కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన విశ్వాసం కలిగి ఉండడం మీకు సాధ్యమే

నిజమైన విశ్వాసం కలిగి ఉండడం మీకు సాధ్యమే

నిజమైన విశ్వాసం కలిగి ఉండడం మీకు సాధ్యమే

సారా జేన్‌కు 19 ఏళ్ళ వయస్సులో, తనకు ఒవేరియన్‌ (అండాశయముకి) క్యాన్సర్‌ ఉందని తెలిసింది. శస్త్ర చికిత్స తర్వాత వ్యాధి కాస్త నయమనిపించడంతో, ఆమెకు భవిష్యత్తు మీద ఆశాభావం కలిగింది. వాస్తవానికి, ఆమె తన 20వ ఏట ఎంతో ఆశతో నిశ్చితార్థము చేసుకొని పెళ్ళి గురించి ఆలోచించడం ఆరంభించింది. అదే సంవత్సరం ఆమెకు క్యాన్సర్‌ తిరగబెట్టింది, తాను కేవలం కొన్ని వారాలు మాత్రమే బ్రతికి ఉంటుందని ఆమెకు తెలిసింది. చివరికి సారా జేన్‌ జూన్‌ నెల 2000 లో 20 యేళ్ళు నిండకముందే మరణించింది.

భవిష్యత్తు గురించి ఆమెకున్న అచంచలమైన దృఢవిశ్వాసముతోపాటు దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆమె కనబరచిన ప్రగాఢ విశ్వాసము హాస్పిటల్‌లో ఆమెను చూడడానికి వచ్చిన వారిని ముగ్ధులను చేసింది. ఆమె ఎంతో విషాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, పునరుత్థానంలో తన స్నేహితులనందరినీ తిరిగి చూడగలుగుతానని ఆమె దృఢ నమ్మకం కలిగి ఉండేది. (యోహాను 5:​28,29) “నేను మిమ్మల్నందరినీ దేవుని నూతన లోకంలో కలుస్తాను” అని ఆమె అన్నది.

అటువంటి విశ్వాసం వట్టి భ్రమ అని కొందరు కొట్టి పడేస్తారు. “మరణం తర్వాతి జీవితమంటే, చివరి బూర ఊదగానే, అక్కడెక్కడో ఉన్న పచ్చని ఏదెను తోటకు చేరుకుని కేకులు, మద్యం, మాంసాల విందుతోపాటు బూరలు ఊదబడుతుండగా, అంతకుముందే అక్కడికి చేరుకున్న వారితోనూ తర్వాత రాబోయే వారితోనూ సంతోషంగా గడపడమనే, ఆత్మస్థయిర్యం లేనివారిలో ఉండే ఒక నమ్మకం కాక మరేమిటి?” అని లుడోవిక్‌ కెన్నెడీ అడుగుతున్నాడు. దీన్ని ఎదుర్కోవడానికి మనం మరో ప్రశ్న వేయాలి​—⁠కెన్నెడీ సూచిస్తున్నట్లుగా “మనకున్నది ఈఒక్క జీవితమే కాబట్టి దాన్ని మనం పూర్తిగా అనుభవిద్దాం” అని విశ్వసించడమా లేక దేవుడ్నీ పునరుత్థానం గురించి ఆయన చేసిన వాగ్దానాన్నీ విశ్వసించడమా, ఏది సహేతుకమైనది? సారా జేన్‌ రెండవదాన్ని ఎన్నుకుంది. అలాంటి విశ్వాసాన్ని ఆమె ఎలా పెంపొందించుకుంది?

‘దేవుణ్ణి వెదకి కనుగొనండి’

ఒకరి మీద విశ్వాసాన్నీ నమ్మకాన్నీ పెంచుకోవాలంటే, ఆవ్యక్తిని మీరు ఎరిగి ఉండాలి, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనేది తెలిసుండాలి. అలా తెలుసుకోవడంలో మనసుతోపాటు హృదయమూ భాగం వహిస్తుంది. దేవుని మీద నిజమైన విశ్వాసాన్ని పెంచుకునే విషయంలోనూ అది వాస్తవం. మీరు ఆయన లక్షణాల గురించి, వ్యక్తిత్వం గురించి, ఆయన తాను చెప్పిన వాటిలో చేసిన వాటిలో ఎంత నమ్మతగినవాడిగా, ఆధారపడదగినవాడిగా తనను తాను నిరూపించుకున్నాడో దాని గురించి మీరు తెలుసుకోవలసిన అవసరముంది.​—⁠కీర్తన 9:​10; 145:​1-21.

