కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆహ్వానాలను అంగీకరించడం ప్రతిఫలదాయకము

యెహోవా ఆహ్వానాలను అంగీకరించడం ప్రతిఫలదాయకము

జీవిత కథ

యెహోవా ఆహ్వానాలను అంగీకరించడం ప్రతిఫలదాయకము

మారీయ డో సేవు జానార్‌డీ చెప్పినది

“యెహోవాకు తెలుసు ఆయనేమి చేస్తున్నాడో. ఆయన నీకు ఆహ్వానాన్ని పంపించాడంటే, నువ్వు దాన్ని వినయంగా అంగీకరించాలి.” దాదాపు 45 సంవత్సరాల క్రితం మానాన్నగారు అన్న మాటలివి. పూర్తికాల పరిచారకురాలిగా సేవ చేసేందుకు యెహోవా సంస్థ నుండి నాకు మొదటిసారిగా అందిన ఆహ్వానాన్ని అంగీకరించేందుకు ఆమాటలు నాకు బలాన్నిచ్చాయి. మానాన్నగారిచ్చిన ఆసలహాకు నేటికీ నేను కృతజ్ఞురాలినే, ఎందుకంటే అలాంటి ఆహ్వానాలను అంగీకరించడం వల్ల గొప్ప ప్రతిఫలాలను పొందాను.

పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో, మానాన్నగారు కావలికోట పత్రికకు చందాకట్టారు, ఆయనకు బైబిలు మీద ఆసక్తి పెరిగింది. ఆయన నివసిస్తున్నది మధ్య పోర్చుగల్‌లో కాబట్టి, ఆయనకు దేవుని సంఘంతో సంబంధం కలిగివుండే ఒకే ఒక మార్గం, తపాలా ద్వారా తనకు అందే ప్రచురణలూ, మాతాత నానమ్మల బైబిలూ మాత్రమే. 1949 లో నాకు 13 ఏండ్లున్నప్పుడు, మేము కుటుంబసమేతంగా, మాఅమ్మవాళ్ళ స్వదేశమైన బ్రెజిల్‌కి వలసవెళ్ళాము. అలా, రియో డీ జనైరోలోని పొలిమేరల్లో మేము స్థిరపడ్డాం.

మా క్రొత్త పొరుగువారు తమ చర్చీకి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు, మేము కొన్నిసార్లు వెళ్ళాము కూడా. మానాన్నగారు వారిని నరకాగ్ని, ఆత్మ, భూమి భవిష్యత్తు మొదలైనవాటి గురించిన ప్రశ్నలు వేయడానికి ఇష్టపడేవారు. కానీ వాళ్ళ దగ్గర జవాబులు ఉండేవి కావు. “నిజమైన బైబిలు విద్యార్థుల కోసం మనం వేచి చూడాలి” అని ఆయన తరచూ అనేవారు.

ఒకరోజు ఒక అంధుడు, మాఇంటికి వచ్చి, కావలికోట, తేజరిల్లు! పత్రికలను ఇచ్చాడు. నాన్నగారు ఆయనను అవే ప్రశ్నలను వేశారు, ఆప్రశ్నలకు ఆయన బైబిలు ఆధారంగా సరైన జవాబులనిచ్చాడు. ఆతర్వాతి వారం, యెహోవాసాక్షియైన మరొకరు మాఇంటికి వచ్చారు. ఆమె అనేక ప్రశ్నలకు జవాబులనిచ్చిన తర్వాత ప్రకటనా పనిని చేసేందుకు నేను ఇప్పుడు క్షేత్ర సేవకు వెళ్ళాలని చెప్పింది, మత్తయి 13:⁠38 ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఆపని జరగాలని చెప్పింది. “నేను కూడా రావచ్చా?” అని నాన్నగారు అడిగారు. “తప్పకుండా” అని ఆమె జవాబిచ్చింది. మేము బైబిలు సత్యాన్ని తిరిగి కనుగొనగలిగినందుకు చాలా ఆనందించాం! తర్వాతి సమావేశంలో నాన్నగారు బాప్తిస్మం తీసుకున్నారు. నేను ఆతర్వాత త్వరలోనే, అంటే 1955 నవంబరులో బాప్తిస్మం తీసుకున్నాను.

