కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమావేశాలు—మన సౌభ్రాతృత్వాన్ని ధ్రువీకరించే ఆనందభరిత సందర్భాలు

సమావేశాలు—మన సౌభ్రాతృత్వాన్ని ధ్రువీకరించే ఆనందభరిత సందర్భాలు

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

సమావేశాలు​—⁠మన సౌభ్రాతృత్వాన్ని ధ్రువీకరించే ఆనందభరిత సందర్భాలు

యాభై ఏండ్ల జోసఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, దాదాపు ఒక సంవత్సరం అన్యాయంగా కారాగారంలో ఉండాల్సి వచ్చిన తర్వాత, అంత ఆరోగ్యంగా లేకపోయినా, సహోదరులను లాడ్జిలకు తీసుకువెళ్ళే నియామకంలో సంతోషంగా సేవ చేస్తున్నాడు. ఆయన చక చక సూట్‌కేసులను మోసుకెళ్తూ, తన తోటి క్రైస్తవులు వాళ్ళ హోటల్‌ గదులకు వెళ్ళేందుకు సహాయం చేస్తున్నాడు. గతంలో ఆయనతోపాటు కారాగారంలో ఉన్న ఇద్దరు తోటి బైబిలు విద్యార్థులు, వసతి కోసం ఎదురు చూస్తున్న ఒక పెద్ద గుంపుకు రూమ్‌ అసైన్‌మెంట్లను అందిస్తున్నారు. అలా అర్ధరాత్రి దాటాక కూడా పనులు చక చక జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరి మధ్యా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇంతకూ ఏమిటా సందర్భం?

అది 1919వ సంవత్సరం, బైబిలు విద్యార్థులు (నేడు యెహోవాసాక్షులు అని పిలువబడుతున్నారు) కొంత కాలంగా అనుభవించిన హింసల నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న సమయమది. తమ సహోదరులను తిరిగి ఉత్సాహభరితులుగా చేసేందుకు, వాళ్ళు అమెరికాలోని, ఒహాయోలోని, సీడార్‌ పాయింట్‌లో 1919, సెప్టెంబరు 1 నుండి 8 వరకు సమావేశాన్ని జరుపుకుంటున్నారు. ఆసమావేశపు చివరి రోజున, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “మన ప్రభువు యొక్క మహిమాన్విత రాజ్యము గురించి ... ప్రజలకు ప్రకటిస్తున్న మీరు, రాజులకు రాజూ ప్రభువులకు ప్రభువూ అయినవానికి రాయబారులు” అన్న మాటలతో అక్కడ హాజరైన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ ఆయన చెబుతున్న మాటలను ఆనందోత్సాహాలతో ఉన్న 7,000 మంది జాగ్రత్తగా వింటున్నారు.

యెహోవా ప్రజల సమావేశాల గతచరిత్రలోకి వెళ్తే మనం ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలానికి వెళ్తాము. (నిర్గమకాండము 23:​14-17; లూకా 2:​41-43) అలాంటి సమావేశాలు ఆనందభరితమైన సందర్భాలు. అవి అక్కడ హాజరైనవారందరూ దేవుని వాక్యంపై తమ మనస్సులను కేంద్రీకరించడానికి సహాయం చేసేవి. అదేవిధంగా, ఆధునిక కాలాల్లోని యెహోవాసాక్షుల సమావేశాలు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ కేంద్రీకరిస్తాయి. యథార్థ హృదయంతో గమనించేవారికి, అలాంటి ఆనందభరితమైన సమావేశాలు, యెహోవాసాక్షులు క్రైస్తవ సౌభ్రాతృత్వమనే బలమైన అనుబంధాలతో ఐక్యపర్చబడివున్నారన్నదానికి తృణీకరించలేని రుజువులనిస్తాయి.

హాజరయ్యేందుకు ప్రయత్నాలు

తమ సమావేశ సమయాలు ఆధ్యాత్మికంగా సేదదీరుస్తాయని, దేవునివాక్యంలో నుండి నిర్దేశకాలనిస్తాయని ఆధునిక దిన క్రైస్తవులు గ్రహిస్తారు. వాళ్ళు ఈపెద్ద కూటాలను, తాము “దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండ”డానికి సహాయపడే అత్యావశ్యమైన మార్గాలుగా ఎంచుతారు. (కొలొస్సయులు 4:​12) అలా, యెహోవాసాక్షులు, ఈకూటాలకు పూర్ణహృదయంతో మద్దతునిస్తూ, వాటికి హాజరయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు.

కొందరి విషయానికి వస్తే, అలాంటి సమావేశాలకు హాజరు కావాలంటే, విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడమూ, పర్వతాల్లాంటి ఆటంకాలను అధిగమించడమూ అవసరం. ఉదాహరణకు, ఆస్ట్రియాలోని పెద్దవయస్కురాలైన ఒక సాక్షి విషయమే తీసుకోండి. ఆమెకు డయబెటీస్‌ ఉన్నా, ప్రతిరోజూ ఇన్‌సులిన్‌ ఇంజక్షన్‌లు తీసుకోవలసివున్నా, తన దేశంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రోజులూ హాజరవ్వగలిగేలా పథకం వేసుకుంది. ఇండియాలో, కడుపేదరికంలో జీవిస్తున్న యెహోవాసాక్షుల ఒక పెద్ద కుటుంబం, తాము సమావేశానికి హాజరవడం సాధ్యం కాదని కనుగొంది. ఆకుటుంబంలోని ఒక సభ్యురాలు ఆపరిస్థితి నుండి బయటపడడానికి సహాయపడింది. “ఆసందర్భాన్ని జారవిడుచుకోకూడదని, ప్రయాణ ఖర్చుల కోసం నేను నా బంగారు దుద్దులను అమ్మేశాను. ఆసహవాసమూ, అనుభవమూ మావిశ్వాసాన్ని బలపరచింది కనుక నేను చేసిన త్యాగం తగినదే” అని ఆమె అంటోంది.

