కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవలో సుసంపన్నమైన జీవితం

యెహోవా సేవలో సుసంపన్నమైన జీవితం

జీవిత కథ

యెహోవా సేవలో సుసంపన్నమైన జీవితం

రస్సెల్‌ కర్జన్‌ చెప్పినది

అది మొదటి ప్రపంచ యుద్ధం విరుచుకుపడడంతో ప్రారంభమైన గమనార్హమైన శకానికి ఏడు సంవత్సరాలు పూర్వం. 1907, సెప్టెంబరు 22న నేనీ భూమ్మీద పడ్డాను. అప్పటికే మాకుటుంబం అతి ప్రాముఖ్యమైన విధానంలో సంపన్నవంతంగా ఉంది. మాగురించి కొంత విన్నాక అది నిజమని మీరు ఒప్పుకుంటారని నేననుకుంటున్నాను.

మాకర్జన్‌ నానమ్మ చిన్నతనంలోనే దేవుని విషయంలో సత్యాన్ని వెదకడం ప్రారంభించింది. ఆమె టీనేజ్‌కి రాకముందే స్విట్జర్లాండ్‌లోని ఎంతో సుందరమైన స్పీట్జ్‌ అనే తన సొంత ఊరిలో అనేక చర్చీలకు వెళ్ళింది. ఆమె పెళ్ళయిన కొన్ని సంవత్సరాలకు, అమెరికాకు వెల్లువలా వచ్చిన వలసదారులతోపాటు కర్జన్‌ కుటుంబం 1887 లో అమెరికాకు వచ్చింది.

ఆ కుటుంబం 1900 దరిదాపుల్లో ఒహాయోలో స్థిరపడింది, నానమ్మ తాను అన్వేషిస్తూన్న నిధిని కనుగొన్నది. ఆనిధి ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ వ్రాసిన, జర్మన్‌ భాషలోకి అనువదించబడిన సమయం ఆసన్నమైంది (ఆంగ్లం) అనే పుస్తకంలో దొరికింది. తాను చదివిన పుస్తకంలో బైబిలు సత్యపు వెలుగు ఉందని ఆమె వెంటనే గ్రహించింది. నానమ్మకు ఇంగ్లీషు చదవడం చాలా కష్టంగా ఉన్నా ఆమె ఇంగ్లీషులోని కావలికోట పత్రికకు చందా కట్టింది. అలా ఆమె మరిన్ని బైబిలు సత్యాలను తెలుసుకున్నది, అదే సమయంలో ఇంగ్లీషు భాష కూడా నేర్చుకుంది. నానమ్మ నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక విషయాలపట్ల తాతగారు నానమ్మ చూపించినంత ఆసక్తిని ఎన్నడూ చూపించలేదు.

కర్జన్‌ నానమ్మకు పుట్టిన 11 మంది పిల్లల్లో, జాన్‌ అడాల్ఫ్‌ అనే ఇద్దరు కొడుకులు ఆమె కనుగొన్న ఆధ్యాత్మిక నిధిని అమూల్యంగా ఎంచారు. జాన్‌ మానాన్నగారు, ఆయన మిస్సూరీలోని సెయింట్‌ లూయిస్‌లో 1904 లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. సెయింట్‌ లూయిస్‌లో వరల్డ్స్‌ ఫెయిర్‌ అనే ఎగ్జిబిషన్‌ జరుగుతున్నప్పుడే ఆసమావేశము జరపబడింది, ఆసమయంలో ట్రైన్‌ చార్జీలు తగ్గించబడ్డాయి కాబట్టి ఆతగ్గింపు చార్జీల నుండి ప్రయోజనం పొందేందుకు తేదీలు అలా ఏర్పాటు చేయబడ్డాయి, బైబిలు విద్యార్థుల్లో అత్యధికులు అంత ధనవంతులు కాదు. తర్వాత 1907 లో మాఅడాల్ఫ్‌ చిన్నాన్నగారు న్యూయార్క్‌లోని నయాగరా ఫాల్స్‌లో జరిగిన ఒక సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు. మానాన్నగారు మాచిన్నాన్నగారు తాము బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను అత్యంతాసక్తితో ప్రకటించారు, వారిద్దరూ చివరికి పూర్తికాల పరిచారకులయ్యారు (ఇప్పుడు పయినీర్లు అని పిలువబడుతున్నారు).

