కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును”

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును”

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును”

మనమందరం ఆశీర్వదించబడాలని కోరుకుంటాము. ఆశీర్వాదములు సంతోషాన్ని, సంక్షేమాన్ని, లేక సమృద్ధిని పెంపొందింపజేస్తాయి. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు యెహోవాయే గనుక, నిజమైనదీ, నిరంతరం నిలిచే ప్రతీ ఆశీర్వాదము మన ప్రేమగల సృష్టికర్త నుండే వస్తుంది. (యాకోబు 1:​17) ఆయన మానవజాతి అంతటిపైనా, చివరికి ఆయనను ఎరుగని వారిపైనా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. యేసు తన తండ్రి గురించి ఇలా చెప్పాడు: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:​45) అయితే, తనను ప్రేమించేవారి పట్ల యెహోవా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 28:1-14; యోబు 1:⁠1; 42:12.

కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యథార్థముగా ప్రవర్తించువారికి [యెహోవా] యే మేలును చేయక మానడు.” (కీర్తన 84:​11) అవును, యెహోవా సేవ చేసేవారికి సుసంపన్నమైన, అర్థవంతమైన జీవితాలు లభిస్తాయి. “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు” అని వారికి తెలుసు. “యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు” అని కూడా బైబిలు చెబుతోంది. (సామెతలు 10:22; కీర్తన 37:​22,29) అది ఎంత చక్కని ఆశీర్వాదమో కదా!

మనం యెహోవా ఆశీర్వాదాన్ని ఎలా పొందవచ్చు? ఒక మార్గం ఏమిటంటే, ఆయన ఇష్టపడే లక్షణాలను మనం అలవర్చుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 30:16, 19, 20; మీకా 6:⁠8) ప్రాచీన కాలానికి చెందిన ముగ్గురు యెహోవా సేవకుల మాదిరిలో దీన్ని మనం చూడవచ్చు.

యెహోవా తన సేవకులను ఆశీర్వదిస్తాడు

నోవహు దేవుని సేవకులలో చాలా విశిష్టమైనవాడు. ఆదికాండము 6:8 లో మనమిలా చదువుతాము: “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.” ఎందుకు? ఎందుకంటే నోవహు విధేయత చూపించాడు. ‘నోవహు దేవునితోకూడ నడిచాడని’ ఆవృత్తాంతం చెబుతోంది. నోవహు యెహోవా నీతియుక్తమైన సూత్రాలను అనుసరించి ఆయన ఆజ్ఞలను శిరసావహించాడు. లోకం హింస దుర్నీతులలో మునిగి ఉన్నప్పుడు, నోవహు “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు” చేయడానికి కదిలించబడ్డాడు, “నోవహు అట్లు చేసెను.” (ఆదికాండము 6:​9,22) ఫలితంగా యెహోవా ఆయనను, ‘నీ యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధము’ చేసుకోమని నిర్దేశించాడు. (హెబ్రీయులు 11:⁠7) ఆవిధంగా, నోవహు ఆయన కుటుంబము​—⁠వారి ద్వారా మానవజాతి అంతా​—⁠ఆతరం ఎదుర్కొన్న నాశనాన్ని తప్పించుకొని జీవించగలిగారు. పరదైసు భూమిపై నిత్యజీవమనే ఉత్తరాపేక్షతో పునరుత్థానం చేయబడే నిరీక్షణతో నోవహు మరణించాడు. ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదములను పొందాడో కదా!

