కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యథార్థత కలిగివుండడం అంటే ఏమిటి?

యథార్థత కలిగివుండడం అంటే ఏమిటి?

యథార్థత కలిగివుండడం అంటే ఏమిటి?

సా.శ.పూ. రెండవ శతాబ్దానికి చెందిన యూదులైన హాసిదీములు తాము నిజమైన యథార్థత గలవారమని భావించారు. వారి పేరు “యథార్థత” అనే మాటకు హీబ్రూ మూలపదమైన హాసీద్‌ నుండి వచ్చింది. అది హేసెద్‌ అనే నామవాచకం నుండి ఉత్పన్నమైంది, అది తరచూ “కృప,” “అనుగ్రహము,” “దయ,” “మంచితనం,” “కనికరము” అని అనువదించబడుతుంది. థియొలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌ ప్రకారం, హేసెద్‌ “చురుకైనది, సంఘజీవనానికి సంబంధించినది, సహనం గలది, కేవలం మానవ దృక్పథాన్ని సూచించడమే కాదు గానీ ఈదృక్పథం నుండి ఉత్పన్నమయ్యే చర్యలను కూడా సూచిస్తుంది. అది జీవాన్ని కాపాడే లేక పెంపొందింపజేసే చర్య. అది, కష్టాన్ని లేక బాధను అనుభవిస్తున్న ఒకరి పక్షాన జోక్యం చేసుకోవడం. అది స్నేహం యొక్క కార్యరూపమే.”

ఈ హీబ్రూ పదం బైబిలులో ఉపయోగించబడినట్లుగా దానితో సంబంధం ఉన్న పూర్తి భావాన్ని, అనేక భాషల్లో ఏఒక్క పదమూ వ్యక్తం చేయలేదని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికీ, బైబిలు భావంలో యథార్థత అంటే ఒప్పందాలకు నమ్మకంగా కట్టుబడి ఉండడం కంటే ఎక్కువే. దానిలో, ప్రేమపూర్వకంగా హత్తుకొని ఉండడమనే తలంపుతోపాటు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి నిర్దిష్టమైన చర్య తీసుకోవడం కూడా ఇమిడి ఉంది. నిజమైన యథార్థత అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, యెహోవా దాన్ని అబ్రాహాము, మోషే, దావీదుల పట్ల, ఇశ్రాయేలు జనాంగము పట్ల, సాధారణ మానవజాతి పట్ల ఎలా చూపించాడో పరిశీలించండి.

యెహోవా యథార్థతను చూపించాడు

యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముతో, “నేను నీకు కేడెము” అని చెప్పాడు. (ఆదికాండము 15:1; యెషయా 41:⁠8) ఇవి వట్టి మాటలు కాదు. యెహోవా అబ్రాహామును ఆయన కుటుంబాన్ని ఫరో నుండి, అబీమెలెకు నుండి కాపాడాడు, విడుదల చేశాడు. నలుగురు రాజుల కూటమి నుండి లోతును రక్షించడానికి ఆయన అబ్రాహాముకు సహాయం చేశాడు. యెహోవా వంద సంవత్సరాల అబ్రాహాము యొక్క, తొంభై సంవత్సరాల శారా యొక్క సంతానోత్పత్తి శక్తిని పునరుజ్జీవింపజేసి, వాగ్దత్త సంతానం వారి నుండి కలిగేలా చేశాడు. యెహోవా దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా, సందేశకులైన దేవదూతల ద్వారా అబ్రాహాముతో తరచుగా సంభాషించాడు. వాస్తవానికి, యెహోవా అబ్రాహాము జీవించివున్నప్పుడు, అలాగే ఆయన మరణించిన చాలాకాలం తర్వాత కూడా ఆయన పట్ల తన యథార్థతను చూపించాడు. శతాబ్దాలు గడుస్తుండగా, అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగం దారితప్పి నడచినప్పటికీ యెహోవా తాను వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చాడు. అబ్రాహాముతో యెహోవాకున్న సంబంధం, నిజమైన యథార్థతకు అంటే కార్యరూపం దాల్చిన ప్రేమకు నిదర్శనం.​—⁠ఆదికాండము, 12 నుండి 25 అధ్యాయాలు.

“మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను” అని చెప్పబడుతుంది. (ఇటాలిక్కులు మావి.) (నిర్గమకాండము 33:​11) అవును, మోషేకు యెహోవాతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉండేది, అలాంటి సంబంధాన్ని యేసుక్రీస్తుకు ముందు మరే ప్రవక్తా కలిగివుండలేదు. యెహోవా మోషే పట్ల తన యథార్థతను ఎలా చూపించాడు?

శక్తిసామర్థ్యాలుగల 40 ఏళ్ల పురుషునిగా మోషే తన ప్రజలను విడుదల చేసే బాధ్యతను దురహంకారంతో తనకు తానుగా తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నాడు. కానీ దానికి ఇంకా సమయం రాలేదు. ఆయన తన ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోవలసి వచ్చింది. నలభై ఏళ్లపాటు మిద్యానులో గొఱ్ఱెలు కాశాడు. (అపొస్తలుల కార్యములు 7:​23-30) అయితే, యెహోవా ఆయనను విడనాడలేదు. తగిన సమయం వచ్చినప్పుడు, ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించడానికి మోషే వెనక్కి రప్పించబడ్డాడు.

అలాగే, యెహోవా ఇశ్రాయేలీయుల పేరొందిన రెండవ రాజైన దావీదు పట్ల యథార్థతను చూపించాడు. దావీదు ఇంకా బాలునిగా ఉన్నప్పుడే, “నీవు లేచి వానిని అభిషేకించుమని” యెహోవా సమూయేలు ప్రవక్తకు చెప్పాడు. అప్పటి నుండి, దావీదు ఇశ్రాయేలంతటికీ భవిష్యద్‌ రాజుగా పరిణతి చెందుతుండగా యెహోవా యథార్థతతో ఆయనను కాపాడి, ఆయనకు నడిపింపునిచ్చాడు. యెహోవా ఆయనను “సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు,” ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు చేతి నుండియు రక్షించాడు. ఇశ్రాయేలీయుల శత్రువులపై యెహోవా ఆయనకు అనేక విజయాలను అనుగ్రహించాడు, అసూయాపరుడూ విద్వేషపూరితుడూ అయిన సౌలు విసిరిన ఈటె నుండి యెహోవా దావీదును కాపాడాడు.​—⁠1 సమూయేలు 16:​12; 17:​37; 18:​11; 19:⁠10.

నిజమే దావీదు పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. వాస్తవానికి ఆయన ఘోరమైన పాపాలు చేశాడు. అయితే, దావీదు తీవ్రంగా పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా తన యథార్థమైన ప్రేమను చూపించాడే గానీ ఆయనను విడనాడలేదు. దావీదు జీవిత కాలమంతటిలోనూ, జీవాన్ని కాపాడేందుకు, పెంపొందింపజేసేందుకు యెహోవా పదే పదే చర్య తీసుకున్నాడు. బాధను అనుభవిస్తున్నవారి పక్షాన ఆయన జోక్యం చేసుకున్నాడు. అది నిజంగా కృపే!​—⁠2 సమూయేలు 11:1-12:​25; 24:​1-17.

సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు జనాంగం మోషే ధర్మశాస్త్ర నిబంధన కట్టడలకు అంగీకరించినప్పుడు యెహోవాతో ఒక ప్రత్యేకమైన సమర్పిత సంబంధంలోకి ప్రవేశించింది. (నిర్గమకాండము 19:​3-8) అందుకే, ఇశ్రాయేలు యెహోవాతో వివాహ సంబంధాన్ని కలిగివున్నట్లు చిత్రించబడింది. ఇశ్రాయేలుకు ఇలా చెప్పబడింది: ‘భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.’ యెహోవా ఆమెతో ఇలా అన్నాడు: “నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును.” (యెషయా 54:​6-9) ఈప్రత్యేకమైన సంబంధంలో యెహోవా యథార్థతను ఎలా చూపించాడు?