అది సాధ్యంకాదని కొందరు అనుకుంటారు. ఒకవేళ దేవుడున్నా ఆయన చాలా దూరంగా ఉన్నాడు, ఆయన అగమ్యగోచరుడు అని వాళ్ళంటారు. “సారా జేన్‌లాంటి క్రైస్తవులకు అనిపించినట్లు దేవుడు నిజంగా వాస్తవమైనవాడే అయితే, ఆయన మిగతా వారందరికీ తనను తాను ఎందుకు ఎరుకపరచుకోవడం లేదు?” అని ఒక సంశయవాది అడుగుతాడు. కానీ, దేవుడు నిజంగానే చాలా దూరంగా ఉన్నాడా, ఆయనను వెదికి కనుగొనడం అసాధ్యమా? అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని తత్త్వవేత్తలకు, విద్యావేత్తలకు ఇచ్చిన ప్రసంగంలో, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు” ‘తనను వెదకి కనుగొనడానికి’ కావలసిన వాటన్నింటినీ కూడా అనుగ్రహించాడని చెప్పాడు. వాస్తవానికి, “ఆయన మనలో ఎవనికిని దూరముగా” లేడని పౌలు అన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 17:24-27.

మరలాంటప్పుడు, మీరు ఆయనను ఎలా ‘వెదకి కనుగొనగలరు’? కొందరు కేవలం తమ చుట్టూ ఉన్న విశ్వాన్ని గమనించి కనుగొన్నారు. చాలామందికి, ఈవిశ్వమే ఒక సృష్టికర్త ఉండవచ్చునని వారిని ఒప్పించేందుకు కావలసినంత సాక్ష్యాధారాన్ని ఇస్తుంది. * (కీర్తన 19:1; యెషయా 40:26; అపొస్తలుల కార్యములు 14:​16,17) “[దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అని అపొస్తలుడైన పౌలు భావించినట్లే, వాళ్ళూ భావిస్తారు.​—⁠రోమీయులు 1:20; కీర్తన 104:24.

మీకు బైబిలు అవసరం

అయితే సృష్టికర్తపై నిజమైన విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి, ఆయన సమకూర్చిన మరొకదాని అవసరం కూడా ఉంది. ఏమిటది? అది, దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలే, దాంట్లో ఆయన తన చిత్తాన్ని సంకల్పాన్ని బయలుపరిచాడు. (2 తిమోతి 3:​16,17) “కానీ ఆగండి, ఓ ప్రక్కన బైబిలు ప్రకారం జీవిస్తున్నామనే ప్రజలే ఎన్నో ఘోరకృత్యాలను చేయడం చూస్తూ, బైబిలు చెప్పేదేదైనా మీరు ఎలా నమ్మగలరు?” అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఆందోళన కలిగించే కపటము, క్రూరత్వంతోపాటు అనైతికతతో నిండిన చరిత్ర క్రైస్తవమత సామ్రాజ్యానికుంది. కానీ, క్రైస్తవమత సామ్రాజ్యం బైబిలు సూత్రాలను పాటిస్తున్నట్లు కేవలం బుకాయిస్తోందని సహేతుకమైన ఏవ్యక్తైనా గ్రహిస్తాడు.​—⁠మత్తయి 15:​7-9.

అనేకమంది దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటారు, కానీ నిజానికి, “వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించు”తారు అని బైబిలే స్వయంగా హెచ్చరించింది. “వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును” అని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (2 పేతురు 2:​1,2) అలాంటివారిని, “అక్రమము చేయు వా[రు]” అని యేసు క్రీస్తు అన్నాడు, వారు తాము చేసే దుష్కార్యములనుబట్టి స్పష్టంగా గుర్తించబడతారు. (మత్తయి 7:​15-23) క్రైస్తవమత సామ్రాజ్యానికున్న అటువంటి చరిత్ర కారణంగా దేవుని వాక్యాన్ని తిరస్కరించడం, నమ్మకస్థుడైన స్నేహితుడి ఉత్తరాన్ని, అది తెచ్చిన వ్యక్తి అప్రతిష్టలపాలైనవాడవడంవల్ల పడేయడంలా ఉంటుంది.

