కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన యేసు

నిజమైన యేసు

నిజమైన యేసు

ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో యేసు తన అపొస్తలుల ద్వారా తెలుసుకున్న తర్వాత, ‘మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు’ అని వారిని అడిగాడు. ‘నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు’ అని పేతురు ఇచ్చిన జవాబును సువార్త రచయితయైన మత్తయి వ్రాసి ఉంచాడు. (మత్తయి 16:​15,16) మిగతా అపొస్తలుల అభిప్రాయం కూడా అదే. “బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు” అని నతనయేలు యేసుతో అన్నాడు, ఆతర్వాత ఆయన అపొస్తలులలో ఒకడయ్యాడు. (యోహాను 1:​49) తన పాత్రకున్న ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని స్వయంగా యేసే అన్నాడు. (యోహాను 14:⁠6) “దేవుని కుమారుడ”నని పలు సందర్భాల్లో స్వయంగా ఆయనే చెప్పాడు. (యోహాను 5:​24,25; 11:⁠4) చనిపోయిన వారిని పునరుత్థానం చేయడంతో సహా తాను చేసిన అద్భుతమైన కార్యాల ద్వారా దానికి రుజువునిచ్చాడు.

కారణసహితమైన సందేహాలా?

యేసు గురించి సువార్తలు చెబుతున్నదానిని మనం నిజంగా నమ్మగలమా? అవి నిజమైన యేసును చిత్రీకరిస్తున్నాయా? ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో బైబిలు విమర్శల, వ్యాఖ్యానాల ప్రొఫెసర్‌గా పనిచేసిన కీర్తిశేషులైన ఫ్రెడ్‌రిక్‌ ఎఫ్‌. బ్రూస్‌ ఇలా పేర్కొన్నాడు: “బైబిలులోనిదే కానివ్వండి బైబిలేతరమైనదే కానివ్వండి ప్రాచీన వ్రాతల్లోని ప్రతి వివరణ యొక్క సత్యత్వాన్ని చారిత్రక వాదనల ద్వారా రుజువుపరచడం సాధ్యం కాదు. రచయిత నమ్మదగినవాడని సహేతుకమైన నమ్మకముంటే చాలు; ఆనమ్మకం ఏర్పడితే, ఆయన తెలిపిన వివరాలు సత్యమనేందుకు ఆనమ్మకమే రుజువుగా ఉంటుంది. ... క్రైస్తవులు క్రొత్త నిబంధనను ‘పవిత్ర’ సాహిత్యంగా స్వీకరించారన్న వాస్తవం, అది చరిత్రపరంగా నమ్మదగినది కాదనడానికి ఒక కారణం కాదు.”

అమెరికాలోని నార్త్‌ డకోటాలోని, జేమ్స్‌టౌన్‌ కాలేజీలో మత ప్రొఫెసర్‌ అయిన జేమ్స్‌ ఆర్‌. ఎడ్వార్డ్స్‌, సువార్తల్లో చిత్రీకరించబడిన యేసును గురించిన సందేహాలను పరిశీలించిన తర్వాత ఇలా వ్రాశాడు: “యేసును గురించిన యథార్థ సత్యానికి సంబంధించిన వైవిధ్యభరితమైన ప్రాముఖ్యమైన రుజువులను సువార్తలు కాపాడుతున్నాయని మేము నమ్మకంగా దృఢంగా చెప్పగలము. ... సువార్తలు యేసును ఆవిధంగా ఎందుకు చిత్రీకరిస్తున్నాయన్న ప్రశ్నకు, నిజానికి యేసు అలా ఉండేవాడు కాబట్టే అలా చిత్రీకరిస్తున్నాయన్నది అత్యంత సహేతుకమైన జవాబు. దేవుడే తనను పంపించాడని, దేవుని కుమారునిగా సేవకునిగా ఉండేందుకు తనకు దైవిక శక్తి ఇవ్వబడిందనీ యేసు తన అనుచరులకు తన గురించి కలిగించిన అభిప్రాయం మరవబడకుండా సువార్తలు నమ్మకంగా కాపాడుతున్నాయి.” *

