కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దీర్ఘశాంతమును ధరించుకొనుడి”

“దీర్ఘశాంతమును ధరించుకొనుడి”

“దీర్ఘశాంతమును ధరించుకొనుడి”

“మీరు జాలిగల మనస్సును, ... దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:⁠12.

1. దీర్ఘశాంతాన్ని వహించిన ఒక చక్కని మాదిరిని గురించి చెప్పండి.

నైరృతి ఫ్రాన్స్‌లో నివసించే రేజీస్‌ 1952 లో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు. యెహోవాను సేవించాలని ఆయన చేసిన ప్రయత్నాల్ని ఆపడానికి ఆయన భార్య ఎన్నో సంవత్సరాలపాటు తాను చేయగలిగినవన్నీ చేసింది. ఆయన్ను కూటాలకు హాజరుకానివ్వకూడదని ఆయన మోటర్‌సైకిల్‌ టైర్లను పంచర్‌ చేయడానికి ప్రయత్నించింది, ఒక సందర్భంలో ఆయన ఇంటింటికి బైబిలు సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు చివరికి ఆమె ఆయన వెనకే వెళ్ళి ఆయన ఇంటివారితో రాజ్య సువార్తను గురించి మాట్లాడుతుండగా ఆయన్ను హేళన చేసింది. ఇలా ఆమె ఎంత వ్యతిరేకిస్తున్నా రేజీస్‌ దీర్ఘశాంతాన్ని వహించాడు. అలా రేజీస్‌ క్రైస్తవులందరికీ ఒక చక్కని మాదిరి అని చెప్పవచ్చు, ఎందుకంటే తన ఆరాధకులందరూ ఇతరులతో వ్యవహరించేటప్పుడు దీర్ఘశాంతముతో ఉండాలని యెహోవా కోరుతున్నాడు.

2. “దీర్ఘశాంతము” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా భావమేమిటి, ఆమాట దేన్ని సూచిస్తుంది?

2 “దీర్ఘశాంతము” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “దీర్ఘమైన ఆత్మ” అని భావం. ఈపదాన్ని తెలుగు పరిశుద్ధ గ్రంథము పన్నెండు సార్లు “దీర్ఘశాంతము” అని, ఒకసారి “ఓర్పు” అని, ఒకసారి “ఓపిక” అని అనువదించింది. “దీర్ఘశాంతము” అని అనువదించబడిన హీబ్రూ, గ్రీకు పదాల్లో ఓర్పు, సహనం, కోపించుటకు నిదానించు అన్న అర్థాలు చేరివున్నాయి.

3. దీర్ఘశాంతము విషయంలో క్రైస్తవుల దృక్కోణం మొదటి శతాబ్దపు గ్రీకుల దృక్కోణానికి ఎలా భిన్నంగా ఉంది?

3 మొదటిశతాబ్దపు గ్రీకులు దీర్ఘశాంతాన్ని నైతిక ప్రమాణంగా దృష్టించలేదు. స్తోయికు తత్త్వజ్ఞానులు ఆపదాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. బైబిలు విద్వాంసుడైన విలియం బార్‌క్లే చెప్పేదాని ప్రకారం, దీర్ఘశాంతం అనేది “గ్రీకుల నైతిక ప్రమాణాలకే విరుద్ధం,” తమ నైతిక ప్రమాణాలు “ఎలాంటి అవమానాన్నైనా ఎలాంటి గాయాన్నైనా సహించడానికి ఒప్పుకోవు” అని వారు గర్వంగా చెప్పుకుంటారు. ఆయనిలా పేర్కొంటున్నాడు: “గ్రీకు దేశస్థుడి దృష్టిలో పగ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించేవాడే గొప్పవాడు. క్రైస్తవుడి దృష్టిలో, పగ తీర్చుకోగలిగినా అలా చేసేందుకు నిరాకరించేవాడే గొప్పవాడు.” గ్రీకులు దీర్ఘశాంతాన్ని బలహీనతకు చిహ్నంగా పరిగణించివుండవచ్చు, కానీ వేరే సందర్భాల్లోలానే ఇక్కడ కూడా “దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.”​—⁠1 కొరింథీయులు 1:⁠25.

