నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
భూగోళవ్యాప్త జలప్రళయం నుండి జీవుల రక్షణకోసం ఓడను నిర్మించిన నోవహు అనే దైవభయంగల వ్యక్తి గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆజలప్రళయం ప్రాచీనకాలాల్లో జరిగినప్పటికీ, ఆకథ కోట్లాది మందికి సుపరిచితమైనదే. అయితే, నోవహు జీవితం మనందరికీ ప్రాముఖ్యమైన కథ అని చాలా మంది గ్రహించరు.
వేల సంవత్సరాల పూర్వ వృత్తాంతంలో మనమెందుకు ఆసక్తిని చూపించాలి? నోవహు కాలంనాటి పరిస్థితికీ మనమిప్పుడున్న పరిస్థితికీ పోలికేమైనా ఉందా? ఉంటే, ఆయన మాదిరి నుండి మనమెలాంటి ప్రయోజనం పొందగలం?
నోవహు కాలం నాటి లోకం
ఆదాము చనిపోయిన 126 సంవత్సరాలకు, అంటే సా.శ.పూ. 2970 లో నోవహు పుట్టాడని బైబిలు కాలగణన చెబుతోంది. నోవహు కాలంనాటికి, భూమి అంతా దౌర్జన్యంతో నిండివుంది, ఆదాము సంతానంలో అధికసంఖ్యాకులు తప్పుదారిపట్టిన తమ పూర్వికుని మాదిరిని అనుసరించడాన్నే ఎంపికచేసుకున్నారు. కాబట్టే, ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడు.’—ఆదికాండము 6:5, 11,12.
యెహోవా కోపానికి మానవ తిరుగుబాటు మాత్రమే ఏకైక కారణం కాదు. “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. ... ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే” అని ఆదికాండము వివరంగా చెబుతోంది. (ఆదికాండము 6:2-4) ఈవచనాలను, అపొస్తలుడైన పేతురు నమోదు చేసిన మాటలతో పోల్చి చూస్తే, అవిధేయత చూపిన దేవదూతలే “దేవుని కుమారులు” అని తెలుస్తుంది. మానవ స్త్రీలకు, తమ స్థానాన్ని వదిలిపెట్టి మానవ రూపం దాల్చిన దూతలకు మధ్య జరిగిన అక్రమ లైంగిక సంపర్కం వల్ల పుట్టిన సంకరజాతి సంతానమే నెఫీలులు.—1 పేతురు 3:19,20.
“నెఫీలులు” అంటే “పడగొట్టేవారు” అని అర్థం. ఈమాట ఇతరులు పడిపోవడానికి కారకులైన వ్యక్తులను సూచిస్తుంది. వారు నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఇతరులను ఏడిపించేవారు, కామతప్తులైన వారి తండ్రుల పాపం, సొదొమ గొమొఱ్ఱాలు చేసిన వ్యభిచార చేష్టలతో పోల్చబడింది. (యూదా 6, 7) వాళ్ళంతా కలిసి, భూమిమీద భరించలేని దుష్టత్వాన్ని ఉసిగొలిపారు.
“తన తరములో నిందారహితుడునై యుండెను”
దుష్టత్వము ఎంతగానో ప్రబలమవ్వడంతో, దేవుడు మానవజాతిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. “అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ... నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు” అని ప్రేరేపిత వృత్తాంతం చెబుతోంది. (ఆదికాండము 6:8,9) నాశనపాత్రమైన భక్తిరహిత లోకంలో ‘దేవునితోకూడ నడవడం’ ఎలా సాధ్యమైంది?
ఆదాము యొక్క సమకాలీనుడూ, దైవవిశ్వాసీ, తన తండ్రీ అయిన లెమెకు నుండి నోవహు ఎన్నో విషయాలు నేర్చుకున్నాడనడంలో సందేహం లేదు. లెమెకు తన కుమారునికి నోవహు అని పేరుపెడుతూ, (“విశ్రాంతి” లేదా “నెమ్మది” అనే అర్థంతో పెట్టాడు) “భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయున”ని ప్రవచించాడు. దేవుడు భూమిమీది నుండి తన శాపాన్ని తీసివేసినప్పుడు, ఆప్రవచనం నెరవేరింది.—ఆదికాండము 5:29; 8:21.