దేవుని వాక్యం లేకుండా నిజమైన విశ్వాసాన్ని పెంచుకోవడం అసాధ్యం. ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా తన వైపునుండి మాట్లాడాలనుకున్న విషయాలను బైబిలు పుటల ద్వారా మాత్రమే తెలియజేస్తాడు. దుఃఖాన్ని, బాధను తాను ఎందుకు అనుమతించాడు, అలాంటి పరిస్థితుల గురించి తానేమి చేస్తాడు వంటి సార్వకాలిక ప్రశ్నలకు ఆయన సమాధానాలను వెల్లడిచేస్తాడు. (కీర్తన 119:105; రోమీయులు 15:⁠4) బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని సారా జేన్‌ నమ్మింది. (1 థెస్సలొనీకయులు 2:13; 2 పేతురు 1:​19-21) ఎలా? అలా నమ్మాలని కేవలం ఆమె తల్లిదండ్రులు చెప్పినందువల్ల మాత్రమే కాక, బైబిలు దేవుడిచ్చిన ఒక విశిష్టమైన దివ్యజ్ఞానమని చూపించే అన్ని రుజువులను యథార్థంగా పరిశీలించేందుకు ఆమె కావలసినంత సమయం తీసుకొని మదింపు చేసి అప్పుడు నమ్మింది. (రోమీయులు 12:⁠2) ఉదాహరణకు, బైబిలు సూత్రాలను అంటిపెట్టుకున్నవారి జీవితాల్లో బైబిలు చూపుతున్న శక్తివంతమైన ప్రభావాన్ని ఆమె గమనించింది. బైబిలు​—⁠దేవుని వాక్యమా లేక మానవునిదా? * (ఆంగ్లం) వంటి ప్రచురణల సహాయంతో బైబిలు దైవ ప్రేరేపితమని రుజువుపరిచే అసంఖ్యాకమైన అంతర్గత సాక్ష్యాలను కూడా ఆమె జాగ్రత్తగా పరిశీలించింది.

“వినుట వలన విశ్వాసము కలుగును”

అయితే, కేవలం ఒక బైబిలును కలిగి ఉండడం లేక అది దైవ ప్రేరేపితమని నమ్మడం మాత్రమే సరిపోదు. “వినుట వలన విశ్వాసము కలుగును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 10:17) బైబిలు చెప్పేది వినడం వల్లనే విశ్వాసం పెరుగుతుంది, కేవలం బైబిలును కలిగి ఉండడం వల్లకాదు. దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది మీరు బైబిలును చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా ‘వింటారు.’ చిన్నపిల్లలు కూడా వినగలరు. తిమోతికి “బాల్యమునుండి” ఆయన అమ్మ, అమ్మమ్మ “పరిశుద్ధలేఖనములను” బోధించారని పౌలు అంటున్నాడు. అంటే వాళ్ళు తమ అభిప్రాయాలను ఆయనపై రుద్దారని అది సూచిస్తుందా? లేదు! తిమోతి లోబరచుకోబడలేదు లేక ఏ విధంగానూ మోసగించబడలేదు. ఆయన తను విన్నవి, చదివినవి ‘రూఢియని తెలిసికొన్నాడు.’​—⁠2 తిమోతి 1:​3-5; 3:14, 15.

సారా జేన్‌ కూడా అదే విధంగా రూఢిగా తెలుసుకుంది. మొదటి శతాబ్దపు బెరయ వారిలా, ఆమె తన “[తల్లిదండ్రులనుండి, ఇతర బోధకులనుండి] ఆసక్తితో వాక్యమును అంగీకరించిం[ది].” ఆమె చిన్నప్పుడు, తన తల్లిదండ్రులు చెప్పిందాన్ని సహజంగానే నమ్మిందనడంలో సందేహం లేదు. కానీ ఆమె పెరిగి పెద్దయ్యాక, తను నేర్చుకున్నవన్నీ ఆమె కేవలం గ్రుడ్డిగా లేక నామమాత్రంగా ఏమీ అంగీకరించలేదు. ఆమె తాను విన్న ‘సంగతులు ఆలాగున్నాయా లేవా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించింది.’​—⁠అపొస్తలుల కార్యములు 17:​11.