అబ్రాహాముకు కూడా యెహోవా ఇష్టపడే లక్షణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది విశ్వాసం. (హెబ్రీయులు 11:​8-10) అబ్రాహాము ఊరులోను ఆతర్వాత హారానులోను సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాడు, ఎందుకంటే ఆయన సంతానం గొప్ప జనమై అన్ని జనాంగాలకు ఆశీర్వాదంగా ఉంటాడన్న యెహోవా వాగ్దానంలో ఆయనకు విశ్వాసం ఉంది. (ఆదికాండము 12:​2,3) అనేక సంవత్సరాలపాటు పరీక్షించబడినప్పటికీ, ఆయన కుమారుడైన ఇస్సాకు జన్మించినప్పుడు ఆయన విశ్వాసానికి ప్రతిఫలం లభించింది. ఇస్సాకు ద్వారా అబ్రాహాము, దేవుడు ఎంపిక చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలు జనాంగానికి, చివరికి మెస్సీయకు పూర్వీకుడయ్యాడు. (రోమీయులు 4:​19-21) అంతేగాక, “నమ్మినవారికందరికి అతడు తండ్రి,” అతడు “దేవుని స్నేహితుడని” పిలువబడ్డాడు. (రోమీయులు 4:11; యాకోబు 2:23; గలతీయులు 3:​7,29) ఆయన ఎంతటి అర్థవంతమైన జీవితాన్ని గడిపాడో, ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో కదా!

నమ్మకస్థుడైన మోషేను కూడా పరిశీలించండి. ఆయనకున్న లక్షణాల్లో అతి విశేషమైనది ఆధ్యాత్మిక విషయాలపై ఆయనకున్న మెప్పు. మోషే ఐగుప్తు సంపదలన్నిటినీ కాదని “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” కొనసాగాడు. (హెబ్రీయులు 11:​27) మిద్యానులో 40సంవత్సరాలు గడిపిన తర్వాత, ఆయన వృద్ధుడిగా ఐగుప్తుకు తిరిగి వచ్చి, తన సహోదరులను విడుదల చేయమని కోరుతూ, ఆకాలంలో అత్యున్నత అధికారి అయిన ఫరోను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. (నిర్గమకాండము 7:​1-7) ఆయన పది తెగుళ్లను, ఎర్ర సముద్రం పాయలుగా చీలడాన్ని, ఫరో సైన్యాల నాశనాన్ని చూశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, క్రొత్త జనాంగముతో తన నిబంధనకు మధ్యవర్తిత్వం నెరపడానికి మోషేను ఉపయోగించుకున్నాడు. నలభై ఏళ్ళపాటు మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యంలో నడిపించాడు. ఆయన జీవితానికి నిజమైన సంకల్పం ఉంది, ఆయన సేవలో అద్భుతమైన గొప్ప ఆశీర్వాదాలను పొందాడు.

ప్రస్తుత-దిన ఆశీర్వాదములు

దేవుని సేవ చేసేవారి జీవితాలు నిజంగా అర్థవంతమైనవని ఈవృత్తాంతాలు చూపిస్తున్నాయి. యెహోవా ప్రజలు విధేయత, విశ్వాసము, ఆధ్యాత్మిక విషయాల పట్ల మెప్పు వంటి లక్షణాలను వృద్ధి చేసుకుంటుండగా వారు మెండుగా ఆశీర్వదించబడతారు.

మనం ఎలా ఆశీర్వదించబడుతున్నాము? క్రైస్తవమత సామ్రాజ్యంలోని కోట్లాదిమంది ఆధ్యాత్మిక క్షామానికి గురవుతుండగా, “యెహోవా చేయు ఉపకారమును బట్టి” మన “ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి.” (యిర్మీయా 31:​12; ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) “జీవమునకు పోవు ద్వారము”పై నిలిచి ఉండడానికి మనకు సహాయం చేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా, యేసుక్రీస్తు ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా పుష్కలంగా అనుగ్రహిస్తున్నాడు. (మత్తయి 7:​13,14; 24:45; యోహాను 17:⁠3) మన క్రైస్తవ సహోదరత్వంతో సహవసించడం మరో గొప్ప ఆశీర్వాదం. ప్రేమను చూపించే, “నవీన స్వభావమును” ధరించుకోవడానికి తీవ్రంగా కృషిచేసే తోటి ఆరాధకులతో కూటాల్లోనూ ఇతర సందర్భాల్లోనూ కలిసి ఉండడం గొప్ప ఆనందానికి మూలం. (కొలొస్సయులు 3:8-10; కీర్తన 133:⁠1) అయితే మనకున్న అతిగొప్ప ఆశీర్వాదం యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అడుగుజాడలను అనుసరించే అమూల్యమైన ఆధిక్యతే.​—⁠రోమీయులు 5:1, 8; ఫిలిప్పీయులు 3:⁠8.

