పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఏదెను తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి సంబంధించిన నియమాన్ని ఉల్లంఘించాలన్న తలంపును సర్పము హవ్వకు ఎలా తెలియజేసింది?
“దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో—ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను” అని ఆదికాండము 3:1 చెబుతోంది. సర్పము ఈతలంపును హవ్వకు ఎలా తెలియజేసివుంటుందన్న దాన్ని గురించి అనేక అభిప్రాయాలు వ్యక్తం చేయబడ్డాయి. అది శరీర కదలికల ద్వారా లేదా సంజ్ఞల ద్వారా తెలిపివుంటుందని కొందరు అనుకుంటారు. ఉదాహరణకు ఆంగ్లేయుడూ పాదిరీ అయిన జోసెఫ్ బెన్సన్, “ఏదో ఒక విధమైన సంజ్ఞల ద్వారానే తెలిపివుండవచ్చని అనిపిస్తుంది. అప్పట్లో, తర్కించడమూ, మాట్లాడడమూ సర్పాల లక్షణాలుగా ఉండేవని కొందరు నమ్ముతున్నారు, ... కానీ దానికి ఏ రుజువూ లేదు” అని అన్నాడు.
అయితే, నిషిద్ధమైన ఫలాన్ని తింటే హవ్వ దేవునిలాగా కాగలదని, మంచి చెడ్డలను తనంతట తానే నిర్ణయించుకోగలదని కేవలం శరీర కదలికల ద్వారా సర్పం హవ్వకు ఎలా తెలియజేసి ఉంటుందంటారు? అంతేకాక, సాతాను వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ హవ్వ ఆసంభాషణలో పాల్గొంది. (ఆదికాండము 3:2-5) సర్పం కేవలం సంజ్ఞల ద్వారా లేదా కదలికల ద్వారా విషయాలను తెలియజేసిందన్న అభిప్రాయం, హవ్వ కూడా సంజ్ఞల ద్వారానే జవాబిచ్చివుంటుందన్న నిర్ధారణకు వచ్చేలా చేస్తుంది. కానీ, ఆమె మాట్లాడిందని బైబిలు చెబుతోంది.
అపొస్తలుడైన పౌలు ఈ సంఘటనను గురించి పేర్కొంటూ, “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి ... పోవునేమో అని భయపడుచున్నాను” అని తన తోటి క్రైస్తవులను హెచ్చరించాడు. పౌలు పేర్కొన్న ప్రమాదం, ‘దొంగ అపొస్తలులు, మోసగాండ్రునగు పనివారి’ నుండి వచ్చింది. అటువంటి ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులు’ తెచ్చిన ప్రమాదం, కేవలం శారీరక కదలికలు లేదా సంజ్ఞల ద్వారా వచ్చింది కాదు. ఆప్రమాదంలో, వాళ్ళ మాటలు—మోసపుచ్చే కుయుక్తితో కూడిన మాటలు కూడా చేరివున్నాయి.—2 కొరింథీయులు 11:3-5,13.
హవ్వను తప్పుదోవపట్టించేందుకు మాట్లాడే శక్తి ఉపయోగించబడినప్పటికీ, ఆసర్పానికి స్వరతంతువులుండేవన్న సూచన ఏ మాత్రం లేదు. నిజానికి దానికి వాటి అవసరమే రాలేదు. దేవుని దూత, బిలాము యొక్క గాడిద ద్వారా అతనితో మాట్లాడినప్పుడు, దానికి మానవునికున్నటువంటి సంక్లిష్టమైన స్వరపేటిక యొక్క అవసరం రాలేదు. (సంఖ్యాకాండము 22:26-31) “నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి”నప్పుడు, ఆచర్యకు అవసరమైన శక్తి ఆత్మ సామ్రాజ్యం నుండి వచ్చిందని స్పష్టం.—2 పేతురు 2:16.
హవ్వతో మాట్లాడిన సర్పం వెనుక పనిచేసిన ఆత్మ ప్రాణి, ‘అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పము’ అని బైబిలు తెలియజేస్తోంది. (ప్రకటన 12:9) హవ్వ విని, జవాబిచ్చేలా పలుకబడిన మాటలు “వెలుగు దూత వేషము ధరించుకొను” సాతాను ప్రేరణతో వచ్చినవే.—2 కొరింథీయులు 11:14.
[27వ పేజీలోని చిత్రం]
‘మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురు’