కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దీర్ఘశాంతముగల దేవుడు

యెహోవా దీర్ఘశాంతముగల దేవుడు

యెహోవా దీర్ఘశాంతముగల దేవుడు

‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప గల దేవుడు.’​—⁠నిర్గమకాండము 34:⁠6.

1, 2. (ఎ) గతంలో ఎవరు యెహోవా దీర్ఘశాంతము నుండి ప్రయోజనం పొందారు? (బి)“దీర్ఘశాంతము” అంటే ఏమిటి?

నోవహు దినాల్లోని ప్రజలు, మోషేతో అరణ్యంలో తిరుగాడుతున్న ఇశ్రాయేలీయులు, యేసు భూమ్మీద నడచిన కాలంలోని యూదులు​—⁠వీరందరూ వేర్వేరు పరిస్థితుల్లో జీవించారు. కానీ వీరందరూ యెహోవా యొక్క దయాపూర్వకమైన లక్షణం నుండి ప్రయోజనం పొందారు​—⁠అదే దీర్ఘశాంతము. కొందరి విషయంలో అది జీవితాల్ని కాపాడుకోవడానికి దారితీసింది. అలాగే యెహోవా దీర్ఘశాంతము మన జీవితాలను కాపాడుకోవడానికి కూడా దారితీయగలదు.

2 దీర్ఘశాంతము అంటే ఏమిటి? యెహోవా దాన్ని ఎప్పుడు ఎందుకు చూపిస్తాడు? “దీర్ఘశాంతము” అనే మాట “అన్యాయం జరిగినా కోపాన్ని తెప్పించినా ఓర్పుగా సహించడం, అలాగే దెబ్బతిన్న సంబంధం మెరుగవుతుందన్న నిరీక్షణను వదులుకోకపోవడం” అని నిర్వచించబడింది. కాబట్టి ఈలక్షణానికి ఒక సంకల్పం ఉంది. అది ప్రాముఖ్యంగా అవాంఛనీయ పరిస్థితిని సృష్టిస్తున్న వ్యక్తి సంక్షేమాన్ని కోరుకుంటుంది. అయితే దీర్ఘశాంతము కలిగివుండడం అంటే అన్యాయాన్ని మన్నించడం అని కాదు. దీర్ఘశాంతము యొక్క సంకల్పం నెరవేరినప్పుడు, లేదా ఫలాని పరిస్థితితో సర్దుకుపోవడంలో ఇక ఎలాంటి లాభమూ లేనప్పుడు దీర్ఘశాంతము ఇక చూపించబడదు.

3. యెహోవా దీర్ఘశాంతానికి ఏ సంకల్పం ఉంది, దాని హద్దు ఏమిటి?

3 మానవులు దీర్ఘశాంతముతో ఉంటారు, అయితే ఈలక్షణానికి అతి శ్రేష్ఠమైన మాదిరి యెహోవాయే. యెహోవాకూ ఆయన సృష్టియైన మానవులకూ మధ్యగల సంబంధంలో పాపం కల్లోలాన్ని సృష్టించినప్పటి నుండి, మన సృష్టికర్త ఓర్పుగా సహనాన్ని కనపర్చాడు, అంతేగాక పశ్చాత్తాపం చెందిన మానవులు ఆయనతో తమకుగల సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి మాధ్యమాన్ని దయచేశాడు. (2 పేతురు 3:⁠9; 1 యోహాను 4:​10) కానీ దేవుని దీర్ఘశాంతము దాని సంకల్పాన్ని నెరవేర్చాక, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నవారికి విరుద్ధంగా ఆయన చర్య తీసుకుంటాడు, ప్రస్తుత దుష్ట విధానానికి అంతాన్ని తీసుకువస్తాడు.​—⁠2 పేతురు 3:⁠7.

దేవుని ప్రాథమిక లక్షణాలతో పొందిక

4. (ఎ) హీబ్రూ లేఖనాల్లో దీర్ఘశాంతము అన్న తలంపు ఎలా వ్యక్తం చేయబడింది? (అధస్సూచి కూడా చూడండి.) (బి)ప్రవక్తయైన నహూము యెహోవాను ఎలా వర్ణిస్తున్నాడు, అది యెహోవా దీర్ఘశాంతాన్ని గురించి ఏమి వెల్లడిపరుస్తుంది?

