నిజ క్రైస్తవులందరు మంచి సందేశాన్ని అందిస్తారు
నిజ క్రైస్తవులందరు మంచి సందేశాన్ని అందిస్తారు
“యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.” —కీర్తన 96:2.
1. ప్రజలు ఎలాంటి శుభ వార్తను వినాల్సిన అవసరం ఉంది, అలాంటి వార్తను వ్యాపింప చేయడంలో యెహోవాసాక్షులు ఎలా మాదిరికరంగా ఉన్నారు?
రోజురోజుకూ ఘోరమైన దుర్ఘటనలు అధికమవుతున్న ఈ ప్రపంచంలో యుద్ధాలు, నేరాలు, ఆకలిబాధలు, అణచివేతలు త్వరలోనే అంతమవుతాయని బైబిలు ప్రకటిస్తోందని తెలుసుకోవడం నిజంగా ఓదార్పుకరం. (కీర్తన 46:9; 72:3, 7, 8, 12, 16) ఇది నిజంగానే ప్రతి ఒక్కరు వినాల్సిన శుభ వార్త కాదా? అవునని యెహోవాసాక్షులు తలస్తున్నారు. వారు “సువర్తమానము ప్రకటించు” ప్రజలుగా ప్రపంచమంతటా పేరుగాంచారు. (యెషయా 52:7) నిజమే, అనేకమంది సాక్షులు ఇతరులకు మంచి సందేశాన్ని చెప్పాలన్న తమ దృఢ సంకల్పం మూలంగా ఎన్నో హింసలను అనుభవించారు. అయినప్పటికీ ప్రజలకు మేలు తలపెట్టాలన్నదే వారి మనోభిలాష. వారు చూపించే ఆసక్తి, పట్టుదలల విషయంలో వారెంత చక్కని పేరు సంపాదించుకున్నారో కదా!
2. యెహోవాసాక్షులు చూపించే ఆసక్తికి ఒక కారణం ఏమిటి?
2 నేడు యెహోవాసాక్షులు చూపిస్తున్న ఆసక్తి మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల ఆసక్తికి సమాంతరంగా ఉంది. వారిని గురించి క్యాథలిక్ వార్తాపత్రిక లోసేర్వాటోరే రోమానో ఇలా చెప్పడం సముచితమే: “తొలి క్రైస్తవులు బాప్తిస్మం పొందిన వెంటనే సువార్తను వ్యాప్తి చేయడం తమ కర్తవ్యంగా భావించారు. దేవుని దాసులు మౌఖికంగా సువార్తను విస్తరింపజేశారు.” ఆ తొలి క్రైస్తవుల్లాగే యెహోవాసాక్షులు ఎందుకు అంత ఆసక్తిని కలిగివున్నారు? మొదటిగా, వారు ప్రకటించే సువార్త, అంటే మంచి సందేశం స్వయంగా యెహోవా దేవుని నుండి వచ్చినది. వారి ఆసక్తికి అంతకన్నా గొప్ప కారణం మరేదైనా ఉండగలదా? వారి ప్రకటనా పని కీర్తనకర్త అందించిన ఈ ఆహ్వానానికి ప్రతిస్పందన: “యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.”—కీర్తన 96:2.
3. (ఎ) యెహోవాసాక్షులు చూపించే ఆసక్తికిగల రెండవ కారణం ఏమిటి? (బి) ‘దేవుని రక్షణ’లో ఏమి ఇమిడివుంది?
3 కీర్తనకర్త మాటలు, యెహోవాసాక్షులు చూపించే ఆసక్తికిగల రెండవ కారణాన్ని మనకు గుర్తుచేస్తాయి. అదేమిటంటే వారు చెప్పేది రక్షణ సందేశం. కొందరు ప్రజలు వైద్యరంగంలో, సామాజిక రంగంలో, ఆర్థికరంగంలో, లేదా మరితర రంగాల్లో సేవచేస్తూ సర్వజనోద్ధరణకు పాటుపడుతుంటారు, వారి కృషి ప్రశంసనీయమే. కానీ ఒక మనిషి మరో మనిషికి చేయగలిగేదేదైనా ‘దేవుని రక్షణ’తో పోలిస్తే చాలా స్వల్పమే. యెహోవా యేసుక్రీస్తు ద్వారా సాత్వికులను పాపం నుండి, వ్యాధుల నుండి, మరణం నుండి రక్షిస్తాడు. ఆ రక్షణను పొందేవారు నిరంతరం జీవిస్తారు! (యోహాను 3:16, 36; ప్రకటన 21:3, 4) ‘అన్యజనులలో [దేవుని] మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు’ అన్న మాటలకు ప్రతిస్పందనగా క్రైస్తవులు ప్రచురించే ‘ఆశ్చర్యకార్యాల్లో’ రక్షణ సందేశం కూడా ఉంది.—కీర్తన 96:3, 4.
యజమాని మాదిరి
4-6. (ఎ) యెహోవాసాక్షులు ఆసక్తిని కనపరచడానికిగల మూడవ కారణం ఏమిటి? (బి) ఒక మంచి సంగతిని గురించి మాట్లాడడానికి యేసు ఎలా ఆసక్తిని కనపర్చాడు?
