కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవలో ఆశ్చర్యాలతో నిండిన జీవితం

యెహోవా సేవలో ఆశ్చర్యాలతో నిండిన జీవితం

జీవిత కథ

యెహోవా సేవలో ఆశ్చర్యాలతో నిండిన జీవితం

ఎరిక్‌ మరియు హేజెల్‌ బెవరిజ్‌ చెప్పినది

“నేను నీకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తున్నాను.” నా చెవుల్లో ఆమాటలు మారుమ్రోగుతుండగా, నన్ను ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉన్న స్ట్రేంజ్‌వేస్‌ జైలుకు తీసుకువెళ్ళారు. అది 1950 డిసెంబరు నెల, నాకప్పుడు 19 ఏళ్ళు. యౌవనస్థునిగా నేనెదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్ష అది, సైనిక సేవలో చేరడానికి నేను నిరాకరించినందుకు వచ్చిన ఫలితమది.​—⁠2 కొరింథీయులు 10:3-5.

నేను యెహోవాసాక్షుల పూర్తికాల పయినీరు పరిచారకుడ్ని, అందుకని నాకు సైనిక సేవ నుండి మినహాయింపు లభించవలసింది, కానీ బ్రిటీషు చట్టం మమ్మల్ని దైవ పరిచారకులుగా అంగీకరించలేదు. దాని ఫలితంగానే నేను జైలుగదిలో ఒంటరిగా ఉన్నాను. నేను మానాన్నగారి గురించి ఆలోచించాను. నేను జైలులో ఉండడానికి పరోక్షంగా ఆయనే కారణం.

జైలు అధికారి అయిన మానాన్నగారు యార్క్‌ వాస్తవ్యుడు, ఆయన చాలా దృఢమైన నమ్మకాలు, నియమాలు గల వ్యక్తి. సైన్యంలోనూ జైళ్ళలో పనిచేసేటప్పుడూ ఆయనకు కలిగిన అనుభవాల మూలంగా క్యాథలిక్‌ మతం పట్ల ఆయనకు విపరీతమైన అనిష్టత ఏర్పడింది. వెనుకటికి 1930ల తొలిభాగంలో సాక్షులను ఆయన మొదటిసారిగా కలిశారు, వాళ్ళు గడప దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను వదిలించుకోవడానికి వెళ్ళి వాళ్ళ పుస్తకాలు కొన్ని చేతబట్టుకుని తిరిగివచ్చారు! తర్వాత ఆయన కన్సోలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికకు చందా కట్టారు. చందాను పొడిగించమని ప్రోత్సహించడానికి సాక్షులు ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వస్తుండేవారు. నాకు దాదాపు 15ఏళ్ళున్నప్పుడు, వాళ్ళు నాన్నగారితో మరోసారి చర్చించారు, నేను సాక్షుల పక్షం వహించాను. నేను బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది అప్పుడే.

నేను 17 ఏళ్ళ వయస్సులో, 1949 మార్చిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు నా సమర్పణను సూచించాను. తర్వాత ఆసంవత్సరంలోనే, నైజీరియాకు వెళుతున్న జాన్‌ మరియు మైకెల్‌ ఛరుక్‌లను కలిశాను, వాళ్ళిద్దరూ ఆమధ్యనే గిలియడ్‌ మిషనరీ పాఠశాల నుండి పట్టభద్రులయ్యారు. వాళ్ళ మిషనరీ స్ఫూర్తిని చూసి నేనెంతో ముగ్ధుడ్నయ్యాను. వాళ్ళకు తెలుసో తెలీదో గాని వాళ్ళు ఆస్ఫూర్తిని నా హృదయంలో నాటారు.

బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, విశ్వవిద్యాలయ చదువులపై ఆసక్తి పోయింది. ఇల్లు విడిచి లండన్‌లోని కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో పని చేయడానికి వెళ్ళిన సంవత్సరంలోపే, నేను ప్రభుత్వోద్యోగం చేస్తూ దేవునికి నా సమర్పణను నెరవేర్చలేనని నాకనిపించింది. నేను నా ఉద్యోగాన్ని వదిలేసినప్పుడు, “మనిషిని జీవచ్ఛవంలా మార్చేసే” ఉద్యోగాన్ని మానేసినందుకు అనుభవజ్ఞుడైన ఒక సహోద్యోగి నన్ను అభినందించాడు.

