మన దినములను లెక్కించడాన్ని యెహోవా మనకు నేర్పిస్తాడు
మన దినములను లెక్కించడాన్ని యెహోవా మనకు నేర్పిస్తాడు
“మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” —కీర్తన 90:12.
1. ‘మన దినములు లెక్కించడం’ నేర్పించమని యెహోవాను అడగడం ఎందుకు యుక్తమైనది?
యెహోవా దేవుడు మన సృష్టికర్త, మన జీవప్రదాత. (కీర్తన 36:9; ప్రకటన 4:11) కాబట్టి మన జీవితకాలంలోని ప్రతి సంవత్సరాన్ని జ్ఞానయుక్తమైన విధంగా ఉపయోగించుకోవడమెలాగో మనకు నేర్పించేందుకు ఆయనకన్నా మెరుగైన స్థానంలో మరెవరూ లేరు. అందుకు తగినట్లుగానే కీర్తనకర్త ఇలా విజ్ఞప్తి చేశాడు: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” (కీర్తన 90:12) ఈవిజ్ఞప్తి 90వ కీర్తనలోనిది, ఆకీర్తనను మనం జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిదనడంలో సందేహం లేదు. అయితే మనం దేవునిచేత ప్రేరేపించబడిన ఈగీతం యొక్క సారాంశాన్ని మొదట పరిశీలిద్దాము.
2. (ఎ) 90వ కీర్తన కూర్చిన వ్యక్తి ఎవరని పేర్కొనబడింది, అది బహుశ ఎప్పుడు వ్రాయబడివుంటుంది? (బి)ఈ కీర్తన జీవితం పట్ల మన దృక్కోణాన్ని ఎలా ప్రభావితం చేయాలి?
2 “దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన” అని 90వ కీర్తన పైవిలాసం తెలియజేస్తోంది. ఆకీర్తన మానవ జీవితం ఎంతటి బుద్బుదప్రాయమో నొక్కిచెబుతుంది. గనుక అది బహుశ, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడుదల పొంది, వాళ్ళు అరణ్యంలో 40 ఏళ్ళు సంచరిస్తున్న సమయంలో కూర్చబడివుంటుందని చెప్పవచ్చు. ఆసమయంలో జరిగిన వేలకొలది మరణాలతో ఒక విశ్వాసఘాతుకమైన తరం అంతం అయిపోయింది. (సంఖ్యాకాండము 32:9-13) అయితే, అదెప్పుడు కూర్చబడినప్పటికీ, అపరిపూర్ణ మానవుల జీవితం చాలా కొద్దిపాటిదని 90వ కీర్తన చూపిస్తోంది. అందుకని మన అమూల్యమైన దినాలను చాలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలన్నది విదితం.
3. ముఖ్యంగా 90వ కీర్తనలో ఏమి ఉంది?
3కీర్తన 90 లో, 1 నుండి 6 వచనాలు యెహోవాయే మన నిత్య నివాసస్థలమని గుర్తిస్తున్నాయి. 7 నుండి 12 వచనాలు క్షణభంగురమైన మన జీవితంలోని సంవత్సరాలను ఆయనకు అంగీకారమైన రీతిలో ఉపయోగించుకునేందుకు ఏమి చేయాలో చూపిస్తున్నాయి. 13 నుండి 17 వచనాల్లో వ్యక్తీకరించబడినట్లుగా మనం యెహోవా కృపను ఆశీర్వాదాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంటాము. ఈకీర్తన యెహోవా సేవకులుగా మనలో ఒక్కొక్కరి అనుభవాలను గురించి ప్రవచించడం లేదన్నది నిజమే. అయినా మనం, ప్రార్థన రూపంలోని ఈకీర్తనలో వ్యక్తం చేయబడిన దైవభక్తితో కూడిన దృక్పథాన్ని గుర్తించి దాన్ని అనుకరించాలి. అందుకని దేవునికి సమర్పించుకున్నవారి దృక్కోణం నుండి మనం 90వ కీర్తనను జాగ్రత్తగా పరిశీలిద్దాము.
