కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నాయొద్ద నేర్చుకొనుడి”

“నాయొద్ద నేర్చుకొనుడి”

నాయొద్ద నేర్చుకొనుడి”

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీప్రాణములకు విశ్రాంతి దొరకును.”​—మత్తయి 11:⁠29.

1. యేసు నుండి నేర్చుకోవడం ఆహ్లాదకరంగాను, మన జీవితాలను మెరుగుపరిచేదిగాను ఉండగలదనడానికి కారణమేమిటి?

యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సముచితంగానే ఆలోచించాడు, బోధించాడు, ప్రవర్తించాడు. ఆయన భూమ్మీద జీవించినది స్వల్పకాలమే అయినా ప్రయోజనకరమైన సంతృప్తికరమైన పనిచేస్తూ సంతోషంగా ఉన్నాడు. ఆయన శిష్యులను సమకూర్చి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తోటి మానవులనెలా ప్రేమించాలో లోకాన్ని ఎలా జయించాలో నేర్పించాడు. (యోహాను 16:​33) ఆయన వారి హృదయాలను నిరీక్షణతో నింపాడు, ‘జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాడు.’ (2 తిమోతి 1:​9-10) మిమ్మల్ని మీరు ఆయన శిష్యులలో ఒకరిగా ఎంచుకుంటున్నట్లయితే, శిష్యుడిగా ఉండడం అంటే ఏమిటని మీరు అనుకుంటున్నారు? శిష్యులను గురించి యేసు ఏమి చెబుతున్నాడన్నది పరిశీలించడం ద్వారా, మన జీవితాలనెలా మెరుగుపరచుకోవచ్చో మనం నేర్చుకోవచ్చు. అందులో, ఆయన దృక్కోణాన్ని అవలంబించడమూ, కొన్ని ప్రాథమిక సూత్రాలను అన్వయించుకోవడమూ ఇమిడివున్నాయి.​—⁠మత్తయి 10:​24,25; లూకా 14:​26,27; యోహాను 8:​31,32; 13:​35; 15:⁠8.

2, 3, (ఎ) యేసు శిష్యుడు అంటే ఎవరు? (బి)‘నేను ఎవరి శిష్యుడిగా ఉన్నాను’ అని ప్రశ్నించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

2 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “శిష్యుడు” అని అనువదించబడిన పదానికి, ప్రాథమికంగా, తన మనస్సును ఒక దానిమీద కేంద్రీకరించేవాడు, లేదా నేర్చుకునేవాడు అని అర్థం. దీనికి సంబంధించిన మాట మన చర్చాంశానికి ఆధార వచనమైన మత్తయి 11:⁠29 లో కనిపిస్తుంది: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (ఇటాలిక్కులు మావి.) అవును, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. సాధారణంగా, సువార్తల్లో, “శిష్యుడు” అన్న మాట యేసు ప్రకటనా పనికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేసిన, ఆయన చేత బోధించబడిన సన్నిహిత అనుచరులకు వర్తిస్తుంది. కొందరు యేసు బోధలను అంగీకరించివుండవచ్చు, రహస్యంగా అంగీకరించినవారు కూడా ఉన్నారు. (లూకా 6:​17; యోహాను 19:​38) ‘[బాప్తిస్మమిచ్చే] యోహాను శిష్యుల’ గురించీ, “పరిసయ్యుల శిష్యుల” గురించీ కూడా సువార్త రచయితలు పేర్కొన్నారు. (మార్కు 2:​18) “పరిసయ్యులు ... అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని” యేసు తన అనుచరులను హెచ్చరించాడు కనుక, ‘నేనెవరి శిష్యుడిగా ఉన్నాను?’ అని మనలను మనం ప్రశ్నించుకోవచ్చు.​—⁠మత్తయి 16:⁠12.