దీనికి ముందు నాకు మరో పరీక్ష ఎదురైంది, పూర్తికాల పరిచారకుడినయ్యేందుకు ఉద్యోగం మానుకోవాలనుకుంటున్నానని నాన్నగారికెలా చెప్పడం? ఒక సెలవు రోజున సాయంకాలం ఇంట్లో ఉన్నప్పుడు నేనా విషయం చెప్పేశాను. నాన్నగారు ధుమధులాడతారేమో అనుకున్నాను. కానీ ఆశ్చర్యం, ఆయన కేవలం ఇలా అన్నారు: “నీవు తీసుకున్న నిర్ణయానికి పర్యవసానాలను నీవే ఎదుర్కోవాలి. కానీ నువ్వు విఫలమైతే మాత్రం నాదగ్గరికి రావద్దు.” నా డైరీలో, 1950, జనవరి 1వ తేదీ పేజీ ఇలా చెబుతోంది: “నాన్నగారికి పయినీరింగ్‌ గురించి చెప్పాను. ఆయన సహేతుకంగా చూపించిన సహాయకరమైన దృక్పథానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన చూపిన దయకు నేను కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండలేకపోయాను.” నేను ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి, పూర్తికాల పయినీరుగా సేవా నియామకాన్ని స్వీకరించాను.

ఒక “కాటేజ్‌” నియామకం

దేవుని పట్ల నా భక్తిని పరీక్షించే మరో పరీక్ష ఎదురైంది. నాకు పయినీరు నియామకం ఇవ్వబడింది, వేల్స్‌ నుండి వచ్చిన తోటి క్రైస్తవుడైన లాయిడ్‌ గ్రిఫ్ఫిత్స్‌తో పాటు నేను లాంకాషైర్‌లో ఉన్న ఒక “కాటేజ్‌”లో ఉండాలి. నేను ఆకాటేజ్‌పై ఎన్నో ఆశయాలు పెట్టుకుని దాని గురించి కలలుకంటూ బేకప్‌ పట్టణానికి చేరుకున్నాను, అక్కడ ఎప్పుడూ వర్షంకురుస్తూ వాతావరణం మందకొడిగా ఉంటుంది. ఆకాటేజ్‌ నేలమాళిగలో ఉండే గృహమని తెలియడంతో నేను ఒక్కసారిగా కలనుండి మేలుకున్నట్లు అయ్యింది! రాత్రి మాకు తోడుగా ఉండడానికి అక్కడ బోలెడు ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయి. నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనే అనుకున్నాను. కానీ, ఈపరీక్షను ఎదుర్కోవడానికి శక్తినివ్వమని నేను మౌనంగా ప్రార్థన చేసుకున్నాను. హఠాత్తుగా, నాలో ప్రశాంతత నిండిపోయినట్లు అనిపించింది, నేను పరిస్థితిని వాస్తవికంగా చూడనారంభించాను. ఇది నాకు యెహోవా సంస్థ ఇచ్చిన నియామకం. సహాయం కోసం నేను యెహోవాపై విశ్వాసముంచాలి. నేను ఆపరిస్థితిని సహించుకోగలిగినందుకు నేనెంత కృతజ్ఞుడినో, ఎందుకంటే నేను గనుక వెనక్కి వెళ్ళిపోయి ఉంటే నా జీవితం పూర్తిగా మారిపోయి ఉండేది!​—⁠యెషయా 26:3, 4.

సైనిక సేవలో చేరడానికి నిరాకరించినందుకు నేను జైలుకు పంపబడకముందు, ఆర్థికపరంగా దుర్భరమైన స్థితిలో ఉన్న రొజన్‌డేల్‌ లోయలో నేను దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రకటించాను. స్ట్రేంజ్‌వేస్‌ జైలులో రెండు వారాలు ఉన్న తర్వాత, నేను ఇంగ్లాండులోని దక్షిణ తీరంలో ఉన్న లూయీస్‌ జైలుకు పంపబడ్డాను. చివరికి మేము మొత్తం ఐదుగురం సాక్షులం అక్కడున్నాము, జైలు గదిలోనే క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించగలిగాము.

నాన్నగారు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు. పేరుపొందిన జైలు అధికారి జైలుపక్షిగా ఉన్న తన కుమారుడ్ని చూడడానికి రావడమంటే అది ఆయన ఆత్మాభిమానాన్ని పరీక్షించి ఉండవచ్చు! ఆయనలా నన్ను చూడడానికి వచ్చినందుకు నేనెప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. చివరికి 1951 ఏప్రిల్‌లో నేను విడుదల చేయబడ్డాను.

నేను లూయీస్‌ నుండి విడుదలై, ట్రైన్‌లో వేల్స్‌లోని కార్డిఫ్‌కు వెళ్ళాను, అక్కడ నాన్నగారు జైలులో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి ఉన్నారు. నన్ను నేను పోషించుకుంటూ పయినీరు సేవ చేయడానికి ఒక పార్ట్‌ టైమ్‌ జాబ్‌ వెతుక్కోవాలి. నేనొక బట్టల దుకాణంలో పనిచేయడానికి వెళ్ళాను, కానీ జీవితంలో నా ప్రధాన లక్ష్యం మాత్రం క్రైస్తవ పరిచర్యనే. ఈసమయంలో మాఅమ్మ మమ్మల్నందరినీ వదిలి వెళ్ళిపోయింది. నాన్నగారికి అది చాలా పెద్ద విఘాతం, 8 నుండి 19 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలమైన మాకు అది పెద్ద దెబ్బనే. విచారకరంగా, మాతల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

మంచి భార్య దొరికినవానికి ...

సంఘంలో చాలామంది పయినీర్లు ఉండేవారు. వారిలో ఒక సహోదరి స్థానిక బొగ్గుగనుల రోండా లోయ నుండి ఉద్యోగానికీ అలాగే ప్రకటనాపని కోసమూ ప్రతిరోజు వచ్చేది. ఆమె పేరు హేజెల్‌ గ్రీన్‌, విశిష్టమైన పయినీరు. హేజెల్‌కు నాకంటే ముందు నుండే సత్యం తెలుసు, ఆమె తల్లిదండ్రులు 1920ల నుండే (ఇప్పుడు యెహోవాసాక్షులని పిలువబడుతున్న) బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరవుతున్నారు. ఇక ఆమె కథ ఆమే చెబుతుంది వినండి.

“నేను 1944 లో, మతం ప్రళయవాయువును కోస్తుంది (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని చదివే వరకూ బైబిలును గంభీరంగా తీసుకోలేదు. కార్డిఫ్‌లో జరుగుతున్న సర్క్యూట్‌ అసెంబ్లీకి వెళ్ళమని అమ్మ నన్ను ఒప్పించింది. బైబిలు గురించి ఏమాత్రం తెలియకపోయినా నేను బహిరంగ ప్రసంగాన్ని ప్రకటిస్తున్న ప్లాకార్డ్‌ను మెడలో తగిలించుకుని ప్రధాన షాపింగ్‌ సెంటర్‌లో నిలబడ్డాను. మతనాయకులు, ఇతరులు ఎంత వేధించినా ధైర్యంగానే ఉండగలిగాను. నేను 1946 లో బాప్తిస్మం తీసుకుని, అదే సంవత్సరం డిసెంబరులో పయినీరు సేవ ప్రారంభించాను. తర్వాత 1951 లో, అప్పుడే జైలు నుండి విడుదలైన యౌవనస్థుడైన ఒక పయినీరు కార్డిఫ్‌కు వచ్చాడు. ఆయనే ఎరిక్‌.

“మేమిద్దరం కలిసి ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళం. చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మాకిద్దరికీ జీవితంలో ఒకే లక్ష్యం ఉంది​—⁠దేవుని రాజ్యాసక్తులను పెంపొందింపజేయడం. కాబట్టి 1952 డిసెంబరులో మేము వివాహం చేసుకున్నాము. మేమిద్దరం పూర్తికాల పయినీరు సేవలో ఉండి ఆర్థికపరంగా అంత మంచిస్థితిలో లేకపోయినప్పటికీ, మాకెప్పుడూ కనీసావసరాలు తీరకుండా ఉండలేదు. కొన్నిసార్లు మాకు ఇతర సాక్షుల నుండి బహుమానాలు అందేవి, అదెలాగంటే తమ నెలసరి సరుకుల్లో జామ్‌ గానీ సబ్బులు గానీ ఎక్కువగా తెప్పించుకున్నామని చెబుతూ దానిలో నుండి మాకు కొంత పంపేవారు, అదీ సరిగ్గా మాకు అవసరమైన సమయంలోనే అవి అందేవి! అలాంటి ఆచరణాత్మకమైన చర్యలకు మేమెంతో కృతజ్ఞులం. కానీ మాకోసం ఇంకా గొప్ప సంభ్రమాశ్చర్యకరమైన విషయాలు వేచివున్నాయి ఉన్నాయి.”

మా జీవితాలను మార్చేసిన ఆశ్చర్యకరమైన విషయం

1954 నవంబరులో, హేజెల్‌ నేను ఎంతమాత్రం ఊహించని ఒక ఆశ్చర్యకరమైన విషయం మాకు ఎదురైంది, అదేమిటంటే, ప్రతివారం ఒక్కో సంఘాన్ని దర్శిస్తూ ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేయమంటూ, లండన్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి ఆఫీసు నుండి మాకు ఒక ధరఖాస్తు పత్రం వచ్చింది. అది కేవలం పొరపాటు మాత్రమేనని మాకిద్దరికీ దృఢంగా అనిపించడంతో సంఘంలో ఎవ్వరికీ ఆవిషయం చెప్పలేదు. అయితే, ఆధరఖాస్తు నింపి దాన్ని తిరిగి పంపించేసి, మేమిద్దరం ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత, “శిక్షణ కోసం లండన్‌కు రండి” అంటూ జవాబు వచ్చింది!

లండన్‌ ఆఫీసులో, ఆధ్యాత్మిక మహామహుల వంటి అద్భుతమైన సహోదరులతో 23ఏళ్ళ నేను ఉన్నానంటే నమ్మలేకపోయాను, ఆసహోదరుల్లో ప్రైస్‌ హ్యూస్‌, ఎమ్లిన్‌ వైన్స్‌, ఎర్నీ బీవర్‌, ఎర్నీ గైవర్‌, బాబ్‌ గాగ్‌, గ్లిన్‌ పార్‌, స్టాన్‌ మరియు మార్టిన ఊడ్‌బర్న్‌, ఇంకా అనేకమంది ఇతరులు ఉన్నారు, వారిలో చాలామంది ఇప్పుడు మరణించారు. వారు పూర్వం 1940లు, 1950లలో బ్రిటన్‌లో అత్యాసక్తి, యథార్థతల పటిష్ఠమైన పునాదిని వేశారు.

ఇంగ్లాండ్‌లో సర్క్యూట్‌ పని—⁠ఎన్నడూ విసుగనిపించలేదు

మా ప్రయాణ పని, 1954/55 సంవత్సరాల, మంచు కురుస్తున్న చలికాలంలో ప్రారంభమైంది. మానియామకం ఈస్ట్‌ ఆంగ్లియాలో, అది నార్త్‌ సీపై నుండి చల్లని గాలులు వీచే ఇంగ్లాండ్‌లోని పల్లపు ప్రాంతం. ఆసమయంలో బ్రిటన్‌లో కేవలం 31,000 మంది సాక్షులే ఉన్నారు. మొదటి సర్క్యూట్‌ చాలా కష్టం అనిపించింది, అయితే దాని నుండి మేమెంతో నేర్చుకున్నాము; అంతేగాక మేము సందర్శించిన సహోదరులకు కూడా కొన్నిసార్లు కష్టంగానే ఉండేది​—⁠నా అనుభవరాహిత్యం మూలంగా, యార్క్‌ వాస్తవ్యులకు సాధారణంగా ఉండే కరుకుదనం మూలంగా నేను కొంతమంది సహోదరులను అభ్యంతరపరిచాను. సంవత్సరాలు గడుస్తుండగా, దక్షత కంటే దయా, పద్ధతుల కంటే ప్రజలూ ఎంతో ముఖ్యమని నేను నేర్చుకోవలసి వచ్చింది. ఇతరులకు సేదదీర్పుగా ఉండడంలో యేసు మాదిరిని అనుసరించాలని నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను, అయితే అన్నిసార్లూ విజయం సాధించలేకపోతున్నాను.​—⁠మత్తయి 11:28-30.

ఈస్ట్‌ ఆంగ్లియాలో 18 నెలలు గడిపిన తర్వాత, ఇంగ్లాండ్‌ ఈశాన్య ప్రాంతంలోని న్యూకాస్టల్‌ అపాన్‌ టైన్‌ మరియు నార్తంబర్‌లాండ్‌లలోని సర్క్యూట్‌లో సేవచేసే నియామకం మాకు ఇవ్వబడింది. సుందర దృశ్యాల ఆప్రాంతంలోని ఆప్యాయతగల ప్రజలను నేనెంతో ఇష్టపడ్డాను. అమెరికాలోనున్న వాషింగ్‌టన్‌లోని సియాటల్‌కు చెందిన, మమ్మల్ని సందర్శిస్తున్న జిల్లా పైవిచారణకర్త డాన్‌ వార్డ్‌ నాకెంతో సహాయం చేశాడు. ఆయన గిలియడ్‌ 20వ తరగతి నుండి పట్టభద్రుడయ్యాడు. ప్రసంగీకునిగా నేను అనర్గళంగా మాట్లాడుతూ అమితవేగంతో సమాచారాన్ని అందజేసేవాడిని. కానీ ఆయన నాకు నెమ్మదిగా మాట్లాడడాన్ని, మాట్లాడేటప్పుడు మధ్యలో వ్యవధి ఇవ్వడాన్ని, బోధించడాన్ని నేర్పాడు.

మా జీవితాలను మార్చివేసిన మరో ఆశ్చర్యకరమైన విషయం

1958 లో మేము, మాజీవితాలను మార్చివేసిన ఒక ఉత్తరాన్ని అందుకున్నాము. అమెరికాలోనున్న న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో గిలియడ్‌ పాఠశాలకు హాజరుకమ్మని మాకు ఆహ్వానం అందింది. మేము మాదగ్గరున్న చిన్ని 1935 ఆస్టీన్‌ సెవెన్‌ కారును అమ్మేసి, ఓడలో న్యూయార్క్‌కు వెళ్ళడానికి టికెట్లు కొనుక్కున్నాము. మొదటగా మేము న్యూయార్క్‌ నగరంలో యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాము. అక్కడి నుండి మేము ఓంటారియోలోని పీటర్‌బరోకు వెళ్ళి అక్కడ ఆరు నెలలపాటు పయినీరింగ్‌ చేసి, ఆతర్వాత దక్షిణంగా గిలియడ్‌ పాఠశాలకు వెళ్ళాము.

పాఠశాల ఉపదేశకుల్లో అల్బర్ట్‌ ష్రోడర్‌ ఉన్నారు, ఆయన ఇప్పుడు పరిపాలక సభ సభ్యుడు, అలాగే మాక్స్‌వెల్‌ ఫ్రెండ్‌ మరియు జాక్‌ రెడ్‌ఫోర్డ్‌ ఉన్నారు, వీళ్ళిద్దరూ ఆతర్వాత మరణించారు. 14 దేశాల నుండి వచ్చిన 82 మంది విద్యార్థుల మధ్య సహవాసం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది. ఒకరి సంస్కృతులను మరొకరం కొంతమేరకు అర్థం చేసుకోవడం ప్రారంభించాము. ఆంగ్లంతో కుస్తీపడుతున్న విదేశీ విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం, మరో భాషను నేర్చుకునేటప్పుడు ఎదురయ్యే సమస్యలను మాకు రుచి చూపించింది. ఐదు నెలల్లో మాశిక్షణ పూర్తయ్యింది, మాకు 27 దేశాలకు నియామకాలు ఇవ్వబడ్డాయి. ఆతర్వాత పట్టా పుచ్చుకునే కార్యక్రమం, ఇక ఆతర్వాత మమ్మల్ని మళ్ళీ యూరప్‌కు తీసుకువెళ్ళే క్వీన్‌ ఎలిజబెత్‌ ఓడ కోసం ఎదురుచూస్తూ కొద్ది రోజుల్లోనే మేము న్యూయార్క్‌ నగరంలో ఉన్నాము.

మా మొదటి విదేశీ నియామకం

మాకు ఎక్కడ నియామకం ఇవ్వబడింది? పోర్చుగల్‌! మేము 1959 నవంబరులో లిస్బన్‌ చేరుకున్నాము. ఇప్పుడిక క్రొత భాష నేర్చుకునే, క్రొత్త సంస్కృతికి సర్దుకోవడమనే పరీక్ష ఎదురైంది. 1959 లో, దాదాపు 90 లక్షల జనాభా ఉన్న పోర్చుగల్‌లో 643 మంది సాక్షులు చురుగ్గా ఉన్నారు. కాని మన ప్రకటనా పనికి చట్టబద్దమైన గుర్తింపు లేదు. రాజ్యమందిరాలు ఉన్నా వాటికి బయటికి కనిపించే గుర్తులేమీ ఉండవు.

మిషనరీ అయిన ఎల్జా పీకోనీ మాకు పోర్చుగీస్‌ భాష నేర్పించాక హేజెల్‌ నేను లిస్బన్‌, ఫారూ, ఇవుర, బేజా చుట్టుప్రక్కలనున్న సంఘాలను, గుంపులను సందర్శించాము. తర్వాత 1961 లో పరిస్థితులు మారడం మొదలైంది. జ్వావూ గోంసాల్విస్‌ మటేయుస్‌ అనే యౌవనస్థుడితో నేను బైబిలు అధ్యయనం చేస్తున్నాను. సైనిక సేవ విషయంలో ఆయన క్రైస్తవునిగా తటస్థంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికే నన్ను ప్రశ్నించడానికి పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మరో ఆశ్చర్యం! 30 రోజుల్లో దేశం వదిలి వెళ్ళాలని మాకు కొద్ది రోజుల్లోనే నోటీసు అందింది. తోటి మిషనరీలైన ఎరిక్‌ మరియు క్రిస్టీన బ్రిట్టన్‌లకు, డొమెనిక్‌ మరియు ఎల్జా పిక్కోన్‌లకు కూడా అలాగే జరిగింది.

నేను నా వాదన వినిపించడానికి అప్పీలు చేసుకున్నాను, సీక్రెట్‌ పోలీసు ప్రధాన అధికారిని కలిసేందుకు మాకు అనుమతి లభించింది. మమ్మల్ని ఎందుకు దేశం విడిచి వెళ్ళమంటున్నారో కారణాన్ని ఆయన తెగేసి చెప్పాడు, ఒక పేరును కూడా ప్రస్తావించాడు​—⁠జ్వావూ గోంసాల్విస్‌ మటేయుస్‌​—⁠నా బైబిలు విద్యార్థి! బ్రిటన్‌లా పోర్చుగల్‌ మనస్సాక్షినిబట్టి సైనిక సేవకు అభ్యంతరం చెప్పడమనే ఖరీదైన కోరికను అనుమతించలేదని ఆయన అన్నాడు. కాబట్టి మేము పోర్చుగల్‌ను వదిలి వెళ్ళవలసి వచ్చింది, ఆతర్వాత నేనిక జ్వావూను కలవలేదు. 26 ఏళ్ల తర్వాత, పోర్చుగల్‌లో క్రొత్త బేతేలు ప్రతిష్ఠాపన సమయంలో తన ముగ్గురు కుమార్తెలతోపాటు సతీసమేతంగా వచ్చిన ఆయనను చూడడం ఎంత ఆనందాన్ని కలిగించిందో! పోర్చుగల్‌లో మేము చేసిన సేవ వ్యర్థం కాలేదు!​—⁠1 కొరింథీయులు 3:6-9.

మా తర్వాతి నియామకం ఎక్కడ? ఆశ్చర్యం! పొరుగునున్న స్పెయిన్‌. 1962 ఫిబ్రవరిలో కన్నీళ్ళతో మేము లిస్బన్‌లో ట్రెయిన్‌ ఎక్కి మాడ్రిడ్‌కు వెళ్ళాము.

మరో సంస్కృతికి అనుగుణంగా సర్దుకుపోవడం

స్పెయిన్‌లో మేము రహస్యంగా ప్రకటించడానికి, రహస్యంగా కూటాలు జరుపుకోవడానికి అలవాటుపడాలి. ప్రకటించేటప్పుడు మేము ఎప్పుడు కూడా ప్రక్కప్రక్కనే ఉన్న ఇళ్ళకు వెళ్ళము. ఒక ఇంటి దగ్గర సాక్ష్యం ఇచ్చిన తర్వాత, మరో వీధిలో ఉన్న మరో భవనంలోకి వెళతాము. అలాగైతేనే పోలీసులుగానీ ప్రీస్టులుగానీ మమ్మల్ని పట్టుకోవడం కష్టం. మేము ఫాసిస్ట్‌, క్యాథలిక్‌ నిరంకుశ పరిపాలన క్రింద ఉన్నామని, మా ప్రకటనా పని అక్కడ నిషేధించబడిందని గుర్తుంచుకోండి. మేము విదేశీయులము గనుక గుర్తింపబడకుండా ఉండేందుకు స్పానిష్‌ పేర్లు పెట్టుకున్నాము. నేను పాబ్లోనయ్యాను, హేజెల్‌ హ్వానా అయ్యింది.

మాడ్రిడ్‌లో కొన్ని నెలలున్న తర్వాత, మాకు బార్సిలోనాలో సర్క్యూట్‌ పని ఇవ్వబడింది. మేము నగరంలో వివిధ సంఘాలను దర్శిస్తూ, ఒక్కో సంఘంలో తరచూ రెండు మూడు వారాలు గడిపేవాళ్ళం. మేము ప్రతి పుస్తక అధ్యయన గ్రూపునూ సంఘాన్ని సందర్శించినట్లు సందర్శించాలి, అందుకే ఒక్కో విజిట్‌కు అంత సమయం పట్టేది, అలా సాధారణంగా వారానికి రెండు గ్రూపులను సందర్శించేవాళ్ళము.

అనూహ్యమైన సవాలు

1963 లో మేము స్పెయిన్‌లో జిల్లా పనిని చేపట్టమన్న ఆహ్వానాన్ని అందుకున్నాము. దాదాపు 3,000 మంది చురుకైన సాక్షులకు సేవచేయడానికి మేము దేశం మొత్తంలో ప్రయాణిస్తూ, అప్పట్లో ఉన్న తొమ్మిది సర్క్యూట్‌లను దర్శించాలి. మేము మరువలేని కొన్ని రహస్య సర్క్యూట్‌ అసెంబ్లీలను సవిల్లె దగ్గర్లోని అడవుల్లోనూ, గిజాన్‌ దగ్గర ఒక పొలంలోనూ, మాడ్రిడ్‌, బార్సీలోనా, లగ్రోన్యాల దగ్గర నదీతీరాల్లోనూ జరుపుకున్నాము.

ముందు జాగ్రత్త చర్యగా, ఇంటింటికి ప్రకటిస్తున్నప్పుడు ఏదైనా అనుకోనిది జరిగితే తప్పించుకుని పారిపోవడానికి మార్గం కోసం దగ్గరలో ఉన్న వీధుల నమూనా పటాన్ని చూసి ఉంచుకునేవాడిని. ఒకసారి మాడ్రిడ్‌లో ప్రకటిస్తున్నప్పుడు, మరో సాక్షీ నేనూ పై అంతస్తులో ఉన్నాము, హఠాత్తుగా మాకు క్రింది నుండి అరుపులు, గోల వినిపించాయి. మేము క్రిందికి వచ్చేసరికి, యౌవనస్థులైన అమ్మాయిల గుంపు ఒకటి ఉంది, వారంతా ఈఖాస్‌ డెమరీయ (మరియ కుమార్తెలు) అని పిలువబడే క్యాథలిక్‌ గుంపు సభ్యులు. వారు ఇరుగుపొరుగు వారికి మాగురించి హెచ్చరిస్తున్నారు. మేము వారితో తర్కించలేకపోయాము, వెంటనే వెళ్ళిపోకపోతే పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారని నాకు తెలుసు. కాబట్టి మేము త్వరగా తప్పించుకుని పారిపోయాము!

స్పెయిన్‌లో గడిపిన ఆసంవత్సరాలు చాలా ఉత్తేజంగా గడిచాయి. ప్రత్యేక పయినీరు పరిచారకులతో సహా అక్కడి చక్కని సహోదర సహోదరీలను ప్రోత్సహించడానికి ప్రయత్నించాము. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికీ, సంఘాలను స్థాపించి వాటిని బలపర్చడానికీ ఆసహోదరులు జైలుకెళ్ళేందుకూ వెనుకాడలేదు, అంతేగాక తరచూ లేమిని అనుభవించారు.

ఈ సమయంలో మాకు కూడా బాధ కలిగించే విషయాలు తెలిశాయి. హేజెల్‌ వివరిస్తుంది: “నమ్మకమైన సాక్షి అయిన మాఅమ్మ 1964 లో మరణించింది. కనీసం ఆమెకు వీడ్కోలు కూడా చెప్పకుండానే ఆమెను పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విఘాతం. అది మిషనరీ సేవ చేయడానికి చెల్లించవలసిన మూల్యాల్లో ఒకటి, అనేకమంది ఇతరులు కూడా అలాగే చెల్లించారు.”

చివరికి మతస్వేచ్ఛ

సంవత్సరాలపాటు హింసించబడిన తర్వాత, చివరికి 1970 జూలైలో ఫ్రాంకో ప్రభుత్వం మాపనికి చట్టబద్దమైన గుర్తింపునిచ్చింది. మొదట మాడ్రిడ్‌లోనూ ఆతర్వాత బార్సిలోనాలోని లెసెప్స్‌లోనూ రాజ్యమందిరాలు తెరువబడడంతో హేజెల్‌ నేను పులకరించిపోయాము. వాటికి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేవారు, తరచూ అవి దేదీప్యమానంగా వెలుగుతుండేవి. మాకు చట్టబద్దమైన గుర్తింపు ఉందనీ, మేము స్పెయిన్‌లోనే ఉండబోతున్నామనీ ప్రజలు తెలుసుకోవాలన్నది మాకోరిక! అప్పటికల్లా అంటే 1972 లో స్పెయిన్‌లో దాదాపు 17,000 మంది సాక్షులున్నారు.

ఆసమయంలో నాకు ఇంగ్లాండ్‌ నుండి కొన్ని చాలా ప్రోత్సాహకరమైన వార్తలు తెలిశాయి. 1969 లో మానాన్నగారు స్పెయిన్‌లో ఉన్న మాదగ్గరికి వచ్చారు. స్పెయిన్‌లోని సాక్షులు తనతో వ్యవహరించిన విధానాన్ని బట్టి ఆయనెంతగా ప్రభావితుడయ్యాడంటే, ఆయన ఇంగ్లాండ్‌కు తిరిగివెళ్ళిన తర్వాత బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. 1971 లో, నాన్నగారు బాప్తిస్మం తీసుకున్నారని నాకు తెలిసింది! మేము ఇంటికి వెళ్ళినప్పుడు, నా క్రైస్తవ సహోదరునిగా మారిన నాన్నగారు భోజనానికి ముందు ప్రార్థనచేశారు, నిజంగా అవి మధుర క్షణాలు. ఇలాంటి రోజు కోసం నేను 20 ఏళ్ళకు పైగా ఎదురు చూశాను. నా తమ్ముడు బాబ్‌, అతని భార్య ఐరిస్‌ 1958 లో సాక్షులయ్యారు. వారి కుమారుడు ఫిలిప్‌ తన భార్య జీన్‌తో కలిసి ఇప్పుడు స్పెయిన్‌లో సర్క్యూట్‌ పైవిచారణకర్తగా సేవచేస్తున్నాడు. ఆఅద్భుతమైన దేశంలో వారు సేవచేయడాన్ని చూడ్డం మాకెంతో ఆనందాన్నిస్తుంది.

ఇటీవలి ఆశ్చర్యకరమైన విషయం

1980 ఫిబ్రవరిలో, పరిపాలక సభ సభ్యుల్లో ఒకరు జోన్‌ పైవిచారణకర్తగా స్పెయిన్‌కు వచ్చారు. ఆయన నాతో కలిసి పరిచర్య చేయాలని ఇష్టపడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన నన్ను తనిఖీ చేస్తున్నాడని నాకు ఎంతమాత్రం తెలియదు! సెప్టెంబరులో, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి రమ్మని మాకు ఆహ్వానం అందింది! మా ఆశ్చర్యానికి అంతులేదు. స్పెయిన్‌లోని సహోదరులను విడిచి వెళ్ళడం బాధ కలిగించినప్పటికీ, మేము ఆహ్వానాన్ని మన్నించాము. అప్పుడక్కడ 48,000 మంది సాక్షులున్నారు!

మేము అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఒక సహోదరుడు నాకు జేబు గడియారం బహుమానంగా ఇచ్చాడు. దాని మీద ఆయన రెండు లేఖనాలు చెక్కించాడు: “లూకాస్‌ 16:​10; లూకాస్‌ 17:10.” అవి నాకు ఆశయంగా ఉన్న లేఖనాలని ఆయన అన్నాడు. లూకా 16:​10 మనం మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలని నొక్కి చెబుతుంది; లూకా 17:⁠10 మనం “నిష్‌ప్రయోజకులమైన దాసులము” గనుక గొప్పలు చెప్పుకోవడం తగదని నొక్కి చెబుతుంది. యెహోవా సేవలో మనమేమి చేసినా, సమర్పిత సేవకులముగా అది కేవలం మన బాధ్యతనే అని నేను ఎల్లప్పుడూ గుర్తించాను.

ఆరోగ్యానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం

1990 లో నాకు గుండెకు సంబంధించిన సమస్యలు ప్రారంభమయ్యాయి. చివరికి, మూసుకుపోయిన ఒక ధమనిని సరిచేయడానికి స్టెంట్‌ అని పిలువబడే గొట్టాన్ని జొప్పించవలసిన అవసరం ఏర్పడింది. శారీరకంగా బలహీనంగా ఉన్న ఈకష్ట సమయంలో, హేజెల్‌ నాకు ఎన్ని విధాలుగానో మద్దతునిచ్చింది, నేను మోయలేని బరువైన బ్యాగులను, సూట్‌కేసులను తరచూ ఆమే మోసేది. 2000 మేలో పేస్‌మేకర్‌ను (గుండె కొట్టుకోవడాన్ని ప్రేరేపించే విద్యుత్‌ పరికరం) జొప్పించారు. ఎంత మార్పు!

యెహోవా హస్తం కురుచ కాలేదనీ, ఆయన సంకల్పాలు ఆయన నియమిత సమయంలో నెరవేరుతాయి గానీ మనం అనుకున్న సమయంలో కాదనీ గత 50 ఏళ్ళ కాలంలో, నేను హేజెల్‌ తెలుసుకున్నాము. (యెషయా 59:1; హబక్కూకు 2:⁠3) మాజీవితంలో మాకు ఎన్నో ఆనందభరితమైన ఆశ్చర్యాలు కలిగాయి, కొన్ని దుఃఖకరమైన ఆశ్చర్యాలు కూడా కలిగాయి, కానీ ఆసమయాలన్నిటిలోనూ యెహోవా మమ్మల్ని బలపరిచాడు. యెహోవా ప్రజల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో, ప్రతి రోజు పరిపాలక సభ సభ్యులతో కలిసే దీవెన మాకు లభించింది. ‘నిజంగా మేమిక్కడున్నామా?’ అని కొన్నిసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అది నిజంగా ఆయన కృప. (2 కొరింథీయులు 12:⁠9) యెహోవా మమ్మల్ని సాతాను తంత్రముల నుండి కాపాడి, భూమిపై ఆయన నీతియుక్తమైన పరిపాలనను ఆనందించగలిగేలా సంరక్షించడంలో కొనసాగుతాడని మేము విశ్వసిస్తున్నాము.​—⁠ఎఫెసీయులు 6:11-18; ప్రకటన 21:1-4.

[26వ పేజీలోని చిత్రం]

మాంచెస్టర్‌లోని స్ట్రేంజ్‌వేస్‌ జైలు, ఇక్కడే నా జైలు శిక్ష ప్రారంభమైంది

[27వ పేజీలోని చిత్రం]

ఇంగ్లాండ్‌లో సర్క్యూట్‌ పనిలో ఉండగా మాఆస్టిన్‌ సెవెన్‌తో

[28వ పేజీలోని చిత్రం]

స్పెయిన్‌, మాడ్రిడ్‌, తెర్సీడీల్యలో రహస్య అసెంబ్లీలో, 1962

[29వ పేజీలోని చిత్రం]

బ్రూక్లిన్‌లో బైబిలు సాహిత్యాలు ఉన్న బల్ల వద్ద