కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మనస్సాక్షిని కాపాడుకోండి

మీ మనస్సాక్షిని కాపాడుకోండి

మీ మనస్సాక్షిని కాపాడుకోండి

తప్పుగా ప్రోగ్రామ్‌ చేయబడిన కంప్యూటర్‌ ఉన్న విమానంలో ప్రయాణించడమనే తలంపు దడ పుట్టిస్తుంది. బదులుగా, ఎవరో విమానంలోని సంకేతాలిచ్చే విధానాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేశారనో లేక ఉద్దేశపూర్వకంగా దాని డేటాను తప్పుగా మార్చేశారనో అనుకోండి! సూచనార్థక భావంలో, మీమనస్సాక్షిని కూడా అలాగే చేయాలని ఒకరు ప్రయత్నిస్తున్నారు. మీనైతిక-మార్గనిర్దేశక విధానాన్ని ధ్వంసం చేయాలని అతడు నిశ్చయించుకున్నాడు. మీరు దేవుడ్ని వ్యతిరేకించేలా చేసే మార్గంపై మిమ్మల్ని నడిపించాలన్నదే అతని లక్ష్యం!​—⁠యోబు 2:2-5; యోహాను 8:44.

ఎవరీ దుష్టుడైన హానికారకుడు? బైబిలులో, అతడు “సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్ప[ము]” అని పిలువబడుతున్నాడు. (ప్రకటన 12:⁠9) అతడు ఏదెను తోటలో కార్యోన్ముఖుడై, హవ్వ తనకు సరైనదని తెలిసిన దాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా, పైకి సహేతుకంగా కనిపించే తర్కాన్ని ఉపయోగించి ఆమెను ఒప్పించాడు. (ఆదికాండము 3:​1-6,16-19) అప్పటి నుండి, ప్రజలందరూ దేవునికి శత్రువులయ్యేలా చేసే మోసపు సంస్థలన్నీ వృద్ధికావడానికి సాతాను మూలకారకుడయ్యాడు. ఈసంస్థల్లోకెల్లా ఎక్కువ నిందార్హమైనది అబద్ధ మతం.​—⁠2 కొరింథీయులు 11:14, 15.

అబద్ధమతం మనస్సాక్షిని కలుషితం చేస్తుంది

బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథములో, అబద్ధమతం మహా బబులోను అని పిలువబడే సూచనార్థక వేశ్యగా కనిపిస్తుంది. దాని బోధలు అనేకమంది ప్రజల నైతిక గ్రహణశక్తులను వక్రీకరించి, భిన్నమైన నమ్మకాలు ఉన్నవారిని ద్వేషించేలా చివరికి వారిపట్ల హింసాత్మకంగా ప్రవర్తించేలా చేసింది. వాస్తవానికి ప్రకటన గ్రంథం ప్రకారం, దేవుని ఆరాధకులతో సహా “భూమిమీద వధింపబడిన వారందరి” రక్తానికి దేవుడు అబద్ధ మతాన్ని ప్రధాన బాధ్యురాలిగా ఎంచుతాడు.​—⁠ప్రకటన 17:​1-6; 18:3, 24.

“మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది” అని చెబుతూ యేసు, అబద్ధమతం కొంతమంది నైతిక దిక్సూచిని ఎంత మేరకు ధ్వంసం చేయగలదనే దాని గురించి తన శిష్యులను హెచ్చరించాడు. హింసాత్మకమైన అలాంటి వ్యక్తులు నైతికంగా ఎంతటి అంధులో కదా! యేసు ఇలా చెప్పాడు: “వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు.” (యోహాను 16:​2,3) యేసు ఆమాటలు పలికి ఎంతోకాలం గడవక ముందే, తాము చేసిన నేరంతో తమ మనస్సాక్షిని రాజీపరచుకోగలిగిన కొంతమంది మతనాయకుల ఆజ్ఞను బట్టి ఆయన హత్య చేయబడ్డాడు. (యోహాను 11:​47-50) దీనికి భిన్నంగా, తన నిజమైన అనుచరులు తమ మధ్యనున్న ప్రేమచే గుర్తించబడతారని యేసు చెప్పాడు. కాని వారి ప్రేమ ఇంకా విస్తృతమైనది, ఎందుకంటే వారు తమ శత్రువులను కూడా ప్రేమిస్తారు.​—⁠మత్తయి 5:44-48; యోహాను 13:35.

