కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి

మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి

మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి

“నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”​—⁠సామెతలు 4:23.

1, 2. మనం మన హృదయాన్ని ఎందుకు భద్రముగా కాపాడుకోవాలి?

కరీబియన్‌లోని ఒక దీవిలో తుఫాను వచ్చి వెలిసిన తర్వాత ఒక వృద్ధుడు తన ఇంట్లో నుండి బయటికి వచ్చాడు. ఆయన తన చుట్టూ జరిగిన భీభత్సాన్ని చూస్తుండగా, దశాబ్దాలుగా తన గేటు దగ్గర నిటారుగా నిలబడిన ఒక మహావృక్షం నేలకొరిగి ఉండడాన్ని గమనించాడు. ‘అదెలా సాధ్యం, చుట్టుప్రక్కల ఉన్న చిన్న చెట్లు చక్కగా నిలిచివుండగా ఈమహావృక్షం ఇలా కూలిపోయిందే’ అని ఆయన ఆశ్చర్యపోయాడు. పడిపోయిన చెట్టు మోడు చూస్తే ఆయనకు విషయమేమిటో అర్థమైంది. దృఢంగా కనిపించిన ఆవృక్షం లోపలి నుండి పూర్తిగా కుళ్ళిపోయింది, పైకి కనిపించకుండా అంతర్గతంగా జరుగుతున్న ఆనాశనాన్ని తుపాను బహిర్గతం చేసింది.

2 క్రైస్తవ జీవిత విధానంలో సుస్థిరంగా వేళ్ళూని ఉన్నట్లు కనిపించే ఒక సత్యారాధకుడు విశ్వాస పరీక్షకు లొంగిపోవడం ఎంత విషాదకరం. “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు సరిగ్గానే చెబుతోంది. (ఆదికాండము 8:​21) అంటే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండకపోతే ఎంత మంచి హృదయమైనా చెడు చేసేలా మరులుకొల్ప బడవచ్చునని అర్థం. అపరిపూర్ణ మానవ హృదయం చెడుకు అతీతమైనది కాదు గనుక, “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అనే ఉపదేశాన్ని మనం గంభీరంగా తీసుకోవలసిన అవసరం ఉంది. (సామెతలు 4:​23) కాబట్టి మనం మన సూచనార్థక హృదయాన్ని భద్రముగా ఎలా కాపాడుకోవచ్చు?

క్రమమైన పరీక్షలు తప్పనిసరి

3, 4. (ఎ) అక్షరార్థ హృదయాన్ని గురించి ఎలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు? (బి)మన సూచనార్థక హృదయాన్ని పరిశోధించుకోవడానికి ఏమి సహాయం చేస్తుంది?

3 మీరు వైద్య పరీక్షల కోసం వైద్యుని దగ్గరికి వెళితే, ఆయన మీగుండెను పరీక్షిస్తుండవచ్చు. మీగుండెతో సహా మీసాధారణ ఆరోగ్యం మీరు సరైన పోషకపదార్థాలను తీసుకుంటున్నారని సూచిస్తోందా? మీరక్త పోటు ఎలా ఉంది? మీగుండె స్పందన సరిగ్గా, బలంగా ఉందా? మీరు తగినంత వ్యాయామం చేస్తున్నారా? మీగుండె అనవసరమైన ఒత్తిడికి లోనవుతోందా?

