కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆండీస్‌లో జీవాన్నిచ్చే జలప్రవాహం

ఆండీస్‌లో జీవాన్నిచ్చే జలప్రవాహం

ఆండీస్‌లో జీవాన్నిచ్చే జలప్రవాహం

ఆండీస్‌ పర్వత శ్రేణి పెరూ మధ్యభాగం వరకూ వ్యాపించి, పశ్చిమాన నిస్సారమైన తీరప్రాంతంగాను, తూర్పున ఫలభరితంగా తేమగా ఉండే అడవిగాను దేశాన్ని రెండుగా విభజిస్తుంది. రెండు కోట్ల డెబ్భై లక్షల పెరూ జనాభాలో మూడింట ఒక వంతు మంది నిటారుగా ఉండే ఈపర్వతాలపైనే నివసిస్తారు. వారు ఎత్తైన పీఠభూముల మీదా, నిట్రమైన పర్వతచరియలలోనూ లేక అగాధంలా కనిపించే లోయల్లోనూ, రంపపు పళ్ళలా ఎగుడుదిగుడుగా ఉన్న ఆ పర్వతశ్రేణి దిగువనున్న సారవంతమైన లోయల్లోనూ నివసిస్తున్నారు.

ఆండీస్‌ పర్వత శ్రేణి ఎత్తుపల్లాలుగా ఉండడం వల్ల, అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. ఫలితంగా, అక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది మిగతా ప్రపంచం నుండి వేరుగా ఉన్నట్లు, ఆప్రాంతానికి అవతల జరిగే సంఘటనలూ, అభివృద్ధులూ తమపై ఏ ప్రభావం చూపనట్లు ఉంటారు.

పంటపొలాలకు, లామాలు, అల్పకాలు, వికునాలు, గొఱ్ఱెలు వంటివాటి మందలకు అవసరమైన నీటి కోసం జల ప్రవాహాలకు ఇరువైపులా చిన్న చిన్న గ్రామాలు వెలిశాయి. అయితే, ఆండీస్‌లో ప్రవహించే మరో రకమైన ప్రాముఖ్యమైన జలాలున్నాయి, అవి “జీవజలముల ఊట” అయిన యెహోవా నుండి వచ్చే, సేదతీర్చే ఆధ్యాత్మిక జలాలు. (యిర్మీయా 2:​13) ఎత్తైన ఆండీస్‌ పర్వతాల్లో నివాసం ఏర్పరచుకున్న ప్రజలు తన గురించిన, తన సంకల్పాలను గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు వారికి సహాయం చేయడానికి దేవుడు తన సాక్షులను ఉపయోగించుకుంటున్నాడు.​—⁠యెషయా 12:3; యోహాను 17:3.

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలన్నది దేవుని చిత్తం గనుక, చేరుకోవడం ఎంతో కష్టమైన స్థలాల్లో ఉన్న సమాజాలకు కూడా బైబిలులో ఉన్న జీవదాయక సందేశాన్ని చేరవేయడానికి ఆసేవకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. (1 తిమోతి 2:⁠4) బైబిలు ఆధారిత సందేశం ఎంతో జ్ఞానదాయకమైనది, ఉన్నతమైనది. అది యథార్థవంతులైన స్థానిక ప్రజలు మృతుల గురించి, దుష్టాత్మల గురించి, ప్రకృతి శక్తుల గురించి భయపడేలా చేసిన మూఢనమ్మకాలు, ఆచారాలు, తలంపుల నుండి వారిని స్వతంత్రులను చేసింది. మరింత ప్రాముఖ్యంగా, ఈసందేశం వారికి పరదైసు భూమిపై అంతంలేని జీవితాన్ని అనుభవించే మహిమాన్వితమైన నిరీక్షణనిస్తుంది.

అవసరమైన ప్రయత్నాలు

ఈసుదూర ప్రాంతాలను సందర్శించే రాజ్య ప్రచారకులు ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలి. బైబిలు బోధకులు ప్రజల హృదయాలను చేరుకోవాలంటే వారికి క్వెచూవా, అయ్‌మారా అనే స్థానిక భాషల్లో కొంత పరిజ్ఞానం అవసరం.

ఆండీస్‌లోని గ్రామాలను చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ఆప్రాంతాలకు రైలు మార్గాలు అంతగా లేవు. అక్కడికి ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం, అక్కడి తీవ్రమైన వాతావరణం మూలంగా, అసాధారణమైన నైసర్గిక స్వరూపం మూలంగా ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరైతే, వారికి రాజ్య సందేశాన్ని అందజేయడానికి సాక్షులు వారినెలా చేరుకుంటారు?

ధైర్యవంతులైన సువార్త ప్రచారకులు దీన్ని సవాలుగా తీసుకుని, యెషయా ప్రవక్తలానే, ‘చిత్తగించుము నేనున్నాను! నన్ను పంపు’ అనే స్ఫూర్తితో వచ్చారు. (యెషయా 6:⁠8) ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలకు ప్రయాణించడానికి వారు మూడు సంచార ఇండ్లను ఉపయోగించారు. ఆసక్తిగల పయినీర్లు లేక పూర్తికాల పరిచారకులు డజన్లకొద్ది కార్టన్లలో బైబిళ్ళను, బైబిలు సాహిత్యాన్ని తీసుకుని వెళ్ళి, అక్కడ నివసిస్తున్న స్నేహశీలురు అతిథిప్రియులు యథార్థవంతులు అయిన ప్రజల హృదయాల్లో బైబిలు సత్యపు విత్తనాలను నాటారు.

ప్రాముఖ్యంగా, పర్వతాలపైనున్న రోడ్ల మలుపులు చాలా ప్రమాదకరమైనవి. అలాంటి కొన్ని మలుపుల గుండా వెళ్ళేటప్పుడు వాహనాలు ఒక మలుపు నుండి మరో మలుపు వరకు రివర్సులో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక రోజు అలా వెళుతుండగా, ఒక బస్సులో వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఒక మిషనరీ కిటికీలో నుండి బయటికి చూసి, బస్సు వెనుక చక్రాల్లో ఒకటి, 190 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తునున్న రోడ్డు అంచున ఉన్నట్లు గమనించాడు! బస్సు ముందుకు వెళ్ళేంత వరకూ ఆయన గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

కొన్ని రోడ్లు దుర్భరమైన స్థితిలో ఉండి, మరీ ఇరుగ్గా ఉంటాయి. ఒకసారి అలాంటి ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతం గుండా సంచార ఇండ్లలో ఒకటి ఇరుకు రోడ్డు మీదుగా క్రిందికి దిగుతుండగా, పైకి వస్తున్న ట్రక్కు ఒకటి ఎదురయ్యింది. ఆరెండు వాహనాలు ఒకదాన్నొకటి దాటి వెళ్ళగలిగేంత ఖాళీ ఉన్న చోటికి చేరుకునే దాకా సంచార ఇండ్లను పర్వతం పైకి వెనక్కి తీసుకువెళ్ళవలసి వచ్చింది.

అయినప్పటికీ, అలా పట్టుదలగా చేసిన ప్రయత్నాలకు లభించిన ఫలితాలు అద్భుతం. వారు చేసిన ఆప్రయత్నాలను గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారా?

టిటికాకా సరస్సుకి “నీళ్ళుపోయడం”

టిటికాకా సరస్సు, ఆండీస్‌ పర్వతాల మధ్యన, సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎగువన ఉంది. అది ఎత్తైన ప్రదేశపు లోతట్టు ప్రాంతంలో ఉంది. అది ప్రయాణానికి అనుకూలంగా ఉన్న సరస్సు. మంచుతో కప్పబడి, 21,000 అడుగుల కన్నా ఎత్తువుండే పర్వత శిఖరాలు కొన్ని, టిటికాకాలో కలిసే 25 కన్నా ఎక్కువ నదులకు జన్మస్థలాలుగా ఉన్నాయి. అంత ఎత్తున ఉన్నందువల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, ఆప్రాంతానికి చెందని వారు, అక్కడ వచ్చే జబ్బులతో సర్దుకుపోవలసిందే.

కొంత కాలానికి ముందు, క్వెచూవా, అయ్‌మారా మాట్లాడే పయినీర్ల గుంపొకటి టిటికాకా సరస్సులోవున్న ఆమాన్‌టానీ, టాకీలే దీవులకు వెళ్ళింది. వాళ్ళు క్రైస్తవమత సామ్రాజ్యపు అబద్ధాలను నిర్మొహమాటంగా బట్టబయలుచేసే “చర్చీలను దగ్గరగా చూడడం” అనే స్లైడ్‌లను తమతోపాటు తీసుకువెళ్ళి చూపించారు. దానికి చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది. ఒక వ్యక్తి సహోదరులను సాదరంగా ఆహ్వానించి, అక్కడే ఉంటూ బైబిలును బోధించేందుకు వారికి తన ఇంట్లోని ఒక విశాలమైన గదిని ఇచ్చాడు.

ఆమాన్‌టానీలో జరిపిన మొదటి కూటానికి 100 మంది హాజరయ్యారు. టాకీలేలో జరిగిన కూటానికి 140 మంది హాజరయ్యారు. ఆస్లైడ్‌లు క్వెచూవాలో భాషలోవి. మునుపు ఆఖండపు భూభాగంలో నివసించిన ఒక జంట, “యెహోవాసాక్షులైన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిన సమయమైందన్నమాట. మీరు రావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం” అని అన్నారు.

టిటికాకా సరస్సులోవున్న ఈ రెండు పెద్ద దీవులే కాక, “తేలుతున్న” మరో దాదాపు 40 దీవులకు సువార్త వ్యాపించింది. తేలుతున్న దీవులా? అవును, ఈదీవులు టొటొరాస్‌ అనే జమ్ములాంటి మొక్కలతో తయారు చేయబడ్డాయి. ఈసరస్సు తక్కువలోతుగా ఉన్న చోట మొలిచిన ఈమొక్కలు, నీటి ఉపరితలంపైకి వ్యాపిస్తాయి. స్థానికులు ఈసరస్సులో కొంచెం ఎక్కువ లోతుగా వేళ్ళూనివున్న టొటొరాస్‌ మొక్కలను వంచి, వాటిని వేదికలాగా అల్లుతారు. తర్వాత, దానిని మట్టితో కప్పుతారు, కోసిన మరికొన్ని మొక్కలతో దానిని మరింత దృఢపరుస్తారు. ఆతర్వాత దాని మీద నిర్మించిన టొటొరాస్‌ కుటీరాల్లో నివసిస్తారు.

యెహోవాసాక్షులు టిటికాకా సరస్సులోని దీవుల్లో నివసించే ప్రజలకు ప్రకటించేందుకు ఒక పడవను సంపాదించుకున్నారు. ఆపడవలో 16 మంది ప్రయాణం చేయవచ్చు. తేలుతున్న ఆదీవుల్లో పడవ ఆగిన తర్వాత, సాక్షులు ఆమొక్కల ప్లాట్‌ఫారమ్‌ మీదుగా, ఒక్కొక్క కుటీరం దగ్గరికి వెళ్తారు. మామూలుగా తమ కాలి క్రింద ఉన్న నేల కొద్దిగా కదులుతున్నట్లు అనిపిస్తుందని వాళ్ళు చెబుతారు. మోషన్‌ సిక్‌నెస్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నవాళ్ళు ఇలాంటి చోట్లకు వెళ్ళకూడదు!

అయ్‌మారా మాట్లాడే ప్రజల విషయం తీసుకుంటే, వాళ్ళు తీరాల్లోను, ఈసరస్సులోకి చొచ్చుకు వచ్చిన ద్వీపకల్పాల్లోను ఉన్న అనేక సమాజాల్లో గ్రామాల్లో నివసిస్తారు. వీరిని తీరంగుండా చేరుకోవడం కన్నా పడవ మీద చేరుకోవడమే సులభం. మొత్తమ్మీద దాదాపు 4,00,000 మంది ప్రజలు ఈప్రాంతంలో నివసిస్తున్నారని అంచనా. వారికి రాజ్య సందేశాన్ని చేరవేయడానికి పడవలు ఉపకరిస్తున్నాయి. అప్పుడప్పుడు పడవలు చాలా రద్దీగా ఉంటాయి.

ఆధ్యాత్మిక దప్పికను తీర్చడం

ఆండీస్‌లోని, హూల్యాకాకు సమీపంలో ఉన్న సాంటా లూసీయా గ్రామంలో ఫ్లావ్యో నివసించేవాడు. వాళ్ళ ఇవాంజిలికల్‌ చర్చీలో, ఆయనకు నరకాగ్నిని గూర్చిన సిద్ధాంతం బోధించబడేది. అలాంటి నిత్యాగ్నిమయ శిక్షను గురించి ఆయన సంవత్సరాలుగా భయపడుతూ జీవించేవాడు. ప్రేమామయుడైన దేవుడు అగ్నిలో మానవులను నిత్యమూ ఎలా చిత్రహింసలు పెట్టగలడని ఆయన తరచూ ఆశ్చర్యపోయేవాడు. యెహోవాసాక్షుల్లో ఒక పూర్తికాల పరిచారకుడైన టిటో ఆగ్రామాన్ని సందర్శించినప్పుడు, ఆయన ఫ్లావ్యోను సందర్శించాడు.

“ప్రజలు నరకాగ్నిలో వేధించబడతారని మీమతం బోధిస్తుందా?” అన్నదే ఫ్లావ్యో అడిగిన మొదటి ప్రశ్న. అలాంటి తలంపు సృష్టికర్తకు అసహ్యమనీ, అంతే కాక, అది ప్రేమామయుడైన యెహోవా నామానికి నిందను కూడా తెస్తుందనీ టిటో జవాబిచ్చాడు. మృతులకు దేని గురించీ స్పృహ ఉండదనీ, దేవుని రాజ్య పరిపాలనలో భూమిపైకి పునరుత్థానం చేయబడడానికి వారు వేచివున్నారని ఫ్లావ్యో దగ్గరున్న బైబిలు అనువాదాన్నే ఉపయోగించి, టిటో చూపించాడు. (ప్రసంగి 9:5; యోహాను 5:​28,29) అది ఫ్లావ్యోకు కనువిప్పు కలిగించింది. ఆయన వెంటనే ఒక బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడుగా అయ్యేందుకు త్వరగా ప్రగతిని సాధించాడు.

మెప్పుదల గల గ్రామం

ఇంతవరకూ బైబిలే చూడని గ్రామీణుల దగ్గరికి బైబిళ్ళను తీసుకువెళ్ళడం లేదా ఇంతవరకూ యెహోవాసాక్షుల గురించి గానీ వారు ప్రకటించే సువార్తను గురించి గానీ వినని ప్రజల గ్రామాల్లో ప్రకటించడం ఎంత పులకింత కలిగిస్తుందో ఊహించండి! రోసా, ఆలీస్యా, సెసీల్యా అనే ముగ్గురు పయినీర్‌ సహోదరీలకు అలాంటి అనుభవం కలిగింది. వాళ్ళు దక్షిణ పెరూలో సముద్ర మట్టానికి 12,000 అడుగులకన్నా ఎత్తునవున్న ఈస్కూచాకా, కోనైకా అనే గ్రామాల్లో సువార్తను ప్రకటించారు.

వాళ్ళు మొదటి గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండడానికి స్థలం లేదు. వాళ్ళు స్థానిక పోలీస్‌ కమాండర్‌తో మాట్లాడి, తాము వచ్చిన ఉద్దేశాన్ని వివరంగా చెప్పారు. ఫలితం? వాళ్ళు ఆరాత్రికి పోలీస్‌ స్టేషన్‌లో ఉండడానికి ఆయన అనుమతించాడు. ఆమరుసటి రోజు, ఆపయినీర్లకు ఒక మంచి ఇల్లు దొరికింది. అది వాళ్ళ కార్యకలాపాలకు కేంద్రమైంది.

త్వరలోనే, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ సమయం వచ్చింది. ఆపయినీర్లు, ఈస్కూచాకా గ్రామంలోని అన్ని ఇండ్లనూ సందర్శించి, అనేక బైబిళ్ళను ఇచ్చారు, అనేక బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టారు. జ్ఞాపకార్థానికి ముందే, వాళ్ళు, ఆఆచరణ ఉద్దేశాన్ని, ఆఆచరణ సమయంలో ఉపయోగించే చిహ్నాల అర్థాన్ని వివరిస్తూ ఆసందర్భం కోసం ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఆసందర్భంలో సహాయపడేందుకు ఒక గుంపు సహోదరులను ఆహ్వానించారు. వారిలో ఒకరు ప్రసంగమిచ్చారు. ఆప్రత్యేక సందర్భంలో, ఆచిన్న గ్రామంలోని 50 మంది హాజరవ్వడాన్ని చూడడం ఎంత ఆనందకరం! ప్రభు రాత్రి భోజనం అంటే నిజానికి ఏమిటో వాళ్ళు మొదటిసారిగా అర్థం చేసుకోగలిగారు. తమ చేతుల్లో దేవుని వాక్యం ఉండడాన్ని వాళ్ళెంతో ప్రశస్తమైన విషయంగా ఎంచారు!

బరువైన భారాల నుండి విడుదల

అబద్ధ మతానికి బందీలుగా ఉన్నవారికి బైబిలు సత్యమనే సేదదీర్చే జలాలను తీసుకువెళ్ళి ఇవ్వడం ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుంది. ప్రాచీన ఇన్‌కా సామ్రాజ్యానికి పిసాక్‌ బలమైన దుర్గంగా ఉండేది. అక్కడ నివసించేవారిలో చాలా మందికి లేఖన విరుద్ధమైన నరకాగ్ని బోధ బోధించబడుతోంది. ప్రీస్టుల మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే మీరు పరలోకానికి వెళ్ళగలరని ప్రీస్టులు వారికి చెబుతారు.

అలాంటి ప్రజలు బైబిలు సత్యమనే సేదదీర్చే జలాల కోసం దప్పికతో ఉన్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. యెహోవాసాక్షియైన పూర్తికాల పరిచారకుడైన సాంటీగో ఇంటింటి ప్రకటన చేస్తుండగా, నీతిమంతులకు పరదైసు భూమిపై జీవించే అవకాశం ఇవ్వబడుతుందని ఒక వ్యక్తికి వివరించే అవకాశం దొరికింది. (కీర్తన 37:​11) మృతులు పునరుత్థానం చేయబడుతారని, మానవులు నిత్యజీవ నిరీక్షణతో యెహోవా యొక్క పరిపూర్ణమైన మార్గాల్లో నడిపించబడతారని సాంటీగో బైబిలు నుండి ఆయనకు చూపించాడు. (యెషయా 11:⁠9) ఆవ్యక్తి అప్పటి వరకూ నిష్ఠగల ఒక క్యాథలిక్కు, మంత్రవిద్యలో మునిగివుండేవాడు, అస్తమానం త్రాగేవాడు. కానీ ఆయన జీవితంలో ఇప్పుడు బైబిలు ఆధారమైన నిరీక్షణ ఉంది, పరదైసులో జీవించాలన్న లక్ష్యం ఉంది. ఆయన మంత్రవిద్యకు సంబంధించిన వస్తువులను కాల్చివేశాడు, త్రాగుడు మానేశాడు. ఆయన తన కుటుంబాన్ని సమాయత్తం చేసి బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించాడు. కొద్ది కాలానికి, ఆకుటుంబ సభ్యులందరూ యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు.

ఆతిథ్యం అంగీకరించబడింది

ఆ పర్వతప్రాంతాల్లోని ప్రజలు అతిథిప్రియులు. వాళ్ళ ఇండ్లు చాలా చిన్నవే అయినప్పటికీ, వారికి వచ్చే ఆదాయం చాలా తక్కువే అయినప్పటికీ, తమ ఇంటికి వచ్చినవారికి తమకున్నదానిలో నుండి ఇస్తారు. ఒక ఆతిథేయుడు, బైబిలు యొక్క ఉన్నత ప్రమాణాలను గురించి తెలియక ముందు, మాట్లాడేటప్పుడు నమలడానికి కొకా ఆకులను అందిస్తుండవచ్చు. కానీ సాక్షి అయిన తర్వాత, ఆయన ఒక స్పూన్‌ నిండా పంచదార ఇస్తుండవచ్చు. ఆసుదూరప్రాంతాల్లో దానికి సమాన విలువ ఉంది.

పునర్దర్శనానికి రమ్మని ఒక సహోదరుడు ఒక మిషనరీని అడిగాడు. నిటారుగా ఉన్న పర్వత మార్గంగుండా ఎంతో కష్టపడి ఎక్కిన తర్వాత తాము వచ్చామని ఆఇంటివారికి తెలియజేయడానికి వాళ్ళు చప్పట్లు కొట్టారు. వాళ్ళు, ఆపూరింట్లోకి రమ్మని వారిని ఆహ్వానించారు. వాళ్ళు ఆఇంట్లోకి ప్రవేశించేందుకు చాలా వంగాలి. వాళ్ళు అలా జాగ్రత్తగా, లోపలికి ప్రవేశించారు. అక్కడ నేలంతా మురికిగా ఉంది. ఆపూరింటి మధ్యలో ఆఇంటామె నేలను కొంచెం లోతుగా చేసి, దాంట్లో రగ్గు వేసి, దానిలో తన పాపని ఉంచింది. పెద్దవాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుండగా ఆపాప దాంట్లో నుండి బయటికి రాలేకపోయినా, కేరింతలూ కొడుతూ సంతృప్తిగా కనిపించింది. వాళ్ళు దేవుని రాజ్యాశీర్వాదాలను గురించి ఉత్సాహంగా చర్చ జరుపుకున్న తర్వాత, ఆస్త్రీ ఒక పొడవైన పాత్రలో స్థానిక పానీయాన్ని తీసుకువచ్చింది. కొద్ది సేపటి తర్వాత, సహోదరులు ఆపర్వత చరియల్లో మరిన్ని పునర్దర్శనాలు చేసేందుకని అక్కడినుండి బయల్దేరారు.

విస్తారమైన కోత

ఇప్పుడు ఈప్రాంతంలో యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్న వెయ్యికన్నా ఎక్కువ మంది గల దాదాపు వంద ఐసొలేటెడ్‌ గ్రూపులున్నాయి. లీమాలో మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నుండి పట్టా తీసుకున్నవారు ఈగుంపులను సంఘాలుగా వృద్ధి చేసేందుకు పంపించబడుతున్నారు. అబద్ధ మతానికీ, మూఢనమ్మకాలకూ ఎంతోకాలంగా బందీలుగా ఉన్న సహృదయులైన వ్యక్తులు, రాజ్య సువార్త ద్వారా స్వతంత్రులయ్యారు! (యోహాను 8:​32) సత్యపు జలాల కోసం వారికున్న దప్పిక తీర్చబడుతోంది.

[10వ పేజీలోని చిత్రం]

టిటికాకా సరస్సులోని “తేలుతున్న” దీవుల్లో సాక్ష్యమివ్వడం