అబద్ధమతం అనేకుల మనస్సాక్షిని ధ్వంసం చేసిన మరో మార్గం ఏమిటంటే, ప్రజాదరణ పొందిన ఏనైతికతకైనా లేదా అనైతికతకైనా వత్తాసు పలకడమే. దీని గురించి ముందుగానే తెలియజేస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొ[ను] ... కాలము వచ్చును.”​—⁠2 తిమోతి 4:⁠3,4.

ఈరోజుల్లో, వివాహేతర లైంగిక సంబంధాలు దేవునికి అంగీకారమే కావచ్చునని చెబుతూ మతనాయకులు ప్రజల దురద చెవులకు తగిన విధంగా బోధిస్తున్నారు. ఇతరులు స్వలింగ సంయోగ క్రియలను చూసీ చూడనట్లు వదిలేస్తారు. వాస్తవానికి, కొంతమంది మతనాయకుల్లో కూడా స్వలింగ సంయోగులున్నారు. ద టైమ్స్‌ అనే బ్రిటీష్‌ వార్తాపత్రికలోని ఒక ఆర్టికల్‌, “స్వలింగ సంయోగులని అందరికీ తెలిసిన పదమూడు మందిని” చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ యొక్క సాధారణ క్రైస్తవ మతగురువుల సభకు ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నది. చర్చి నాయకులు బైబిలు నైతికతను విడనాడినప్పుడు, వారి చర్చీలు దాని గురించి ఏమీ చేయనప్పుడు, ఆచర్చీల సభ్యులు ఏప్రమాణాలను ఎంచుకోవాలి? కోట్లాదిమంది పూర్తిగా అయోమయంలో ఉన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు.

బైబిలులో బోధించబడిన దీపంవంటి నైతిక, ఆధ్యాత్మిక సత్యాలచే నిర్దేశించబడడం ఎంత మేలు! (కీర్తన 43:3; యోహాను 17:​17) ఉదాహరణకు, జారులూ, వ్యభిచారులూ “దేవుని రాజ్యమునకు వారసులు” కాలేరని బైబిలు బోధిస్తోంది. (1 కొరింథీయులు 6:​9,10) “స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిం[చే]” పురుషులైనా, స్త్రీలైనా దేవుని దృష్టికి “అవాచ్యమైనది” చేస్తున్నారని అది చెబుతోంది. (రోమీయులు 1:​26,27,32) ఈనైతిక సత్యాలు అపరిపూర్ణులైన మానవులు రూపించినవి కావు; అవి దేవుని ప్రేరేపిత ప్రమాణాలు, ఆయన వాటిని ఎన్నడూ మార్చలేదు. (గలతీయులు 1:8; 2 తిమోతి 3:​16) అయితే, మనస్సాక్షిని ధ్వంసంచేసే ఇతర విధానాలు కూడా సాతాను వద్ద ఉన్నాయి.

వినోదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి

ఒక వ్యక్తి చెడు కార్యం చేసేలా ఎవరినైనా బలవంతం చేయడమే తప్పు, ఇక అలాంటి చెడు కార్యం చేయాలనే కోరికను అతడిలో చెలరేగించడం మరీ ఘోరమైన తప్పు. “ఈ లోకాధికారి” అయిన సాతాను లక్ష్యం అదే. మూర్ఖుల లేక నిస్సంశయుల​—⁠ప్రాముఖ్యంగా చాలా త్వరగా హానికి గురి కాగలవారైన యౌవనుల​—⁠మనస్సులపైనా, హృదయాలపైనా తన నీచమైన ఆలోచనా విధానాన్ని ముద్రించడానికి అతడు అనుమానాస్పదమైన సాహిత్యము, సినిమాలు, సంగీతం, కంప్యూటర్‌ గేములు, ఇంటర్‌నెట్‌పై అశ్లీలత వంటివాటిని ఉపయోగిస్తాడు.​—⁠యోహాను 14:30; ఎఫెసీయులు 2:⁠2.