4 అక్షరార్థమైన హృదయానికి క్రమమైన వైద్యపరీక్షలు అవసరమైతే, మరి మీసూచనార్థక హృదయం మాటేమిటి? యెహోవా దాన్ని పరిశోధిస్తాడు. (1 దినవృత్తాంతములు 29:​17) కాబట్టి మనం కూడా దాన్ని పరిశోధించాలి. ఎలా? మనల్ని మనమిలా ప్రశ్నించుకోవడం ద్వారా: క్రమమైన వ్యక్తిగత అధ్యయనం ద్వారా, కూటాలకు హాజరు కావడం ద్వారా నా హృదయానికి తగినంత ఆధ్యాత్మిక ఆహారం లభిస్తోందా? (కీర్తన 1:1, 2; హెబ్రీయులు 10:​24,25) యెహోవా సందేశం ‘నా యెముకలలో మూయబడి మండుచున్నట్లున్న అగ్నివలె’ నా హృదయానికి ముఖ్యమైన విషయమై ఉండి, రాజ్యప్రకటన పనిలోనూ శిష్యులనుచేసే పనిలోనూ పాల్గొనేందుకు నన్ను ప్రేరేపిస్తోందా? (యిర్మీయా 20:9; మత్తయి 28:19, 20; రోమీయులు 1:​15,16) సాధ్యమైనప్పుడల్లా పూర్తికాల పరిచర్యలోని ఏదైనా ఒక ఏర్పాటులో పాల్గొంటూ నేను నా శాయశక్తులా కృషి చేయడానికి పురికొల్పబడుతున్నానా? (లూకా 13:​24) నేను నా సూచనార్థక హృదయాన్ని ఏవిధమైన వాతావరణానికి గురయ్యేలా చేసుకుంటున్నాను? సత్యారాధనలో ఐక్యమైవున్న హృదయాలుగల ఇతరులతో సహవసించడానికి ఇష్టపడుతున్నానా? (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:​33) ఏదైనా కొరత ఉంటే మనం వెంటనే గమనించి తగిన దిద్దుబాటు చర్యలు సత్వరంగా తీసుకుందాము.

5. విశ్వాస పరీక్షలు ఎలాంటి ఉపయోగకరమైన ఉద్దేశాన్ని నెరవేర్చగలవు?

5 మనకు సాధారణంగా విశ్వాస పరీక్షలు ఎదురవుతుంటాయి. మన హృదయ పరిస్థితిని గమనించడానికి అవి మనకు అవకాశాలనిస్తాయి. వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతున్న ఇశ్రాయేలీయులకు మోషే ఇలా చెప్పాడు: “నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.” (ద్వితీయోపదేశకాండము 8:⁠2) మనం అనూహ్యమైన పరిస్థితులను లేక శోధనలను ఎదుర్కొన్నప్పుడు జనించే భావాలను, కోరికలను లేక ప్రతిస్పందనలను బట్టి తరచూ మనం ఆశ్చర్యపోమా? యెహోవా మనం ఎదుర్కొనడానికి అనుమతించే శోధనలు, మనం మన లోపాలను గ్రహించేలా చేసి, మెరుగుపర్చుకోవడానికి మనకు అవకాశాన్నిస్తాయి. (యాకోబు 1:​2-4) మనం శోధనలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిస్పందించే విధానం గురించి మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడంలో ఎన్నడూ విఫలం కాకుండా ఉందాము!

మన మాటలు ఏమి వెల్లడి చేస్తాయి?

6. మనం మాట్లాడడానికి ఇష్టపడే విషయాలు మన హృదయాన్ని గురించి ఏమి వెల్లడి చేయగలవు?

6 మనం మన హృదయాల్లో ఏమి భద్రము చేసుకున్నామో మనమెలా నిర్ధారించుకోవచ్చు? యేసు ఇలా చెప్పాడు: “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:​45) మనం సాధారణంగా దేని గురించి మాట్లాడతామో అది, మన హృదయం కేంద్రీకృతమై ఉన్నదాన్ని చక్కగా సూచిస్తుంది. మనం తరచూ వస్తుదాయక విషయాల గురించి, లౌకిక సాఫల్యాల గురించి మాట్లాడతామా? లేదా మన సంభాషణలు తరచూ ఆధ్యాత్మిక విషయాలపై, దైవపరిపాలనా గమ్యాలపై కేంద్రీకృతమై ఉంటాయా? ఇతరుల పొరపాట్ల గురించి ప్రచారం చేసే బదులు, వాటిని ప్రేమపూర్వకంగా కప్పిపుచ్చడానికి ఇష్టపడుతున్నామా? (సామెతలు 10:​11,12) ఆధ్యాత్మిక, నైతిక సూత్రాల గురించి మాట్లాడే బదులు ఎక్కువగా మనం ప్రజల గురించి వారి జీవితాల్లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా? ఇతరుల వ్యక్తిగత విషయాల్లో మనం అనవసరమైన ఆసక్తిని చూపిస్తున్నామనడానికి ఇది ఒక సూచన కావచ్చా?​—⁠1 పేతురు 4:15.

