కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషభరితమైన లోకానికి కీలకం

సంతోషభరితమైన లోకానికి కీలకం

సంతోషభరితమైన లోకానికి కీలకం

“నజరేతుకు చెందిన యేసు, ఈరెండు సహస్రాబ్దాల్లోనే కాదు, మొత్తం మానవ చరిత్రలోనే అత్యంత శక్తిమంతుడైన ఒకే ఒక వ్యక్తి” అని టైమ్‌ పత్రిక అంది. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, వేలాదిమంది యథార్థహృదయులైన ప్రజలు ఆయన గొప్పతనాన్నే కాక, ఇతరుల మీద ఆయనకున్న శ్రద్ధను కూడా గుర్తించారు. కాబట్టి, ఆయనను తమకు రాజుగా చేసుకోవాలని వాళ్ళు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు. (యోహాను 6:​10,14,15) అయితే, ముందటి ఆర్టికల్‌లో పేర్కొన్నట్లు, యేసు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

యేసు అలా ఉండడానికి కనీసం మూడు కారణాలున్నాయి. అవి: మానవ పరిపాలనతో సహా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలన్న మానవ ధోరణుల గురించి తన తండ్రికున్న దృక్కోణం; పరిపాలనలో మానవులు చేసే శ్రేష్ఠమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా పనిచేసే బలమైన గుప్త శక్తులున్నాయని యేసుకు తెలుసు; భూమియంతటా పరిపాలించే పరలోక ప్రభుత్వాన్ని స్థాపించాలన్న దేవుని సంకల్పం. మనం ఈఅంశాలను మరింత సునిశితంగా పరిశీలించినప్పుడు, ఈలోకాన్ని మెరుగుపర్చాలన్న మానవ ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయన్నది గ్రహిస్తాము. అయితే ఎలా సఫలులవ్వవచ్చు అన్న విషయాన్ని కూడా మనం గ్రహిస్తాము.

మానవులు తమను తాము పరిపాలించుకోగలరా?

దేవుడు మానవులను సృష్టించినప్పుడు, ఆయన వారికి జంతు ప్రపంచంపై అధికారమిచ్చాడు. (ఆదికాండము 1:​26) కానీ మానవులు మాత్రం దేవుని సర్వాధిపత్యం క్రిందనే ఉండేవారు. మొదటి స్త్రీపురుషులు, తాము దేవునికి లోబడి ఉన్నామన్న విషయాన్ని నిర్దిష్టమైన ఒక చెట్టు ఫలములను అంటే “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష” ఫలములను తినకుండా దేవునికి విధేయతగా ఉండడం ద్వారా ధ్రువీకరించవలసింది. (ఆదికాండము 2:​17) విచారకరంగా, ఆదాము హవ్వలు తమ నైతిక స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేసుకుని, దేవునికి అవిధేయత చూపించారు. నిషేధించబడిన పండును తీసుకోవడం దొంగతనం మాత్రమే కాదు. అది దేవుని సర్వాధిపత్యానికి వ్యతిరేకమైన తిరుగుబాటు కూడా. “సంపూర్ణమైన నైతిక స్వాతంత్ర్యం కావాలని” ఆదాము హవ్వలు చెప్పారు, “ఆ విధంగా, సృష్టించబడినవాడిగా తన అసలు స్థానాన్ని గుర్తించడానికి మానవుడు నిరాకరించాడు ... మొదటి పాపం, దేవుని సర్వాధిపత్యంపై దాడిచేయడమే” అని ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌లో ఆదికాండము 2:⁠17కున్న అధఃసూచి చెబుతోంది.

దాంట్లో ఇమిడివున్న గంభీరమైన నైతిక వివాదాలను బట్టి, దేవుడు ఆదాము హవ్వలను, వారి సంతతిని తమ సొంత జీవన మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించాడు, ఏది తప్పు ఏది సరైనది అన్న విషయంలో వాళ్ళు సొంత ప్రమాణాలను ఏర్పరచుకున్నారు. (కీర్తన 147:19, 20; రోమీయులు 2:​14) ఒక్కమాటలో చెప్పాలంటే, మానవుడు సొంత నిర్ణయాలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మరా ప్రయోగం సఫలమవుతోందా? సఫలమవడం లేదని వేల సంవత్సరాలుగా జరుగుతున్నవాటిని బట్టి మనం చెప్పవచ్చు! “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని ప్రసంగి 8:9 చెబుతోంది. “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” అని యిర్మీయా 10:⁠23 చెబుతున్న మాటలు నిజమని మానవుని స్వయం పరిపాలనను గురించిన విచారకరమైన చరిత్ర ధ్రువీకరిస్తోంది. తమ సృష్టికర్త సహాయం లేకుండా తమను తాము విజయవంతంగా పరిపాలించుకునే శక్తి మానవులకు లేదని చరిత్ర నిరూపించింది.

