కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము”

“నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము”

“నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము”

విద్యుచ్ఛక్తి పోయి అకస్మాత్తుగా మన చుట్టూ అంధకారం ఏర్పడే పరిస్థితుల్లో తప్ప, తరచుగా మనం వెలుగును చాలా తేలిగ్గా తీసుకుంటాము. అయితే సంతోషకరమైన విషయమేంటంటే, అత్యంత శ్రేష్ఠమైన మన “పవర్‌ స్టేషన్‌,” అంటే సూర్యగోళం పూర్తిగా నమ్మదగినది. సూర్యునినుంచి వచ్చే వెలుగు సహాయంతో మనం చూడగలం, తినగలం, శ్వాసించగలం, జీవించగలం.

వెలుగు మన జీవితానికి ప్రాముఖ్యమైనది కాబట్టి, ఆదికాండములో సృష్టి మొదటిరోజున వెలుగు కలిగిందని చదవడానికి మనం ఆశ్చర్యపోకూడదు. “దేవుడు​—⁠వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.” (ఆదికాండము 1:⁠3) దావీదు రాజులాంటి భక్తిపరులు, యెహోవా జీవానికి, వెలుతురుకు మూలమని ఎల్లప్పుడూ గుర్తించారు. “నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము” అని దావీదు వ్రాశాడు.​—⁠కీర్తన 36:⁠9.

దావీదు మాటలు అక్షరార్థంగా, ఆలంకారికంగా రెండు విధాలుగా వర్తిస్తాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంది: “వెలుగు నిస్సందేహంగా దృష్టికి ప్రధానమైన ఆధారం.” అది ఇంకా ఇలా అంటోంది: “మానవుని మెదడుకు ఇతర అన్ని ఇంద్రియాలకంటే కళ్ళద్వారానే అధిక సమాచారం అందుతుంది.” మనం నేర్చుకునేది ఎక్కువగా దృష్టిమీదే ఆధారపడివుంది కాబట్టి, ఆదృష్టి సరిగా పని చేయాలంటే వెలుగు అవసరం, అందుకే లేఖనాల్లో వెలుగు ఆలంకారికంగా కూడా ఉపయోగించబడింది.

అందుకే యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును.’ (యోహాను 8:​12) యేసుచేత సూచించబడిన ఆలంకారిక వెలుగు, ఆయన ప్రకటించిన సత్య సందేశం, అది వినేవారి మనస్సులను హృదయాలను ప్రకాశవంతం చేస్తుంది. యేసు శిష్యులు ఆధ్యాత్మిక అంధకారంలో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత, మానవజాతిపట్ల దేవుని సంకల్పం గురించి రాజ్య నిరీక్షణ గురించి అర్థం చేసుకోగలిగారు. ఆపరిజ్ఞానం నిత్యజీవానికి నడిపిస్తుంది కాబట్టి అది నిజంగా ‘జీవపు వెలుగే.’ యేసు తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) ఈఆధ్యాత్మిక వెలుగును మనం తేలిగ్గా తీసుకోకుండా ఉందాం!