యెహోవా—మన “నివాసస్థలము”
4-6. యెహోవా మనకు “నివాసస్థలము”గా ఎలా ఉన్నాడు?
4 ఈ కీర్తన ఈమాటలతో ప్రారంభమవుతుంది: ‘ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు [“పురిటి నొప్పులతో,” NW] పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు.’—కీర్తన 90:1, 2.
5 ‘నిత్యదేవుడైన’ యెహోవా మనకు “నివాసస్థలము”—మనకు ఒక ఆధ్యాత్మిక ఆశ్రయస్థానము. (రోమీయులు 16:25-27) మనము భద్రతా భావాన్ని అనుభవిస్తాము, ఎందుకంటే ‘ప్రార్థన ఆలకించేవానిగా’ ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడు. (కీర్తన 65:2) మనం మన చింతలన్నింటినీ ఆయన ప్రియ కుమారుని ద్వారా మన పరలోకపు తండ్రిపై వేస్తాము కాబట్టి ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలివుంటుంది.’—ఫిలిప్పీయులు 4:6,7; మత్తయి 6:9; యోహాను 14:6,14.
6 మనం ఆధ్యాత్మికంగా భద్రతా భావాన్ని అనుభవిస్తాము ఎందుకంటే, సూచనార్థకంగా చెప్పాలంటే యెహోవాయే మనకు “నివాసస్థలము.” ఆయన ఆధ్యాత్మిక భద్రతా స్థలాలుగా “అంతఃపురముల”ను కూడా దయచేస్తాడు, ఇవి బహుశ ఆయన ప్రజల సంఘాలకు సంబంధించినవి కావచ్చును; అక్కడ ప్రేమగల కాపరులు మన భద్రతా భావానికి ఎంతో దోహదపడతారు. (యెషయా 26:21; 32:1,2; అపొస్తలుల కార్యములు 20:28,29) అంతేకాదు, మనలో కొందరు దేవుని సేవ చేసినట్లు సుదీర్ఘమైన చరిత్రవున్న కుటుంబాలకు చెందినవారు, అలా ఆయన ‘తరతరములనుండి మన నివాసస్థలముగా’ ఉన్నట్లు వారు వ్యక్తిగతంగా గుర్తించారు.
7. పర్వతాలు ‘పుట్టాయని’ భూమి “పురిటి నొప్పులతో” పుట్టిందని ఏ భావంలో చెప్పవచ్చు?
7 యెహోవా పర్వతములు “పుట్టక” ముందే లేక భూమి సూచనార్థక “పురిటి నొప్పులతో” పుట్టించబడక ముందే ఉనికిలో ఉన్నాడు. మానవ దృక్కోణం నుండి చూస్తే ఈభూమినీ అందులోని అనేకానేక రూపురేఖలను, రసాయనాలను, ఎంతో సంక్లిష్టమైన నిర్మాణ వ్యవస్థను సృష్టించడానికి ఎంతో శ్రమ అవసరం అవుతుంది. పర్వతములు ‘పుట్టాయని’ భూమి “పురిటి నొప్పులతో” పుట్టించబడిందని చెప్పడం ద్వారా కీర్తనకర్త యెహోవా వీటిని సృష్టించేటప్పుడు తీసుకున్న శ్రమ పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాడు. మనం కూడా సృష్టికర్త హస్తకృతిపట్ల అలాంటి గౌరవమూ కృతజ్ఞతా కలిగివుండవద్దా?
యెహోవా మన సహాయార్థం ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు
8. యెహోవా “యుగయుగములు” ఉండే దేవుడు అన్న మాటకు అర్థం ఏమిటి?
8 “యుగయుగములు నీవే దేవుడవు” అని పాడాడు కీర్తనకర్త. “యుగయుగములు” అన్నది ఇంత కాలమని నిర్దిష్టంగా చెప్పని విషయాలకు వర్తిస్తుంది, అయినా వాటికి ముగింపు మాత్రం ఉంటుంది. (నిర్గమకాండము 31:16,17; హెబ్రీయులు 9:15) అయితే కీర్తన 90:2 లోను హీబ్రూ లేఖనాల్లో మరితర కొన్నిచోట్లలోను “యుగయుగములు” అంటే “నిత్యము” అని అర్థం. (ప్రసంగి 1:4) దేవుడు ఎల్లప్పుడూ ఎలా ఉనికిలో ఉన్నాడన్నది మన మనస్సులు అర్థం చేసుకోలేవు. అయినా యెహోవాకు ఆది లేదు, అంతమూ ఉండదు. (హబక్కూకు 1:12) ఆయన ఎల్లప్పుడు సజీవుడిగానే ఉంటాడు, మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు.
9. కీర్తనకర్త వెయ్యి సంవత్సరాల మానవ ఉనికిని దేనితో పోల్చాడు?
9 మానవుల వెయ్యి సంవత్సరాల ఉనికిని నిత్యుడైన సృష్టికర్త దృష్టిలో చాలా స్వల్పమైన కాలమని తెలిపేలా కీర్తనకర్త ప్రేరేపించబడ్డాడు. దేవుణ్ణి సంబోధిస్తూ ఆయనిలా వ్రాశాడు: “నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు—నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి. రాత్రియందలి యొక జామువలెనున్నవి.”—కీర్తన 90:3, 4.
10. మనుష్యుడు ‘మంటికి మారేలా’ దేవుడు ఎలా చేస్తాడు?
10 మనుష్యుడు మర్త్యుడు, దేవుడు ఆయనను ‘మంటికి మారేలా’ చేస్తాడు. అంటే ‘నీవు నేలనుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని’ యెహోవా చెబుతున్నాడన్నమాట. (ఆదికాండము 2:7; 3:19) ఇది శక్తిశాలురేమి, బలహీనులేమి, ధనికులేమి బీదలేమి అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే అపరిపూర్ణుడైన ఏ మానవుడూ ‘ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు.’ (కీర్తన 49:6-9) కానీ ‘దేవుడు తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించినందుకు’ మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి!—యోహాను 3:16; రోమీయులు 6:23.
11. మనకు ఎంతో సుదీర్ఘమైన కాలంగా ఉండేది నిత్య దేవుడైన యెహోవాకు చాలా స్వల్పవ్యవధిగా ఉంటుందని ఎలా చెప్పగలము?
11 యెహోవా దృక్కోణం నుండి చూస్తే 969 ఏండ్ల మెతూషెల కూడా ఒక రోజు కన్నా తక్కువకాలం జీవించినట్లే. (ఆదికాండము 5:27) యెహోవా దృష్టిలో గతించిన వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటివలె ఉంటుంది—అది ఆయనకు కేవలం 24 గంటల కాలమే. దేవునికి వెయ్యి సంవత్సరాలు, రాత్రిపూట పాళెములో కావలివాడు కాపలాకాసే నాలుగు గంటల జామువలె ఉంటాయని కూడా కీర్తనకర్త పేర్కొంటున్నాడు. (న్యాయాధిపతులు 7:19) కాబట్టి, మనకు ఎంతో సుదీర్ఘమైన కాలంగా ఉండేది నిత్య దేవుడైన యెహోవాకు చాలా స్వల్పవ్యవధిగా ఉంటుందని స్పష్టమవుతోంది.
12. మానవులు దేవునిచేత ఎలా ‘పారగొట్టివేయ’బడతారు?
12 దేవుని నిత్య ఉనికికి భిన్నంగా ప్రస్తుత మానవ జీవితం నిజంగానే స్వల్పంగా ఉంది. కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు. ప్రొద్దున అది మొలిచి చిగిరించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును.” (కీర్తన 90:5,6) అరణ్యంలో వేలాదిమంది ఇశ్రాయేలీయులు చనిపోవడం మోషే చూశాడు, దేవుడు వరదలా వారిని ‘పారగొట్టివేయడం’ చూశాడు. కీర్తనలోని ఈభాగం ఇలా అనువదించబడింది: “నీవు మనుష్యులను మృత్యునిద్రలో కొట్టివేస్తావు.” (న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) మరోవైపు అపరిపూర్ణ మానవుల జీవితకాలము స్వల్పమైన ‘నిద్ర’ వంటిది—దాన్ని ఒక రాత్రి తీసే కునుకుతో పోల్చవచ్చు.
