కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన విలువ దేనికుంది?

నిజమైన విలువ దేనికుంది?

నిజమైన విలువ దేనికుంది?

నిజమైన విలువగలదేదైనా మన దగ్గర ఉంటే ఎంతో ఆనందంగా ఉండవచ్చు. కానీ అదేమై ఉండవచ్చు? పెద్ద మొత్తంలో డబ్బా? ఖరీదైన లేక అపూర్వమైన ఆభరణమా? కీర్తి ప్రతిష్ఠలా? చాలా మంది వీటిని చాలా విలువైనవిగా ఎంచుతారు. అవి ఉంటే కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చు, జీవితాన్ని మరింత అర్థవంతంగా చేసుకోవచ్చు, లేదా గుర్తింపు కావాలి, ఘనకార్యాలను సాధించాలి అన్న కోరికను తీర్చుకోవచ్చు. అలాంటివి మన భవిష్యత్తు కోసం పెట్టుకున్న లక్ష్యాలను అభిలాషలను సాధించేందుకు సహాయపడతాయనే ఆశతో మనం వాటి కోసం శ్రమిస్తున్నామా?

తమ అవసరాలను లేదా వ్యక్తిగత కోరికలను ఎలా తీర్చుతుందన్న దాన్ని బట్టే సాధారణంగా ప్రజలు, దేనికైనా విలువకడతారు. మనం క్షేమంగా ఉన్నామన్న అనుభూతిని, భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నిరీక్షణను ఇవ్వగల కార్యాలనే మనం ఇష్టపడతాం. మనకు వెంటనే ఉపశమనాన్నిచ్చే, ఓదార్పునిచ్చే, లేదా గుర్తింపునిచ్చే విషయాలను మనం విలువైనవిగా ఎంచుతాం. అయినప్పటికి మారే మన కోరికలను లేదా ఆసక్తులను బట్టి విలువైనదేదో నిర్ణయించడం అంటే లోతుగా చూడకుండా నిర్ణయించడమే, అది ముందుచూపు లేకపోవడమే అవుతుంది. నిజానికి, నిజంగా విలువైనదేదన్నది మనకు ఏది అత్యధికంగా అవసరమైనదని మనం గ్రహిస్తామో దాన్నిబట్టి నిర్ణయించబడుతుంది.

మనకు అత్యధికంగా అవసరమైనదేది? ప్రాథమికమైన ఒక విషయం అంటే ప్రాణం లేకపోతే దేనికీ ఏ విలువా ఉండదు. ప్రాణం లేకపోతే మనం ఉనికిలోనే ఉండం. ప్రాచీన ఇశ్రాయేలు రాజు సొలొమోను, “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. ... నీవు పోవు పాతాళమునందు [మానవజాతి సామాన్య సమాధి] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని వ్రాశాడు. (ప్రసంగి 9:​5,10) మరణం మనలను పొట్టనబెట్టుకుంటే, మనకున్న ప్రతిదాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. కాబట్టి, మనకు అత్యవసరమైనది, మన ప్రాణాలను నిలబెట్టగలదాన్ని సంపాదించుకోవడమే. ఆపని ఏది చేయగలదు?

మన ప్రాణాలను నిలబెట్టేదేమిటి?

“ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని సొలొమోను రాజు అన్నాడు. (ప్రసంగి 7:​12) మన దగ్గర సరిపడా డబ్బుంటే, ఆహారాన్నీ, సౌకర్యవంతమైన ఇంటినీ సంపాదించుకోగలుగుతాము. డబ్బుంటే సుదూర ప్రాంతాలను పర్యటించి ఆనందించవచ్చు. వార్ధక్యం వల్లా అశక్తతవల్లా ఇక పనిచేయలేని సమయంలో డబ్బుంటే కావలసిన వస్తువులను కొనుక్కోవచ్చు. డబ్బుంటే చాలా ప్రయోజనాలున్నాయి. కానీ డబ్బు మన ప్రాణాలను నిలబెట్టలేదు. “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము” అని అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాశాడు. (1 తిమోతి 6:​17) లోకంలోని డబ్బునంతటినీ కలిపినా అది మనకు ప్రాణాన్ని కొనిపెట్టలేదు.

