కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు శిక్షణనిచ్చే విషయంలో యెహోవాను అనుకరించండి

మీ పిల్లలకు శిక్షణనిచ్చే విషయంలో యెహోవాను అనుకరించండి

మీ పిల్లలకు శిక్షణనిచ్చే విషయంలో యెహోవాను అనుకరించండి

“తండ్రి శిక్షింపని కుమారుడెవడు?”​—⁠హెబ్రీయులు 12:⁠7.

1, 2. తల్లిదండ్రులు నేడు తమ పిల్లల్ని పెంచే విషయంలో సమస్యల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు?

కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లో చేయబడిన ఒక సర్వేలో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంభాషణ చాలా తక్కువగా ఉంటుందనీ తల్లిదండ్రులు తమ పిల్లలకు మరీ అలుసిస్తున్నారనీ ఇంటర్వ్యూ చేయబడిన వారిలో సగం మంది భావిస్తున్నట్లు వెల్లడైంది. అదే దేశంలో జరిపిన మరో సర్వేలో, తమ పిల్లలతో ఎలా వ్వవహరించాలో తెలియట్లేదని సర్వేకు ప్రతిస్పందించినవారిలో దాదాపు నాలుగోవంతు మంది ఒప్పుకున్నారు. ఈపరిస్థితి ప్రాచ్య దేశాల్లోనే కాదు. “కెనడాలోని అనేకమంది తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏమి చెయ్యాలో తెలియట్లేదని ఒప్పుకున్నారు” అని ద టొరొంటో స్టార్‌ నివేదిస్తోంది. ఏదేశంలో చూసినా, తమ పిల్లల్ని పెంచడం కష్టంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు అనిపిస్తోంది.

2 తమ పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు సమస్యల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఒక ప్రధాన కారణం ఏమిటంటే మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాము, ఇవి “అపాయకరమైన కాలములు.” (2 తిమోతి 3:⁠1) అంతేకాదు, “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 8:​21) ప్రత్యేకంగా యౌవనస్థులు సాతాను దాడులకు సులభంగా బలయ్యే అవకాశం ఉంది, వాడు “గర్జించు సింహమువలె” మాటు వేసి అనుభవశూన్యులను పట్టుకుంటాడు. (1 పేతురు 5:⁠8) అందుకనే తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాలనుకునే క్రైస్తవ తల్లిదండ్రులకు ఎన్నో అవరోధాలు ఎదురౌతాయి. (ఎఫెసీయులు 6:⁠4) తమ పిల్లలు పెరిగి పెద్దయి యెహోవాను ఆరాధించే పరిణతిచెందిన ఆరాధకులుగా, “మేలు కీడులను” వివేచించేవారిగా తయారుకావడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయగలరు?​—⁠హెబ్రీయులు 5:⁠14.

3. పిల్లలను విజయవంతంగా పెంచాలంటే తల్లిదండ్రుల శిక్షణ, నడిపింపు ఎందుకు అవసరం?

3 “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని వ్యాఖ్యానించాడు జ్ఞానియైన సొలొమోను రాజు. (సామెతలు 13:⁠1; 22:​15) వారి హృదయాల నుండి ఆమూఢత్వాన్ని తొలగించడానికి తల్లిదండ్రుల ప్రేమపూర్వకమైన దిద్దుబాటు ఎంతైనా అవసరం. అయితే పిల్లలు అలాంటి దిద్దుబాటును అన్ని వేళలా ఆనందంగా స్వీకరించరు. చెప్పాలంటే, సలహా ఎవరిచ్చినప్పటికీ వారు దాన్ని తిరస్కార దృష్టితో చూస్తారు. కాబట్టి ‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పించడం’ ఎలాగో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. (సామెతలు 22:⁠6) పిల్లలు అలాంటి క్రమశిక్షణను స్వీకరించినప్పుడు అది వారికి జీవాన్ని ఇవ్వగలదు. (సామెతలు 4:​13) తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణనిచ్చే విషయంలో ఏమేమి ఇమిడివుందో తెలుసుకోవడం ఎంత ఆవశ్యకం!