4 హీబ్రూ లేఖనాల్లో దీర్ఘశాంతమనే తలంపు రెండు హీబ్రూ పదాల్లో వ్యక్తం చేయబడింది, వాటికి అక్షరార్థంగా “ముక్కుపుటాల పొడవు” అని భావం; ఇవి న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో “కోపించుటకు నిదానించు” అని అనువదించబడ్డాయి. * దేవుని దీర్ఘశాంతాన్ని గురించి మాట్లాడుతూ ప్రవక్తయైన నహూము ఇలా అన్నాడు: “యెహోవా దీర్ఘశాంతుడు, [“కోపించుటకు నిదానించువాడు,” NW] మహాబలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు.” (నహూము 1:⁠3) కాబట్టి యెహోవా దీర్ఘశాంతము ఏదో బలహీనతకు చిహ్నం కాదు, దానికి హద్దులున్నాయి. సర్వశక్తుడైన దేవుడు కోపించుటకు నిదానించేవాడు, అదే సమయంలో మహా బలము గలవాడు అన్న వాస్తవం ఆయన దీర్ఘశాంతము సంకల్పంతో కూడిన నిగ్రహ ఫలితమేనని చూపిస్తుంది. ఆయనకు శిక్షించే అధికారముంది, కానీ ఆయన వెంటనే అలా చేయకుండా తప్పిదస్థుడు మారడానికి అవకాశమిచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఆగుతాడు. (యెహెజ్కేలు 18:​31,32) కాబట్టి యెహోవా దీర్ఘశాంతము ఆయన ప్రేమ యొక్క వ్యక్తీకరణయైవుంది, అది ఆయన తన శక్తిని ఉపయోగించడంలో చూపించే జ్ఞానాన్ని వెల్లడిచేస్తుంది.

5. యెహోవా దీర్ఘశాంతము ఆయన న్యాయంతో ఎలా పొందిక కలిగివుంది?

5 యెహోవా దీర్ఘశాంతము ఆయన న్యాయంతో నీతితో కూడా పొందిక కలిగివుంటుంది. తాను ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడనని’ మోషేకు వెల్లడిచేసుకున్నాడు. (నిర్గమకాండము 34:⁠6) కొన్ని సంవత్సరాల తర్వాత మోషే యెహోవాను స్తుతిస్తూ ఇలా పాడాడు: “ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:⁠4) అవును యెహోవా కనికరం, దీర్ఘశాంతము, న్యాయము, నీతి అన్నీ కలిసికట్టుగా పొందికగా పనిచేస్తాయి.

జలప్రళయానికి పూర్వం యెహోవా చూపించిన దీర్ఘశాంతము

6. ఆదాము హవ్వల సంతానం పట్ల యెహోవా తన దీర్ఘశాంతానికి ఎలాంటి గమనార్హమైన రుజువును ఇచ్చాడు?

6 ఏదెనులో ఆదాము హవ్వల తిరుగుబాటు తమ ప్రేమగల సృష్టికర్త అయిన యెహోవాతో తమ అమూల్యమైన సంబంధాన్ని శాశ్వతంగా తెగనరికింది. (ఆదికాండము 3:​8-13,23,24) ఇలా విడిపోవడం వారి సంతానాన్ని కూడా ప్రభావితం చేసింది, వారు పాపాన్ని, అపరిపూర్ణతను, మరణాన్ని వారసత్వంగా పొందారు. (రోమీయులు 5:​17-19) మొదటి మానవ దంపతులు ఉద్దేశపూర్వకంగా పాపం చేసినప్పటికీ వారు పిల్లల్ని కనేందుకు యెహోవా అనుమతించాడు. తర్వాత ఆయన ఆదాము హవ్వల సంతానం తనతో సమాధానపరచబడే మాధ్యమాన్ని ప్రేమతో అందజేశాడు. (యోహాను 3:​16,36) అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.”​—⁠రోమీయులు 5:8-10.