13. మనం ఏ భావంలో ‘పచ్చగడ్డిలాంటి’ వాళ్ళము, ఇది మన ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేయాలి?
13 మనం ‘ప్రొద్దున చిగిర్చే పచ్చ గడ్డి’లాంటి వాళ్ళము, అది సాయంత్రమయ్యే సరికి తీవ్రమైన ఎండ వేడికి వాడిపోతుంది. అవును, మన జీవితం ఒక్క రోజులో వాడిపోయే పచ్చ గడ్డిలా క్షణభంగురమైనది. కాబట్టి మనమీ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేయకుండా ఉందాం. బదులుగా, మనం ఈవిధానంలో మన జీవితంలోని మిగిలిన సంవత్సరాలను ఎలా ఉపయోగించుకోవాలో దేవుని నడిపింపును కోరుకుందాము.
‘మన దినములను లెక్కించడానికి’ యెహోవా మనకు సహాయం చేస్తాడు
14, 15. కీర్తన 90:7-9 ఇశ్రాయేలీయుల విషయంలో ఎలాంటి నెరవేర్పును కలిగివుంది?
14 దేవుని గురించి కీర్తనకర్త ఇంకా ఇలా అంటున్నాడు: “నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు. నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము.”—కీర్తన 90:7-9.
15 విశ్వాసఘాతకులైన ఇశ్రాయేలీయులు ‘దేవుని కోపానికి’ గురయ్యారు. వారు ‘ఆయన ఉగ్రతనుబట్టి దిగులుపడ్డారు,’ అంటే ‘ఆయన ఆగ్రహాన్నిబట్టి భీతిచెందారు.’ (న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) కొందరు దైవిక తీర్పుల మూలంగా “అరణ్యములో సంహరింపబడిరి.” (1 కొరింథీయులు 10:5) యెహోవా ‘వారి దోషములను తన యెదుటనే ఉంచుకున్నాడు.’ వారు బహిరంగముగా చేసిన పాపాలకు ఆయన వారిని బాధ్యులను చేశాడు, కానీ వారి “రహస్యపాపములు” కూడా లేదా చాటుగా చేసిన పాపాలు కూడా ‘ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి.’ (సామెతలు 15:3) దేవుని ఉగ్రతకు గురైనవారిగా పశ్చాత్తాపపడని ఇశ్రాయేలీయులు ‘నిట్టూర్పులు విడిచినట్టు తమ జీవితకాలాన్ని జరుపుకున్నారు.’ ఆమాటకొస్తే మన జీవితకాలం కూడా మన పెదాల మధ్య నుండి బయటికి వచ్చే నిట్టూర్పులా మాత్రమే ఉంది.
16. ఎవరైనా రహస్యంగా పాపాన్ని చేస్తూ ఉన్నట్లైతే వారు ఏమి చేయాలి?
సామెతలు 28:13; యాకోబు 5:14,15) మనం నిత్యజీవ నిరీక్షణను కోల్పోయే ప్రమాదంలోపడి ‘నిట్టూర్పు విడిచినట్లు మన జీవితకాలాన్ని జరుపుకోవడం’ కన్నా అదెంత శ్రేష్ఠమైన పని!
16 మనలో ఎవరైనా రహస్యంగా పాపాన్ని చేస్తూ ఉన్నట్లైతే ఆపాపాలను తోటి మానవుల నుండి కొంతకాలంపాటు దాచగలుగుతుండవచ్చు. కానీ మన రహస్యపాపాలు ‘యెహోవా ముఖకాంతిలో కనబడతాయి’ మన చర్యలు ఆయనతో మనకున్న సంబంధాన్ని దెబ్బతీస్తాయి. యెహోవాతో సాన్నిహిత్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే, మనం ఆయన క్షమాపణ కోసం అర్థించాల్సివుంటుంది, మన పాపాల్ని విడిచిపెట్టాల్సివుంటుంది, క్రైస్తవ పెద్దల ఆధ్యాత్మిక సహాయాన్ని కృతజ్ఞతాభావంతో స్వీకరించాల్సివుంటుంది. (17. సాధారణంగా ప్రజల జీవితకాలము ఎంత ఉంటుంది, మన జీవితకాలంలోని సంవత్సరాలు దేనితో నిండివుంటాయి?
