కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బంగారు సూత్రం

బంగారు సూత్రం

బంగారు సూత్రం

ఆచరణీయమైనదే

బంగారు సూత్రం యేసు ప్రతిపాదించిన నైతిక బోధ అని అనేకమంది భావించినా, “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని ఆయన స్వయంగా ప్రకటించాడు.​—యోహాను 7:​16.

అవును, బంగారు సూత్రమని ప్రఖ్యాతిగాంచిన దానితోపాటు యేసు బోధించినవాటికి మూలకర్త ఎవరంటే, యేసును పంపినవాడూ, సృష్టికర్తా అయిన యెహోవా అనే నామముగల దేవుడు.

తమతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని మానవులందరూ కోరుకుంటారో అలాగే వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించాలన్నదే దేవుని మొట్టమొదటి సంకల్పం. మానవులను సృష్టించే విధానంలోనే ఆయన ఇతరుల సంక్షేమంపట్ల శ్రద్ధను వ్యక్తపరచడంలో ఎంతో చక్కని మాదిరి ఉంచాడు: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:​27) అంటే వాళ్ళు జీవితాన్ని శాంతి, సంతోషం, సామరస్యాలతో సాధ్యమైతే నిరంతరం గడిపేలా దేవుడు ప్రేమపూర్వకంగా వాళ్ళకు తన విశిష్టమైన లక్షణాలను కొంతమేరకు అనుగ్రహించాడని దానర్థం. దేవుడిచ్చిన వారి మనస్సాక్షికి సరైన విధంగా శిక్షణనిస్తే, ఇతరులు తమతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో ఇతరులతో వారూ అలాగే ప్రవర్తించేలా అది వారిని నడిపిస్తుంది.

ప్రబలమైన స్వార్థం

అలాంటి అద్భుతమైన ఆరంభమున్న మానవాళికి ఏమి జరిగింది? సరళమైన మాటల్లో చెప్పాలంటే, ప్రజలు స్వార్థముతో కూడిన లక్షణాలను వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఆదికాండము 3వ అధ్యాయంలో నమోదైనట్లు మొదటి మానవ దంపతులు ఏమి చేశారన్న బైబిలు వృత్తాంతం అనేకమందికి విదితమే. దేవుని నీతి సూత్రాలన్నింటికీ విరోధియైన సాతాను ప్రేరేపణవల్ల, స్వతంత్రానికి, స్వేచ్ఛాధీనతకు మొగ్గుచూపిన ఆదాము, హవ్వలు స్వార్థపూరితంగా దేవుని పరిపాలనను తిరస్కరించారు. వారి స్వార్థపూరిత తిరుగుబాటు చర్య వారికి గొప్ప నష్టాన్ని తేవడమే కాకుండా వారి భావి సంతానమంతటికి కూడా విషాదకరమైన పర్యవసానాలను తెచ్చింది. అది బంగారు సూత్రంగా వ్యాప్తి చెందిన బోధను నిర్లక్ష్యం చేయడంవల్ల వచ్చిన విపత్కర ఫలితమని స్పష్టంగా రుజువుచేసింది. తత్ఫలితంగా, “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”​—⁠రోమీయులు 5:12.

మానవులందరూ కలిసి యెహోవా దేవుని ప్రేమపూర్వకమైన మార్గాలను తిరస్కరించినా, ఆయన వారిని వదిలిపెట్టలేదు. ఉదాహరణకు, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆయన వారికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇతరులు తమతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో అదే విధంగా తాము ఇతరులతో ప్రవర్తించాలని అది వారికి బోధించింది. బానిసలను, తండ్రుల్లేని పిల్లలను, విధవరాండ్రను ఎలా చూసుకోవాలో ధర్మశాస్త్రం నిర్దేశించింది. ఒకరిపై దౌర్జన్యం చేయడం, మనుష్యులను అపహరించుకుపోవడం, దొంగతనం చేయడం వంటి విషయాలతో ఎలా వ్యవహరించాలో అది తెలిపింది. పరిశుభ్రతకు సంబంధించిన నియమాలు, ఇతరుల ఆరోగ్యంపట్ల శ్రద్ధను చూపించాయి. లైంగిక విషయాలపై కూడా నియమాలు ఉన్నాయి. ప్రజలకు ఇలా చెప్పడం ద్వారా యెహోవా తన ధర్మశాస్త్రాన్ని సంగ్రహపరిచాడు: “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను.” ఇదే వ్యాఖ్యను తర్వాత యేసు ఉల్లేఖించాడు. (లేవీయకాండము 19:18; మత్తయి 22:​39,40) ఇశ్రాయేలీయుల మధ్య జీవించే పరదేశుల గురించి కూడా ధర్మశాస్త్రంలో నియమాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇలా ఆదేశించింది: “పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.” వేరే మాటల్లో చెప్పాలంటే, ఇశ్రాయేలీయులు దీనులపట్ల భావపూరిత దయను చూపించాలి.​—⁠నిర్గమకాండము 23:9; లేవీయకాండము 19:34; ద్వితీయోపదేశకాండము 10:19.

ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా పాటించినంత కాలం యెహోవా ఆదేశాన్ని ఆశీర్వదించాడు. దావీదు, సొలొమోనుల పరిపాలనలో ఆదేశం సస్యశ్యామలంగా వర్ధిల్లింది, ప్రజలు సంతోషంగా, సంతృప్తితో జీవించారు. చారిత్రక వృత్తాంతమొకటి మనకిలా చెబుతోంది: “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. ... ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.”​—⁠1 రాజులు 4:20, 25.

విషాదకరంగా, ఆదేశంలో శాంతి భద్రతలు ఎక్కువ కాలం ఉండలేదు. దేవుని ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, ఇశ్రాయేలీయులు దాన్ని పాటించలేదు; ఇతరులపట్ల తమకున్న శ్రద్ధ స్థానంలో వారు స్వార్థానికి చోటిచ్చారు. అది మతభ్రష్టత్వంతోపాటు, వారిని విడి విడిగాను ఒక దేశంగాను కష్టాలపాలుజేసింది. చివరికి, సా.శ.పూ. 607వ సంవత్సరంలో బబులోనీయులు యూదా సామ్రాజ్యాన్ని, యెరూషలేము పట్టణమును, చివరికి అక్కడున్న మహిమాన్వితమైన మందిరమును కూడా నాశనం చేయడానికి యెహోవా అనుమతించాడు. ఏ కారణం చేత? “మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.” (యిర్మీయా 25:​8,9) యెహోవాను స్వచ్ఛంగా ఆరాధించని కారణంగా ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందో కదా!

అనుకరించడానికి ఒక మాదిరి

మరోవైపున, యేసు క్రీస్తు బంగారు సూత్రాన్ని బోధించడమే కాకుండా అనుకరించడానికి ప్రశస్తమైన మాదిరిని ఉంచాడు. ఆయన ఇతరుల సంక్షేమంపట్ల యథార్థమైన శ్రద్ధను చూపించాడు. (మత్తయి 9:36; మత్తయి 14:14; లూకా 5:​12,13) ఒకసారి, నాయీను పట్టణము దగ్గర, దుఃఖాక్రాంతురాలైన ఒక విధవరాలు తన ఒక్కగానొక్క కుమారుని అంత్యక్రియలకు వెళ్ళడం యేసు చూశాడు. ఆసంఘటన గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడ్డాడు.’ (లూకా 7:​11-15) ‘కనికరపడ్డాడు’ అనే మాట, వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, “ఎదుటివారి మనసులో మెదిలినట్లే, తన మనసు కదలించబడడం” అని తెలియజేస్తోంది. ఆయన ఆమె హృదయవేదన తనదే అన్నట్లు వేదనచెందాడు, ఆబాధనుండి ఆమెను విముక్తిచేసే సానుకూలమైన చర్యలు తీసుకునేలా అది ఆయనను కదిలించింది. యేసు ఆబాలుడ్ని పునరుత్థానం చేసి ‘అతనిని అతని తల్లికి అప్పగించి’నప్పుడు, ఆవిధవరాలికి ఎంతటి ఆనందం కలిగిందో కదా!

చివరికి, దేవుని సంకల్పానికి అనుగుణంగా, యేసు ఇష్టపూర్వకంగా బాధలను అనుభవించాడు, మానవాళి పాప మరణాల బానిసత్వం నుండి విముక్తి పొందేలా తన జీవితాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడు. బంగారు సూత్రాన్ని అనుసరించి జీవించడంలో ఇది అత్యున్నతమైన మాదిరి.​—⁠మత్తయి 20:28; యోహాను 15:13; హెబ్రీయులు 4:15.