3 మనం యేసు శిష్యులమైతే, మనమాయన నుండి నేర్చుకున్నట్లయితే, ఇతరులు మన సమక్షంలో ఆధ్యాత్మికంగా సేదదీర్చుకోగలగాలి. మనం మునుపటికన్నా సౌమ్యంగాను, వినయమనస్కులుగాను ఉన్నామని వాళ్ళు గ్రహించగలగాలి. మనకు ఉద్యోగ స్థలంలో యాజమాన్య బాధ్యతలు ఉన్నట్లయితే, లేదా మనం తల్లిదండ్రులమైతే, లేదా క్రైస్తవ సంఘంలో మనకు మందకాపరి విధులున్నట్లయితే, మన పర్యవేక్షణ క్రింద ఉండేవారు, యేసు తన పర్యవేక్షణ క్రింద ఉన్నవారితో వ్యవహరించినట్లే మనం వాళ్ళతో వ్యవహరిస్తున్నట్లు వాళ్ళు గ్రహించగలుగుతున్నారా?

యేసు ప్రజలతో వ్యవహరించిన విధానం

4, 5. (ఎ) సమస్యలున్న ప్రజలతో యేసు ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడం ఎందుకు కష్టం కాదు? (బి)యేసు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఏమి జరిగింది?

4 ప్రజలతో ముఖ్యంగా, గంభీరమైన సమస్యలున్నవారితో యేసు ఎలా ప్రవర్తించాడో మనం తెలుసుకోవలసిన అవసరముంది. దాన్ని నేర్చుకోవడం కష్టమేమీ కాదు; యేసుకు ఇతరులు తారసపడిన అనేక నివేదికలు బైబిలులో ఉన్నాయి. ఆయనకు తారసపడినవారిలో కొందరు బాధలననుభవిస్తున్నారు. అయితే, మత నాయకులు, ముఖ్యంగా, పరిసయ్యులు, అలాంటి సమస్యలుగల వ్యక్తులతో ఎలా ప్రవర్తించారో కూడా పరిశీలించుదాం. యేసుకూ పరిసయ్యులకూ ఉన్న తేడా మనకు ఎంతో నేర్పిస్తుంది.

5 సా.శ. 31వ సంవత్సరంలో, యేసు గలిలయలో ప్రకటనా పర్యటనలో ఉన్నప్పుడు, ‘పరిసయ్యులలో ఒకడు తనతోపాటు భోజనము చేయవలెనని ఆయననడిగాడు.’ యేసు ఆఆహ్వానాన్ని అంగీకరించడానికి సందేహించలేదు. “ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఆఅత్తరు వాటికి పూసెను.”​—⁠లూకా 7:​36-38.

6. “పాపాత్మురాలు” అయిన ఆస్త్రీ ఆ పరిసయ్యుని ఇంటికి ఎందుకు వచ్చివుంటుంది?

6 మీరు దాన్ని ఊహించుకోగలరా? “అవసరాల్లో ఉన్న ప్రజలు అలాంటి విందుల్లో మిగిలిన ఆహారాన్ని తీసుకునేందుకు అక్కడికి రావడానికి అనుమతించే ఆచారాన్ని ఆ స్త్రీ (37వ వచనం) ఉపయోగించుకుంది” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి, తమను ఆహ్వానించకపోయినా ఒక వ్యక్తి ఎలా ప్రవేశించగలడో తెలుస్తుంది. ఆవిందు ముగిసినప్పుడు, ఏమైనా ఉన్నాయా అని చూసేందుకు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండవచ్చు. అయినప్పటికీ, ఈస్త్రీ ప్రవర్తన అసాధారణంగా ఉంది. ఆవిందు ఎప్పుడు ముగుస్తుందా అన్న దృష్టితో ఆమె వేచి ఉండలేదు. ఆమెకు “పాపాత్మురాలు” అని ఒక చెడ్డపేరుంది. అందుకే, “ఆమెయొక్క విస్తార పాపములు” తనకు తెలుసని యేసు అన్నాడు.​—⁠లూకా 7:⁠47.