హీటోషీ అనే వ్యక్తి అనుభవాన్నే తీసుకోండి. పేదరికంలో పెరిగిన ఆయనకు, ధనవంతుడవ్వాలన్న కోరిక చాలా గాఢంగా ఉండేది. డబ్బుకున్న శక్తి మీద ఆయనకు ఎంత నమ్మకముండేదంటే, డబ్బుతో మనుష్యులను కూడా కొనుక్కోవచ్చని ఆయన అనుకునేవాడు. అలా ఉండగా, ఒక రోజు ఒక వ్యక్తి వాళ్ళ తలుపు దగ్గరకు వచ్చి, మీకోసం యేసుక్రీస్తు చనిపోయాడని మీకు తెలుసా అని అడిగాడు. ఈప్రశ్న ఆయనలో జిజ్ఞాసను రేకెత్తించింది. ఎందుకంటే, తనలాంటి వ్యక్తి కోసం ఎవరూ చనిపోరని ఆయన అనుకున్నాడు. ఆయన బహిరంగ బైబిలు ప్రసంగానికి హాజరై, ‘కన్ను తేటగా ఉంచుకొనుము’ అన్న ఉద్బోధను విని ఆశ్చర్యపోయాడు. “తేటగా” ఉండే కన్ను దీర్ఘదృష్టి గలదనీ, అది ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరిస్తుందనీ ఆప్రసంగీకుడు వివరించాడు. (లూకా 11:​34) డబ్బు కోసం ప్రాకులాడే బదులు, ఆయన తన జీవితంలో ఆధ్యాత్మికంగా విలువైనవాటికి ప్రథమ స్థానం ఇవ్వడం మొదలుపెట్టాడు.

భౌతిక ఆస్తులు మనకు కొంతవరకు స్థిరతను, భద్రతను ఇవ్వవచ్చు. సమృద్ధి, దైనందిన కార్యాలను గురించిన ఆందోళనల నుండి మనలను విముక్తులను చేయవచ్చు. మంచి ఇల్లు కోరుకోదగిన ఇరుగు పొరుగు ఉంటే ఏదో గెలుచుకున్న అనుభూతినివ్వవచ్చు. వివిధ ఫ్యాషన్‌ల దుస్తులు, మంచి కారు ఉంటే ఇతరుల మెప్పును పొందవచ్చు.

“కష్టార్జితమువలన సుఖమనుభవించుట” ఒక ఆశీర్వాదము. (ప్రసంగి 3:​13) మిగులు ఉంటే, మన ప్రియమైనవారు ‘సుఖంగా ఉండేందుకు తిని త్రాగి ఆనందించేందుకు’ వీలవుతుండవచ్చు. అయినప్పటికీ, భౌతిక ఆస్తులకుండే విలువ నేడుండి రేపు పోయేదే. యేసుక్రీస్తు అత్యాశకు పోకూడదని హెచ్చరిస్తూ, “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కా[దు]” అని అన్నాడు. (లూకా 12:​15-21) ఆస్తి ఎంత ఎక్కువున్నా, ఎంత విలువైనదైనా, అది మనకు జీవాన్ని హామీ ఇవ్వలేదు.

ఉదాహరణకు, లిజ్‌ ఒక ధనవంతుడ్ని పెళ్ళి చేసుకుంది. “మాకు అందమైన ఇల్లు, రెండు కార్లు ఉండేవి, మాఆర్థిక స్తోమత, ఈలోకంలో ఉన్న భౌతికమైన వేటినైనా ఆనందించే స్వేచ్ఛనిచ్చింది. ... చిత్రమైన విషయమేమిటంటే, అయినప్పటికీ నేను డబ్బు గురించి ఆందోళనపడుతుండేదాన్ని” అని ఆమె అంటోంది. “మాకు కోల్పోవడానికి చాలా ఉంది. ఎంత ఎక్కువ ఉంటే భద్రతా భావం అంత తక్కువగా ఉంటుందని అనిపిస్తుంది” అని ఆమె చెబుతోంది.