దైవభయంగల తల్లిదండ్రులున్నంత మాత్రాన ఒకరికి ఆధ్యాత్మికత ఉంటుందన్న హామీ లేదు, ప్రతివ్యక్తీ యెహోవాతో సంబంధాన్ని స్వయంగా స్థాపించుకోవలసిందే. దైవిక అంగీకారం లభించే జీవన విధానాన్ని అనుసరిస్తూ, నోవహు ‘దేవునితో నడిచాడు.’ తాను దేవుని గురించి తెలుసుకున్న విషయాలు, తాను దేవుణ్ణి సేవించేలా నోవహును కదిలించాయి. ‘జలప్రళయంలో సమస్త శరీరులను నాశము చేయాలన్న’ దేవుని ఉద్దేశం తనకు తెలియజేయబడినప్పుడు నోవహు విశ్వాసం సడలలేదు.—ఆదికాండము 6:13,17.
మునుపెన్నడూ జరగనటువంటి ఈవిపత్తు తప్పక జరుగుతుందన్న నమ్మకంతో, “చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను” అని యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను నోవహు శిరసావహించాడు. (ఆదికాండము 6:14) దేవుడిచ్చిన నిర్దేశానుసారంగా ఓడను నిర్మించడం చిన్న పనేమీ కాదు. అయినప్పటికీ, “నోవహు అట్లు చేసెను” నిజంగా, “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:22) నోవహు తన భార్య, కుమారులైన షేము, హాము, యాపెతు, వాళ్ళ భార్యల సహాయంతో చేశాడు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నేటి కుటుంబాలకు ఎంత చక్కని మాదిరి!
ఓడ నిర్మాణపు పనిలో ఏమేమి ఇమిడివున్నాయి? నీళ్ళు చొరబడని విధంగా, మూడంతస్థులుండే విధంగా, 437 అడుగుల పొడవూ, 73 అడుగుల వెడల్పూ, 44 అడుగుల ఎత్తూ ఉండే విధంగా ఒక పెద్ద ఓడను నిర్మించాలని యెహోవా నోవహుకు నిర్దేశమిచ్చాడు. (ఆదికాండము 6:15,16) ఆఓడ, నేటి కాలంలోని సరుకులు తీసుకువెళ్ళే ఓడ అంతటి పరిమాణం ఉంటుంది.
ఎంత పెద్ద నిర్మాణమది! వేలాది చెట్లను నరికి, నిర్మాణ స్థలానికి లాక్కువెళ్ళి, వాటిని చదునైన కొయ్య పలకలుగాను, దూలాలుగాను చెయ్యాలి. మంచెలను నిర్మించాలి, చీలలను లేదా మేకులను తయారుచేయాలి, నీళ్ళు చొరబడకుండా ఉండేందుకు తారును తయారుచేయాలి, మరితర పరికరాలను పెట్టెలను సంపాదించాలి, అలా ఇంకా ఎన్నో పనులు ఇమిడివున్నాయి. ఈపనిలో వ్యాపారస్తులను సంప్రదించడమూ, కావలసిన ఒప్పందాలను కుదుర్చుకోవడమూ, వస్తువులకు వాటి రవాణాకి ద్రవ్యము చెల్లించడమూ కూడా ఇమిడివుండవచ్చు. కొయ్యలను సరైన విధంగా అమర్చేందుకు, కావలసినంత దృఢంగా నిర్మించేందుకు వడ్రంగి పనిలో ఎంతో నైపుణ్యం అవసరమై ఉంటుందన్నది స్పష్టం. మీరే ఆలోచించి చూడండి, ఈనిర్మాణపు పనికి దాదాపు 50 లేదా 60 సంవత్సరాలు పట్టివుంటాయి!
ఆ తర్వాత, నోవహు, తమకు కావలసిన ఆహారాన్ని, మిగతా జీవులకు కావలసిన మేతను సిద్ధం చేసుకునే పని మొదలుపెట్టాలి. (ఆదికాండము 6:21) ఓడలోకి జంతువుల పెద్ద సమూహాన్ని ఒక దగ్గరకు తీసుకురావాలి, వాటిని అదుపులో పెట్టాలి. దేవుడు తనకు చెప్పినవాటన్నింటినీ నోవహు చేశాడు, ఆపని పూర్తయ్యింది. (ఆదికాండము 6:22) యెహోవా దీవెన ఆపనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆయనకు సహాయపడింది.
