కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోండి

యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోండి

యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోండి

“దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.”​—⁠కీర్తన 51:10.

1, 2. మనం మన హృదయం గురించి ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?

అతడు ఆజానుబాహుడు, అందగాడు. అతడిని చూసి సమూయేలు ప్రవక్త ఎంతగా ప్రభావితుడయ్యాడంటే, యెష్షయి పెద్ద కుమారుడైన అతడే సౌలు తర్వాత రాజుగా ఉండడానికి దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అయ్యుంటాడని ఆయన భావించాడు. కానీ యెహోవా ఇలా ప్రకటించాడు: “[ఆ కుమారుని] రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, ... నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” యెహోవా యెష్షయి చిన్న కుమారుడిని, అంటే “తన హృదయానికి అనుగుణమైన మనిషి” అయిన దావీదును ఎంపిక చేసుకున్నాడు.​—⁠1 సమూయేలు 13:⁠14, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం; 16:⁠7.

2 దేవుడు మానవ హృదయాన్ని చదువగలడు, అందుకే ఆతర్వాత ఆయనిలా స్పష్టం చేశాడు: “ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” (యిర్మీయా 17:​10) అవును, “హృదయ పరిశోధకుడు యెహోవాయే.” (సామెతలు 17:⁠3) అయితే, యెహోవా మానవునిలో పరిశోధించే హృదయం ఏది? ఆయన ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోవడానికి మనమేమి చేయాలి?

“హృదయపు అంతరంగ స్వభావము”

3, 4. బైబిలులో “హృదయం” అనే పదం ప్రాథమికంగా ఏభావంలో ఉపయోగించబడింది? ఉదాహరణలు ఇవ్వండి.

3 పరిశుద్ధ లేఖనాల్లో “హృదయం” అనే పదం దాదాపు వెయ్యిసార్లు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అది సూచనార్థక భావంలోనే ఉపయోగించబడింది. ఉదాహరణకు, యెహోవా మోషే ప్రవక్తకు ఇలా చెప్పాడు: “నా కొరకు విరాళములను ఇండని యిస్రాయేలీయులతో చెప్పుము. హృదయపూర్వకముగా యిచ్చువాని నుండియే ఈవిరాళములను స్వీకరింపుము.” “ఎవని హృదయము వాని రేపెనో” వారందరు విరాళములు ఇచ్చారు. (నిర్గమకాండము 25:​2, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము; 35:​21) సూచనార్థక హృదయానికి సంబంధించిన ఒక అంశం ప్రేరణ, అంటే చర్య తీసుకునేలా మనల్ని పురికొల్పే అంతర్గత శక్తి అని స్పష్టమవుతోంది. మన సూచనార్థక హృదయం మన భావోద్వేగాలను, భావాలను, మన కోరికలను, ఇష్టాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఒక హృదయం ఆగ్రహంతో లేక భయంతో నిండిపోగలదు, దుఃఖంతో కృంగిపోగలదు లేక సంతోషంతో ఉప్పొంగిపోగలదు. (కీర్తన 27:⁠3; 39:3; యోహాను 16:22; రోమీయులు 9:⁠1) అది గర్వించగలదు, వినయం కలిగివుండగలదు, ప్రేమించగలదు లేక ద్వేషించగలదు.​—⁠సామెతలు 16:5; మత్తయి 11:29; 1 పేతురు 1:22.

4 అదేవిధంగా, “హృదయం” తరచు ప్రేరణతో, భావోద్వేగాలతో ముడిపడి ఉంటే, “మనస్సు” ప్రాముఖ్యంగా మేధస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. లేఖనాల్లో ఒకే సందర్భంలో ఈరెండూ కనిపించినప్పుడు మనం ఈపదాలను అలాగే అర్థం చేసుకోవాలి. (మత్తయి 22:37; ఫిలిప్పీయులు 4:⁠7, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) కానీ హృదయము, మనస్సు పూర్తిగా భిన్నమైనవి కావు. ఉదాహరణకు, మోషే ఇశ్రాయేలీయులను ఇలా ఉద్బోధించాడు: “యెహోవాయే దేవుడనీ మరో దేవుడు లేడనీ ఈరోజు తెలుసుకోండి. మీహృదయాలలో [లేదా, “మనస్సులలో,” NW, అధస్సూచి] ఈసంగతి నాటనివ్వండి.” (ద్వితీయోపదేశకాండము 4:​40, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) తనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్న శాస్త్రులను ఉద్దేశించి యేసు ఇలా అన్నాడు: “మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?” (మత్తయి 9:⁠4) ‘వివేకమును,’ ‘జ్ఞానమును,’ ‘ఆలోచించుకోవడాన్ని’ కూడా హృదయంతో జత చేయవచ్చు. (1 రాజులు 3:12; సామెతలు 15:14; మార్కు 2:⁠7) కాబట్టి, సూచనార్థక హృదయంలో మన మేధస్సు, అంటే మన తలంపులు లేక మన అవగాహన కూడా ఇమిడి ఉండగలవు.