మీరు నిజమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవచ్చు

హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు వర్ణించినటువంటి నిజమైన విశ్వాసాన్ని మీరు కూడా వృద్ధిచేసుకోవచ్చు. అలాంటి విశ్వాసం, “నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని ఆయన అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 11:⁠1) అలాంటి విశ్వాసం ఉంటే, దేవుడు చేసిన పునరుత్థాన వాగ్దానంతో సహా మీకోరికలు, నిరీక్షణలు అన్నీ నిజమవుతాయని మీరు సంపూర్ణమైన నిశ్చయత కలిగివుంటారు. అలాంటి నిరీక్షణలు, ఆశాపూరితమైన ఆలోచనమీద కాదుగానీ, అవి నిశ్చయమైన హామీలపై ఆధారపడినవని మీరు నమ్ముతారు. యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చడంలో ఎప్పుడూ విఫలుడు కాలేదని మీరు తెలుసుకుంటారు. (యెహోషువ 21:​44, 45; 23:​14; యెషయా 55:10,11; హెబ్రీయులు 6:17, 18)) దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకము ఇప్పటికే వచ్చేసినంత వాస్తవంగా మీకు అనిపిస్తుంది. (2 పేతురు 3:​13) అంతేగాక యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, దేవుని రాజ్యం పగటి కలలు కావనీ, అవన్నీ నిజాలనీ మీరు మీవిశ్వాసనేత్రాలతో స్పష్టంగా చూడగలుగుతారు.

నిజమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడానికి మీరు ఒంటరిగా వదిలిపెట్టబడలేదు. యెహోవా తన వాక్యాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు, దేవుని మీద నిజమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడంలో యథార్థ హృదయులకు సహాయపడడానికి అంకితమైన ఒక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. (యోహాను 17:20; రోమీయులు 10:​14,15) ఆసంస్థ ద్వారా యెహోవా ఇస్తున్న సహాయాన్నంతటినీ స్వీకరించండి. (అపొస్తలుల కార్యములు 8:​30,31) విశ్వాసము కూడా దేవుని ఆత్మ ఫలము గనుక, మీరు నిజమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడానికి సహాయపడేలా ఆఆత్మ కోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.​—⁠గలతీయులు 5:​22.

దేవుని మీద ఆయన వాక్యం మీద విశ్వాసముందని చెప్పేవారిని ఎగతాళి చేసే సంశయవాదుల కారణంగా నిరుత్సాహపడకండి. (1 కొరింథీయులు 1:18-21; 2 పేతురు 3:​3,4) వాస్తవానికి, అలాంటి దాడులను తట్టుకొని నిలబడాలనే మీనిశ్చయతను బలపర్చడంలో నిజమైన విశ్వాసము ఎంతగానో తోడ్పడుతుంది. (ఎఫెసీయులు 6:​16) సారా జేన్‌ అది నిజమని తెలుసుకుంది, ఆమెను చూడడానికి హాస్పిటలుకు వచ్చిన వారిని తమ విశ్వాసాన్ని వృద్ధిచేసుకొమ్మని ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహించేది. “సత్యాన్ని మీస్వంతం చేసుకోండి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. దేవుని సంస్థను అంటిపెట్టుకొని ఉండండి. నిరంతరం ప్రార్థించండి. యెహోవా సేవలో చురుగ్గా ఉండండి” అని ఆమె అంటుండేది.​—⁠యాకోబు 2:17, 26.

దేవుని మీద, పునరుత్థానం మీద ఆమెకున్న విశ్వాసాన్ని చూసిన నర్సుల్లో ఒకామె, “మీరు నిజంగా దీన్ని నమ్ముతారు కదూ” అని అంది. ఆమె అంత బాధననుభవిస్తున్నప్పటికీ అలాంటి ఆశాపూరిత దృక్పథం కలిగివుండడానికి కారణమేమిటని అడిగినప్పుడు “యెహోవా మీది విశ్వాసమే. ఆయన నాకు ఒక నిజమైన స్నేహితుడు, ఆయనను నేనెంతో ప్రేమిస్తాను” అని సారా జవాబిచ్చింది.

[అధస్సూచీలు]

^ పేరా 8 యెహోవా సాక్షులు ప్రచురించిన, మీపట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూడండి.

^ పేరా 12 యెహోవా సాక్షులచే ప్రచురించబడింది.

[6వ పేజీలోని చిత్రం]

తిమోతికి “బాల్యమునుండి” ఆయన అమ్మ, అమ్మమ్మ “పరిశుద్ధలేఖనములను” బోధించారు

[6వ పేజీలోని చిత్రం]

బెరయలోని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించినందుకు ప్రశంసించబడ్డారు

[చిత్రసౌజన్యం]

1914 లోని “Photo-Drama of Creation,” నుండి

[7వ పేజీలోని చిత్రాలు]

బైబిలు చెప్పేది విని దాన్ని అనుసరించడం వల్లనే విశ్వాసం పెరుగుతుంది, కేవలం బైబిలును కలిగి ఉండడం వల్లకాదు

[7వ పేజీలోని చిత్రం]

“నేను మిమ్మల్నందరినీ దేవుని నూతన లోకంలో కలుస్తాను”