అలాంటి ఆశీర్వాదాల గురించి తలపోస్తున్నప్పుడు, దేవునికి మనం చేసే సేవ నిజంగా ఎంత అమూల్యమైనదో మనం గుర్తిస్తాము. యేసు చెప్పిన, చక్కని ముత్యములను కనుగొన్న సంచార వర్తకుని ఉపమానం గురించి బహుశా మనం ఆలోచించవచ్చు. ఈవ్యక్తి గురించి యేసు ఇలా చెప్పాడు: “అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.” (మత్తయి 13:​46) దేవునితో మన సంబంధాన్ని గురించి, ఆయన సేవచేసేందుకు మనకున్న ఆధిక్యత గురించి, మన క్రైస్తవ సహవాసం గురించి, మన క్రైస్తవ నిరీక్షణ గురించి, మన విశ్వాసానికి సంబంధించిన ఇతర ఆశీర్వాదములన్నిటి గురించి ఖచ్చితంగా మనం అలాగే భావించాలి. మన జీవితాల్లో అంతకన్నా అమూల్యమైనదేదీ లేదు.

యెహోవాకు తిరిగి ఇవ్వండి

యెహోవా ప్రతి మంచి ఈవిని ఇచ్చేవాడని మనం గ్రహిస్తాము గనుక, మనకు లభించిన ఆశీర్వాదాలను బట్టి మెప్పును వ్యక్తపర్చడానికి మన హృదయాలు పురికొల్పబడతాయి. మనమెలా మన మెప్పును వ్యక్తపర్చవచ్చు? ఒక మార్గం ఏమిటంటే, అవే ఆశీర్వాదాలను ఆనందించడానికి ఇతరులకు సహాయం చేయడం. (మత్తయి 28:​19) అందుకే, యెహోవాసాక్షులు 230 కన్నా ఎక్కువ దేశాల్లో తమ పొరుగువారిని కలవడంలో నిమగ్నమై ఉన్నారు. వారలా చేయడంలో, ఇతరులు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” పొందేలా వారికి సహాయం చేయడానికి తమకున్న పరిమితమైన వ్యక్తిగత వనరులను అంటే సమయాన్ని, శక్తిని, వస్తుసంబంధ ఆస్తులను వెచ్చిస్తారు.​—⁠1 తిమోతి 2:⁠4.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గ్లెండల్‌లో నివసిస్తున్న పయినీర్‌లను పరిశీలించండి. వారు ప్రతి శనివారం ఉదయం ఫెడరల్‌ జైలుకు వెళ్ళి తిరిగి రావడానికి దాదాపు 100కిలోమీటర్లు ప్రయాణిస్తారు. వారు అలా వెళ్ళిన ప్రతిసారీ ఖైదీలతో కేవలం కొన్ని గంటలకన్నా ఎక్కువ సమయం గడపలేకపోయినప్పటికీ వారు నిరుత్సాహం చెందరు. వారిలో ఒకరు ఇలా చెబుతున్నారు: “ఈఅసాధారణమైన క్షేత్రంలో సేవ చేయడం ఎంతో ప్రతిఫలదాయకమైనది. మేము ఎంతో ఆనందంగా ఈపని చేస్తున్నాము. అక్కడ ఎంతమంది ఆసక్తిగలవారు ఉన్నారంటే వారందరనీ కలవాలంటే మాకు కష్టమవుతోంది. ప్రస్తుతం మేము ఐదుగురితో అధ్యయనం చేస్తున్నాము, మరో నలుగురు బైబిలు అధ్యయనం కోసం అడిగారు.”