5. సూచనార్థక హృదయం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది?

5 ఒక రెఫరెన్స్‌ గ్రంథం ప్రకారం, సూచనార్థక హృదయం “సాధారణంగా అతి ప్రధానమైన భాగానికి” ప్రాతినిధ్యం వహిస్తుంది, “కాబట్టి అది, ఒక వ్యక్తి యొక్క వివిధ కార్యకలాపాలలో, అతని కోరికల్లో, ఇష్టాల్లో, భావోద్వేగాల్లో, వాంఛల్లో, సంకల్పాల్లో, అతని తలంపుల్లో, స్ఫూర్తిలో, ఊహల్లో, అతని బుద్ధిలో, జ్ఞానములో, నైపుణ్యంలో, అతని నమ్మకాల్లో, అతని హేతుబద్ధమైన తర్కంలో, అతని జ్ఞాపకాల్లో, అతని చేతనలో అతడిని బయలుపరిచే అంతర్గత వ్యక్తిని సూచిస్తుంది.” మనం నిజంగా అంతర్గతంగా ఏమై ఉన్నామో దానికి అంటే, “హృదయపు అంతరంగ స్వభావము”కు అది ప్రాతినిధ్యం వహిస్తుంది. (1 పేతురు 3:⁠4) యెహోవా చూసేదీ, పరిశోధించేదీ దాన్నే. అందుకే, దావీదు ఇలా ప్రార్థించగలిగాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” (కీర్తన 51:​10) మనం శుద్ధ హృదయమును ఎలా సంపాదించుకోగలం?

దేవుని వాక్యమును ‘మీ హృదయములలో పెట్టుకోండి’

6. మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకుని ఉన్నప్పుడు మోషే వారికి ఏమని ఉద్బోధించాడు?

6 వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు మోయాబు మైదానాల్లో సమకూడి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఉపదేశిస్తూ మోషే ఇలా అన్నాడు: “మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో [“హృదయములలో,” NW] పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 32:​46) ఇశ్రాయేలీయులు “శ్రద్ధగా వినాలి.” (నాక్స్‌) దేవుని ఆజ్ఞలతో సుపరిచితులై ఉండడం ద్వారా మాత్రమే వారు వాటిని తమ పిల్లలకు అభ్యసింపజేయగలుగుతారు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:6-8.

7. దేవుని వాక్యమును ‘హృదయములో పెట్టుకోవడంలో’ ఏమి ఇమిడి ఉంది?

7 శుద్ధ హృదయాన్ని సంపాదించుకోవడానికి, దేవుని చిత్తాన్ని గురించి ఆయన సంకల్పాల గురించి ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందడం ఒక కీలకమైన ఆవశ్యకత. ఆపరిజ్ఞానమును పొందడానికి కేవలం ఒకే మూలం ఉంది, అది దేవుని ప్రేరేపిత వాక్యం. (2 తిమోతి 3:​16,17) అయితే కేవలం బుర్రలో నింపుకొనే పరిజ్ఞానం, యెహోవాకు ప్రీతికరమైన హృదయాన్ని సంపాదించుకోవడానికి మనకు సహాయం చేయదు. మనం నిజంగా అంతర్గతంగా ఎలాంటి వ్యక్తిగా ఉన్నామో దాన్ని పరిజ్ఞానం ప్రభావితం చేయాలంటే, మనం నేర్చుకుంటున్న దాన్ని మనం మన ‘హృదయాల్లో పెట్టుకోవాలి’ లేక “హృదయంలోకి తీసుకోవాలి.” (ద్వితీయోపదేశకాండము 32:​46, యాన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌) దీన్నెలా చేయవచ్చు? కీర్తనకర్త దావీదు ఇలా తెలియజేస్తున్నాడు: “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను; నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.”​—⁠కీర్తన 143:⁠5.