యేసు దానితో పూర్తిగా ఏకీభవించాడు. దేవునిపై ఆధారపడకుండా ఉండడమంటే ఆయనకు ఎంతో అసహ్యం. “నా అంతట నేనే యేమియుచేయక,” ‘దేవుడికిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును’ అని ఆయన అన్నాడు. (యోహాను 4:​34; 8:28, 29) కనుక, మానవుల నుండి రాజరికాన్ని పొందడానికి దేవుడు తనకు అధికారమివ్వనందువల్ల, దాన్ని అంగీకరించడం గురించి ఆయన ఆలోచించను కూడా లేదు. అయితే, దీనర్థం ఆయన తన తోటి మానవులకు సహాయపడేందుకు వెనుకంజవేసేవాడని కాదు. అందుకు భిన్నంగా, ఆకాలంలోనూ, భవిష్యత్తులోనూ ప్రజలు అత్యధిక సంతోషాన్ని కనుగొనేలా వారికి సహాయపడేందుకు ఆయన తన శాయశక్తులా కృషి చేశాడు. ఆయన మానవుల కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. (మత్తయి 5:3-11; 7:​24-27; యోహాను 3:​16) “ప్రతిదానికి,” అంతెందుకు, మానవులపై తనకున్న సర్వాధిపత్యాన్ని యెహోవా ధ్రువీకరించుకునేందుకు సహితం “సమయము కలదు” అని యేసుకు తెలుసు. (ప్రసంగి 3:1; మత్తయి 24:14, 21, 22, 36-39) అయితే, ఏదెనులో కంటికి కనబడే సర్పం ద్వారా మాట్లాడిన దుష్టాత్మ చిత్తానికి మన మొదటి తల్లిదండ్రులు లోబడ్డారు. యేసు రాజకీయాలకు దూరంగా ఉండడానికి రెండవ కారణమేమిటో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది.

ఈ లోకపు రహస్య పరిపాలకుడు

తనకు ఒక్కసారి నమస్కరిస్తే, “యీ లోకరాజ్యములన్నిటిని” ఇస్తానని అపవాదియైన సాతాను యేసుకు ప్రతిపాదించాడని బైబిలు మనకు చెబుతోంది. (మత్తయి 4:​8-10) నిజంగానే, తన షరతు మీద లోకాధిపత్యాన్ని ఇస్తానని అపవాది యేసుకు ప్రతిపాదించాడు. కానీ అపవాది శోధనకు యేసు లొంగిపోలేదు. అయితే, అది నిజంగా ఒక శోధనేనా? సాతాను నిజంగా అంత గొప్ప ప్రతిపాదనను చేయగలడా? అవును, అపవాది “లోకాధికారి” అని స్వయంగా యేసే అన్నాడు, “ఈ యుగ సంబంధమైన దేవత” అని అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు.​—⁠యోహాను 14:30; 2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 6:⁠12.

నిజమే, అపవాది మానవుని శ్రేయస్సు కోసం ఆలోచించడని యేసుకు తెలుసు. ఆయన సాతానును “నరహంతకుడు” అని “అబద్ధానికి అసత్యమైనవాటన్నింటికి తండ్రి” అని పేర్కొన్నాడు. (యోహాను 8:​44, ది ఆంప్లిఫైడ్‌ బైబిల్‌) స్పష్టంగా, అలాంటి దుష్టాత్మ ‘ఆధీనంలో ఉన్న’ లోకం నిజంగా ఎన్నడూ సంతోషంగా ఉండలేదు. (1 యోహాను 5:​19, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కానీ అపవాదికి ఈఅధికారం ఎల్లకాలం ఉండదు. ఇప్పుడు శక్తిమంతుడైన ఆత్మ ప్రాణిగా ఉన్న యేసు త్వరలోనే సాతానును, ఆయన ప్రభావాన్ని బొత్తిగా లేకుండా చేస్తాడు.​—⁠హెబ్రీయులు 2:14; ప్రకటన 20:1-3.

లోకాధిపతిగా తనకు కొంచెం సమయమే ఉందని సాతానుకూ తెలుసు. కనుక నోవహు కాలం నాటి జలప్రళయానికి ముందు తాను చేసినట్లు, మానవులను ఇక ఏ మాత్రం సరిదిద్దలేని విధంగా భ్రష్టుపట్టించాలని ఆయన తన సర్వశక్తులను ఒడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. (ఆదికాండము 6:1-5; యూదా 6) అందుకే, ‘భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు’ అని ప్రకటన 12:⁠12 చెబుతోంది. మనం ఈ‘కొంచెం సమయము’ ముగింపులో ఉన్నామని బైబిలు ప్రవచనాలు, లోక సంఘటనలు సూచిస్తున్నాయి. (2 తిమోతి 3:​1-5) త్వరలో మనకు ఉపశమనం లభించబోతోంది.

సంతోషాన్ని తీసుకువచ్చే ఒక ప్రభుత్వం

యేసు రాజకీయాలకు దూరంగా ఉండడానికి మూడవ కారణం ఏమిటంటే, భవిష్యత్తులోని నిర్ణీత సమయంలో దేవుడు భూమిని పరిపాలించేందుకు ఒక పరలోక ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు అని ఆయనకు తెలుసు. బైబిలు ఈప్రభుత్వాన్ని దేవుని రాజ్యమని అంటోంది, యేసు బోధ యొక్క ముఖ్యాంశం అదే. (లూకా 4:43; ప్రకటన 11:​15) ఆరాజ్యం రావాలని ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. ఎందుకంటే, దాని పరిపాలన క్రింద మాత్రమే, ‘దేవుని చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుతుంది.’ (మత్తయి 6:​9,10) ‘ఈ ప్రభుత్వం యావత్‌ భూమిని పరిపాలిస్తే, మానవనిర్మిత ప్రభుత్వాలు ఏమవుతాయి?’ అని మీరనుకుంటుండవచ్చు.

దానియేలు 2:44 లో కనిపిస్తున్నదే దానికి జవాబు: ‘ఆ రాజుల [ప్రస్తుత విధానాంతంలో పరిపాలిస్తున్నవారి] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన [మానవ నిర్మిత] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.’ (ఇటాలిక్కులు మావి.) దేవుని రాజ్యం భూమిపైనున్న పరిపాలనలను ఎందుకు ‘పగులగొట్టాలి’? ఎందుకంటే పూర్వం ఏదెను తోటలో సాతాను పెంపొందింపజేసిన, దేవుణ్ణి నిరాకరించి స్వయంగా నిర్ణయించుకునే వైఖరి కలకాలం కొనసాగాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఆవైఖరి కలకాలం కొనసాగాలని ప్రయత్నించేవారు మానవుని శ్రేయస్సుకు విరుద్ధంగా పని చేయడమే కాక, సృష్టికర్తకు వ్యతిరేకమైన దిశలో పయనిస్తున్నారు. (కీర్తన 2:6-12; ప్రకటన 16:​14,16) మనం ‘దేవుని పరిపాలన పక్షాన ఉంటామా, లేక వ్యతిరేకంగా ఉంటామా?’ అని మనలను మనం ప్రశ్నించుకోవాలి.

మీరు ఎవరి సర్వాధిపత్యాన్ని కోరుకుంటారు?

పరిపాలనను గురించిన సరైన అవగాహనతో నిర్ణయం తీసుకునేలా ప్రజలకు సహాయపడేందుకు, ప్రస్తుత విధానానికి అంతం రాక ముందు, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను” ప్రకటించమని యేసు తన శిష్యులకు ఆదేశించాడు. (మత్తయి 24:​14) నేడు ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నవారిగా పేరుగాంచినది ఎవరు? యెహోవాసాక్షులు. వాస్తవానికి, ఎంతో కాలంగా, ఈపత్రిక ముఖపత్రంలో, “యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది” అన్న మాటలు కనిపిస్తున్నాయి. నేడు, ప్రజలు ఆరాజ్యాన్ని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు 230 కన్నా ఎక్కువ దేశాల్లో దాదాపు 60 లక్షల మంది సాక్షులు సహాయపడుతున్నారు. *

రాజ్య ప్రజలకు ఆశీర్వాదాలు

యేసు ఎల్లప్పుడూ దేవుడు చేసినట్లే చేసేవాడు. కనుక స్వతంత్ర మార్గాన్ని ఎంచుకునే బదులు, ప్రస్తుత విధానానికి మద్దతునివ్వడానికి లేదా మెరుగుపరచడానికి రాజకీయాల ద్వారా ప్రయత్నించే బదులు, లోక రుగ్మతలకు ఏకైక పరిష్కారమైన దేవుని రాజ్య ఆసక్తులను అభివృద్ధిపరచేందుకు గట్టిగా కృషి చేశాడు. తాను చూపిన యథార్థతకు, అదే రాజ్యానికి రాజుగా పరలోకంలో మహిమాన్వితమైన సింహాసనాన్ని ప్రతిఫలంగా ఆయన పొందాడు. దేవునికి లోబడివున్నందుకు ఆయన ఎంత చక్కని బహుమానాన్ని పొందాడు!​—⁠దానియేలు 7:13,14.

దేవుని రాజ్యాన్ని మొదట ఉంచడంలోను, దేవుని చిత్తానికి లోబడడంలోను యేసును అనుకరించే లక్షలాది మంది కూడా ఒక అద్భుతమైన బహుమానాన్ని అంటే దేవుని రాజ్య ప్రజలుగా భూమిమీద ఉండే ఆధిక్యతను పొందుతారు. (మత్తయి 6:​33) దాని ప్రేమపూర్వక పరిపాలన క్రింద, నిత్యజీవమనే నిరీక్షణతో వారు పరిపూర్ణతకు చేర్చబడతారు. (ప్రకటన 21:​3,4) “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని 1 యోహాను 2:⁠17 చెబుతోంది. సాతాను, అతని అనుచరులు తుడిచిపెట్టబడడంతో, విభేదాలను కలిగించే జాతీయతలు, అవినీతికరమైన వాణిజ్య వ్యవస్థలు, అబద్ధ మతం అనే వాటి నుండి భూమి విముక్తిపొంది, భూగోళవ్యాప్త పరదైసుగా మారుతుంది, కలకాలం అక్కడ జీవించి ఉండడం ఎంత ఆనందంగా ఉంటుంది!​—⁠కీర్తన 37:​29; 72:⁠16.

అవును, వాస్తవంగా సంతోషభరితమైన లోకానికి నిజమైన కీలకం దేవుని రాజ్యమే. దాన్ని ప్రకటించే సందేశం సువార్త అని పేర్కొనబడడం సబబే. మీరు ఇప్పటి వరకు సువార్తను వినడానికి అంగీకరించనట్లయితే, యెహోవాసాక్షులు ఈసారి మీఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు తీసుకువచ్చే సువార్తను ఎందుకు వినకూడదు?

[అధస్సూచి]

^ పేరా 16 దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న యెహోవాసాక్షులు రాజకీయాలకు దూరంగా ఉంటారు, అయితే లౌకిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటునూ లేవదీయరు, అది, సాక్షులు నిషేదించబడిన లేదా హింసించబడే దేశాల్లోనైనా సరే. (తీతు 3:⁠1) బదులుగా, వారు యేసూ, మొదటి శతాబ్దపు క్రైస్తవులూ చేసిన విధంగా నిర్మాణాత్మకమైన, ఆధ్యాత్మికమైన, రాజకీయ సంబంధం లేని తోడ్పాటునిచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ప్రేమ, నిజాయితీ, నైతిక పవిత్రత, ఉద్యోగాల్లో నీతి నియమాలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన బైబిలు విలువలను తమ సొంతం చేసుకునేందుకు వివిధ సమాజాల్లోవున్న నీతివైపుకు మొగ్గుచూపే ప్రజలకు సహాయపడడానికి సాక్షులు శ్రమిస్తారు. ప్రాముఖ్యంగా, బైబిలు సూత్రాలను ఎలా అనుసరించాలి, మానవుని నిజమైన నిరీక్షణగా దేవుని రాజ్యంవైపుకు ఎలా చూడాలి అన్నది వారికి నేర్పించడానికి శ్రమిస్తారు.

[5వ పేజీలోని చిత్రాలు]

దేవుని సహాయం లేకుండా మానవులు విజయవంతంగా పరిపాలించుకోలేరని చరిత్ర రుజువుచేస్తోంది

[5వ పేజీలోని చిత్రం]

సాతాను ప్రస్తుత విధానాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టే, “యీ లోకరాజ్యములన్నిటిని” యేసుకు ఇస్తానని వాగ్దానం చేయగలిగాడు

[7వ పేజీలోని చిత్రాలు]

దేవుని రాజ్య ఏర్పాటు క్రింద ఈలోకం అద్భుతమైన స్థలంగా మారుతుందని యేసు బోధించాడు