కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యిర్మీయా 7:16 లో వ్రాయబడిన దేవుని నిర్దేశం యొక్క భావం, క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడిన వ్యక్తి పశ్చాత్తాపపడని పాపి కనుక, ఆవ్యక్తి కోసం క్రైస్తవులు ప్రార్థన చేయకూడదనా?

యెహోవా, విశ్వాసఘాతకురాలైన యూదాపై తన తీర్పును ప్రకటించిన తర్వాత, “నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను” అని యిర్మీయాకు చెప్పాడు.​—⁠యిర్మీయా 7:⁠16.

ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థించవద్దని యెహోవా యిర్మీయాకు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే, వారు ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతో బాహాటంగా ఉల్లంఘించారు. వారు బహిరంగంగా, సిగ్గూ బిడియంలేకుండా, ‘జారచోర క్రియలను నరహత్యను చేస్తూ, అబద్ధసాక్ష్యము పలుకుతూ, బయలుకు ధూపమువేస్తూ, తామెరుగని దేవతలను అనుసరిస్తూవున్నారు.’ దాని ఫలితంగా, “ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును” అని విశ్వాసఘాతకులైన ఆయూదులకు యెహోవా చెప్పాడు. యెహోవా తాను తీర్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని, యిర్మీయా గానీ, మరెవరైనా గానీ ప్రార్థించడం అనుచితమే.​—⁠యిర్మీయా 7:​9,10,15.

దీనికి అనుగుణంగా, అపొస్తలుడైన యోహాను, దేవునికి చేయవలసిన సముచితమైన ప్రార్థన గురించి వ్రాశాడు. “ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించు”నని ఆయన క్రైస్తవులకు మొదట హామీ ఇచ్చాడు. (1 యోహాను 5:14) ఆతర్వాత, ఇతరుల కోసం ప్రార్థించడాన్ని గురించి మాట్లాడుతూ, “తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు” అని కూడా యోహాను వ్రాశాడు. (1 యోహాను 5:⁠16) ‘క్షమాపణ లేని’ పాపాన్ని గురించి, అంటే పరిశుద్ధాత్మకు విరోధమైన పాపాన్ని గురించి కూడా యేసు మాట్లాడాడు.​—⁠మత్తయి 12:31, 32.

పశ్చాత్తాపపడనందువల్ల క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడినవాళ్ళంతా ‘మరణకరమైన’ పాపం చేసినవారేనని, వారి గురించి ప్రార్థన చేయకూడదని దానర్థమా? అలాగనేమీ కాదు, ఎందుకంటే, అలా బహిష్కరించబడిన కొందరు చేసిన పాపాలు, మరణకరమైన పాపాలు కావు. వాస్తవానికి, అవి మరణకరమైనవేనా అన్నది చెప్పడం కష్టం. దానికి మంచి ఉదాహరణ, యూదా రాజైన మనష్షే. ఆయన అబద్ధ దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు, తన సొంత కుమారులను వాటికి బలిగా అర్పించాడు, అభిచారాన్ని అభ్యసించాడు, యెహోవా ఆలయంలో ఒక చెక్కుడు విగ్రహాన్ని నిలబెట్టించాడు. వాస్తవానికి, మనష్షేతోపాటు ఆయన ప్రజలు కూడా, ‘ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటె మరింత అక్రమముగా ప్రవర్తించారు.’ దీనికంతటికీ శిక్షగా, యెహోవా మనష్షేను గొలుసులతో బంధింపజేయించి, బబులోనుకు బందీగా పంపించాడు.​—⁠2 రాజులు 21:​1-9; 2 దినవృత్తాంతములు 33:​1-11.

మనష్షే చేసిన పాపాలు ఎంతో ఘోరమైనవైనప్పటికీ, అవి మరణకరమైనవేనంటారా? కాదని స్పష్టమవుతోంది, అలా ఎందుకు చెప్పగలమంటే, ఆయనను గురించిన వృత్తాంతమిలా చెబుతోంది: “అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.”​—⁠2 దినవృత్తాంతములు 33:​12,13.

కాబట్టి, ఒక వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడినంత మాత్రాన, ఆయన మరణకరమైన పాపాన్ని చేసివుంటాడని తొందరపడి ఆయనను గురించి ఒక నిర్ణయానికి రాకూడదు. ఆవ్యక్తి హృదయ స్థితి నిజానికెలా ఉందో వెల్లడవడానికి సమయం పట్టవచ్చు. పాపం చేసిన వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చి, పశ్చాత్తాపపడి, తిరిగివచ్చేలా సహాయపడాలన్నదే వాస్తవానికి బహిష్కరణ యొక్క ఒక ఉద్దేశమని తరచూ పేర్కొనబడుతుంది.

ఆ వ్యక్తి ఇప్పుడు సంఘంలో లేడు కనుక, ఆయన హృదయంలోగానీ, దృక్పథంలోగానీ మార్పు వస్తే, మొదట వివాహజత లేదా కుటుంబ సభ్యులు గమనించవచ్చు. అలాంటి మార్పులను గమనించేవారు, ఆవ్యక్తి మరణకరమైన పాపాన్ని చేయలేదన్న నిర్ణయానికి రావచ్చు. ఆవ్యక్తి, దైవ ప్రేరేపిత వాక్యం ద్వారా బలం పొందాలని, యెహోవా తన చిత్తానికి అనుగుణంగా, ఆయనతో ప్రవర్తించాలని ప్రార్థించేందుకు వాళ్ళు కదిలించబడుతుండవచ్చు.​—⁠కీర్తన 44:​21; ప్రసంగి 12:⁠14.

పాపం చేసిన వ్యక్తి మారుమనస్సు పొందాడని నమ్మేందుకు కావలసినన్ని రుజువులను కొందరు చూడవచ్చు, కానీ, సంఘంలోని అందరికీ అలాంటి అవకాశం దొరకకపోవచ్చు. కాబట్టి ఆతప్పిదస్థుని గురించి బహిరంగంగా ప్రార్థన చేయడం వాళ్ళు వింటే, వాళ్ళు కలవరపడవచ్చు, కలతచెందవచ్చు, అభ్యంతరపడవచ్చు కూడా. కాబట్టి, పాపం చేసిన ఆవ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి పురికొల్పబడినవాళ్ళు, తాము ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వారికోసం ప్రార్థన చేయాలి, మిగతా విషయాలను సంఘంలోని బాధ్యతగల పెద్దలకు వదిలిపెట్టాలి.

[31వ పేజీలోని చిత్రం]

మనష్షే తనను తాను యెహోవా ఎదుట తగ్గించుకున్నప్పుడు, ఆయన చేసిన ఘోరమైన పాపాలు క్షమించబడ్డాయి

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

Illustrierte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s నుండి తీసుకోబడింది