జీవాన్ని కాపాడే ఈపనిని చేయడానికి ఆసక్తిగల క్రైస్తవ పరిచారకులు తమ సేవలను ఉచితంగా అందజేయడానికి ఇష్టపడుతున్నారు. వారు, “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని చెప్పిన యేసు దృక్పథాన్ని ప్రతిబింబిస్తారు. (మత్తయి 10:⁠8) ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అలాంటి నిస్వార్థ సేవలో నిమగ్నమై ఉన్నారు, ఫలితంగా యథార్థవంతులు గుంపులు గుంపులుగా ప్రతిస్పందించి, శిష్యులు అవుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లోనే, దాదాపు 17లక్షలమంది యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. అధికమవుతున్న ఈవిస్తరణకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి బైబిళ్ళను, బైబిలు ఆధారిత ప్రచురణలను ముద్రించడం అలాగే క్రొత్త రాజ్యమందిరాలను, ఇతర కూటాల స్థలాలను నిర్మించడం అవసరం. ఈఅవసరాలను తీర్చడానికి అవసరమయ్యే డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. పూర్తిగా స్వచ్ఛంద విరాళాల నుండే వస్తుంది.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యల మూలంగా, చాలామంది తమ కుటుంబాలకు కావలసిన కనీస జీవితావసరాలను తీర్చడానికే ఎంతో కష్టపడుతున్నారు. న్యూసైంటిస్ట్‌ అనే పత్రిక ప్రకారం, వంద కోట్ల మంది తాము సంపాదించేదానిలో కనీసం 70శాతాన్ని ఆహారం కోసమే వెచ్చించాల్సివస్తోంది. మన క్రైస్తవ సహోదర సహోదరీల్లో అనేకులు అలాంటి స్థితిలోనే ఉన్నారు. తోటి విశ్వాసుల నుండి సహాయం లభించకపోతే వారు క్రైస్తవ ప్రచురణలు లేదా తగిన రాజ్య మందిరం వంటి వాటిని ఎంతమాత్రం కలిగివుండలేరు.

అయితే వారు ఇతరులు తమ బరువు మోయాలని అపేక్షిస్తున్నారని దాని భావంకాదు. కానీ వారికి సహాయం అవసరం. ఇశ్రాయేలీయులు తమకు లభించిన ఆశీర్వాదములను బట్టి యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు వస్తుపరమైన విరాళాలు తీసుకురమ్మని మోషే వారిని ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు; “నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.” (ద్వితీయోపదేశకాండము 16:​17) కాబట్టి, ఆలయంలో ఒక విధవరాలు “రెండు కాసులు” విరాళం వేయడాన్ని చూసినప్పుడు ఆయన తన శిష్యుల ఎదుట ఆమెను ప్రశంసించాడు. ఆమె తాను చేయగలిగింది చేసింది. (లూకా 21:​2,3) అలాగే, పేద పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు తాము చేయగలిగింది చేస్తారు. ఏదైనా కొరత ఉంటే, వస్తుపరంగా అంత పేదరికంలో లేని తోటి క్రైస్తవుల నుండి వచ్చే విరాళాల ద్వారా ఆకొరతను తీర్చవచ్చు.​—⁠2 కొరింథీయులు 8:13-15.

అలాంటి మార్గాల ద్వారా మనం దేవునికి తిరిగి ఇచ్చేటప్పుడు, మనం సరైన ప్రేరణ కలిగివుండడం ప్రాముఖ్యం. (2 కొరింథీయులు 8:​12) పౌలు ఇలా చెప్పాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:⁠7) హృదయపూర్వకంగా ఇవ్వడం ద్వారా మనం ఇప్పుడు జరుగుతున్న దైవపరిపాలనా విస్తృతికి మద్ధతునివ్వడమే గాక మన సొంత ఆనందాన్ని కూడా పెంపొందింపజేసుకుంటాము.​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