అలా నేను 1907 లో పుట్టే సరికే మాకుటుంబము ఆధ్యాత్మిక భావంలో సుసంపన్నంగా ఉంది. (సామెతలు 10:​22) జాన్‌ ఐడా అనే నా తల్లిదండ్రులు నన్ను ఒహాయోలోని పుట్‌-ఇన్‌-బేలో 1908 లో జరిగిన “విజయంవైపు పయనం” అనే సమావేశానికి తీసుకెళ్ళేసరికి నేనింకా పసిపిల్లాడినే. అక్కడ అప్పట్లో ప్రయాణ పరిచారకుడిగా ఉన్న జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ సమావేశ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకు కొన్ని వారాల క్రితం ఆయన ఒహాయోలోని డాల్టన్‌ పట్టణానికి వెళ్ళారు, అక్కడాయన మాఇంటికి వెళ్లి స్థానిక బైబిలు విద్యార్థులకు ప్రసంగాలు ఇచ్చారు.

నాకు ఆవిషయాలు ఏమీ గుర్తు లేవనుకోండి, కానీ మేరీలాండ్‌లోని మౌంటెన్‌ లేక్‌ పార్క్‌ పట్టణంలో 1911 లో జరిగిన సమావేశం మాత్రం నాకు గుర్తుంది. అక్కడ నేనూ మాచెల్లి ఎస్తేరు ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ను కలిశాము, అప్పట్లో బైబిలు విద్యార్థుల ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నది ఆయనే.

సారాయెవోలో ఆర్క్‌డ్యూక్‌ ఫెర్డినాండ్‌ ఆయన భార్య ఇద్దరూ 1914, జూన్‌ 28వ తారీఖున హత్య చేయబడడంతో ప్రపంచం యుద్ధంలోకి కూరుకుపోయింది, ఆరోజు నేను నా కుటుంబం ఒహాయోలోని కొలంబస్‌లో ఒక శాంతియుతమైన సమావేశానికి హాజరవుతున్నాము. ఆతొలినాళ్ళ నుండి నేను యెహోవాసాక్షుల అనేక సమావేశాలకు హాజరయ్యే ఆధిక్యతను అనుభవించాను. కొన్ని సమావేశాల హాజరు కేవలం కొన్ని వందలు మాత్రమే ఉంది. మరికొన్ని సమావేశాలు ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియంలలో భారీ ఎత్తున జరిగాయి.

సరైన స్థలంలో మాఇల్లు

పిట్స్‌బర్గ్‌, పెన్సిల్వేనియా, క్లీవ్‌లాండ్‌, ఒహాయోలకు మధ్యన ఉన్న డాల్టన్‌లోని మాఇంట్లో 1908 నుండి 1918 వరకు బైబిలు విద్యార్థుల చిన్న సంఘం కూటాలు జరుపుకునేది. మాఇల్లు అనేకమంది ప్రయాణ ప్రసంగీకులకు ఆతిథ్యాన్నిచ్చే కేంద్రంగా కూడా ఉండేది. వారు తమ గుర్రాలను గుర్రపు బగ్గీలను మాపశువుల కొట్టం వెనకాల కట్టేసి, చుట్టూ కూర్చున్న వారితో ఎన్నో ఉత్తేజకరమైన అనుభవాలను ఆధ్యాత్మిక రత్నాల్లాంటి సత్యాలను పంచుకునేవారు. అవెంత ప్రోత్సాహకరమైన సమయాలో కదా!

నాన్నగారు స్కూలు టీచరుగా పనిచేసేవారు, కానీ ఆయన మనసంతా అతి గొప్ప బోధనా పనియైన క్రైస్తవ పరిచర్యపైనే ఉండేది. ఆయన తన కుటుంబమంతటికీ యెహోవాను గురించి క్రమం తప్పక బోధించేవారు, ప్రతిరోజు సాయంత్రం మేము కుటుంబ సమేతంగా ప్రార్థించేవారము. 1919 వసంతకాలంలో నాన్నగారు మాగుర్రాన్ని బగ్గీని అమ్మేసి 175 డాలర్లకు ఒక 1914 ఫోర్డ్‌ కారు కొన్నారు, అలాగైతే ప్రకటనా పనిలో మరింత ఎక్కువమందిని చేరుకోవచ్చని ఆయన ఉద్దేశం. 1919 నుండి 1922 వరకు ఆకారు మాకుటుంబాన్ని ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల విశేషమైన సమావేశాలకు తీసుకువెళ్ళింది.

మా కుటుంబమంతా​—⁠అమ్మా, నాన్నగారు, ఎస్తేరు, నా తమ్ముడు జాన్‌, నేను​—⁠అందరం బహిరంగ పరిచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నాము. ఇంటి యజమాని నన్ను ఒక బైబిలు ప్రశ్న అడిగిన మొట్టమొదటి సందర్భం నాకు బాగా జ్ఞాపకం. నాకప్పుడు ఏడేళ్ళు. “అబ్బాయీ, అర్మగిద్దోను అంటే ఏమిటి?” అనడిగాడు ఆయన. మానాన్న కొంత సహాయం చేయడంతో నేనాయనకు బైబిలు నుండి జవాబును ఇవ్వగలిగాను.

పూర్తికాల పరిచర్యలోకి ప్రవేశం

1931 లో మాకుటుంబం ఒహాయోలోని కొలంబస్‌లో సమావేశానికి హాజరయ్యింది, అక్కడ మేము యెహోవాసాక్షులనే క్రొత్త పేరును స్వీకరించడంలో భాగం వహించి ఎంతో ఉత్తేజాన్ని పొందాము. జాన్‌ ఎంత ఉత్తేజాన్ని పొందాడంటే ఆయనా నేనూ పయినీరు సేవను చేపట్టాలని నిర్ణయించాడు. * మేము మొత్తానికి చేపట్టాము, మాఅమ్మా, నాన్నగారు, ఎస్తేరు కూడా చేరారు. మాకు ఎంత గొప్ప నిధి లభించింది​—⁠దేవుని రాజ్య సువార్తను ఆనందంగా ప్రకటించే పనిలో ఐక్యమైవున్న ఒక కుటుంబం! ఈఆశీర్వాదం నిమిత్తం నేను యెహోవాకు అనునిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. అయితే మేమప్పటికే చాలా ఆనందంగా ఉన్నప్పటికీ మరిన్ని ఆనందాలు మాకోసం వేచివున్నాయి.

1934 ఫిబ్రవరిలో నేను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధానకార్యాలయంలో (బేతేలు అని పిలువబడుతుంది) సేవచేయడం ప్రారంభించాను. కొన్ని వారాల తర్వాత జాన్‌ కూడా బేతేలుకి వచ్చాడు. మేమిద్దరం రూమ్మేట్లుగా ఉన్నాము, చివరికి ఆయన 1953 లో జెస్సీ అనే అమ్మాయిని తన ప్రియ భార్యగా చేసుకున్నాడు.

నేనూ జాన్‌ బేతేలుకి వెళ్ళాక మాతల్లిదండ్రులు దేశంలో వివిధ ప్రాంతాల్లో పయినీర్లుగా నియామకాలను అందుకున్నారు, ఎస్తేరు ఆమె భర్త జార్జ్‌ రీడ్‌ వారితోపాటు ఉన్నారు. మాతల్లిదండ్రులు 1963 లో తమ భూ పరిచర్య ముగించేంతవరకు పయినీరు సేవలోనే ఉన్నారు. ఎస్తేరు ఆమె భర్త ఒక చక్కని కుటుంబాన్ని పెంచిపోషించారు, నాకిక మేనల్లుళ్ళు మేనకోడళ్ళు దొరికారు, వాళ్ళంటే నాకెంతో ప్రేమానురాగాలు.

బేతేలులో పని, సహవాసం

జాన్‌ బేతేలులో తన సాంకేతికపరమైన నైపుణ్యాలను ఉపయోగించి ఇతర బేతేలైట్లతో పోర్టబుల్‌ ఫోనోగ్రాఫుల తయారీ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశాడు. వీటిని వేలాదిమంది యెహోవాసాక్షులు తమ ఇంటింటి పరిచర్యలో ఉపయోగించారు. చందాదార్లకు పంపించే పత్రికలను మడతపెట్టే, వాటికి లేబుళ్ళను అంటించే యంత్రాలను డిజైన్‌ చేయడంలో వాటిని నిర్మించడంలో కూడా జాన్‌ సహాయం చేశాడు.

నేను నా బేతేలు సేవను పుస్తకాల బైండింగులో ప్రారంభించాను. ఆసమయంలో ఫ్యాక్టరీలో పనిచేసిన యౌవనస్థులు ఇప్పటికీ బేతేలులో విశ్వసనీయంగా సేవచేస్తున్నారు. వీరిలో క్యారీ బార్బర్‌, రాబర్ట్‌ హాట్స్‌ఫెల్ట్‌ ఉన్నారు. నేథన్‌ నార్‌, కార్ల్‌ క్లైన్‌, లైమన్‌ స్వింగిల్‌, క్లాస్‌ జెన్సన్‌, గ్రాంట్‌ స్యూటర్‌, జార్జ్‌ గ్యాంగస్‌, ఓరిన్‌ హిబ్బర్డ్‌, జాన్‌ సీయోరస్‌, రాబర్ట్‌ పేన్‌, ఛార్లెస్‌ ఫెకెల్‌, బెన్నో బూర్చిక్‌, జాన్‌ పెర్రీలు చనిపోయారు, వారిని నేనెంతో ప్రేమగా గుర్తుచేసుకుంటుంటాను. వారు ఎన్నడూ ఫిర్యాదులు చేయకుండా లేదా ఏదో “ప్రమోషన్‌” వస్తుందని ఎదురుచూడకుండా ప్రతి సంవత్సరం తమ నియామకంలో విశ్వసనీయంగా పనిచేశారు. అయినా, యథార్థతగల ఆత్మాభిషిక్త క్రైస్తవులైన వీరిలో చాలామందికి సంస్థ ఎదుగుతుండగా పెద్ద పెద్ద బాధ్యతలు లభించాయి. కొందరు యెహోవాసాక్షుల పరిపాలక సభలో కూడా సేవచేశారు.

ఆత్మత్యాగ స్వభావంగల ఈసహోదరులతో పనిచేయడం నాకో ప్రాముఖ్యమైన పాఠాన్ని బోధించింది. లౌకిక ఉద్యోగాల్లో పనివాళ్ళకి వారి శ్రమ కోసం డబ్బు జీతంగా దొరుకుతుంది. అదే వారి ప్రతిఫలం. బేతేలులో పనిచేయడం మూలంగా ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన ఆశీర్వాదాలు లభిస్తాయి, అలాంటి ప్రతిఫలాల్ని కేవలం ఆధ్యాత్మికత ఉన్న స్త్రీ పురుషులు మాత్రమే అర్థంచేసుకుంటారు, కృతజ్ఞులైవుంటారు.​—⁠1 కొరింథీయులు 2:6-16.

బేతేలుకి 1923 లో టీనేజ్‌లో వచ్చిన నేథన్‌ నార్‌ 1930లలో ఫ్యాక్టరీ పైవిచారణకర్తగా సేవచేశాడు. ఆయన ప్రతిరోజు ఫ్యాక్టరీలో నడుస్తూ పనిచేసే ప్రతి ఒక్కరినీ పలకరించేవాడు. బేతేలులో క్రొత్తవారమైన మేము అలాంటి వ్యక్తిగత ఆసక్తి విషయమై ఎంతో కృతజ్ఞతా భావాన్ని కలివున్నాము. 1936 లో మాకు జర్మనీ నుండి ఒక క్రొత్త ప్రెస్‌ వచ్చింది, దాని అసెంబ్లింగ్‌లో యౌవనస్థులైన సహోదరులు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాంతో సహోదరుడు నార్‌ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ధరించే బట్టలు వేసుకుని అది పనిచేసేంతవరకు వారితోపాటు ఒక నెలరోజులు పనిచేశాడు.