కీర్తి ప్రతిష్ఠలు ప్రశంసలను సన్మానాలను తేవచ్చు కనుక, చాలా మంది వాటికి ఎంతో విలువనిస్తారు. నేటి లోకంలో, కెరీర్‌లో విజయవంతమవ్వడమంటే ఇతరులు అసూయపడే ఘనకార్యమే. అనుపమానమైన సామర్థ్యాలను నైపుణ్యాలను అలవరచుకోవడం మనం పేరు ప్రతిష్ఠలను గడించేందుకు సహాయపడవచ్చు. ఇతరులు మనలను ప్రశంసించవచ్చు, మన అభిప్రాయాలకు చాలా విలువ ఇస్తుండవచ్చు, మన మెప్పు పొందడానికి తహతహలాడుతుండవచ్చు. ఇవన్నీ మనకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుండవచ్చు. అయినప్పటికీ, చివరికి ఇవన్నీ గతించిపోతాయి. ఒక రాజుకుండే సకల విధములైన మహిమా అధికారమూ సొలొమోనుకుండేవి, కానీ ఆయన “బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; ... వారందరును మరువబడినవారై యుందురు” అని బాధపడ్డాడు. (ప్రసంగి 2:​16) ప్రాణం కీర్తిప్రతిష్ఠలు ఇచ్చే బహుమానం కాదు.

చెలో అనే శిల్పి, కీర్తి కన్నా ఎంతో విలువైన ఒక విషయానికి చాలా విలువివ్వనారంభించాడు. ఆయనకు స్వతస్సిద్ధంగా శిల్పాలను చెక్కే నైపుణ్యం ఉన్నందువల్ల, ఆనైపుణ్యాన్ని ఇంకా పెంపొందించుకునే శిక్షణను పొందే అవకాశాన్ని ఆయన సంపాదించాడు. త్వరలోనే అతనిలోని శిల్పకళా చాతుర్యం సమాచార మాధ్యమాల నుండి, కళా విమర్శకుల నుండి ప్రశంసలను తీసుకువచ్చింది. ఆయన చెక్కిన అనేక శిల్పాలు యూరప్‌లోని అనేక ముఖ్య నగరాల్లో ప్రదర్శించబడ్డాయి. “ఒకప్పుడు నా జీవితంలో కళకు అత్యంత ప్రముఖ స్థానం ఉండేదని నేను ఒప్పుకోవలసిందే. అయినప్పటికీ, నేను నా కెరీర్‌ని కొనసాగించడమంటే, ఇద్దరు యజమానులను సేవించడానికి ప్రయత్నించడంలాంటిదే అవుతుందని నేను గ్రహించాను. (మత్తయి 6:​24) నేను చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించడమేనని నాకు అవగతమైంది. అందుకే శిల్పాలు చెక్కే పనిని వదిలిపెట్టాలని నాకై నేనే నిర్ణయించుకున్నాను” అని ఆయన అంటున్నాడు.

అత్యధిక విలువ దేనికి ఉంది?

ప్రాణం లేకపోతే దేనికీ అర్థంగానీ విలువ గానీ ఉండదు కనుక, మనం మన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే దేన్ని సంపాదించుకోవాలి? జీవం యెహోవా దేవుని నుండి ఉద్భవిస్తుంది. (కీర్తన 36:⁠9) నిజానికి, “మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.” (అపొస్తలుల కార్యములు 17:​28) ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి నిత్యజీవాన్ని బహుమానంగా ఇస్తాడు. (రోమీయులు 6:​23) ఈబహుమానానికి మనం యోగ్యులమవ్వాలంటే మనం తప్పకుండా చేయాల్సిందేమిటి?

నిత్యజీవమనే బహుమానాన్ని పొందడం అనేది మనకు యెహోవా దేవునితో సన్నిహిత సంబంధం ఉండడంపై ఆధారపడివుంటుంది. కాబట్టి, మనకు ఎంత ఆస్తి ఉన్నా వాటన్నింటి కన్నా ఎక్కువ విలువ ఆయన అనుగ్రహానికే ఉంది. మనమా అనుగ్రహాన్ని పొందినప్పుడు, మనకు నిజమైన నిత్యమైన సంతోషముండే నిరీక్షణ ఉంటుంది. అయితే, దేవుని అనుగ్రహం లేకపోతే మనం శాశ్వతంగా ఉనికిలో లేకుండా పోతాము. అలాగైతే, యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండడానికి మనకు సహాయపడేదేదైనా అదెంతో విలువైనదని స్పష్టం.