శిక్ష​—⁠ఏమిటి దానర్థం?

4. బైబిలులో ఉపయోగించిన ప్రకారం “శిక్ష” అనే పదానికి ఏప్రాథమిక అర్థం ఉంది?

4 తమ పిల్లలపై ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని కొడుతున్నారని, తిడుతున్నారని, లేదా భావోద్రేక ఒత్తిడికి గురిచేస్తున్నారని నిందిస్తారన్న భయంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరిదిద్దకుండా ఉండిపోతారు. మనం అలాంటి భయాల్ని పెట్టుకోవల్సిన అవసరం లేదు. “శిక్ష” అన్న పదం బైబిలులోని వాడుక ప్రకారం ఎలాంటి దర్వ్యవహారమునూ లేదా క్రూరత్వమునూ సూచించడం లేదు. “శిక్ష” కోసమైన గ్రీకు పదం ప్రాథమికంగా ఉపదేశించడం, నేర్పించడం, సరిదిద్దడం, కొన్నిసార్లు దృఢంగా అదే సమయంలో ప్రేమపూర్వకంగా మందలించడానికి కూడా సంబంధించిన పదం.

5. యెహోవా తన ప్రజలతో వ్యవహరించే పద్ధతిని పరిశీలించడం ఎందుకు ప్రయోజనకరం?

5 అలాంటి శిక్షను ఇవ్వడంలో యెహోవా దేవుడు ఒక పరిపూర్ణ మాదిరిని ఉంచుతున్నాడు. యెహోవాను ఒక మానవ తండ్రికి పోలుస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ... శరీర సంబంధులైన తండ్రులు ... కొన్ని దినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన [“యెహోవా,” NW] శిక్షించుచున్నాడు.” (హెబ్రీయులు 12:​7-10) అవును, యెహోవా ఇచ్చే శిక్ష వారు పరిశుద్ధులు, లేదా స్వచ్ఛమైనవారు కావాలన్న ఉద్దేశంతోనే. యెహోవా తన ప్రజలకు ఎలా శిక్షణనిచ్చాడో పరిశీలించడం ద్వారా మనం మన పిల్లలకు శిక్షనివ్వడం గురించి తప్పకుండా ఎంతో నేర్చుకోవచ్చు.​—⁠ద్వితీయోపదేశకాండము 32:⁠4; మత్తయి 7:​10; ఎఫెసీయులు 5:⁠1.

ప్రేమ​—⁠పురికొల్పే శక్తి

6. యెహోవా ప్రేమను అనుకరించడం తల్లిదండ్రులకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

6 “దేవుడు ప్రేమాస్వరూపి” అని అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు. కాబట్టి, యెహోవా అందించే శిక్షణ ఎల్లప్పుడు ప్రేమ మూలంగానే పురికొల్పబడుతుంది. (1 యోహాను 4:⁠8; సామెతలు 3:​11,12) అంటే దీనర్థం, తమ పిల్లల పట్ల సహజసిద్ధమైన వాత్సల్యం ఉన్న తల్లిదండ్రులకు ఈవిషయంలో యెహోవాను అనుకరించడం సులభంగా ఉంటుందనా? కానక్కరలేదు. దేవుని ప్రేమ సరైన సూత్రాలపై ఆధారపడినది. అలాంటి ప్రేమ “ఎల్లప్పుడూ సహజ ప్రవృత్తితో పొందికగా ఉండదు” అని ఒక గ్రీకు భాషా విద్వాంసుడు చెబుతున్నాడు. దేవుడు గ్రుడ్డి భావావేశాలకు లోనుకాడు. ఆయనెల్లప్పుడు తన ప్రజలకు ఏది అత్యంత మేలును చేకూరుస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు.​—⁠యెషయా 30:​20, NW; 48:⁠17.

