“పర మత సహన దినం”
“పర మత సహన దినం”
యెహోవాసాక్షులతో జరిగిన ఒక చర్చతో జిజ్ఞాస పెరిగిన పోలాండులోని ఒక స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ తన స్కూల్లో “పర మత సహన దినం” కోసం ఒక రోజును ఏర్పాటు చేసింది. కాథలిక్కులు, బౌద్ధులు, యెహోవాసాక్షుల్లోని విద్యార్థులు కొందరు తమ తమ విశ్వాసాలను, ఆచారాలను ఇతర విద్యార్థులకు తెలియజేసే విధంగా క్లుప్తమైన వ్యాఖ్యానాన్ని సిద్ధం చేసి తీసుకురమ్మని ఆమె చెప్పింది. యెహోవాసాక్షులైన ముగ్గురు విద్యార్థులు వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
ఏర్పాటు చేయబడిన రోజున, మొదట 15ఏండ్ల మాల్వీనా మాట్లాడాలి. ఆమె చెప్పిన దానిలో కొంత భాగం: “మేము మీఇండ్లను మునుపు సందర్శించిన కారణంగా, మేము ఈస్కూలుకు రావడానికి ముందే మీలో చాలామందికి మాగురించి తెలుసు. మేమలా ఎందుకు చేస్తున్నామని మీరు ఆశ్చర్యపోయుండవచ్చు. క్రైస్తవ స్థాపకుడైన యేసు క్రీస్తు మాదిరిని మేము అనుసరిస్తున్నాము కాబట్టి మేమలా చేస్తున్నాము. ప్రజలెక్కడ కనబడితే అక్కడ ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అపొస్తలులు, తొలికాలంలోని ఇతర క్రైస్తవులు అలాగే చేశారు. అనేక ప్రాంతాల్లో యెహోవాసాక్షులు తమ విశ్వాసాన్ని పరీక్షించే అత్యంత కష్టతరమైన శ్రమలను సహించారు, కానీ మన స్కూల్లో మీఅందరి తోడ్పాటువల్ల మేము శాంతిని అనుభవించాము, సంతోషంగా ఉన్నాము. అందుకు మీకు మాకృతజ్ఞతలు!”
వ్యాఖ్యానానికి ముగింపులో, మాల్వీనా ఇలా చెప్పింది: “మేము మీఇండ్లకు రావడానికి మరో కారణం కూడా ఉంది. మాకు మీపై ఉన్న శ్రద్ధే అది. ప్రపంచాన్ని కుదిపివేసే సంఘటనలను మానవజాతి త్వరలోనే ఎదుర్కోబోతోందని బైబిలు చెబుతోంది. కాబట్టి ఈసారి మేము మీఇంటికి వచ్చినప్పుడు, దయచేసి మేము చెప్పేది వినండి. మనమందరమూ కలిసి పరదైసు భూమిపై నిరంతరం ఎలా జీవించగలమో మీకు తెలియజేయడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాము.”
రెండవ వ్యాఖ్యానితుడు మాటేయూష్, ఆయనక్కూడా 15ఏండ్లే. మాటేయూష్ తన ప్రేక్షకులతో, సువార్తను వ్యాప్తి చేయడానికి యెహోవాసాక్షులు సంవత్సరాలుగా అనేక పద్ధతులను ఉపయోగించారని చెప్పాడు. ఉదాహరణకు, మూకీ సినిమాల యుగంలో 1914 లో, యెహోవాసాక్షులు “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” అని ఒక మోషన్ పిక్చర్‌తోపాటు సౌండుతో స్లైడ్ షో ప్రదర్శించారు.
రాజ్య సందేశాన్ని వాప్తి చేయడంలో రేడియో పాత్ర గురించి మాటేయూష్ చర్చించాడు, తర్వాత యెహోవాసాక్షులు రూపొందించిన విశిష్టమైన కంప్యూటరైజ్డ్ మల్టీలాంగ్వేజ్ ఎలక్ట్రానిక్ ఫోటోటైప్‌సెట్టింగ్ సిస్టమ్ (MEPS)
గురించి చెప్పాడు. డాక్టర్లు రక్తరహిత చికిత్సా విధానాల గురించి తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు వారికెలా సహాయం చేశారో కూడా చెప్పాడు. “ప్రఖ్యాతిగాంచిన పోలిష్ వైద్య శాస్త్రజ్ఞులు ఇప్పుడు మమ్మల్ని సమర్థిస్తూ వ్యాఖ్యానిస్తూ ప్రతి సంవత్సరం సాక్షులు కాని రోగులు అనేకమంది రక్తం ఉపయోగించకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నారనే విషయాన్ని ప్రత్యేకించి చెబుతున్నారు” అని ఆయన చెప్పాడు.మాటేయూష్ ముగింపులో రాజ్య మందిరాల నిర్మాణం గురించి చెబుతూ ఇలా అన్నాడు: “మీరు మారాజ్య మందిరాన్ని సందర్శించడానికి ఇష్టపడతారా? ప్రవేశం ఉచితం, చందాలు సేకరించబడవు.” సాస్నోవ్యెట్స్‌లోని సమావేశ కేంద్రం గురించి మాట్లాడుతూ మాటేయూష్ ఇలా అన్నాడు: “ఉపయోగకరంగా, ఆచరణాత్మకంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మించిన ఈపెద్ద భవనాన్ని మీరు తప్పకుండా చూడాలి. అక్కడికి మనం కలిసే ఎందుకు వెళ్ళగూడదు? మాదగ్గరొక సలహా ఉంది, దాని గురించి మన స్నేహితురాలు కాటార్జీనా చెబుతుంది.”
ఆ తర్వాత 15ఏండ్ల కాటార్జీనా చాలా ఉత్సాహంగా చెప్పింది: “సాస్నోవ్యెట్స్‌లో జరగబోయే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, యువతకు సంబంధించిన విషయాలు అక్కడ చర్చించబడతాయి.” క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఆచరించే యేసు క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని గురించి కూడా కాటార్జీనా చెప్పింది. ఆమె తన శ్రోతలతో “గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈఆచరణకు 1.4 కోట్లమంది హాజరయ్యారు. ఈరాబోయే ఆచరణ దినమున మీరెందుకు హాజరు కాకూడదు?” అంటూ వారిని ప్రోత్సహించింది.
అలా వారు వ్యాఖ్యానాలను ముగించిన తర్వాత, మాల్వీనా, మాటేయూష్, కాటార్జీనా వాళ్ళ టీచర్లకు యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంతోపాటు యెహోవాసాక్షుల విశ్వాసాల గురించి, కార్యకలాపాల గురించి తెలియజేసే రెండు వీడియో కాసెట్లను ఇచ్చారు. * టీచర్లు వాటిని ఎంతో కృతజ్ఞతతో తీసుకుని, చరిత్ర క్లాసుల్లో వాటిని వినియోగిస్తామని వాగ్దానం చేశారు.
ఈ కార్యక్రమం చివర్లో 12 ఏండ్ల మార్టినా అక్కడ సమావేశమై ఉన్న వారందరు విని ఆనందించేలా “యెహోవాకు కృతజ్ఞతలు” అనే పాటను టేప్‌రికార్డరులో వినిపించింది. ఈ టీనేజ్ సాక్షులు తమ ‘దేవునియందు ధైర్యము తెచ్చుకొని’ మంచి సాక్ష్యమిచ్చారు. (1 థెస్సలొనీకయులు 2:2) ప్రపంచవ్యాప్తంగావున్న యువ సాక్షులందరికీ ఇది ఎంత చక్కని మాదిరి!
[అధస్సూచి]
^ పేరా 9 యెహోవాసాక్షులచే ముద్రించబడింది.
[26వ పేజీలోని చిత్రం]
మాల్వీనా స్కూల్లో ఇవ్వబోయే వ్యాఖ్యానానికి కొన్ని రోజుల ముందునుండే సిద్ధమవుతోంది
[26వ పేజీలోని చిత్రం]
కాటార్జీనా వ్యాఖ్యానానికి కావలసిన లేఖనాలను ఎంపిక చేసుకుంటోంది