17 అపరిపూర్ణ మానవుల స్వల్పమైన జీవితకాలాన్ని గురించి కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.” (కీర్తన 90:10) సాధారణంగా ప్రజల జీవితకాలము 70 ఏండ్లుగా ఉంటుంది, కాలేబు 85 ఏండ్ల వయస్సులో తన అసాధారణమైన బలాన్ని గురించి మాట్లాడాడు. అహరోను (123), మోషే (120), యెహోషువ (110) వంటి మినహాయింపులు కూడా ఉన్నాయి. (సంఖ్యాకాండము 33:39; ద్వితీయోపదేశకాండము 34:7; యెహోషువ 14:6,10,11; యెహోషువ 24:29) కానీ ఐగుప్తు నుండి బయటికి వచ్చిన విశ్వాసఘాతుకమైన తరంలోని 20 ఏళ్ళ వయస్సుకు పైబడి లెక్కింపబడినవారందరు 40 సంవత్సరాల లోపలే చనిపోయారు. (సంఖ్యాకాండము 14:29-34) నేడు అనేక దేశాల్లో సాధారణంగా ప్రజల జీవితకాలము కీర్తనకర్త పేర్కొన్న పరిధిలోనే ఉంటుంది. మన జీవితకాలంలోని సంవత్సరాలు ‘ఆయాసము, దుఃఖములతో’ నిండివున్నాయి. అవి త్వరగా గతిస్తాయి, ‘మనము ఎగిరిపోవుదుము.’—యోబు 14:1,2.
18, 19. (ఎ) ‘జ్ఞానహృదయము కలుగునట్లుగా మన దినములు లెక్కించుట’ అంటే ఏమిటి? (బి)మనం జ్ఞానాన్ని ఉపయోగించడం ఏమి చేసేందుకు కదిలిస్తుంది?
18 కీర్తనకర్త తర్వాత ఇలా పాడుతున్నాడు: “నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును? మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” (కీర్తన 90:11,12) దేవుని ఆగ్రహబలము ఎంతో లేదా క్రోధము ఎంతో మనలో ఎవరికీ పూర్తిగా తెలియదు, ఇది యెహోవాపట్ల మనకున్న భక్తిపూర్వక భయాన్ని పెంచాలి. నిజానికి అది మనం ‘జ్ఞానహృదయము కలుగునట్లుగా మన దినములు లెక్కించుట’ ఎలాగో అడిగేందుకు మనల్ని ప్రేరేపించాలి.