“[అమెరికాలోని] యౌవనస్థులు ప్రతి సంవత్సరం 10,000 హింసాత్మకమైన దృశ్యాలను వీక్షిస్తున్నారని అంచనా వేయబడుతోంది, పిల్లల కోసం రూపొందించబడినవి అత్యంత హింసాత్మకంగా ఉంటున్నాయి” అని పెడ్యాట్రిక్స్‌ అనే పత్రికలోని ఒక నివేదిక తెలియజేసింది. “ప్రతి సంవత్సరం, యౌవనస్థులు దాదాపు 15,000 లైంగిక సన్నివేశాలను, వ్యంగ్యోక్తులను, హాస్యోక్తులను చూస్తున్నారు” అని కూడా ఆనివేదిక వెల్లడించింది. సాధారణంగా ఎక్కువమంది టీవీ చూసే సమయమైన రాత్రి వేళల్లోని కార్యక్రమాల్లో, “గంటకు 8కన్నా ఎక్కువ లైంగిక సన్నివేశాలు ఉంటున్నాయని, అది 1976 లో ఉన్నదానికన్నా నాలుగు రెట్ల కంటే ఎక్కువేనని” అది పేర్కొన్నది. “అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం అంతకంతకూ పెరిగిపోతున్నట్లు” కూడా ఆఅధ్యయనం కనుగొన్నదంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే, అలాంటి వాటిని అలవాటుగా మనస్సుల్లోకి నింపుకుంటూ ఉండడం ప్రజలపై ఘోరమైన ప్రభావాన్ని చూపుతుందని అటు బైబిలూ ఇటు అనేకానేక వైజ్ఞానిక అధ్యయనాలూ హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మీరు నిజంగా దేవుడ్ని ప్రీతిపరచాలనీ, మీకు మీరు ప్రయోజనం చేకూర్చుకోవాలనీ కోరుకుంటే, “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి ... నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని చెబుతున్న సామెతలు 4:23ను లక్ష్యపెట్టండి.​—⁠యెషయా 48:17.

ప్రజాదరణ పొందిన సంగీతంలో అధికభాగం కూడా మనస్సాక్షిని కలుషితం చేస్తుంది. చాలా పాశ్చాత్య దేశాల్లో అత్యధిక ప్రజాదరణ పొంది అగ్రస్థానానికి చేరుకున్న పాటలను పాడే ఒక గాయకుడు “షాక్‌ కలిగించడానికి ప్రత్యేక ప్రయత్నం” చేస్తాడని ఆస్ట్రేలియాకు చెందిన ద సండే మెయిల్‌ అనే వార్తాపత్రికలోని ఒక నివేదిక హెచ్చరిస్తోంది. “అతని పాటలు మాదకద్రవ్యాలను, రక్తసంబంధీకులతో లైంగిక సంబంధాన్ని, మానభంగాన్ని మహిమపరుస్తాయి” అనీ, అతడు “తన భార్యను చంపి ఆమె శవాన్ని చెరువులో పడేయడం గురించి పాడతాడు” అనీ ఆఆర్టికల్‌ పేర్కొంటోంది. అందులో ప్రస్తావించబడిన మరితర గీతాలు ఇక్కడ ప్రస్తావించలేనంత నికృష్టమైనవి. అయినప్పటికీ, ఆయన సంగీతం ఆయనకు గౌరవప్రదమైన అవార్డును సంపాదించిపెట్టింది. పైన పేర్కొన్నటువంటి అనారోగ్యకరమైన తలంపులకు సంగీతమనే చక్కెరపూత పూసినా, వాటితో మీమనస్సును, హృదయాన్ని నింపుకోవడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే అలా చేసేవారు తమ మనస్సాక్షిని కలుషితం చేసుకుని, తాము దేవుని శత్రువులుగా మారేలా చివరికి తమలో “దుష్టహృదయము”ను సృష్టించుకుంటారు.​—⁠హెబ్రీయులు 3:12; మత్తయి 12:33-35.