7. యోసేపు పదిమంది సహోదరుల వృత్తాంతం నుండి, మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడం గురించి ఎటువంటి పాఠం నేర్చుకోవచ్చు?

7 ఒక పెద్ద కుటుంబంలో ఏమి జరిగిందో పరిశీలించండి. యాకోబు పదిమంది పెద్ద కుమారులు తమ తమ్ముడైన యోసేపును “క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.” ఎందుకు? అతడు తమ తండ్రికి ఇష్టమైన కుమారుడు కాబట్టి వాళ్ళు అతని మీద ఈర్ష్యపడ్డారు. తర్వాత, యోసేపుపై యెహోవా అనుగ్రహం ఉందనడానికి నిదర్శనంగా దేవుడు అతనికి కలలను అనుగ్రహించినప్పుడు, వాళ్ళు “అతనిమీద మరి పగపట్టిరి.” (ఆదికాండము 37:​4,5,11) క్రూరాతి క్రూరంగా వాళ్ళు తమ తమ్ముడ్ని బానిసగా అమ్మేశారు. తర్వాత, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు యోసేపును క్రూరమృగం చంపేసిందని చెప్పి తమ తండ్రిని మోసగించారు. యోసేపు సహోదరులు పదిమందీ ఆసందర్భంలో తమ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడంలో విఫలమయ్యారు. మనం ఇతరులను విమర్శించడానికి మొగ్గుచూపుతున్నామంటే, అది మన హృదయంలోనున్న ఈర్ష్యకు లేక అసూయకు నిదర్శనమా? అందుకే మనం అప్రమత్తంగా ఉండి, ఏమి మాట్లాడుతున్నామనేది పరీక్షించుకుంటూ, అనుచితమైన కోరికలను మనస్సు నుండి పెళ్ళగించివేయడానికి సత్వర చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

8. మనం అబద్ధం చెప్పే శోధనకు లొంగిపోతే మన హృదయాన్ని పరిశీలించుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది?

8 “దేవుడు ... అబద్ధమాడజాల[డు]” కానీ అపరిపూర్ణ మానవులు అబద్ధం చెప్పడానికే మొగ్గుచూపుతారు. (హెబ్రీయులు 6:​17,18) “మనుష్యులంతా అబద్ధీకులే” అని విలపించాడు కీర్తనకర్త. (కీర్తన 116:​11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అపొస్తలుడైన పేతురు సహితం అబద్ధం చెప్పి యేసును మూడుసార్లు నిరాకరించాడు. (మత్తయి 26:​69-75) “కల్లలాడు నాలుక” యెహోవాకు అసహ్యం గనుక మనం అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త వహించాలని స్పష్టమవుతోంది. (సామెతలు 6:​16-19) మనమెప్పుడైనా అబద్ధం చెప్పే శోధనకు లొంగిపోతే, దానికి కారణమేమిటో మనం విశ్లేషించుకోవడం మంచిది. దానికి కారణం మనుష్యుల భయమా? శిక్షించబడతామనే భయమా? మన పరువు కాపాడుకోవడానికైన ప్రయత్నమో లేక అతిస్వార్థమో దానికి మూల కారణమా? విషయం ఏదైనప్పటికీ, మనం దాని గురించి నెమ్మదిగా ఆలోచించి, నమ్రతగా మన బలహీనతను అంగీకరించి, యెహోవా క్షమాపణను వేడుకుని, ఆబలహీనతను జయించడానికి ఆయన సహాయాన్ని కోరడం ఎంత సముచితమో కదా! ‘సంఘ పెద్దలు’ అలాంటి సహాయాన్ని అందజేయడానికి తగినవారు.​—⁠యాకోబు 5:14.

9. మన ప్రార్థనలు మన హృదయం గురించి ఏమి బయలుపరుస్తాయి?

9 యౌవనుడైన సొలొమోను రాజు జ్ఞానము కోసం తెలివి కోసం చేసిన విన్నపానికి జవాబుగా యెహోవా ఇలా చెప్పాడు: “నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ... అడుగ[లేదు] ... కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్యబడును; ... ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను.” (2 దినవృత్తాంతములు 1:​11,12) సొలొమోను అడిగినదాన్ని బట్టీ, ఆయన అడుగనిదాన్ని బట్టీ, ఆయన హృదయానికి ఏది ప్రియమైనదో యెహోవాకు తెలిసింది. దేవునికి మనం చేసే ప్రార్థనలు మన హృదయాన్ని గురించి ఏమి బయలుపరుస్తున్నాయి? మన ప్రార్థనలు పరిజ్ఞానము, జ్ఞానము, వివేచనల కోసం మనకున్న దప్పికను బయలుపరుస్తున్నాయా? (సామెతలు 2:1-6; మత్తయి 5:⁠3) రాజ్యాసక్తులు మన హృదయానికి ప్రియమైనవా? (మత్తయి 6:​9,10) మన ప్రార్థనలు మొక్కుబడిగా చేసేవిగా తయారయితే, యెహోవా కార్యాల గురించి ధ్యానించడానికి సమయం తీసుకోవలసిన అవసరతను అది సూచిస్తుండవచ్చు. (కీర్తన 103:⁠2) క్రైస్తవులందరూ తమ ప్రార్థనలు ఏమి బయలుపరుస్తున్నాయో గ్రహించడానికి అప్రమత్తంగా ఉండాలి.

మన చర్యలు ఏమి చెబుతున్నాయి?

10, 11. (ఎ) వ్యభిచారము, జారత్వము ఎక్కడి నుండి ఉద్భవిస్తాయి? (బి)‘హృదయమందు వ్యభిచారము చేయకుండా’ ఉండడానికి మనకేమి సహాయం చేస్తుంది?

10 మాటల కన్నా చేతలు గట్టివని నానుడి. మన చేతలు మనం అంతర్గతంగా ఏమై ఉన్నామనేదాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తాయి. ఉదాహరణకు, నైతికతకు సంబంధించి హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడంలో జారత్వాన్ని లేక వ్యభిచారాన్ని నివారించడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:​28) మన హృదయంలో సహితం వ్యభిచారానికి దూరంగా ఎలా ఉండవచ్చు?

11 నమ్మకమైన పూర్వీకుడైన యోబు వివాహిత క్రైస్తవులకు చక్కని మాదిరిని ఉంచాడు. యోబు యౌవన స్త్రీలతో మామూలుగా వ్యవహరిస్తూ, వారికి సహాయం అవసరమైతే దయతో సహాయం చేసేవాడనడంలో సందేహం లేదు. కానీ వారిపట్ల ప్రణయాసక్తి కలిగివుండడమన్న తలంపు సహితం యథార్థవంతుడైన యోబుకు అనంగీకారమైనదే. ఎందుకు? స్త్రీలవైపు మోహపు చూపు చూడకూడదని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును?” (యోబు 31:⁠1) మనం కూడా మన కన్నులతో అలాంటి నిబంధననే చేసుకుని, మన హృదయాన్ని భద్రముగా కాపాడుకుందాము.

12. మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడానికి సంబంధించి మీరు లూకా 16:10ని ఎలా అన్వయించుకుంటారు?

12 దేవుని కుమారుడు ఇలా ప్రకటించాడు: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:​10) అవును, మనం అనుదిన జీవితంలోని అత్యల్పమైనవనిపించే విషయాల్లో, చివరికి మన ఇంట్లో ఏకాంతంలో జరిగే వాటికి సంబంధించి మన ప్రవర్తనను పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. (కీర్తన 101:⁠2) మనం మన ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ, లేక ఇంటర్‌నెట్‌లో ఉన్నప్పుడూ, “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ... మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు” అని చెబుతున్న లేఖన ఉపదేశానికి అనుగుణంగా ప్రవర్తించడానికి జాగ్రత్త వహిస్తామా? (ఎఫెసీయులు 5:​3,4) టీవీలోగానీ వీడియో గేముల్లోగానీ కనిపించే క్రూరత్వం మాటేమిటి? “యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు,” అని చెప్పాడు కీర్తనకర్త.​—⁠కీర్తన 11:⁠5.

13. మన హృదయంలో నుండి వెలువడుతున్నదాని గురించి ధ్యానించడానికి సంబంధించి ఎలాంటి హెచ్చరిక ఇవ్వబడుతోంది?

13 “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని హెచ్చరించాడు యిర్మీయా. (యిర్మీయా 17:⁠9) మనం చేసిన తప్పులకు మనం సాకులు చెప్పినప్పుడు, మన పొరపాట్లను తగ్గించి చెప్పుకున్నప్పుడు, గంభీరమైన వ్యక్తిత్వ లోపాలను సమర్థించుకున్నప్పుడు, లేక మనం సాధించినవాటిని గోరంతలు కొండంతలు చేసి చెప్పుకున్నప్పుడు హృదయం చేసే ఈమోసం బయటపడుతుంది. చాలా చెడ్డదైన హృదయం రెండు కోణాలుగల స్థితిని కూడా పొందగలదు, అంటే ఇచ్చకములాడు పెదవులతో ఒక విషయం చెప్పడం, చేతలు మరో విషయాన్ని చూపించడం. (కీర్తన 12:2; సామెతలు 23:⁠7) మన హృదయంలో నుండి వెలువడుతున్నదాన్ని పరిశీలించుకునేటప్పుడు మనం నిజాయితీగా ఉండడం ఎంత అవసరమోకదా!

మన కన్ను తేటగా ఉందా?

14, 15. (ఎ) “తేటగా” ఉండే కన్ను అంటే ఏమిటి? (బి)కంటిని తేటగా ఉంచుకోవడం హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది?

14 “దేహమునకు దీపము కన్నే” అని చెప్పాడు యేసు. “గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును” అని ఆయన జతచేశాడు. (మత్తయి 6:​22) తేటగా ఉండే కన్ను ఒకే గమ్యంపై లేక సంకల్పంపై కేంద్రీకృతమై ఉండి దాని నుండి ప్రక్కకు తొలగదు లేక అవధానం మరల్చదు. వాస్తవానికి మన కన్ను ‘రాజ్యమును, దేవుని నీతిని మొదట వెదకడం’ పై కేంద్రీకరించబడి ఉండాలి. (మత్తయి 6:​33) మన కంటిని తేటగా ఉంచుకోకపోతే మన సూచనార్థక హృదయానికి ఏమి జరుగుతుంది?

15 జీవనోపాధికి సంబంధించిన విషయాన్ని పరిశీలించండి. మన కుటుంబ అవసరాలను తీర్చడం క్రైస్తవ బాధ్యత. (1 తిమోతి 5:⁠8) కానీ ఆహారం, వస్త్రాలు, గృహవసతి, మరితర విషయాల్లో అత్యాధునికమైనవి, అతిశ్రేష్ఠమైనవి, అతిగొప్పవి కావాలన్న కోరిక కలిగితే అప్పుడేమిటి? మన ఆరాధనలో మనల్ని అర్ధహృదయులుగా చేస్తూ అది మన హృదయాన్ని మనస్సును బానిసగా చేసుకోదా? (కీర్తన 119:113; రోమీయులు 16:​18) మన జీవితం పూర్తిగా కుటుంబం, వ్యాపారం, వస్తుదాయక విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేలా మనం భౌతిక విషయాల గురించి శ్రద్ధవహించడంలోనే ఎందుకు మునిగిపోవాలి? ఈప్రేరేపిత ఉపదేశాన్ని గుర్తుంచుకోండి: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.”​—⁠లూకా 21:34, 35.

16. కన్ను గురించి యేసు ఏమని ఉపదేశించాడు, ఎందుకు?

16 మనస్సుకు, హృదయానికి కన్ను ఒక ప్రాముఖ్యమైన సమాచార మాధ్యమం. అది దేనిపై కేంద్రీకరిస్తుందన్నది మన తలంపులను, భావాలను, చర్యలను ఎంతో బలంగా ప్రభావితం చేయగలదు. ఉపమానార్థక భాషను ఉపయోగిస్తూ, యేసు దృశ్య సంబంధ శోధనను ఉద్దేశించి ఇలా అన్నాడు: “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.” (మత్తయి 5:​29) అనుచితమైన దృశ్యాలపై అవధానం నిలుపకుండా కంటిని అదుపు చేసుకోవాలి. ఉదాహరణకు, అశుద్ధమైన వాంఛలను, కోరికలను రేకెత్తించేవాటిని చూస్తూ ఉండేందుకు దాన్ని అనుమతించకూడదు.

17. కొలొస్సయులు 3:5ను అన్వయించుకోవడం హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది?

17 అయితే బయటి ప్రపంచంతో సంప్రదింపులు జరపడంలో తోడ్పడే ఇంద్రియం కన్ను మాత్రమే కాదు. స్పర్శ, వినికిడి వంటి ఇతర ఇంద్రియాలు కూడా తమ పాత్రను నిర్వహిస్తాయి, కాబట్టి మనం తత్సంబంధిత శరీరావయవాల గురించి కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా ఉపదేశించాడు: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.”​—⁠కొలొస్సయులు 3:⁠5.

18. అనుచితమైన తలంపుల గురించి మనం ఏచర్యలు తీసుకోవాలి?

18 మన మనస్సులోని అంతర్గత భాగాల్లో ఏదైనా చెడు కోరిక ఉత్పన్నం కావచ్చు. అలాంటి తలంపు గురించి తదేకంగా ఆలోచించడం సాధారణంగా హృదయాన్ని ప్రభావితం చేస్తూ చెడు కోరికను తీవ్రతరం చేస్తుంది. అప్పుడు ‘దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది.’ (యాకోబు 1:​14,15) సాధారణంగా హస్తప్రయోగము అలాగే జరుగుతుందని అనేకులు అంగీకరిస్తారు. కాబట్టి మన మనస్సులను ఆధ్యాత్మిక విషయాలతో నింపుకుంటూ ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! (ఫిలిప్పీయులు 4:⁠8) ఏదైనా చెడు తలంపు మనస్సుకు వచ్చినా, దాన్ని తొలగించడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి.

‘హృదయపూర్వకంగా యెహోవాను సేవించండి’

19, 20. హృదయపూర్వకంగా యెహోవాను సేవించడంలో మనమెలా విజయం సాధించవచ్చు?

19 దావీదు రాజు తన వృద్ధాప్యంలో తన కుమారునికి ఇలా చెప్పాడు: “సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము.” (1 దినవృత్తాంతములు 28:⁠9) సొలొమోను తానే “వివేకముగల హృదయము” కోసం ప్రార్థించాడు. (1 రాజులు 3:⁠9) అయితే, తన జీవితమంతటిలో అలాంటి హృదయాన్ని కాపాడుకోవడం ఆయనకు సవాలుగా పరిణమించింది.

20 ఈ విషయంలో మనం విజయం సాధించాలంటే, మనం యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోవడమే కాదు, దాన్ని భద్రముగా కాపాడుకోవాలి కూడా. దీన్ని సాధించడానికి, దేవుని వాక్యంలోని జ్ఞాపికలను మన ‘హృదయమందు’ ఉంచుకోవాలి. (సామెతలు 4:​20-22) మన మాటలు చేతలు ఏమి బయల్పరుస్తున్నాయో ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ, మన హృదయాన్ని పరిశోధించుకోవడాన్ని ఒక అభ్యాసంలా కూడా చేసుకోవాలి. మనం కనుగొన్న ఏదైనా బలహీనతను సరిచేసుకోవడానికి యెహోవా సహాయాన్ని ఎడతెగక కోరకపోతే అలా ధ్యానించుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? మనం మన ఇంద్రియాల ద్వారా లోపలికి ఏమి తీసుకుంటున్నామనే దాన్ని జాగ్రత్తగా గమనించడం ఎంత ప్రాముఖ్యమో కదా! అలా చేయడంలో, ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి’ ఉంటుందనే హామీ మనకు ఉంది. (ఫిలిప్పీయులు 4:​6,7) అవును, అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును భద్రముగా కాపాడుకొంటూ, హృదయపూర్వకంగా యెహోవాను సేవించేందుకు మనం దృఢంగా నిశ్చయించుకుందాము.

మీరు గుర్తుతెచ్చుకోగలరా?

• హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

• మన మాటలను విశ్లేషించుకోవడం మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

• మనం మన కంటిని ఎందుకు “తేటగా” ఉంచుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రాలు]

మనం క్షేత్ర సేవలోనూ, కూటాల్లోనూ, ఇంటి దగ్గరా సాధారణంగా దేని గురించి మాట్లాడతాము?

[25వ పేజీలోని చిత్రాలు]

తేటగా ఉండే కన్ను అవధానం ప్రక్కకు మరల్చబడదు