7, 8. (ఎ) యెహోవా తన ప్రజలతో వ్యవహరించేటప్పుడు సరైన సూత్రాలపై ఆధారపడిన ప్రేమ విషయంలో ఎలాంటి మాదిరిని ఉంచాడు? (బి)బైబిలు సూత్రాలను పాటించే సామర్థ్యాన్ని అలవర్చుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేసేటప్పుడు వారెలా యెహోవాను అనుకరించవచ్చు?

7 యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తూ వారిపట్ల ఆయన ప్రదర్శించిన ప్రేమను పరిశీలించండి. అప్పుడప్పుడే ఉద్భవించిన ఇశ్రాయేలు జనాంగం పట్ల యెహోవా కలిగివున్న ప్రేమను వర్ణించడానికి మోషే ఒక రమణీయమైన పోలికను ఉపయోగించాడు. మనమిలా చదువుతాము: “పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా [యాకోబును] నడిపించెను.” (ద్వితీయోపదేశకాండము 32:​9, 11,12) తన పిల్లలకు ఎగరడం నేర్పించడానికి తల్లి గ్రద్ద తన రెక్కలు టపటపలాడిస్తూ, ఎగరమని వాటిని ప్రేరేపిస్తూ ‘తన గూడును రేపుతుంది.’ సాధారణంగా ఎత్తైన కొండ చరియలపై ఉండే గూటిలో నుండి ఒక పిల్ల చివరికి ఒక్క దూకుతో బయటికి ఎగిరిన తర్వాత తల్లి గ్రద్ద దానికి పైగా ‘అల్లాడుతూ’ ఉంటుంది. ఆపిల్ల నేలను కూలే అవకాశం ఉందని గనుక తల్లి పసిగడితే, హఠాత్తుగా దాని క్రిందుగా వెళ్ళి దాన్ని తన “రెక్కల మీద” ఎక్కించుకుని దాన్ని మోస్తుంది. యెహోవా అదే రీతిలో నవజాత ఇశ్రాయేలు జనాంగం పట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధవహించాడు. ఆయన తన ప్రజలకు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. (కీర్తన 78:​5-8) ఆతర్వాత, ఆజనాంగం ఆపదలో పడిన వెంటనే రక్షించేందుకు సిద్ధంగా ఉండి, వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాడు.

8 క్రైస్తవ తల్లిదండ్రులు యెహోవా ప్రేమను ఎలా అనుకరించవచ్చు? మొదటిగా, వారు తమ పిల్లలకు దేవుని వాక్యంలోని సూత్రాలనూ ప్రమాణాలనూ బోధించాలి. (ద్వితీయోపదేశకాండము 6:​4-9) దాని లక్ష్యం ఏమిటంటే పిల్లలు బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకునేలా వారికి నేర్పించడమే. ఇలా చేస్తూ, ప్రేమగల తల్లిదండ్రులు ఒక విధంగా చెప్పాలంటే తమ పిల్లలకు పైగా అల్లాడుతూ ఉంటారు, అలా వారు నేర్చుకున్న సూత్రాలను ఎలా అన్వయించుకుంటున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళవుతుండగా, వారికి క్రమేణా మరింత స్వేచ్ఛను ఇస్తుండగా శ్రద్ధగల తల్లిదండ్రులు ప్రమాదం ఎప్పుడు ఏర్పడినా “హఠాత్తుగా వారి క్రిందుగా” వెళ్ళి వారిని ‘తమ రెక్కల మీద మోస్తారు.’ ఏ విధమైన ప్రమాదం వచ్చినప్పుడు?

9. ప్రేమగల తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఏప్రమాదం విషయంలో అప్రమత్తంగా ఉండాలి? ఉదాహరణ ఇవ్వండి.

9 చెడు సాంగత్యం మూలంగా వచ్చే పరిణామాలను గురించి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ముందే హెచ్చరించాడు. (సంఖ్యాకాండము 25:​1-18; ఎజ్రా 10:​10-14) సరైనవారు కాని ప్రజలతో సాంగత్యం చేయడమనేది కూడా నేడు సాధారణంగా ఏర్పడే ప్రమాదమే. (1 కొరింథీయులు 15:​33) క్రైస్తవ తల్లిదండ్రులు ఈవిషయంలో యెహోవాను అనుకరించాలి. లీసా అనే 15ఏండ్ల అమ్మాయి తన కుటుంబంలో ఉన్నటువంటి నైతిక, ఆధ్యాత్మిక విలువలు లేని ఒక అబ్బాయి మీద మనసుపడింది. “నా వైఖరిలో వచ్చిన మార్పును మాఅమ్మా నాన్నా వెంటనే పసిగట్టేశారు. నన్ను సరిదిద్దాలని కొన్నిసార్లు ప్రయత్నించారు, కొన్నిసార్లు నన్ను సున్నితంగానే మందలించారు” అని లీసా తెలియజేస్తోంది. వారిద్దరు లీసాతోపాటు ప్రశాంతంగా కూర్చుని ఆమె చెప్పేది ఓర్పుగా విన్నారు. తన తోటివారి ఆమోదాన్ని పొందాలన్న కోరిక ఆమె అసలు సమస్య అని చివరికి వారు గ్రహించి, ఆసమస్యతో వ్యవహరించేందుకు ఆమెకు సహాయం చేయనారంభించారు. *

సంభాషణకు అనుకూలమైన పరిస్థితులు ఉండేలా చూసుకోండి

10. ఇశ్రాయేలీయులతో సంభాషించడంలో యెహోవా ఏయే మార్గాల్లో మాదిరిని ఉంచాడు?

10 పిల్లలకు విజయవంతంగా శిక్షణనివ్వాలంటే, తల్లిదండ్రులు తమ పిల్లలు తమతో నిస్సంకోచంగా సంభాషించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేలా కృషిచేయాలి. యెహోవా మన హృదయాల్లో ఏముందో పూర్తిగా ఎరిగినా, తనతో సంభాషించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 దినవృత్తాంతములు 28:⁠9) యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత వారికి ఉపదేశాన్ని అందజేయడానికి గాను ఆయన లేవీయులను నియమించాడు, అంతేకాదు వారితో తర్కించడానికీ వారిని సరిదిద్దడానికీ తన ప్రవక్తలను పంపించాడు. అదే విధంగా ఆయన వారి ప్రార్థనలు వినడానికి ఇష్టతను చూపించాడు.​—⁠2 దినవృత్తాంతములు 17:​7-9; కీర్తన 65:⁠2; యెషయా 1:​1-3,18-20; యిర్మీయా 25:⁠4; గలతీయులు 3:22-24.

11. (ఎ) తల్లిదండ్రులు తమకు తమ పిల్లలకు మధ్య మంచి సంభాషణ జరుగుతుండేలా చేయడానికి వారు ఏమి చేయగలరు? (బి)తమ పిల్లలతో సంభాషించేటప్పుడు తల్లిదండ్రులు చక్కగా వినేవారిగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

11 తల్లిదండ్రులు తమ పిల్లలతో సంభాషించేటప్పుడు యెహోవాను వారు ఎలా అనుకరించగలరు? మొట్టమొదటిగా, వారు పిల్లలతో గడపడానికి సమయాన్ని వెచ్చించాలి. తల్లిదండ్రులు, “ఓస్‌, అంతేనా? నేనింకా ఏదో చాలా పెద్ద విషయమేమో అనుకున్నాను కదరా!” “ఏమిట్రా మరీ అంత తెలివితక్కువ పని!” “అంతకన్నా గొప్పగా ఏం జరగాలి గనుక? నీవేమైనా పెద్ద మొనగాడివనుకున్నావా?” లాంటి ఎగతాళిచేసే ఆలోచనా రహిత వ్యాఖ్యానాలు చేయకూడదు. (సామెతలు 12:​18) పిల్లలు మనసు విప్పి మాట్లాడాలని వారిని ప్రోత్సహించడానికిగాను జ్ఞానవంతులైన తల్లిదండ్రులు మంచి శ్రోతలుగా ఉండడానికి కృషిచేస్తారు. పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిని అలక్ష్యం చేస్తే వారు పెద్దవారయ్యాక తమ తల్లిదండ్రులను అలక్ష్యం చేసే అవకాశం ఉంది. యెహోవా తన ప్రజలు చెప్పేది వినడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాడు. తనతట్టు తిరిగి నమ్రతగా ప్రార్థించేవారి ప్రార్థనలు వినడానికి ఆయన చెవియొగ్గి ఉంటాడు.​—⁠కీర్తన 91:​15; యిర్మీయా 29:​12; లూకా 11:9-13.

12. తల్లిదండ్రులు ఎలాంటి లక్షణాలను కలిగివుంటే వారిని సమీపించడం పిల్లలకు సులభంగా ఉంటుంది?

12 దేవుని వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలు ఆయన ప్రజలు ఆయన్ను నిస్సంకోచంగా సమీపించే వ్యక్తిగా ఎలా చేశాయో పరిశీలించండి. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు బత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుని ఘోరంగా పాపం చేశాడు. అపరిపూర్ణ మానవుడిగా దావీదు తన జీవితంలో వేరే పాపాలెన్నో చేశాడు. అయితే, క్షమాపణను గద్దింపును కోరుతూ ఆయన యెహోవాను ప్రార్థనలో సమీపించని సందర్భం ఒక్కటి కూడా లేదు. దేవుని కృపా దయల మూలంగా దావీదు ఆయనవైపు మరలడం చాలా సులభమని భావించివుంటాడనడంలో సందేహం లేదు. (కీర్తన 103:⁠8) తల్లిదండ్రులు కనికరం, కరుణ వంటి దైవిక లక్షణాలను ప్రదర్శించడం ద్వారా, తమ పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా సంభాషణకు అనుకూలమైన పరిస్థితులు ఉండేలా దోహదపడగలరు.​—⁠కీర్తన 103:​13; మలాకీ 3:⁠17.

సహేతుకంగా ఉండండి

13. సహేతుకంగా ఉండడంలో ఏమి ఇమిడివుంది?

13 తమ పిల్లలు చెప్పేది ఆలకిస్తున్నప్పుడు తల్లిదండ్రులు సహేతుకంగా ఉండాలి, అలా “పైనుండి వచ్చు జ్ఞానము”ను ప్రతిబింబించాలి. (యాకోబు 3:​17) “మీ సహనమును [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:⁠5) సహేతుకంగా ఉండడం అంటే ఏమిటి? “సహేతుకత” అని అనువదించబడిన గ్రీకు పదానికి, “నియమాన్ని ఉన్నదున్నట్లు ఖచ్చితంగా పాటించాలని పట్టుబట్టకపోవడం” అనేది ఒక నిర్వచనం. ఒక ప్రక్క స్థిరమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలను ఉన్నతపరుస్తూనే తల్లిదండ్రులు ఎలా సహేతుకంగా ఉండగలరు?

14. లోతుతో వ్యవహరించేటప్పుడు యెహోవా ఎలా సహేతుకతను ప్రదర్శించాడు?

14 సహేతుకంగా ఉండడంలో యెహోవా అత్యున్నతమైన మాదిరిని ఉంచుతున్నాడు. (కీర్తన 10:​17) నాశనం కాబోతున్న సొదొమ పట్టణాన్ని విడిచి వెళ్ళమని ఆయన లోతును ఆయన కుటుంబాన్ని ప్రేరేపించినప్పుడు లోతు “తడవు చేసెను.” తర్వాత, యెహోవా దూత పర్వతప్రాంతానికి పారిపొమ్మని చెప్పినప్పుడు లోతు ఇలా అన్నాడు: “నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ... ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు [సోయరు] సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా.” దీనికి యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? ఆయనిలా అన్నాడు: “ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని.” (ఆదికాండము 19:​16-21,30) యెహోవా లోతు విన్నపాన్ని మన్నించడానికి సిద్ధపడ్డాడు. నిజమే, యెహోవా తన వాక్యమైన బైబిలులో స్థాపించిన ప్రమాణాలకు తల్లిదండ్రులు అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. అయినా, బైబిలు ప్రమాణాలు ఉల్లంఘించబడని సందర్భాల్లో చిన్నవాళ్ళ కోరికలను తీర్చడం సాధ్యం అవుతుండవచ్చు.

15, 16. యెషయా 28:​24,25 లోని దృష్టాంతం నుంచి తల్లిదండ్రులు ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు?

15 సహేతుకంగా ఉండడంలో సలహాను వెంటనే స్వీకరించేందుకు పిల్లల హృదయాలను సిద్ధం చేయడం కూడా ఇమిడివుంది. ఒక దృష్టాంతాన్ని ఉపయోగిస్తూ యెషయా యెహోవాను ఒక వ్యవసాయదారునితో పోల్చి ఇలా అన్నాడు: “దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా? అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?”​—⁠యెషయా 28:​24,25.

16 యెహోవా ‘విత్తడానికి గాను పొలాన్ని దున్నుతాడు,’ ‘దుక్కి, పెల్లలు బద్దలుగొడతాడు.’ అలాగే ఆయన తన ప్రజలను శిక్షించడానికి ముందు వారిని సిద్ధం చేస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను సరిదిద్దడంలో భాగంగా, వారి హృదయాలను ఎలా ‘దున్నగలరు’? ఒక తండ్రి తన నాలుగేళ్ళ పిల్లవాడిని సరిదిద్దుతున్నప్పుడు యెహోవాను అనుకరించాడు. ఆపిల్లవాడు తమ పొరుగింటి అబ్బాయిని కొట్టాడు, అందుకు వాడు చెప్పే కారణాలన్నీ ఆతండ్రి ఓర్పుగా విన్నాడు. ఆతర్వాత, తన కుమారుని హృదయాన్ని ‘దున్నడానికి’ గాను ఆతండ్రి వాడికొక కథ చెప్పాడు. ఒక చిన్నారి అబ్బాయిని వయసులో పెద్దవాడైన ఒకడు చాలా ఏడిపిస్తున్నాడు. ఈరౌడీ కుర్రవాడు పెట్టే బాధలు భరించడం చాలా కష్టంగా ఉంది ఆచిన్నారికి. ఈకథ సాంతం విన్న తర్వాత కొడుకు, ఆరౌడీ అబ్బాయిని శిక్షించాల్సిందేనని చెప్పేలా కదిలించబడ్డాడు. తండ్రి ఈవిధంగా ‘దున్నడం,’ ఆపిల్లవాడి హృదయాన్ని సిద్ధంచేసి, తాను పొరుగింటి అబ్బాయిని కొట్టడమే ఆరౌడీ కుర్రాడి ప్రవర్తననీ, అది చాలా తప్పనీ వాడు గ్రహించడం సులభమయ్యేలా చేసింది.​—⁠2 సమూయేలు 12:1-14.

17. తల్లిదండ్రులు ఉపయోగించే దిద్దుబాటు చర్యల విషయంలో యెషయా 28:26-29 లో ఎలాంటి పాఠం ఉంది?