కాబట్టి మీరు వినోదమును ఎంపిక చేసుకునే విషయంలో జ్ఞానయుక్తంగా ఉండండి. “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి” అని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది.​—⁠ఫిలిప్పీయులు 4:⁠8.

సహవాసాలు మీమనస్సాక్షిని ప్రభావితం చేస్తాయి

చిన్న పిల్లలుగా నీల్‌, ఫ్రాంజ్‌ యథార్థ క్రైస్తవులతో ఆరోగ్యదాయకమైన సహవాసాన్ని ఆనందించేవారు. * కాని సమయం గడుస్తుండగా, “నేను చెడు సహవాసాలు చేయడం మొదలుపెట్టాను” అని నీల్‌ చెబుతున్నాడు. తత్ఫలితంగా విషాదకరమైన పర్యవసానాలు ఏమిటంటే, నేరము, జైలు. ఫ్రాంజ్‌ కథ కూడా అలాంటిదే. “ఈ లోకంలోని యౌవనస్థుల మధ్య మెలిగినా నేను ఏ మాత్రం ప్రభావితం కాకుండా ఉండగలనని అనుకున్నాను” అని ఆయన వాపోతున్నాడు. “కానీ గలతీయులు 6:7 చెబుతున్నట్లుగా, ‘దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.’ నాది తప్పనీ, యెహోవా చెప్పేదే ఒప్పనీ నేను చేదు అనుభవం ద్వారా తెలుసుకున్నాను. నేను చేసిన తప్పుకు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.”

సాధారణంగా నీల్‌, ఫ్రాంజ్‌ వంటి ప్రజలు హఠాత్తుగా ఏ నేరానికీ పాల్పడరు; మొదట్లో, ఆతలంపును కూడా వారు అసహ్యించుకోవచ్చు. కానీ దిగజారడమన్నది అంచెలంచెలుగా జరుగుతుంది, తరచుగా మొదటి అడుగు చెడు సహవాసాలే. (1 కొరింథీయులు 15:​33) తర్వాతి అడుగు, మత్తుపదార్థాలు లేక మద్యం అమితంగా సేవించడం కావచ్చు. వాస్తవానికి, మనస్సాక్షి అన్నది “మద్యంలో కరిగిపోగల, వ్యక్తిత్వంలోని ఒక భాగమని” సరిగ్గానే వర్ణించబడింది. ఇక అక్కడి నుండి, నేరం చేయడానికి లేక దుర్నీతికి పాల్పడడానికి కేవలం ఒక చిన్న అడుగు చాలు.

కాబట్టి మరి ఆమొదటి అడుగు వేయడం దేనికి? బదులుగా, దేవుడ్ని నిజంగా ప్రేమించే జ్ఞానవంతులైన ప్రజలతో సహవసించండి. మీకు ఎన్నో బాధలను తప్పించి, సరైన మార్గనిర్దేశాన్ని ఇచ్చేలా మీమనస్సాక్షిని బలపర్చుకోవడానికి వారు మీకు సహాయం చేస్తారు. (సామెతలు 13:​20) ఇప్పటికీ జైలులోనే ఉన్నా నీల్‌, ఫ్రాంజ్‌ ఇప్పుడు తమ మనస్సాక్షిని, సరైన శిక్షణనిచ్చుకోవలసిన, వాస్తవానికి విలువైనదిగా ఎంచవలసిన, దేవుడిచ్చిన బహుమానంగా దృష్టిస్తున్నారు. అంతేగాక, వారు తమ దేవుడైన యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జ్ఞానవంతులై ఉండి, వారి తప్పుల నుండి పాఠం నేర్చుకోండి.​—⁠సామెతలు 22:⁠3.