దీర్ఘశాంతము విషయంలో క్రీస్తు మాదిరి

4, 5. యేసు దీర్ఘశాంతము విషయంలో ఎలాంటి అద్భుతమైన మాదిరిని ఉంచాడు?

4 యెహోవా తర్వాత క్రీస్తు యేసే దీర్ఘశాంతము విషయంలో చక్కని మాదిరిని ఉంచాడు. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా యేసు అబ్బురపరచేంతటి నిగ్రహశక్తిని ప్రదర్శించాడు. ఆయన గురించి ఇలా ప్రవచించబడింది: “అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.”​—⁠యెషయా 53:⁠7.

5 ఈ భూమ్మీద తను చేసిన పరిచర్య అంతటిలోను యేసు ఎంత విశిష్టమైన దీర్ఘశాంతాన్ని కనపరిచాడో కదా! ఆయన తన శత్రువులు వేసే కుయుక్తితో కూడిన ప్రశ్నలను, వ్యతిరేకుల అవమానాలను సహించాడు. (మత్తయి 22:​15-46; 1 పేతురు 2:​23) ఆయన తన శిష్యులతో ఓర్పుగా వ్యవహరించాడు, చివరికి వారు తమలో ఎవరు గొప్ప అన్న విషయమై నిరంతరం పోట్లాడుకున్నప్పుడు కూడా ఆయన ఓర్పుగా ఉన్నాడు. (మార్కు 9:​33-37; 10:35-45; లూకా 22:​24-27) తను అప్పగింపబడిన రాత్రి, ‘మెలకువగా ఉండుడి’ అని చెప్పినా పేతురు యోహానులు నిద్రలోకి జారుకున్నప్పుడు ఆయన ఎంత అద్భుతమైన నిగ్రహాన్ని కనపర్చాడు!​—⁠మత్తయి 26:36-41.

6. యేసు చూపిన దీర్ఘశాంతము నుండి పౌలు ఎలా ప్రయోజనం పొందాడు, దీనినుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

6 తన మరణ పునరుత్థానాల తర్వాత కూడా యేసు దీర్ఘశాంతముతో ఉన్నాడు. ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలుకు దీని గురించి తెలుసు, ఎందుకంటే ఆయన మునుపు క్రైస్తవులను హింసించిన వ్యక్తి. పౌలు ఇలా వ్రాశాడు: “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.” (1 తిమోతి 1:​15,16) మన గతం ఎలాంటిదైనప్పటికీ మన విశ్వాసాన్ని యేసుపై ఉంచితే ఆయన మనపట్ల దీర్ఘశాంతముతో ఉంటాడు​—⁠అయితే మనం “మారుమనస్సునకు తగిన క్రియలు” చేస్తామని ఆయన ఆశిస్తాడు. (అపొస్తలుల కార్యములు 26:​20; రోమీయులు 2:⁠4) ఆసియా మైనరులోని ఏడు సంఘాలకు క్రీస్తు అందించిన సందేశాలు పరిశీలిస్తే, ఆయన దీర్ఘశాంతము గలవాడే అయినప్పటికీ మన ప్రవర్తన మెరుగుపడుతుందని మాత్రం ఆయన ఆశిస్తున్నాడని అర్థమవుతుంది.​—⁠ప్రకటన, 2,3 అధ్యాయాలు.

ఆత్మ ఫలాల్లో ఒకటి

7. దీర్ఘశాంతానికీ పరిశుద్ధాత్మకూ మధ్యగల సంబంధం ఏమిటి?