7. జలప్రళయానికి ముందు యెహోవా దీర్ఘశాంతాన్ని ఎలా కనపర్చాడు, జలప్రళయపూర్వపు తరం నాశనం కావడం ఎందుకు న్యాయోచితం?

7 యెహోవా దీర్ఘశాంతము నోవహు దినాల్లో కనిపించింది. జలప్రళయానికి ఒక శతాబ్దానికి ముందే “దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.” (ఆదికాండము 6:​12) అయినా కొంతకాలంపాటు యెహోవా మానవజాతిపట్ల దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఆయన, “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.” (ఆదికాండము 6:⁠3) ఆ120 ఏండ్ల మూలంగా, విశ్వసనీయుడైన నోవహు కుటుంబాన్ని ప్రారంభించేందుకూ, దేవుని ఆజ్ఞ లభించిన తర్వాత ఒక ఓడను కట్టడానికీ, రాబోయే జలప్రళయాన్ని గురించి తన సమకాలీనులను హెచ్చరించడానికీ కావలసినంత సమయం లభించింది. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ... ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.” (1 పేతురు 3:​19,20) నిజమే, నోవహు సమీప కుటుంబ సభ్యులు కానివారు ఆయన ప్రకటించినా “ఎరుగక పోయిరి.” (మత్తయి 24:​38,39) కానీ నోవహుచేత ఓడను కట్టించడం ద్వారా, బహుశ కొన్ని దశకాలపాటు ఆయన ‘నీతిని ప్రకటించేలా’ చేయడం ద్వారా యెహోవా, నోవహు సమకాలీనులు తమ హింసాపూరిత మార్గాల విషయమై పశ్చాత్తాపపడి తనను సేవించేలా మరలేందుకు కావలసినంత అవకాశాన్ని ఇచ్చాడు. (2 పేతురు 2:⁠5; హెబ్రీయులు 11:⁠7) చివరికి ఆదుష్ట తరం నాశనం కావడం పూర్తిగా న్యాయోచితమే.

ఇశ్రాయేలుపట్ల దీర్ఘశాంతము మాదిరికరం

8. ఇశ్రాయేలు జనాంగం పట్ల యెహోవా ఎలా దీర్ఘశాంతము కనపర్చాడు?

8 ఇశ్రాయేలు పట్ల యెహోవా దీర్ఘశాంతము 120సంవత్సరాల కన్నా చాలా ఎక్కువకాలమే నిలిచింది. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలుగా 1,500 సంవత్సరాలకుపైగా ఉన్న ఇశ్రాయేలీయుల చరిత్రలో వారు దేవుని దీర్ఘశాంతాన్ని చివరికంటా పరీక్షించిన సందర్భాలు కోకొల్లలు. ఐగుప్తు నుండి అద్భుతరీతిన విడుదల పొందిన కొన్ని వారాలకే వారు విగ్రహారాధన తట్టు తిరిగారు, తమ రక్షకుని పట్ల ఘోరమైన అగౌరవాన్ని ప్రదర్శించారు. (నిర్గమకాండము 32:⁠4; కీర్తన 106:​21,22) ఆతర్వాతి దశకాల్లో ఇశ్రాయేలీయులు అరణ్యంలో అద్భుతరీతిన అందించబడిన ఆహారం గురించి ఫిర్యాదుచేశారు, మోషే అహరోనులకు విరుద్ధంగా సణిగారు, యెహోవాకు విరుద్ధంగా మాట్లాడారు, అన్యులతో వ్యభిచరించారు, చివరికి బయలు ఆరాధనలో పాల్గొన్నారు కూడా. (సంఖ్యాకాండము 11:​4-6; 14:​2-4; 21:⁠5; 25:​1-3; 1 కొరింథీయులు 10:​6-11) యెహోవా తన ప్రజలను న్యాయోచితంగానే సమూలంగా తుడిచిపెట్టివుండగలిగేవాడు, కానీ దీర్ఘశాంతాన్ని కనపర్చాడు.​—⁠సంఖ్యాకాండము 14:11-21.

9. యెహోవా న్యాయాధిపతుల కాలంలోను రాజుల కాలంలోను దీర్ఘశాంతముగల దేవుడనని ఎలా నిరూపించుకున్నాడు?

9 న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు విగ్రహారాధనలో పడిపోయారు. వారలా పడిపోయినప్పుడు యెహోవా వారిని వారి శత్రువులకు అప్పగించాడు. కానీ వారు పశ్చాత్తాపపడి సహాయాన్ని అర్థించినప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని చూపించి వారిని విడిపించడానికి న్యాయాధిపతులను నియమించాడు. (న్యాయాధిపతులు 2:​17,18) సుదీర్ఘంగా కొనసాగిన రాజుల కాలంలో యెహోవా పట్ల చాలా కొద్దిమంది రాజులు మాత్రమే సంపూర్ణ భక్తిని చూపించారు. విశ్వసనీయులైన రాజుల క్రింద కూడా ప్రజలు తరచు సత్యారాధనను అబద్ధారాధనతో సమ్మిళితం చేశారు. విశ్వాసఘాతుకం చేయవద్దని హెచ్చరించడానికి యెహోవా ప్రవక్తలను నియమించినప్పుడు ప్రజలు సాధారణంగా భ్రష్టులైన యాజకుల అబద్ధ ప్రవక్తల మాటలు వినడానికే ఇష్టపడ్డారు. (యిర్మీయా 5:​31; 25:​4-7) నిజానికి ఇశ్రాయేలీయులు విశ్వసనీయులైన ప్రవక్తలను హింసించారు, చివరికి వారిలో కొందరిని చంపేశారు కూడా. (2 దినవృత్తాంతములు 24:​20,21; అపొస్తలుల కార్యములు 7:​51,52) అయినా యెహోవా దీర్ఘశాంతాన్ని కనపరుస్తూనే ఉన్నాడు.​—⁠2 దినవృత్తాంతములు 36:⁠15.

యెహోవా దీర్ఘశాంతము అంతం కాలేదు

10. యెహోవా దీర్ఘశాంతము ఎప్పుడు హద్దును చేరుకుంది?

10 అయితే దేవుని దీర్ఘశాంతానికి ఒక హద్దు ఉందని చరిత్ర చూపిస్తోంది. సా.శ.పూ. 740 లో అష్షూరీయులు పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని కూలద్రోసి దాని నివాసులను చెరలోకి తీసుకువెళ్ళేలా ఆయన అనుమతించాడు. (2 రాజులు 17:​5,6) ఆతర్వాతి శతాబ్దాంతంలో, బబులోనీయులు రెండు గోత్రాల యూదా రాజ్యంపై దండెత్తి యెరూషలేమునూ దాని దేవాలయాన్ని నాశనం చేసేందుకు ఆయన అనుమతించాడు.​—⁠2 దినవృత్తాంతములు 36:16-19.

11. యెహోవా తీర్పును అమలు చేస్తున్నప్పుడు కూడా దీర్ఘశాంతాన్ని ఎలా ప్రదర్శించాడు?

11 అయితే ఇశ్రాయేలు యూదాలకు విరుద్ధంగా తన తీర్పులను అమలుచేస్తున్నప్పుడు కూడా యెహోవా దీర్ఘశాంతాన్ని కనపర్చడం మర్చిపోలేదు. తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా తాను ఎంపిక చేసుకున్న ప్రజల పునఃస్థాపనను గురించి ప్రవచించాడు. ఆయనిలా అన్నాడు: “బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నన్ను నేను మీకు కనుపరచుకొందును; ... నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను.”​—⁠యిర్మీయా 29:10,14.

12. మెస్సీయ రాక సంబంధంగా చూస్తే యూదుల శేషం యూదాకు తిరిగిరావడం దేవుని నిర్దేశానుసారమేనని ఎందుకు చెప్పగలం?

12 చెరలోకి వెళ్లిన యూదుల్లో కొంత శేషం యూదాకు తిరిగిరానే వచ్చారు, యెరూషలేములోని పునర్నిర్మిత దేవాలయంలో యెహోవా ఆరాధనను తిరిగి ప్రారంభించనే ప్రారంభించారు. యెహోవా సంకల్పాల నెరవేర్పులో ఈశేషము “యెహోవా కురిపించు మంచువలె” అయ్యారు, మంచు నూతనోల్లాసాన్ని సమృద్ధిని తీసుకువస్తుంది. వారు “అడవిమృగములలో సింహమువలె” ధైర్యంగా బలంగా కూడా ఉన్నారు. (మీకా 5:​7,8) ఈరెండవ వ్యక్తీకరణ బహుశ, మక్కబీయుల కాలంలో యూదులు మక్కబీ కుటుంబ నేతృత్వంలో, వాగ్దానం చేయబడిన దేశం నుండి తమ శత్రువులను వెళ్ళగొట్టి అపవిత్రం చేయబడిన దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసినప్పుడు నెరవేరివుంటుంది. ఆవిధంగా దేశము, దేవాలయము రెండూ కాపాడబడ్డాయి, తద్వారా దేవుని కుమారుడు మెస్సీయాగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను ఆహ్వానించడానికి మరో విశ్వసనీయమైన ప్రజల శేషం ఉండడం సాధ్యమయ్యింది.​—⁠దానియేలు 9:​25; లూకా 1:​13-17,67-79; 3:15, 21,22.

13. యూదులు తన కుమారుణ్ణి చంపిన తర్వాత కూడా యెహోవా వారిపట్ల దీర్ఘశాంతాన్ని ఎలా చూపించాడు?

13 యూదులు తన కుమారుణ్ణి చంపిన తర్వాత కూడా యెహోవా వారిపట్ల ఇంకా మూడున్నర సంవత్సరాలు దీర్ఘశాంతాన్ని చూపించాడు, అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక సంతానంలో భాగమయ్యేందుకు పిలుపునందుకోగల అవకాశాన్ని కేవలం వారికి మాత్రమే అందించాడు. (దానియేలు 9:​27) * సా.శ.36వ సంవత్సరానికి మునుపూ, ఆతర్వాతా కొందరు యూదులు ఈపిలుపును స్వీకరించారు, పౌలు ఆతర్వాత చెప్పినట్లుగా, “కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది.”​—⁠రోమీయులు 11:⁠5.

14. (ఎ) అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక సంతానంలో భాగమయ్యే ఆధిక్యత సా.శ.36 లో ఎవరికి అందించబడింది? (బి)ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులను యెహోవా ఎంపిక చేసుకునే విధానం విషయంలో పౌలు తన భావాలను ఎలా వ్యక్తం చేశాడు?

14 అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక సంతానంలో భాగమయ్యే ఆధిక్యత సా.శ.36 లో మొట్టమొదటి సారిగా యూదులు కాని వారికి యూదా మతప్రవిష్టులు కాని వారికి అందించబడింది. ఇందుకు ప్రతిస్పందించినవారు యెహోవా కృపను దీర్ఘశాంతాన్ని కూడా అనుభవించేవారయ్యారు. (గలతీయులు 3:​26-29; ఎఫెసీయులు 2:​4-7) ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా రూపొందే అందరినీ యెహోవా కరుణతో దీర్ఘశాంతాన్ని వహించడం ద్వారానే సమకూరుస్తాడు, ఈదీర్ఘశాంతంలోగల జ్ఞానాన్ని, దాని సంకల్పాన్ని గుణగ్రహించి ప్రగాఢమైన మెప్పుదలను వ్యక్తం చేస్తూ పౌలు ఇలా విస్మయం చెందాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు!”​—⁠రోమీయులు 11:​25,26,33; గలతీయులు 6:​15,16.

తన నామము నిమిత్తం దీర్ఘశాంతము

15. దేవుని దీర్ఘశాంతానికి ప్రాథమిక కారణం ఏమిటి, ఏ వివాదాంశ పరిష్కారానికి సమయం అవసరమయ్యింది?

15 యెహోవా దీర్ఘశాంతాన్ని ఎందుకు కనపరుస్తాడు? ప్రాథమికంగా తన పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోవడానికీ, తన సర్వాధిపత్యాన్ని రుజువు పరచుకోవడానికీను. (1 సమూయేలు 12:​20-22) యెహోవా తన సర్వాధిపత్యాన్ని ఉపయోగించే రీతి విషయమై సాతాను లేవనెత్తిన నైతికపరమైన వివాదాంశాన్ని సర్వ సృష్టి ఎదుట సంతృప్తికరంగా పరిష్కరించడానికి కొంత సమయం అవసరమయ్యింది. (యోబు 1:​9-11; 42:​2,5,6) అందుకనే ఐగుప్తులో తన ప్రజలు అణచివేతకు గురవుతున్నప్పుడు యెహోవా ఫరోతో ఇలా అన్నాడు: “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.”​—⁠నిర్గమకాండము 9:⁠16.

16. (ఎ) యెహోవా దీర్ఘశాంతము తన నామము కొరకు ఒక జనమును సిద్ధం చేయడాన్ని ఎలా సాధ్యపరిచింది? (బి)యెహోవా నామము ఎలా పరిశుద్ధపరచబడుతుంది, ఆయన సర్వాధిపత్యము ఎలా రుజువుపరచబడుతుంది?

16 దేవుడు తన పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోవడంలో ఆయన దీర్ఘశాంతం వహించే పాత్రను గురించి అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నప్పుడు యెహోవా ఫరోతో పలికిన మాటలను ఎత్తివ్రాశాడు. ఆతర్వాత పౌలు ఇలా వ్రాశాడు: “ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆప్రకారము​—⁠నా ప్రజలు కానివారికి నా ప్రజలని ... పేరు పెట్టుదును ... అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.” (రోమీయులు 9:​17,22-26) యెహోవా దీర్ఘశాంతాన్ని వహించాడు కాబట్టి ఆయన జనాంగముల నుండి “తన నామము కొరకు ఒక జనమును” ఏర్పరచుకోగలిగాడు. (అపొస్తలుల కార్యములు 15:​14) తమ నాయకుడైన యేసుక్రీస్తు క్రింద ఉన్న ఈ“పరిశుద్ధులు,” యెహోవా తన గొప్ప నామాన్ని పరిశుద్ధపరచుకోవడానికీ తన సర్వాధిపత్యాన్ని రుజువుపరచుకోవడానికీ తాను ఉపయోగించే రాజ్యానికి వారసులు.​—⁠దానియేలు 2:44; 7:13, 14, 27; ప్రకటన 4:9-11; 5:​9,10.

యెహోవా దీర్ఘశాంతము రక్షణకు దారితీస్తుంది

17, 18. (ఎ) మనం ఏమి చేస్తే మనకు తెలియకుండానే, యెహోవా దీర్ఘశాంతము వహిస్తున్నందుకు ఆయనను విమర్శిస్తున్న వారము అవుతాము? (బి)యెహోవా దీర్ఘశాంతాన్ని మనమెలా దృష్టించడానికి ప్రోత్సహించబడుతున్నాము?

17 మానవజాతి తొలుత వినాశకరమైన పాపంలో పడిపోవడం మొదలుకొని ఇప్పటి వరకు యెహోవా తానొక దీర్ఘశాంతముగల దేవుడనని చూపించుకున్నాడు. జలప్రళయం ముందు ఆయన కనపర్చిన దీర్ఘశాంతము మూలంగా సరిపడా హెచ్చరికను చేయడానికి, రక్షణ నిమిత్తం ఒక మాధ్యమాన్ని నిర్మించడానికి సమయం లభించింది. కానీ చివరికి ఆయన ఓర్పు హద్దులకు చేరుకుంది, జలప్రళయం వచ్చింది. అదే విధంగా నేడు కూడా యెహోవా ఎంతో దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు, మరిది బహుశ కొందరు ఊహించిన దానికన్నా ఎక్కువ కాలమే కొనసాగుతోంది. అయినా, నిస్పృహకు గురికావడానికి ఇది కారణం కాకూడదు. అలానే గనుక చేస్తే అది దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నందుకు ఆయన్ను విమర్శించడంతో సమానం అవుతుంది. పౌలు ఇలా అడుగుతున్నాడు: “దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?”​—⁠రోమీయులు 2:⁠4.

18 రక్షణ పొందడానికి దేవుని అంగీకారం మనకు ఉందని నిశ్చయంగా భావించడానికి ఆయన దీర్ఘశాంతము ఎంతమేరకు మనకు అవసరం అవుతుందనేది మనలో ఎవరమూ పూర్తిగా తెలుసుకోలేము. ‘భయముతోను వణకుతోను మన సొంతరక్షణను కొనసాగించుకోవాలి’ అని పౌలు మనకు సలహా ఇస్తున్నాడు. (ఫిలిప్పీయులు 2:​12) అపొస్తలుడైన పేతురు తన తోటి క్రైస్తవులకిలా వ్రాశాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (ఇటాలిక్కులు మావి.)​—⁠2 పేతురు 3:⁠9.

19. మనం యెహోవా దీర్ఘశాంతము నుండి ఏ విధంగా ప్రయోజనం పొందగలము?

19 కాబట్టి, మనం యెహోవా కార్యవిధానాల విషయంలో అసహనాన్ని కనపర్చక ఉందాము. బదులుగా, పేతురు తర్వాత ఇచ్చిన సలహాను పాటిస్తూ ‘మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొందాము.’ ఎవరి రక్షణార్థము? మన రక్షణార్థమూ, అలాగే ఇంకా పొడిగిస్తే, “రాజ్య సువార్త”ను ఇంకా వినాల్సివున్న అసంఖ్యాకులైన ప్రజల రక్షణార్థమూ. (2 పేతురు 3:​15; మత్తయి 24:​14) ఈవిషయాన్ని అర్థం చేసుకోవడం యెహోవా ఎంతో ఔదార్యంతో కనపరుస్తున్న దీర్ఘశాంతాన్ని అమూల్యంగా ఎంచేందుకు సహాయం చేస్తుంది, అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనమూ దీర్ఘశాంతముతో ఉండేందుకు సహాయం చేస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 4 హీబ్రూ భాషలో “ముక్కు” లేదా “ముక్కుపుటాలు” అన్న అర్థం ఇచ్చే పదం (ఆఫ్‌) తరచూ సూచనార్థకంగా కోపానికి ఉపయోగించబడింది. ఎందుకంటే ఆగ్రహంతో ఉన్న వ్యక్తి శ్వాస తీవ్రంగా ఉంటుంది, ముక్కుపుటాలు అదురుతుంటాయి.

^ పేరా 13 ఈ ప్రవచనంపై మరింత వివరణ కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) పుస్తకంలోని 191-4 పేజీలు చూడండి.

మీరు వివరించగలరా?

• బైబిలులో “దీర్ఘశాంతము” అనే మాటకుగల అర్థం ఏమిటి?

• యెహోవా జలప్రళయానికి ముందు, బబులోను చెర తర్వాత, ఇంకా సా.శ. మొదటి శతాబ్దంలోను దీర్ఘశాంతాన్ని ఎలా కనపర్చాడు?

• యెహోవా ఏ ప్రముఖ కారణాలను బట్టి దీర్ఘశాంతాన్ని కనపర్చాడు?

• మనం యెహోవా దీర్ఘశాంతాన్ని ఏ విధంగా దృష్టించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

జలప్రళయానికి ముందు యెహోవా చూపించిన దీర్ఘశాంతము ప్రజలు పశ్చాత్తాపపడేందుకు కావలసినంత అవకాశాన్ని ఇచ్చింది

[10వ పేజీలోని చిత్రం]

బబులోను కూలిన తర్వాత యూదులు యెహోవా దీర్ఘశాంతము నుండి ప్రయోజనం పొందారు

[11వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దంలో అటు యూదులు ఇటు యూదులు కానివారు యెహోవా దీర్ఘశాంతము నుండి ప్రయోజనం పొందారు

[12వ పేజీలోని చిత్రాలు]

నేడు క్రైస్తవులు యెహోవా దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు