కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేషధారణను మీరెలా ఎదుర్కొంటారు?

వేషధారణను మీరెలా ఎదుర్కొంటారు?

వేషధారణను మీరెలా ఎదుర్కొంటారు?

ఇస్కరియోతు యూదా గెత్సేమనే తోటలోనున్న యేసు దగ్గరికి వెళ్ళి ‘ఆయనను ముద్దుపెట్టుకొన్నాడు.’ ఇది హృదయపూర్వకమైన అనురాగాన్ని వ్యక్తం చేసే ఆచారబద్ధమైన ఒక చర్య. కానీ ఇక్కడ యూదా కేవలం ఆరాత్రి ఆయనను బంధించడానికి వచ్చినవారు యేసు ఎవరో గుర్తించడానికి మాత్రమే అలా చేశాడు. (మత్తయి 26:​48,49) యూదా వేషధారి; వేషధారి అంటే తనలో లేని లక్షణాలు ఉన్నాయన్నట్లుగా నటించే వ్యక్తి, తన చెడు ఉద్దేశాలను కప్పిపుచ్చుతూ నిజాయితీ ముసుగు వేసుకునే ఒక వ్యక్తి. “వేషధారి” అని అనువదించబడిన గ్రీకు పదానికి “జవాబు చెప్పేవాడు” అని అర్థం, అది రంగస్థల నటుణ్ణి కూడా సూచిస్తుంది. కాలక్రమేణా ఈపదం ఇతరులను మోసపుచ్చడానికి నటిస్తున్న వ్యక్తి కోసం ఉపయోగించబడసాగింది.

మీరు వేషధారణను ఎలా దృష్టిస్తారు? ఉదాహరణకు సిగరెట్టు తయారీదార్లు, తమ ఉత్పత్తులు హానికరమైనవని వైద్య సంబంధ రుజువులు చూపిస్తున్నా పొగత్రాగడాన్ని ప్రోత్సహించడం చూసి మీరు కోపగించుకుంటారా? సంరక్షకులే తమకు అప్పగింపబడిన వారిపట్ల భక్షకులుగా ప్రవర్తించినప్పుడు వారి వేషధారణను చూసి మీరు ఆగ్రహం చెందుతారా? నిజమైన స్నేహితుడని మీరనుకున్న వ్యక్తి మోసగాడిగా నిరూపణ అయితే మీమనస్సు గాయపడుతుందా? మతపరమైన వేషధారణ మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

‘అయ్యో, వేషధారురాలా!’

యేసు భూమ్మీద ఉన్నప్పటి మతపరమైన వాతావరణాన్ని పరిశీలించండి. శాస్త్రులు పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని యథార్థతతో బోధించేవారిగా నటిస్తున్నారు, కానీ నిజానికి వారు దేవునిపై నుండి మనస్సును మళ్లించే మనుష్యుల బోధలతో ప్రజల మనస్సులను నింపుతున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్తాన్ని ఖచ్చితంగా పాటించాలని పట్టుబట్టుతున్నారు, కానీ వారు ప్రేమా కరుణలను ప్రతిబింబించే ప్రాథమిక సూత్రాలను మాత్రం అలక్ష్యం చేస్తున్నారు. తాము దేవునిపట్ల నిష్ఠ కలిగివున్నామని ప్రజల ముందు నటిస్తున్నారు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు పూర్తిగా చెడుతో నిండివున్నారు. వారి క్రియలు వారి మాటలతో ఎన్నడూ పొసగలేదు. వారేమి చేసినా “మనుష్యులకు కనబడునిమిత్తము” మాత్రమే చేశారు. వారు “సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.” వారి వేషధారణను బహిర్గతం చేస్తూ యేసు వారితో “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా” అని పదే పదే అన్నాడు.​—⁠మత్తయి 23:5, 13-31.

మీరు ఆరోజుల్లో జీవించివుంటే అలాంటి మతపరమైన వేషధారణను చూసి నిష్కపటులైన ఇతర ప్రజలతోపాటు మీరు కూడా నిజంగా ఏవగించుకునేవారు. (రోమీయులు 2:​21-24; 2 పేతురు 2:​1-3) కానీ శాస్త్రుల పరిసయ్యుల వేషధారణను చూసి మీరు అన్ని మతాలను చివరికి యేసుక్రీస్తు ఆయన శిష్యులు బోధిస్తూ ఆచరిస్తున్న మతాన్ని కూడా తిరస్కరించేంతగా మీరు ఏవగించుకునేవారా? అలా చేయడం మీకు నష్టకరంగా ఉండేదే కదా?

మత సంబంధ వ్యక్తుల్లో వేషధారణతో కూడిన ప్రవర్తన మనం మతాన్నే హేయంగా ఎంచి దానికి దూరమయ్యేలా చేయగలదు. అయితే అలా చేస్తే మనం సత్యారాధకుల నిజాయితీని కూడా గ్రహించలేము. వేషధారణకు విరుద్ధంగా రక్షణకోసం మనం నిర్మించుకున్న అడ్డుగోడలే నిజమైన స్నేహితుల నుండి మనలను దూరం చేయవచ్చు. కాబట్టి వేషధారణకు మనం ప్రతిస్పందించే రీతి సహేతుకంగాను సమతుల్యంగాను ఉండాలి.

“మీ కన్నులు తెరుచుకుని జాగ్రత్తగా ఉండండి”

మొట్టమొదట మనం వేషధారణను గుర్తించడం నేర్చుకోవాలి. ఇది అన్ని సందర్భాల్లోను అంత సులభం కాదు. ఒక కుటుంబంవారు దీన్ని గొప్ప మూల్యం చెల్లించి నేర్చుకోవలసివచ్చింది. ఈకుటుంబంలోని తల్లి కోమాలోకి వెళ్ళింది. ఇది జరిగిన ఆసుపత్రిపై కోర్టులో దావా వేసినప్పుడు ఆకుటుంబ సభ్యులు స్థానిక చర్చీలోని ప్రీస్టును వకీలుగా పెట్టుకున్నారు. కేసు పరిష్కారంలో ఆసుపత్రి 34 లక్షల డాలర్లను చెల్లించినప్పటికీ ఆకుటుంబ పరిస్థితి మరింత విషాదభరితం అయ్యింది. ఆతల్లి ఒక బీదరాలిగా మరణించింది, ఆమెకు అంత్యక్రియలు జరిపించడానికి కూడా డబ్బు లేకపోయింది. ఎందుకని? ఎందుకంటే వచ్చిన డబ్బులో అధికమొత్తం వకీలే మింగేశాడు. ఈవకీలు గురించి ఒక న్యాయపత్రిక ఇలా పేర్కొంది: “తాను అవలంబించినదే ఆయన బోధిస్తే, ..., ఆయన సందేశం ఇలా ఉంటుంది: రండి మనం పీక్కు తిందాం.” అలాంటి ప్రజల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలము?

“మీ కన్నులు తెరుచుకుని జాగ్రత్తగా ఉండండి” అని యేసు మత వేషధారణను ఎదుర్కొంటున్న తన కాలంలోని ప్రజలకు సలహా ఇచ్చాడు. (మత్తయి 16:​6, NW; లూకా 12:⁠1) అవును, మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అత్యంత ఉదాత్తమైన లక్ష్యాలు కలిగివున్నట్లు చెప్పుకుంటుండవచ్చు, నిజాయితీపరుల్లా కనిపిస్తుండవచ్చు కానీ మనం సహేతుకమైన జాగ్రత్త వహించాలి, ప్రతి మనిషిని పైకి కనిపిస్తున్న దాన్నిబట్టి స్వీకరించేయకూడదు. జాలీ నోట్లు చెలామణి అవుతున్నాయని మనకు గనుక తెలిస్తే మన దగ్గరున్న నోట్లు జాగ్రత్తగా పరిశీలించుకోమా?

నిజ క్రైస్తవ సంఘంలో కూడా వేషధారులు ప్రత్యక్షమయ్యారు. శిష్యుడైన యూదా వారి గురించి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: ‘వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేని చెట్లుగాను ఉన్నారు.’​—⁠యూదా12.

‘మనం కన్నులు తెరుచుకుని జాగ్రత్తగా ఉండడం’ అంటే ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నా నిజానికి స్వార్థపరుడిగా ఉంటూ దేవునివాక్యంపై ఆధారితంకాని అభిప్రాయాలను ప్రచారం చేస్తున్న వ్యక్తి మోసంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండడం అని అర్థం. ప్రశాంత జలాల ఉపరితలం క్రింద మొనదేలిన బండరాతిలా ఉండే అలాంటి వ్యక్తి ఆదమరచి ఉన్నవారి ఆధ్యాత్మిక ఓడను బద్దలైపోయేలా చేయగలడు. (1 తిమోతి 1:​19) వేషధారి ఆధ్యాత్మికంగా సేదదీరుస్తానని ఎంతో వాగ్దానం చేయవచ్చు కానీ ఆయన వర్షాలు కురిపించని “నిర్జల మేఘములుగా” ఉన్నాడని చివరికి రుజువవుతుండవచ్చు. మోసగాడు ఫలాలు లేని చెట్టులా, ఏలాంటి నిజమైన క్రైస్తవ ఫలాలనూ ఉత్పత్తిచేయడు. (మత్తయి 7:​15-20; గలతీయులు 5:​19-21) అవును, మనం అలాంటి మోసగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, మనం అందరి ఉద్దేశాలనూ అనుమానించకుండా అలా జాగ్రత్తగా ఉండాలి.

“మీరు తీర్పు తీర్చకుడి”

అపరిపూర్ణ మానవులు తమ సొంత దోషాలను పట్టించుకోకుండా ఇతరుల దోషాలను ఎత్తిచూపించడం ఎంత సులభమో కదా! అయితే ఇలాంటి ధోరణి మనం వేషధారణలో పడిపోయేలా చేస్తుంది. “వేషధారీ” అని పిలుస్తూ యేసు ఇలా అన్నాడు, “మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.” మనం ఆయనిచ్చిన ఈసలహాను పాటించడం మనకే మేలు చేస్తుంది: ‘మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు సహోదరుని చూచి​—⁠నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?’​—⁠మత్తయి 7:1-5.

ఇతరులు అప్పుడప్పుడు వేషధారణ అనిపించే క్రియలు చేసినప్పటికీ మనం తొందరపడి వారు వేషధారులు అని ముద్ర వేయకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు అపొస్తలుడైన పేతురు యెరూషలేము నుండి యూదులు సందర్శించినప్పుడు వారిని ప్రీతిపరచడానికిగాను అంతియొకయలోని అన్యులైన తోటి విశ్వాసుల నుండి ‘వెనుకతీసి వేరైపోయాడు.’ ‘తక్కిన యూదులును పేతురుతో కలిసి మాయవేషము వేసికొనిరి,’ బర్నబాకూడ “వారి వేషధారణముచేత మోసపోయెను.” క్రైస్తవ సంఘంలోనికి అన్యులను అనుమతించేందుకు మార్గాన్ని తెరిచే ఆధిక్యత తను అనుభవించినప్పటికీ ఆయన అలా చేశాడు. (గలతీయులు 2:​11-14; అపొస్తలుల కార్యములు 10:​24-28,34,35) బర్నబా, పేతురులు ఇలా ఒకసారి తప్పిపోయినంత మాత్రాన వారు కూడా శాస్త్రులు పరిసయ్యులు లేదా ఇస్కరియోతు యూదా వంటివారి వర్గంలో చేరిపోయారని కాదు.

“మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను”

“మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు” అని యేసు ఉద్బోధ చేశాడు. (మత్తయి 6:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:⁠9) ఆయన యౌవనుడైన తిమోతిని ‘పవిత్ర హృదయమునుండియు నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమను’ కలిగియుండుమని ప్రోత్సహించాడు. (1 తిమోతి 1:⁠5) మన ప్రేమ విశ్వాసము నిజమైనవైతే​—⁠స్వార్థము మోసము వంటివాటితో కళంకితం కాకపోయినట్లైతే​—⁠ఇతరులు మనల్ని నమ్ముతారు. మన చుట్టు ప్రక్కలనున్న ప్రజలకు మనం నిజమైన బలానికి ప్రోత్సాహానికి మూలంగా ఉంటాము. (ఫిలిప్పీయులు 2:⁠4; 1 యోహాను 3:​17,18; 1 యోహాను 4:​20,21) అన్నింటికీ మించి మనకు యెహోవా ఆమోదం లభిస్తుంది.

మరోవైపు చూస్తే వేషధారణ చివరికి దాన్ని అభ్యసించేవారికి మృతప్రాయంగా ఉంటుంది. చివర్లో వేషధారణ అందరికీ బహిర్గతం చేయబడుతుంది. “మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు” అని యేసుక్రీస్తు అన్నాడు. (మత్తయి 10:​26; లూకా 12:⁠2) జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా ప్రకటించాడు: “గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.”​—⁠ప్రసంగి 12:⁠14.

ఈలోగా, ఇతరుల వేషధారణ నిజమైన స్నేహితుల నిజమైన ప్రేమను కోల్పోయేంతగా మనం ప్రభావితమయ్యేందుకు ఎందుకు అనుమతించాలి? మరీ అనుమానించేవారిగా ఉండకుండానే మనం జాగ్రత్తగా ఉండగలము. రండి, మనం మన ప్రేమను విశ్వాసాన్ని నిష్కపటంగా ఉంచుకొందాము.​—⁠యాకోబు 3:​17; 1 పేతురు 1:⁠22.

[22, 23వ పేజీలోని చిత్రాలు]

శాస్త్రుల పరిసయ్యుల వేషధారణ మూలంగా మీరు యేసుక్రీస్తు ఆయన శిష్యుల నుండి దూరమయ్యేవారా?