కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు శిక్షణ పొందిన మనస్సాక్షి అవసరం

మీకు శిక్షణ పొందిన మనస్సాక్షి అవసరం

మీకు శిక్షణ పొందిన మనస్సాక్షి అవసరం

అంటార్కిటికాకు వెళ్తున్న ఎయిర్‌ న్యూజీలాండ్‌ ఫ్లైట్‌901 లో ఉన్న ప్రయాణీకుల కోసం, అందులోని సిబ్బంది కోసం ఒక మరపురాని రోజు వేచివుంది. ఆడిసి-10జెట్‌ విమానం అంటార్కిటికా ఖండాన్ని సమీపిస్తుండగా అందులోని ప్రయాణీకులు అత్యద్భుతమైన దృశ్యాలను చూడగలిగేలా విమానం కాస్త క్రిందుగా ఎగురుతున్నప్పుడు, కెమేరాలు సిద్ధం చేయబడివున్నాయి, విమానమంతా పార్టీ వాతావరణం నెలకొని ఉంది.

పదిహేను సంవత్సరాల నుండి పైలట్‌గా పనిచేస్తున్న కెప్టెన్‌ విమాన యానంలో 11,000 కంటే ఎక్కువ గంటలనే గడిపాడు. టేకాఫ్‌కు ముందు, ఆయన తన విమానంలోని కంప్యూటర్‌లోకి ఫ్లైట్‌ ప్లాన్‌ అంతటినీ జాగ్రత్తగా ఎక్కించాడు గానీ తనకు ఇవ్వబడిన నిర్దేశాంకాలు సరైనవి కావని ఆయనకు తెలియదు. కేవలం 600మీటర్ల ఎత్తులో ఉన్న ఒక మేఘం గుండా ప్రయాణిస్తుండగా డిసి-10జెట్‌ విమానం అకస్మాత్తుగా కూలి ఎరబస్‌ పర్వత లోయల్లోకి పడిపోవడంతో అందులో ఉన్న మొత్తం 257మంది ప్రయాణికులు మరణించారు.

ఆకాశంలో ఎగరడానికి నేడు విమానాలు నిర్దేశం కోసం కంప్యూటర్లపై ఆధారపడుతున్నట్లుగానే, జీవన పయనంలో తమ మార్గనిర్దేశం కోసం మానవులకు ఒక మనస్సాక్షి ఇవ్వబడింది. ఫ్లైట్‌901కు జరిగిన ఘోరమైన దుర్ఘటన, మన మనస్సాక్షి గురించి మనకు కొన్ని శక్తివంతమైన పాఠాలను బోధించగలదు. ఉదాహరణకు, విమానయాన భద్రత, సరిగ్గా పనిచేసే విమానయాన విధానంపైనా, ఖచ్చితమైన నిర్దేశకాలపైనా ఆధారపడి ఉన్నట్లుగానే, మన ఆధ్యాత్మిక, నైతిక, చివరికి శారీరక సంక్షేమం సరైన నైతిక నిర్దేశకాలచే నడిపించబడుతున్న, ప్రతిస్పందించే మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది.

విచారకరంగా, నేటి ప్రపంచంలో, అలాంటి నిర్దేశకాలు త్వరగా అంతరించిపోతున్నాయి లేదా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. అమెరికాలోని ఒక విద్యావేత్త ఇలా అంటోంది: “అమెరికాలోని సగటు బడిపిల్లవాడు సరిగ్గా చదవలేకపోతున్నాడని, సరిగ్గా వ్రాయలేకపోతున్నాడని, ప్రపంచమ్యాపులో ఫ్రాన్స్‌ ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నాడని మనం నేడు ఎక్కువగా వింటుంటాము. కానీ వాడు తప్పొప్పుల మధ్య తేడాను గుర్తించలేకపోతున్నాడనేది కూడా అంతే వాస్తవం. విద్యా సంబంధిత సమస్యల పట్టికకు మనం నిరక్షరాస్యత, లెక్కలు తెలియకపోవడంతోపాటు తీవ్రమైన నైతిక గందరగోళం అనేదాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది.” ఆమె ఇంకా ఇలా పేర్కొన్నది: “నేటి యౌవనస్థులు నైతిక అయోమయావస్థలో జీవిస్తున్నారు. ‘తప్పు, ఒప్పు’ వంటివి ఉన్నాయా అని వారిలో ఎవరినైనా అడగండి, హఠాత్తుగా మీఎదుట, ఎంతో అయోమయంతో, నోరుపెగలని, కంగారు పడుతున్న, అభద్రతాభావంతో ఉన్న వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. ... ఇక వాళ్లు కాలేజీలో అడుగుపెట్టడంతో ఈఅయోమయం అధికమవుతుందేగానీ ఏమాత్రం తగ్గదు.”

ఈఅయోమయానికి ఒక కారణం నైతిక సాపేక్షవాదం, అంటే వ్యక్తిగత లేక సాంస్కృతిక ఇష్టాలకు అనుగుణంగా ప్రమాణాలు మారుతుంటాయనే విస్తృతంగా వ్యాపించిన దృక్పథం. పైలట్‌లు నిర్దిష్టమైన సంకేతాలచే కాకుండా, ఇష్టమొచ్చినట్లు అటూ ఇటూ కదులుతూ ఒక్కోసారి పూర్తిగా కనబడకుండాపోయే సంకేతాలచే నడిపించబడితే ఏమి జరుగుతుందో ఊహించండి! ఎరబస్‌ పర్వతం వద్ద జరిగినటువంటి దుర్ఘటనలు సర్వసాధారణం అయిపోతాయనడంలో సందేహం లేదు. అలాగే, నిర్దిష్టమైన నైతిక ప్రమాణాలను వదిలేసినందుకు, నమ్మకద్రోహం మూలంగా కుటుంబాలు తునాతునకలైపోతుండగా, ఎయిడ్స్‌ మూలంగా లేక లైంగిక సంబంధాల ద్వారా సోకిన మరితర వ్యాధుల మూలంగా కోట్లాదిమంది బాధపడుతుండగా ఈలోకం భయంకరమైన, అంతకంతకూ అధికమవుతున్న దుఃఖం మరణాలనే ప్రతిఫలాలను కోస్తోంది.

నైతిక సాపేక్షవాదం జ్ఞానవంతమైనదిగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి దాని అనుచరులు ‘కుడియెడమలు’ ఎరుగని ప్రాచీన నీనెవె వాసుల్లా ఉన్నారు. నైతిక సాపేక్షవాదాన్ని అనుసరించేవారు, “కీడు మేలనియు మేలు కీడనియు” చెప్పిన మతభ్రష్ట ఇశ్రాయేలీయులను పోలి ఉన్నారు.​—⁠యోనా 4:11; యెషయా 5:⁠20.

కాబట్టి మన మనస్సాక్షి సురక్షితమైన సంకేతంగా ఉండేలా దానికి శిక్షణనిచ్చుకునేందుకు మనకు స్పష్టమైన, ఖచ్చితమైన సూత్రాలు నియమాలు ఎక్కడ లభిస్తాయి? బైబిలులో లభిస్తాయని లక్షలాదిమంది తెలుసుకున్నారు. సుశ్శీలత నుండి పని సంబంధిత నీతిసూత్రాల వరకూ, పిల్లలకు శిక్షణనివ్వడం నుండి దేవుడ్ని ఆరాధించడం వరకూ, బైబిలు ప్రాముఖ్యమైన ఏఅంశాన్నీ విడిచిపెట్టడం లేదు. (2 తిమోతి 3:​16) అది గత శతాబ్దాల్లో పూర్తిగా ఆధారపడదగినదిగా నిరూపించబడింది. బైబిలులోని నైతిక ప్రమాణాలను అత్యున్నతమైన అధికారి, అంటే మన సృష్టికర్త స్థాపించాడు గనుక అవి మానవులందరికీ సంబంధించినవి. కాబట్టి, మనం నైతికపరంగా అస్థిరమైన జీవితాన్ని గడపవలసిన అవసరం లేదు.

అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈరోజుల్లో, మీమనస్సాక్షి దాడికి గురవుతోంది. అదెలా జరుగుతోంది? మీరు మీమనస్సాక్షిని ఎలా కాపాడుకోవచ్చు? దాడి చేస్తున్న ఆవ్యక్తినీ, అతడి కుతంత్రాలనూ తెలుసుకోవడమే దానికి సరైన మార్గం. ఈవిషయాలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.