యేసు కోసం అన్వేషణ

యేసుక్రీస్తును గురించిన బైబిలేతర ప్రస్తావనల విషయమేమిటి? అవి ఎలా ఎంచబడుతున్నాయి? టాసిటస్‌, సూటోనియస్‌, జోసీఫస్‌, ప్లినీ ద యంగర్‌ రచనల్లోను, ఇంకా కొందరు ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన రచయితల రచనల్లోను యేసును గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. వాటి గురించి ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1995) ఇలా అంటోంది: “ఈ స్వతంత్ర వృత్తాంతాలు నిరూపిస్తున్నదేమిటంటే, ప్రాచీన కాలాల్లో, క్రైస్తవత్వపు వ్యతిరేకులు సహితం యేసు వాస్తవంగా ఉనికిలో ఉన్నవాడేనన్న విషయాన్ని సందేహించలేదు, ఆవిషయం మొదట 18వ శతాబ్దపు ముగింపులో, ఆతర్వాత, 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్దారంభంలోను వివాదవిషయంగా మారింది.”

ఆధునిక పండితులు, “నిజమైన” లేదా “యథార్థమైన” యేసు కోసం అన్వేషిస్తుండగా, నిర్హేతుకమైన ఊహలు, అకారణమైన సందేహాలు, నిరాధారమైన సిద్ధాంతాలు అనే పొరల్లో ఆయన నిజమైన గుర్తింపు మరుగున పడిపోయినట్లు కనిపించడం విచారకరం. సువార్త రచయితలు మిథ్యా రచనలను చేశారని పండితులు ఆరోపిస్తున్నారు, కానీ నిజానికి ఒక రకంగా వారే అలా చేసిన దోషులు. కొందరు ఇంకా ఎక్కువ ప్రఖ్యాతి గాంచాలి, ఆశ్చర్యాన్ని కలిగించే క్రొత్త సిద్ధాంతానికి తమ పేరును తగిలించుకోవాలి అన్న ఆతురతలో యేసును గురించిన రుజువులను సత్యసంధంగా పరిశీలించలేదు. ఆవిధంగా వాళ్ళు, పండితుల ఊహాకల్పనలో భాగమైన ఒక “యేసు”ను సృష్టించారు.

నిజమైన యేసును కనుగొనాలనుకునేవారు, ఆయనను బైబిలులో కనుగొంటారు. చారిత్రక యేసు కోసం చేసే పరిశోధనలో చాలా భాగం, బైబిలు ఉద్దేశాన్ని విస్మరించి చేయబడుతోందన్నది, ఎమ్రీ యూనివర్సిటీలోని కాండ్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ థియోలజీలో “క్రొత్త నిబంధన మరియు క్రైస్తవ ఆవిర్భావాలు” బోధించే ప్రొఫెసర్‌ అయిన లూక్‌ జాన్సన్‌ వాదన. యేసు జీవిత కాలంలోని, అలాగే ఆకాలంలోని సామాజికశాస్త్రపరమైన, రాజకీయపరమైన, మానవశాస్త్రపరమైన సాంస్కృతికపరమైన సందర్భాలను పరిశీలించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయినప్పటికీ, పండితులు చెబుతున్న చారిత్రక యేసును గురించి విషయాలేవీ కూడా “లేఖనాల్లో చెప్పబడలేదు,” లేఖనాలు “యేసు వ్యక్తిత్వాన్ని గురించి” ఆయన సందేశాన్ని గురించి, విమోచకుడుగా ఆయన పాత్రను గురించే “ఎక్కువగా చెబుతున్నాయి” అని కూడా ఆయన అంటున్నాడు. అలాగైతే, యేసు యొక్క నిజమైన వ్యక్తిత్వమేమిటి, ఆయనిచ్చే సందేశమేమిటి?