నాకు వచ్చిన మొదటి ఆహ్వానాన్ని అంగీకరించడం

ఒక సంవత్సరమున్నర తర్వాత, పూర్తికాల ప్రకటనాపనిని చేపట్టమన్న ఆహ్వానం నాకు అందింది, అది పెద్ద బ్రౌన్‌ ఎన్‌వెలప్‌లో రియో డీ జనైరోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి వచ్చింది. ఆసమయంలో అమ్మ ఆరోగ్యం బాగలేదు. కాబట్టి నాన్నగారిని సలహా అడిగాను. “యెహోవాకు తెలుసు ఆయనేమి చేస్తున్నాడో” అని ఆయన దృఢంగా జవాబిచ్చారు. “ఆయన నీకు ఆహ్వానాన్ని పంపించాడంటే, నువ్వు దాన్ని వినయంగా అంగీకరించాలి” అని ఆయన చెప్పారు. ఆయన మాటలు నాకు ప్రోత్సాహం కలిగించాయి, నేను దరఖాస్తు నింపాను, అలా, 1957 జూలై 1న పూర్తికాల సేవలో ప్రవేశించాను. నా మొదటి నియామకం, రియో డీ జనైరో రాష్ట్రంలోని ట్రేస్‌ రీయుస్‌.

ట్రేస్‌ రీయుస్‌లోని నివాసులు మేము చెప్పే సందేశాన్ని మొదట్లో వినేవారు కాదు. ఎందుకంటే, మేము క్యాథలిక్‌ బైబిలు అనువాదాన్ని ఉపయోగించేవాళ్ళం కాదు. క్యాథలిక్‌ మతాన్ని అవలంబించే జరాల్డూ రామాల్యూ అనే వ్యక్తితో మేము బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు మాకు సహాయం లభించింది. ఆయన సహాయంతో, స్థానిక ప్రీస్టు సంతకంగల ఒక బైబిలును సంపాదించుకోగలిగాను. అప్పటి నుండి, ఎవరైనా అభ్యంతరం తెలిపితే, నేను ప్రీస్టు సంతకాన్ని చూపించేదాన్ని, ఆతర్వాత మళ్ళీ ఏమీ అడిగేవారు కాదు. కొన్నాళ్ళ తర్వాత జరాల్డూ బాప్తిస్మం తీసుకున్నాడు.

1959 లో, ట్రేస్‌ రీయుస్‌ కేంద్రస్థానంలో ప్రాంతీయ సమావేశం జరిగినప్పుడు నేను ఎంతో ఆనందించాను. ఆసమయంలో బైబిలు అధ్యయనం చేస్తున్న పోలీస్‌ ఛీఫ్‌, ఆకార్యక్రమాన్ని ప్రకటించే బ్యానర్‌లను ఆపట్టణమంతా ప్రదర్శించే ఏర్పాట్లను కూడా చేశాడు. ట్రేస్‌ రీయుస్‌లో మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత, నాకు క్రొత్త నియామకం ఈటూకు లభించింది. అది సావో పౌలోకు పశ్చిమాన దాదాపు 110 కిలోమీటర్ల దూరాన ఉంది.

ఎరుపు, నీలం, పసుపు రంగు పుస్తకాలు

ఇంటికోసం కొంత వెదికిన తర్వాత, నాకూ, నా పయినీరు భాగస్వామికీ పట్టణ కేంద్రస్థానంలో ఉన్న మారీయ అనే దయాళువైన విధవరాలి ఇల్లు దొరికింది. మారీయ మమ్మల్ని తన సొంత కూతుర్లలా చూసుకుంది. అయితే, కొన్నాళ్ళకి, ఈటూకు చెందిన రోమన్‌ క్యాథలిక్‌ బిషప్‌ ఆమెను సందర్శించి, మమ్మల్ని పంపించేయమని చెప్పాడు. కానీ ఆమె గట్టిగా నిలబడింది. “నా భర్త చనిపోయినప్పుడు, నన్ను ఓదార్చడానికి మీరు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. నేను వారి మతానికి చెందిన దానిని కాకపోయినా, ఈయెహోవాసాక్షులు నాకు సహాయం చేశారు” అని చెప్పింది.

