కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన శక్తిమేరకు మనం చేద్దాం!

మన శక్తిమేరకు మనం చేద్దాం!

మన శక్తిమేరకు మనం చేద్దాం!

“మీశక్తిమేరకు మీరు చేయండి” యెహోవా సాక్షుల పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఒక మిషనరీకి ఆఆచరణాత్మకమైన సలహాను ఇచ్చాడు. అనుభవజ్ఞుడైన ఒక పరిచారకునికి అలాంటి ప్రాథమికమైన సలహాను ఎందుకివ్వాల్సి వచ్చింది? చాలామంది మిషనరీలు అనుదినం పురుగులు, పాములు, అత్యధిక ఉష్ణోగ్రత, వ్యాధులు, వివిధ కష్టాలు వంటివాటిని ఎదుర్కొనే ధైర్యశాలులు కాదా?

వాస్తవానికి యెహోవాసాక్షుల్లోని మిషనరీలు సర్వసామాన్యులైన స్త్రీపురుషులే, వారు యెహోవాపట్లా తమ పొరుగువారిపట్లా తమకు గల ప్రగాఢమైన ప్రేమ మూలంగా విదేశాల్లో సేవచేసేలా పురికొల్పబడిన క్రైస్తవులు. వారు బలం కోసం యెహోవాపై ఆధారపడుతూ, తమ శాయశక్తులా ఆయన సేవ చేయడానికి కృషి చేస్తున్నారు.​—⁠ఎఫెసీయులు 6:10.

మిషనరీ సేవ గురించి మరింతగా తెలుసుకోవడానికి, మనం పశ్చిమాఫ్రికాలోని విలక్షణమైన ఒక మిషనరీ గృహంలో ఒక రోజు గడుపుతున్నట్లుగా ఊహించుకుందాం.

మిషనరీ పనిలో ఒక రోజు

ఉదయం ఏడవుతోంది. దినవచనాన్ని పరిశీలించడంలో భాగం వహించడానికి మనం మిషనరీ గృహానికి సరిగ్గా సమయానికి చేరుకున్నాం. పదిమంది మిషనరీలు మనల్ని సాదరంగా ఆహ్వానించి, బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌పైన మనకు స్థలం ఏర్పాటు చేస్తారు. మనం వారితో పరిచయాలు చేసుకుంటుండగా, ఎన్నో సంవత్సరాల నుండి మిషనరీ సేవ చేస్తున్న ఒక సహోదరి తనకు పరిచర్యలో కలిగిన ఒక హాస్యభరితమైన అనుభవాన్ని మనకు చెప్పడం మొదలుపెడుతుంది. ఆరోజు దినవచనాన్ని పరిశీలించడానికి సమయమైందని ఛైర్మన్‌ గుర్తు చేయడంతో మన సంభాషణ ఆగిపోతుంది. దినవచన పరిశీలన ఫ్రెంచ్‌ భాషలో జరుగుతుంది. మనకు ఆభాష రాకపోయినప్పటికీ, విదేశాల నుండి వచ్చిన ఆమిషనరీలు ఈభాషను చక్కగా అభ్యసించారని వాళ్ళు వ్యక్తం చేస్తున్న విధానాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాము.

దినవచన పరిశీలన తర్వాత, హృదయపూర్వకంగా ప్రార్థించడం జరిగింది, ఆతర్వాత ఇక బ్రేక్‌ఫాస్ట్‌. మనం చక్కగా గిన్నె నిండుగా సీరియల్‌ తీసుకోగానే, మన ప్రక్కన కూర్చుని ఉన్న మిషనరీ దానిలో అరటిపండు ముక్కలు వేసుకోమని చెబుతాడు. మనకు అరటిపళ్ళు అంతగా ఇష్టంలేదని చెప్పడంతో, స్థానికంగా పండించే అరటిపళ్ళను ఒకసారి రుచి చూశారంటే ఇక వాటిని విడిచిపెట్టరని ఆయన హామీ ఇస్తాడు. దానితో మనం సీరియల్‌లో అరటిపండు ముక్కలు కొన్ని వేసుకుంటాము. ఆయన చెప్పింది అక్షరాలా నిజం! ఈఅరటిపళ్ళు చాలా రుచిగా, ఐస్‌క్రీమంత తియ్యగా ఉన్నాయి! మనకివ్వబడిన ఫ్రెంచ్‌ బ్రెడ్‌ను, మిషనరీ గృహం ఎదురు వీధిలోని ఒక దుకాణంలో ఈఉదయమే బేక్‌ చేశారని వాళ్ళు చెప్తారు.

బ్రేక్‌ఫాస్ట్‌ అయ్యాక, మనం ఆరోజు ఒక మిషనరీ జంటతో గడుపుతాము, వాళ్ళను మనం బెన్‌, కారెన్‌ అని పిలుద్దాం. పశ్చిమాఫ్రికాలోని ఈదేశంలో క్షేత్రం ఎంతో ఫలవంతంగా ఉందని మనం విన్నాం కాబట్టి అది ఎంత నిజమో తెలుసుకోవాలని ఆత్రుతతో ఉన్నాం.

మనం బస్టాపుకు చేరుకునే సరికి అక్కడో డజనుమంది బస్సుకోసం ఎదురుచూస్తున్నారు. కొంతసేపటికి, ఆమిషనరీ దంపతులు ఒక స్త్రీతోనూ, ఆమె కుమారునితోనూ బైబిలు అంశంపై ఉల్లాసవంతమైన చర్చను ప్రారంభించారు. మనకు ఫ్రెంచ్‌ రాదు గనుక ప్రక్కనే నిలబడి చిరునవ్వులు చిందించడం కంటే ఇంకేమీ చేయలేము! ఆస్త్రీ కావలికోట, తేజరిల్లు! పత్రికలు తీసుకుంటుండగా బస్సు వచ్చింది, అందరూ బస్సులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు, అదీ అందరూ కలిసి ఒకేసారి! మనం ఎలాగోలా బస్సులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా జనం మనల్ని వెనుక నుండి నెట్టుతున్నారు. బస్సు వెనుక భాగానికి క్షేమంగా చేరుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక డ్రైవరు బస్సు స్టార్ట్‌ చేయగానే మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలబడతాం. బస్టాపులో బస్సు ఆగిన ప్రతిసారి ఇంకా చాలామంది బస్సులోకి ఎక్కుతున్నారు. మనం తోటి ప్రయాణికులను చూసి పలకరింపుగా నవ్వినప్పుడు బదులుగా వాళ్ళూ దరహాసం చేస్తున్నారు. నోరువిప్పి వారితో మాట్లాడగలిగితే ఎంత బావుండు!

బస్సు వేగంగా వెళుతుండగా, కిటికీలో నుండి రద్దీగా ఉన్న వీధులు కనబడుతున్నాయి. ఇద్దరు స్త్రీలు తమ తలలపైన పెద్ద బరువులు పెట్టుకుని ప్రక్కప్రక్కన నడుస్తున్నారు. ఒకావిడ పెద్ద నీళ్ల డబ్బా తలపైన పెట్టుకుని నడుస్తోంది. ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన దుప్పటి పరిచి దాని మీద చిన్న చిన్న వస్తువులు అమ్మకానికి పెట్టాడు. ఎక్కడ చూసినా, క్రయవిక్రయం చేయగల ప్రతిదాన్ని ప్రజలు కొంటున్నారు, అమ్ముతున్నారు.

నా ప్రక్కన నిలబడివున్న బెన్‌ హఠాత్తుగా, ఏదో తన కాలును పొడుస్తోందని గమనించాడు. ఏమై ఉండవచ్చు? బస్సు జనంతో క్రిక్కిరిసివుండడం కారణమా, అదిగో మళ్ళీ. ఆయన ఎలాగోలా క్రిందికి చూడగలిగాడు. ఆయన కాళ్ళ దగ్గర ఒక సంచిలో ఓ బాతు ఉంది, అది సంచిలో నుండి తల బయటికి పెట్టి అడపాదడపా బెన్‌ కాలును పొడుస్తోంది! బహుశా దాన్ని అమ్మడానికి దాని యజమాని దాన్ని మార్కెట్‌కు తీసుకువెళుతుండవచ్చునని బెన్‌ అంటాడు.

