ఆధ్యాత్మిక గుండెపోటు రాకుండా మీరు తప్పించుకోవచ్చు
ఆధ్యాత్మిక గుండెపోటు రాకుండా మీరు తప్పించుకోవచ్చు
మంచి ప్రావీణ్యత, చక్కని దేహ దారుఢ్యం ఉన్న ఒక ప్రపంచ స్థాయి అథ్లెట్, ఒకరోజు ప్రాక్టీసు చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి, చివరికి మరణించాడు. ఆయనే సిర్జియా గ్రింకోఫ్, ఐస్ స్కేటింగులో ఆయన రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అప్పుడే వికసించడం ఆరంభమైన ఆఅథ్లెట్ జీవితగమనం, 28వ ఏటనే అంతం అయ్యింది. ఎంత విషాదకరం! అసలు కారణమేమిటి? గుండెపోటు. ఆయన మరణం పూర్తిగా ఊహించనిది, ఎందుకంటే ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అంతవరకు ఆయనలో ఎటువంటి సూచనలు కనబడలేదని కొందరు అన్నారు. కానీ, పరిశోధకులు ఆయన గుండె వ్యాకోచించిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు చాలా తీవ్రంగా పూడుకు పోయాయని తేల్చి చెప్పారు.
చాలాసార్లు గుండెపోటు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందని అనిపిస్తుంది, కానీ చాలా అరుదుగా అలా జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి, ఊపిరి అందనట్లుండడం, అధికబరువు, ఛాతీలో నొప్పిలాంటి పైకి కనబడే సూచనలను, దానికి తోడ్పడే కొన్ని వాస్తవాలను తరచుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా, గుండెపోటు వచ్చిన వారు మరణించక పోయినా, చాలామంది తమ శేష జీవితమంతా తీవ్రమైన అంగవైకల్యతకు గురవుతారు.
గుండెపోటును నివారించడానికి ఆహారపు అలవాట్లను, జీవిత శైలిని క్రమంగా జాగ్రత్తగా చూసుకోవాలనీ, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ నేడు వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఒప్పుకుంటున్నారు. * అలాంటి చర్యలతోపాటు, అవసరమైన చోట మార్పులు చేసుకోవడానికి చూపించే నిజమైన సుముఖత, గుండెపోటువల్ల వచ్చే దుష్ఫలితాలనుండి ఒక వ్యక్తిని చాలామటుకు రక్షిస్తుంది.
అయితే, మనం మరింత ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన మరొక కోణం మన హృదయానికి ఉంది. “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని బైబిలు సామెతలు 4:23) ప్రాముఖ్యంగా ఈలేఖనం ఆలంకారిక హృదయాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు. మన భౌతిక హృదయాన్ని కాపాడ్డానికి సరైన జాగ్రత్త అవసరం, కానీ ఆధ్యాత్మిక మరణానికి గురిచేసే వ్యాధులనుండి మన ఆలంకారిక హృదయాన్ని కాపాడాలనుకుంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యం.
మనలను హెచ్చరిస్తోంది. (ఆలంకారిక గుండెపోటు విశ్లేషణము
భౌతిక గుండెపోటులాగే, ఆధ్యాత్మిక గుండెపోటును నివారించే సురక్షితమైన మార్గాల్లో ఒకటేమిటంటే, అది రావడానికి గల కారణాలను తెలుసుకొని, అవసరమైన చర్యలను తీసుకోవడమే. అందుకే అక్షరార్థమైన హృదయానికి, ఆలంకారికమైన హృదయానికి సమస్యలను తెచ్చే కొన్ని ప్రధానమైన వాస్తవాలను మనం పరిశీలిద్దాం.
నియమితాహారం. చిరుతిండి నోరూరించేలా ఉన్నప్పటికీ అది మన ఆరోగ్యానికి కేవలం స్వల్పమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది లేక ఏ ప్రయోజనమూ చేకూర్చదన్న విషయం సర్వత్రా అంగీకరించబడినదే. అదే విధంగా, సిద్ధంగా లభిస్తున్న మానసిక చిరుతిండి జ్ఞానేంద్రియాలను రెచ్చగొడుతుంది, కానీ అది ఆధ్యాత్మిక ఆరోగ్యానికి హానికరమైనది. చట్టవిరుద్ధమైన లైంగికత, మాదక ద్రవ్యాలు, హింస, క్షుద్ర శక్తులు వంటివి కథాంశాలుగా ఉన్న సమాచారం నేటి మాధ్యమాల్లో విశృంఖలంగా, చాకచక్యంతో మార్కెట్ చేయబడుతోంది. ఒకరి మనస్సును అలాంటి ఆహారంతో పోషించడమంటే మరణాంతకమైన గుండెపోటును తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే దేవుని వాక్యమిలా హెచ్చరిస్తోంది: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:16, 17.
చిరుతిండ్లకు అలవాటుపడిన ఒక వ్యక్తికి పండ్లు, ఆకుకూరల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు అంత నోరూరించేవిగా కనిపించవు. అదేవిధంగా, ఈలోకం అందిస్తున్న ఆహారంతో తన మనసును, హృదయాన్ని పోషించడం అలవాటుపడిన వ్యక్తికి, ఆరోగ్యకరమైన బలమైన ఆధ్యాత్మిక ఆహారము అంత నోరూరించేదిగా కనిపించదు. దేవుని వాక్యపు “పాల”పైన ఆవ్యక్తి కొంతకాలం జీవిస్తుండవచ్చు. (హెబ్రీయులు 5:13) కానీ చివరికి క్రైస్తవ సంఘంలో, పరిచర్యలో అవసరమయ్యే ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక బాధ్యతలను వహించడానికి కావలసిన ఆధ్యాత్మిక పరిణతికి అతను ఎదగలేడు. (మత్తయి 24:14; 28:19; హెబ్రీయులు 10:24,25) కొందరు అలాంటి పరిస్థితిలో తమ ఆధ్యాత్మిక బలం క్షీణించిపోయేలా చివరికి క్రియలులేని సాక్షులుగా మారేంతగా అనుమతించారు!
మరొక అపాయమేమిటంటే మోసకరమైన బాహ్యరూపం. అనైతికతను, హింసను లేక క్షుద్ర శక్తులను పురికొల్పే వస్తుప్రధానవాద లౌకిక సిద్ధాంతాల్లో లేక వినోదాల్లో రహస్యంగా మునిగిపోవడంవల్ల బలహీనమైన ఆలంకారిక హృదయం వ్యాధి ఎంత ముదురుతున్నా అది కనబడకుండా పైపైన చేసే క్రైస్తవ విధులు మరుగుపరుస్తుండవచ్చు. ఆధ్యాత్మికంగా అపరిశుద్ధమైన అలాంటి ఆహారం ఒకరి ఆధ్యాత్మికతను చాలా తక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుండవచ్చు. కానీ, అది చిరుతిండిలాంటి ఆహారం ధమనుల గోడలు గట్టిపడేలా చేసి అక్షరార్థ గుండెకు హాని కలిగించినట్లు, ఆధ్యాత్మిక హృదయాన్ని అంగవైకల్యానికి గురిచేయవచ్చు. ఒకరి హృదయంలో అనుచితమైన కోరికలు కలుగనీయకూడదని యేసు హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28) అవును, బలహీనమైన ఆధ్యాత్మిక ఆహారం ఆధ్యాత్మిక గుండెపోటుకు దారి తీస్తుంది. ఇంకా పరిశీలించాల్సిన విషయాలున్నాయి.
వ్యాయామం. ఎప్పుడూ కూర్చొని ఉండే జీవన శైలి భౌతిక గుండెపోటుకు కారణమవుతుందని అందరికీ తెలుసు. అదే విధంగా, ఆధ్యాత్మిక వ్యాయామంలేని జీవన శైలి కూడా గంభీరమైన పర్యవసానాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి క్రైస్తవ పరిచర్యలో కొంతమేరకు పాల్గొంటుండవచ్చు, కానీ తన జీవన శైలికి ఎటువంటి ఆటంకం ఏర్పడనంతవరకు దాన్ని పరిమితం చేసుకుంటుండవచ్చు. “సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను” కావడానికి స్వల్పంగా ప్రయత్నిస్తుండవచ్చు లేదా ఏ మాత్రం కృషి చేయకపోవచ్చు. (2 తిమోతి 2:15) లేక ఒక వ్యక్తి అప్పుడప్పుడు కూటాలకు హాజరవుతుండవచ్చు కానీ చర్చలో పాల్గొనడానికి సిద్ధపడకపోతుండవచ్చు. ఆధ్యాత్మిక లక్ష్యాలు లేకపోతుండవచ్చు లేక ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆకలి లేక ఉత్సాహం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక వ్యాయామ లోపంవల్ల నెమ్మదిగా బలహీనపడి చివరికి ఒకప్పుడు విశ్వాసమంటూ ఏమైనా ఉండివుంటే ఇప్పుడు అది కూడా లేకుండా పోవచ్చు. (యాకోబు 2:26) అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు వ్రాసేటప్పుడు ఈప్రమాదాన్ని పేర్కొన్నాడు, వారిలో కొందరు దాదాపు ఆధ్యాత్మిక వ్యాయామంలేని జీవన శైలిలో పడిపోయారు. వారి ఆధ్యాత్మికత కఠినమయ్యే అవకాశముందని ఆయన వారిని ఎలా హెచ్చరించాడో గమనించండి. “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ... పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు—నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి.”—హెబ్రీయులు 3:12-15.
ఒత్తిడి. భౌతిక గుండెపోటు రావడానికి మరొక ప్రధాన కారకం అధిక ఒత్తిడి. అదే విధంగా, ఒత్తిడి లేక ‘ఐహిక విచారములు’ ఆలంకారిక హృదయానికి చాలా సులభంగా ప్రాణాంతకం కావచ్చు, చివరికి బాధితుడు మొత్తానికి దేవుడ్ని ఆరాధించడమే మానేయవచ్చు. ఈవిషయంలో యేసు చేసిన హెచ్చరిక సమయోచితమైనది: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34,35) మనం ఏదైనా రహస్య పాపం కారణంగా చాలా కాలంనుండి మానసికంగా బాధపడుతున్నా, ఆఒత్తిడి మన ఆలంకారిక హృదయాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి హానికరమైన ఒత్తిడి ఎలాంటి బాధను కలిగిస్తుందో దావీదు రాజు తన అనుభవం నుండి తెలుసుకున్నట్లు ఆయన చెప్పిన ఈమాటల్లో కనబడుతుంది: “నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.”—కీర్తన 38:3, 4.
అమితమైన ఆత్మవిశ్వాసం. గుండెపోటు బాధితులు చాలామంది తమకు గుండెపోటు రావడానికి ముందువరకు తమ ఆరోగ్య స్థితి గురించి చాలా ధైర్యంగా ఉంటారు. తరచుగా పరీక్షలను లేక వైద్య పరీక్షలను తిరస్కరిస్తారు లేదా అసలేమాత్రం అవసరం లేదన్నట్లు నవ్వేస్తారు. అదేవిధంగా, కొందరు తాము కొంత కాలంనుండి క్రైస్తవులము కాబట్టి తమకు ఏమీ జరిగే అవకాశం లేదని భావిస్తారు. వాళ్ళు ఆకస్మికమైన విపత్తుకు గురయ్యేంతవరకు, ఆధ్యాత్మిక పరీక్షలను లేక ఆత్మపరిశీలనను నిర్లక్ష్యం చేస్తుండవచ్చు. అమితమైన ఆత్మవిశ్వాసం పెంచుకోకూడదని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన మంచి ఉపదేశాన్ని మనసులో ఉంచుకోవడం చాలా ముఖ్యం: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” మన అపరిపూర్ణ స్వభావాన్ని అంగీకరించడం, క్రమంగా మనల్ని మనం ఆధ్యాత్మికంగా పరీక్షించుకోవడం జ్ఞానయుక్తమైన పని.—1 కొరింథీయులు 10:12; సామెతలు 28:14.
హెచ్చరికా చిహ్నాలను నిర్లక్ష్యం చేయకండి
ఆలంకారిక హృదయ స్థితికి లేఖనాలు ఉన్నతమైన స్థానాన్నివ్వడానికి చాలా విలువైన కారణముంది. యిర్మీయా 17:9,10 లో మనమిలా చదువుతాం: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” యెహోవా మన హృదయాలను పరీక్షించడంతోపాటు, అవసరమైన ఆత్మపరిశీలనా సహాయాన్ని అందించడానికి ఆయన ప్రేమపూర్వకమైన ఏర్పాటును కూడా చేస్తాడు.
‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా, మనకు సమయోచితమైన జ్ఞాపికలు ఇవ్వబడుతున్నాయి. (మత్తయి 24:45) ఉదాహరణకు, మన ఆలంకారిక హృదయం మనలను మోసం చేసే ముఖ్యమైన మార్గాల్లో, లౌకిక ఊహల్లో మునిగిపోయేలా చేయడం ఒకటి. అవి అవాస్తవిక ఊహలు, పగటి కలలు, వ్యర్థమైన మనోకల్పనలు. ముఖ్యంగా అవి చెడు ఆలోచనలను కలుగజేసే ఊహలైతే మాత్రం చాలా ప్రమాదకరం. కాబట్టి అలాంటి ఊహలను మనం పూర్తిగా తోసివేయాలి. మనం యేసులాగే దుర్నీతిని అసహ్యించుకుంటే, మనం మన హృదయం లౌకిక ఊహల్లో మునిగిపోకుండా కాపాడుకోగలుగుతాము.—హెబ్రీయులు 1:7-9.
దాంతోపాటు, మనకు సహాయంగా క్రైస్తవ సంఘంలో ప్రేమగల పెద్దలున్నారు. మనపట్ల ఇతరులు చూపించే శ్రద్ధకు మనం ముగ్ధులమైనా, మన ఆలంకారిక హృదయంపై శ్రద్ధ వహించే బాధ్యత మాత్రం మనదే. ‘సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టడం,’ ‘మనం విశ్వాసముగలవారమై ఉన్నామో లేదో మనల్ని మనం శోధించుకొని చూచుకొనడం’ వ్యక్తిగతంగా మనపై ఆధారపడి ఉంటుంది.—1 థెస్సలొనీకయులు 5:21; 2 కొరింథీయులు 13:5.
హృదయాన్ని కాపాడుకోండి
“మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే బైబిలు సూత్రం మన ఆలంకారిక హృదయము యొక్క స్థితికి కూడా వర్తిస్తుంది. (గలతీయులు 6:7) తరచుగా, అకస్మాత్తుగా జరిగిన ఆధ్యాత్మిక విపత్తు అని అనిపించే సంఘటన నిజానికి, చాలా కాలం నుండి ఆధ్యాత్మిక హానికి కారకమయ్యే అశ్లీల చిత్రాలను చూడడం, వస్తుసంపదలకై అర్రులు చాచడం లేక హోదా కొరకు లేదా అధికారం కొరకు తీవ్రంగా ప్రయత్నించడం లాంటివాటిలో తలమునకలవడంవల్ల వచ్చిన ఫలితమని తేలుతుంది.
కాబట్టి, హృదయాన్ని కాపాడాలంటే ఆధ్యాత్మిక ఆహారం విషయంలో జాగ్తత్తగా ఉండడం చాలా ముఖ్యం. మనసును హృదయాన్ని దేవుని వాక్యంతో పోషించండి. ఎక్కడంటే అక్కడ లభ్యమవుతూ, శరీరానికి కావాలనిపించేలా ఉండి దాని ఫలితాలు మాత్రం ఆలంకారిక హృదయాన్ని మొద్దుబారజేసే మానసిక చిరుతిండిని త్రోసివేయండి. కీర్తనకర్త వైద్యపరంగా సరైనదీ, యుక్తమైనదీ అయిన పోలికతో ఇలా హెచ్చరిస్తున్నాడు: “వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది.”—కీర్తన 119:70.
చాలా కాలం నుండి గుప్తమైవున్న లోపాలేమైనా మీలో ఉంటే వాటిని పెరికివేయడానికి గట్టిగా కృషి చేయండి, లేకపోతే అవి మీఆలంకారిక ధమనులకు అడ్డుపడతాయి. ఈలోకం ఆకర్షణీయంగా కనబడినా, సుఖానుభూతిని ఆనందాన్ని ఎక్కువగా అందిస్తున్నట్లనిపించినా, అపొస్తలుడైన 1 కొరింథీయులు 7:29-31) వస్తు సంపదలపై మనసు లాగడం ఆరంభమైతే, యోబు మాటలను స్మృతిలోకి తెచ్చుకోండి: “సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను—నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను ... పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరమగును.”—యోబు 31:24,27, 28; కీర్తన 62:10; 1 తిమోతి 6:9,10.
పౌలు అందించిన జ్ఞానయుక్తమైన సలహాను ధ్యానించండి. ఆయనిలా వ్రాశాడు: ‘సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట ... లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనివారిలా ఉండండి; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.’ (బైబిలు ఆధారిత హితబోధను నిర్లక్ష్యంచేసే అలవాటు ఎంత గంభీరమైనదో సూచిస్తూ బైబిలిలా హెచ్చరిస్తోంది: “ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.” (సామెతలు 29:1) దానికి భిన్నంగా, మన ఆలంకారిక హృదయంపై మంచి శ్రద్ధ వహించడం ద్వారా, నిరాడంబరమైన, క్రమబద్ధమైన జీవితాన్ని గడపడంవల్ల కలిగే సుఖానుభూతిని, మనశ్శాంతిని మనం అనుభవిస్తాం. ఇది ఎల్లప్పుడూ పాటించమని చెప్పబడుతున్న నిజమైన క్రైస్తవ మార్గము. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:6-8.
అవును, దైవభక్తి మార్గంలో మనం శిక్షణ పొందుతూ చేసే వ్యాయామం, ఆరోగ్యవంతమైన, దృఢమైన ఆలంకారిక హృదయాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. మన ఆధ్యాత్మిక ఆహారాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడం ద్వారా, మన ఆధ్యాత్మికతకు ఎటువంటి హాని లేక చెరుపు కలుగకుండా, వినాశకరమైన ఈలోకపు మార్గాలకు, ఆలోచనలకు ఏ మాత్రము తావివ్వకుండా ఉండగలము. అన్నింటినీ మించి, యెహోవా తన సంస్థద్వారా చేసిన ఏర్పాట్లను అంగీకరించడం ద్వారా, మనం క్రమంగా మన ఆలంకారిక హృదయ పరీక్షలను చేయించుకోవచ్చు. అలా కష్టపడి పరీక్షలు చేయించుకోవడం ఆధ్యాత్మిక గుండెపోటు వల్ల వచ్చే విషాదకరమైన పర్యవసానాలను తప్పించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.
[అధస్సూచి]
^ పేరా 4 ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే, దయచేసి యెహోవాసాక్షులు ప్రచురించిన, “గుండెపోటు—ఏమి చేయవచ్చు?” అనే వ్యాస పరంపరను తేజరిల్లు! జనవరి 8, 1997 సంచికలో చూడండి.
[10వ పేజీలోని బ్లర్బ్]
సరైన పౌష్టికాహారం లేకపోవడంవల్ల ధమనుల గోడలు గట్టిపడి అక్షరార్థ గుండెకు ఎలా ప్రమాదం కలిగిస్తుందో అలాగే, చెడిపోయిన ఆధ్యాత్మిక ఆహారం ఆలంకారిక హృదయం సరిగా పనిచేయకుండా చేస్తుంది
[10వ పేజీలోని బ్లర్బ్]
ఆధ్యాత్మిక వ్యాయామంలేని జీవన శైలివల్ల గంభీరమైన పర్యవసానాలు కలుగవచ్చు
[11వ పేజీలోని బ్లర్బ్]
“ఐహిక విచారములు,” చాలా సులభంగా ఆలంకారిక హృదయానికి ప్రాణాంతకంగా మారతాయి
[11వ పేజీలోని చిత్రం]
మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల తీవ్రమైన కష్టాలు వస్తాయి
[13వ పేజీలోని చిత్రాలు]
మంచి ఆధ్యాత్మిక అలవాట్లను అలవర్చుకుంటే అవి ఆలంకారిక హృదయాన్ని కాపాడతాయి
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
AP Photo/David Longstreath