7 తాను గలతీయులకు వ్రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో పౌలు ఆత్మ ఫలాలకు విరుద్ధంగా శరీరకార్యాలు ఉన్నాయని పేర్కొంటున్నాడు. (గలతీయులు 5:​19-23) యెహోవా లక్షణాల్లో దీర్ఘశాంతము ఒకటి గనుక ఈలక్షణం ఆయన నుండి ఉద్భవిస్తుంది, అది ఆయన ఆత్మ ఫలాల్లో ఒకటి కూడా. (నిర్గమకాండము 34:​6,7) నిజానికి దీర్ఘశాంతము అనేది ఆత్మ ఫలాల గురించి పౌలు ఇచ్చిన వివరణలో నాలుగవదిగా ఉంది, మిగతావి “ప్రేమ, సంతోషము, సమాధానము, ... దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” (గలతీయులు 5:​22,23) కాబట్టి, దేవుని సేవకులు దైవిక ఓర్పును, అంటే దీర్ఘశాంతాన్ని కనపర్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉండి కనపరుస్తున్నారని అర్థం.

8. దీర్ఘశాంతముతో సహా మనం పరిశుద్ధాత్మ ఫలాలను పెంపొందించుకోవడాన్ని ఏది సాధ్యం చేస్తుంది

8 అయితే దీనర్థం యెహోవా తన ఆత్మను ఒక వ్యక్తిపై బలవంతంగా రుద్దుతాడని కాదు. మనం ఇష్టపూర్వకంగా దాని ప్రభావానికి లోబడాలి. (2 కొరింథీయులు 3:​17; ఎఫెసీయులు 4:​30) మనం చేసే ప్రతి విషయంలోను దాని ఫలాలను అలవర్చుకోవడం ద్వారా మనం పరిశుద్ధాత్మను మన జీవితాల్లో పనిచేయనిచ్చేందుకు అనుమతిస్తాము. శరీర కార్యాలను, ఆత్మ ఫలాలను పేర్కొన్న తర్వాత పౌలు ఇలా అన్నాడు: “మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛేలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.” (గలతీయులు 5:​25; 6:​7,8) మనం దీర్ఘశాంతాన్ని అలవర్చుకోవడంలో విజయాన్ని సాధించాలంటే, క్రైస్తవులలో పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పన్నం చేయబడే మిగతా ఫలాలను కూడా మనం అలవర్చుకోవాలి.

“ప్రేమ దీర్ఘకాలము సహించును”

9. “ప్రేమ దీర్ఘకాలము సహించును” అని పౌలు కొరింథీయులకు బహుశ ఎందుకు చెప్పివుంటాడు?

9 “ప్రేమ దీర్ఘకాలము సహించును” అని అన్నప్పుడు పౌలు ప్రేమకు దీర్ఘశాంతానికి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందని చూపిస్తున్నాడు. (1 కొరింథీయులు 13:⁠4) కొరింథులోని క్రైస్తవ సంఘంలో వివాదాలు, కలహాలు నెలకొనివున్నందున పౌలు దీన్ని నొక్కిచెప్పాడని ఆల్బర్ట్‌ బార్న్స్‌ అనే ఒక బైబిలు విద్వాంసుడు సూచిస్తున్నాడు. (1 కొరింథీయులు 1:​11,12) బార్న్స్‌ ఇలా పేర్కొంటున్నాడు: “ఇక్కడ [దీర్ఘశాంతము కోసం] ఉపయోగించబడిన పదం తొందరపడడానికి వ్యతిరేకమైన పదంగా ఉంది: తీవ్రోద్రేకంతో కూడిన భావాలకూ, ఆలోచనలకూ, కోపపడడానికీ వ్యతిరేకమైన భావాన్నిస్తుంది. అది అణచివేతను అనుభవిస్తున్నప్పుడు, కోపం వచ్చినప్పుడు దీర్ఘకాలంపాటు సహించగల మనఃస్థితిని సూచిస్తుంది.” ప్రేమ, దీర్ఘశాంతము క్రైస్తవ సంఘంలోని శాంతికి ఎంతగానో దోహదపడతాయి.