4 యెహోవాసాక్షులు ఆసక్తిని చూపించడానికి మూడవ కారణం, వారు యేసుక్రీస్తు మాదిరిని అనుకరించడం. (1 పేతురు 2:21) ఆ పరిపూర్ణ పురుషుడు ‘దీనులకు సువర్తమానము ప్రకటించాలనే’ నియామకాన్ని పూర్ణహృదయంతో స్వీకరించాడు. (యెషయా 61:1; లూకా 4:17-21) అలా ఆయన సువార్తికుడయ్యాడు, అంటే మంచి సందేశాన్ని చెప్పేవాడయ్యాడు. ఆయన “రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు” గలిలయ యూదయ ప్రాంతాలన్నింటిలోను సంచరించాడు. (మత్తయి 4:23) ఆ సువార్తకు, అంటే మంచి సందేశానికి అనేకమంది ప్రతిస్పందిస్తారని ఆయనకు తెలుసు గనుకనే తన శిష్యులతో ఇలా అన్నాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.”—మత్తయి 9:37, 38.
5 తన ప్రార్థనకు అనుగుణంగా యేసు ప్రకటించేవారిగా కావడానికి ఇతరులకు శిక్షణనిచ్చాడు. కొంతకాలం తర్వాత తను వెళ్ళకుండా అపొస్తలులను మాత్రమే పంపిస్తూ, ‘[మీరు] వెళ్లుచు—పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటించుడి’ అని చెప్పాడు. వారు అలా ప్రకటించడానికి బదులుగా, ఆ కాలంలోని సాంఘిక దురాచారాల్ని రూపుమాపే ప్రయత్నంలో వివిధ సంఘ సేవా కార్యక్రమాలను చేపట్టడం ఇంకా ఆచరణాత్మకమైనదిగా ఉండేదంటారా? లేక, అప్పట్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోన్న అవినీతికి విరుద్ధంగా పోరాడడానికి వారు రాజకీయాల్లో చేరాల్సిందంటారా? లేదు. బదులుగా యేసు తన అనుచరులతో, ‘మీరు వెళ్ళుచు ప్రకటించుడి’ అని చెప్పినప్పుడే క్రైస్తవ సువార్తికులందరికి ఒక ప్రమాణాన్ని ఏర్పరిచాడు.—మత్తయి 10:5-7.
6 అటు తర్వాత కొంతకాలానికి, “దేవుని రాజ్యము . . . దగ్గరకు వచ్చియున్నదని” ప్రకటించేందుకు మరి కొంతమంది శిష్యులను యేసు పంపించాడు. వారు తమ సువార్త ప్రకటనా పర్యటన నుండి తిరిగి వచ్చి తాము సాధించిన విజయాలను గురించి నివేదించినప్పుడు యేసు అత్యానందభరితుడయ్యాడు. ఆయనిలా ప్రార్థించాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (లూకా 10:1, 8, 9, 21) జాలరులు రైతులు వంటి శ్రామిక ప్రజలుగా ఉండిన యేసు శిష్యులు, ఉన్నత విద్యను అభ్యసించిన ఆ జనాంగపు మత నాయకులతో పోలిస్తే పసిబాలురే. కానీ ఆ శిష్యులకు శుభ వార్తల్లోకెల్లా అత్యంత ఆనందాన్నిచ్చే శుభ వార్తను గురించి మాట్లాడడానికి శిక్షణనివ్వబడింది.
7. యేసు పరలోకానికి ఆరోహణం అయ్యాక ఆయన శిష్యులు మంచి వార్తను మొదట ఎవరికి తెలియజేశారు?
7 యేసు పరలోకానికి ఆరోహణమయ్యాక ఆయన అనుచరులు రక్షణను గూర్చిన చక్కని సమాచారాన్ని వ్యాపింపజేస్తూనే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 2:21, 38-40) వారు మొదట ఎవరికి ప్రకటించారు? దేవుడినెరగని అన్యజనుల దగ్గరికి వెళ్ళారా? లేదు, 15 శతాబ్దాలకు పైగా యెహోవాను ఎరిగిన ఇశ్రాయేలు జనాంగమే వారి తొలి క్షేత్రం. అయితే అప్పటికే యెహోవా ఆరాధన జరుగుతూ ఉన్న దేశంలో ప్రకటించే హక్కు వారికి ఉందా? ఉంది. “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” యేసు వారితో చెప్పాడు. (అపొస్తలుల కార్యములు ) వేరే జనాంగాల వలెనే ఇశ్రాయేలు జనాంగం కూడా మంచి వార్తను వినాల్సిన అవసరం ఉంది. 1:8
8. నేడు యెహోవాసాక్షులు మొదటి శతాబ్దపు యేసు అనుచరులను ఎలా అనుకరిస్తారు?
