కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక క్రైస్తవ భార్య దేవునిపట్ల యథార్థతనూ మతసంబంధమైన పండుగ కార్యాల్లో పాల్గొంటున్న అవిశ్వాసియైన భర్తపట్ల విధేయతనూ సమతుల్యంగా ఎలా చూపించగలదు?

అలా సమతుల్యతను చూపించడానికి ఆమెకు జ్ఞానము, నేర్పు అవసరం. ఆమె తన రెండు బాధ్యతల మధ్య సమతుల్యత కోసం పాటుపడడం సరైనదే. యేసు ఇలాంటి పరిస్థితిని గురించి సలహా ఇచ్చాడు: “ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మత్తయి 22:​21) ఆయన చెప్పింది ప్రభుత్వాలకు చూపించాల్సిన కర్తవ్యాల గురించేనన్నది నిజమే, ఆతర్వాత వాటికి క్రైస్తవులు లోబడి ఉండాలని చెప్పబడింది. (రోమీయులు 13:⁠1) కానీ, ఆయన సలహా ఒక భార్య తన భర్త అవిశ్వాసి అయినప్పటికీ అతనికి చూపించాలని లేఖనాలు చెప్పే విధేయతకు, దేవునికి చూపించాల్సిన విధేయతకూ మధ్య సమతుల్యతకు కూడా వర్తిస్తుంది.

ఒక క్రైస్తవుని/రాలి మొట్టమొదటి బాధ్యత సర్వశక్తిమంతుడైన దేవునికి అన్ని వేళలా యథార్థంగా ఉండడమని బైబిలు నొక్కి చెబుతోందన్న విషయాన్ని, దాంతో పరిచయమున్న వారెవరూ కాదనరు. (అపొస్తలుల కార్యములు 5:​29) కాని, ఒక నిజమైన ఆరాధకుడు/రాలు, అధికారంలో ఉన్న ఒక అవిశ్వాసి కోరికలను లేక అధికారంతో అడిగేవాటిని దేవుని ఉన్నతమైన నియమాలను అతిక్రమించనంత వరకు అనేక పరిస్థితుల్లో మన్నించవచ్చు.

దానియేలు 3వ అధ్యాయంలో పేర్కొన్న ముగ్గురు హెబ్రీయుల్లో మనకు ఒక ఉపదేశాత్మకమైన మాదిరి కనబడుతుంది. అక్కడ వారి ప్రభుత్వ అధికారి నెబుకద్నెజరు, ఆయన ఆముగ్గురితోపాటు ఇతరులూ దూరా మైదానములో హాజరు కావాలని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అందులో అబద్ధ ఆరాధన ఉందని గ్రహించిన ఈముగ్గురు హెబ్రీయులు అక్కడికి వెళ్ళకుండా తప్పించుకోవాలని ప్రయత్నించివుంటారు. బహుశా దానియేలు తప్పించుకోగలిగాడు, కాని ఈముగ్గురికి వీలు కాలేదు. * అందుకే వాళ్ళు అక్కడ హాజరుకావాలనే ఆజ్ఞకు లోబడాల్సివచ్చింది, కానీ ఎటువంటి తప్పుడు చర్యలోను పాల్గొనకూడదు అనుకున్నారు, పాల్గొనలేదు కూడా.​—⁠దానియేలు 3:1-18.

అదేవిధంగా, ఒక క్రైస్తవ భార్య ఏవైతే తను చేయకుండా తప్పించుకోవాలని అనుకుంటుందో అలాంటివి చేయమని పండుగ సమయాల్లో అవిశ్వాసియైన ఆమె భర్త కోరవచ్చు లేక అధికారంతో అడగవచ్చు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి: ఆయన, మరితరులు కలిసి చేసుకునే పండుగకు ప్రత్యేకమైన ఒక వంటను చేయమని చెబుతాడు. లేదా ఆయన కుటుంబసమేతంగా (తన భార్యతోపాటు) ఆరోజు తన బంధువుల ఇంటికి భోజనానికి వెళ్దామనో లేక ఊరకే కలిసివద్దామనో అడుగుతాడు. లేదా పండుగకు ముందు, తన భార్య ఏవైనా సామాన్లు కొనుక్కురావడానికి బజారుకు వెళ్ళినప్పుడు పండుగకు సంబంధించిన కొన్ని తినుబండారాలు, బహుమతులుగా ఇచ్చే వస్తువులు లేక వాటితో ఉపయోగించడానికి ప్యాక్‌ చేసే రాపింగ్‌ పేపర్‌, గ్రీటింగ్‌ కార్డుల్లాంటివి కొనుక్కురమ్మని ఆయన చెప్పవచ్చు.

ఇక్కడ మళ్ళీ, క్రైస్తవ భార్య అబద్ధ మత కార్యాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది, కాని అలా అడిగినప్పుడు ఏమి చేయాలి? ఆయన కుటుంబ శిరస్సు, “భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది” అని దేవుని వాక్యం కూడా చెబుతోంది. (కొలొస్సయులు 3:​18) ఇలాంటి విషయాల్లో ఆమె దేవునికి యథార్థంగా ఉంటూ తన భర్తకు విధేయత చూపించగలదా? ఆమె తన భర్తకు విధేయత చూపించడంలో దానికన్నా ప్రాముఖ్యమైనదైన యెహోవాకు చూపించాల్సిన విధేయతను అతిక్రమించకుండా సమతుల్యతగా ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.

ఇతర సమయాల్లో ఆమె భర్త ఆమెను ఒకానొక ప్రత్యేక వంట చేయమని అడుగుతుండవచ్చు, అది ఆయనకు ఇష్టమైన వంట కావచ్చు లేదా కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో తినే అలవాటున్న వంట కావచ్చు. ఆమె తన ప్రేమను, శిరస్సత్వానికి విధేయతను చూపించాలనే కోరుకుంటుంది. ఆయన అదే వంటను పండుగ రోజున చేయమని అడిగినప్పుడు కూడా ఆమె చేయవచ్చా? కొందరు క్రైస్తవ భార్యలు అది మామూలుగా ప్రతిరోజు వండుకునే వంటల్లాంటిదే అనే భావంతో మంచి మనస్సాక్షితో చేస్తారు. అవును, అటువంటి వంటకు తన భర్త ఏదైనా పండుగ సూచనను జోడించినా, ఒక యథార్థ క్రైస్తవురాలు మాత్రం అలాంటిదేమీ చేయదు. అదేవిధంగా, ఆయన పలు సందర్భాల్లో తన బంధువులను కలవడానికి ప్రతి నెలా లేక ప్రతి సంవత్సరం తనతోపాటు రమ్మని ఆమెను అడుగుతుండవచ్చు. అలా వెళ్ళేది పండుగ రోజైనా ఆమె ఆయనతో వెళ్ళవచ్చా? లేక బజారునుండి ఆయన కోరిన వస్తువులను ఆయన వాటిని ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తాడో అని తీర్మానించకుండా తీసుకెళ్ళవచ్చా?

ఒక క్రైస్తవ భార్య ఇతరులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందని తప్పకుండా ఆలోచించాలి. (ఫిలిప్పీయులు 2:⁠4) ముగ్గురు హెబ్రీయులు దూరా మైదానమునకు వెళ్ళేటప్పుడు ఇతరులు తమను చూడకూడదని బహుశ ఎలా అనుకున్నారో అలాగే ఆమె పండుగలో పాల్గొన్నట్లు అనిపించే ఎటువంటి సూచనను ఇవ్వడానికి ఇష్టపడదు. అలాంటప్పుడు ఆమె, తన భర్త తనను ప్రేమించే, గౌరవించే భార్యగా గుర్తించి తన భావాలను పరిగణలోకి తీసుకుని అలాంటి పండుగకు సంబంధించిన పనులు తనే స్వయంగా చేసుకునేలా ఆమె చాలా నేర్పుగా ఆయనతో తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఆమె అలా అబద్ధ మత కార్యాల్లో పాల్గొనడానికి నిరాకరించినప్పుడు, ఆమెను బలవంతం చేసి ఇరువురూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడకుండా ఉండడమే మంచిది అని ఆయన అర్థం చేసుకోగలడు. అవును, ప్రశాంతంగా ముందుగానే చర్చించుకుంటే అది, శాంతియుతమైన పరిష్కారానికి నడిపిస్తుంది.​—⁠సామెతలు 22:⁠3.

చివరిగా, ఒక యథార్థ క్రైస్తవురాలు విషయాలను బాగా ఆలోచించిన తర్వాతే ఏమి చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ముగ్గురు హెబ్రీయులకు ఉన్నట్లు మొదటి స్థానం దేవుని విధేయతకే ఉండాలి. (1 కొరింథీయులు 10:​31) అది మనసులో పెట్టుకొని, అధికారంలో ఉన్న కుటుంబ పెద్దేగానీ, సమాజంలోని పెద్దేగానీ అడిగిన దాన్ని నెరవేర్చడంలో రాజీపడని విషయాలు ఏవో వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.

[అధస్సూచి]

^ పేరా 5 ఆగస్టు 1, 2001, కావలికోటలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.