7, 8. (ఎ) లూకా 7:​36-38 వచనాల్లో నివేదించబడినటువంటి పరిస్థితుల్లో మనమే ఉంటే ఎలా ప్రతిస్పందించి ఉండేవాళ్ళం? (బి)సీమోను ఎలా ప్రతిస్పందించాడు?

7 మీరు ఆకాలంలో జీవించినట్లు, మీరు యేసు స్థానంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఎలా ప్రతిస్పందించివుండేవారు? ఆస్త్రీ మీదగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించివుండేదా? అటువంటి పరిస్థితి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపించివుంటుంది? (లూకా 7:​45) మీరు కంగారుపడివుండేవారా, భయపడివుండేవారా?

8 మీరు ఇతర అతిథుల్లో ఒకరైవుంటే, మీఆలోచనా విధానం కూడా కనీసం కొంతైనా పరిసయ్యుడైన సీమోను ఆలోచించినట్లే ఉండేదా? ‘[యేసును] పిలిచిన పరిసయ్యుడు అది చూచి​—⁠ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.’ (లూకా 7:​39) యేసు ఆయనకు భిన్నమైనవాడు, ఎంతో సానుభూతిపరుడు. యేసు ఆస్త్రీ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, ఆమెకున్న వ్యాకులతను గ్రహించాడు. ఆమె పాపభరితమైన జీవితంలో ఎలా ఇరుక్కుపోయిందో మనకు తెలుపబడలేదు. ఆమె నిజంగానే ఒక వేశ్యే అయితే, ఆపట్టణంలోవున్న సమర్పిత యూదులైన పురుషులు ఆమెకు సహాయపడలేదని స్పష్టమవుతుంది.

9. యేసు ఎలా ప్రతిస్పందించాడు, దానివల్ల ఎటువంటి ఫలితం లభించివుండవచ్చు?

9 కానీ యేసు ఆమెకు సహాయం చేయాలని కోరుకున్నాడు. “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని ఆమెతో అన్నాడు. ఆతర్వాత, “నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లు” అని కూడా అన్నాడు. (లూకా 7:​48-50) ఇక్కడితో ఈవృత్తాంతం ముగుస్తుంది. యేసు ఆమెకు పెద్ద సహాయమేమీ చేయలేదని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు. నిజానికి, ఆయన ఆమెను ఆశీర్వదించి పంపాడు. తర్వాత కూడా ఆమె విచారకరమైన ఆజీవనశైలినే కొనసాగించి ఉంటుందని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా ఏమీ చెప్పలేము, కానీ తర్వాత లూకా ఏమి చెబుతున్నాడో గమనించండి. యేసు “దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను” సంచారము చేశాడని ఆయన చెబుతున్నాడు. యేసు, ఆయన శిష్యులతోపాటు, “కొందరు స్త్రీలును” ఉండిరని ‘[ఆ స్త్రీలు] తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి’ అని కూడా లూకా నివేదిస్తున్నాడు. పశ్చాత్తాపపడి కృతజ్ఞతాభావం కలిగిన ఈస్త్రీ, నిర్మలమైన మనస్సాక్షితో, నూతనమైన సంకల్పంతో, దేవుని మీద మరింత ప్రగాఢమైన ప్రేమతో, దైవభక్తితో కూడిన జీవనాన్ని ప్రారంభించి ఆస్త్రీలతోపాటు ఉండే అవకాశం ఉంది.​—⁠లూకా 8:1-3.

యేసుకూ పరిసయ్యులకూ ఉన్న తేడా

10. సీమోను ఇంట్లో యేసును, ఆస్త్రీని గురించిన వృత్తాంతాన్ని పరిశీలించడమెందుకు లాభకరము?

10 స్పష్టమైన ఈవృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అది మన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది, కాదంటారా? మీరు సీమోను ఇంట్లో ఉన్నారనుకోండి. మీరెలా భావించి ఉంటారు? యేసు ప్రవర్తించినట్లే మీరు ప్రవర్తించివుంటారా, లేక ఆయన ఆతిథేయుడైన పరిసయ్యుడు భావించినట్లే మీరు కొంత మేరకు భావించివుండేవారా? యేసు దేవుని కుమారుడు, సరిగ్గా ఆయన భావించినట్లే, ప్రవర్తించినట్లే మనం భావించలేము, ప్రవర్తించలేము. అయితే, మనం పరిసయ్యుడైన సీమోనులా ఉన్నట్లు ఆలోచించడానికి ఇష్టపడకపోవచ్చు. పరిసయ్యుల్లా ఉన్నామని గర్వపడేవారు అరుదు.

11. పరిసయ్యుల కోవలో ఉండడానికి మనమెందుకు ఇష్టపడము?

11 మనం బైబిలుపరమైన లౌకికమైన రుజువులను అధ్యయనం చేయడం ద్వారా, పరిసయ్యులు తమను తాము ప్రజా సంక్షేమ సంరక్షకులుగా జాతీయ సంక్షేమ సంరక్షకులుగా, ఎంతో ఉన్నతంగా ఎంచుకున్నారన్న నిర్ధారణకు రావచ్చు. దేవుని ధర్మశాస్త్రం, నిజానికి స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఉందని వాళ్ళు తృప్తిపడలేదు. ధర్మశాస్త్రం ఏయే విషయాలనైతే నిర్దిష్టంగా చెప్పనట్లు అనిపించిందో ఆవిషయాలకు నిర్దిష్టమైన అన్వయింపులను తామే నిర్ణయించి వాటిని ధర్మశాస్త్రంతో చేర్చి, మనస్సాక్షి అవసరం లేకుండా చేశారు. చాలా స్వల్పమైన విషయాలతో సహా ఒక్కటి కూడ విడువకుండా అన్ని విషయాల్లోను ప్రవర్తనా నియమావళిని తయారుచేసేందుకు మత నాయకులు ప్రయత్నించారు. *

12. పరిసయ్యులు తమను తాము ఎలా ఎంచుకునేవారు?

12 పరిసయ్యులు తమను తాము దయగలవారిగా, నెమ్మదిగలవారిగా, న్యాయవంతులుగా, తమ పనికి యోగ్యులైనవారిగా ఎంచుకున్నారని మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ స్పష్టం చేస్తున్నాడు. నిస్సందేహంగా వారిలో కొందరు ఆయోగ్యతలను దాదాపుగా చేరుకున్నారు. మీకు నీకొదేము గుర్తు వచ్చివుండవచ్చు. (యోహాను 3:​1,2; 7:​50,51) కొంతకాలానికి, వారిలో కొందరు క్రైస్తవ మార్గాన్ని అవలంబించారు. (అపొస్తలుల కార్యములు 15:⁠5) క్రైస్తవ అపొస్తలుడైన పౌలు పరిసయ్యులు వంటి కొందరు యూదులను గురించి గురించి వ్రాశాడు: “వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.” (రోమీయులు 10:⁠2) అయినప్పటికీ, వారిని సామాన్య ప్రజానీకం, గర్విష్ఠులుగా, అహంభావులుగా, స్వనీతిమంతులుగా, తప్పులుపట్టేవారిగా, ఇతరులకు తీర్పుతీర్చేవారిగా, చిన్నబుచ్చేవారిగా ఎంచేవారని సువార్తలుచూపిస్తున్నాయి.

యేసు దృక్కోణం

13. యేసు పరిసయ్యులను గురించి ఏమని చెప్పాడు?

