కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను ఎవరినని జనులు చెప్పుచున్నారు?’

‘నేను ఎవరినని జనులు చెప్పుచున్నారు?’

‘నేను ఎవరినని జనులు చెప్పుచున్నారు?’

క్రిస్మస్‌ కాలం మళ్ళీ వచ్చింది. భూగోళవ్యాప్తంగా ప్రజలు ఒకరి జన్మదినాన్ని వేడుకగా జరుపుకోవాలనుకుంటున్నారు. ఎవరి జన్మదినాన్ని? దేవుని కుమారునిదా, మొదటి శతాబ్దంలో తన ప్రాంతంలో ప్రబలివున్న మతాన్ని సంస్కరించాలని ఉద్దేశించిన ఒక యథార్థ యూదునిదా? పేదల ఉద్ధారకునిదా లేక రోమా సామ్రాజ్యానికే ముప్పుగా ఉన్నందువల్ల, చంపబడిన ఒక తిరుగుబాటుదారునిదా? లేక సొంత పరిజ్ఞానానికి, తనకున్న జ్ఞాన సంపదకు ప్రాధాన్యతనిచ్చిన సన్యాసిదా? ‘నిజానికి, యేసుక్రీస్తు ఎవరు?’ అని ఆశ్చర్యపోవడానికి మీకు మంచి కారణమే ఉంది.

ఆ ప్రశ్నకు ప్రజలెలా ప్రతిస్పందిస్తున్నారని తెలుసుకోవడానికి యేసు కూడా ఆసక్తి చూపించాడు. ‘నేను ఎవరినని జనులు చెప్పుచున్నారు?’ అని ఆయన ఒకసారి తన శిష్యులను అడిగాడు. (మార్కు 8:​27) ఆయన ఆప్రశ్న ఎందుకు వేశాడు? అప్పటికే చాలా మంది ఆయనను అనుసరించడం మానేశారు. ఇతరులు ఆయనను రాజుగా చేయాలని చేసిన ప్రయత్నాలను ఆయన తిరస్కరించిన తర్వాత వారు అయోమయంలో పడ్డారని, నిరాశపడ్డారని స్పష్టమవుతుంది. అంతేకాక, తన శత్రువులు తనను సవాలు చేసినప్పుడు, తానెవరో నిరూపించుకునేందుకు పరలోకం నుండి యేసు ఏ సూచనా చూపించలేదు. ఇంతకూ, ఆయన అడిగిన ప్రశ్నకు ఆయన అపొస్తలులు ఏమని జవాబిచ్చారు? ప్రజల అభిప్రాయాలను కొన్నింటిని వాళ్ళు పేర్కొన్నారు. “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని” వాళ్ళు చెప్పారు. (మత్తయి 16:​13,14) దైవదూషకుడని, గొప్ప జ్ఞానమున్నట్లు నటించేవాడని, అబద్ధ ప్రవక్తని, చివరికి పిచ్చివాడు

అని కూడా ఆనాడు పాలస్తీనాలో యేసును గురించి ప్రబలివున్న విమర్శనాత్మక దూషణలను వాళ్ళు పేర్కొనలేదు.

యేసు యొక్క అనేక పార్శ్వాలు

యేసు అదే ప్రశ్నను నేడు వేస్తే, చిన్నమార్పు చేసి, “నేనెవరినని పండితులు చెప్పుకుంటున్నారు?” అని అడగవచ్చు. దానికి జవాబులన్నింటినీ కలిపి క్లుప్తంగా, వేర్వేరు అభిప్రాయాలున్నాయి అని చెప్పవచ్చు. యేసును గురించీ, ఆయన మాటలు క్రియల గురించీ ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన డేవిడ్‌ ట్రేసీ అభిప్రాయపడుతున్నారు. నిజానికి యేసు ఎవరు అన్న ప్రశ్నకు జవాబులను కనుగొనేందుకు గత శతాబ్దంలోని పండితులు, సామాజికశాస్త్రపరంగా మానవశాస్త్రపరంగా సాహిత్యపరంగా అనేక పద్ధతులను ఉపయోగించి ప్రయత్నించారు. వారు చివరికి నిజానికి యేసు ఎవరని కనుగొన్నారు?

మారుమనస్సు పొందమని ఉద్బోధిస్తూ, లోకాంతాన్ని గురించి చెప్పిన యూదా ప్రవక్తే యేసని కొందరు పండితులు నొక్కి చెబుతున్నారు. కానీ, వాళ్ళు, ఆయనను దేవుని కుమారుడు, మెస్సీయ, విమోచకుడు అని పిలవడం లేదు. ఆయన జననం పరలోక సంబంధమైనదని, ఆయన పునరుత్థానం చేయబడ్డాడని బైబిలు చెబుతున్న వృత్తాంతాన్ని అధిక సంఖ్యాకులు సంశయిస్తారు. మరికొందరు, యేసు కేవలమొక మనిషనీ, ఆయన ఆదర్శవంతమైన తన జీవితం ద్వారా, బోధల ద్వారా, అనేక మతవిశ్వాసాలకు ప్రేరణనిచ్చాడనీ, అవే చివరికి క్రైస్తవత్వంలోకి ప్రవేశించాయనీ నమ్ముతారు. మరి కొందరు, యేసును “ఒక రంధ్రాన్వేషిగా, సంచరించే సన్యాసిగా లేదా ఒక సామాన్య యోగిగా; సమాజ వ్యవస్థాపకుడిగా, సమాజాన్ని విమర్శించే సమాజ విరుద్ధ కవిగా, లేదా పట్టణ వాతావరణంలో జీవించగలవాడిగా, పాలస్తీనాలో ఎంతో వేడిగాను పేదరికంతోను సామాజిక అలజడులతోను నిండివున్న వెనుకబడిన గ్రామాల్లో సంచరించేవాడిగా దృష్టిస్తారు.”

ఇంతకన్నా అసాధారణమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. యేసు నల్లగా ఉండేవాడన్న అభిప్రాయం రాప్‌ సంగీతంలో తరచూ వినిపిస్తోంది, నగర సంబంధ కళల్లోను, చివరికి నాట్యంలోను కనిపిస్తోంది. * కొందరైతే, నిజానికి యేసు ఒక స్త్రీ అని ఊహిస్తున్నారు. 1993వ సంవత్సరం వేసవి కాలంలో, కాలిఫోర్నియాలోని ఆరంజ్‌ కౌంటీ ఫెయిర్‌కు వచ్చిన సందర్శకులు, “క్రిస్టీ” అనే విగ్రహాన్ని, అంటే సిలువ మీద నగ్నంగా ఉన్న ఆడ “క్రీస్తు”ను చూశారు. అదే సమయంలో, న్యూయార్క్‌లో, సిలువపై వ్రేలాడదీయబడిన “క్రిస్ట” అనే ఆడ “యేసు” ప్రదర్శించబడింది. ఆరెండు విగ్రహాలూ వివాదాన్ని రేపడంలో వాటి వంతు అవి చేశాయి. 1999 తొలిభాగంలో, “బాల యేసు, ఏంజెల్‌ అనే కుక్క పరస్పరం పంచుకునే ప్రేమను గురించి చెప్పే” ఒక సంపుటి దుకాణదారులకు లభించింది. అందులో, వాళ్ళ మధ్యవున్న సంబంధం “ఆధ్యాత్మికంగా పురికొలిపేదిగా ఉందని, ఆబాలుడూ ఆబాలుని కుక్కా పరస్పరం తమ జీవితాలను త్యాగం చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నారో చూపిస్తుందని” వర్ణించబడింది.

నిజానికి అది అంత ప్రాముఖ్యమా?

యేసు అప్పుడెవరు, ఇప్పుడెవరు అన్న విషయంలో మీరెందుకాసక్తి చూపించాలి? ఒక కారణమేమిటో నెపోలియన్‌ మాటల్లో చెప్పాలంటే, “యేసు తన ప్రజల మధ్య దృశ్యముగా లేకపోయినప్పటికీ, ఆయన వారిని ప్రభావితం చేసి, వారిని శాసించాడు.” తన శక్తివంతమైన బోధల ద్వారా, తన జీవన విధానం ద్వారా, యేసు దాదాపు రెండు వేల సంవత్సరాలుగా కోట్ల మంది జీవితాలను శక్తివంతంగా ప్రభావితం చేశాడు. ఆయనతో పోల్చితే, “ఇంతవరకు కవాతుచేసిన సైన్యములన్నియు, నిర్మింపబడిన పెద్ద నౌకాబలములన్నియు, ఇంతవరకు సమావేశమైన పార్లమెంటులన్నియు, పరిపాలించిన రాజులందరు కలిసినా, ఈ భూమిమీది మనుష్యునిపై అంతటి శక్తివంతమైన ప్రభావమును చూపలేరు” అని ఒక రచయిత అన్నాడు. ఆయన అలా అనడం సరైనదే.

అంతేకాక, యేసు అప్పట్లో ఎవరు, ఇప్పుడెవరు అన్నది మీరు తెలుసుకోవలసిన అవసరముంది, ఎందుకంటే, ఆయన మీ భవిష్యత్తుపై సూటిగా ప్రభావం చూపిస్తాడు. సుస్థాపిత పరలోక ప్రభుత్వము క్రిందవుండే ప్రజలలో, అంటే యేసు క్రిందవుండే దేవుని రాజ్య ప్రజలలో ఒకరయ్యే అవకాశం మీకుంది. దుర్వినియోగం చేయబడుతున్న మన గ్రహంపై యేసు నిర్దేశం క్రింద మహిమాన్వితమైన జీవవైవిధ్యమూ, పర్యావరణ సమతుల్యతా తిరిగి ఏర్పడతాయి. యేసు రాజ్యం ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారాన్నిస్తుంది, పేదలపై శ్రద్ధ చూపిస్తుంది, రోగులను స్వస్థపరుస్తుంది, చనిపోయినవారిని తిరిగి జీవింపజేస్తుంది.

ఎంతో అవసరమైన అలాంటి ప్రభుత్వాన్ని పాలించే వ్యక్తి ఎలాంటివాడై ఉంటాడన్నది తెలుసుకోవాలని మీరు తప్పకుండా అనుకుంటారు. నిజమైన యేసును గురించి మీరు సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకు తర్వాతి ఆర్టికల్‌ మీకు సహాయపడుతుంది.

[అధస్సూచి]

^ పేరా 8 యేసు రూపాన్ని గురించి, తేజరిల్లు! డిసెంబరు 8, 1998 (ఆంగ్లం) సంచికలో “యేసు ఎలా ఉంటాడు?” అనే ఆర్టికల్‌ చూడండి.