పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
హెబ్రీయులు 4:9-11 లో ప్రస్తావించబడిన “విశ్రాంతి” అంటే ఏమిటి, ఒకరు “ఆ విశ్రాంతిలో” ఎలా ‘ప్రవేశిస్తారు’?
మొదటి శతాబ్దపు హీబ్రూ క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి ... ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.”—హెబ్రీయులు 4:9-11.
దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించడం గురించి పౌలు మాట్లాడినప్పుడు ఆయన ఆదికాండము 2:2 లో పేర్కొనబడిన దాని గురించి సూచిస్తున్నాడని స్పష్టమౌతుంది, అక్కడ మనమిలా చదువుతాము: “దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.” యెహోవా ఎందుకు ‘యేడవ దినమున విశ్రమించాడు’? “తాను చేసిన తన పని” అంతటిని బట్టి అలసట తీర్చుకోవలసిన అవసరం ఉందని మాత్రం కాదు. తర్వాతి వచనం మనకు ఒక సూచననిస్తుంది: “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.”—ఆదికాండము 2:3; యెషయా 40:26, 28.
“యేడవ దినము” మునుపటి ఆరు దినాలకూ భిన్నమైనది, ఎందుకంటే అది దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచిన దినము, అంటే ప్రత్యేకమైన సంకల్పం కోసం ప్రత్యేకించబడిన లేక సమర్పించబడిన దినము. ఏమిటా సంకల్పం? అంతకు మునుపు, మానవజాతి గురించి భూమి గురించి తనకున్న సంకల్పాన్ని దేవుడు బయలుపరిచాడు. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” దేవుడు మొదటి మానవునికి, అతని భార్యకు చెప్పాడు. (ఆదికాండము 1:28) దేవుడు మానవజాతికి, భూమికి పరిపూర్ణమైన ప్రారంభాన్ని ఇచ్చినప్పటికీ, దేవుడు సంకల్పించినట్లుగా యావత్ భూమీ లోబరచుకోబడడానికీ, పరిపూర్ణ మానవ కుటుంబంతో నింపబడిన పరదైసుగా మార్చబడడానికీ కొంత సమయం పడుతుంది. కాబట్టి, దేవుడు తాను ఇది వరకే సృష్టించినవి తన చిత్తానుసారంగా వృద్ధి చెందేలా అనుమతించడానికి “యేడవ దినమున” విశ్రమించాడు లేక భూసంబంధంగా మరే సృష్టి కార్యాలు చేపట్టకుండా ఉండిపోయాడు. ఆ“దినము” ముగింపుకల్లా, దేవుడు సంకల్పించినదంతా వాస్తవ రూపం దాలుస్తుంది. ఆవిశ్రాంతి ఎంత కాలనిడివి కలిగి ఉంటుంది?
హెబ్రీయులకు వ్రాసిన పత్రికలోని పౌలు వ్యాఖ్యానం వైపు మరలుతే, “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది” అని ఆయన అన్నాడనీ, “ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు” తాము చేయగలిగినదంతా చేయమని ఆయన తోటి క్రైస్తవులను ఉద్బోధించాడనీ మనం గమనిస్తాము. ఆఉద్బోధ, పౌలు ఆమాటలను వ్రాసినప్పుడు, దాదాపు 4,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన, దేవుడు విశ్రమిస్తున్న “యేడవ దినము” ఇంకా కొనసాగుతోందని చూపిస్తుంది. ‘విశ్రాంతి దినమునకు ప్రభువైయున్న’ యేసు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతంలో మానవజాతిపట్ల భూమిపట్ల దేవునికున్న సంకల్పం పూర్తిగా నెరవేరే వరకూ ఆదినము ముగియదు.—మత్తయి 12:8; ప్రకటన 20:1-6; 21:1-4.