‘నీతిని ప్రకటించాడు’
నోవహు ఓడను నిర్మించడమే కాక, ఇతరులకు గట్టి హెచ్చరికగా ‘నీతిని ప్రకటిస్తూ’ దేవునికి నమ్మకంగా సేవ చేశాడు. కానీ ప్రజలు, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.”—2 పేతురు 2:5; మత్తయి 24:38,39.
ఆ రోజుల్లో ఆధ్యాత్మికంగాను, నైతికంగాను దిగజారిన పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే, జరుగబోయేవాటిని నమ్మడానికి సిద్ధంగాలేని పొరుగువారి మధ్యన నోవహు కుటుంబం నవ్వులపాలై ఉంటుందని, ఆపొరుగువారు వారితో చెడుగాను ఎగతాళిగాను మాట్లాడివుంటారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వాళ్ళను పిచ్చివాళ్ళుగా తలంచివుంటారు. అయితే, నోవహు, తన ఇంటివారికి ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్నీ, మద్దతునూ విజయవంతంగా ఇవ్వగలిగాడు. కాబట్టి, ఆకుటుంబం దైవభయంలేని తమ సమకాలీనుల దౌర్జన్యపూరితమైన, అనైతికమైన, తిరుగుబాటు ధోరణులను అవలంబించలేదు. విశ్వాసాన్ని ప్రదర్శించే తన మాటల ద్వారా చేతల ద్వారా నోవహు ఆకాలం నాటి లోకముమీద నేరస్థాపన చేశాడు.—హెబ్రీయులు 11:7.
జలప్రళయం ద్వారా కాపాడబడ్డారు
నిర్మాణం పూర్తయిన తర్వాత వర్షం కుండపోతగా కురవడానికి కొద్దిరోజులు ముందు దేవుడు నోవహుకు ఆఓడలోకి ప్రవేశించమని చెప్పాడు. ఆయన కుటుంబమూ, జంతువులూ ఓడ ఎక్కిన తర్వాత, అపహాస్యమూ ఎగతాళీ చేసినవారు లోపలికి వెళ్ళకుండా ‘యెహోవా ఓడను మూసివేశాడు.’ జలప్రళయం వచ్చినప్పుడు, అవిధేయులైన దూతలు మానవ రూపాన్ని వదిలిపెట్టి, నాశనాన్ని తప్పించుకున్నారని స్పష్టమవుతుంది. మరి మిగతావాళ్ళకు ఏమి జరిగింది? ఏమి జరిగిందంటే, నెఫీలులతో సహా ఓడ వెలుపల నేల మీదవున్న ప్రతి జీవి నాశనమైంది! కేవలం, నోవహు ఆయన కుటుంబసభ్యులు మాత్రమే కాపాడబడ్డారు.—ఆదికాండము 7:1-23.
నోవహు, అలాగే, ఆయన కుటుంబ సభ్యులు, ఒక చాంద్రమాన సంవత్సరమూ, పది రోజులూ ఓడలో ఉన్నారు. వాళ్ళు జంతువులకు మేత వేయడంలోను, నీళ్ళుపెట్టడంలోను, వాటి కసువు తీసివేయడంలోను, సమయం లెక్కిస్తూ ఉండడంలోను నిమగ్నులై ఉన్నారు. ఆదికాండము, ఓడ ప్రయాణ విశేషాలను నమోదు చేసే పుస్తకంలాగా జలప్రళయానికి సంబంధించిన అన్ని వివరాలను తేదీలతో సహా ఎంతో ఖచ్చితంగా తెలియజేస్తుంది.—ఆదికాండము 7:11, 17, 24; 8:3-14.
