కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“తప్పిపోయిన” కుమారుడికి మీరెలా సహాయం చేయగలరు?

“తప్పిపోయిన” కుమారుడికి మీరెలా సహాయం చేయగలరు?

“తప్పిపోయిన” కుమారుడికి మీరెలా సహాయం చేయగలరు?

‘ఆనందించండి ... వాడు తప్పిపోయి దొరికాడు.’​—⁠లూకా 15:⁠32.

1, 2. (ఎ) క్రైస్తవ సత్యం పట్ల కొందరు యౌవనస్థులు ఎలా స్పందించారు? (బి)అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు ఎలా భావిస్తుండవచ్చు?

“నేనిక యెహోవాసాక్షిగా ఉండదల్చుకోలేదు!” దైవభయంగల తల్లిదండ్రులు ఎంతో శ్రమించి తమ పిల్లల్ని క్రైస్తవమార్గంలో పెంచిన తర్వాత వాళ్ళలో ఒకరు ఆమాటంటే గుండె పిండేసినట్లుగా ఉండదూ! కొందరు యౌవనస్థులైతే తమ ఉద్దేశాలను అలా బాహాటంగా చెప్పకుండానే నెమ్మదిగా ‘కొట్టుకొనిపోతారు.’ (హెబ్రీయులు 2:⁠1) వీరిలో చాలామంది యేసు ఇచ్చిన దృష్టాంతంలోని తప్పిపోయిన కుమారుడ్ని పోలివుంటారు. దృష్టాంతంలోని కుమారుడు తన తండ్రి ఇంటిని వదిలి ఒక దూర దేశానికి వెళ్ళి ఆస్తిలో తన వాటాను దుర్వ్యయం చేస్తాడు.​—⁠లూకా 15:11-16.

2 యెహోవాసాక్షుల్లోని అత్యధికులు తమ పిల్లలు సత్యాన్ని విడిచివెళ్ళే సమస్యని అనుభవించకపోయినా, అనుభవించినవాళ్ళు మాత్రం ఎంత ఓదార్చినా పూర్తిగా దుఃఖనివృత్తి పొందలేరు. దారితప్పిన ఆయౌవనస్థుడు/రాలు పొందే విచారాన్ని కూడా అలక్ష్యం చేయకూడదు. ఆవ్యక్తి మనస్సాక్షి ఎంతగానో కలతపెడుతుండవచ్చు. యేసు దృష్టాంతంలోని తప్పిపోయిన కుమారుడికి చివరికి ‘బుద్ధి వచ్చింది,’ తండ్రి ఎంతో ఆనందించాడు. అదే విధంగా తల్లిదండ్రులు, సంఘంలోని ఇతరులు తప్పిపోయినవారికి ‘బుద్ధి వచ్చేలా’ చేయడానికి ఎలా సహాయం చేయగలరు?​—⁠లూకా 15:⁠17.

విడిచిపెట్టాలని కొందరు ఎందుకు నిర్ణయించుకుంటారు?

3. యౌవనస్థులు క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకోవడానికి కొన్ని కారణాలేమిటి?

3 క్రైస్తవ సంఘంలో యెహోవాను ఆనందంగా సేవించే యౌవనస్థులు లక్షలాదిమంది ఉన్నారు. మరైతే కొందరు ఎందుకని విడిచి వెళ్ళిపోతారు? బహుశ లోకం అందించే ఆనందాలను తాము అనుభవించలేకపోతున్నామని వారు భావిస్తుండవచ్చు. (2 తిమోతి 4:​10) లేక, సంరక్షణగా ఉన్న యెహోవా గొఱ్ఱెలదొడ్డి తమను మరీ నిర్బంధిస్తున్నట్లు అనుకుంటుండవచ్చు. మనస్సాక్షి నిందించడం, ఎవరిపైనైనా మనసుపడడం, లేక తోటివారి ఆమోదాన్ని సంపాదించాలన్న కోరిక వంటివి కూడా యౌవనస్థులు యెహోవా మందకు దూరంగా కొట్టుకుని పోయేందుకు కారణమవుతాయి. తమ తల్లిదండ్రులు గాని మరెవరైనా క్రైస్తవులు గాని కపటంగా ప్రవర్తిస్తున్నారని తాము భావించడం మూలంగా కూడా యౌవనస్థులు దేవుణ్ణి సేవించడం ఆపేయవచ్చు.

4. యౌవనస్థులు దారితప్పడానికి సాధారణంగా అసలు మూలం ఏమైవుంటుంది?

4 పిల్లవాడి తిరుగుబాటు వైఖరి, తిరుగుబాటు ప్రవర్తన సాధారణంగా ఆధ్యాత్మిక బలహీనతకు చిహ్నాలు, అవి ఆయన హృదయంలో ఏముందో దాన్ని ప్రతిబింబిస్తాయి. (సామెతలు 15:13; మత్తయి 12:​34) యౌవనస్థుడు ఏ కారణం చేత దారితప్పినా, సాధారణంగా సమస్యకు అసలు మూలం ఆయన “సత్యవిషయమైన అనుభవజ్ఞానము” కలిగివుండకపోవడమే అయివుంటుంది. (2 తిమోతి 3:​6,7) ఏదో యాంత్రికంగా యెహోవా సేవ చేయడం కాక, యౌవనస్థులు ఆయనతో ఒక సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ప్రాముఖ్యం. వారలా చేయడానికి ఏమి సహాయం చేస్తుంది?

దేవుని దగ్గరికి రండి

5. యౌవనస్థులు దేవునితో సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏది ప్రాముఖ్యం?

5 “దేవునియొద్దకు రండి” అని చెబుతూ, “అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని శిష్యుడు యాకోబు వ్రాశాడు. (యాకోబు 4:⁠8) అలా చేయాలంటే ఒక యౌవనస్థుడు దేవుని వాక్య రుచిని ఎరిగేలా ఆయనకు సహాయం చేయాలి. (కీర్తన 34:⁠8) మొదట్లో ఆయనకు “పాలు,” అంటే బైబిలులోని ప్రాథమిక బోధలు అవసరం అవుతాయి. కానీ ఆయన దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందిస్తుంటే, “బలమైన ఆహారము”ను, అంటే లోతైన ఆధ్యాత్మిక విషయాలను అపేక్షిస్తుంటే ఆయనకు ఆధ్యాత్మిక పరిణతి ఎంతో దూరంలో లేదన్నట్లే. (హెబ్రీయులు 5:​11-14; కీర్తన 1:⁠2) తాను లోకప్రవాహంలో పడి కొట్టుకుపోయానని ఒప్పుకున్న ఒక యౌవనస్థుడు చివరికి ఆధ్యాత్మిక విలువలను ప్రియమైనవిగా ఎంచడం ప్రారంభించాడు. తన మార్గాలను మార్చుకోవడానికి ఆయనకేమి సహాయం చేసింది? బైబిలును పూర్తిగా చదవమన్న సలహాకు ప్రతిస్పందించి ఆయన బైబిలు పఠన పట్టికను వేసుకుని దాన్ని పాటించాడు. అవును, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం యెహోవాతో సన్నిహితమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలా అవసరం.

6, 7. దేవుని వాక్యమంటే ఇష్టాన్ని ఏర్పర్చుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయగలరు?