మీ మనస్సాక్షిని కాపాడుకోండి

దేవునిపట్ల ప్రేమను, విశ్వాసాన్ని, ఆరోగ్యదాయకమైన భయాన్ని పెంపొందింపజేసుకుంటే, మనం మన మనస్సాక్షిని కాపాడుకోవాలని కోరుకుంటున్నట్లే. (సామెతలు 8:13; 1 యోహాను 5:⁠3) ఈప్రభావాలు కొరవడిన మనస్సాక్షి తరచూ నైతిక స్థిరత్వం లేకుండా ఉంటుందని బైబిలు వెల్లడిస్తోంది. ఉదాహరణకు, కీర్తన 14:​1, “దేవుడు లేడని” తమ హృదయములలో అనుకునే వారి గురించి మాట్లాడుతుంది. ఈవిశ్వాసలేమి వారి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆవచనం ఇలా కొనసాగుతోంది: “వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు.”

దేవునిమీద నిజమైన విశ్వాసం లేని ప్రజలకు మేలైన భవిష్యత్తును గురించిన దృఢమైన నిరీక్షణ కూడా ఉండదు. కాబట్టి, వారు తమ శారీరక కోరికలను తీర్చుకుంటూ కేవలం ప్రస్తుతం కోసమే జీవించడానికి ఇష్టపడతారు. “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అన్నది వారి సిద్ధాంతం. (1 కొరింథీయులు 15:​32) మరోవైపున, నిత్యజీవ బహుమానంపై తమ దృష్టిని కేంద్రీకరించినవారు ఈలోకంలోని క్షణికానందాలను బట్టి మోసపోయి ప్రక్కదారి పట్టరు. ఖచ్చితమైన విమానయాన కంప్యూటర్‌లా, తర్ఫీదు పొందిన వారి మనస్సాక్షి వారిని దేవునికి యథార్థంగా విధేయత చూపడమనే మార్గంపైనే నిలకడగా ఉంచుతుంది.​—⁠ఫిలిప్పీయులు 3:⁠8.

మీ మనస్సాక్షి తన శక్తిని, స్థిరత్వాన్ని నిలుపుకోవాలంటే, దానికి దేవుని వాక్యం నుండి క్రమంగా నడిపింపు అవసరం. అలాంటి నడిపింపు అందుబాటులో ఉందని తెలియజేస్తూ, బైబిలు వివరణాత్మకమైన విధంగా ఇలా చెబుతోంది: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను​—⁠ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:​21) కాబట్టి ప్రతిరోజు బైబిలు చదవడానికి సమయాన్ని కేటాయించుకోండి. మీరు సరైనది చేయడానికి పోరాడుతున్నప్పుడు లేక చింత వ్యాకులతల మేఘాలు మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు అది మిమ్మల్ని బలపరచి, ప్రోత్సహిస్తుంది. మీరు యెహోవాపై మీసంపూర్ణ విశ్వాసాన్ని ఉంచితే ఆయన మీకు నైతికపరమైన, ఆధ్యాత్మికమైన నడిపింపును ఇస్తాడని నిశ్చయత కలిగివుండండి. అవును, “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను” అని వ్రాసిన కీర్తనకర్తను అనుకరించండి.​—⁠కీర్తన 16:⁠8; 55:22.

[అధస్సూచి]

^ పేరా 16 పేర్లు మార్చబడ్డాయి.

[5వ పేజీలోని చిత్రాలు]

బైబిలులో “మహా బబులోను” అని వర్ణించబడిన అబద్ధ మతం అనేకుల మనస్సాక్షి మొద్దుబారేలా చేసింది

[చిత్రసౌజన్యం]

ప్రీస్టు సైనికులను ఆశీర్వదించడం: U.S. Army photo

[6వ పేజీలోని చిత్రాలు]

హింసను, దుర్నీతిని వీక్షించడం మీమనస్సాక్షికి హానిచేస్తుంది

[7వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం నుండి క్రమమైన నడిపింపు మీమనస్సాక్షిని కాపాడుతుంది