సహోదరుడు నార్‌ ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తంటే మాలో చాలామంది ఆయనతో సమంగా పనిచేయగలిగేవారు కాదు. కానీ వినోదాన్ని అనుభవించడం ఎలాగో ఆయనకు తెలుసు. 1942 జనవరిలో యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిపై పర్యవేక్షణ లభించిన తర్వాత కూడా ఆయన కొన్నిసార్లు బేతేలు కుటుంబ సభ్యులతోను గిలియడ్‌ మిషనరీ స్కూలు విద్యార్థులతోను న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌ సమీపాన ఉన్న క్యాంపస్‌లో బేస్‌బాల్‌ ఆడేవాడు.

1950 ఏప్రిల్‌లో బేతేలు కుటుంబం క్రొత్తగా నిర్మించిన పది అంతస్తుల బిల్డింగ్‌లోకి మారింది, ఇది న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న 124 కొలంబియా హైట్స్‌వద్ద ఉంది. క్రొత్త డైనింగ్‌ రూములో భోజనాలకు మేమందరం కలిసే కూర్చునే అవకాశం ఏర్పడింది. ఈబిల్డింగు నిర్మాణం జరుగుతున్న దాదాపు మూడు సంవత్సరాలు మేము ఉదయకాల ఆరాధన జరుపుకోవడం సాధ్యం కాలేదు. ఆకార్యక్రమం తిరిగి ప్రారంభించబడినప్పుడు ఎంత సంతోషించామో! మాకుటుంబంలోని క్రొత్త సభ్యుల పేర్లను గుర్తుచేయడంలో ఆయనకు నేను సహాయం చేయగలిగేలా సహోదరుడు నార్‌ నన్ను చైర్మన్‌ టేబుల్‌ వద్ద తనతోపాటు కూర్చోమని నియమించాడు. ఉదయకాల ఆరాధనకూ టిఫిన్‌ చేయడానికీ నేను 50 సంవత్సరాలపాటు ఆసీట్లోనే కూర్చున్నాను. 2000, ఆగస్టు 4న ఆడైనింగ్‌ రూము మూసివేయబడింది, మునుపటి టవర్స్‌ హోటల్‌లోని పునర్నవీకరించబడిన డైనింగ్‌ రూముల్లో ఒకదాన్లో నాకు నియామకం లభించింది.

1950లలో కొంతకాలంపాటు నేను టైపుల స్లగ్‌లను పేజీలుగా అసెంబ్లింగ్‌ చేస్తూ ఫ్యాక్టరీలో లినోటైప్‌ యంత్రంపై పనిచేశాను, ఇది ప్రింటింగ్‌ ప్లేట్‌లను తయారుచేసే ప్రక్రియలో భాగం. ఆపని చేయడం నాకంతగా ఇష్టంలేదు, కానీ ఆయంత్రాలపై పర్యవేక్షణ చేస్తున్న విలియమ్‌ పీటర్సన్‌ నన్నెంత బాగా చూసుకునేవాడంటే అక్కడున్నంత కాలమూ నేనెంతో ఆనందించాను. తర్వాత 1960 లో క్రొత్తగా నిర్మించబడిన నివాస సముదాయాలైన 107 కొలంబియా హైట్స్‌కి పెయింటు వేయడానికి స్వచ్ఛంద సేవకులు అవసరమయ్యారు. పెరుగుతున్న మాబేతేలు కుటుంబం కోసం ఈక్రొత్త సదుపాయాలను సిద్ధం చేయడంలో సహాయపడడానికి నేను ఆనందంగా ముందుకు వచ్చాను.