పాపువా న్యూ గినియాలోని, బాప్తిస్మం తీసుకోని ఆసక్తిగలవారి గుంపొకటి రాజధానిలో జరుగుతున్న జిల్లా సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించుకుంది. తమ గ్రామంలో వ్యాన్‌ ఉన్న ఒక వ్యక్తి దగ్గరికివెళ్ళి, తాము సమావేశానికి వెళ్ళాలంటే ఎంత తీసుకుంటారని అడిగింది. దానికయ్యే ఖర్చు తమ తాహతుకు మించినదని తెలిసికొని, వాళ్లు ఆవ్యక్తి ఇంట్లోని వంటగదిని పునర్నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆవిధంగా వాళ్ళు జిల్లా సమావేశానికి హాజరై, అక్కడ జరిగిన కార్యక్రమమంతటి నుండీ ప్రయోజనం పొందగలిగారు.

సమావేశాలకు వెళ్ళాలనుకునే యెహోవాసాక్షులకు దూరం అధిగమించలేని ఆటంకం కాదు. 1978 లో, ఫ్రాన్స్‌లోని లిలిలో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు, ఒక యువకుడు పోలండ్‌ నుండి సైకిలు మీద ఆరు రోజులు 1,200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. 1997 వేసవిలో రష్యాలోని ఇర్‌కుట్స్‌లో జరుగుతున్న క్రైస్తవ సమావేశానికి ఇద్దరు సాక్షులు మంగోలియా నుండి 1,200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు.

నిజమైన సహోదరత్వం క్రియాశీలమైనది

సాక్షులు తమ సమావేశాల్లో చూపించే ఏకత్వమూ, సహోదరత్వమూ నిష్పక్షపాతంగా చూసే చూపరులకు స్పష్టంగా కనిపిస్తాయి. సమావేశమైనవారి మధ్య ఎటువంటి పక్షపాతం లేకపోవడమూ, మొదటిసారి కలిసేవారి మధ్య కూడా యథార్థమైన ఆప్యాయత ఉండడమూ చూసి చాలా మంది ముగ్ధులయ్యారు.

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సమావేశానికి విదేశాల నుండి వచ్చిన సహోదరులతోపాటు ఒక వారం రోజులుండడానికి వచ్చిన ఒక టూర్‌ గైడ్‌ వాళ్ళ సహవాసాన్ని ఆనందించేందుకు ఇంకా కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఉండాలని కోరుకున్నాడు. వాళ్ళ మధ్యవున్న ప్రేమ, ఐక్యతలకు ఆయన ముగ్ధుడయ్యాడు. వాళ్ళలా ఒకరితో ఒకరు కలిసిపోవడం ఆయన నమ్మలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది అప్పటివరకు ఒకరికొకరు పరిచయంలేనివారే. ఆయన అక్కడినుండి బయలుదేరేముందు వాళ్ళందరినీ పిలిచాడు. ఆయన వారిని “బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌” అని సంబోధిస్తూ, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పబోయాడు కానీ, భావోద్వేగంతో ఆయన తన మాటలను పూర్తి చేయకుండానే, బావురుమని ఏడ్చాడు.

1997 లో, శ్రీలంకలోని ఒక పెద్ద స్టేడియంలో త్రిభాషా జిల్లా సమావేశం జరిగింది. ఆకార్యక్రమమంతా, ఒకే సమయంలో ఇంగ్లీష్‌, సింహళ, తమిళ భాషల్లో నిర్వహించబడింది. వర్గపోరాటాలు అంతకంతకూ పెరుగుతున్న లోకంలో, ఇలా మూడు భాషలవారి సమావేశం జరగడం చూపరుల దృష్టిలో పడకుండా పోలేదు. “ఈ సమావేశాన్ని ఎవరు జరుపుతున్నారు, సింహళీయులా, తమిళులా, లేక ఆంగ్లేయులా?” అని ఒక పోలీసు ఒక సహోదరుడ్ని అడిగాడు. “ఈ సమావేశాన్ని ఏదో ఒక గుంపు వాళ్ళు కాదు కానీ, మేమందరమూ కలిసి జరుపుకుంటున్నాం” అని సహోదరుడు జవాబిచ్చాడు. ఆపోలీసు నమ్మలేకపోయాడు. ముగింపు ప్రార్థనకు మూడు భాషలవారు కలిసి, ఐక్యంగా “ఆమేన్‌” అన్నప్పుడు అది స్టేడియమ్‌లో ప్రతిధ్వనించింది. అక్కడ హాజరైవున్నవారు ఆతర్వాత అనుకోకుండా చప్పట్లు కొట్టారు. అందరి కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. అవును, సమావేశాలు నిజంగానే, మన సహోదరత్వాన్ని ధ్రువీకరించే ఆనందభరితమైన సందర్భాలు.​—⁠కీర్తన 133:⁠1. *

[అధస్సూచి]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు​—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 66-77, 254-82 పేజీలు చూడండి.