13 యేసు శాస్త్రులను పరిసయ్యులను వేషధారులు అన్నాడు. “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.” అవును, ఆబరువులు చాలా భారంగా ఉండేవి, ప్రజలపై మోపిన కాడి మోయశక్యం కానంత కఠినంగా ఉండేది. యేసు శాస్త్రులను పరిసయ్యులను “అవివేకులారా” అన్నాడు. అవివేకి, సమాజానికి ప్రమాదకారి. యేసు శాస్త్రులను, పరిసయ్యులను “అంధులైన మార్గదర్శకులారా” అని కూడా పిలిచాడు. “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి” అని కూడా నొక్కి చెప్పాడు. యేసు తనను పరిసయ్యునిగా ఎంచాలని ఎవరు కోరుకుంటారు?​—⁠మత్తయి 23:1-4, 16, 17,23.

14, 15. (ఎ) మత్తయి లేవీతో యేసు ప్రవర్తించిన తీరు, పరిసయ్యులు ప్రవర్తించే విధానం ఎలాంటిదని వెల్లడిచేస్తుంది? (బి)ఈ వృత్తాంతం నుండి ప్రాముఖ్యమైన ఏపాఠాలను మనం నేర్చుకోవచ్చు?

14 సువార్త వృత్తాంతాలను చదివే దాదాపు ప్రతి ఒక్కరూ, పరిసయ్యుల్లో అధిక సంఖ్యాకుల విమర్శనా వైఖరిని గమనించగలరు. యేసు సుంకరివాడైన మత్తయి లేవీని శిష్యుడవ్వమని ఆహ్వానించిన తర్వాత, లేవీ ఆయన కోసం గొప్ప విందును ఏర్పాటు చేశాడు. “పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి​—⁠సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. అందుకు యేసు ... మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను” అని ఆవృత్తాంతం చెబుతుంది.​—⁠లూకా 5:27-32.

15 యేసు ఆ సందర్భంలో చెప్పిన ఇంకో విషయాన్ని, అంటే “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని” అన్న మాటలను లేవి గ్రహించాడు. (మత్తయి 9:​13) హీబ్రూ ప్రవక్తలు వ్రాసినవాటిని తాము నమ్ముతున్నట్లు పరిసయ్యులు చెప్పుకున్నప్పటికీ, హోషేయ 6:6 లో చెప్పబడుతున్న ఈమాటలను వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేయబోతున్నట్లయితే, అది పారంపర్యాలకు విధేయత చూపుతున్నట్లుండేలా నిశ్చయపరచుకునేవారు. మనలో ప్రతి ఒక్కరము, ‘వ్యక్తిగత అభిప్రాయాలను లేదా ఒక విషయంలో సాధారణంగా ఉన్న దృక్పథాలను ప్రతిబింబించే కొన్ని నియమాలను గురించి పట్టుపట్టే వ్యక్తి అన్న పేరు నాకుందా? లేక ఇతరులు నా గురించి ఎక్కువగా కరుణా దయా గల వ్యక్తిగా అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించుకోవచ్చు.

16. పరిసయ్యుల పద్ధతి ఏమిటి, మనం వారిలా ఉండకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?

16 తప్పులు పట్టడం, తప్పులు పట్టడం, తప్పులు పట్టడం. అదే పరిసయ్యుల పద్ధతి. పరిసయ్యులు ఎప్పుడు ఏ పొరపాటు జరుగుతుందా అని చూసేవారు, అది నిజమైనదే కావచ్చు,ఊహించుకున్నదే కావచ్చు. ప్రజలతో పోట్లాడడానికి సిద్ధంగా ఉండేవారు. వారి వైఫల్యాలను గుర్తుచేస్తుండేవారు. ఆపరిసయ్యులు, పుదీనా సోపు జీలకఱ్ఱ వంటి చిన్నమొక్కల పదియవ వంతు చెల్లించడంలో చాలా గర్వపడేవారు. వాళ్ళు తమ భక్తిని తమ వస్త్రధారణ ద్వారా ప్రదర్శించేవారు, జనాంగంపై అజమాయిషీ చేయడానికి ప్రయత్నించేవారు. మన క్రియలుయేసు మాదిరితో పొందికగా ఉండాలంటే, మనం ఎల్లవేళలా ఇతరుల తప్పుల కోసం చూసే ధోరణిని,వాటినిపెద్దగా చేసి చూపే ధోరణిని తప్పక నివారించుకోవాలి.

యేసు సమస్యలతో ఎలా వ్యవహరించాడు?

17-19. (ఎ) చాలా తీవ్రమైన పర్యవసానాలకు దారితీయగల పరిస్థితిలో యేసు ఎలా వ్యవహరించాడో వివరించండి. (బి)ఆ పరిస్థితిని ఏది ఒత్తిడిమయంగా, ఇబ్బందికరంగా మార్చింది? (సి)ఆస్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అక్కడ ఉంటే, మీరెలా ప్రవర్తించివుంటారు?

17 సమస్యలతో యేసు వ్యవహరించిన విధానానికీ, పరిసయ్యులు వ్యవహరించిన విధానానికీ చాలా తేడా ఉంది. ఎంతో తీవ్రంగా ఉండగల పరిస్థితితో యేసు ఎలా వ్యవహరించాడో చూడండి. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఇమిడివున్న పరిస్థితి అది. మీరు లూకా 8:42-48 లో ఉన్న వృత్తాంతాన్ని చదవవచ్చు.

18 ఆ స్త్రీ “భయపడి, వణకుచు” వచ్చిందని మార్కు వృత్తాంతం చెబుతుంది. (మార్కు 5:​33) ఎందుకని? ఎందుకంటే, ఆమె దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. లేవీయకాండము 15:25-28 ప్రకారం, అసహజమైన రక్తస్రావం గల స్త్రీ, అదున్నంత సేపు, ఇంకొక వారమూ అపవిత్రురాలుగా ఉంటుంది. ఆమె ఏమి ముట్టుకున్నా అపవిత్రమవుతుంది, ఆమె దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ అపవిత్రులవుతారు. ఆస్త్రీ యేసు దగ్గరికి వెళ్ళడానికి, జనసమూహం మధ్యలో గుండా అతి కష్టం మీద వెళ్ళాల్సి వచ్చింది. ఆనాటి ఆవృత్తాంతాన్ని 2,000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు పరిశీలిస్తున్నప్పుడు, ఆమె అనుభవిస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితికి మనకు ఆమె మీద సానుభూతి కలుగుతుంది.

19 ఆనాడు మీరుంటే, ఆపరిస్థితిని ఎలా దృష్టించివుండేవారు? మీరు ఏమని ఉంటారు? యేసు ఆస్త్రీ క్షేమాన్ని మనస్సులో పెట్టుకుంటూ, ఆమెతో దయగా, ప్రేమగా వ్యవహరించాడనీ, ఆమె మూలంగా రాగల సమస్యలను గురించి ఆయన పరోక్షంగా కూడా సూచించలేదనీ గమనించండి.​—⁠మార్కు 5:⁠34.

20. లేవీయకాండము 15:25-28 నేటికీ కోరబడుతున్నట్లయితే, మనం ఏ సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది?

20 ఈ సంఘటన నుండి మనమేమైనా నేర్చుకోగలమా? నేటి క్రైస్తవ సంఘంలో మీరు ఒక పెద్ద అనుకోండి. లేవీయకాండము 15:25-28 నేడు క్రైస్తవుల నుండి కూడా కోరబడుతుందనీ, ఒక క్రైస్తవ స్త్రీ బాధతో, నిస్సహాయ భావంతో ఆనియమాన్ని ఉల్లంఘించిందనీ అనుకోండి. మీరు ఎలా వ్యవహరిస్తారు? విమర్శన బుద్ధితో కూడిన ఉపదేశంతో మీరు ఆమెను బహిరంగంగా అవమానపరుస్తారా? “అబ్బే, నేనలా ఎన్నడూ చేయను! నేను యేసు మాదిరిని అనుకరిస్తూ, దయగా, ప్రేమగా, సాలోచనతో, ఆమె క్షేమంపై శ్రద్ధ చూపిస్తూ వ్యవహరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తానని” మీరంటారు. చాలా మంచిది! కానీ, ఆవిధంగా చేయడం, యేసు మాదిరిని అనుకరించడం సవాలే.