నిజమైన యేసు

సువార్తలు​—⁠యేసు జీవితాన్ని గురించిన నాలుగు బైబిలు వృత్తాంతాలు​—⁠ఎంతో సానుభూతిపరుడైన మనిషిగా చిత్రీకరిస్తున్నాయి. రోగములతో, అంధత్వముతో, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారికి సహాయం చేసేందుకు జాలి కనికరము యేసును పురికొల్పాయి. (మత్తయి 9:⁠36; 14:​14; 20:​34) తన స్నేహితుడైన లాజరు మరణం, ఆయన సహోదరీలకు కలిగించిన దుఃఖము యేసు ‘మూలిగేలా, కన్నీళ్ళు విడిచేలా’ చేశాయి. (యోహాను 11:​32-36) వాస్తవానికి, యేసుకు కలిగిన వివిధ భావాలను సువార్తలు వెల్లడి చేశాయి. ఆయనకు కుష్ఠరోగముగల వ్యక్తిమీద కనికరమూ, తన శిష్యుల సాఫల్యాన్ని బట్టి అవధుల్లేని ఆనందమూ, కఠినహృదయులైన శాసనబద్ధులపై ఆగ్రహమూ, యెరూషలేము మెస్సీయను తృణీకరించినందుకు విచారమూ కలిగాయి.

యేసు ఒక అద్భుతాన్ని చేసినప్పుడు, ఆయన తరచూ, ఆస్వస్థతా ప్రక్రియలో స్వస్థతను పొందే వ్యక్తి పాత్రను చూపిస్తూ, ‘నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను’ అనేవాడు. (మత్తయి 9:​22) యేసు నతనయేలు గురించి, ‘ఇతనియందు ఏ కపటమును లేదు’ అని చెబుతూ, “యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు” అని మెచ్చుకున్నాడు. (యోహాను 1:​47) ఒక స్త్రీ కృతజ్ఞతా భావంతో ఇచ్చిన కానుక దుబారా ఖర్చని కొందరనుకున్నప్పుడు, యేసు ఆమెను సమర్థిస్తూ, ఆమె చూపించిన ఔదార్యాన్ని దీర్ఘకాలం గుర్తుచేసుకుంటారని చెప్పాడు. (మత్తయి 26:​6-13) ఆయన తన అనుచరులను ‘అంతమువరకు ప్రేమించి’ తాను వారికి నిజమైన స్నేహితుడనని, ప్రేమానురాగాలు గల సహచరుడనని నిరూపించుకున్నాడు.​—⁠యోహాను 13:⁠1; 15:​11-15.

తనకు తారసపడిన వ్యక్తులు ఎలాంటివారో యేసు త్వరగా గుర్తుపట్టేవాడని కూడా సువార్తలు చూపిస్తున్నాయి. ఆయన బావి దగ్గర ఒక స్త్రీతో గానీ, తోటలో మత బోధకునితో గానీ లేక సరస్సుతీరమున జాలరితోనేగానీ మాట్లాడుతున్నప్పుడు నేరుగా వారి హృదయాన్ని చేరుకున్నాడు. వారిలో చాలా మంది యేసుతో ఒకసారి మాట్లాడిన తర్వాత, తమ హృదయాంతరంగాల్లోని తలంపులను ఆయనకు వెల్లడి చేశారు. వారు ప్రతిస్పందించేలా ఆయన వారి మనస్సులను తాకాడు. సాధారణంగా యేసు కాలంలోని ప్రజలు అధికార హోదాలో ఉన్నవారికి దూరంగా ఉండివుండవచ్చు, కానీ, ఆయన చుట్టూ మూగేవారు. వారు యేసుతో ఉండడానికి ఇష్టపడేవారు; ఆయన సహచర్యంలో హాయిగా ఉండేవారు. ప్రజలు ఆయనతో చనువుగా ఉండేవారు, ఒక చిన్నపిల్లవాడిని మాదిరిగా దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆయన ఆబిడ్డను, తన శిష్యుల ఎదుట కేవలం నిలబెట్టక, ‘వానిని ఎత్తి కౌగిలించుకున్నాడు.’ (మార్కు 9:​36; 10:​13-16) వాస్తవానికి, మనస్సులో నాటుకుపోయే ఆయన మాటలు వినేందుకు ప్రజలు మూడు రోజులు ఆయన దగ్గరే ఉండేంత ఆకర్షణ శక్తివున్న పురుషుడిగా సువార్తలు యేసును చిత్రీకరిస్తున్నాయి.​—⁠మత్తయి 15:⁠32.