బంగారు సూత్రాన్ని పాటించే ప్రజలు

మన కాలంలో కూడా బంగారు సూత్రాన్ని నిజంగా పాటించే ప్రజలున్నారా? ఉన్నారు, అయితే వారు అనుకూల సమయాల్లో మాత్రమే పాటించడం లేదు. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీలో, యెహోవాసాక్షులు బంగారు సూత్రంతో రాజీపడకుండా దేవునిపై తమ విశ్వాసాన్ని, పొరుగువారిపట్ల తమ ప్రేమను కాపాడుకున్నారు. దేశమంతటా యూదులందరికి వ్యతిరేకంగా ద్వేషం, వివక్షలతో కూడిన ప్రచారం చేయబడినా సాక్షులు బంగారు సూత్రాన్ని పాటించడంలో కొనసాగారు. కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో కూడా వారు తోటివారిపట్ల శ్రద్ధ చూపించారు, ఆహార కొరత ఉన్నప్పటికీ ఆకలితో అలమటించే యూదులు, యూదేతరులతో తమ ఆహారాన్ని పంచుకున్నారు. అంతేగాక, ఇతరులను చంపడానికి ఆయుధాలను చేపట్టమని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఇతరులచేత చంపబడడానికి వారెలాగైతే ఇష్టపడరో అలాగే ఇతరులను చంపడానికి వారు నిరాకరించారు. తమను తాము ఎలా ప్రేమించుకుంటున్నారో అలాగే ప్రేమించాల్సిన ఇతరులను వారు ఎలా చంపగలరు? వారలా నిరాకరించినందుకు వారిలో చాలామంది కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులకు పంపించబడడమే కాక మరణానికి కూడా గురయ్యారు.​—⁠మత్తయి 5:43-48.

మీరు ఈఆర్టికల్‌ చదువుతూ, ఆచరణలోనున్న బంగారు సూత్రపు మరో మాదిరి నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారు. నేడు అనేకమంది నిరాశతో, నిస్సహాయతతో బాధపడుతున్నారని యెహోవాసాక్షులు గ్రహించారు. ఆకారణంగానే, బైబిల్లో లభించే నిరీక్షణను, ఆచరణాత్మకమైన నిర్దేశాన్ని ఇతరులు నేర్చుకునేలా సహాయపడేందుకు, సాక్షులు స్వచ్ఛందంగా సానుకూల చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఇంతవరకూ జగమెరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విద్యాపనిలో ఒక భాగమే. దాని ఫలితమేమిటి? యెషయా 2:​2-4 లో ప్రవచించిన విధంగా, “జనములు గుంపులు గుంపులుగా,” వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షలకు పైగా, ‘యెహోవా మార్గముల విషయమై బోధించుచు, ఆయన త్రోవలలో నడుస్తున్నారు.’ ఆలంకారికంగా, వారు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టు”ట నేర్చుకున్నారు. ఈకష్టతరమైన సమయాల్లో కూడా వాళ్ళు శాంతి భద్రతలను పొందారు.

మీ విషయమేమిటి?

అపవాదియైన సాతాను ఏదెనులో తిరుగుబాటును పురిగొల్పినప్పటినుండి బంగారు సూత్రాన్ని నిరాకరించినందువల్ల మానవాళి ఎదుర్కొన్న వేదనను, బాధను ఒక్క క్షణం తిరిగి చూడండి. ఆపరిస్థితిని అతి త్వరలో మార్చివేయాలని యెహోవా సంకల్పిస్తున్నాడు. ఏ విధంగా? “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” (1 యోహాను 3:⁠8) బంగారు సూత్రాన్ని నేర్పించి దాని ప్రకారం జీవించిన, జ్ఞానవంతుడు, సమర్థవంతుడైన యేసు క్రీస్తు ద్వారా దేవుని రాజ్య పరిపాలనలో ఇది నెరవేరుతుంది.​—⁠కీర్తన 37:9-11; దానియేలు 2:44.

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఇది గమనించాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.” (కీర్తన 37:​25,26) నేడు అనేకమంది ‘దయతో అప్పివ్వడానికి’ బదులుగా స్వాధీనం చేసుకుంటున్నారని, ఆక్రమించుకుంటున్నారని మీరు అంగీకరించరా? స్పష్టంగా, బంగారు సూత్రం పాటించడం నిజమైన శాంతి భద్రతలకు దారితీస్తుంది, ఎందుకంటే అది ఇప్పుడు మరియు భవిష్యత్తులో దేవుని రాజ్యంలోని ఆశీర్వాదాలను అనుభవించేలా చేస్తుంది. దేవుని రాజ్యం, భూమిపై స్వార్థం, దుష్టత్వం ఏ మాత్రం లేకుండా చేసి, దాని స్థానంలోనే దేవుని హస్తకృతి అయిన నూతన విధానాన్ని స్థాపిస్తుంది. అప్పుడు ప్రజలందరూ బంగారు సూత్రాన్ని పాటిస్తూ ఆనందిస్తారు.​—⁠కీర్తన 29:11; 2 పేతురు 3:⁠13.

[4, 5వ పేజీలోని చిత్రాలు]

యేసు బంగారు సూత్రాన్ని నేర్పించడమే కాకుండా, దాన్ని పాటించడంలో కూడా అతి చక్కని మాదిరిని ఉంచాడు

[7వ పేజీలోని చిత్రాలు]

బంగారు సూత్రాన్ని పాటించడం నిజమైన శాంతి భద్రతలకు నడిపిస్తుంది