107 కొలంబియా హైట్స్‌ బిల్డింగుకి పెయింటు వేయడం ముగిసిన తర్వాత కొద్ది కాలానికే బేతేలు సందర్శకులను ఆహ్వానించే నియామకం నాకు లభించడంతో చాలా ఆశ్చర్యానందాలు కలిగాయి. నేను రిసెప్షనిస్టుగా పనిచేసిన గత 40 సంవత్సరాలు నేను బేతేలులో గడిపిన సంవత్సరాల్లో అత్యద్భుతమైనవే. వచ్చినవారు సందర్శకులైనా లేదా బేతేలు కుటుంబంలో చేరిన క్రొత్త సభ్యులైనా వారిని చూస్తున్నప్పుడు, రాజ్యాసక్తులు పెరిగేలా చేయడంలో మాసమష్టి కృషికి లభించిన ఫలితాలను గురించి ఆలోచిస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

బైబిలును దీక్షగా అధ్యయనం చేసే విద్యార్థులు

మా బేతేలు కుటుంబం ఆధ్యాత్మికంగా ఎంతో వర్ధిల్లుతూ ఉంటుంది, ఎందుకంటే అందులోని సభ్యులందరూ బైబిలును ప్రేమించేవారే. నేను బేతేలుకి వచ్చిన కొత్తలో ప్రూఫ్‌రీడరుగా పనిచేస్తున్న ఎమ్మా హామిల్టన్‌ను తను బైబిలును ఎన్నిసార్లు చదివిందని అడిగాను. “ముప్ఫై ఐదు సార్లు” అందామె. “కానీ తర్వాత ఇక లెక్కపెట్టడం మానేశాను” అన్నది. ఆంటన్‌ కోయెర్బర్‌ అనే మరో విశిష్టమైన క్రైస్తవుడు దాదాపు ఎమ్మా పనిచేసిన కాలంలోనే పనిచేశాడు, ఆయనిలా అనేవాడు: “బైబిలును చేతికందేంత దూరంకన్నా ఎక్కువ దూరం పెట్టకండి.”

1916 లో సహోదరుడు రస్సెల్‌ చనిపోయిన తర్వాత ఆయన నిర్వర్తించిన సంస్థాపరమైన బాధ్యతలను జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ తన భుజాలకెత్తుకున్నాడు. రూథర్‌ఫోర్డ్‌ చాలా శక్తివంతమైన, ప్రజ్ఞావంతుడైన ప్రసంగీకుడు, ఆయన వకీలుగా అమెరికా సుప్రీం కోర్టులో యెహోవాసాక్షుల కేసులను కూడా వాదించాడు. 1942 లో రూథర్‌ఫోర్డ్‌ మరణం తర్వాత సహోదరుడు నార్‌ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు, ఈయన బహిరంగ ప్రసంగాలివ్వడంలో తన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో గట్టిగా కృషిచేశాడు. నేను ఆయనున్న గదికి దగ్గర్లోనే ఉండేవాడిని కాబట్టి ఆయన తన ప్రసంగాలను మళ్ళీ మళ్లీ ఎన్నోసార్లు ప్రాక్టీసు చేయడం నాకు తరచు వినిపించేది. అలాంటి అవిరళ కృషితో ఆయన కొంతకాలానికి చక్కని ప్రసంగీకుడిగా తయారయ్యాడు.

1942 ఫిబ్రవరిలో సహోదరుడు నార్‌ బేతేలులో ఉన్న మేమందరమూ బోధనా సామర్థ్యాన్ని మాట్లాడే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయం చేసేలా ఒక కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయపడ్డాడు. ఈపాఠశాల బైబిలు పరిశోధనపైనా బహిరంగంగా మాట్లాడడంపైనా దృష్టి కేంద్రీకరించింది. మొదట్లో మాకు ఒక్కొక్కరికి బైబిలు పాత్రలపై చిన్న ప్రసంగాలిచ్చే నియామకాలు అందేవి. నా మొదటి ప్రసంగం మోషే గురించి. 1943 లో యెహోవాసాక్షుల సంఘాల్లో అలాంటి పాఠశాలే ఒకటి ప్రారంభమైంది, అది నేటికీ కొనసాగుతోంది. బేతేలులో ఇప్పటికీ కూడా నొక్కి చెప్పేది ఏమిటంటే బైబిలు పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడము, ప్రభావవంతమైన బోధనా పద్ధతులను పెంపొందించుకోవడమే.

1943 ఫిబ్రవరిలో గిలియడ్‌ మిషనరీ స్కూలు యొక్క మొదటి తరగతి ప్రారంభమైంది. ఇటీవలనే 111వ తరగతి విద్యార్థులు పట్టభద్రులయ్యారు! ఈస్కూలు పనిచేసిన 58కిపైగా సంవత్సరాల్లోను అది 7,000 మందికి పైగా వ్యక్తులకు ప్రపంచవ్యాప్తంగా మిషనరీలుగా సేవచేసే శిక్షణను అందించింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, 1943 లో ఈస్కూలు ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఖ్య కేవలం 1,00,000గా ఉండేది. నేడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో భాగం వహించేవారి సంఖ్య 60,00,000గా ఉంది!

నా ఆధ్యాత్మిక వారసత్వం విషయమై కృతజ్ఞుణ్ణి

గిలియడ్‌ స్థాపించడానికి కొంచెం ముందు అమెరికా అంతటా ఉన్న సంఘాలను సందర్శించే నియామకం బేతేలులో నాతోపాటు మరిద్దరికి లభించింది. మేము ఆసంఘాలను ఆధ్యాత్మికంగా బలపర్చడానికి ప్రయత్నిస్తూ ఒక్కో రోజు, కొన్నిసార్లు కొన్ని రోజుల తరబడి, కొన్ని సందర్భాల్లోనైతే ఒక వారం రోజులు కూడా ఉండేవాళ్ళము. మమ్మల్ని సహోదరుల సేవకులు అని పిలిచేవారు, ఇది ఆతర్వాత సర్క్యూట్‌ సేవకుడు అనీ ఆతర్వాత సర్క్యూట్‌ పైవిచారణకర్త అనీ మారింది. అయితే గిలియడ్‌ ప్రారంభమైన వెంటనే అక్కడికి వచ్చి కొన్ని కోర్సులను బోధించమని నన్ను అడిగారు. నేను 2 నుండి 5 తరగతుల వరకు రెగ్యులర్‌ ఉపదేశకుడిగా పనిచేశాను, 14వ తరగతిలోని ఒక రెగ్యులర్‌ ఉపదేశకుడి స్థానంలో పనిచేశాను కూడా. యెహోవా సంస్థ యొక్క ఆధునికదిన చరిత్రలోని గమనార్హమైన ఘట్టాలను విద్యార్థులతో పునస్సమీక్షించగల్గడం మూలంగా​—⁠ఆ ఘట్టాల్లో చాలావాటిని నా వ్యక్తిగత అనుభవంతో చెప్పేవాడిని అందుకని—⁠నా సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం విషయమై మరింత ఎక్కువ కృతజ్ఞుడిగా భావించాను.

ఈ సంవత్సరాల్లో నేను అనుభవించిన మరో ఆధిక్యత యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశాలకు హాజరుకావడమే. 1963 లో “నిత్య సువార్త” సమావేశాలకు 500 మంది ఇతర ప్రతినిధులతోపాటు నేను భూమియంతటా పర్యటించాను. 1989 లో పోలాండ్‌లోని వార్సాలో; 1990 లో జర్మనీలోని బెర్లిన్‌లో; 1993 లో రష్యాలోని మాస్కోలో జరిగిన సమావేశాలు నేను హాజరైన ఇతర చరిత్రాత్మక సమావేశాలు. నాజీ పరిపాలన క్రింద, కమ్యూనిస్టు పరిపాలన క్రింద దశాబ్దాలపాటు హింసలను అనుభవించిన ప్రియ సహోదర సహోదరీల్లో కొందరిని కలిసే అవకాశం ప్రతి సమావేశంలోను నాకు లభించింది, కొందరైతే రెండు పరిపాలనల క్రిందా హింసలను అనుభవించారు. అవి ఎంతగా విశ్వాసాన్ని బలపర్చే అనుభవాలో కదా!