నోవహు, ఓడలో ఉన్నప్పుడు, తన కుటుంబం లేఖనాధారిత చర్చలను చేయడంలోను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోను నాయకత్వం వహించాడనడంలో సందేహం
లేదు. నోవహు, ఆయన కుటుంబం ద్వారా, జలప్రళయానికి ముందటి చరిత్ర కాపాడబడిందని స్పష్టమవుతుంది. జలప్రళయ సమయంలో వారు ప్రయోజనాత్మకంగా చర్చించుకునేందుకు ఒక్కో తరం నుండి నోటి మాట ద్వారా అందిన సమాచారమే కానివ్వండి, వాళ్ళ చేతిలో ఉన్న లిఖిత చారిత్రక దస్తావేజులే కానివ్వండి, వాళ్ళ దగ్గర కావలసినంత నమ్మదగిన సమాచారం ఉంది.నోవహు, ఆయన కుటుంబము చాలా కాలం తర్వాత ఆరిన నేల మీద అడుగు పెట్టినప్పుడు ఎంత ఆనందించి ఉంటారు! ఆయన చేసిన మొదటి పని, బలిపీఠాన్ని కట్టి, కుటుంబ యాజకుడుగా విధి నిర్వహిస్తూ, తమను కాపాడినవానికి బలులను అర్పించాడు.—ఆదికాండము 8:18-20.
“నోవహు దినములు ఏలాగుండెనో”
“నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును” అని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 24:37) నేడు క్రైస్తవులు కూడా మారుమనస్సు పొందమని ప్రజలను ఉద్బోధిస్తూ, నీతిని ప్రకటిస్తున్నారు. (2 పేతురు 3:5-9) ఈపోలికను గురించి ఆలోచించినప్పుడు, జలప్రళయానికి ముందు నోవహు ఏమి ఆలోచించివుండవచ్చన్న తలంపు మనకు వస్తుండవచ్చు. తన ప్రకటనా పని నిష్ప్రయోజనమని ఆయన ఎప్పుడైనా అనుకున్నాడా? ఆయన కొన్నిసార్లు అలసిపోయి ఉంటాడా? బైబిలు ఏమీ చెప్పడం లేదు. నోవహు దేవునికి విధేయత చూపించాడని మాత్రమే అది మనకు చెబుతోంది.
నోవహు పరిస్థితిని నేటి పరిస్థితికి మీరు అన్వయించగలరా? ఆయన వ్యతిరేకతలనూ క్లిష్టమైన పరిస్థితినీ ఎదుర్కున్నప్పటికీ యెహోవాకు విధేయత చూపించాడు. అందుకే, యెహోవా ఆయనను నీతిమంతుడని తీర్పు తీర్చాడు. దేవుడు జలప్రళయాన్ని ఖచ్చితంగా ఎప్పుడు తెస్తాడో నోవహు కుటుంబానికి తెలియకపోయినప్పటికీ, అది తప్పక వస్తుందని మాత్రం వాళ్ళకు తెలుసు. ఎంతో శ్రమపడవలసిన, నిష్ప్రయోజనకరముగా కనిపించే ప్రకటనా పనిని చేయాల్సిన ఆకాలమంతటిలోను, నోవహుకు దేవుని వాక్యంపైవున్న విశ్వాసం ఆయనను బలపరచింది. వాస్తవానికి, “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను” అని మనకు చెప్పబడుతుంది.—హెబ్రీయులు 11:7.
నోవహు అలాంటి విశ్వాసాన్ని ఎలా సంపాదించుకున్నాడు? యెహోవా గురించి తనకు తెలిసిన ప్రతిదాని గురించి ధ్యానించేందుకు సమయం తీసుకున్నాడని, ఆపరిజ్ఞానం తనను నడిపేందుకు ఆయన అనుమతించాడన్నది స్పష్టం. నోవహు ప్రార్థనలో యెహోవాతో మాట్లాడేవాడన్నదానికి సందేహమే లేదు. వాస్తవానికి, నోవహు యెహోవాకు ఎంత సన్నిహితంగా అయ్యాడంటే ‘ఆయనతో పాటు నడిచాడు.’ కుటుంబ శిరస్సుగా, నోవహు, తన ఇంటివారి కోసం సమయాన్నిచ్చాడు, ప్రేమపూర్వక శ్రద్ధను చూపించాడు. ఆశ్రద్ధలో తన భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్ళ ఆధ్యాత్మిక సంక్షేమంపై చూపించిన శ్రద్ధ కూడా ఇమిడివుంది.
ఆనాడు నోవహుకు తెలిసినట్లే, దైవభయం లేని ఈవిధానాన్ని యెహోవా త్వరలోనే అంతమొందిస్తాడని నేటి నిజ క్రైస్తవులకు తెలుసు. అది ఏ రోజున ఏ గంటలో వస్తుందో మనకు తెలియదు. కానీ, “నీతిని ప్రకటించిన” ఆయన విశ్వాస విధేయతలను అనుకరించడం, మన ‘రక్షణకు’ దారితీస్తుందని మనం గ్రహిస్తాం.—హెబ్రీయులు 10:36-39.
[29వ పేజీలోని బాక్సు]
అది నిజంగా జరిగిందా?
దాదాపు అన్ని జాతుల తెగల వారినుండి మానవశాస్త్రజ్ఞులు సేకరించిన జలప్రళయాన్ని గురించిన కథలు 270 మేరకున్నాయి. దాని గురించి పండితుడైన క్లాస్ వెస్టర్‌మాన్ ఇలా అంటున్నాడు: “జలప్రళయాన్ని గురించిన కథ ప్రపంచవ్యాప్తంగా ఉంది. సృష్టిని గురించిన కథలాగే, ఇది కూడా మన ప్రాథమిక సాంస్కృతిక వారసత్వంలో భాగం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే: పూర్వకాలంలో జరిగిన గొప్ప జలప్రళయాన్ని గురించిన కథలను భూమిమీద ప్రతిచోటా వినవచ్చు.” దీనికి కారణమేమిటని వారు చెబుతున్నారు? “వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు ప్రజలు జలప్రళయాన్ని గురించి ఖచ్చితంగా చెప్పుకోవడం, ఆకథను అలా చెప్పుకోవడానికి కారణం అది వాస్తవంగా జరిగిన చారిత్రాత్మక సంఘటన అనేదానికి సూచనగా ఉంది” అని ఎన్రికో గాల్బీయాటీ అనే వ్యాఖ్యాత అంటున్నాడు. అయితే, పండితుల అభిప్రాయాల కన్నా, జలప్రళయం మానవ చరిత్రలో నిజంగా జరిగినదని స్వయంగా యేసే మాట్లాడాడన్న విషయమే క్రైస్తవులకు ప్రధానమైనది.—లూకా 17:26,27.
[30వ పేజీలోని బాక్సు]
నెఫీలులు—మిథ్యా?
దేవతలకు మానవులకు మధ్య జరిగిన సంపర్కాలను గురించిన కథలు, “శూరులు” లేదా “చిన్ని దైవాలు” ఈసంపర్కాల ద్వారా పుట్టినవారేనన్న కథలు గ్రీకు, ఈజిప్టు, ఉగారిటిక్, హురియన్, మెసపొటేమియా దైవశాస్త్రాల్లో సర్వసాధారణంగా కనిపిస్తాయి. గ్రీకు పురాణాల్లోని దైవాలకు మానవ రూపమూ, అద్భుత సౌందర్యమూ ఉన్నట్లు వర్ణించబడుతుంది. వాళ్ళు తిన్నారు, తాగారు, నిద్రించారు, లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, జగడమాడారు, పోరాటాలు జరిపారు, మోసాలు చేశారు, మానభంగాలు చేశారు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాల్సినవారే అయినప్పటికీ, మోసాలు నేరాలు చేయగల శక్తి వాళ్ళకుండేది. అఖీలిస్ వంటి శూరులు దైవాంశ సంభూతులు, అలాగే మానవ వంశజులు కూడ అని చెప్పుకోబడేది. వారికి మానవాతీత శక్తి అనుగ్రహించబడినప్పటికీ, అమర్త్యులు మాత్రం కారు అని చెప్పుకునేవారు. కాబట్టి, ఆదికాండము చెబుతున్న నెఫీలుల గురించిన వృత్తాంతం అలాంటి పురాణ కథలు ఎలా ఉద్భవించివుంటాయో సూచనప్రాయంగా, లేదా నిజానికి ఖచ్చితంగానే తెలియజేస్తుంది.