6 తమ పిల్లలు దేవుని వాక్యం పట్ల ప్రీతిని పెంచుకునేలా తల్లిదండ్రులు వారికి సహాయం చేయడం ఎంత ప్రాముఖ్యమో కదా! కుటుంబ అధ్యయనాన్ని క్రమంగా చేస్తూ ఉన్నా ఒక టీనేజ్‌ అమ్మాయి నేరస్థులతో సాంగత్యం చేయడం ప్రారంభించింది. తన కుటుంబ అధ్యయనం గురించి ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “మా నాన్నగారు ప్రశ్నలు అడిగినప్పుడు నేను కనీసం తలెత్తి ఆయన ముఖంలోకి చూడకుండానే జవాబుల్ని చదివేసేదాన్ని.” కుటుంబ అధ్యయనంలో ఎంతో కొంత సమాచారాన్ని పరిశీలించడం పూర్తిచేయడమే పరమావధిగా ఉండడానికి బదులు జ్ఞానయుక్తమైన తల్లిదండ్రులు బోధనా కళను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. (2 తిమోతి 4:⁠2, NW) యౌవనస్థుడు అధ్యయనంలో ఆనందించాలంటే అది తనకు వర్తించేదన్న భావన ఆయనలో కలగాలి. ఆయౌవనస్థుడి అభిప్రాయాలు అడుగుతూ, ఆయన తనను తాను వ్యక్తం చేసుకునే అవకాశాన్ని ఆయనకు ఎందుకు ఇవ్వకూడదు? పరిశీలిస్తున్న సమాచారాన్ని ఆచరణయోగ్యంగా ఎలా అన్వయించుకోవచ్చో చెప్పమని యౌవనస్థుడ్ని ప్రోత్సహించండి. *

7 అంతేగాక, లేఖనాధారిత చర్చలు ఉల్లాసవంతంగా ఉండేలా చేయండి. యుక్తమైన సందర్భాల్లో పిల్లలు బైబిలు సంఘటనలను, నాటకాలను ప్రదర్శించేలా చేయండి. చర్చించబడుతున్న సంఘటనలు జరిగిన ప్రాంతాలను, భూ స్వరూపాలను మనస్సులో చిత్రించుకునేందుకు వారికి సహాయం చేయండి. మ్యాపులను, చార్టులను ఉపయోగించడం సహాయకరంగా ఉండవచ్చు. అవును కాస్తంత సృజనాత్మకతను ఉపయోగిస్తే కుటుంబ అధ్యయనం ఉల్లాసభరితంగా వైవిధ్యభరితంగా ఉండేలా చేయవచ్చు. తల్లిదండ్రులు కూడా యెహోవాతో తమకు గల సంబంధాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. వారు తమకై తాము యెహోవాకు సన్నిహితమౌతుండగా, తమ పిల్లలు కూడా అలా సన్నిహితం కావడానికి సహాయం చేయగలరు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:5-7.

8. దేవునికి దగ్గర కావడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

8 ప్రార్థన కూడా మనం దేవునికి దగ్గర కావడానికి దోహదపడుతుంది. కౌమారప్రాయంలో ఉన్న ఒక అమ్మాయి క్రైస్తవ జీవిత విధానమా లేక తన విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగివున్న తన స్నేహితులా అన్నది తేల్చుకోలేక సతమతమయ్యింది. (యాకోబు 4:⁠4) చివరికి ఆమె ఏం చేసింది? “నేనెలా భావిస్తున్నానో జీవితంలో మొదటిసారిగా యెహోవాకు ప్రార్థనలో తెలియజేశాను” అని ఆమె నిస్సంకోచంగా వెల్లడిచేసింది. తాను తన భావాలను వ్యక్తం చేయగల ఒక సహోదరి క్రైస్తవ సంఘంలోనే చివరికి కనిపించడంతో అదే తన ప్రార్థనకు జవాబు అన్న నిర్ధారణకు వచ్చింది. యెహోవా తనను నడిపిస్తున్నాడన్న నమ్మకంతో ఆమె దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ స్వంత ప్రార్థనలను మెరుగుపర్చుకోవడం ద్వారా తమ పిల్లలకు సహాయం చేయగలరు. కుటుంబంగా కలిసి ప్రార్థించేటప్పుడు తల్లిదండ్రులు తమ హృదయాలను యెహోవా ఎదుట కుమ్మరించాలి, అలా పిల్లలు యెహోవాకు తమ తల్లిదండ్రులకు మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గ్రహించగలుగుతారు.

ఓర్పును కనపర్చండి, కానీ స్థిరంగా ఉండండి

9, 10. వక్రమార్గంలో పయనిస్తున్న ఇశ్రాయేలీయుల పట్ల దీర్ఘశాంతంగా ఉంటూ యెహోవా ఎలాంటి మాదిరిని ఉంచాడు?