19 కీర్తనకర్త మాటలు, తన ప్రజలు తమ శేష దినాలను అమూల్యంగా ఎంచడంలోనూ తనకు అంగీకృతమైన రీతిలో ఉపయోగించుకోవడంలోనూ జ్ఞానాన్ని ప్రదర్శించడం ఎలాగో వారికి నేర్పించాలని చేసిన ప్రార్థన. మనం 70 సంవత్సరాలు జీవించగలిగితే అది దాదాపు 25,500 రోజులకు సమానం. అయితే మన వయస్సు ఎంతైనా ‘రేపేమి సంభవించునో మనకు తెలియదు. మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారమే.’ (యాకోబు 4:13-15) ‘కాలవశానికీ, అనూహ్య సంఘటనలకూ మనమందరమూ గురవుతాము’ కాబట్టి మనమింకా ఎంత కాలం జీవిస్తామన్నది మనకు తెలియదు. కాబట్టి కష్టాలను ఎదుర్కొనేందుకు, ఇతరులతో తగిన రీతిలో వ్యవహరించేందుకు, యథాశక్తిగా యెహోవా సేవ చేసేందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిద్దాము! (ప్రసంగి 9:11, NW; యాకోబు 1:5-8) యెహోవా తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా, తన సంస్థ ద్వారా మనల్ని నడిపిస్తాడు. (మత్తయి 24:45-47; 1 కొరింథీయులు 2:10; 2 తిమోతి 3:16,17) మనం జ్ఞానాన్ని ఉపయోగించినట్లైతే అది మనం ‘మొదట దేవుని రాజ్యాన్ని వెదికేందుకూ,’ యెహోవాకు మహిమను తీసుకువచ్చే విధంగాను ఆయన హృదయాన్ని సంతోషపరిచే విధంగాను మన జీవితంలోని రోజులను ఉపయోగించుకునేందుకూ మనల్ని కదిలిస్తుంది. (మత్తయి 6:25-33; సామెతలు 27:11) అయితే, హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించడం మన సమస్యలన్నింటినీ తీసివేయదు, కానీ అది తప్పకుండా మనకు ఎంతో ఆనందాన్ని తీసుకువస్తుంది.
యెహోవా ఆశీర్వాదం మనకు ఆనందాన్ని తెస్తుంది
20. (ఎ) దేవుడు ఎలా ‘సంతాపపడతాడు’? (బి)మనం గంభీరమైన తప్పిదము చేసినా నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించినట్లైతే యెహోవా మనతో ఎలా వ్యవహరిస్తాడు?
20 మన శేష జీవితమంతా ఆనందిస్తూనే ఉండగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది! ఈవిషయంలో మోషే ఇలా విజ్ఞప్తి చేస్తున్నాడు: “యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.” (కీర్తన 90:13,14) దేవుడు పొరబాట్లు చేయడు. అయితే ఆయన ‘సంతాపపడతాడు’ తన కోపంనుండి వెనుకకు ‘తిరుగుతాడు,’ అలాగే శిక్షను అమలుచేస్తానన్న హెచ్చరికకు ప్రతిస్పందించి పశ్చాత్తాపంచెందిన తప్పిదస్థులు తమ వైఖరినీ ప్రవర్తననూ మార్చుకున్నట్లైతే ఆయన ఆశిక్షను అమలు చేయకుండా కూడా వెనుకకు ‘మళ్లుతాడు.’ (ద్వితీయోపదేశకాండము 13:17,18) కాబట్టి, మనం గంభీరమైన తప్పిదం చేసినప్పటికీ నిజమైన పశ్చాత్తాపము ప్రదర్శించినట్లైతే యెహోవా ‘తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు’ అప్పుడు మనము ‘ఉత్సహించడానికి’ కారణం ఉంటుంది. (కీర్తన 32:1-5) అలాగే, ఒక నీతియుక్తమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మనపట్ల దేవునికి ఉన్న యథార్థమైన ప్రేమను గుర్తిస్తాము, అలా మనము ‘మన దినములన్నియు సంతోషించ’గలుగుతాము—అవును, మన మిగతా జీవితమంతా సంతోషించగలుగుతాము.
21. కీర్తన 90:15,16 లో నమోదు చేయబడిన మాటల్లో మోషే ఏమని వేడుకున్నాడు?
21 కీర్తనకర్త హృదయపూర్వకంగా ఇలా ప్రార్థిస్తున్నాడు: “నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.” (కీర్తన 90:15,16) శ్రమలను అనుభవించిన దినాలకు సరిపడా, కీడును అనుభవించిన ఏండ్లకు సరిపడా ఇశ్రాయేలును సంతోషానందాలతో ఆశీర్వదించుమని ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతూ ఉండవచ్చు. ఇశ్రాయేలును ఆశీర్వదించడమనే తన “కార్యము” తన సేవకులకు స్పష్టంగా కనబడనిమ్మని, తన ప్రభావము వారి కుమారులకు లేదా వారి సంతానానికి ప్రదర్శితమయ్యేలా చేయమని ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన నీతియుక్త నూతన లోకంలో విధేయులైన మానవజాతిపై ఆశీర్వాదాలను కుమ్మరించుమని మనం కూడా ప్రార్థించడం సరైనదే.—2 పేతురు 3:13.