21. ధర్మశాస్త్రాన్ని గురించి యేసు ప్రజలకు ఏమని బోధించాడు?

21 నిజంగా, యేసు ద్వారా ప్రజలు సేదదీర్చుకున్నారు, బలాన్ని పొందారు, ప్రోత్సాహాన్ని పొందారు. దేవుని ధర్మశాస్త్రం ఖచ్చితంగా ఏదైనా చెప్పినట్లయితే, అది ఏమి చెప్పిందో అదే ఉద్దేశించబడింది. అది నిర్దిష్టంగా చెప్పనట్లయితే, ప్రజలు ముఖ్యంగా తమ మనస్సాక్షిననుసరించి ప్రవర్తించాలి, వాళ్ళు తమ నిర్ణయాల ద్వారా దేవుని మీద తమకున్న ప్రేమను చూపించగలిగేవారు. పరిస్థితులను బట్టి మెలిగే స్వాతంత్ర్యాన్ని ధర్మశాస్త్రం వాళ్ళకిచ్చింది. (మార్కు 2:​27,28) దేవుడు తన ప్రజలను ప్రేమించాడు, నిరంతరం మంచి కోసం పనిచేశాడు, వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు వారిపై కనికరం చూపేందుకు సుముఖత చూపాడు. యేసూ అలాగే చేశాడు.​—⁠యోహాను 14:⁠9.

యేసు బోధల ఫలితాలు

22. యేసు నుండి నేర్చుకోవడం, ఆయన శిష్యులకు ఎలాంటి దృక్పథాన్ని కలిగివుండేందుకు సహాయపడింది?

22 యేసు బోధలను విని, ఆయన శిష్యులైనవారు, “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” అని ఆయన చెప్పిన మాటలు సత్యమని గ్రహించగలిగారు. (మత్తయి 11:​30) ఆయన తమపై భారం మోపుతున్నట్లుగానీ, తమను వేధిస్తున్నట్లు గానీ, ఒకటే ప్రసంగిస్తున్నట్లుగానీ వారికి ఎన్నడూ అనిపించలేదు. వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా, ఇంకా సంతోషంగా ఉన్నారు, తమకు దేవునితోను, తోటివారితోను ఉన్న సంబంధాన్ని గురించి ఇంకా నిశ్చయతతో ఉన్నారు. (మత్తయి 7:​1-5; లూకా 9:​49,50) ఆధ్యాత్మిక నాయకుడుగా ఉండాలంటే, ఇతరులను సేదదీర్చేవారిగా, వినయ మనస్సునూ హృదయాన్నీ కనబరిచేవారిగా ఉండాలని వారాయన నుండి నేర్చుకున్నారు.​—⁠1 కొరింథీయులు 16:​17,18; ఫిలిప్పీయులు 2:⁠3.

23. యేసు సహచర్యం, ఆయన శిష్యులకు ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పింది, వాళ్ళు ఏ నిర్ధారణలకు రావడానికి సహాయపడింది?

23 అంతేకాక, క్రీస్తులో ఏకమై, ఆయన చూపిన స్ఫూర్తిని అవలంబించవలసిన ప్రాముఖ్యత అనేకుల మనస్సుల్లో నాటుకుంది. “తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని; నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని ఆయన తన శిష్యులతో అన్నాడు. (యోహాను 15:​9,10) వారు దేవుని పరిచారకులుగా సేవకులుగా సఫలులవ్వాలంటే, దేవుని అద్భుతమైన సువార్తను బహిరంగంగా ప్రకటించేటప్పుడూ, బోధించేటప్పుడూ, కుటుంబ సభ్యులతోను, స్నేహితులతో వ్యవహరించేటప్పుడూ యేసు నుండి నేర్చుకున్న విషయాలను శ్రద్ధగా ఆచరించాలి. సంఘాల్లో సహోదరుల సంఖ్య పెరుగుతున్న కొలది, యేసు వ్యవహరించిన విధానం సరైనదన్న విషయాన్ని మరల మరల గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది. ఆయన వారికి నేర్పినది సత్యము. ఆయనలో వారు గమనించిన జీవనశైలి, నిజంగా కోరుకోవలసిన జీవనశైలి.​—⁠యోహాను 14:⁠6; ఎఫెసీయులు 4:20,21.