17 యెషయా ఇంకా ముందుకి వెళ్తూ, యెహోవా అందించే దిద్దుబాటుని వ్యవసాయదారుని మరో పనితో పోల్చాడు​—⁠నూర్పిడి. వ్యవసాయదారుడు గింజలపైనున్న పొట్టు గట్టిదనానికి తగ్గట్లు వాటి నూర్పిడికి వేర్వేరు ఉపకరణాలను ఉపయోగిస్తాడు. మృదువుగా ఉండే నల్ల జీలకఱ్ఱకు కర్రను, జీలకఱ్ఱకు చువ్వను ఉపయోగిస్తాడు, కానీ ఇంకా గట్టి పొట్టు ఉన్న గింజల నూర్పిడికి ఆయన నూర్పిడి మ్రానును లేదా బండి చక్రాన్ని ఉపయోగిస్తాడు. అయితే, గట్టి గింజల్ని ఆయన పిండిచేసేంతగా తొక్కించడు. అదే విధంగా, యెహోవా తన ప్రజల్లో అవాంఛనీయమైన దేన్నైనా తొలగించాలనుకుంటే ఆయా సందర్భాల్లోని అవసరం కొద్దీ పరిస్థితి కొద్దీ తను వ్యవహరించే విధానాన్ని మారుస్తాడు. ఆయనెన్నడూ నిరంకుశంగా ప్రవర్తించడు, లేదా కర్కశంగా అణగద్రొక్కడు. (యెషయా 28:​26-29) కొందరు పిల్లలు తల్లిదండ్రులు ఒక్క చూపు విసిరితే చాలు అర్థం చేసుకుంటారు, ఇంకేం అవసరం లేదు. కొందరికి మళ్ళీ మళ్ళీ జ్ఞాపికలు ఇవ్వాల్సివుంటుంది, మరి కొందరిని ఒప్పించడానికి కాస్త గట్టి ప్రయత్నం చేయాల్సివుండవచ్చు. సహేతుకతగల తల్లిదండ్రులు పిల్లవాడి అవసరాలకు తగ్గట్లుగా దిద్దుబాటు చర్యలను ఉపయోగిస్తారు.

కుటుంబ చర్చలను ఆనందించదగ్గవిగా చేయండి

18. తల్లిదండ్రులు క్రమమైన కుటుంబ అధ్యయనం కోసం సమయాన్ని ఎలా కేటాయించగలరు?

18 మీ పిల్లలకు ఉపదేశించడానికి అత్యుత్తమ మార్గం క్రమమైన కుటుంబ బైబిలు అధ్యయనం, అలాగే ప్రతిరోజు చేసే లేఖనాధార చర్చలే. కుటుంబ అధ్యయనం క్రమంగా చేసినప్పుడే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జరిగినప్పుడు జరుగుతుందిలే అని వదిలేస్తే, లేదా అప్పటికప్పుడు ఏర్పాటు చేసేదిగా ఉంటే అది కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి తల్లిదండ్రులు అధ్యయనం కోసం ‘సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి.’ (ఎఫెసీయులు 5:​15-17) అందరికీ అనుకూలంగా ఉండే నిర్దిష్టమైన సమయాన్ని ఎంపిక చేసుకోవడం పెద్ద సవాలే కాగలదు. పిల్లలు ఎదుగుతుండగా వారి పని వేళలు మారుతూ ఉండడం వలన కుటుంబాన్నంతటినీ ఒక్కచోట సమకూడేలా చేయడం కష్టమవుతున్నట్లు ఒక కుటుంబ శిరస్సు గ్రహించాడు. అయితే సంఘ కూటాలు జరిగే సాయంకాలాలన్నింట్లోను ఆకుటుంబ సభ్యులు ఒక్కచోట ఉంటున్నారు. అందుకని ఆతండ్రి ఆసాయంకాలాల్లో ఒక సాయంకాలం కుటుంబ అధ్యయనాన్ని ఏర్పాటు చేశాడు. ఇది పనిచేసింది. ఆయన పిల్లలు ముగ్గురూ బాప్తిస్మం తీసుకుని ఇప్పుడు యెహోవా సేవకులుగా ఉన్నారు.

19. కుటుంబ అధ్యయనాన్ని నిర్వహించేటప్పుడు తల్లిదండ్రులు యెహోవాను ఎలా అనుకరించగలరు?