22. కీర్తన 90:17 ప్రకారం మనం దేనికోసం ప్రార్థించడం సముచితం?
22కీర్తన 90 ఈవిజ్ఞప్తితో ముగుస్తుంది: “మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతిపనిని మాకు స్థిరపరచుము. మా చేతిపనిని స్థిరపరచుము.” (కీర్తన 90:17) ఆయన సేవలో మనం చేసే కృషిని ఆశీర్వదించాలని మనం దేవునికి ప్రార్థించడం సముచితమేనని ఈమాటలు చూపిస్తున్నాయి. మనం అభిషిక్త క్రైస్తవులమైనా వారి సహవాసులైన ‘వేరే గొఱ్ఱెలమైనా’ యెహోవా “ప్రసన్నత” మన మీద ఉన్నదని మనం ఆనందిస్తాము. (యోహాను 10:16) రాజ్య ప్రచారకులుగాను మరితర రంగాల్లోను దేవుడు ‘మన చేతిపనిని మనకు స్థిరపరిచాడని’ మనమెంత ఆనందిస్తున్నామో కదా!
మనం మన దినములను లెక్కించుకుంటూ ఉందాం
23, 24. మనం 90వ కీర్తనపై ధ్యానించడం ద్వారా ప్రయోజనం ఎలా పొందగలము?
23 మనం 90వ కీర్తనపై ధ్యానించడం మన “నివాసస్థలము” అయిన యెహోవాపై మనం మరింత ఆధారపడేలా చేయాలి. జీవిత క్షణభంగురత్వాన్ని గురించిన అందులోని మాటలను తలపోయడం మన దినాలను లెక్కించుకోవడంలో మనకు దైవిక నడిపింపు అవసరమన్న స్పృహను మరింత ఎక్కువ చేయాలి. మనం దేవుని జ్ఞానాన్ని వెదకడంలోను దాన్ని ఉపయోగించడంలోను పట్టుదలతో కొనసాగినట్లైతే యెహోవా కృప ఆయన ఆశీర్వాదము మనకు లభిస్తాయనడంలో నిశ్చయతను కలిగివుండగలము.
24 మన దినములను లెక్కించడం ఎలాగో యెహోవా మనకు నేర్పిస్తూనే ఉంటాడు. మనమా ఉపదేశాన్ని స్వీకరిస్తే మనం నిరంతరం మన దినములను లెక్కించుకుంటూ ఉండగలుగుతాము. (యోహాను 17:3) అయితే, మనం నిత్య జీవితాన్ని మన దృష్టిపథంలో ఉంచుకోవాలంటే యెహోవా మనకు ఆశ్రయస్థానముగా ఉండాలి. (యూదా 20,21) తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్లుగా ఈవిషయం 91వ కీర్తనలో ఎంతో హృద్యమైన మాటల్లో సుస్పష్టం చేయబడింది.
మీరెలా జవాబిస్తారు?
• యెహోవా మనకు ఏ విధంగా “నివాసస్థలము” అవుతాడు?
• మన సహాయార్థం యెహోవా ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉన్నాడని మనమెలా చెప్పగలము?
• ‘మన దినములను లెక్కించడానికి’ యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
• మనము ‘మన దినములన్నియు సంతోషించేలా’ సాధ్యం చేసేది ఏమిటి?
[అధ్యయన ప్రశ్నలు]
[11వ పేజీలోని చిత్రం]
“పర్వతములు పుట్టకమునుపు” కూడా యెహోవాయే దేవుడు
[12వ పేజీలోని చిత్రం]
యెహోవా దృక్కోణం నుండి చూస్తే 969 ఏండ్ల మెతూషెల కూడా ఒక రోజు కన్నా తక్కువకాలం జీవించినట్లే
[14వ పేజీలోని చిత్రాలు]
యెహోవా ‘మన చేతిపనిని స్థిరపరిచాడు’