9 ఒక యౌవనస్థుడు కొట్టుకొనిపోవడం ప్రారంభించినప్పుడు, ఆయన తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన తల్లిదండ్రులు తనతో ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా నిరోధించే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో తల్లిదండ్రులు ఏమి చేయగలరు? ప్రాచీన ఇశ్రాయేలు విషయంలో యెహోవా ఏం చేశాడో పరిశీలించండి. ఆయన “లోబడనొల్లని ప్రజల”ను 900కు పైగా సంవత్సరాలు సహించి, వక్రమార్గంలో పయనిస్తున్న వారిని చివరికి విసర్జించాడు. (నిర్గమకాండము 34:⁠9; 2 దినవృత్తాంతములు 36:​17-21; రోమీయులు 10:​20,21) వారు మాటికిమాటికి ‘ఆయనను శోధించినా’ ఆయన “వాత్సల్యసంపూర్ణుడై” ఉన్నాడు. ఆయన “తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.” (కీర్తన 78:​38-42) దేవుడు వారితో వ్యవహరించిన రీతిలో నిందారహితునిగా ఉన్నాడు. ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డకు సహాయం చేయాలనే తమ ప్రయత్నాలకు వాడు వెంటనే ప్రతిస్పందించకపోతే వారు యెహోవాను అనుకరిస్తారు.

10 దీర్ఘశాంతము వహించడం, లేదా ఓర్పును కనపర్చడం అనే మాటలు, కలతలతో నిండిన సంబంధాలు మెరుగవుతాయన్న నిరీక్షణను విడిచిపెట్టకపోవడాన్ని కూడా సూచిస్తాయి. దీర్ఘశాంతాన్ని ఎలా కలిగివుండాలో యెహోవా మనకు మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల దగ్గరికి “మళ్ళీ మళ్ళీ” తన దూతలను పంపుతూ చొరవ తీసుకున్నాడు. వారు తన “దూతలను ఎగతాళిచేయుచు, [తన] వాక్యములను తృణీకరించుచు” ఉన్నప్పటికీ యెహోవా తన “జనులయందు ... కటాక్షము గలవాడై” ఉన్నాడు. (2 దినవృత్తాంతములు 36:​15,16, NW) ‘మీరందరు మీ చెడ్డమార్గమును విడిచిపెట్టి తిరగండి’ అని అంటూ ఆయన ఇశ్రాయేలీయులకు విజ్ఞప్తిచేశాడు. (యిర్మీయా 25:​4,5) అయితే యెహోవా తన నీతియుక్త సూత్రాల విషయంలో రాజీ పడలేదు. ఇశ్రాయేలీయులు దేవుని తట్టు, ఆయన మార్గాల తట్టు ‘తిరగాలని’ నిర్దేశించబడ్డారు.

11. తల్లిదండ్రులు దారితప్పుతున్న పిల్లవాడితో వ్యవహరించేటప్పుడు దీర్ఘశాంతంతో ఉంటూనే స్థిరంగా ఎలా ఉండగలరు?

11 తల్లిదండ్రులు దారితప్పుతున్న పిల్లవాడి విషయంలో ఆశలన్నీ వెంటనే వదిలేసుకోకపోవడం ద్వారా వారు, దీర్ఘశాంతాన్ని కనపర్చడంలో యెహోవా ఉంచిన మాదిరిని అనుకరించగలరు. వారు ఆశలు వదులుకోకుండా పిల్లవాడితో మాట్లాడుతూ ఉండడానికీ, ఒకవేళ అప్పటికే మాటల్లేకుండా పోయినట్లైతే మళ్ళీ సంబంధాల్ని నెలకొల్పడానికీ చొరవ తీసుకోవాలి. వారు నీతియుక్తమైన సూత్రాలకు అంటిపెట్టుకుని ఉంటూనే పిల్లవాడు సత్యమార్గానికి మరలిరావాలని “మళ్ళీ మళ్ళీ” విజ్ఞప్తి చేస్తూ ఉండగలరు.

మైనర్‌ పిల్లవాడు బహిష్కరించబడినప్పుడు

12. తమతో పాటు ఉంటున్న మైనర్‌ పిల్లవాడు సంఘం నుండి బహిష్కృతుడైతే తల్లిదండ్రులకు ఆయనపట్ల ఎలాంటి బాధ్యత ఉంటుంది?

12 తన తల్లిదండ్రులతో ఉంటున్న మైనర్‌ పిల్లవాడు గంభీరమైన తప్పిదం చేసి, పశ్చాత్తాపం లేని వైఖరి మూలంగా సంఘం నుండి బహిష్కృతుడైతే అప్పుడేమిటి? మైనర్‌ పిల్లవాడు తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు కాబట్టి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉపదేశాన్ని క్రమశిక్షణను అందించే బాధ్యత ఇంకా వారి మీదే ఉంటుంది. వారు దీన్నెలా నిర్వర్తించగలరు?​—⁠సామెతలు 6:​20-22; 29:⁠17.

13. తల్లిదండ్రులు తప్పుచేస్తున్న పిల్లవాడి హృదయాన్ని స్పృశించేందుకు ఎలా ప్రయత్నించగలరు?

13 అలాంటి ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఆయనతో వ్యక్తిగతంగా బైబిలు అధ్యయనాన్ని చేస్తున్నప్పుడు ఇవ్వడం సాధ్యమౌతుండవచ్చు, నిజానికి అలా చేయడం చాలా మంచిది. తల్లి లేక తండ్రి ఆపిల్లవాడి కఠిన వైఖరిని బట్టి వాడికి తీర్పుతీర్చకూడదు, ఆయన హృదయంలో ఏముందో వారు చూడడానికి ప్రయత్నించాలి. ఆయన ఆధ్యాత్మిక వ్యాధి ఎంతగా వ్యాపించివుంది? (సామెతలు 20:⁠5) ఆయన హృదయంలో ఇంకా రాయిలా తయారుకాని ప్రదేశాన్ని స్పృశించవచ్చా? ఏ లేఖనాలను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చును? అపొస్తలుడైన పౌలు మనకిలా హామీ ఇస్తున్నాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:​12) అవును, మళ్ళీ తప్పుడు పనుల్లో పాల్గొనవద్దని తమ పిల్లవాడికి చెప్పేసి ఊరుకోవడం కాకుండా తల్లిదండ్రులు ఇంకా ఎక్కువే చేయగలరు. పునరారోగ్యాన్ని పొందే ప్రక్రియను వారు ప్రారంభించగలరు, దాన్ని కొనసాగించగలరు.

14. యెహోవాతో తన సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి తప్పు చేస్తున్న పిల్లవాడు తీసుకోవలసిన మొట్టమొదటి చర్య ఏమిటి, ఆచర్యను తీసుకోవడానికి తల్లిదండ్రులు ఆయనకు ఎలా సహాయం చేయగలరు?

14 తప్పు చేస్తున్న పిల్లవాడు యెహోవాతో తనకుగల సంబంధాన్ని పునఃస్థాపించుకోవల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి చర్యగా వాడు ‘మారుమనస్సునొంది తిరగాలి.’ (అపొస్తలుల కార్యములు 3:​19,20; యెషయా 55:​6,7) తమ ఇంట్లో ఉన్న పిల్లవాడు మారుమనస్సు పొందడానికి సహాయం చేయడంలో, అనుకూలంగా స్పందించనప్పుడు తల్లిదండ్రులు ‘కీడును సహిస్తూ, సాధువుగా బోధిస్తూ’ ఉండాలి. (2 తిమోతి 2:​23-26) వారు ఆయనను బైబిలు భావంలో ‘గద్దించాలి.’ ‘గద్దించు’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని “ఒప్పింపజేసే సాక్ష్యాధారాల్ని చూపించడం” అని కూడా అనువదించవచ్చు. (ప్రకటన 3:​19; యోహాను 16:⁠8) కాబట్టి గద్దించడంలో, ఆపిల్లవాడి మార్గం పాపభరితమైనదని ఒప్పించడానికి సరిపడినంత సాక్ష్యాధారాల్ని చూపించడం కూడా ఇమిడివుంది. నిజమే, ఇది సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు సాధ్యమైనప్పుడల్లా అతడి హృదయాన్ని రేకెత్తించవచ్చు, లేఖనాధారంగా యుక్తమైన మాధ్యమాలన్నీ ఉపయోగిస్తూ వాడిని ఒప్పించవచ్చు. “కీడును ద్వేషించి మేలును ప్రేమించ”వలసిన అవసరం ఉందని గ్రహించేలా ఆయనకు సహాయం చేయడానికి వారు ప్రయత్నించాలి. (ఆమోసు 5:​15) ఆయన ‘సాతాను ఉరిలోనుండి తప్పించుకొని మేలుకొనే’ అవకాశం ఉంది.

15. తప్పుచేస్తున్న వ్యక్తి యెహోవాతో సంబంధాన్ని పునఃస్థాపించుకోవడంలో ప్రార్థన ఎలాంటి పాత్రను నిర్వహిస్తుంది?

15 యెహోవాతో సంబంధాన్ని పునఃస్థాపించుకోవడంలో ప్రార్థనను మరువలేము. క్రైస్తవ సంఘంతో సహవసిస్తున్న ఒక వ్యక్తి పశ్చాత్తాపం చూపకుండా స్పష్టంగా చేస్తూ ఉన్న ఘోరమైన పాపం విషయంలో ఎవరూ ‘వేడుకొనకూడదు.’ (1 యోహాను 5:​16,17; యిర్మీయా 7:​16-20; హెబ్రీయులు 10:​26,27) అయినా, తమ పరిస్థితితో తెలివిగా వ్యవహరించేందుకు తమకు జ్ఞానాన్నివ్వమని తల్లిదండ్రులు యెహోవాను అడుగవచ్చు. (యాకోబు 1:⁠5) బహిష్కృతుడైన పిల్లవాడు పశ్చాత్తాప చిహ్నాలు కనపరుస్తున్నప్పుడు, ఒకవేళ “దేవుని యెదుట ధైర్యము” కలిగివుండలేకపోతుంటే ఆపిల్లవాని తప్పును క్షమించడానికి దేవునికి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూడమని ప్రార్థిస్తూ, తన చిత్తమే జరగాలని దేవుణ్ణి కోరవచ్చు. (1 యోహాను 3:​21) పిల్లవాడు ఆప్రార్థనలు వినడం ద్వారా, యెహోవా కనికరంగల దేవుడని గ్రహించేందుకు సహాయాన్ని పొందాలి. *​—⁠నిర్గమకాండము 34:​6,7; యాకోబు 5:⁠16.

16. బహిష్కృతులైన మైనర్‌ పిల్లల కుటుంబ సభ్యులకు మనమెలా సహాయం చేయవచ్చు?

16 బాప్తిస్మం పొందిన యౌవనస్థుడు బహిష్కృతుడైతే సంఘ సభ్యులు ఆయనతో ‘సాంగత్యము చేయకూడదు.’ (1 కొరింథీయులు 5:​11; 2 యోహాను 10, 11) బహుశ ఇది, చివరకు ఆయనకు ‘బుద్ధి వచ్చేందుకు,’ సంరక్షణగా ఉన్న దేవుని గొఱ్ఱెలదొడ్డికి తిరిగి వచ్చేందుకు సహాయపడవచ్చు. (లూకా 15:​17) అయితే ఆయన వచ్చినా రాకపోయినా సంఘ సభ్యులు బహిష్కృత యౌవనస్థుడి కుటుంబాన్ని ప్రోత్సహించవచ్చు. ‘ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడే’ అవకాశాల కోసం, వారిపట్ల ‘కరుణాచిత్తులుగా’ ఉండే అవకాశాల కోసం ఎదురుచూడవచ్చు.​—⁠1 పేతురు 3:8, 9.

ఇతరులు ఎలా సహాయం చేయగలరు?

17. దారితప్పుతున్న యౌవనస్థుడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సంఘ సభ్యులు ఏమి గుర్తుంచుకోవాలి?

17 అయితే, క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడకపోయినా, విశ్వాసంలో బలహీనంగా తయారైన యౌవనస్థుడి విషయమేమిటి? “ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 12:​26) అలాంటి యౌవనస్థుడి విషయంలో ఇతరులు మంచి ఆసక్తిని ప్రదర్శించగలరు. కొంతమేరకు జాగ్రత్త అవసరం, ఎందుకంటే ఆధ్యాత్మికంగా అస్వస్థతగా ఉన్న యౌవనస్థుడు ఇతర యౌవనస్థులపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపగలడు. (గలతీయులు 5:​7-9) ఒక సంఘంలో, ఆధ్యాత్మికంగా బలహీనంగా తయారైన కొందరు యౌవనస్థులకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో కొంతమంది పెద్దవాళ్ళు పాపులర్‌ మ్యూజిక్‌ని సంగీత వాయిద్యాలపై వాయించడానికి వారిని ఆహ్వానించారు. ఆయౌవనస్థులు వెంటనే ఒప్పుకుని అలాంటి సమావేశాల నుండి ఆనందాన్ని అనుభవించినా, ఒకరిపై మరొకరు చూపిన ప్రభావం మూలంగా వారు చివరికి సంఘంతో సంబంధాలను తెంచేసుకోవడానికి నడిపించింది. (1 కొరింథీయులు 15:​33; యూదా 22, 23) అస్వస్థతతో ఉన్న పిల్లవాడికి స్వస్థతను చేకూర్చగలిగేది, ఎలాంటి ఆధ్యాత్మిక నడిపింపూ లేని సామాజిక కార్యకలాపాలు కాదు గాని ఆధ్యాత్మిక విషయాలంటే అభిరుచిని పెంపొందించుకునేలా సహాయం చేసే సాంగత్యమే. *

18. యేసు దృష్టాంతంలోని తప్పిపోయిన కుమారుడి తండ్రి చూపినటువంటి ఆహ్వాన స్ఫూర్తిని మనం ఎలా అనుకరించగలము?

18 సంఘాన్ని విడిచిపెట్టిన ఒక యౌవనస్థుడు రాజ్యమందిరానికి వస్తే లేదా సమావేశానికి హాజరైతే ఆయనెలా భావిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. యేసు దృష్టాంతంలోని తప్పిపోయిన కుమారుడి తండ్రి చూపినటువంటి ఆహ్వాన స్ఫూర్తిని మనం ప్రదర్శించవద్దా? (లూకా 15:​18-20,25-32) క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టిన ఒక యౌవనస్థుడు ఒక జిల్లా సమావేశానికి హాజరైన తర్వాత ఇలా వ్యాఖ్యానించాడు: “నాలాంటి వాడిని చూసి అందరూ తప్పించుకు తిరుగుతారనుకున్నాను, కానీ సహోదర సహోదరీలు నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించారు. నేను చాలా కదిలిపోయాను.” ఆయన తిరిగి బైబిలు అధ్యయనం ప్రారంభించి తర్వాత బాప్తిస్మం పొందాడు.

చేతులెత్తేయకండి

19, 20. తప్పిపోయిన బిడ్డ విషయంలో మనం ఎందుకు అనుకూల వైఖరిని కలిగివుండాలి?

19 “తప్పిపోయిన” కుమారుడు/కుమార్తె ‘బుద్ధి తెచ్చుకునేందుకు’ సహాయం చేయడానికి ఓర్పు కావాలి, అది తల్లిదండ్రులకూ ఇతరులకూ చాలా సవాలుగా ఉంటుంది. కానీ చేతులెత్తేయకండి. “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 పేతురు 3:⁠9) ప్రజలు పశ్చాత్తాపం చూపి, సజీవులుగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడన్న లేఖనాధారిత హామీ మనకు ఉంది. నిజానికి మానవులు తనతో సమాధానపడేందుకు ఏర్పాటు చేయడంలో ఆయన చొరవ తీసుకున్నాడు. (2 కొరింథీయులు 5:​18,19) ఆయన ఓర్పు మూలంగా లక్షలాదిమంది బుద్ధితెచ్చుకున్నారు.​—⁠యెషయా 2:2,3.