ఇశ్రాయేలీయుల అవసరాలను తీర్చడానికి, తనతో వారి సంబంధాలను పటిష్ఠం చేయడానికి యెహోవానే చొరవ తీసుకున్నాడు. ఆయన వారిని ఐగుప్తు నుండి విడుదల చేశాడు, వారిని ఒక జనాంగముగా సంస్థీకరించాడు, వారిని “పాలు తేనెలు ప్రవహించు దేశము”లోకి తీసుకువచ్చాడు. (నిర్గమకాండము 3:⁠8) ఆయన యాజకులు లేవీయుల ద్వారా, ప్రవక్తలను సందేశకులను వరుసగా పంపించడం ద్వారా క్రమంగా ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 17:7-9; నెహెమ్యా 8:7-9; యిర్మీయా 7:​25) జనాంగం ఇతర దేవుళ్ళను సేవించడం ప్రారంభించినప్పుడు, యెహోవా వారిని సరిదిద్దాడు. వారు పశ్చాత్తాపపడినప్పుడు ఆయన వారిని క్షమించాడు. ఇశ్రాయేలు జనాంగం చాలా కష్టతరమైన “భార్య” అని ఒప్పుకోవలసిందే. అయినా యెహోవా ఆమెను వెంటనే విడనాడలేదు. ఆయన అబ్రాహాముకు చేసిన వాగ్దానాల మూలంగా, ఇశ్రాయేలీయులకు సంబంధించి తన సంకల్పాలు నెరవేరే వరకూ ఆయన యథార్థంగా వారికి కట్టుబడి ఉన్నాడు. (ద్వితీయోపదేశకాండము 7:​7-9) నేటి వివాహిత దంపతులకు ఎంత చక్కని మాదిరి!

యెహోవా నీతిమంతులకు, అనీతిమంతులకు అందరికీ జీవితంలోని ప్రాథమికావసరాలను తీర్చడం ద్వారా సాధారణ మానవజాతి పట్ల కూడా యథార్థతను చూపిస్తాడు. (మత్తయి 5:45; అపొస్తలుల కార్యములు 17:​25) అన్నిటికంటే ఎక్కువగా, పరదైసులో పరిపూర్ణమైన నిత్యజీవాన్ని పొందే మహిమకరమైన ఉత్తరాపేక్షలను ఆనందించేందుకు పాపమరణాల సంకెళ్ళనుండి విడిపించబడగలిగే అవకాశం మానవజాతి అంతటికీ లభించేలా ఆయన తన కుమారుడ్ని విమోచన క్రయధన బలిగా అర్పించాడు. (మత్తయి 20:28; యోహాను 3:​16) విమోచన క్రయధన ఏర్పాటు జీవాన్ని కాపాడే, పెంపొందింపజేసే అత్యుత్తమ చర్య. అది నిజంగా, “కష్టాన్ని లేక బాధను అనుభవిస్తున్న ఒకరి పక్షాన జోక్యం చేసుకోవడం.”

