కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిథియన్లు గతచరిత్రలో నిగూఢమైన ప్రజలు

సిథియన్లు గతచరిత్రలో నిగూఢమైన ప్రజలు

సిథియన్లు గతచరిత్రలో నిగూఢమైన ప్రజలు

ఆసంచార ప్రజల అశ్వాలు దుమ్ము రేపుకుంటూ పరుగెడుతున్నాయి, వాటిపైనున్న జీనుల్లోని సంచులు కొల్లసొమ్ముతో నిండివున్నాయి. ఆనిగూఢమైన ప్రజలు యురేషియాలోని స్టెప్పీ మైదానాల్లో సా.శ.పూ. 700 నుండి 300 వరకు స్వైరవిహారం చేశారు. తర్వాత వారు అంతర్థానమయ్యారు​—⁠కానీ చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించిన తర్వాతే. చివరికి బైబిలులో కూడా వారి ప్రస్తావన ఉంది. వారే సిథియన్లు.

శతాబ్దాలుగా అడవి గుర్రాల మందలతోపాటు సంచార ప్రజలు తూర్పు యూరప్‌లోని కార్పథియన్‌ కొండలు మొదలుకొని ఇప్పటి ఆగ్నేయ రష్యా వరకు ఉన్న గడ్డిమైదానాల్లో తిరుగాడారు. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దానికల్లా చైనా సామ్రాట్టు అయిన షూయీయాన్‌ చేపట్టిన సైనిక చర్యల మూలంగా పశ్చిమంవైపుకు వలసలు ప్రారంభించారు. సిథియన్లు పశ్చిమం వైపు పయనిస్తూ, కాకసస్‌నూ నల్ల సముద్రానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్నీ నియంత్రణలో ఉంచుకున్న సిమ్మెరియన్లతో పోరాడి వారిని తరిమేశారు.

ధన సంపదల కోసం సిథియన్లు అష్షూరు రాజధానియైన నీనెవెను కొల్లగొట్టారు. తర్వాత మాదీయులకు, బబులోనీయులకు, మరితరులకు విరోధంగా వారు అష్షూరీయులతో స్నేహం చేశారు. వారి దాడులు చివరికి ఉత్తర ఐగుప్తుకు కూడా విస్తరించాయి. ఈశాన్య ఇశ్రాయేలులోని బేత్షాను పట్టణం తర్వాత సిథోపోలిస్‌ అని పిలువబడిందన్న వాస్తవం దాన్ని సిథియన్లు కొంతకాలం ఆక్రమించుకున్నారని సూచిస్తుండవచ్చు.​—⁠1 సమూయేలు 31:11,12.

చివరికి సిథియన్లు ఇప్పటి రొమేనియా, మాల్డోవా, యుక్రేన్‌, దక్షిణ రష్యాలోని స్టెప్పీ మైదానాల్లో స్థిరపడ్డారు. అక్కడ వారు, గ్రీకులకు ఇప్పటి యుక్రేన్‌, ఇప్పటి దక్షిణ రష్యా ప్రాంతాల్లోని ధాన్యం ఉత్పత్తిదారులకు మధ్యవర్తులుగా పనిచేసి ధనవంతులయ్యారు. సిథియన్లు ధాన్యాలు, తేనె, జంతువుల బొచ్చు, పశువులు వంటి వాటిని ఇస్తూ వాటికి బదులుగా గ్రీకుల ద్రాక్షారసం, బట్టలు, ఆయుధాలు, కళాకృతులు వంటివాటిని తీసుకునేవారు. అలా వారు గొప్ప ధనసంపదలను ఆర్జించారు.

భయంకరులైన గుర్రపు రౌతులు

ఎడారుల్లోని ప్రజలకు ఒంటె ఎలాంటిదో స్టెప్పీ మైదానాల్లోని ఈయోధులకు గుర్రం అలాంటిది. సిథియన్లు గుర్రాల్ని పరుగెత్తించడంలో ఘనులు, గుర్రపు జీనుని దానికుండే పాదాలు పెట్టుకునే ఇనుపమెట్టుని ఉపయోగించిన తొలి ప్రజల్లో వీరున్నారు. వీరు గుర్రం మాంసాన్ని తినేవారు, గుర్రం పాలు త్రాగేవారు. చెప్పాలంటే వారు దహన బలుల్లో గుర్రాలను అర్పించారు కూడా. సిథియన్‌ యోధుడు చనిపోతే ఆయన గుర్రాన్ని చంపి, దాని జీను, అలంకార వస్త్రాలతోపాటు దానికి ఘనమైన ఉత్తర క్రియలు జరిపేవారు.

చరిత్రకారుడైన హెరొడోటస్‌ వర్ణించిన ప్రకారం సిథియన్లు చాలా క్రూరమైన ఆచారాలను పాటించారు, వారు తాము చంపినవారి కపాలాలను త్రాగడానికి కప్పులుగా ఉపయోగించారు. వారు తమ శత్రువులపై మెరుపుదాడులు చేస్తూ వారిని ఇనుప ఖడ్గాలతో, యుద్ధ గొడ్డళ్ళతో, బరిసెలతో ఊచకోతకోశారు, శరీరాన్ని చేధించడానికి ములుకులుగల బాణాలను ఉపయోగించారు.

నిరంతరం నిలిచేలా నిర్మించబడిన సమాధులు

సిథియన్లు క్షుద్రవిద్యలను, మంత్రతంత్రాలను ఆచరించారు, అగ్నిని, మాతృ దేవతను ఆరాధించారు. (ద్వితీయోపదేశకాండము 18:​10-12) వారు సమాధులను మృతులు నివసించే స్థలంగా దృష్టించారు. చనిపోయిన తమ యజమానికి ఉపయోగపడాలని జంతువులతోపాటు బానిసలు బలివ్వబడేవారు. ప్రముఖులు చనిపోయినప్పుడు నిధులతోపాటు ఇంటి సేవకులు కూడా “తర్వాతి లోకానికి” వెళ్ళేవారని నమ్మేవారు. ఒక రాజ సంబంధిత సమాధిలో ఐదుగురు సేవకుల శరీరాలు తమ యజమాని వైపు కాళ్ళు పెట్టి ఉండడం కనిపించింది, అంటే తమ సేవలను కొనసాగించేలా లేచినిలబడడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట.

పరిపాలకులు గొప్ప బలులతో సమాధి చేయబడేవారు, విలాప కాలంలో సిథియన్లు తమ రక్తాన్ని ఒలికిస్తూ జుట్టును కత్తిరించుకునేవారు. హెరొడోటస్‌ ఇలా వ్రాశాడు: “వారు తమ చెవిని కొంత కత్తిరించుకుంటారు, గుండు గీయించుకుంటారు, చేతుల చుట్టూ గంట్లు పెట్టుకుంటారు, నొసళ్ళు ముక్కులు చీరుకుంటారు, ఎడమ చేతుల్ని బాణాలతో గుచ్చుకుంటారు.” దీనికి విరుద్ధంగా, అదే కాలంలోని ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రం ఇలా ఆజ్ఞాపిస్తోంది: “చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు.”​—⁠లేవీయకాండము 19:⁠28.

సిథియన్లు వేల సంఖ్యలో కూర్గన్‌లను (సమాధి దిబ్బలు) విడిచిపోయారు. కూర్గన్‌లలో కనుగొనబడిన ఆభరణాలు అనేకం సిథియన్ల అనుదిన జీవితం గురించి తెలియజేస్తున్నాయి. రష్యా దేశపు జార్‌ పీటర్‌ ద గ్రేట్‌ అలాంటి వస్తువులను 1715 లో సేకరించడం ప్రారంభించాడు, ఆకాంతులీనే వస్తువులను ఇప్పుడు రష్యాలోను యుక్రేన్‌లోను ఉన్న వస్తుప్రదర్శనశాలల్లో చూడవచ్చును. ఈ“జంతు నమూనా కళ”లో గుర్రాలు, గ్రద్దలు, డేగలు, పిల్లులు, చిఱుతపులులు, కణుజులు, లేళ్ళు, బర్డ్‌-గ్రిఫ్ఫిన్‌లు, సింహం-గ్రిఫ్ఫిన్‌లు (శరీరం ఒక జంతువుది, తల మరో జంతువుదిగల రెక్కలు ఉన్న లేదా రెక్కలు లేని మిథ్యా ప్రాణులు) ఉన్నాయి.

సిథియన్లు, బైబిలు

బైబిలు సిథియన్ల గురించి ఒకే ఒక్కసారి సూటిగా పేర్కొంటుంది. కొలొస్సయులు 3:11 లో మనమిలా చదువుతాము: “ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు.” క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఆమాటలను వ్రాసినప్పుడు “సిథియను” అని అనువదించబడిన గ్రీకు పదానికి ఫలాని జనాంగాన్ని కాదు గానీ అతి ఘోరమైన అనాగరిక ప్రజల్ని సూచించింది. పౌలు యెహోవా పరిశుద్ధాత్మ అంటే చురుకైన శక్తి ప్రభావం క్రింద అలాంటి వ్యక్తులు కూడా దైవిక వ్యక్తిత్వాన్ని ధరించుకోగలరని నొక్కిచెబుతున్నాడు.​—⁠కొలొస్సయులు 3:9,10.

యిర్మీయా 51:27 లో కనబడే అష్కనజు అన్న పేరు అష్షూరీయుల పదమైన అష్గుజాయ్‌ అన్నదానికి సమానార్థకం అని కొందరు పురాతత్త్వశాస్త్రజ్ఞులు నమ్ముతారు. అష్గుజాయ్‌ అన్నది సిథియన్లకు అన్వయించబడిన ఒక పేరు. కీలలిపిలోని పలకలు సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో అష్షూరుపై జరిగిన తిరుగుబాటులో ఈప్రజలకు, మన్నై అనే ప్రాంతపు నివాసులకు మధ్య కుదిరిన మిత్రత్వాన్ని గురించి పేర్కొంటున్నాయి. యిర్మీయా ప్రవచించడానికి కొద్దిగా ముందు సిథియన్లు యూదా దేశం ప్రక్కనుండి ఐగుప్తుకు ఎలాంటి అపాయమూ జరగకుండా వెళ్ళి వచ్చారు. అందుకనే ఉత్తరదిక్కు నుండి యూదాపై దాడిని గురించి ఆయన ప్రవచించడం విన్న చాలామంది ఆప్రవచన ఖచ్చితత్వాన్ని సందేహించారు.​—⁠యిర్మీయా 1:13-15.

కొందరు విద్వాంసులు యిర్మీయా 50:42 లో సిథియన్లను గురించిన సూచన ఉన్నదని భావిస్తారు: “వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు. బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.” కానీ ఈవచనం ప్రాథమికంగా సా.శ.పూ. 539 లో బబులోనును జయించిన మాదీయ పారసీకులకు అన్వయిస్తుంది.

యెహెజ్కేలు 38, 39 అధ్యాయాల్లో పేర్కొనబడిన ‘మాగోగు దేశము’ సిథియన్ల తెగల గురించేనని సూచించబడింది. అయితే ‘మాగోగు దేశానికి’ సూచనార్థక ప్రాముఖ్యం ఉంది. అది భూ పరిధికి సంబంధించినదని స్పష్టమవుతుంది, పరలోకంలో యుద్ధం జరిగిన తర్వాత సాతాను వాని దూతలు భూమికే పరిమితం చేయబడ్డారు.​—⁠ప్రకటన 12:7-17.

నీనెవె పడద్రోయబడడాన్ని గురించి ప్రవచించిన నహూము ప్రవచన నెరవేర్పులో సిథియన్లు ఇమిడివున్నారు. (నహూము 1:​1,14) కల్దీయులు, సిథియన్లు, మాదీయులు సా.శ.పూ. 632 లో నీనెవెను ధ్వంసం చేసి, కొల్లగొట్టి, అష్షూరు సామ్రాజ్యం కూలిపోవడానికి కారణమయ్యారు.

నిగూఢమైన రీతిలో పతనం

సిథియన్లు అంతర్థానమయ్యారు, కానీ ఎందుకు? “నిజం చెప్పాలంటే, అసలు ఏమి జరిగిందో మనకు తెలీదు” అని యుక్రేన్‌లోని ఒక ప్రముఖ పురాతత్త్వశాస్త్రజ్ఞుడు చెబుతున్నాడు. సిరిసంపదల మోహానికిలోనై సా.శ.పూ. ఒకటి రెండవ శతాబ్దాల్లో ఆసియాకు చెందిన సర్మాటియన్లనే సంచార ప్రజలకు లొంగిపోయారని కొందరు నమ్ముతారు.

మరితరులు సిథియన్‌ తెగల్లోనే సంఘర్షణల మూలంగా వారు పతనమయ్యారని భావిస్తున్నారు. ఇంకా ఇతరులు, సిథియన్లలో శేషించిన కొందరు కాకసస్‌కు చెందిన ఒస్సెటియన్‌లలో కనబడతారని చెబుతారు. ఏదేమైనా గతచరిత్రలోని ఈనిగూఢమైన ప్రజలు మానవ చరిత్రలో తమ ముద్రను వేసి వెళ్ళిపోయారు​—⁠ఆ ముద్ర మూలంగా సిథియన్లు అన్న పేరు క్రూరత్వానికి మారుపేరుగా అయ్యింది.

[24వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

◻ ప్రాచీన పట్టణం

• ఆధునిక పట్టణం

డాన్యూబ్‌

సిథియా వలస మార్గం

• కీవ్‌

నీపర్‌

నీస్టర్‌

నల్ల సముద్రము

ఒస్సెటియా

కాకసస్‌ పర్వతాలు

కాస్పియన్‌ సముద్రము

అష్షూరు ← దండయాత్రల మార్గాలు

◻ నీనెవె

టైగ్రీస్‌

మాదీయ ← దండయాత్రల మార్గాలు

మెసపొతెమియ

బాబిలోనియా ← దండయాత్రల మార్గాలు

◻ బబులోను

యూఫ్రటీస్‌

పర్షియా సామ్రాజ్యం

◻ సూసా

పర్షియా సింధుశాఖ

పాలస్తీనా

• బేత్షాను (సిథోపోలిస్‌)

ఐగుప్తు ← దండయాత్రల మార్గాలు

నైలు

మధ్యధరా సముద్రము

గ్రీసు

[25వ పేజీలోని చిత్రాలు]

సిథియన్లు యుద్ధకాముకులు

[చిత్రసౌజన్యం]

The State Hermitage Museum, St.Petersburg

[26వ పేజీలోని చిత్రాలు]

సిథియన్లు తమ వస్తువులను గ్రీకుల కళాకృతులతో మార్పిడి చేసుకుని చాలా సంపన్నులయ్యారు

[చిత్రసౌజన్యం]

Courtesy of the Ukraine Historic Treasures Museum, Kiev