10. (ఎ) మనం దీర్ఘశాంతముతో ఉండేందుకు ప్రేమ ఏ విధాల్లో మనకు సహాయం చేస్తుంది, ఈసంబంధంగా అపొస్తలుడైన పౌలు ఏ సలహా ఇస్తున్నాడు? (బి)దేవుని దీర్ఘశాంతాన్ని గురించి, దయను గురించి ఒక బైబిలు విద్వాంసుడు ఏమని వ్యాఖ్యానించాడు? (అధస్సూచి చూడండి.)

10 “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ ... స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు.” కాబట్టి, మనం దీర్ఘశాంతముగా ఉండేందుకు ప్రేమ అనేక విధాలుగా మనకు సహాయపడుతుంది. * (1 కొరింథీయులు 13:​4,5) ప్రేమ మనం ఓర్పుతో ఒకరినొకరం సహించేందుకు, మనందరం అపరిపూర్ణులమని మనందరిలో తప్పులూ దోషాలూ ఉంటాయని గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తుంది. ఇతరుల కష్టసుఖాలు ఆలోచించేందుకు వారిని క్షమించేందుకు అది మనకు సహాయం చేస్తుంది. ‘సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకరినొకరం సహిస్తూ, ... దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను’ నడుచుకోవాలని అపొస్తలుడైన పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.​—⁠ఎఫెసీయులు 4:1-3.

11. క్రైస్తవ సమాజాల్లో దీర్ఘశాంతాన్ని కనపర్చడం ఎందుకు మరింత ప్రాముఖ్యం?

11 అవి సంఘాలైనా, బేతేలు గృహాలైనా, మిషనరీ గృహాలైనా, నిర్మాణ జట్టులైనా, లేదా పాఠశాలలైనా క్రైస్తవ సమాజాల్లోని సభ్యులు దీర్ఘశాంతముతో ఉండడం శాంతికీ సంతోషానికీ దోహదం చేస్తుంది. వ్యక్తిత్వాల్లో, అభిరుచుల్లో, పెంపకంలో, మర్యాదల ప్రమాణాల్లో, చివరికి ఆరోగ్యపరమైన ప్రమాణాల్లో భిన్నత్వం ఉన్నందున చిరాకు తెప్పించే పరిస్థితులు అప్పుడప్పుడు తలెత్తగలవు. ఇది కుటుంబాల్లో కూడా జరుగుతుంది. కోపించుటకు నిదానించడం చాలా ఆవశ్యకం. (సామెతలు 14:​29; 15:​18; 19:​11) మనందరం దీర్ఘశాంతము వహించడం, అంటే పరిస్థితి మెరుగవుతుందన్న నిరీక్షణతో ఓర్పుగా సహించడం చాలా అవసరం.​—⁠రోమీయులు 15:1-6.

దీర్ఘశాంతము మనం సహించడానికి సహాయం చేస్తుంది

12. చిరాకు తెప్పించే పరిస్థితుల్లో దీర్ఘశాంతము ఎందుకు ప్రాముఖ్యము?

12 అంతూ పొంతూ లేనట్లుండే లేదా త్వరిత పరిష్కారం కనిపించనట్లుండే చిరాకు తెప్పించే పరిస్థితుల్లో సహనాన్ని కనపర్చడానికి దీర్ఘశాంతము మనకు సహాయం చేస్తుంది. మొదట్లో పేర్కొన్న రేజీస్‌ విషయంలో అదే జరిగింది. యెహోవాను సేవించాలని చేసే ప్రయత్నాలను సంవత్సరాల తరబడి ఆయన భార్య వ్యతిరేకించింది. అయితే, ఒకరోజు ఆమె కంట తడిపెడుతూ ఆయన దగ్గరకు వచ్చి, “ఇదే సత్యమని నాకు తెలుసు. నాకు సహాయం చేయండి. నాకు బైబిలు అధ్యయనం కావాలి” అని అడిగింది. ఆమె చివరికి సాక్షిగా బాప్తిస్మం తీసుకుంది. రేజీస్‌ ఇలా అంటున్నాడు: “ఆ సంవత్సరాల్లో నేను పడిన సంఘర్షణను, చూపించిన ఓర్పును, సహనాన్ని యెహోవా ఆశీర్వదించాడని ఇది రుజువుచేసింది.” ఆయన దీర్ఘశాంతానికి ప్రతిఫలం లభించింది.