24. యేసు మాదిరి నుండి మనం గ్రహించవలసిన విషయాలు ఏమిటి?

24 మనమిప్పటి వరకూ చర్చిస్తూ వచ్చిన కొన్ని విషయాలను గురించి ధ్యానిస్తుండగా, మీరు ఏయే విధాల్లో మెరుగుపడవలసి ఉందో గ్రహిస్తున్నారా? యేసు ఎల్లప్పడూ సముచితమైన విధంగానే, ఆలోచించాడని బోధించాడని ప్రవర్తించాడని మీరు అంగీకరిస్తారా? మరైతే, ధైర్యం తెచ్చుకోండి. “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు” అన్నవి ఆయన మనకు చెబుతున్న ప్రోత్సాహకరమైన మాటలు.​—⁠యోహాను 13:⁠17.

[అధస్సూచి]

^ పేరా 11 “[యేసుకూ పరిసయ్యులకూ] మధ్య ఎలాంటి తేడా ఉందన్నది దేవుని గురించి వారికున్న పరస్పర విరుద్ధమైన అవగాహనల ద్వారా మాత్రమే స్పష్టమవుతుంది. పరిసయ్యుల దృష్టిలో, దేవుడు ముఖ్యంగా ఆదేశాలనిచ్చేవాడు; యేసు దృష్టిలో దేవుడు దయ, సానుభూతి గలవాడు. అయితే, పరిసయ్యుడు దేవుని మంచితనాన్ని, ప్రేమను పూర్తిగా కాదనడు, కానీ, దేవుని ఈగుణాలు తోరహ్‌ [ధర్మశాస్త్రం] అనే బహుమానంలోను, తోరహ్‌ కోరుతున్నవాటిని పాటించగల సాధ్యతలోను వ్యక్తం చేయబడ్డాయన్నది అతని ఉద్దేశం. ... ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించేందుకు మౌఖిక సంప్రదాయం పెట్టిన నియమాలతో సహా మౌఖిక సంప్రదాయమంతటిని అవలంబించడమే తోరహ్‌ నెరవేర్చే మార్గమని పరిసయ్యులు దృష్టించేవారు. ... ప్రేమించాలన్న రెండు పార్శ్వాలుగల ఆజ్ఞను (మత్తయి 22:​34-40) యేసు ఆధికారిక ప్రమాణ స్థాయి మేరకు ఉన్నతపరచి, మనుష్యులను కట్టిపడేసేటువంటి మౌఖిక సాంప్రదాయ స్వభావాన్ని తిరస్కరించడం వల్ల ... ఆయన పరిసయ్యుల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా అయ్యాడు.”​—⁠ద న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ థియోలజీ.

మీరెలా జవాబిస్తారు?

• యేసు శిష్యులుగా ఉండడమంటే ఏమిటని మీరు అనుకుంటున్నారు?

• ప్రజలతో యేసు ఎలా వ్యవహరించాడు?

• యేసు బోధించిన విధానం నుండి మనమేమి నేర్చుకోగలం?

• పరిసయ్యులకూ యేసుకూ తేడా ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[18, 19వ పేజీలోని చిత్రాలు]

ప్రజల పట్ల యేసుకున్న దృక్పథానికీ, పరిసయ్యులకున్న దృక్పథానికీ ఎంత తేడా!