19 అయితే, అధ్యయనంలో ఏదో ఒక లేఖనాధార ప్రచురణను తిరగేయడం మాత్రమే సరిపోదు. పునఃస్థాపిత ఇశ్రాయేలీయులకు యెహోవా యాజకుల ద్వారా బోధించాడు, వారు దేవుని గ్రంథాన్ని “స్పష్టముగా చదివి వినిపించి” వారు బాగా “గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.” (నెహెమ్యా 8:⁠8) తన ఏడుగురు పిల్లలూ యెహోవాను ప్రేమించడానికి సహాయం చేసిన ఒక తండ్రి కుటుంబ అధ్యయనానికి ముందు తన గదిలోకి వెళ్ళి, అధ్యయన సమాచారాన్ని సిద్ధపడేవాడు, దాన్ని తన ప్రతి బిడ్డ అవసరాలకూ తగినట్లు మలచడానికీ ప్రయత్నించేవాడు. తన పిల్లలందరూ ఆనందించేలా ఆయన అధ్యయనాన్ని చేసేవాడు. “ప్రతి అధ్యయనం భలే ఆనందించదగ్గదిగా ఉండేది” అని ఆయన ఎదిగిన కుమారుల్లో ఒకాయన అంటున్నాడు. “మేము పెరట్లో బంతాట ఆడుకుంటున్నట్లైతే, కుటుంబ అధ్యయనానికి రమ్మన్న పిలుపు వినబడగానే వెంటనే బంతిని ఇంట్లో పడేసి అధ్యయనం కోసం పరుగెత్తి వెళ్ళేవాళ్ళం. వారమంతటిలో మేము అత్యధికంగా ఆనందించే సాయంకాలాల్లో అదొకటి.”

20. పిల్లల్ని పెంచడంలో ఎదురుకాగల ఏ సమస్యని ఇంకా చర్చించాల్సివుంది?

20 కీర్తనకర్త ఇలా ప్రకటించాడు: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” (కీర్తన 127:⁠3) మన పిల్లలకు శిక్షణనివ్వడానికి సమయము, గట్టి కృషి అవసరమవుతాయి, కానీ సరైన విధానంలో దాన్ని చేస్తే మన చిన్నారులు నిత్య జీవాన్ని పొందగలరు. అదెంత చక్కని బహుమానమో కదా! అందుకని, మన పిల్లలకు శిక్షణనిచ్చేటప్పుడు మనం యెహోవాను పూర్ణ హృదయంతో అనుకరిద్దాము. అయితే తల్లిదండ్రులకు తమ పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాల్సిన బాధ్యత ఉన్నా, వారు విజయాన్ని సాధిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. (ఎఫెసీయులు 6:⁠4) ఎంతటి అత్యుత్తమమైన శ్రద్ధను కనబరచినా ఒక పిల్లవాడు తిరుగుబాటు చేసేవాడిగా తయారుకావచ్చు, యెహోవాను సేవించడం మానేయవచ్చు. అప్పుడెలా? తర్వాతి ఆర్టికల్‌లోని విషయం అదే.

[అధస్సూచి]

^ పేరా 9 ఈ ఆర్టికల్‌లోను, తర్వాతి ఆర్టికల్‌లోను ఉన్న అనుభవాలు బహుశ మీసంస్కృతికి పూర్తిగా వేరైన సంస్కృతిగల దేశాల నుండి వచ్చినవి కావచ్చు. వాటిలో ఇమిడివున్న సూత్రాలను గ్రహించడానికి ప్రయత్నించి మీసంస్కృతికి వాటినెలా వర్తింపజేసుకోవచ్చో ఆలోచించండి.

మీ జవాబేమిటి?

ద్వితీయోపదేశకాండము 32:​11,12 వచనాల్లో వర్ణించబడిన యెహోవా ప్రేమను తల్లిదండ్రులు ఎలా అనుకరించగలరు?

• యెహోవా ఇశ్రాయేలీయులతో సంభాషించిన విధానం నుండి మీరేమి నేర్చుకున్నారు?

• లోతు విన్నపాన్ని యెహోవా మన్నించడం మనకు ఏమి బోధిస్తుంది?

యెషయా 28:24-29 నుండి పిల్లలను సరిదిద్దే విషయంలో మీరే పాఠాన్ని నేర్చుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[8, 9వ పేజీలోని చిత్రం]

యెహోవా తన ప్రజలకు ఇచ్చే శిక్షణను, గ్రద్ద తన పిల్లలను పెంచే విధానంతో మోషే పోల్చాడు

[10వ పేజీలోని చిత్రాలు]

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమయాన్ని తీసుకోవాలి

[12వ పేజీలోని చిత్రం]

“వారమంతటిలో మేము అత్యధికంగా ఆనందించే సాయంకాలాల్లో అదొకటి”