అనుకూలమైన చర్యలతో మీయథార్థతను నిరూపించుకోండి

కృప యథార్థతకు ప్రత్యామ్నాయ పదం గనుక అది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే బలమైన భావాన్ని కూడా కలిగి ఉంది. ఎవరైనా మీపట్ల కృప చూపిస్తే, మీరు కూడా వారికి కృప చూపిస్తారని అపేక్షించబడుతుంది. యథార్థతకు యథార్థతే ప్రతిఫలం. ఖేసెద్‌తో సంబంధం ఉన్న భావాలను దావీదు అర్థం చేసుకున్నాడన్న విషయం, ఆయన పలికిన ఈమాటల్లో స్పష్టమవుతుంది: “నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను ... నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను.” ఎందుకు? “నీ కృపాసత్యములనుబట్టి.” (కీర్తన 138:⁠2) యెహోవా కృపను పొందినవానిగా దావీదు ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి కదిలించబడ్డాడని స్పష్టమవుతుంది. కాబట్టి, యెహోవా మన పట్ల చూపించిన కృపను గురించి ధ్యానిస్తుండగా, దానికి తగినవిధంగా ప్రతిస్పందించడానికి మనం ప్రేరేపించబడుతున్నామా? ఉదాహరణకు, యెహోవా నామంపై అపనింద వేయబడితే, ఆయన పేరు ప్రతిష్ఠల పట్ల మీకుగల శ్రద్ధ, ఆయనను సమర్థిస్తూ మాట్లాడడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందా?

ఈమధ్యనే సత్యం తెలుసుకున్న ఒక క్రైస్తవుడూ, ఆయన భార్యా అలాగే ప్రేరేపించబడ్డారు. వారు మోటర్‌సైకిల్‌ యాక్సిడెంట్‌లో మరణించిన తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. అది మతపరమైన కార్యక్రమం కాదు, అక్కడ హాజరై ఉన్నవారందరికీ మరణించిన వ్యక్తి గురించి ఏదైనా చెప్పడానికి అవకాశం ఇవ్వబడింది. ‘దేవుడు అతడిని పరలోకంలో కావాలనుకున్నాడు అందుకే అతడిని తీసుకువెళ్ళాడు’ అని చెబుతూ ఒక వ్యక్తి ఆయౌవనుని అకాల మరణానికి దేవుడ్ని నిందించడం మొదలుపెట్టాడు. మన క్రైస్తవ సహోదరునికి నోరు మెదపకుండా ఉండడం అసాధ్యమనిపించింది. ఆయన తన దగ్గర బైబిలుగానీ, నోట్స్‌గానీ లేకపోయినా వేదికపైకి వెళ్ళాడు. “కనికరముగల, వాత్సల్యపూరితుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలాంటి పరిస్థితులను ఆమోదిస్తాడని మీరు అనుకుంటున్నారా?” అని ఆయన అడిగాడు. ఆతర్వాత ఆయన, మనమెందుకు చనిపోతామో, మానవజాతిని మరణం నుండి తప్పించడానికి దేవుడేమి చేశాడో తెలియజేస్తూ, పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందడానికి పునరుత్థానం చేయబడే అద్భుతమైన ఉత్తరాపేక్ష గురించి వివరిస్తూ లేఖనాలను ఎత్తి చెబుతూ అప్పటికప్పుడు పది నిమిషాల ప్రసంగాన్నిచ్చాడు. అక్కడ సమకూడి ఉన్న 100 కన్నా ఎక్కువమంది చాలాసేపు చప్పట్లు కొట్టారు. తర్వాత ఆసహోదరుడిలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఇంతకు ముందెప్పుడూ కలుగని అంతర్గత ఆనందం నాకు కలిగింది. తన జ్ఞానాన్ని నాకు బోధించినందుకు, ఆయన పరిశుద్ధ నామాన్ని సమర్థిస్తూ మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను.”

యెహోవా పట్ల యథార్థంగా ఉండడంలో, ఆయన వాక్యమైన బైబిలు పట్ల యథార్థంగా ఉండడం కూడా ఇమిడి ఉంది. ఎందుకు? ఎందుకంటే, బైబిలు పుటల ద్వారానే యెహోవా మనకు ఎలా జీవించాలో బోధిస్తాడు. అందులో వ్రాయబడివున్న నియమాలు, సూత్రాలు వాస్తవానికి శ్రేష్ఠమైన, అత్యంత ప్రయోజనకరమైన జీవిత సూక్తులు. (యెషయా 48:​17) ఇతరుల నుండి వచ్చే ఒత్తిడి లేక మీసొంత బలహీనత యెహోవా ఆజ్ఞల నుండి మీరు వైదొలగిపోవడానికి కారణమయ్యేందుకు అనుమతించకండి. దేవుని వాక్యం పట్ల యథార్థంగా ఉండండి.