8. మనం అధ్యయనం చేసేటప్పుడు ఏప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

8 మనం కూడా యెహోవా క్రియలను గురించి కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించాలి. బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదివేటప్పుడు, మనం ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది: ‘ఇది నాకు యెహోవా గురించి ఏమి బోధిస్తోంది? దీంట్లో యెహోవా యొక్క ఏలక్షణాలను నేను చూస్తున్నాను? యెహోవా ఏమి ఇష్టపడతాడు ఏమి ఇష్టపడడు అనే దాని గురించి ఈవృత్తాంతం నాకేమి బోధిస్తోంది? యెహోవా ప్రేమించే విధానాన్ని అనుసరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, అయితే దానికి భిన్నంగా యెహోవా ద్వేషించే విధానాన్ని అనుసరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? నాకు ఇప్పటికే తెలిసిన విషయాలతో ఈసమాచారం ఎలాంటి సంబంధం కలిగి ఉంది?’

9. వ్యక్తిగత అధ్యయనమూ, ధ్యానమూ ఎంత విలువైనవి?

9 ముప్పై రెండేళ్ళ లీసా * తాను అర్థవంతమైన అధ్యయనం మరియు ధ్యానం చేయడంలోని విలువను ఎలా గ్రహించిందో వివరిస్తోంది: “నేను 1994 లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దాదాపు రెండేళ్ళపాటు సత్యంలో చాలా చురుగ్గా ఉన్నాను. నేను క్రైస్తవ కూటాలన్నిటికీ హాజరయ్యేదాన్ని, క్షేత్రసేవలో నెలకు 30 నుండి 40 గంటలు గడిపేదాన్ని, తోటి క్రైస్తవులతో సహవసించేదాన్ని. ఆతర్వాత నేను నెమ్మదిగా కొట్టుకొనిపోవడం మొదలు పెట్టాను. నేను ఎంత హీనస్థితికి దిగజారిపోయానంటే, చివరికి దేవుని నియమాన్ని కూడా ఉల్లంఘించాను. కానీ నేను బుద్ధి తెచ్చుకొని నా జీవితాన్ని శుద్ధిపరచుకోవడానికి నిశ్చయించుకున్నాను. యెహోవా నా పశ్చాత్తాపాన్ని గుర్తించి, నన్ను తిరిగి అంగీకరించినందుకు నేనెంత ఆనందంగా ఉన్నానో! ‘నేనెందుకు పడిపోయాను?’ అని నేను తరచూ ఆలోచిస్తుంటాను. పదే పదే నా మనస్సుకు తట్టే సమాధానం ఏమిటంటే, నేను అర్థవంతమైన అధ్యయనాన్ని, ధ్యానించడాన్ని నిర్లక్ష్యం చేశాను. బైబిలు సత్యం నా హృదయాన్ని చేరుకోలేదు. ఇప్పటి నుండి వ్యక్తిగత అధ్యయనమూ, ధ్యానమూ నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలై ఉంటాయి.” మనం యెహోవా, ఆయన కుమారుడు, ఆయన వాక్యముల పరిజ్ఞానములో ఎదుగుతుండగా మనం అర్థవంతమైన ధ్యానం కోసం సమయాన్ని కేటాయించడం ఎంత ఆవశ్యకమో కదా!

10. వ్యక్తిగత అధ్యయనము, ధ్యానముల కోసం మనం సమయాన్ని సంపాదించుకోవడం ఎందుకు ఆవశ్యకం?

10 తీరికలేని ఈలోకంలో, అధ్యయనం కోసం, ధ్యానం కోసం సమయాన్ని కేటాయించడం నిజంగా ఒక సవాలే. అయితే, క్రైస్తవులు నేడు అద్భుతమైన వాగ్దాన దేశపు ముంగిట్లో అంటే దేవుని నీతియుక్తమైన నూతన లోకపు ముంగిట్లో నిలబడి ఉన్నారు. (2 పేతురు 3:​13) “మహా బబులోను” నాశనం, “మాగోగు దేశపువాడగు గోగు” యెహోవా ప్రజలపై దాడి చేయడం వంటి భయోత్పాదకమైన సంఘటనలు త్వరలోనే సంభవిస్తాయి. (ప్రకటన 17:1, 2, 5, 15-17; యెహెజ్కేలు 38:​1-4, 14-16; 39:⁠2) రానున్న సంఘటనలు యెహోవా పట్ల మనకున్న ప్రేమను పరీక్షించవచ్చు. ఇప్పుడు మనం సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని హృదయాల్లో పెట్టుకోవడం ఆవశ్యకం.​—⁠ఎఫెసీయులు 5:15, 16.

‘దేవుని వాక్యమును పరిశోధించడానికి మీహృదయాన్ని సిద్ధం చేసుకోండి’

11. మన హృదయాన్ని నేలతో ఎలా పోల్చవచ్చు?

11 సూచనార్థక హృదయాన్ని, సత్యపు విత్తనాలు నాటగల నేలతో పోల్చవచ్చు. (మత్తయి 13:​18-23) పంటలు బాగా పండడానికి అక్షరార్థమైన నేలను సాధారణంగా సాగు చేస్తారు. అలాగే, హృదయం కూడా దేవుని వాక్యాన్ని మరింత చక్కగా తనలోకి తీసుకోవాలంటే దాన్ని సిద్ధం చేసుకోవాలి. యాజకుడైన ఎజ్రా ‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకు దృఢనిశ్చయము [“తన హృదయమును సిద్ధము,” NW] చేసికొనెను.’ (ఎజ్రా 7:​10) మనం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?

12. అధ్యయనం కోసం హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి ఏమి సహాయం చేస్తుంది?

12 మనం దేవుని వాక్యాన్ని సంప్రదించేటప్పుడు మన హృదయాన్ని చక్కగా సిద్ధం చేసుకోవడానికి ఒక మార్గం హృదయపూర్వకమైన ప్రార్థనే. సత్యారాధకుల క్రైస్తవ కూటాలు ప్రార్థనతో ప్రారంభమై, ప్రార్థనతో ముగుస్తాయి. మనం వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని హృదయపూర్వకమైన ప్రార్థనతో ప్రారంభించి, మన అధ్యయన సమయమంతటిలో ప్రార్థనాపూర్వకమైన దృక్పథాన్ని కలిగివుండడం ఎంత సముచితమో కదా!

13. యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోవడానికి మనం ఏమి చేయాలి?

13 విషయాన్ని సరిగ్గా తెలుసుకోక ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను నిర్మూలించుకోవడానికి సూచనార్థక హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. యేసు కాలంనాటి మత నాయకులు అలా చేయడానికి ఇష్టపడలేదు. (మత్తయి 13:​13-15) మరో వైపున, యేసు తల్లి మరియ తాను విన్న సత్యాల ఆధారంగా “తన హృదయములో” ధ్యానిస్తుండేది. (లూకా 2:​19,51) ఆమె యేసు నమ్మకమైన శిష్యురాలు అయ్యింది. తుయతైరలోని లూదియ పౌలు చెప్పినది వినడంతో “ప్రభువు ఆమె హృదయము తెరచెను.” ఆమె కూడా విశ్వాసి అయ్యింది. (అపొస్తలుల కార్యములు 16:​14,15) వ్యక్తిగత తలంపులను లేక మనమిష్టపడే సిద్ధాంతపరమైన దృక్కోణాలను మనం ఎన్నడూ గట్టిగా పట్టుకొని వ్రేలాడకూడదు. బదులుగా, ‘ప్రతి మనుష్యుడును అబద్ధికుడు’ అయినా, “దేవుడు సత్యవంతుడు” అవ్వాలని ఇష్టపడదాము.​—⁠రోమీయులు 3:⁠4.

14. క్రైస్తవ కూటాల్లో వినడానికి మనం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?

14 క్రైస్తవ కూటాల్లో వినేలా హృదయాన్ని సిద్ధం చేసుకోవడం మరీ ప్రాముఖ్యం. పరధ్యానం, కూటాల్లో చెప్పేవాటిపై నుండి మన అవధానాన్ని మరల్చవచ్చు. దినమంతటిలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తుంటే లేదా రేపేమి జరుగబోతోందనే దాని గురించి ఆలోచిస్తున్నా, అక్కడ చెప్పే మాటలు మనపై ఎక్కువ ప్రభావాన్ని చూపలేవు. అక్కడ చెప్పే దాని నుండి మనం ప్రయోజనం పొందడానికి మనం వినాలని, నేర్చుకోవాలని దృఢ నిశ్చయం చేసుకోవలసిన అవసరం ఉంది. బాగుగా గ్రహించునట్లు విడమర్చి చెప్పబడుతున్న లేఖనాలను అర్థంచేసుకోవాలని మనం నిశ్చయించుకుంటే మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు!​—⁠నెహెమ్యా 8:5-8, 12.

15. మనకు బోధించడం మరింత సులభయ్యేందుకు నమ్రత మనకెలా సహాయం చేస్తుంది?

15 సరైన ఎరువులను చల్లడం ద్వారా ఎలాగైతే భౌతికపరమైన నేల సారవంతమవుతుందో అలాగే మనం నమ్రతను, ఆధ్యాత్మిక ఆకలిని, నమ్మకాన్ని, దైవభయాన్ని, దేవుని పట్ల ప్రేమను పెంపొందింపజేసుకున్నప్పుడు అవి మన సూచనార్థక హృదయాన్ని ఫలవంతం చేయగలవు. నమ్రత మన హృదయాన్ని మెత్తబరచి, మనకు బోధించడం మరింత సులభమయ్యేలా చేస్తుంది. యూదా రాజైన యోషీయాకు యెహోవా ఇలా చెప్పాడు: “నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సు [“హృదయం,” NW] కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, ... నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను.” (2 రాజులు 22:​19) యోషీయా హృదయం నమ్రతగలదీ, గ్రహించే సామర్థ్యం గలది. ‘జ్ఞానులు, వివేకులు’ గ్రహించలేకపోయిన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి అన్వయించుకోవడానికి, ‘విద్యలేని పామరులైన’ యేసు శిష్యులకు నమ్రత సహాయం చేసింది. (లూకా 10:21; అపొస్తలుల కార్యములు 4:​13) యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ‘మన దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాము.’​—⁠ఎజ్రా 8:​21, NW.

16. ఆధ్యాత్మిక ఆహారం కోసం మనం ఆకలిని పెంచుకోవడానికి ఎందుకు కృషి చేయాలి?

16 “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అని చెప్పాడు యేసు. (మత్తయి 5:​3) ఆత్మ విషయాల్లో ఆసక్తిని కలిగివుండే సామర్థ్యం మనకు ఇవ్వబడినప్పటికీ, ఈదుష్టలోకం నుండి వచ్చే ఒత్తిళ్ళు లేక సోమరితనం వంటి లక్షణాలు మనకున్న ఆఆసక్తిని మందగింపజేయవచ్చు. (మత్తయి 4:⁠4) మనం ఆధ్యాత్మిక ఆహారం కోసం ఆరోగ్యదాయకమైన ఆకలిని పెంచుకోవాలి. బైబిలు చదవడంలో, వ్యక్తిగత అధ్యయనంలో మనం మొదట్లో అంత ఆనందాన్ని పొందకపోయినా, పట్టు విడువక కొనసాగితే అధ్యయన వేళల కోసం మనం ఆత్రంగా ఎదురుచూసేలా, పరిజ్ఞానము మనకు ‘మనోహరముగా ఉన్నట్లు’ మనం గ్రహిస్తాము.​—⁠సామెతలు 2:10, 11.

17. (ఎ) యెహోవా మన సంపూర్ణ నమ్మకాన్ని పొందడానికి ఎందుకు అర్హుడు? (బి)మనం దేవుని మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?

17 “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అని ఉద్బోధించాడు సొలొమోను రాజు. (సామెతలు 3:⁠5) యెహోవాను నమ్మే హృదయానికి ఆయన తన వాక్యం ద్వారా ఏమి అడిగినా, ఏమి నిర్దేశించినా అది ఎల్లప్పుడూ సరైనదేనని తెలుస్తుంది. (యెషయా 48:​17) యెహోవా మన పూర్ణ నమ్మకానికి కచ్చితంగా అర్హుడు. ఆయన తాను సంకల్పించినదంతా నెరవేర్చగలడు. (యెషయా 40:​26,29) అంతెందుకు, “తానే కర్త అవుతాడు” అన్నది ఆయన పేరుకు ఉన్న అక్షరార్థమైన భావం, గనుక తాను వాగ్దానం చేసిన వాటిని నేరవేర్చేందుకు ఆయనకున్న సామర్థ్యంపై మన నమ్మకాన్ని అది పెంపొందింపజేస్తుంది! ఆయన “తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు.” (కీర్తన 145:​17) అయితే, ఆయన మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి మనం బైబిలు నుండి నేర్చుకునేదాన్ని మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవడం ద్వారా, అది ఉత్పన్నం చేసే మంచి గురించి ఆలోచించడం ద్వారా మనం ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి.’​—⁠కీర్తన 34:⁠8.

18. దేవుని నడిపింపును స్వీకరించేవారిగా ఉండడానికి దేవుని భయం మనకెలా సహాయం చేస్తుంది?

18 దైవిక నడిపింపును మన హృదయం స్వీకరించేలా చేసే మరో లక్షణాన్ని సూచిస్తూ, సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము.” (సామెతలు 3:⁠7) ప్రాచీన ఇశ్రాయేలు గురించి యెహోవా ఇలా చెప్పాడు: “వారికీ వారి సంతానానికీ ఎల్లకాలం క్షేమంగా ఉండేలా నాపట్ల భయభక్తులు గలిగి నా ఆజ్ఞలన్నిటికీ లోబడే హృదయం వారికుంటే ఎంత బాగుంటుంది!” (ద్వితీయోపదేశకాండము 5:​29, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) అవును, దేవునికి భయపడే వారు ఆయనకు విధేయత చూపిస్తారు. ‘తనయెడల యథార్థ హృదయము గలవారిని బలపరచే’ సామర్థ్యమూ, తనకు అవిధేయత చూపేవారిని శిక్షించే సామర్థ్యమూ యెహోవాకు ఉన్నాయి. (2 దినవృత్తాంతములు 16:⁠9) దేవునికి ఇష్టంలేని పనులను చేయకుండా భక్తిపూర్వకమైన భయం మన చర్యలను, తలంపులను, భావోద్వేగాలను నిర్దేశించును గాక.

‘మీ పూర్ణహృదయముతో యెహోవాను ప్రేమించండి’

19. యెహోవా నడిపింపుకు మన హృదయం ప్రతిస్పందించేలా చేయడంలో ప్రేమ ఏపాత్ర నిర్వహిస్తుంది?

19 ఇతర లక్షణాలన్నిటి కన్నా ఎక్కువగా ప్రేమే మన హృదయాన్ని యెహోవా నడిపింపుకు ప్రతిస్పందించేలా చేస్తుంది. దేవునిపట్ల ప్రేమతో నిండివున్న హృదయం, ఒక వ్యక్తి దేవునికి ప్రీతికరమైనదేదో, అప్రీతికరమైనదేదో ఆత్రుతతో తెలుసుకునేలా చేస్తుంది. (1 యోహాను 5:⁠3) ‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను’ అని యేసు చెప్పాడు. (మత్తయి 22:​37) దేవుని మంచితనాన్ని గురించి ఆలోచించడాన్ని ఒక అలవాటుగా చేసుకోవడం ద్వారా, ఒక సన్నిహిత స్నేహితునితో మాట్లాడినట్లు ఆయనతో క్రమంగా మాట్లాడడం ద్వారా, ఆయన గురించి ఇతరులతో ఆత్రంగా మాట్లాడడం ద్వారా ఆయనపై మనకున్న ప్రేమను ప్రగాఢం చేసుకుందాము.

20. యెహోవా ఇష్టపడే హృదయాన్ని మనమెలా సంపాదించుకోవచ్చు?

20 పునఃపరిశీలన: యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోవడంలో, మనం అంతర్గతంగా ఏమైవున్నామో దానిపై అంటే మన హృదయపు అంతరంగ స్వభావంపై దేవుని వాక్యం ప్రభావం చూపడానికి అనుమతించడం ఇమిడివుంది. లేఖనాలను అర్థవంతంగా వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం, కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించడం తప్పనిసరి. సిద్ధమైన హృదయంతో, అంటే విషయాన్ని సరిగ్గా తెలుసుకోక ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను తొలగించుకుని, మనకు బోధించడం మరింత సులభమయ్యేలా చేసే లక్షణాలను నింపుకున్న హృదయంతో అలా చేయడం మంచిది! అవును, యెహోవా సహాయంతో, ఒక మంచి హృదయాన్ని సంపాదించుకోవడం సాధ్యమే. అయితే, మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనం ఏచర్యలు తీసుకోవచ్చు?

[అధస్సూచి]

^ పేరా 9 పేరు మార్చబడింది.

మీరేమని జవాబిస్తారు?

• యెహోవా పరిశోధించే సూచనార్థక హృదయం ఏది?

• దేవుని వాక్యమును ఎలా ‘మన హృదయములలో పెట్టుకోవచ్చు’?

• దేవుని వాక్యాన్ని సంప్రదించడానికి మనం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి?

• ఈసమాచారాన్ని పరిశీలించిన తర్వాత, మీరు ఏమి చేయడానికి పురికొల్పబడ్డారు?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

దావీదు ఆధ్యాత్మిక విషయాల గురించి కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించాడు. మరి మీరు?

[18వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే ముందు మీహృదయాన్ని సిద్ధం చేసుకోండి