13. పౌలు సహించడానికి ఏమి సహాయం చేసింది, ఆయన మాదిరి మనం సహించడానికి ఎలా సహాయం చేయగలదు?

13 వెనుకటికి సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు దీర్ఘశాంతము విషయంలో చక్కని మాదిరిని ఉంచాడు. (2 కొరింథీయులు 6:​3-10; 1 తిమోతి 1:​16) ఆయన తన జీవిత చరమాంకంలో తన సహవాసియైన యువకుడైన తిమోతికి సలహా ఇస్తూ, క్రైస్తవులందరూ శ్రమలను ఎదుర్కొంటారని ఆయన్ను హెచ్చరించాడు. పౌలు తన స్వంత మాదిరిని పేర్కొని సహనానికి అవసరమయ్యే ప్రాధమిక లక్షణాలను సిఫారసు చేశాడు. ఆయనిలా వ్రాశాడు: “నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:​10-12; అపొస్తలుల కార్యములు 13:​49-51; 14:​19-22) సహించాలంటే మనందరికి విశ్వాసము, ప్రేమ, దీర్ఘశాంతము అవసరము.

దీర్ఘశాంతమును ధరించుకొని

14. పౌలు దీర్ఘశాంతము వంటి దైవిక లక్షణాలను వేటితో పోల్చాడు, ఆయన కొలస్సయిలోని క్రైస్తవులకు ఏమని సలహా ఇచ్చాడు?

14 అపొస్తలుడైన పౌలు దీర్ఘశాంతాన్ని, మరితర దైవిక లక్షణాలను, ఒక క్రైస్తవుడు “ప్రాచీనస్వభావము”కు చెందే అలవాట్లను తీసివేసుకున్న తర్వాత ధరించాల్సిన వస్త్రాలతో పోల్చాడు. (కొలొస్సయులు 3:​5-10) ఆయనిలా వ్రాశాడు: “దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:12-14.

15. క్రైస్తవులు దీర్ఘశాంతాన్ని మరితర దైవిక లక్షణాలను ‘ధరించుకొన్నప్పుడు’ ఎలాంటి ఫలితాలు లభిస్తాయి?

15 సంఘ సభ్యులు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ప్రేమను ‘ధరించుకొంటే’ వారు సమస్యలను పరిష్కరించుకొని యెహోవా సేవలో ఐక్యంగా ముందుకు కొనసాగడం సాధ్యమవుతుంది. ప్రాముఖ్యంగా క్రైస్తవ పైవిచారణకర్తలు దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాల్సిన అవసరంవుంది. వారు ఎవరైనా క్రైస్తవుడిని ఖండించాల్సిన అవసరం కొన్నిసార్లు ఏర్పడవచ్చు, కానీ ఇది చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. వారు కలిగివుండాల్సిన అతి శ్రేష్ఠమైన వైఖరి గురించి పౌలు తిమోతికి వ్రాసినప్పుడు వివరించాడు: “సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.” (2 తిమోతి 4:⁠2) అవును, యెహోవా గొఱ్ఱెలతో ఎల్లప్పుడు దీర్ఘశాంతముతో, గౌరవముతో, వాత్సల్యముతో వ్యవహరించాలి.​—⁠మత్తయి 7:​12; 11:​28; అపొస్తలుల కార్యములు 20:​28,29; రోమీయులు 12:⁠10.

“అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి”

16. మనం ‘అందరియెడల దీర్ఘశాంతముగలవారమై’ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు లభించగలవు?

16 మానవుల పట్ల యెహోవా కలిగివున్న దీర్ఘశాంతము మనం ‘అందరియెడల దీర్ఘశాంతముగలవారమై’ ఉండాల్సిన నైతిక బాధ్యతను మనపై పెడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:​14) అంటే సాక్షులు కాని కుటుంబ సభ్యులతో, పొరుగువారితో, సహోద్యోగులతో, తోటి విద్యార్థులతో ఓర్పుగా ఉండడం అని అర్థం. ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో హేళనతో కూడిన మాటలను లేదా పూర్తి వ్యతిరేకతను సహించినందున కొన్ని సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలపాటు సహించినందున, అనేకమందిలో ఉన్న దురభిమానాలను తొలగించడం సాధ్యమయ్యింది. (కొలొస్సయులు 4:​5,6) అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: ‘అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెను.’​—⁠1 పేతురు 2:⁠12.

17. మనం యెహోవా ప్రేమను దీర్ఘశాంతాన్ని ఎలా అనుకరించగలము, మనం ఎందుకు అనుకరించాలి?

17 యెహోవా దీర్ఘశాంతము కోట్లాదిమందికి రక్షణార్థంగా పరిణమిస్తుంది. (2 పేతురు 3:​9,15) మనం యెహోవా ప్రేమను దీర్ఘశాంతాన్ని అనుకరించినట్లయితే మనం ఓర్పుగా దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తాము, క్రీస్తు యొక్క రాజ్య పరిపాలనకు లోబడమని ఇతరులకు బోధిస్తాము. (మత్తయి 28:​18-20; మార్కు 13:​10) మనం ప్రకటించడమే మానేస్తే అది, యెహోవా దీర్ఘశాంతాన్ని మనం పరిమితం చేయాలని కోరుకుంటున్నామని, ఆయన దీర్ఘశాంతానికిగల సంకల్పాన్ని మనం గుర్తించలేకపోతున్నామని అర్థాన్ని ఇస్తుంది, ప్రజలు మారుమనస్సు పొందేలా చేయడమే ఆసంకల్పం.​—⁠రోమీయులు 2:⁠4.

18. కొలొస్సయుల గురించి పౌలు ఏమని ప్రార్థించాడు?

18 ఆసియా మైనరులోని కొలొస్సయి క్రైస్తవులకు తాను వ్రాసిన పత్రికలో పౌలు ఇలా అన్నాడు: “అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు ... దేవుని బతిమాలుచున్నాము.”​—⁠కొలొస్సయులు 1:9-11.

19, 20. (ఎ) యెహోవా దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ కొనసాగడాన్ని మనం ఒక పరీక్షగా దృష్టించడం ఎలా నివారించగలము? (బి)మనం దీర్ఘశాంతాన్ని కలిగివుండడం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

19 మనం గనుక ‘ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారముగా’ ఉన్నట్లయితే యెహోవా తన దీర్ఘశాంతాన్ని లేదా ఓర్పును కనపరుస్తూ కొనసాగడం మనకు ఒక పరీక్షగా మారదు. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె”నన్నదే ఆయన చిత్తము. (1 తిమోతి 2:⁠4) తద్వారా మనం “ప్రతి సత్కార్యములో,” ప్రత్యేకంగా “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించడంలో ‘సఫలులమవుతూ’ ఉంటాము. (మత్తయి 24:14) మనం విశ్వసనీయంగా ఇలా చేస్తూ కొనసాగితే మనము “ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు” యెహోవా మనల్ని ‘సంపూర్ణ బలముతో బలపరుస్తాడు.’ అలా చేస్తూ మనం ‘ఆయనకు తగినట్టుగా నడుచుకొంటాము,’ అలా మనం ‘అన్ని విషయములలో ఆయనను సంతోషపెడుతున్నామని’ తెలుసుకోవడం ద్వారా లభించే శాంతిని అనుభవిస్తాము.

20 యెహోవా దీర్ఘశాంతములో ఎంతో జ్ఞానము ఉందన్న విషయంలో మనం సంపూర్ణంగా ఒప్పింపబడుదుము గాక. అది మన రక్షణకు, మన ప్రకటనను బోధను వినేవారి రక్షణకు దారితీస్తుంది. (1 తిమోతి 4:​16) ప్రేమ, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి ఆత్మ ఫలాలను అలవర్చుకోవడం మనం ఆనందముగా దీర్ఘశాంతమును కలిగివుండడాన్ని సాధ్యపరుస్తుంది. మనం మన కుటుంబ సభ్యులతోను, అలాగే సంఘంలోని మన సహోదర సహోదరీలతోను సమాధానముగా జీవించడం సాధ్యమవుతుంది. దీర్ఘశాంతము మన సహోద్యోగులతోను లేదా తోటి విద్యార్థులతోను ఓర్పుగా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు, మన దీర్ఘశాంతము ఒక సంకల్పాన్ని కలిగివుంటుంది, అదే పాపులను రక్షించడమూ, దీర్ఘశాంతానికి దేవుడైన యెహోవాను మహిమపరచడమూను.

[అధస్సూచీలు]

^ పేరా 10 “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును” అన్న పౌలు మాటలను గురించి వ్యాఖ్యానిస్తూ బైబిలు విద్వాంసుడైన గోర్డన్‌ డి.ఫీ ఇలా వ్రాస్తున్నాడు: “పౌలు వివరించే దైవశాస్త్రంలో అవి [దీర్ఘశాంతము దయ] మానవజాతిపట్ల దైవుడు కలిగివున్న దృక్పథంలోని రెండు పార్శ్వాలను సూచిస్తున్నాయి (రోమా. 2:4 పోల్చండి). ఒకవైపు దేవుని ప్రేమపూర్వకమైన సహనం ఆయన మానవ తిరుగుబాటుపట్ల తన ఉగ్రతను పట్టివుంచడం ద్వారా ప్రదర్శితమౌతుంటే, మరోవైపు ఆయన దయ, వెయ్యి విధాలుగా వ్యక్తమైన ఆయన కరుణలో మనకు కనిపిస్తుంది. అందుకే ప్రేమను గురించిన పౌలు వర్ణన దేవుని గురించిన ద్వికోణ వర్ణనతో ప్రారంభం అవుతుంది. దైవిక ప్రతికూల తీర్పులు పొందవలసివున్న వారిపట్ల తాను సహనం గలవాడినని దయగలవాడినని దేవుడు క్రీస్తు ద్వారా చూపించుకున్నాడు.”

మీరు వివరించగలరా?

• దీర్ఘశాంతము విషయంలో క్రీస్తు ఏ విధాల్లో ఒక అద్భుతమైన మాదిరిని ఉంచాడు?

• దీర్ఘశాంతాన్ని అలవర్చుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?

• దీర్ఘశాంతము కుటుంబాలకు, క్రైస్తవ సమాజాలకు, పెద్దలకు ఎలా సహాయం చేస్తుంది?

• మనం దీర్ఘశాంతము వహించడం మనకు, ఇతరులకు ఎలా ప్రయోజనాలను తెస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా యేసు తన శిష్యులతో ఓర్పుగా ఉన్నాడు

[16వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పైవిచారణకర్తలు తమ సహోదరులతో వ్యవహరించేటప్పుడు దీర్ఘశాంతానికి మంచి మాదిరిని ఉంచాలని ఉద్బోధించబడుతున్నారు

[17వ పేజీలోని చిత్రం]

మనం యెహోవా ప్రేమను దీర్ఘశాంతాన్ని అనుకరిస్తే, మనం సువార్తను ప్రకటిస్తూ కొనసాగుతాం

[18వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు “ఆనందముతోకూడిన ... దీర్ఘశాంతమును” కనపర్చాలని పౌలు ప్రార్థించాడు