కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఈ లోకాన్ని మెరుగుపరచగలరా?

మీరు ఈ లోకాన్ని మెరుగుపరచగలరా?

మీరు ఈ లోకాన్ని మెరుగుపరచగలరా?

“విడిపోయిన సమాజ చట్రాన్ని తిరిగి బిగించే పనిని రాజకీయవ్యవస్థ మొదలుపెట్టలేదు. అది సాంప్రదాయక నైతిక నమ్మకాలను తిరిగి కలిగించేందుకు కావలసిన విధంగా సిద్ధపడి లేదు. ఎంత గొప్ప పథకాలైనా సరే, కోర్ట్‌షిప్‌లను వివాహజీవితాలను మెరుగుపరచలేవు. తండ్రులను పిల్లలకు జవాబుదారులుగా చేయలేవు, జరగకూడనిది జరిగినప్పుడు ఒకప్పటిలా విభ్రాంతిని కానీ, సిగ్గును కానీ కలిగించలేవు ... మనకు ఇబ్బంది కలిగించే అనేక నైతిక సమస్యలను చట్టం నిర్మూలించలేదు.”

మాజీ యు.ఎస్‌. ప్రభుత్వ సహాయకుడు చెప్పిన పై మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించినట్లయితే, అత్యాశ, కుటుంబాల్లో ప్రేమానురాగాలు లేకపోవడం, విచ్చలవిడితనం, అజ్ఞానం మొదలైనవాటి నుండీ, సమాజపు వ్యవస్థను తినివేస్తున్న మరితర హానికరమైనవాటి నుండీ నేడు పుట్టుకొస్తున్న అనేక సమస్యలకు పరిష్కారమేమిటి? కొందరు పరిష్కారమేమీ లేదని భావించి, తమకు చేతనైనంత మట్టుకు బాగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక రోజున, జనాన్నాకట్టుకునే శక్తీ, మేథా గల నాయకుడు బహుశా, ఒక మతనాయకుడు వచ్చి తమను సరైన దిశలోకి నడిపిస్తాడని మరి కొందరు ఆశిస్తారు.

వాస్తవానికి, రెండు వేల సంవత్సరాల క్రితంనాటి ప్రజలు, యేసుక్రీస్తును తమ రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు. ఎందుకంటే, దేవుడే ఆయనను పంపాడనీ ఆయన అందరికన్నా సమర్థుడైన పరిపాలకుడు కాగలడనీ వాళ్ళు గ్రహించారు. అయినప్పటికీ, యేసు వాళ్ళ ఉద్దేశాలను గ్రహించి, అక్కడ నుండి త్వరగా వెళ్ళిపోయాడు. (యోహాను 6:​14,15) “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని తర్వాత ఆయన ఒక రోమా అధిపతికి వివరంగా చెప్పాడు. (యోహాను 18:​36) అయితే యేసు దృఢంగా నిలబడినట్లు నిలబడేవారు నేడు చాలా తక్కువ, ఆయన అనుచరులమని చెప్పుకునే మత నాయకులు కూడా అలా నిలబడడం అరుదు. అలాంటివాళ్ళలో కొంతమంది తమకున్న పలుకుబడితో లోక పరిపాలకుల ద్వారానే గానివ్వండి, లేక తామే రాజకీయ అధికార స్థానాన్ని వహించడం ద్వారానే గానివ్వండి మొత్తానికి ఈలోకాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించారు. మనం 1960, 70ల కాలాన్ని చూస్తే అది కనిపిస్తుంది.

ఈ లోకాన్ని మెరుగుపరచేందుకు మతసంబంధ ప్రయత్నాలు

1960లలో, లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లోని కొందరు దైవశాస్త్రజ్ఞులు, పేదల పీడితుల న్యాయం కోసం పోరాడడం మొదలుపెట్టారు. ఆలక్ష్యం కోసం వారు, క్రీస్తును బైబిలు భావంలోనే కాక, రాజకీయ, ఆర్థిక భావంలో కూడా రక్షకుడిగా వ్యాఖ్యానించే లిబరేషన్‌ థియోలజీని రూపొందించారు. అమెరికాలో, నైతిక విలువలు పడిపోవడాన్ని గురించి ఎంతో ఆందోళన చెందిన అనేక మంది చర్చినాయకులు కలిసి మోరల్‌ మెజారిటీ అనే సంస్థను రూపొందించారు. దాని ఉద్దేశం, ఆరోగ్యకరమైన కుటుంబ విలువలను పెంపొందించే చట్టాలను రూపొందించగలవారు రాజకీయాధికార స్థానంలోకి వచ్చేలా చేయడం. అదేవిధంగా, అనేక ముస్లిము దేశాల్లోని గుంపులు కూడా ఖురానును నమ్మకంగా అనుసరించే ధోరణిని పెంపొందించడం ద్వారా అవినీతి దౌర్జన్యాలను నియంత్రించాలని ప్రయత్నించాయి.

ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందువల్ల ఈలోకం మెరుగుపడిందని మీరు నమ్ముతున్నారా? మొత్తమ్మీద నైతిక విలువలు అంతకంతకూ పడిపోతూనే ఉన్నాయని, లిబరేషన్‌ థియోలజీ ప్రబలంగా ఉన్న దేశాల్లో సహితం పేదలకు ధనికులకు మధ్య ఉన్న అంతరం అంతకంతకూ పెరుగుతూనే ఉందని వాస్తవాలు చూపిస్తున్నాయి.

అమెరికాలోని మోరల్‌ మెజారిటీ దాని ప్రముఖ లక్ష్యాలను సాధించలేకపోవడంతో, దాని స్థాపకుడైన జెర్రీ ఫాల్‌వెల్‌ ఆసంస్థను 1989 లో మూసేశాడు. దాని స్థానంలో వేరే సంస్థలు వచ్చాయి. అయినప్పటికీ, మోరల్‌ మెజారిటీ అన్న మాటను సృష్టించిన పాల్‌ వేరిచ్‌, “మనం రాజకీయాల్లో గెలిచినా, ప్రాముఖ్యమని మనం నమ్మే కార్యాచరణ విధానాలు మన గెలుపుల ద్వారా రూపొందడం లేదు” అని క్రిస్టియానిటీ టుడే అనే పత్రికలో వ్రాశాడు. “సంస్కృతి అంతకంతకూ విశాలమైన మురికి కూపముగా మారుతోంది. మనం ఎంతో నీచంగా దిగజారిపోయిన సంస్కృతిలో కూరుకుపోతున్నాం. అదెంత దిగజారిందంటే, అది రాజకీయ వ్యవస్థనే ముంచేస్తోంది” అని కూడా ఆయన వ్రాశాడు.

కాలమిస్టూ రచయితా అయిన కాల్‌ థామస్‌, రాజకీయాల ద్వారా సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న ప్రయత్నంలో తాను దేన్ని ప్రాథమిక వైఫల్యంగా దృష్టిస్తున్నాడో వెల్లడిచేస్తూ, “నిజమైన మార్పు ఒక్కొక్క వ్యక్తిలో రావాలి, ప్రతి ఎలక్షన్‌ జరిగిన తర్వాత వచ్చేది కాదు. ఎందుకంటే, మన ప్రాథమిక సమస్యలు ఆర్థికమైనవో, రాజకీయపరమైనవో కావు, అవి నైతికతకు, ఆధ్యాత్మికతకు సంబంధించినవి” అని అంటున్నాడు.

ప్రమాణాలు ఏమీ లేకుండా, ఏది తప్పో, ఏది సరైనదో ప్రజలు తమకు తామే నిర్ణయించుకునే లోకంలో నైతిక, ఆధ్యాత్మిక సమస్యలను మీరెలా పరిష్కరించుకుంటారు? మతవిశ్వాసమున్నా లేకపోయినా, పలుకుబడీ సదుద్దేశమూ గల ప్రజలు ఈలోకాన్ని నిజంగా మెరుగుపరచలేకపోతే, మరెవరు మెరుగుపరచగలరు? మనం తర్వాతి ఆర్టికల్‌ని చూసినప్పుడు, దానికి జవాబును కనుగొంటాం. వాస్తవానికి, జవాబు, నా రాజ్యము ఈలోకసంబంధమైనది కాదు అని యేసు ఎందుకన్నాడన్నదానిలోనే ఉంది.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

కవర్‌: మురికి నీరు: WHO/UNICEF photo; భూగోళం Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

పిల్లలు: UN photo; భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.