కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రజలను ఏదైనా నిజంగా ఐక్యపరచగలదా?

ప్రజలను ఏదైనా నిజంగా ఐక్యపరచగలదా?

ప్రజలను ఏదైనా నిజంగా ఐక్యపరచగలదా?

మీ నమ్మకాలు ఏవైనా, దాదాపు అన్ని మతాల్లోనూ సత్య ప్రేమికులు ఉంటారని మీరు ఒప్పుకుంటుండవచ్చు. సత్యము గురించి ఎంతో మెప్పుదల గలవారిని, దాన్ని అన్వేషించడానికి సిద్ధపడేవారిని హిందువుల్లోను క్యాథలిక్కుల్లోను యూదుల్లోను మరితర మతస్థుల్లోను కనుగొనవచ్చు. అయినప్పటికీ, మతం మానవజాతిని విభజిస్తున్నట్లు కనిపిస్తుంది. కొందరు మతాన్ని చెడు లక్ష్యాల కోసం కూడా ఉపయోగించుకుంటారు. మరలాంటప్పుడు, మంచిదాన్ని సత్యమైనదాన్ని ప్రేమించే యథార్థవంతులైన అన్ని మతాల నుండి వచ్చినవారు ఐక్యం కావడం ఎన్నటికైనా సాధ్యమవుతుందా? వాళ్ళందర్నీ ఒకే ఉద్దేశం కోసం సమీకరించడం వీలవుతుందా?

ప్రజల మధ్య అనైక్యతకు మతం ఎక్కువ కారణమవడం చూస్తుంటే ఎంత కలతగా ఉంది! కొన్ని మత సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోండి. శ్రీలంకలో హిందువులు బౌద్ధులతో పోరాడుతారు. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు, యూదులు అనేక పోరాటాల్లో రక్తం చిందించారు. ఇండోనేషియా, కసోవా, చెచ్నియా, బోస్నియా దేశాల్లో “క్రైస్తవులు” ముస్లిములతో పోరాడుతారు. 2000వ సంవత్సరం మార్చి నెలలో, రెండు రోజులు సాగిన మతసంబంధ పోరాటాల్లో 300 మంది నైజీరియన్లు చనిపోయారు. నిజానికి ఈపోరాటాల్లో జరిగే క్రూరకృత్యాలకు మత విద్వేషమే ప్రేరకమైంది.

యథార్థ హృదయులైన ప్రజలు తరచూ మతం పేరిట జరిగే క్రూరకృత్యాలవల్ల చాలా కలతచెందుతున్నారు. ఉదాహరణకు, పిల్లలపై లైంగిక అత్యాచారం చేసిన పాదిరీలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని తెలుసుకొని చర్చికి వెళ్ళే చాలా మంది ఆశ్చర్యపోయారు. మరి కొందరు విశ్వాసులు, క్రైస్తవులమని చెప్పుకొంటున్న కొన్ని తెగలు, స్వలింగ సంపర్కం, గర్భస్రావం వంటి విషయాలపై ఉన్న భేదాభిప్రాయాల కారణంగా విభజించబడడం చూసి చాలా కలత చెందుతున్నారు. స్పష్టంగా, మతం మానవులను ఐక్యపరచలేదు. అయినప్పటికీ, క్రింది అనుభవాలు చూపిస్తున్నట్లు, అనేక మతాలవారిలో సత్యాన్ని నిజంగా ప్రేమించేవారున్నారు.

వారు సత్యం కోసం పరితపించారు

బొలీవియాలోని, లా పాజ్‌లోని క్యాథలిక్‌ చర్చ్‌ ఆఫ్‌ సాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫీడెల్యా, యథార్థమైన భయభక్తులు గల ఆరాధకురాలు. ఆమె మరియ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేసేది, సిలువ ముందు తన చేతనైనంత మట్టుకు అత్యంత నాణ్యమైన క్రొవ్వొత్తులను వెలిగించేది. ప్రతివారం, బీదలకు పంచిపెట్టడానికి పెద్ద పెద్ద మొత్తాల్లో ఆహార పదార్ధాలను ప్రీస్టుకు విరాళంగా ఇచ్చేది. ఆమె ఐదుగురు పిల్లలు జ్ఞానస్నానం పొందక ముందే చనిపోయారు. ఆపిల్లలందరూ పాతాళపు అంధకారంలో బాధపడుతున్నారని ప్రీస్టు ఆమెకు చెప్పినప్పుడు, ‘దేవుడు మంచివాడైతే, అలా ఎందుకు జరుగుతుంది?’ అని ఆమె ఆశ్చర్యపోయింది.

తారా అనే మెడికల్‌ డాక్టర్‌, నేపాల్‌లోని ఖాట్మండులో హిందువుగా పెరిగింది. శతాబ్దాలనుండి తన పూర్వికులు అనుసరిస్తున్న ఆచారాల ప్రకారం ఆమె హిందూ ఆలయాల్లో వాళ్ళ దేవుళ్ళను ఆరాధించేది, తన ఇంట్లో కూడా విగ్రహాలను పెట్టుకునేది. కానీ, మానవులు ఎందుకిన్ని బాధలు అనుభవించవలసి వస్తోంది? ఎందుకు మరణిస్తారు? అనే ప్రశ్నలు ఆమెను కలవరపెట్టేవి. ఆమెకు తన మతంలో సంతృప్తికరమైన జవాబులేమీ దొరకలేదు.

మరొకవైపు, థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఒక కాలువ ప్రక్కనున్న ఇంట్లో పాన్య ఒక బౌద్ధుడిగా పెరిగాడు. గత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగా బాధలను అనుభవించవలసి వస్తుందని, కోరికలనన్నింటినీ త్యజిస్తే బాధా విముక్తులు కావచ్చని ఆయనకు బోధించబడింది. ప్రతి ఉదయం ధర్మం అడగడానికి పసుపురంగు దుస్తుల్లో ఇంటికి వచ్చే సన్యాసులు ఎంతో జ్ఞానులని వాళ్ళను గౌరవించాలని ఆయనకు బోధించబడింది. ఆయన ధ్యానం చేసేవాడు, బుద్ధుని విగ్రహాలు రక్షణనిచ్చాయన్న నమ్మకంతో వాటిని సేకరించేవాడు. తాను ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకొని, నడుము నుండి క్రింది భాగము పక్షవాతానికి గురికావడంతో, తనకు అద్భుత స్వస్థత జరుగుతుందని ఎంతో ఆశతో బౌద్ధ సన్యాసమఠాలను సందర్శించాడు. ఆయనకక్కడ ఆధ్యాత్మిక జ్ఞానోదయం గానీ ఏ స్వస్థత గానీ జరగలేదు. బదులుగా ఆయనకు క్షుద్రవిద్య నేర్పించబడింది. ఇక దానితో ఆయన ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు.

అమెరికాలో పుట్టిన వర్జిల్‌, తన కాలేజీలోనే చదివే నల్లజాతి ముస్లిములతో కలిశాడు. ఆయన వారి సాహిత్యాలను ఆసక్తితో అందరికీ పంపిణీ చేయడం మొదలుపెట్టాడు. ఆసాహిత్యాలు శ్వేత జాతీయులు సాతానులు అని ఆరోపించాయి. శ్వేతజాతీయులు సాతానులు కాబట్టే నల్ల జాతీయులపై ఎన్నో అకృత్యాలు చేశారని వాళ్ళనుకున్నారు. ఆయన నిజంగానే హృదయపూర్వకంగా అలా నమ్మినప్పటికీ, శ్వేత జాతీయులు అందరూ చెడ్డవారిగా ఎలా ఉండగలరు? డబ్బు గురించిన ప్రసంగాలు ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతాయి? అనే ప్రశ్నలు ఆయనను కలతపెట్టేవి.

చారో, క్యాథలిక్కులు ఎక్కువగా ఉన్న దక్షిణ అమెరికాలో పెరిగినప్పటికీ, ఆమె మాత్రం గట్టి ప్రొటెస్టెంట్‌. తన చుట్టూ ఉన్న విగ్రహారాధనలో తాను భాగం వహించకుండా ఉంటున్నందుకు సంతోషించింది. చర్చిలో జరిగే భావోద్వేగాలను రేకెత్తించే పూజలకు ఆమె ప్రతి ఆదివారం వెళ్ళి ఆనందించేది. అక్కడ ఆమె “హల్లెలూయా!” అని బిగ్గరగా అరిచేది, ఆతర్వాత పాడే మతసంబంధ పాటల్లోను చేసే నాట్యంలోను పాల్గొనేది. తాను రక్షించబడిందని, తిరిగి జన్మించిందని హృదయపూర్వకంగా నమ్మింది. ఆమె తన ఆదాయంలోని దశమ భాగం చర్చికిచ్చేది. తనెంతో అభిమానించే టీవీ సువార్తికుడు ఆఫ్రికాలోని పిల్లల కోసం విరాళాలను ఇవ్వమని అడిగినప్పుడు, ఆమె డబ్బు పంపించేది. అయినా, ప్రేమ స్వరూపియైన దేవుడు నరకంలో ఆత్మలను ఎందుకు హింసిస్తాడని ఆమె తమ పాస్టర్‌ని అడిగినప్పుడు ఆయన దగ్గర అర్థవంతమైన జవాబు లేదని ఆమె గ్రహించింది. తను పంపే విరాళాలు ఆఫ్రికాలోని పిల్లలకు సహాయపడేందుకు ఉపయోగించడం లేదని కూడా తర్వాత తెలుసుకుంది.

ఈ ఐదుగురు వ్యక్తులు విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారే అయినప్పటికీ, వీరందరూ కోరుకున్నది ఒకటే: సత్యాన్ని ప్రేమించారు, తమ ప్రశ్నలకు సత్యసంధమైన జవాబులు కావాలని హృదయపూర్వకంగా ప్రయత్నించారు. కానీ వారు సత్యారాధనలో ఐక్యపరచబడగలిగారా? తరువాతి ఆర్టికల్‌ ఈప్రశ్నకు జవాబిస్తుంది.

[4వ పేజీలోని చిత్రం]

విభిన్న నేపథ్యాల్లోని ప్రజలు నిజంగా ఐక్యం కావడం సాధ్యమేనా?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

G.P.O., Jerusalem