యెహోవా మనకు ఇచ్చినవాటిని బట్టి ఆయనకు మనం తిరిగి ఇవ్వగల రెండు మార్గాలు ఏమిటంటే, ప్రకటనా పనిలో భాగం వహించడమూ, స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడమూ. ప్రస్తుతం యెహోవాను ఎరుగని యథార్థవంతులైన ఇంకా అనేకులపై తన ఆశీర్వాదములను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడం ఎంతటి ప్రోత్సాహాన్ని ఇస్తుందో కదా! (2 పేతురు 3:⁠9) కాబట్టి, యథార్థవంతులను కనుగొని, విధేయత, విశ్వాసం, మెప్పు వంటి లక్షణాలను అలవర్చుకునేందుకు వారికి సహాయం చేయగలిగేలా మనం మన వనరులను దేవుని సేవలో ఉపయోగించడాన్ని కొనసాగిద్దాము. ఆవిధంగా, ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడానికి’ వారికి సహాయం చేసే ఆనందం మనకు లభిస్తుంది.​—⁠కీర్తన 34:⁠8.

[28, 29వ పేజీలోని బాక్సు]

ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు

“ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు.—మత్తయి 24:14.” అని వ్రాయబడి ఉన్న చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్‌లో దాన్ని చేరుస్తారు.

ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి గానీ లేదా స్థానిక బ్రాంచి కార్యాలయానికి గానీ పంపిస్తాయి. డబ్బు రూపంలోని స్వచ్ఛంద విరాళాలను నేరుగా The Watch Tower Bible and Tract Society of India, G-37, South Avenue, Santacruz, Mumbai 400 054కి గానీ మీదేశంలోవున్న బ్రాంచి కార్యాలయానికి గానీ పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. వీటితో పాటు వీటిని విరాళంగా ఇస్తున్నామని ఖచ్చితంగా తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

ప్రణాలిక వేసుకుని ఇవ్వడం

ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో, నేరుగా డబ్బునే కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఇచ్చే విరాళాలే కాక, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ ప్లాన్‌కు లబ్దిదారుగా Watch Tower Society పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలను, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగ విరమణ ఖాతాలను ఒక ట్రస్టు ఏర్పాటు ద్వారా Watch Tower Societyకి ఇవ్వవచ్చు లేదా మరణానంతరం వాటిని Watch Tower Societyకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు మరియు బాండ్లు: షేర్లను మరియు బాండ్లను పూర్తిగా కానుక రూపంలో Watch Tower Societyకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఇళ్లస్థలాలు: అమ్మదగిన ఇళ్లస్థలాలను పూర్తిగా ఒక బహుమానంగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో Watch Tower Societyకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు మీదేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Watch Tower Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు అగ్రిమెంట్‌ లబ్దిదారుగా Watch Tower Society పేరు వ్రాయవచ్చు.

అలా సొసైటీని లబ్దిదారుగా పేర్కొంటూ వీలునామా వ్రాసేటప్పుడు దయచేసి ఇండియన్‌ సక్సెషన్‌ యాక్ట్‌, 1925 లోని సెక్షన్‌ 118ని గమనించండి, “సోదరుని లేదా సోదరి కుమారుడు లేదా కుమార్తె ఉన్న వ్యక్తి, తన మరణానికి పన్నెండు నెలల ముందు వీలునామా వ్రాస్తేనే గాని, మతపరమైన లేదా ధార్మిక అవసరాల కోసం ఆస్తిని ఇచ్చే ఎటువంటి అధికారం ఆయనకు ఉండదు. అంతేకాదు, సజీవంగా ఉన్న వ్యక్తుల వీలునామాల సంరక్షణ కోసం చట్టం ఏర్పాటుచేసిన స్థలంలో ఆ వీలునామాని ఉంచిన పక్షంలోనే అది చెల్లుతుంది.”

మీరు మీవీలునామాలో లబ్దిదారుగా Watch Tower Society పేరును వ్రాయాలనుకుంటే, వీలునామాలో సొసైటీ పూర్తి పేరును, చిరునామాను దయచేసి వ్రాయండి:

The Watch Tower Bible and Tract Society of India

G-37, South Avenue,

Santa Cruz,

Mumbai - 400 054.