తప్పనిసరిగా మనం చేయాల్సినది

మన సాఫల్యం మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన జ్ఞానానికి మూలం యెహోవా దేవుని వాక్యమైన బైబిలు. అది మాత్రమే మనం దేవుణ్ణి ప్రీతిపరచేందుకు తప్పనిసరిగా ఏమి చేయాలో చెబుతుంది. కనుక, మనం లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మనం యెహోవా దేవుని గురించి యేసుక్రీస్తు గురించి సాధ్యమైనంత వరకు నేర్చుకునేందుకు శ్రద్ధగా ప్రయత్నం చేసినప్పుడు, ‘నిత్యజీవమైన జ్ఞానము’ మనకు లభిస్తుంది. (యోహాను 17:⁠3) అలాంటి జ్ఞానము మనం విలువైనదిగా ఎంచవలసిన నిధి!​—⁠సామెతలు 2:1-5.

దేవుని వాక్యంలో మనం సంపాదించుకునే జ్ఞానము మనం మరొక మెట్టు ఎక్కేందుకు అంటే యేసు క్రీస్తు మీద ఉన్న విశ్వాసాన్ని ఆచరణలో పెట్టేందుకు మనలను సంసిద్ధం చేస్తుంది. తన దగ్గరకు వచ్చేవారందరూ యేసు ద్వారా రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (యోహాను 14:⁠6) నిజానికి, “మరి ఎవనివలనను రక్షణ కలుగదు.” (అపొస్తలుల కార్యములు 4:​12) “వెండి బంగారముల” మీద కాదు గానీ, క్రీస్తు యొక్క “అమూల్యమైన రక్తము” మీదనే మన అసలు మనుగడ ఆధారపడి ఉంటుంది. (1 పేతురు 1:​18,19) యేసు బోధలను నమ్మడం ద్వారా, ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా మనం మన విశ్వాసాన్ని కనబరచాలి. (హెబ్రీయులు 12:1-3; 1 పేతురు 2:​21) నిజంగా ఆయన బలి ఎంత విలువైనది! దాని ప్రయోజనాలు అమలుచేయబడడమే సకల మానవుల శాశ్వత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన పక్షాన ఆప్రయోజనాలు పూర్తిగా అమలు చేయబడినప్పుడు నిజంగా విలువైన నిత్యజీవమనే బహుమానం మనకు ఇవ్వబడుతుంది.​—⁠యోహాను 3:⁠16.

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె”నని యేసు చెప్పాడు. (మత్తయి 22:​37) యెహోవాను ప్రేమించడమంటే, “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే.” (1 యోహాను 5:⁠3) మనం లోకం నుండి వేరుగా ఉండాలని, నీతిగా ప్రవర్తిస్తుండాలని, ఆయన రాజ్యానికి నమ్మకంగా మద్దతునివ్వాలని ఆయన ఆజ్ఞలు కోరుతున్నాయి. మనం మరణాన్ని కాక, “జీవాన్ని” ఎంపిక చేసుకునేది ఆవిధంగానే. (ద్వితీయోపదేశకాండము 30:​20) మనం ‘దేవుణ్ణి సమీపిస్తే, దేవుడు మనల్ని సమీపిస్తాడు.’​—⁠యాకోబు 4:⁠8 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌).

దేవుని అనుగ్రహముందన్న నిశ్చయతే, ఈలోకంలోని నిధులన్నిటికన్నా ఎక్కువ విలువైనది. అది ఉన్నవారే ఈభూమి మీద ఉన్న అత్యంత ధనికులు! అందుకే, నిజంగా విలువైన నిధిని, అంటే యెహోవా ఆమోదాన్ని సంపాదించుకునేందుకు మనం శ్రమించుదము గాక. “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉద్బోధను నిశ్చయంగా హృదయంలోకి తీసుకుందాం.​—⁠1 తిమోతి 6:11,12.

[21వ పేజీలోని చిత్రాలు]

మీరు దేనికి ఎక్కువ విలువిస్తారు? డబ్బుకా, ఆస్తులకా, కీర్తికా, లేక వేరే దేనికైనానా?

[23వ పేజీలోని చిత్రం]

మనం లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది