కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెహోవా అబ్రాహాముతో తన నిబంధన చేసింది ఊరులోనా హారానులోనా?

అబ్రాహాముతో యెహోవా చేసిన నిబంధన గురించిన తొలి వృత్తాంతం ఆదికాండము 12:1-3 లో ఉంది, అక్కడిలా ఉంది: ‘యెహోవా​—⁠నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చే[సెదను] ... భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను.’ * అబ్రాహాము ఊరులో ఉన్నప్పుడే యెహోవా ఆయనతో ఈనిబంధన చేసివుండవచ్చు, అబ్రాహాము హారానులో ఉన్నప్పుడు దాన్ని ఆయన ధ్రువపరచివుండవచ్చు.

యెహోవా కనానుకు వెళ్ళమని అబ్రాహామును ఆజ్ఞాపించాడని మొదటి శతాబ్దంలో స్తెఫను పేర్కొన్నాడు. యూదుల మహాసభవారితో మాట్లాడుతూ ఆయనిలా అన్నాడు: “మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై​—⁠నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.” (ఇటాలిక్కులు మావి.) (అపొస్తలుల కార్యములు 7:2,3) అబ్రాహాము ఊరు పట్టణవాసే, స్తెఫను సూచించినట్లుగా ఆయన కనానుకు వెళ్ళమన్న ఆజ్ఞను అక్కడే విన్నాడు. (ఆదికాండము 15:7; నెహెమ్యా 9:7) అబ్రాహాముతో దేవుని నిబంధన గురించి స్తెఫను ఏమీ పేర్కోలేదు, కానీ ఆదికాండము 12:1-3 వచనాల్లో, ఆనిబంధన కనానుకు వెళ్ళమన్న ఆజ్ఞతో ముడిపెట్టబడివుంది. కాబట్టి యెహోవా అబ్రాహాముతో ఆనిబంధనను ఊరులో చేశాడని నమ్మడం సహేతుకమే.

అయితే, ఆదికాండము వృత్తాంతాన్ని జాగ్రత్తగా చదివితే, ఆనిబంధనను కనానులో ఉన్నప్పుడు అనేకసార్లు పునరుద్ఘాటించి దానిలోని కొన్ని అంశాలను ఇంకా విపులపరచిన రీతిలో, యెహోవా తన నిబంధనను అబ్రాహాముకు హారానులో మళ్ళీ పేర్కొన్నట్లు మనం గ్రహిస్తాము. (ఆదికాండము 15:5; 17:1-5; 18:18; 22:16-18) ఆదికాండము 11:31,32 ప్రకారం చూస్తే అబ్రాహాము తండ్రి తెరహు, అబ్రాహాము, శారా, లోతులతోపాటు ఊరు విడిచి కనానుకు బయల్దేరాడని తెలుస్తోంది. వారు హారానుకు వచ్చి అక్కడ తెరహు మరణించేంత వరకు ఉన్నారు. అబ్రాహాము హారానులో చాలా కాలమే గడిపాడు. అక్కడ ఉన్నప్పుడే తన ఆస్తిని బాగా సమృద్ధి చేసుకున్నాడు. (ఆదికాండము 12:⁠5) తర్వాత ఎప్పుడో అబ్రాహాము సహోదరుడు నాహోరు కూడా అక్కడికి తరలి వచ్చాడు.

బైబిలు తెరహు మరణాన్ని గురించి నివేదించిన తర్వాత, అబ్రాహాముతో యెహోవా పలికిన మాటలను పేర్కొంటూ ఇలా కొనసాగింది: “యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను.” (ఆదికాండము 12:4) కాబట్టి, ఆదికాండము 12:1-3లో నమోదు చేయబడిన మాటలను యెహోవా తెరహు చనిపోయిన తర్వాత అన్నాడని ఆదికాండము 11:31–12:4 వచనాలు ధృఢంగా రుజువుపరుస్తున్నాయి. అదే నిజమైతే, అబ్రాహాము తాను అప్పుడే విన్న ఈఆజ్ఞకూ, అలాగే ఎన్నో సంవత్సరాల క్రితం ఊరులో విన్న ఆఆజ్ఞకూ విధేయంగా హారానును విడిచిపెట్టి యెహోవా ఆయనకు చూపించిన దేశానికి తరలివెళ్ళాడని అర్థం.

ఆదికాండము 12:1 ప్రకారం, యెహోవా అబ్రాహాముకు ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.” ఒకప్పుడు అబ్రాహాము “దేశము” ఊరు, మరి ఆయన తండ్రి ‘యిల్లు’ అక్కడే ఉండేది. అయితే, అబ్రాహాము తండ్రి తన కుటుంబమంతటితో హారానుకు తరలివెళ్ళాడు, ఈప్రాంతాన్ని అబ్రాహాము తన దేశమని పిలువనారంభించాడు. ఆయన కనానులో ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత, ఆయన ఇస్సాకు కోసం భార్యను వెదకడానికి ‘తన స్వదేశమందున్న తన బంధువుల’ దగ్గరికి తన దాసుణ్ణి పంపించినప్పుడు, ఆదాసుడు “నాహోరు పట్టణము”కు (హారాను గానీ లేదా దగ్గర్లో మరేదైనా ప్రాంతం గానీ అయివుండవచ్చు) వెళ్ళాడు. (ఆదికాండము 24:4,10) అక్కడ ఆదాసుడు అబ్రాహాము బంధువుల్లో, అంటే నాహోరుకు చెందిన పెద్ద కుటుంబ సభ్యుల్లో రిబ్కాను కనుగొన్నాడు.—ఆదికాండము 22:20-24; 24:15,24,29; 27:42,43.

యూదుల మహాసభకు తానిచ్చిన ప్రసంగంలో స్తెఫను అబ్రాహాము గురించి ఇలా అన్నాడు: “అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.” (అపొస్తలుల కార్యములు 7:4) అబ్రాహాముతో యెహోవా హారానులో మాట్లాడాడని ఇది సూచిస్తోంది. ఆదికాండము 12:1-3లో నివేదించబడినట్లు ఈసందర్భంలో యెహోవా అబ్రాహాముతో తన నిబంధనను మళ్ళీ నొక్కిచెప్పాడని భావించడం సహేతుకమే అనిపిస్తుంది, ఎందుకంటే అబ్రాహాము కనానులోకి ప్రవేశించినప్పుడు నిబంధన అమలులోకి వచ్చింది. ఈవిధంగా అన్ని వాస్తవాల పరిశీలన, యెహోవా అబ్రాహాముతో తన నిబంధనను ఊరులో చేసి, దాన్నే ఆతర్వాత మళ్ళీ హారానులో ధ్రువపరచివుంటాడన్న నిర్ధారణకు నడిపిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవా అబ్రాము పేరుని అబ్రాహాముగా మార్చాడు, ఇది అబ్రాహాము 99 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు కనానులో జరిగింది.​—⁠ఆదికాండము 17:1, 5.