మనం క్షేత్రానికి చేరుకోగానే, మనం అసలైన ఆఫ్రికా పరిసరాల్లోకి వెళ్ళబోతున్నామని తెలుసుకుని చాలా సంతోషించాము. మొదటి ఇంటికి చేరుకున్నాక, ఇంటి యజమానిని పిలువడానికి బెన్‌ శక్తినంతా ఉపయోగించి చప్పట్లు కొడతాడు. ప్రపంచంలోని ఈభాగంలో ప్రజలు “తలుపు తట్టేది” అలాగే. ఒక యౌవనస్థుడు బయటికి వచ్చి, ఇప్పుడు తాను పనిలో ఉన్నానని, కొంత సేపయ్యాక రమ్మని చెబుతాడు.

తర్వాతి ఇంట్లో, మనం ఒక స్త్రీని కలుస్తాము, ఆస్త్రీ మాట్లాడుతున్న మాండలికం బెన్‌కి అర్థంకాదు. ఆమె తన కుమారుడ్ని పిలిచి, బెన్‌ చెబుతున్నదేమిటో తనకు అనువదించి చెప్పమంటుంది. బెన్‌ చెప్పడం ముగించినప్పుడు, ఆస్త్రీ బైబిలు అంశంపైనున్న ఒక బ్రోషూరు తీసుకుంటుంది, దాన్ని ఆమెకు వివరిస్తానని ఆమె కుమారుడు మనకు హామీనిస్తాడు. మూడో ఇంట్లో కొంతమంది యౌవనస్థులు ఇంటి ముందరి వరండాలో కూర్చుని ఉంటారు. వారిలో ఇద్దరు వెంటనే లేచి నిలబడి మనకు తమ కుర్చీలు ఇస్తారు. ఆరాధనలో సిలువను ఉపయోగించడంపై ఉత్తేజవంతమైన చర్చ జరుగుతుంది. తర్వాతి వారంలో చర్చను కొనసాగించడానికి ఏర్పాట్లు చేయబడతాయి. మొదటి ఇంట్లో మనం కలిసిన, బిజీగా ఉన్న యౌవనస్థుని దగ్గరికి మళ్ళీ వెళ్ళవలసిన సమయం అయ్యింది. ఆవీధిలోనే ఉన్న ఇతర యౌవనస్థుల నుండి ఆయన మన చర్చ గురించి అప్పటికే ఎలాగో విన్నాడు. ఆయనకు ఎన్నో బైబిలు ప్రశ్నలున్నాయి, కాబట్టి బైబిలు అధ్యయనం కావాలని అడుగుతాడు. తన కాలెండర్‌లో చూసుకున్న తర్వాత, తర్వాతి వారం ఇదే సమయానికి తిరిగి రావడానికి బెన్‌ ఒప్పుకుంటాడు. తాము తమ బైబిలు అధ్యయనాలను చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలనీ లేకపోతే తాము నిర్వహించగలిగిన వాటికంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలను సుళువుగా మొదలుపెట్టేస్తామనీ బెన్‌, కారెన్‌ భోజనం చేయడానికి మిషనరీ గృహానికి తిరిగి వస్తుండగా అంటారు.

వాళ్ళు ఫ్రెంచి భాష అనర్గళంగా మాట్లాడగలుగుతున్నందుకు మనం వారిని ప్రశంసిస్తాము. తానూ, కారెన్‌ ఆరు సంవత్సరాల నుండి మిషనరీలుగా సేవ చేస్తున్నామనీ, కాబట్టి ఫ్రెంచ్‌ భాష బాగానే వచ్చనీ బెన్‌ చెబుతాడు. క్రొత్త భాష నేర్చుకోవడం అంత సులభమేమీ కాకపోయినప్పటికీ పట్టుదలకు తగిన ఫలితం లభిస్తోందని వారు దృఢంగా చెబుతారు.

పన్నెండున్నరకు, భోజనానికి మిషనరీలంతా బల్ల చుట్టూ కూర్చుంటారు. ఉదయం, మధ్యాహ్నం వంట చేయడం, అంట్లు తోమడం ప్రతి రోజు ఒక్కో మిషనరీకి అప్పగించబడుతుందని మనం తెలుసుకుంటాము. ఈరోజు ఒక మిషనరీ నోరూరించే కోడిమాంసం వేపుడు, ఆలుగడ్డల ఫ్రెంచ్‌ ఫ్రై సిద్ధంచేసి, టమాటా సలాడ్‌ చేసింది​—⁠దానిలో ఆమె సిద్ధహస్తురాలు!

బెన్‌, కారెన్‌ మధ్యాహ్నం ఏమి చేస్తారు? ఎండ వేడిని తప్పించుకునేందుకు మొత్తం దేశమంతా ఒంటిగంట నుండి మూడు గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటుంది, కాబట్టి మిషనరీలు సాధారణంగా ఆసమయాన్ని కాస్త కునుకు తీయడానికో, అధ్యయనం చేసుకోవడానికో ఉపయోగించుకుంటారని వారు చెబుతారు. ఈవిధమైన దినచర్యకు అలవాటు పడడానికి క్రొత్త మిషనరీలకు ఎక్కువ సమయం పట్టదని కారెన్‌ చెబుతుంటే మనకు నిజమే అనిపిస్తుంది!

కాస్త కునుకు తీశాక, మనం మళ్ళీ క్షేత్ర సేవకు బయలుదేరుతాము. ఆసక్తి చూపించిన ఒక వ్యక్తి ఈసారి కూడా ఇంటి దగ్గర లేడు, బెన్‌ ఆయనను కలవడానికి గతంలో కూడా ఇలాగే చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ ఈసారి బెన్‌ చప్పట్లు కొట్టినప్పుడు ఇద్దరు యౌవనస్థులు తలుపు దగ్గరికి వస్తారు. ఆఇంట్లో ఉండే వ్యక్తి, బెన్‌ వస్తాడనీ, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే బైబిలు సహాయక పుస్తకాన్ని తీసుకోమనీ తమకు పదే పదే చెప్పాడని వాళ్ళు తెలియజేస్తారు. మనం సంతోషంగా వాళ్ళకా పుస్తకాన్ని ఇస్తాము. తర్వాత మనం, ఆసక్తిగల ఒక స్త్రీతో కారెన్‌ బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్ళే బస్సు ఎక్కుతాము.

రద్దీగా ఉన్న వీధుల గుండా బస్సు వెళుతుండగా, కారెన్‌ తాను కొంతమంది ఇతర ప్రయాణీకులతో పాటు ఒకసారి టాక్సీలో వెళుతుండగా ఆస్త్రీని కలిశానని మనకు చెబుతుంది. ప్రయాణంలో చదవడానికి కారెన్‌ ఆస్త్రీకి ఒక కరపత్రం ఇచ్చింది. ఆస్త్రీ దాన్ని చదివేసి మరొకటి కావాలని అడిగింది. ఆకరపత్రాన్ని కూడా ఆమె మరింత ఆసక్తితో చదివింది. ప్రయాణం ముగింపులో, ఆస్త్రీని ఆమె ఇంటి వద్ద కలిసి దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషర్‌ నుండి ఫలవంతమైన బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కారెన్‌ ఏర్పాట్లు చేసుకుంది. ఈరోజు కారెన్‌ ఆబ్రోషర్‌లో నుండి ఐదవ పాఠం అధ్యయనం చేయబోతోంది.

మనం ఈరోజంతా క్షేత్రసేవలో చక్కగా ఆనందించాము, కానీ మిషనరీ సేవ గురించి మనకు ఇంకా కొన్ని ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత, మన కోసం కాస్త అల్పాహారం సిద్ధం చేసి, తర్వాత మన ప్రశ్నలకు సమాధానం ఇస్తామని మన అతిథేయులు మనకు నిశ్చయంగా చెబుతారు.

వాళ్ళు తమ వేగాన్ని కాపాడుకునే విధానం

కోడిగ్రుడ్ల వేపుడు, ఫ్రెంచ్‌ బ్రెడ్‌, ఛీస్‌ల కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ, మనం మిషనరీ జీవితం గురించి మరింత తెలుసుకుంటాము. సాధారణంగా మిషనరీలు సోమవారం విశ్రాంతి తీసుకుంటారు లేదా తమ వ్యక్తిగతమైన పనులు చక్కబెట్టుకుంటారు. చాలామంది మిషనరీలు ఆరోజున తమ కుటుంబాలకు, స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తారు. ఇంటి నుండి క్షేమసమాచారం తెలుసుకోవడం మిషనరీలకు చాలా ముఖ్యం, ఉత్తరాలు వ్రాయడమన్నా, అందుకోవడమన్నా వాళ్ళకు చాలా ఇష్టం.

మిషనరీలు చాలా దగ్గర దగ్గరగా నివసిస్తారు గనుక, వాళ్లు తోటి మిషనరీలతో కలిసిమెలిసి ఉండడం ద్వారా, వాళ్ళతో ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం ద్వారా మంచి సంబంధాలను కాపాడుకోవడం ఆవశ్యకం. అందుకే, మిషనరీలంతా వ్యక్తిగత బైబిలు అధ్యయనం క్రమంగా చేయడమే గాక, ప్రతి సోమవారం సాయంకాలం అందరూ కలిసి కావలికోట పత్రికతోపాటు బైబిలును అధ్యయనం చేస్తారు. వివిధ నేపథ్యాలు గల మిషనరీలు కలిసి జీవించినప్పుడు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనివార్యమే అయినప్పటికీ, కుటుంబ అధ్యయనమనే ఆధ్యాత్మిక ఏర్పాటు మిషనరీలు సమాధానకరమైన ఐక్య వాతావరణాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుందని బెన్‌ పేర్కొన్నాడు. మనకు మనం అధికంగా ప్రాధాన్యత నిచ్చుకోకుండా ఉండేందుకు కూడా అది సహాయం చేస్తుందని ఆయన నొక్కి చెబుతాడు.

నమ్రత కూడా ఆవశ్యకం. మిషనరీలు పంపించబడింది సేవ చేయించుకోవడానికి కాదు గానీ తామే ఇతరులకు సేవ చేయడానికి. “నన్ను క్షమించండి” అని చెప్పడం ఏభాషలోనైనా చాలా కష్టమే, ప్రాముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా పలికిన లేక చేసిన దానికి క్షమాపణలు చెప్పుకోవడం మరీ కష్టం అని మిషనరీలు అన్నారు. బెన్‌ మనకు బైబిలు ఉదాహరణ అయిన అబీగయీలు గురించి గుర్తు చేస్తాడు, ఆమె తన భర్త మూర్ఖపు ప్రవర్తనకు తాను క్షమాపణలు చెప్పుకుని, పెద్ద విపత్తుకు కారణమై ఉండగల ఒక పరిస్థితిని తప్పించింది. (1 సమూయేలు 25:​23-28) మంచి మిషనరీకి ఆవశ్యకమైన వాటిలో ‘సమాధానముగా ఉండగల’ సామర్థ్యం ఒకటి.​—⁠2 కొరింథీయులు 13:11.

నెలకొకసారి మిషనరీ కుటుంబానికి సంబంధించిన విషయాలను, అలాగే వారికి అప్పగించబడే పనుల మార్పును చర్చించడానికి మిషనరీలు ఒక సమావేశం జరుపుకుంటారు. ఆతర్వాత, అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన పిండివంటకాన్ని ఆరగిస్తారు. ఇది మనకు చాలా ఆచరణాత్మకమైన, రుచికరమైన ఏర్పాటులా అనిపిస్తుంది.

రాత్రి భోజనం ముగిశాక, మనం మిషనరీ గృహమంతా తిరిగి చూస్తాము. నిరాడంబరమైన ఇల్లే అయినా, మిషనరీలు పరస్పర సహకారంతో దాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకున్నట్లు మనం గమనిస్తాము. అక్కడ ఒక ఫ్రిజ్‌, ఒక వాషింగ్‌ మెషీన్‌, ఒక స్టౌ ఉన్నాయి. పశ్చిమాఫ్రికాలోని ఈదేశంవంటి ఉష్ణ దేశాల్లో, ఎయిర్‌ కండిషనర్‌ కూడా ఉంటుందని కారెన్‌ మనకు చెబుతుంది. అనుకూలమైన గృహవసతులు, పుష్టికరమైన ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన స్వల్పమైన ముందుజాగ్రత్తలు మిషనరీలు ఆరోగ్యంగా, ఫలవంతంగా ఉండేందుకు దోహదపడతాయి.

అనుకూల విషయాలపై మనస్సును కేంద్రీకరించండి

మనం చూసిన ప్రతిదీ మనపై ఎంతో ప్రభావాన్ని చూపింది. మనం కూడా మిషనరీ సేవ చేయగలమా? ఆవిషయాన్ని మనమెలా నిశ్చయించుకోవచ్చు? మన అతిథేయులు ఆలోచించుకోవడానికి మనకు కొన్ని విషయాలు తెలియజేస్తారు.

వారు మనకిలా చెబుతారు, మొదటగా, క్రైస్తవ మిషనరీలు ఏదో సాహసోపేతమైన కార్యాలు చేయడానికి చూడరు. దేవుని అద్భుతమైన వాగ్దానాల గురించి తెలుసుకోవాలని కోరుకునే యథార్థ హృదయుల కోసం వారు వెదుకుతారు. మిషనరీలు నెలకు కనీసం 140 గంటలు క్షేత్రసేవలో గడుపుతారు, కాబట్టి పరిచర్యపట్ల మక్కువ తప్పనిసరి.

‘మరి పాములు, బల్లులు, పురుగుల మాటేమిటీ’ అని మనం అనుకుంటాము. చాలా మిషనరీ నియామకాల్లో ఇవి ఉన్నప్పటికీ, మిషనరీలు వాటికి అలవాటు పడిపోతారని బెన్‌ మనకు చెబుతాడు. ప్రతి మిషనరీ నియామకానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది, కాలం గడుస్తుండగా, మిషనరీలు తమ నియామకంలోని అనుకూల విషయాలపై మనస్సును కేంద్రీకరిస్తారని ఆయన జతచేస్తాడు. మునుపు “భిన్నమైన” పరిస్థితులుగా పరిగణింపబడినవి, త్వరలోనే సర్వసామాన్యమైనవిగా అయిపోతాయి, కొన్నిసార్లయితే అవే ఆనందాన్నిచ్చేవిగా తయారవుతాయి. పశ్చిమాఫ్రికాలో అనేక సంవత్సరాలపాటు సేవ చేసిన ఒక మిషనరీ, తన వ్యక్తిగత బాధ్యతలవల్ల స్వదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, సంవత్సరాల క్రితం తన స్వదేశాన్ని వదిలి రావడం కంటే తన నియామకాన్ని వదిలి వెళ్ళడం తనకు ఎక్కువ కష్టంగా ఉందని అన్నది. ఆమెకు తన మిషనరీ నియామకమే తన స్వగృహమైపోయింది.

మీరు సిద్ధమేనా?

కారెన్‌, బెన్‌ మనం ఆలోచించుకునేందుకు అనేక విషయాలను తెలియజేశారు. మీవిషయమేమిటి? విదేశాల్లో మిషనరీగా సేవ చేయడం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి ఉంటే, మీరు ఊహించినదాని కన్నా ఇప్పుడు మీరు మీలక్ష్యానికి మరింత చేరువై ఉండవచ్చు. ప్రాథమిక ఆవశ్యకతలేమిటంటే, పూర్తికాల పరిచర్య పట్ల ఇష్టం, ప్రజలకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందడం. మిషనరీలంటే ఏదో సాహసవీరులు కాదుగానీ సామాన్యులైన స్త్రీ పురుషులేనని గుర్తుంచుకోండి. ఒక ప్రాముఖ్యమైన పనిని సాధించడానికి వారు, తాము చేయగలిగింది చేస్తున్నారు.

[27వ పేజీలోని చిత్రాలు]

ప్రతిరోజు బైబిలు లేఖన చర్చతో ప్రారంభమవుతుంది

[28, 29వ పేజీలోని చిత్రాలు]

మిషనరీగా జీవితం ఎంతో సంతృప్తిదాయకమైనదిగా ఉండగలదు

[29వ పేజీలోని చిత్రం]

ఆఫ్రికాలోని దృశ్యాలు