బంగారు సూత్రం విశ్వవ్యాప్తమైన ఒక బోధన
బంగారు సూత్రం విశ్వవ్యాప్తమైన ఒక బోధన
“కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 7:12.
దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు తన ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలో ఆమాటలను అన్నాడు. అప్పటినుండి శతాబ్దాలపాటు ఆచిన్న వ్యాఖ్యానం గురించి ఎన్నో విధాలుగా చెప్పబడింది, వ్రాయబడింది. ఉదాహరణకు, “లేఖనాల నిజమైన సారం,” “తన పొరుగువారిపట్ల ఒక క్రైస్తవుడి కర్తవ్యాన్ని గురించిన సంక్షిప్త సమాచారం,” “ప్రాముఖ్యమైన ఒక నైతిక సూత్రం” అని అది పొగడబడింది. చాలా ప్రఖ్యాతిగాంచిన ఆసూత్రం, తరచుగా బంగారు సూత్రం అని సూచించబడింది.
అయితే, ఆబంగారు సూత్రపు ఆలోచన క్రైస్తవులమని చెప్పుకునేవారికి మాత్రమే పరిమితం కాలేదు. యూదామతంలో, బౌద్ధమతంలో, గ్రీకు తత్త్వంలో కూడా ఏదో ఒక రూపంలో ప్రాముఖ్యమైన ఈనైతిక సూత్రం వ్యాపించింది. అతి గొప్ప జ్ఞాని, బోధకుడు అని ప్రాచ్య దేశాల్లో కొనియాడబడుతున్న కన్‌ఫ్యూషియస్ చెప్పిన మాట ప్రత్యేకంగా ప్రాచ్య దేశాల్లోని ప్రజల్లో చాలా ప్రసిద్ధికెక్కింది. కన్‌ఫ్యూషియన్ల నాలుగు పుస్తకాల్లోని మూడవ పుస్తకమైన ది అనలెక్ట్స్‌లో మూడుసార్లు ఈఆలోచన వ్యక్తమైనట్లు మనకు కనబడుతుంది. రెండుసార్లు, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానంగా కన్‌ఫ్యూషియస్ ఇలా పేర్కొన్నాడు: “ఇతరులు మీపట్ల ఏమి చేయకూడదని మీరు కోరుకుంటారో, అది మీరు ఇతరులకు చేయకండి.” మరొక సందర్భంలో, డ్జిగోన్ అనే ఒక విద్యార్థి “ఇతరులు నాకు ఏమి చేయకూడదని నేను కోరుకుంటానో, నేను కూడా వారికి చేయాలని కోరుకోను” అని గర్వంగా పలికినప్పుడు, అతని బోధకుడైన కన్‌ఫ్యూషియస్ “అవును, కానీ నీవు ఇప్పటివరకు అలా చేయలేకపోయావు” అని గంభీరంగా జవాబిచ్చాడు.
ఎవరైనా ఈ మాటలు చదివినప్పుడు, కన్‌ఫ్యూషియస్ చేసిన వ్యాఖ్యానం యేసు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఖచ్చితమైన తేడా ఏమిటంటే, యేసు పేర్కొన్న బంగారు సూత్రం ఇతరులకు మంచి చేకూరేలా అనుకూల చర్యలను చేయమంటుంది. ప్రజలు యేసు చెప్పిన అనుకూలమైన వ్యాఖ్యకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి, సహాయం చేయడానికి ముందుకువస్తూ, ప్రతిదినం ఈసూత్రానికి అనుగుణంగా జీవించారనుకోండి. నేటి లోకాన్ని అది మెరుగుపరుస్తుందని మీరు అనుకుంటున్నారా? అందులో సందేహం లేదు.
ఆ సూత్రం అనుకూలంగానైనా ప్రతికూలంగానైనా లేక వేరే ఏ విధంగా పేర్కొన్నప్పటికీ గమనించదగ్గ విషయమేమిటంటే, వేర్వేరు కాలాల్లో వేర్వేరు స్థలాల్లో విభిన్న నేపథ్యమున్న ప్రజలు బంగారు సూత్రపు ఆలోచనను గట్టిగా నమ్మారు. కొండమీది ప్రసంగంలో యేసు ఏదైతే పేర్కొన్నాడో అది, ప్రపంచంలోని ప్రజలందరి
జీవితాలను అన్ని కాలాల్లోను ప్రభావితంచేసే విశ్వవ్యాప్తమైన ఒక బోధన అని స్పష్టంగా కనబడుతోంది.మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇతరులు నాతో గౌరవంగా, న్యాయంగా, నిజాయితీగా ప్రవర్తించాలనుకుంటున్నానా? జాతి భేదం, నేరం, యుద్ధం లేని లోకంలో నేను జీవించాలనుకుంటున్నానా? ప్రతి ఒక్కరు ఇతరుల భావాలపై, సంక్షేమంపై శ్రద్ధ చూపించే సభ్యులుగల కుటుంబంలో ఉండాలనుకుంటున్నానా?’ అలాంటివి గనుక సాధ్యమైతే వద్దని ఎవరంటారు? నిష్ఠూరమైన వాస్తవేమిటంటే, చాలా తక్కువమంది అలాంటి పరిస్థితులను అనుభవిస్తారు. అధిక సంఖ్యాకుల విషయంలో చూస్తే అలాంటి వాటికోసం ఆశించడం ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించడంలాంటిదే.
బంగారు సూత్రం కాంతిహీనమైంది
చరిత్రంతటా, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో ప్రజల హక్కులు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. వీటిలో ఆఫ్రికాలోని బానిస వర్తకం, నాజీ మరణ శిబిరాలు, బలవంతపు బాల కార్మికత్వం, అనేక స్థలాల్లో జరిగిన క్రూరమైన జాతి నిర్మూలాలు ఉన్నాయి. భయోత్పాదకమైన ఈపట్టిక పొడవు ఇంకా పెరుగుతూ పోగలదు.
నేడు మన హైటెక్ లోకం స్వార్థపరమైనది. చాలా తక్కువమంది ఇతరుల గురించి ఆలోచిస్తారు, అదీ తమ సౌకర్యాలు లేక కల్పిత హక్కులు అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడే. (2 తిమోతి 3:1-5) అనేకమంది స్వార్థపరులుగా, క్రూరులుగా, భావానుభూతుల్లేనివారిగా, తమ గురించే ఆలోచించేవారిగా ఎందుకయ్యారు? బంగారు సూత్రం ఎంతో వ్యాప్తి చెందినా, దాన్ని ఆచరణీయంకాని దానిలాగా నైతికతను తెలిపే ఒక స్మారకచిహ్నంగా పక్కకు నెట్టడంవల్లనే కాదా? విషాదకరంగా, దేవుని మీద విశ్వాసముందని చెప్పే అనేకమంది విషయంలో కూడా అదే జరిగింది. నడుస్తున్న ధోరణినిబట్టి చూస్తుంటే ప్రజలు మరింత స్వార్థపరులు అవుతారని మాత్రమే అర్థమవుతోంది.
కాబట్టి, ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటంటే: బంగారు సూత్రానికి అనుగుణంగా జీవించడమంటే ఏమిటి? ఇప్పటికీ ఆసూత్రానికి అనుగుణంగా జీవించేవారెవరైనా ఉన్నారా? మానవాళి అంతా బంగారు సూత్రానికి అనుగుణంగా జీవించే కాలమెప్పుడైనా వస్తుందా? వీటికి నిజమైన జవాబుల కోసం దయచేసి దీని తర్వాతి ఆర్టికల్ చదవండి.
[3వ పేజీలోని చిత్రం]
కన్‌ఫ్యూషియస్‌తోపాటు ఇతరులు బంగారు సూత్రాన్ని నానా రకాలుగా బోధించారు