దేవుని పట్ల యథార్థంగా ఉండడంలో ఆయన సంస్థపట్ల యథార్థంగా ఉండడం కూడా ఇమిడివుంది. గత సంవత్సరాల్లో నిర్దిష్టమైన లేఖనాలను మనం అర్థం చేసుకోవడంలో సవరింపులు, సర్దుబాట్లు ఆవశ్యకంగా జరిగాయి. వాస్తవమేమిటంటే, ఆధ్యాత్మికంగా మనం పోషించబడుతున్నంత చక్కగా మరింకెవరూ పోషించబడడం లేదు. (మత్తయి 24:​45-47) నిస్సందేహంగా, యెహోవా తన ఆధునిక-దిన సంస్థకు యథార్థంగా కట్టుబడివున్నాడు. మనం కూడా అలాగే చేయలేమా? ఏ.హెచ్‌. మాక్‌మిలన్‌ అలాగే చేశాడు. తన మరణానికి కొంతకాలం ముందు, ఆయనిలా అన్నాడు: “నేను 1900 సెప్టెంబరులో, 23 ఏళ్ళ వయస్సులో దేవునికి నన్ను నేను సమర్పించుకున్నప్పుడు, చిన్నగా ఉన్న యెహోవా సంస్థ, ఆయన సత్యాలను అత్యాసక్తితో ప్రకటిస్తున్న సంతోషభరితులైన ప్రజల ప్రపంచవ్యాప్త సంస్థగా మారడాన్ని చూశాను. ... ఈభూమిపై నేను దేవునికి చేసే సేవ ముగింపుకు వస్తుండగా, యెహోవా తన ప్రజలకు నడిపింపునిచ్చాడనీ, సరైన సమయంలో సరిగ్గా వారికి కావలసినదాన్ని ఆయన అనుగ్రహించాడనీ నేను మునుపెన్నటికన్నా ఎక్కువగా ఒప్పించబడ్డాను.” సహోదరుడు మాక్‌మిలన్‌ 1966 ఆగస్టు 26న మరణించే వరకూ దాదాపు 66 సంవత్సరాలపాటు నమ్మకంగా యథార్థతతో సేవ చేశాడు. దేవుని దృశ్య సంస్థపట్ల యథార్థంగా ఉండడంలో ఆయన చక్కని మాదిరిని ఉంచాడు.

సంస్థ పట్ల యథార్థంగా ఉండడమే గాక, మనం ఒకరి పట్ల ఒకరం యథార్థంగా ఉంటామా? క్రూరమైన హింస అనే ముప్పు వాటిల్లినప్పుడు, మనం మన సహోదర సహోదరీల పట్ల యథార్థంగా ఉంటామా? రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, నెదర్లాండ్స్‌లోని మన సహోదరులు యథార్థత కలిగివుండడంలో చక్కని మాదిరిని ఉంచారు. గ్రొనింగెన్‌ సంఘానికి చెందిన క్లాస్‌ డెవ్రీస్‌ అనే పెద్దను నాజీ గెస్టపో పోలీసులు క్రూరంగా నిర్దాక్షిణ్యంగా ఇంటరాగేట్‌ చేసి, 12 రోజుల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారు, అప్పుడు కేవలం రొట్టె నీళ్లు మాత్రమే ఆయనకు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆయనను ప్రశ్నలడిగారు. చంపేస్తామని బెదిరిస్తూ రివాల్వర్‌ గురిపెట్టి, బాధ్యతగల సహోదరుల వివరాలను అలాగే ఇతర ప్రాముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయమని ఆయనకు రెండు నిమిషాలు ఇచ్చారు. “నేను మీకు ఏమీ చెప్పను. ... నేను ద్రోహిగా మారను” అన్న మాటలు తప్ప క్లాస్‌ నోటి నుండి మరో మాట రాలేదు. రివాల్వర్‌తో ఆయనను మూడు సార్లు బెదిరించారు. చివరికి గెస్టపో చేతులెత్తేసి, క్లాస్‌ను మరో చెరసాలకు పంపారు. ఆయన తన సహోదరులను ఎన్నడూ అప్పగించలేదు.

మనం మన అత్యంత సన్నిహిత బంధువు అయిన మన జీవిత భాగస్వామి పట్ల యథార్థంగా ఉంటామా? యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో తనకున్న నిబంధన సంబంధాన్ని గౌరవించినట్లుగానే, మనం మన వివాహ ప్రమాణాలపట్ల యథార్థంగా ఉంటున్నామా? మన జీవిత భాగస్వామికి స్థిరంగా కట్టుబడి ఉండడమే గాక, సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడానికి చురుగ్గా కృషి చేయాలి. మీవివాహబంధాన్ని పటిష్ఠం చేసుకునేందుకు చొరవ తీసుకోండి. కలిసి సమయం గడపండి, దాపరికం లేకుండా మనసువిప్పి మాట్లాడుకోండి, ఒకరికొకరు మద్దతునిచ్చుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరు చెప్పేది మరొకరు వినండి, కలిసి నవ్వండి, కలిసి ఏడ్వండి, కలిసి ఆడుకోండి, పరస్పర లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేయండి, ఒకరినొకరు మెప్పించండి, స్నేహితులుగా ఉండండి. ప్రాముఖ్యంగా ఇతరులపట్ల ప్రణయ భావాలు వృద్ధికాకుండా జాగ్రత్త వహించండి. మీజీవిత భాగస్వామితో కాక మరితరులతో పరిచయాలు ఏర్పరచుకోవడం, సన్నిహిత స్నేహబంధాలు ఏర్పరచుకోవడం సరైనదే అయినప్పటికీ, ప్రణయభావాలు మాత్రం మీభాగస్వామికే పరిమితమై ఉండాలి. మీకూ మీజీవిత భాగస్వామికీ మధ్య మరెవరు వచ్చేందుకూ అనుమతించకండి.​—⁠సామెతలు 5:15-20.

విశ్వాసులైన స్నేహితులకు, కుటుంబానికి యథార్థంగా ఉండండి. సంవత్సరాలు గడుస్తుండగా వారిని మరచిపోకండి. వారికి ఉత్తరాలు వ్రాయండి, ఫోన్లు చేయండి, వారిని సందర్శించండి. జీవిత గమనంలో మీరెక్కడున్నా, వారిని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు తమకు తెలుసనీ లేక మీరు తమకు బంధువులనీ చెప్పుకునేందుకు వారు సంతోషించేలా చేయండి. వారి పట్ల యథార్థంగా ఉండడం సరైనది చేయడానికి మిమ్మల్ని బలపరుస్తుంది, మీకు ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంటుంది.​—⁠ఎస్తేరు 4:6-16.

అవును, నిజమైన యథార్థతలో, అమూల్యమైన సంబంధాలను కాపాడుకోవడానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడం ఇమిడి ఉంది. యెహోవా కృపకు కృతజ్ఞతగా మీరు చేయగలిగినది చేయండి. క్రైస్తవ సంఘంతో, మీజీవిత భాగస్వామితో, కుటుంబంతో, స్నేహితులతో మీవ్యవహారాల్లో యెహోవా యథార్థతను అనుకరించండి. యెహోవా సుగుణాలను మీపొరుగువారికి యథార్థతతో ప్రకటించండి. “యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను” అన్నప్పుడు కీర్తనకర్త దాన్ని సరిగ్గా వ్యక్తపరిచాడు. (కీర్తన 89:⁠1) అలాంటి దేవునివైపుకి మనం ఆకర్షించబడమా? నిజంగానే, “ఆయన కృప నిత్యముండును.”​—⁠కీర్తన 100:5.

[23వ పేజీలోని చిత్రం]

ఎ.హెచ్‌. మాక్‌మిలన్‌