20 కాబట్టి తల్లిదండ్రులు తప్పిపోయిన తమ మైనర్‌ పిల్లలు బుద్ధి తెచ్చుకునేందుకు సహాయం చేయడానికి సాధ్యమైనంతగా ప్రతి లేఖనాధార పద్ధతిని ఉపయోగించవద్దా? యెహోవాను అనుకరిస్తూ, మీపిల్లవాడు యెహోవా దగ్గరికి తిరిగి వచ్చేందుకు సహాయం చేయడానికి మీరు నిర్దిష్టమైన చర్యలను తీసుకుంటున్నప్పుడు దీర్ఘశాంతం కలిగివుండండి. బైబిలు సూత్రాలకు స్థిరంగా అంటిపెట్టుకుని ఉంటూ యెహోవా సహాయం కోసం ప్రార్థిస్తూ ఆయన లక్షణాలైన ప్రేమ, న్యాయం, జ్ఞానములను ప్రతిబింబించడానికి ప్రయత్నించండి. కఠోరమైన తిరుగుబాటుదారులు అనేకులు, తిరిగిరమ్మంటున్న యెహోవా ప్రేమపూర్వకమైన ఆహ్వానానికి ప్రతిస్పందించినట్లే మీతప్పిపోయిన కుమార్తె లేక కుమారుడు సంరక్షణగా ఉన్న దేవుని గొఱ్ఱెలదొడ్డికి తిరిగి రావచ్చును.​—⁠లూకా 15:6,7.

[అధస్సూచీలు]

^ పేరా 6 యౌవనస్థులకు సమర్థవంతంగా ఎలా బోధించాలో మరిన్ని సూచనల కోసం కావలికోట, జూలై 1, 1999, 13-17 పేజీలు చూడండి.

^ పేరా 15 అలాంటి ప్రార్థనలు బహిష్కృత మైనర్‌ పిల్లవాడి పక్షాన సంఘ కూటాల్లో బహిరంగంగా చేయబడవు, ఎందుకంటే బహిష్కృత వ్యక్తి స్థితిని గురించి ఇతరులకు బహుశ తెలియకపోవచ్చు.​—⁠కావలికోట, అక్టోబరు 15, 1979 (ఆంగ్లం), 31వ పేజీ చూడండి.

^ పేరా 17 నిర్దిష్ట సూచనల కోసం తేజరిల్లు! జూన్‌ 22, 1972 (ఆంగ్లం), 13-16 పేజీలు; అక్టోబరు 8, 1996, 22-24 పేజీలు చూడండి.

మీరు గుర్తు తెచ్చుకోగలరా?

• యౌవనస్థులు సంఘాన్ని విడిచిపెట్టడానికి మూలకారణం బహుశ ఏమైవుంటుంది?

• యౌవనస్థులు యెహోవాతో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వారికి ఎలా సహాయం చేయవచ్చు?

• తప్పిపోయిన కుమారుడికి సహాయం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు దీర్ఘశాంతముగా అదే సమయంలో స్థిరంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది?

• తప్పిపోయిన యౌవనస్థుడు తిరిగి వచ్చేందుకు సంఘంలోనివారు ఎలా సహాయం చేయగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

యెహోవాతో సన్నిహితమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి దేవుని వాక్యాన్ని చదవడం చాలా ఆవశ్యకం

[15వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులు హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం, యెహోవాకు వారికి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని పిల్లలు గ్రహించేందుకు సహాయం చేయగలదు

[17వ పేజీలోని చిత్రం]

తప్పిపోయిన కుమారుడు ‘బుద్ధి తెచ్చుకున్నప్పుడు’ ఆయనను ఆహ్వానించండి

[18వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలు యెహోవా దగ్గరికి తిరిగివచ్చేందుకు సహాయం చేయడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోండి