కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?

దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?

దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?

“ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.”​—1 యోహాను 4:19.

1, 2. (ఎ) మనం ప్రేమించబడుతున్నామని తెలుసుకోవడం మనకు ఎందుకు ప్రాముఖ్యం? (బి)మనకు ఎవరి ప్రేమ అత్యంత ఆవశ్యకం?

మీరు ప్రేమించబడుతున్నారని తెలుసుకోవడం మీకెంత ప్రాముఖ్యం? పసితనం నుండి వార్ధక్యం వరకూ మానవులు ప్రేమ మూలంగానే వృద్ధిచెందుతారు. తన తల్లి మమతానురాగాల ఒడిలో ఒదిగి ఉన్న బిడ్డను మీరెప్పుడైనా గమనించారా? తన చుట్టూ ఏమి జరుగుతున్నా ఆపసిబిడ్డ చిరునవ్వులు చిందించే తన తల్లి కళ్ళలోకి చూస్తూ, తనను ఎంతో ప్రేమించే తన తల్లి ఒడిలో హాయిగా ప్రశాంతంగా పడుకుంటుంది. లేదా, కల్లోలభరితమైన యుక్తవయస్సులో కొన్నిసార్లు మీరెలా భావించారో మీకు గుర్తుందా? (1 థెస్సలొనీకయులు 2:⁠7) కొన్నిసార్లు, అసలు మీకేమి కావాలో, చివరికి మీరెలా భావిస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు, అయినప్పటికీ మీతల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! మీకు ఏసమస్య ఎదురైనా, ఏసందేహమొచ్చినా సహాయం కోసం నిస్సంకోచంగా వారి దగ్గరికి వెళ్ళగలగడం మీకు సహాయకరంగా అనిపించలేదా? నిజంగా, జీవితమంతటిలో మనకుండే అతిగొప్ప అవసరత ప్రేమించబడడమే. అలాంటి ప్రేమ మనకు విలువుందని ధ్రువీకరిస్తుంది.

2 నిరంతరం నిలిచే తల్లిదండ్రుల ప్రేమ సరైన ఎదుగుదలకు, సమతుల్యానికి తప్పక దోహదపడుతుంది. అయితే, మన పరలోక తండ్రి అయిన యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని దృఢ నమ్మకం కలిగివుండడం మన ఆధ్యాత్మిక, మానసిక సంక్షేమానికి ఎంతో ఆవశ్యకం. ఈపత్రిక చదివే కొందరు పాఠకులకు, తమపట్ల నిజంగా శ్రద్ధ చూపించే తల్లిదండ్రులు లేకపోవచ్చు. మీపరిస్థితి కూడా అలాంటిదే అయితే, అధైర్యపడకండి. తల్లిదండ్రుల ప్రేమ మీకు లభించకపోయినా లేక కొరవడినా, దేవుని యథార్థమైన ప్రేమ దాన్ని భర్తీ చేస్తుంది.

3. యెహోవా తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ గురించి వారికెలా అభయమిచ్చాడు?

3 ఒక తల్లి, పాలుకుడిచే తన చంటిబిడ్డను ‘మరువ’ గలదు గానీ తాను తన ప్రజలను మరువనని యెహోవా తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేశాడు. (యెషయా 49:​15) అదే విధంగా, దావీదు దృఢనమ్మకంతో ఇలా చెప్పాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:​10) ఊరట కలిగించే ఎంత చక్కని మాటలవి! మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మీరు యెహోవా దేవునితో సమర్పిత సంబంధంలోకి ప్రవేశించినట్లైతే, ఆయనకు మీపట్ల ఉన్న ప్రేమ ఏమానవునికైనా ఉండగల ప్రేమకన్నా ఎంతో ఉన్నతమైనదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి!

దేవుని ప్రేమలో నిలిచివుండండి

4. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు దేవుని ప్రేమ గురించి ఎలా అభయమివ్వబడింది?

4 మీరు యెహోవా ప్రేమ గురించి మొదట ఎప్పుడు తెలుసుకున్నారు? బహుశా మీఅనుభవం కొంతమేరకు మొదటి శతాబ్దపు క్రైస్తవుల అనుభవం వంటిదే కావచ్చు. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయం, ఒకప్పుడు దేవునికి దూరమైవున్న పాపులు ఎలా యెహోవా ప్రేమకు చేరువయ్యారో రమ్యంగా వివరిస్తుంది. ఐదవ వచనంలో మనమిలా చదువుతాము: “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.” ఎనిమిదవ వచనంలో పౌలు ఇంకా ఇలా చెబుతున్నాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”

5. దేవుని ప్రేమ విస్తృతిని మీరెలా గ్రహించారు?

5 అదే విధంగా, దేవుని వాక్యం నుండి సత్యం మీకు అందజేయబడి, మీరు విశ్వసించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా పరిశుద్ధాత్మ మీహృదయంలో పని చేయనారంభించింది. మీకోసం మరణించడానికి తన ప్రియ కుమారుడ్ని పంపించడం ద్వారా యెహోవా తీసుకున్న చర్య యొక్క గంభీరతను మీరు గ్రహించడం మొదలుపెట్టారు. తాను మానవజాతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవడానికి యెహోవా ఆవిధంగా మీకు సహాయం చేశాడు. మీరు ఆయన నుండి దూరమైన పాపిగా జన్మించినప్పటికీ, మానవులు నిత్యజీవ నిరీక్షణతో నీతిమంతులుగా తీర్చబడేందుకు యెహోవా ఒక మార్గాన్ని తెరిచాడని మీరు గ్రహించినప్పుడు, మీహృదయం పులకించలేదా? మీకు యెహోవా అంటే ప్రేమ జనించలేదా?​—⁠రోమీయులు 5:10.

6. మనం యెహోవా నుండి కొంతమేరకు దూరమైపోయినట్లు కొన్నిసార్లు మనకెందుకు అనిపిస్తుంది?

6 మీరు మీ పరలోక తండ్రి ప్రేమకు ఆకర్షితులై, ఆయనకు అంగీకృతమయ్యేలా మీజీవితాన్ని సరిచేసుకుని, ఆయనకు సమర్పించుకున్నారు. ఇప్పుడు మీకు దేవునితో సమాధానం ఉంది. అయినప్పటికీ, కొన్నిసార్లు మీరు యెహోవా నుండి దూరమైపోయినట్లు భావిస్తున్నారా? మనలో ఎవరికైనా అలా అనిపించవచ్చు. అయితే, దేవుడు ఎన్నడూ మారడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఆయన ప్రేమ, భూమిపై తన వెచ్చని కిరణాలను ప్రసరించడం ఎన్నడూ మానుకోని సూర్యుడంత ఎడతెగనిది, నిశ్చలమైనది. (మలాకీ 3:6; యాకోబు 1:​17) మరో వైపున, తాత్కాలికంగానే అయినప్పటికీ మనమే మారే అవకాశం ఉంది. భూమి పరిభ్రమిస్తుండగా, సగ భాగం అంధకారంగా ఉంటుంది. అలాగే, మనం కొంతమేరకే అయినా దేవుని నుండి దూరమైపోతే, ఆయనతో మనకున్న సంబంధం దెబ్బతింటుంది. ఆపరిస్థితిని సరిచేసుకోవడానికి మనం ఏమి చేయవచ్చు?

7. దేవుని ప్రేమలో నిలిచివుండడానికి ఆత్మ పరిశీలన మనకెలా సహాయం చేయగలదు?

7 దేవుని ప్రేమనుండి మనం దూరమైపోయినట్లు అనిపిస్తే, మనల్ని మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘దేవుని ప్రేమను నేను విలువైనదిగా ఎంచడం లేదా? విశ్వాసం సన్నగిల్లుతోందని వివిధ రకాలుగా చూపిస్తూ నేను క్రమంగా సజీవుడైన ప్రేమామయుడైన దేవుని నుండి కొంతమేరకు దూరం వెళ్ళిపోయానా? నేను నా మనస్సును “ఆత్మవిషయముల” మీద నిలిపే బదులు “శరీరవిషయముల” మీద నిలుపుతున్నానా?’ (రోమీయులు 8:5-8; హెబ్రీయులు 3:​12) మనం యెహోవా నుండి దూరమైపోయినట్లైతే, అవసరమైన సర్దుబాట్లు చేసుకుని తిరిగి ఆయనతో సన్నిహితమైన వాత్సల్యపూరితమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం తగిన చర్యలు తీసుకోవాలి. యాకోబు మనల్నిలా ఉద్బోధిస్తున్నాడు: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:⁠8) యూదా చెబుతున్న ఈమాటలనూ వినండి: “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, ... దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.”​—⁠యూదా 20, 21.

మారిన పరిస్థితులు దేవుని ప్రేమను ప్రభావితం చేయవు

8. మన జీవితాల్లో ఏమార్పులు హఠాత్తుగా సంభవించవచ్చు?

8 ఈ విధానంలో మన జీవితం అనేక మార్పులకు గురవుతుంది. మనందరి జీవితాల్లోనూ కొన్ని సంఘటనలు ‘కాలవశముచేతనూ అనూహ్యంగానూ’ సంభవిస్తాయని సొలొమోను రాజు పేర్కొన్నాడు. (ప్రసంగి 9:​11, NW) హఠాత్తుగా మన జీవితం పూర్తిగా మారిపోవచ్చు. ఒక రోజు మనం ఆరోగ్యంగా ఉంటాం, మరునాడు తీవ్రమైన అనారోగ్యానికి గురికావచ్చు. ఒకరోజు మన ఉద్యోగం చాలా స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మరునాడు మనం నిరుద్యోగులం కావచ్చు. ఏహెచ్చరికా లేకుండా మరణం మనకు ప్రియమైనవారిని పొట్టనబెట్టుకోవచ్చు. ఒక దేశంలోని క్రైస్తవులు కొంతకాలం పాటు ప్రశాంతమైన పరిస్థితులను ఆనందించవచ్చు, కానీ హఠాత్తుగా తీవ్రమైన హింసాకాండ చెలరేగవచ్చు. బహుశా మనం నిందించబడవచ్చు, దాని మూలంగా మనం కొంత అన్యాయానికి గురికావచ్చు. అవును, జీవితం సుస్థిరమైనది కాదు లేదా అది పూర్తిగా భద్రతగలది కాదు.​—⁠యాకోబు 4:13-15.

9. రోమీయులకు వ్రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో కొంతభాగాన్ని పరిశీలించడం ఎందుకు మంచిది?

9 విషాదకరమైన విషయాలు జరిగినప్పుడు, మనం ఒంటరివారమైనట్లు భావిస్తూ, దేవునికి మన మీద ప్రేమ తగ్గిపోయిందని కూడా మనం ఊహించుకోవచ్చు. మనకందరికీ అలా జరిగే అవకాశం ఉంది గనుక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలోవున్న ఆయన ఓదార్పుకరమైన మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆమాటలు ఆత్మాభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడ్డాయి. అయినప్పటికీ, సూత్రబద్ధంగా అవి వేరే గొఱ్ఱెలకు చెందిన వారికి కూడా వర్తిస్తాయి, వీరు క్రైస్తవపూర్వ కాలంలోని అబ్రాహాములా దేవుని స్నేహితులుగా నీతిమంతులని తీర్చబడ్డారు.​—⁠రోమీయులు 4:20-22; యాకోబు 2:21-23.

10, 11. (ఎ) దేవుని ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులు కొన్నిసార్లు ఎలాంటి ఆరోపణలు చేస్తారు? (బి)అలాంటి ఆరోపణలను క్రైస్తవులు ఎందుకు అంతగా పట్టించుకోరు?

10రోమీయులు 8:31-34 చదవండి. పౌలు ఇలా అడుగుతున్నాడు: “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” నిజమే, సాతాను అతని దుష్టలోకం మనకు విరోధంగా ఉన్నారు. దేశ న్యాయస్థానాలలో సహితం శత్రువులు మనపై నిందారోపణలు చేయవచ్చు. కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే వైద్యపద్ధతులను అంగీకరించేందుకూ, అన్యమత ఆచారాల్లో పాల్గొనేందుకూ తమ పిల్లలను అనుమతించనందువల్ల వారు తమ పిల్లలను ప్రేమించడం లేదని నిందించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 2 కొరింథీయులు 6:​14-16) ఇతర నమ్మకమైన క్రైస్తవులు, యుద్ధాల్లో తమ తోటి మానవులను చంపనందుకు లేక రాజకీయాల్లో పాల్గొననందుకు దేశద్రోహులుగా నిందించబడ్డారు. (యోహాను 17:​16) యెహోవా సాక్షులు ప్రమాదకరమైన తెగవారని కూడా నిందారోపణలు చేస్తూ కొందరు వ్యతిరేకులు ప్రసార మాధ్యమాల ద్వారా అబద్ధాలను వ్యాప్తిచేశారు.

11 కానీ, అపొస్తలుల దినాల్లో “మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు” అని చెప్పబడిందని మరచిపోకండి. (అపొస్తలుల కార్యములు 28:​22) అబద్ధ ఆరోపణలు నిజంగా పట్టించుకోదగినవేనా? క్రీస్తు బలియందు నిజమైన క్రైస్తవులకున్న విశ్వాసం ఆధారంగా వారిని నీతిమంతులుగా తీర్చేది దేవుడే. యెహోవా తన ఆరాధకుల కోసం తానివ్వగల అత్యంత అమూల్యమైన బహుమానాన్ని అంటే తన సొంత ప్రియకుమారుడ్నే ఇచ్చాడు కదా, మరి తర్వాత ఆయనెందుకు వారిని ప్రేమించడం మానేస్తాడు? (1 యోహాను 4:​10) క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు గనుక, ఆయన క్రైస్తవుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు తన అనుచరులను సమర్థిస్తూ చేసే ఆవిజ్ఞాపన సరైనది కాదని ఎవరు న్యాయంగా నిరూపించగలరు లేదా దేవుడు తన నమ్మకమైన సేవకుల పట్ల కలిగివున్న అభిప్రాయాన్ని సహేతుకంగా ఎవరు సవాలు చేయగలరు? ఎవ్వరి తరంకాదు!​—⁠యెషయా 50:8, 9; హెబ్రీయులు 4:15, 16.

12, 13. (ఎ) ఎలాంటి పరిస్థితులు మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు? (బి)మనకు కష్టపరిస్థితులను తీసుకురావడంలో సాతాను ఉద్దేశం ఏమిటి? (సి)క్రైస్తవులు ఎందుకు సంపూర్ణంగా విజయవంతులవుతారు?

12రోమీయులు 8:35-37 చదవండి. మనకై మనం దూరమైతే తప్ప, యెహోవా ప్రేమ నుండి, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని మరెవరైనా ఎడబాపగలరా లేక ఏదైనా ఎడబాపగలదా? క్రైస్తవులను శ్రమపెట్టడానికి సాతాను భూసంబంధీకులైన తన ప్రతినిధులను ఉపయోగించుకోవచ్చు. గత శతాబ్దంలో, అనేక దేశాల్లో మన క్రైస్తవ సహోదర సహోదరీలు చాలామంది తీవ్రంగా హింసించబడ్డారు. నేడు కొన్ని ప్రాంతాల్లో, మన సహోదరులు అనుదినం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆకలి బాధలను అనుభవిస్తున్నారు లేదా సరైన కట్టుబట్టలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈకష్ట పరిస్థితులను తీసుకురావడంలో సాతాను లక్ష్యం ఏమిటి? యెహోవా సత్యారాధనను నిరుత్సాహపరచాలన్నది అతని ఉద్దేశాల్లో ఒకటి. దేవుని ప్రేమ చల్లారిందని మనల్ని నమ్మించాలన్నది సాతాను కోరిక. అయితే, అలా జరిగిందా?

13కీర్తన 44:⁠22ను ఎత్తి వ్రాసిన పౌలు వలె, మనం దేవుని లిఖిత వాక్యాన్ని అధ్యయనం చేశాము. ఆయన “గొఱ్ఱెల”మైన మనం, దేవుని నామము మూలంగా ఇవన్నీ ఎదుర్కొంటున్నామని మనకు అర్థమవుతోంది. దేవుని నామము పరిశుద్ధపరచబడడం, ఆయన విశ్వసర్వాధిపత్యం యొక్క న్యాయనిరూపణ దాంట్లో ఇమిడి ఉన్నాయి. అలాంటి ప్రాముఖ్యమైన వివాదాంశాల మూలంగానే దేవుడు కఠిన పరీక్షలను అనుమతించాడు గానీ ఆయనకు మనమంటే ప్రేమలేక కాదు. మనం ఎంత వేదనకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నా, మనలో ప్రతి ఒక్కరితో సహా తన ప్రజల పట్ల దేవుని ప్రేమ మారలేదని మనకు దృఢనిశ్చయత ఇవ్వబడుతోంది. మనం ఓడిపోతున్నామనిపించే ఎటువంటి అనుభవమైనా, మన యథార్థతను కాపాడుకుంటే విజయంగా మారుతుంది. మనపై దేవునికున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఇవ్వబడుతున్న హామీని బట్టి మనం బలపరచబడతాము, ప్రోత్సహించబడతాము.

14. క్రైస్తవులు కష్టాలు అనుభవించవలసి వచ్చినప్పటికీ, పౌలు దేవుని ప్రేమపై ఎందుకు దృఢనమ్మకాన్ని కలిగివున్నాడు?

14రోమీయులు 8:38, 39 చదవండి. దేవుని ప్రేమనుండి క్రైస్తవులను ఏదీ ఎడబాపలేదని పౌలుకు నమ్మకమెలా కలిగింది? దేవునికి మనపట్ల ఉన్న ప్రేమను మనమెదుర్కొనే కష్టాలు ప్రభావితం చేయలేవన్న పౌలు దృఢనమ్మకాన్ని, పరిచర్యలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు బలపరిచాయనడంలో సందేహం లేదు. (2 కొరింథీయులు 11:23-27; ఫిలిప్పీయులు 4:​13) అంతేగాక, యెహోవా నిత్య సంకల్పం గురించీ, ఆయన తన ప్రజలతో వ్యవహరించిన విధానం గురించీ పౌలుకు తెలుసు. యథార్థంగా ఆయన సేవ చేసిన వారి ఎడల దేవునికున్న ప్రేమను మరణమైనా జయించగలదా? అసంభవం! అలా మరణించే నమ్మకమైనవారు దేవుని పరిపూర్ణమైన స్మృతిలో నిలిచివుంటారు, తగిన సమయంలో వారిని ఆయన పునరుత్థానం చేస్తాడు.​—⁠లూకా 20:37, 38; 1 కొరింథీయులు 15:22-26.

15, 16. దేవుడు తన నమ్మకమైన సేవకులను ప్రేమించడాన్ని ఎన్నడూ ఆపలేని కొన్ని విషయాలను తెలియజేయండి.

15 పెద్ద దుర్ఘటనే కానీయండి, ప్రాణాలు పోయే వ్యాధే కానీయండి, లేక ఆర్థిక సంక్షోభమే కానీయండి నేడు జీవితం మనకు ఎలాంటి కష్టాలను తెచ్చినా సరే దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఏదీ నాశనం చేయలేదు. సాతానుగా మారిన అవిధేయుడైన దేవదూత వంటి శక్తిమంతులైన దేవదూతలు, భక్తిపరులైన తన సేవకులను ప్రేమించకుండా యెహోవాను ప్రభావితం చేయలేరు. (యోబు 2:⁠3) ప్రభుత్వాలు దేవుని సేవకులను నిషేధించవచ్చు, జైళ్ళలో పెట్టవచ్చు, వారితో దురుసుగా ప్రవర్తించవచ్చు, వారిని “పర్సోనా నాన్‌ గ్రాటా” [ఆమోదయోగ్యం కాని వ్యక్తులు] అని ముద్ర వేయవచ్చు. (1 కొరింథీయులు 4:​13) దేశాలు చూపించే అలాంటి అన్యాయమైన ద్వేషం, మానవులు మనకు వ్యతిరేకంగా మారేలా ఒత్తిడి తేగలదేమో గానీ విశ్వ సర్వాధిపతి మనల్ని ఎడబాపేలా మాత్రం చేయలేదు.

16 “ఉన్నవి” అని పౌలు పేర్కొన్న ఈ ప్రస్తుత విధానంలోని సంఘటనలు, సందర్భాలు, పరిస్థితులే గానీ, లేక “రాబోవునవి” అయిన భవిష్యత్‌ పరిస్థితులే గానీ దేవుడ్ని ఆయన ప్రజల నుండి దూరం చేస్తాయేమోనని భయపడవలసిన అవసరం క్రైస్తవులుగా మనకు లేదు. భూసంబంధమైన, పరలోకసంబంధమైన శక్తులు మనతో యుద్ధం చేసినా, దేవుని యథార్థమైన ప్రేమ మనల్ని బలపరుస్తుంది. పౌలు నొక్కి చెప్పినట్లుగా, “ఎత్తయినను లోతైనను” దేవుని ప్రేమను మరుగుచేయలేదు. అవును, మనల్ని నిరుత్సాహపరిచేదేదైనా, లేదా మనపై అధిక ప్రభావాన్ని చూపించేదేదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు; సృష్టికర్తకు తన నమ్మకమైన సేవకులతో ఉన్న సంబంధాన్ని మరే సృష్టమూ భంగపర్చలేదు. దేవుని ప్రేమ ఎన్నడూ విఫలం కాదు; అది శాశ్వతకాలం ఉంటుంది.​—⁠1 కొరింథీయులు 13:⁠8.

దేవుని కృపను నిరంతరం విలువైనదిగా ఎంచండి

17. (ఎ) దేవుని ప్రేమను పొందడం ఎందుకు “జీవముకంటె ఉత్తమము”? (బి)మనం దేవుని కృపను విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపిస్తాము?

17 దేవుని ప్రేమ మీకు ఎంత ప్రాముఖ్యమైనది? “నీ కృప జీవముకంటె ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ... కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను; నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను” అని వ్రాసిన దావీదులా మీరు భావిస్తారా? (కీర్తన 63:​3,6) నిజంగా, దేవుని ప్రేమనూ, యథార్థమైన ఆయన స్నేహాన్నీ ఆనందించడం కంటే మిన్నయైన దేన్నైనా ఈలోకంలోని జీవితం మనకివ్వగలదా? ఉదాహరణకు, దేవునితోగల సన్నిహిత సంబంధం ఫలితంగా లభించే మనశ్శాంతి, సంతోషాలకంటే లాభదాయకమైన లౌకిక ఉద్యోగాన్ని సంపాదించుకోవడం మిన్నయా? (లూకా 12:​15) కొంతమంది క్రైస్తవులు యెహోవాను విడనాడడమా లేక ప్రాణాలు కోల్పోవడమా అనే క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో అనేకమంది యెహోవాసాక్షుల విషయంలో అదే జరిగింది. చాలా కొద్దిమంది మినహాయించి, మన క్రైస్తవ సహోదరులు అవసరమైతే మరణించడానికైనా వెనుకాడక దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ఎంపిక చేసుకున్నారు. ఆయన ప్రేమలో యథార్థంగా నిలిచి ఉండేవారు, ఈలోకం ఇవ్వలేని నిత్య జీవాన్ని దేవుడిస్తాడనే దృఢనమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. (మార్కు 8:​34-36) అయితే, దాంట్లో నిత్యజీవం పొందడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది.

18. నిత్యజీవం ఎందుకంత కోరదగినది?

18 మన సృష్టికర్తయైన యెహోవా లేకుండా నిరంతరం జీవించడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఆయన లేకుండా అతిసుధీర్ఘమైన జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించండి. నిజమైన సంకల్పమనేది లేకుండా అది శూన్యంగా ఉంటుంది. యెహోవా తన ప్రజలకు ఈఅంత్యదినాల్లో సంతృప్తికరమైన పనిని ఇచ్చాడు. గొప్ప సంకల్పకర్తయైన యెహోవా నిత్యజీవాన్ని అనుగ్రహించినప్పుడు, అది మనం నేర్చుకోవలసిన, చేయవలసిన, అద్భుతమైన, ప్రయోజనకరమైన విషయాలతో నిండివుంటుందని మనం విశ్వసించవచ్చు. (ప్రసంగి 3:​11) రానున్న సహస్రాబ్దాలలో మనం ఎంత నేర్చుకున్నప్పటికీ, మనం “దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము”ను ఎన్నటికీ సంపూర్ణంగా గ్రహించలేము.​—⁠రోమీయులు 11:33.

తండ్రికి మీరంటే ప్రేమ ఉంది

19. యేసు క్రీస్తు తాను వెళ్ళే ముందు తన శిష్యులను ఎలా ధైర్యపరిచాడు?

19 యేసు సా.శ.33 నీసాను 14న తన పదకొండు మంది నమ్మకమైన అపొస్తలులతో తన చివరి సాయంకాలాన్ని గడుపుతున్నప్పుడు, రానున్న దాని కోసం వారిని బలపర్చడానికి వారికి అనేక విషయాలు తెలియజేశాడు. వారందరూ యేసు శోధనలలో ఆయనతో కూడా ఉన్నారు, వారు తమ పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తిగతంగా చవిచూశారు. (లూకా 22:​28-30; యోహాను 1:​16; 13:⁠1) తర్వాత యేసు వారినిలా ధైర్యపరిచాడు: “తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.” (యోహాను 16:​27) తమ పరలోక తండ్రికి తమపట్ల ఉన్న ప్రేమపూర్వకమైన భావాలను గుర్తించడానికి ఆమాటలు శిష్యులకు ఎంతగా సహాయం చేసి ఉంటాయో కదా!

20. మీరేమి చేయడానికి నిశ్చయించుకున్నారు, మీరు దేనియందు నమ్మకం కలిగివుండగలరు?

20 ప్రస్తుతం సజీవంగా ఉన్న అనేకులు దశాబ్దాలపాటు నమ్మకంగా యెహోవా సేవ చేశారు. ఈదుష్ట విధానపు అంతానికి ముందు మనం మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొంటామనడంలో సందేహం లేదు. అలాంటి పరీక్షలు లేక బాధలు, దేవునికి మీపట్ల ఉన్న యథార్థమైన ప్రేమను శంకించేలా చేసేందుకు అనుమతించకండి. ఈవాస్తవాన్ని ఇంతకన్నా నొక్కి చెప్పడం కష్టం: యెహోవాకు మీరంటే ప్రేమ ఉంది. (యాకోబు 5:​11) మనలో ప్రతి ఒక్కరం మన వంతు ప్రయత్నం మనం చేస్తూ, దేవుని ఆజ్ఞలను యథార్థంగా అనుసరిద్దాం. (యోహాను 15:​8-10) యెహోవా నామమును స్తుతించడానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ప్రార్థనలోనూ, ఆయన వాక్య అధ్యయనంలోనూ ఆయనకు సన్నిహితమవ్వడంలో కొనసాగాలన్న మన దృఢనిశ్చయాన్ని మనం బలపరచుకోవాలి. యెహోవాను ప్రీతిపరచడానికి మనం చేయగలిగినదంతా మనం చేస్తుంటే, రేపేమి జరిగినా, ఆయన కచ్చితమైన ప్రేమపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగివుండి ప్రశాంతంగా ఉంటాము.​—⁠2 పేతురు 3:14.

మీరేమని జవాబిస్తారు?

• మనం మన ఆధ్యాత్మిక, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రాముఖ్యంగా మనకు ఎవరి ప్రేమ అవసరం?

• యెహోవా తన సేవకులను ప్రేమించడాన్ని ఏవిషయాలు ఎన్నడూ ఆపలేవు?

• యెహోవా ప్రేమను పొందడం, ఎందుకు “జీవముకంటె ఉత్తమము”?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రాలు]

మనం దేవుని ప్రేమ నుండి దూరమైనట్లు మనకు అనిపిస్తుంటే, విషయాలను సరిదిద్దుకోవడానికి మనం కృషి చేయవచ్చు

[15వ పేజీలోని చిత్రం]

పౌలు తాను ఎందుకు హింసించబడుతున్నాడో అర్థం చేసుకున్నాడు