యెహోవా సేవలో నా జీవితం నిజంగా సుసంపన్నమైనది! ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వెల్లువ ఎన్నడూ ఆగిపోదు. అంతేకాదు, భౌతిక వస్తుసంపదల విషయంలోలా కాకుండా ఈఅమూల్యమైన విషయాలను మనమెంతగా పంచుకుంటామో అంతగా మన సంపద పెరుగుతుంది. కొందరు తాము యెహోవాసాక్షులుగా పెంచబడి ఉండకపోయుంటే బాగుండేది అనడం నేనప్పుడప్పుడు వింటుంటాను. తాము మొదట దేవుని సంస్థ వెలుపల జీవితాన్ని అనుభవించివుంటే అప్పుడు బైబిలు సత్యాలను మరింత అమూల్యంగా ఎంచేవారము అని వారంటారు.

యౌవనస్థులు ఆవిధంగా మాట్లాడినప్పుడు నేనెప్పుడూ చాలా కలతచెందుతుంటాను, ఎందుకంటే వారు నిజానికి చెప్పేదేమంటే యెహోవా మార్గాలను గురించిన పరిజ్ఞానంలో పెంచబడి ఉండకపోవడం బాగుండేది అనే. అయితే, కొందరు బైబిలు సత్యాన్ని తమ జీవితాల్లో కనుగొన్న తర్వాత వారు వదిలిపెట్టాల్సిన చెడు అలవాట్లను, భ్రష్టమైన ఆలోచనా విధానాలను గురించి ఒక్కసారి ఆలోచించండి. నా తల్లిదండ్రులు ముగ్గురు పిల్లల్నీ నీతి మార్గాల్లో పెంచినందుకు నేనెల్లప్పుడూ ఎంతో కృతజ్ఞుడనై ఉంటాను. జాన్‌ 1980 జూలైలో మరణించేంత వరకు యెహోవాకు విశ్వసనీయమైన సేవకుడిగా ఉన్నాడు, ఎస్తేరు నేటికీ విశ్వసనీయురాలైన సాక్షిగా ఉంది.

విశ్వసనీయులైన క్రైస్తవ సహోదర సహోదరీలతో నేననుభవించిన చక్కని స్నేహాలను నేనెంతో అపురూపంగా జ్ఞాపకం చేసుకుంటుంటాను. నేనిప్పటికి బేతేలులో 67 సంవత్సరాలకుపైగా అద్భుతమైన అనుభవాలతో గడిపాను. నేను పెండ్లి చేసుకోకపోయినా నాకెందరో ఆధ్యాత్మిక కుమారులు కుమార్తెలు ఉన్నారు, ఆధ్యాత్మిక మనవళ్ళు మనవరాండ్రు కూడా ఉన్నారు. మన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలోని మిగతా సభ్యుల్లో కలవాల్సిన ఒక్కొక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేనెంతో ఆనందిస్తాను, వారిలో ప్రతి ఒక్కరూ అమూల్యమైనవారే. ఎంత వాస్తవమీ మాట: “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును”!​—⁠సామెతలు 10:⁠22.

[అధస్సూచి]

^ పేరా 16 నేను 1932, మార్చి 8న బాప్తిస్మం తీసుకున్నాను. కాబట్టి నేను పయినీరు సేవ చేయాలని నిర్ణయం జరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నానన్నమాట.

[20వ పేజీలోని చిత్రం]

ఎడమ నుండి కుడికి: ఒళ్ళో తమ్ముడు జాన్‌తో నాన్నగారు, ఎస్తేరు, నేను, అమ్మ

[23వ పేజీలోని చిత్రాలు]

1945 లో గిలియడ్‌ తరగతిలో బోధిస్తూ

పైన కుడి: గిలియడ్‌ స్కూలు ఉపదేశకులు ఎడ్వార్డో కెల్లర్‌, ఫ్రెడ్‌ ఫ్రాంజ్‌, నేను, అల్బర్డ్‌ ష్రోడర్‌

[24వ పేజీలోని చిత్రం]

యెహోవా సేవలో సుసంపన్నమైన నా జీవితాన్ని గురించి తలపోస్తూ