ఆ సమయంలోనే, ఈటూ క్యాథలిక్‌ ప్రీస్టులు “అపవాదిని గురించిన ఎర్రని పుస్తక” ప్రతులను తీసుకోవద్దని తమ చర్చి సభ్యులకు చెప్పారని ఒక మహిళ మాకు తెలిపింది. వాళ్ళు అలా అన్నది మేము ఆవారంలో ప్రజలకు ప్రతిపాదిస్తున్న “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే ప్రచురణ గురించి. ఆఎర్రని పుస్తకమును ప్రీస్టులు “నిషేధించారు” కనుక, మేము నీలిరంగు పుస్తకం (“క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి” [ఆంగ్లం]) అందింపుకు సిద్ధపడ్డాం. తర్వాత, మతనాయకులు, ఈమార్పును గురించి విన్నప్పుడు, మేము అది మార్చి పసుపురంగు పుస్తకాన్ని (మతం మానవజాతి కోసం ఏం చేసింది? [ఆంగ్లం]) ఉపయోగించడం మొదలుపెట్టాం, అలా మారుస్తూ వచ్చాము. మాదగ్గర వివిధ రంగుల్లోని వేర్వేరు పుస్తకాలుండడం మంచిదైంది!

ఈటూలో ఒక సంవత్సరం ఉన్న తర్వాత, జాతీయ సమావేశానికి జరగవలసిన సిద్ధపాట్లలో భాగంగా, రియో డీ జనైరోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయమైన బేతేలులో, తాత్కాలికంగా సేవ చేయమన్న ఆహ్వానం టెలిగ్రాము ద్వారా నాకు అందింది. నేను దాన్ని ఆనందంగా స్వీకరించాను.

ఇంకా ఎక్కువ ఆధిక్యతలూ, సవాళ్ళూ

బేతేలులో పనికేమీ లోటు లేదు, ఏవిధంగా సాధ్యమైతే ఆవిధంగా నేను సహాయపడడానికి సంతోషించాను. ప్రతిరోజు ఉదయం దినవచనం చర్చకు, ప్రతి సోమవారం సాయంకాలం కుటుంబ కావలికోట అధ్యయనానికి హాజరుకావడం ఎంతో బలాన్నిచ్చింది! ఓటో ఎస్టల్‌మాన్‌, మరియు బేతేలు కుటుంబంలోని అనుభవజ్ఞులైన ఇతర సభ్యుల ప్రార్థనలు నాపై లోతైన ప్రభావం చూపాయి.

జాతీయ సమావేశం తర్వాత, నేను ఈటూకు తిరిగి వెళ్ళడానికి బ్యాగ్‌లు సర్దుకున్నాను, కానీ, బ్రాంచి సేవకుడైన గ్రాంట్‌ మిల్లర్‌, బేతేలు కుటుంబంలో శాశ్వత సభ్యురాలిగా ఉండమని ఆహ్వానిస్తున్న ఉత్తరం నా చేతికిచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. నా రూమ్‌మేట్‌ సహోదరి హాజా యాజెడ్‌జీయన్‌ ఇప్పటికీ బ్రెజిల్‌ బేతేలులో సేవ చేస్తోంది. ఆరోజుల్లో బేతేలు కుటుంబం చాలా చిన్నగా, కేవలం 28 మందితో ఉండేది, మేమందరమూ సన్నిహిత స్నేహితులుగా ఉండేవాళ్ళం.

1964 లో జ్వావు జానార్‌డీ అనే యువ పూర్తికాల పరిచారకుడు శిక్షణ కోసం బేతేలుకు వచ్చాడు. ఆయన అప్పుడు మాకు దగ్గరి ప్రాంతంలోనే ప్రాంతీయ సేవకుడుగా అంటే ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాడు. ఆయన తన రిపోర్టులను ఇవ్వడానికి బేతేలుకు వచ్చినప్పుడు మేము కొన్నిసార్లు కలిసేవాళ్ళం. సోమవారం సాయంకాలాలు కుటుంబ అధ్యయనానికి హాజరు కావడానికి బ్రాంచి సేవకుడు జ్వావుకు అనుమతినిచ్చారు, అలా మేము ఇంకా ఎక్కువ సమయం కలిసి గడపగలిగాము. నేను, జ్వావు 1965 ఆగస్టులో పెళ్ళి చేసుకున్నాము. నా భర్తతోపాటు ప్రాంతీయ పనిలో చేరమన్న ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాను.

ఆ రోజుల్లో, బ్రెజిల్‌లోని అంతర్భాగంలో ప్రయాణ పని చేయడమంటే సాహసం చేయడమే. మినాస్‌ జెరాయిస్‌ స్టేట్‌లోని ఆరానలోని ప్రచారకుల గుంపును మేము సందర్శించిన సందర్భాలను నేను ఎన్నడూ మరిచిపోలేను. మేము ట్రెయిన్‌లో కొంత దూరం వెళ్ళి, మిగతా దూరం సూట్‌కేసులు, టైప్‌రైటర్‌, స్లైడ్‌ ప్రొజెక్టర్‌, సర్వీస్‌ బ్యాగ్‌లు, సాహిత్యాలు మోసుకుంటూ నడిచివెళ్ళాలి. లురీవాల్‌ షాన్‌టాల్‌ అనే పెద్దవయస్కుడైన ఒక సహోదరుడు, మేము మాలగేజీ తీసుకువెళ్ళడంలో సహాయపడేందుకు, మేము వెళ్ళే ప్రతిసారీ రైల్వేస్టేషన్‌కి వచ్చి నిలబడడం చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగేది.

ఆరానలోని కూటాలు అద్దె ఇంట్లో జరిగేవి. దాని వెనుకవున్న చిన్న గదిలో మేము నిద్రపోయేవాళ్ళం. ఆగదిలో ఒకవైపున వంట చెరుకు ఉండేది, మేము దానిని వంట చేసుకోవడానికి, సహోదరులు మాకోసం బకెట్లలో తెచ్చే నీళ్ళను వేడిచేసుకోవడానికీ ఉపయోగించేవాళ్ళం. దగ్గర్లోవున్న వెదురు తోట మధ్యన నేలలోవున్న చిన్న గుంట మరుగుదొడ్డిగా ఉపయోగపడేది. చగస్‌ వ్యాధిని సంక్రమింపజేసే బార్బర్‌ పురుగులను పారద్రోలేందుకు మేము రాత్రుల్లో గ్యాస్‌లైట్లను వెలిగించేవాళ్ళం. ఉదయం లేచేసరికి మానాసికారంధ్రాలు పొగతో నల్లగా తయారయ్యేవి. చాలా వింతైన అనుభవం!

పారానా రాష్ట్రంలోని సర్క్యూట్‌లో మేము సేవ చేస్తున్నప్పుడు, బ్రాంచి కార్యాలయం నుండి పెద్ద బ్రౌన్‌ ఎన్‌వెలప్‌లు మాకు అందాయి. అయితే, యెహోవా సంస్థ నుండి ఈసారి మాకు వచ్చిన ఆహ్వానం, పోర్చుగల్‌లో సేవచేయమని! అక్కడ మన క్రైస్తవ పని నిషేధించబడి పోర్చుగీసు ప్రభుత్వం ఇప్పటికే అనేక మంది సహోదరులను అరెస్ట్‌ చేసింది కాబట్టి, లూకా 14:28 లోని సూత్రాన్ని పరిగణనలోకి తీసుకొంటూ ఈనియామకాన్ని అంగీకరించే ముందు దీనికి చెల్లించవలసి వచ్చే మూల్యం లెక్క చూసుకొమ్మని ఆఆహ్వాన ఉత్తరంలో సలహా ఇవ్వబడింది.

అలాంటి హింసలు ఎదురయ్యే దేశానికి మేము వెళ్ళామా? “మన పోర్చుగీసు సహోదరులు అక్కడ నివసిస్తూ, యెహోవాను నమ్మకంగా సేవిస్తుంటే మనం మాత్రం చేయలేమా?” అని జ్వావు అన్నాడు. మానాన్నగారి ప్రోత్సాహకరమైన మాటలను గుర్తుచేసుకుని, “యెహోవా మనకు ఈఆహ్వానాన్ని పంపించాడంటే, మనం దాన్ని అంగీకరించాలి, ఆయనపై నమ్మకముంచాలి” అంటూ నేను కూడా ఏకీభవించాను. కొన్నాళ్ళ తర్వాత, సావో పౌలోలోని బేతేలుకి వెళ్ళి మేము మరిన్ని నిర్దేశాలను పొందాము, ప్రయాణానికి అవసరమైన అధికార పత్రాలను సిద్ధం చేసుకున్నాం.

జ్వావు మారీయ, మారీయ జ్వావు

1969 సెప్టెంబరు 6న, ఏయూజేన్‌యూసే అనే పడవ సావో పౌలో స్టేట్‌లోని సాంటోస్‌ ఓడరేవునుండి బయలుదేరింది. తొమ్మిది రోజుల సముద్ర ప్రయాణం తర్వాత, మేము పోర్చుగల్‌కి చేరుకున్నాం. మొదట్లో, అనుభవజ్ఞులైన సహోదరులతో లిస్బన్‌ అనే పాత జిల్లాలోని ఆల్‌ఫామా, మోరారీయ పట్టణాల్లోని ఇరుకైన వీధుల గుండా అనేక నెలలు కలిసి పని చేశాము. మేము పోలీసుల చేతికి సులభంగా చిక్కకుండా ఉండేందుకు కావలసిన మెలకువలను వాళ్ళు మాకు నేర్పించారు.

సంఘ కూటాలు సాక్షుల ఇండ్లలో జరిగేవి. పొరుగువారికి అనుమానం కలుగుతోందని మేము గమనించిన వెంటనే కూటాల స్థలాలను మార్చేసేవాళ్ళం. అలా ఆఇంట్లో రెయిడ్‌ జరగకుండా, సహోదరులు అరెస్ట్‌ చేయకుండా నివారించేవాళ్ళం. మేము సమావేశాలను పిక్నిక్‌లని పిలిచేవాళ్ళం, వాటిని లిస్బన్‌ పొలిమేరల్లో ఉన్న మన్‌సాన్‌టూ పార్క్‌లోను, తీరప్రాంతంలోని కోస్టా డ కాపారికా అనే వనంలోను జరుపుకునేవాళ్ళం. మేము ఆసందర్భాల్లో మామూలు వస్త్రాలు ధరించేవాళ్ళం. ముందుగా పథకం వేసుకున్న చోట్లలో కావలిగా అటెండెంట్ల గుంపు అప్రమత్తంగా ఉండేది. ఎవరైనా అనుమానంగా దగ్గరికి వస్తున్నట్లయితే, వాళ్ళు వచ్చే లోపు మేము అప్పటికప్పుడు ఏవైనా ఆటలు ఆడుకోవడం గానీ, పిక్నిక్‌ జరుపుకోవడం గానీ జానపదగేయాలు పాడుకోవడం గానీ మొదలుపెట్టేవాళ్ళం.

సెక్యూరిటీ పోలీసులు మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు, మేము మాఅసలు పేర్లను ఉపయోగించకుండా ఉండేవాళ్ళం. సహోదరులకు, మేము జ్వావు మారీయ, మారీయ జ్వావు అని తెలుసు. మాపేర్లను ఏ ఉత్తరాల్లో గానీ, రికార్డులలోగాని ఉపయోగించేవారు కాదు. బదులుగా మాకు నంబర్లు నియమించబడేవి. సహోదరుల చిరునామాలు గుర్తుంచుకోకుండా ఉండడానికి దృఢనిశ్చయంతో ప్రయత్నించేదాన్ని. అలాగైతే, ఒకవేళ, నన్ను అరెస్ట్‌ చేసినా సహోదరులను పట్టిచ్చే పరిస్థితి నాకు రాదుకదా.

ఆంక్షలున్నా, నేనూ, జ్వావు, లభించే ప్రతి అవకాశంలోను సాక్ష్యమివ్వాలన్న దృఢనిశ్చయంతో ఉండేవాళ్ళం. ఎందుకంటే, ఏ నిమిషంలోనైనా మేము స్వాతంత్ర్యాన్ని కోల్పోవచ్చని మాకు తెలుసు. మేము మన పరలోక తండ్రియైన యెహోవాపై ఆధారపడడం నేర్చుకున్నాం. “అదృశ్యుడైనవాని చూచుచున్నట్టు” మాకనిపించే విధంగా ఆయన తన దూతలను ఉపయోగించి మమ్మల్ని కాపాడేవాడు.​—⁠హెబ్రీయులు 11:⁠27.

ఒక సందర్భంలో, పోర్టోలో, ఇంటింటి ప్రకటనా పని చేస్తున్నప్పుడు, మేము కలిసిన వ్యక్తి, ఇంటిలోపలికి రమ్మని పట్టు పట్టాడు. నాతోపాటున్న సహోదరి, ఏమాత్రం జంకకుండా అందుకు అంగీకరించడంతో, నేను ఆమెతో పాటు లోపలికి వెళ్ళక తప్పలేదు. హాలులో, మిలిటరీ యూనిఫారమ్‌లో ఉన్న వ్యక్తి ఫోటో చూసేసరికి నాకు చాలా భయంవేసింది. ఇక ఇప్పుడు ఏమి చేసేది? మాఆతిథేయుడు మమ్మల్ని కూర్చోబెట్టి, “సైన్యంలోకి చేరమని మీ కొడుకుకి పిలుపువస్తే, ఆయన అందులో సేవచేయడానికి మీరు అనుమతిస్తారా?” అని నన్ను అడిగాడు. అది చాలా సున్నితమైన పరిస్థితి. మౌనంగా ప్రార్థించిన తర్వాత, “నాకు పిల్లలు లేరు, లేనివాళ్ళ గురించి అడిగితే, మీరు కూడా తప్పకుండా ఇదే జవాబిస్తారు” అని నెమ్మదిగా జవాబిచ్చాను. ఆయన మౌనం వహించాడు. అప్పుడు నేను, “తమ్ముడ్ని లేదా తండ్రిని కోల్పోతే ఎలా ఉంటుందని మీరు అడిగితే నేను చెప్పగలను, ఎందుకంటే నా తమ్ముడూ తండ్రీ ఇద్దరూ చనిపోయారు” అని అన్నాను. నేనలా మాట్లాడుతుండగా నా కళ్ళు నీళ్ళతో నిండాయి, ఆయన కూడా దాదాపుగా ఏడ్చినంత పనిచేశాడు. ఇటీవలే తన భార్య చనిపోయిందని ఆయన చెప్పాడు. నేను పునరుత్థాన నిరీక్షణను గురించి చెప్పినప్పుడు ఆయన జాగ్రత్తగా విన్నాడు. తర్వాత మేము గౌరవపూర్వకంగా గుడ్‌బై చెప్పి, మిగతా విషయాన్ని యెహోవాకు వదిలేసి, అక్కడి నుండి క్షేమంగా బయటికి వచ్చేశాము.

నిషేధమున్నప్పటికీ, సత్యాన్ని గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు యథార్థహృదయులైన ప్రజలకు సహాయమివ్వబడింది. నా భర్త, ఓరాస్యూ అనే వ్యాపారస్థునికి అధ్యయనం నిర్వహించింది పోర్టోలోనే. ఆయన త్వరితగతిన అభివృద్ధి సాధించాడు. తర్వాత, ఆయన కుమారుడు ఏమీల్యూ కూడ యెహోవా పక్షాన నిలబడి, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఒక మంచి డాక్టరు. అవును, యెహోవా పరిశుద్ధాత్మను ఏదీ ఆపలేదు.

“యెహోవా దేనిని అనుమతిస్తాడో మనకు తెలియదు”

1973 లో బెల్జియమ్‌లోని బ్రస్సెల్స్‌లో “దైవిక విజయం” అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరు కమ్మని నాకు జ్వావుకు ఆహ్వానం లభించింది. వేలాదిమంది, స్పెయిన్‌, బెల్జియమ్‌ సహోదరులు హాజరయ్యారు, అలాగే మొజాంబిక్‌, అంగోలా, కేప్‌ వెర్డె, మడీరా, అజోర్స్‌ అనే దేశాల నుండి కూడా సహోదరులు వచ్చారు. న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన సహోదరుడు నార్‌, “యెహోవాను నమ్మకంగా సేవిస్తూ ఉండండి. యెహోవా దేనిని అనుమతిస్తాడో మనకు తెలియదు. మీరు తర్వాతి అంతర్జాతీయ సమావేశానికి పోర్చుగల్‌లో సమావేశమవుతుండవచ్చునేమో ఎవరికి తెలుసు!” అనే మాటలతో తన ప్రసంగాన్ని ముగించారు.

తర్వాతి సంవత్సరం, పోర్చుగల్‌లో ప్రకటనా పనికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. సహోదరుడు నార్‌ చెప్పినట్లుగానే, 1978 లో, మేము లిస్బన్‌లో మామొదటి అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకున్నాం. సందేశాలు వ్రాసివున్న అట్టలతోను, పత్రికలతోను సాక్ష్యమిస్తూ, బహిరంగ ప్రసంగానికి ఆహ్వానాలనిస్తూ లిస్బన్‌ వీధుల గుండా వెళ్ళడం ఎంతటి ఆధిక్యత. ఎన్నాళ్ళగానో కన్న కల నిజమైంది.

మాకు పోర్చుగీసు సహోదరులంటే ఎంతో ప్రేమ. వారిలో చాలా మంది క్రైస్తవ తటస్థతను పాటించినందుకు జైలు శిక్షను అనుభవించారు, దెబ్బలు తిన్నారు. మేము పోర్చుగల్‌లోనే సేవ కొనసాగించాలని కోరుకున్నాం. కానీ అలా జరగలేదు. 1982 లో, జ్వావుకు తీవ్రమైన గుండెజబ్బు వచ్చింది. మేము బ్రెజిల్‌కి తిరిగి వెళ్ళాలని బ్రాంచి కార్యాలయం మాకు సూచించింది.

విషమకరమైన సమయం

బ్రెజిల్‌ బ్రాంచి కార్యాలయంలోని సహోదరులు మాకెంతో మద్దతునిచ్చారు. సావో పౌలో రాష్ట్రంలోని టావ్‌బాటేలోవున్న కీరీరీంగ్‌ సంఘంలో సేవ చేయడానికి నియమించబడ్డాం. జ్వావు ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించసాగింది, ఎంతోకాలం గడవక ముందే ఆయన ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆసక్తిగల వ్యక్తులు బైబిలు అధ్యయనం చేయడానికి మాఇంటికి వచ్చేవారు, ప్రతిరోజు క్షేత్ర సేవా కూటాలు ఉండేవి, అలాగే ప్రతివారం గుంపు అధ్యయనం జరిగేది. ఈఏర్పాట్లు మేము మాఆధ్యాత్మికతను కాపాడుకునేందుకు సహాయం చేశాయి.

1985, అక్టోబరు 1న జ్వావు చనిపోయారు, ఆరోజు వరకూ ఆయన యెహోవా సేవలో తాను చేయగలిగింది చేయడంలో కొనసాగారు. నేను చాలా విచారంగాను, మానసిక వ్యధతోను ఉండేదాన్ని, కానీ నేను నా నియామకంలో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. 1986 ఏప్రిల్‌లో, మాఇంట్లో దొంగలుపడి దాదాపుగా ఉన్నదంతా దోచుకుపోవడం మరో దెబ్బ. నా జీవితంలో మొదటిసారిగా నేను ఒంటరిగా ఉన్నందుకు నాకు భయమేసింది. ఒక జంట కొన్నాళ్ళు తమతో ఉండమని నన్ను ఆహ్వానించారు, అందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.

జ్వావు మరణమూ, అలాగే ఇంటి దోపిడీ నేను చేస్తున్న యెహోవా సేవపై ప్రభావం చూపాయి. పరిచర్య చేయగలనన్న నమ్మకం నాకిక లేకుండా పోయింది. నా ఇబ్బందులను గురించి నేను బ్రాంచి కార్యాలయానికి వ్రాసినప్పుడు, నేను భావోద్వేగపరమైన సమతుల్యతను తిరిగి పొందేలా సహాయపడేందుకు కొంత కాలం ఇక్కడ వచ్చి ఉండమని బేతేలు నుండి పిలుపు వచ్చింది. నేను అక్కడున్న సమయంలో బాగా బలపడ్డాను!

నేను కొంత కోలుకున్నట్లు అనిపించిన వెంటనే, సావో పౌలో రాష్ట్రంలోని ఒక పట్టణమైన ఈపువాలో నియామకాన్ని స్వీకరించాను. ప్రకటనా పనిలో బిజీగా ఉన్నా, అప్పుడప్పుడు చాలా నిరుత్సాహంగా ఉండేది. అలాంటి సమయాల్లో, నేను కీరీరీంగ్‌లోని సహోదరులకు ఫోను చేసేదాన్ని, ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేది. వారి రాక నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది! నేను ఈపువాలో ఉన్న మొదటి సంవత్సరం, 38 మంది సహోదర సహోదరీలు నన్ను చూడడానికి ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చారు.

జ్వావు చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత, 1992 లో, యెహోవా సంస్థ నుండి నాకు మరొక ఆహ్వానం లభించింది. ఈసారి, సావో పౌలో రాష్ట్రంలోని ప్రాంకాకు వెళ్ళమని వచ్చింది. ఇప్పటికీ నేనిక్కడే పూర్తికాల పరిచారకురాలిగా సేవచేస్తున్నాను. ఇక్కడి టెరిటరీ చాలా ఫలవంతంగా ఉంది. 1994 లో, నేను ఇక్కడి మేయర్‌తో బైబిలు అధ్యయనం మొదలుపెట్టాను. ఆసమయంలో, ఆయన బ్రెజిలియన్‌ కాంగ్రెస్‌లో సీటు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ప్రతి సోమవారం మధ్యాహ్నం మేము అధ్యయనం చేసేవాళ్ళం. మధ్యలో అవాంతరాలు రాకుండా ఉండేందుకు, ఆయన ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసివుంచేవారు. ఆయన నెమ్మదిగా, రాజకీయాలను వదులుకోవడం, సత్యం సహాయంతో, వైవాహిక జీవితాన్ని పునర్నిర్మించుకోవడం చూసినప్పుడు నేనెంతో సంతోషించాను! ఆయనా, ఆయన భార్యా 1998 లో బాప్తిస్మం తీసుకున్నారు.

గతాన్ని వెనుదిరిగి చూస్తే, పూర్తికాల పరిచారకురాలిగా నా జీవితం, ఎంతో గొప్ప ఆశీర్వాదాలతోను, ఆధిక్యతలతోను నిండివుందని చెప్పగలను. యెహోవా తన సంస్థ ద్వారా నాకందించిన ఆహ్వానాలను అంగీకరించడం, నిజంగా గొప్ప ప్రతిఫలాలనిచ్చింది. భవిష్యత్తులో కూడా నాకెలాంటి ఆహ్వానాలు వచ్చినా, వాటిని అంగీకరించడానికి నేను మునుపటిలానే సుముఖంగా ఉంటాను.

[25వ పేజీలోని చిత్రాలు]

1957 లో, నేను పూర్తికాల సేవ ప్రారంభించినప్పుడూ, ఇప్పుడూ

[26వ పేజీలోని చిత్రం]

1963 లో, బ్రెజిల్‌ బేతేలు కుటుంబంతో

[27వ పేజీలోని చిత్రం]

1965 లో మావివాహం

[27వ పేజీలోని చిత్రం]

నిషేధమున్నప్పుడు పోర్చుగల్‌లో సమావేశం

[28వ పేజీలోని చిత్రం]

1978 లో “విజయవంతమైన విశ్వాసం” అనే అంతర్జాతీయ సమావేశపు రోజున లిస్బన్‌లో వీధి సాక్ష్యమివ్వడం