ఆఅద్భుతమైన నిరీక్షణను దృష్టిలో ఉంచుకుని పౌలు, ఒకరు దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చో వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: “[దేవుని] విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” మానవజాతి పరిపూర్ణంగానే ప్రారంభమైనప్పటికీ, అది మొత్తంగా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేదని ఇది మనకు చెబుతుంది. దీనికి కారణమేమిటంటే, ఆదాము హవ్వలు తమ కోసం దేవుడు చేసిన ఏర్పాటును అంగీకరిస్తూ “యేడవ దినమున” దేవుని విశ్రాంతిని ఆచరించడాన్ని ఎక్కువకాలం కొనసాగించలేదు. బదులుగా, వారు తిరుగుబాటు చేసి, దేవుని నుండి స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. వాస్తవానికి, వారు దేవుని ప్రేమపూర్వకమైన నడిపింపును అంగీకరించే బదులు సాతాను పథకాలను అనుసరించారు. (ఆదికాండము 2:15-17) తత్ఫలితంగా, వారు పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను కోల్పోయారు. అప్పటి నుండీ, మానవజాతి అంతా పాపమరణాలకు బానిసయ్యింది.—రోమీయులు 5:12, 14.
మానవజాతి తిరుగుబాటు దేవుని సంకల్పాన్ని అడ్డగించలేదు. ఆయన విశ్రాంతి దినం కొనసాగుతూనే ఉంది. అయితే, యెహోవా తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఒక ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడు, అదే విమోచన క్రయధన ఏర్పాటు, విశ్వాసం ఆధారంగా దాన్ని అంగీకరించే వారందరూ పాప మరణాల భారం నుండి విడుదల పొంది విశ్రమించడానికి ఎదురు చూడవచ్చు. (రోమీయులు 6:23) అందుకే ‘తమ కార్యములను ముగించి విశ్రమించమని’ పౌలు తోటి క్రైస్తవులను ఉద్బోధించాడు. వారు రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాటును అంగీకరించాలిగానీ ఆదాము హవ్వలు చేసినట్లుగా తమ భవిష్యత్తును తామే తమ సొంత మార్గంలో ఏర్పరచుకునేందుకు ప్రయత్నించకూడదు. తమను తాము సమర్థించుకునే కార్యాలను చేపట్టడాన్ని కూడా వారు నివారించాలి.
దేవుని చిత్తాన్ని చేయడానికి తమ స్వార్థపూరిత లేక ఐహిక ప్రయాసలను ప్రక్కన పెట్టడం నిజంగా సేదదీర్చేదిగా ఉంటుంది. యేసు ఈఆహ్వానాన్నిచ్చాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
దేవుని విశ్రాంతి గురించీ ఒకరు దానిలో ఎలా ప్రవేశించవచ్చనేదాని గురించీ పౌలు చేసిన చర్చ, తమ విశ్వాసం నిమిత్తం ఎంతో హింసను ఎగతాళిని సహించిన యెరూషలేములోని హీబ్రూ క్రైస్తవులకు కచ్చితంగా ప్రోత్సాహకరంగా ఉంది. (అపొస్తలుల కార్యములు 8:1; 12:1-5) అలాగే, పౌలు మాటలు నేటి క్రైస్తవులకు ప్రోత్సాహకరంగా ఉండగలవు. తన నీతియుక్తమైన రాజ్య పరిపాలన క్రింద పరదైసు భూమిని తీసుకువస్తానన్న దేవుని వాగ్దాన నెరవేర్పు సమీపంలో ఉందని గ్రహిస్తూ, మనం కూడా మన సొంత కార్యముల నుండి విశ్రమించి, ఆవిశ్రాంతిలో ప్రవేశించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.—మత్తయి 6:10, 33; 2 పేతురు 3:13.
[31వ పేజీలోని చిత్రాలు]
భూ పరదైసును గురించిన దేవుని వాగ్దానం ఆయన విశ్రాంతి దినము ముగింపులో నెరవేరుతుంది