యేసు పరిపూర్ణత, తనతో పాటు నివసిస్తున్న తాను బోధిస్తున్న అపరిపూర్ణులు పాపభరితులు అయిన ప్రజలను అతిగా విమర్శించేలా గాని, వారి ఎదుట గొప్పలు చెప్పుకునేలా గాని, వారిని శాసించేలా గానీ చేయలేదు. (మత్తయి 9:​10-13; 21:31, 32; లూకా 7:​36-48; 15:​1-32; 18:​9-14) యేసు ఇతరులను ఏమీ కోరేవాడు కాదు. ఆయన ప్రజల భారాన్ని అధికం చేయలేదు. బదులుగా, ఆయన “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అన్నాడు. ఆయన ‘సాత్వికుడు దీనమనస్సు గలవాడు’ అని ఆయన కాడి సుళువుగాను భారము తేలికగాను ఉన్నవని వారు తెలుసుకున్నారు.​—⁠మత్తయి 11:​28-30.

యేసు వ్యక్తిత్వాన్ని గురించిన స్పష్టమైన సత్యం సువార్త వృత్తాంతాల్లో వెల్లడవుతుంది. నలుగురు వేర్వేరు వ్యక్తులు అసాధారణమైన ఒక వ్యక్తిత్వాన్ని ఊహాకల్పన చేసి, తాము వ్రాసిన ఆనాలుగు వేర్వేరు వృత్తాంతాల్లోను ఆవ్యక్తిత్వాన్ని ఒకే విధంగా చిత్రీకరించడం సులభం కాదు. అలాంటి వ్యక్తి అసలు ఉనికిలోనే లేనట్లయితే, నలుగురు వేర్వేరు రచయితలు అలా ఉనికిలోనే లేని ఒక వ్యక్తిని వర్ణించడం ఒకే విధంగా చిత్రీకరించడం అసాధ్యమైన పని.

“ఆకర్షణీయమైన ఒక యువకుడు, చెడ్డ పేరు సంపాదించుకున్న స్త్రీలతో సహా అన్ని రకాల స్త్రీలతోను, ఎటువంటి భావభేదమూ అసహజత్వమూ లేకుండా అతి వినయం చూపించకుండా, అన్ని సమయాల్లోను, నిర్దోషంగా నిజాయితీగా వ్యవహరించాడని నాలుగు సువార్త కథనాలూ ఎలా చెప్పగలుగుతున్నాయి?” అని ఆలోచనను రేకెత్తించే ప్రశ్నను చరిత్రకారుడైన మైఖెల్‌ గ్రాంట్‌ అడిగాడు. అలాంటి ఒక వ్యక్తి నిజంగా ఉనికిలో ఉన్నాడు, బైబిలు వర్ణిస్తున్నట్లే నడిచాడు అన్నదే సహేతుకమైన జవాబు.

నిజమైన యేసు మరియు మీభవిష్యత్తు

బైబిలు, యేసు ఈభూమ్మీద ఉన్నప్పటి ఆయన నిజజీవిత చరిత్రను తెలియజేయడమే కాక, దేవుని అద్వితీయ కుమారునిగా, “సర్వసృష్టికి ఆదిసంభూతు”డుగా ఆయనకు మానవపూర్వ ఉనికి ఉందని కూడా చూపిస్తోంది. (కొలొస్సయులు 1:​15) ఇరవై శతాబ్దాల క్రితం, పరలోకంలోని తన కుమారుడు మానవుడుగా జన్మించేందుకు ఆకుమారుని జీవాన్ని యూదా కన్నె గర్భంలోకి దేవుడు బదిలీ చేశాడు. (మత్తయి 1:⁠18) యేసు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో, బాధలననుభవిస్తున్న మానవులకు ఏకైక నిరీక్షణగా దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు, ఆప్రకటనా పనిని కొనసాగించేందుకు తన శిష్యులకు శిక్షణనిచ్చాడు.​—⁠మత్తయి 4:​17; 10:​5-7; 28:19,20.

ప్రభుత్వాన్ని ధిక్కరించాడన్న అబద్ధ ఆరోపణ మీద సా.శ. 33 నీసాను 14న (రమారమి ఏప్రిల్‌ 1), యేసును బంధించి, విచారించి, మరణశిక్షను అమలుచేశారు. (మత్తయి 26:​18-20,48–27: 50) యేసు మరణం, విశ్వసించే మానవులను వారి పాపభరిత పరిస్థితి నుండి విడిపించి, ఆయన మీద విశ్వాసముంచేవారందరికి నిత్య జీవాన్నిచ్చే మార్గాన్ని తెరిచే విమోచన క్రయధనంగా పనిచేస్తుంది. (రోమీయులు 3:​23,24; 1 యోహాను 2:⁠2) నీసాను 16న, యేసు పునరుత్థానం చేయబడ్డాడు, ఆతర్వాత కొన్నాళ్ళకు తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు. (మార్కు 16:​1-8; లూకా 24:50-53; అపొస్తలుల కార్యములు 1:​6-9) పునరుత్థానం చేయబడిన యేసుకు, యెహోవా అభిషిక్త రాజుగా, మానవుల గురించి దేవునికున్న ఆది సంకల్పాన్ని నెరవేర్చే సంపూర్ణ అధికారముంది. (యెషయా 9:​6,7; లూకా 1:​32,33) బైబిలు యేసును దేవుని సంకల్పాల నెరవేర్పులో కీలకమైన వ్యక్తిగా వర్ణిస్తోంది.

మొదటి శతాబ్దంలోని జన సమూహాలు యేసు ఎవరై ఉన్నాడో అదే విధంగా, అంటే వాగ్దత్త మెస్సీయ లేదా క్రీస్తుగా, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించడానికి, మానవుల కోసం విమోచన క్రయధనంగా మరణించడానికి పంపబడినవాడిగా అంగీకరించాయి. (మత్తయి 20:​28; లూకా 2:​25-32; యోహాను 17:​25,26; 18:​37) యేసు ఉనికిలో ఉన్నాడా అన్నది అంత ఖచ్చితంగా తెలియకపోతే, తీవ్రమైన హింసలు చెలరేగుతున్నప్పుడు, ప్రజలు యేసు శిష్యులు కావడానికి పురికొల్పబడేవారే కాదు. “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆయన తమకిచ్చిన ఆదేశాన్ని వాళ్ళు ధైర్యముగా అత్యంతాసక్తితో పాటించారు.​—⁠మత్తయి 28:⁠19.

యేసు కల్పిత కథల్లోని ఒక పాత్ర కాదని, యథార్థ హృదయులైన, విషయ పరిజ్ఞానమున్న లక్షలాది మంది క్రైస్తవులకు తెలుసు. పరలోకంలో, దేవుని స్థాపిత రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించిన రాజుగా ఆయనను వారు అంగీకరిస్తారు, ఆయన భూమిపైనా, ఇక్కడి కార్యాలపైనా సంపూర్ణ అధికారాన్ని చూపిస్తాడు. ఈరాజ్యము లోక సమస్యల నుండి ఉపశమనాన్నిస్తానని వాగ్దానం చేస్తుంది కనుక ఈరాజ్యవార్త స్వాగతం చేయవలసిన వార్తగా ఉంది. నిజ క్రైస్తవులు, “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించడం ద్వారా యెహోవా ఎంపిక చేసుకున్న రాజుకు నమ్మకంగా మద్దతునిస్తారు.​—⁠మత్తయి 24:⁠14.

సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుద్వారా జరిగే రాజ్య ఏర్పాటుకు మద్దతునిచ్చేవారు, శాశ్వత ఆశీర్వాదాలను అనుభవించడానికి జీవించివుంటారు. ఈఆశీర్వాదాలను మీరు కూడా పొందవచ్చు! మీరు నిజమైన యేసును తెలుసుకొనేలా మీకు సహాయపడేందుకు ఈప్రచురణ ప్రకాశకులు సంతోషిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 5 సువార్త వృత్తాంతాల విశదమైన పరిశీలన కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు​—⁠దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకంలోని 5 నుండి 7 అధ్యాయాలను చూడండి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇతరులు చెప్పినవి

“నజరేతుకు చెందిన యేసును, ప్రపంచంలోని శక్తివంతమైన బోధకుల్లో ఒకరిగా నేనెంచుతాను. ... మీరు యేసు బోధలను పూజ్యభావంతో అధ్యయనం చేయకపోతే, మీజీవితాలు అసంపూర్ణంగా ఉంటాయని హిందువులకు చెబుతాను.” మోహన్‌దాస్‌ కె. గాంధీ, యేసుక్రీస్తు సందేశం (ఆంగ్లం).

“ఈ వ్యక్తిత్వం ఎంతో వాస్తవమైనది, సంపూర్ణమైనది, అన్నివేళలా ఏకరీతిగా ఉంది, లోపరహితంగా ఉంది, మానవ సహజంగా ఉంది. కానీ, మానవులందరి గొప్పతనంకన్నా ఎంతో ఉన్నతమైనది, ఇది మోసమో, కల్పిత కథనమో అయ్యుండదు. ... ఒక యేసును ఊహించి చెప్పడానికి అంతకన్నా గొప్పవాడైన మరో యేసు అవసరం.” ఫిలిప్‌ షాఫ్‌, క్రైస్తవ చర్చి చరిత్ర (ఆంగ్లం).

“ఒకే తరంలోని, సామాన్య వ్యక్తులు కొందరు ఎంతో శక్తివంతమైన, ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వాన్నీ, ఎంతో ఉన్నతమైన నైతిక సూత్రావళినీ, మానవులందరూ సహోదరులేననే ఎంతో ప్రేరణాత్మకమైన దర్శనాన్నీ కనిపెట్టారంటే, అది సువార్తలలో వ్రాయబడిన ఏ అద్భుతంకన్నా నమ్మశక్యము కానంత అద్భుతమై ఉంటుంది.” విల్‌ డ్యూరంట్‌, సీజరు మరియు క్రీస్తు (ఆంగ్లం).

“అసలు ఉనికిలో ఉన్నవారేనా అని వివాదం రేకెత్తించలేని నిజమైన వ్యక్తులే వివిధ మత విశ్వాసాలను స్థిరపరచడానికి ప్రయత్నించి విఫలులు కాగా, వాణిజ్య తంత్రంలో ఊహాకల్పిత వ్యక్తిని సృష్టిస్తున్నట్లు, ప్రాచీన కాలంలో అసలు ఉనికిలోనే లేని ఒక వ్యక్తిని కల్పించి చెప్పి, అతడే భూగోళవ్యాప్తమవుతున్న ఒక మత కార్యకలాపాలను ప్రారంభించాడనడం అర్థం చేసుకోలేని విషయంగా కనిపిస్తుండవచ్చు.” గ్రెగ్‌ ఈస్టర్‌బ్రూక్‌, బిసైడ్‌ స్టిల్‌ వాటర్స్‌.

‘సువార్తలు కల్పితకథలు కావని సాహిత్య చరిత్రకారునిగా నాకు సంపూర్ణ నమ్మకం కలిగింది. కల్పిత కథలని చెప్పేంతటి ఊహానైపుణ్యమేమీ ఆ రచనల్లో కనిపించడం లేదు. యేసు జీవిత చరిత్రలో చాలా భాగం మనకు తెలియదు. కల్పితకథలను సృష్టించేవారెవరూ ఆ విధంగా తెలపకుండా ఉండరు.’ సి. ఎస్‌. లూయిస్‌, గాడ్‌ ఇన్‌ ద డాక్‌.

[7వ పేజీలోని చిత్రాలు]

యేసుకు కలిగిన వివిధ భావాలను సువార్తలు వెల్లడిచేస్తున్నాయి