8 అదే విధంగా నేడు యెహోవాసాక్షులు మంచి విషయాలను భూవ్యాప్తంగా తెలియజేస్తున్నారు. ‘భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచున్న’ యోహాను చూసిన దూతతో వారు సహకరిస్తున్నారు. (ప్రకటన 14:6) 2001వ సంవత్సరంలో వారు 235 దేశాల్లో, ప్రాంతాల్లో క్రియాత్మకంగా పని చేస్తున్నారు; వీటిలో కొన్ని క్రైస్తవ దేశాలుగా కూడా పరిగణించబడుతున్నాయి. క్రైస్తవమత సామ్రాజ్యం అప్పటికే తన చర్చీలను స్థాపించిన ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ప్రకటించడం తప్పా? తప్పని కొందరంటారు, అలాంటి ప్రకటనా పని తమ చర్చి సభ్యులను “దొంగిలించడం” వంటిదని కూడా అంటారు. అయితే యేసు కాలంలోని నమ్రతగల యూదులపట్ల ఆయనకుగల భావాలను యెహోవాసాక్షులు గుర్తు చేసుకుంటారు. ఆ యూదులకు అప్పటికే యాజకత్వం ఉన్నా వారికి మంచి వార్తను ప్రకటించడానికి యేసు సంకోచించలేదు. ఆయన ‘సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడ్డాడు.’ (మత్తయి 9:36) యెహోవాను గురించి ఆయన రాజ్యాన్ని గురించి తెలియని ప్రజలను యెహోవాసాక్షులు కలిసినప్పుడు, వారిపై వేరే ఏదో మతం అధికారం కలిగివున్నంత మాత్రాన వారికి మంచి వార్తను చెప్పడం మానేయాలా? యేసు అపొస్తలుల మాదిరిని అనుకరిస్తూ మనం వారికి తప్పకుండా చెప్పాలనే జవాబిస్తాము. ఎలాంటి మినహాయింపూ లేకుండా మంచి సందేశాన్ని “సకల జనములకు” చెప్పాలి.—మార్కు 13:10.
తొలి క్రైస్తవులందరూ ప్రకటించారు
9. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో ప్రకటనా పనిలో ఎవరు పాల్గొన్నారు?
9 మొదటి శతాబ్దపు ప్రకటనా పనిలో ఎవరు పాల్గొన్నారు? క్రైస్తవులందరూ సువార్త పని చేశారని ఆధారాలు చూపిస్తున్నాయి. డబ్ల్యు. ఎస్. విలియమ్స్ అనే రచయిత ఇలా అంటున్నాడు: “తొలి చర్చిలోని క్రైస్తవులందరూ . . . సువార్తను ప్రకటించారని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి.” సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తు రోజున జరిగిన సంఘటనల గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘అందరు [స్త్రీలు పురుషులు] పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.’ ఆ ప్రచారకుల్లో స్త్రీలు పురుషులు, పిన్నలు పెద్దలు, దాసులు స్వతంత్రులు అందరూ ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 1:14; 2:1, 4, 17, 18; యోవేలు 2:28, 29; గలతీయులు 3:28) హింసల మూలంగా అనేకమంది క్రైస్తవులు యెరూషలేము నుండి పారిపోవలసి వచ్చింది, అలా “చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 8:4) ఏదో నియమించబడిన కొద్దిమంది మాత్రమే కాక “చెదరిపోయిన” వారందరూ ప్రకటించారు.
10. యూదా విధానం నాశనం కావడానికి ముందు ఏ రెండు పార్శ్వాల నియామకం నెరవేరింది?
10 ఆ ప్రారంభ సంవత్సరాలన్నింటిలోను అలానే జరిగింది. యేసు ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) ఆ మాటల తొలి నెరవేర్పుగా, మొదటి శతాబ్దంలో రోమా సైన్యాలు యూదుల మత విధానాన్ని రాజకీయ విధానాన్ని నాశనం చేయడానికి ముందే సువార్త విస్తృతంగా ప్రకటించబడింది. (కొలొస్సయులు 1:23) ప్రకటించడమే కాక యేసు అనుచరులందరూ ఆయనిచ్చిన ఈ ఆజ్ఞను కూడా శిరసావహించారు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) తొలి క్రైస్తవులు, యేసునందు నమ్మకముంచమని సాత్వికులకు ఉద్బోధ చేసిన తర్వాత ఇక ఎలాంటి నడిపింపూ ఇవ్వకుండా వారి మానాన వారిని విడిచిపెట్టేయలేదు; నేడు కొందరు చర్చి బోధకులు చేస్తున్నదదే. దానికి బదులుగా, ఇతరులు యేసు శిష్యులయ్యేందుకు వారికి బోధించి, వారిని సంఘాలుగా సంస్థీకరించి, వారు మళ్ళీ ఇతరులకు శుభ వార్తను చెప్పి, ఆ ఇతరులను శిష్యులను చేసేలా వారికి శిక్షణనిచ్చారు. (అపొస్తలుల కార్యములు 14:21-23) నేడు యెహోవాసాక్షులు ఆ పద్ధతినే పాటిస్తున్నారు.
11. శుభ వార్తలన్నింటికన్నా అత్యంత ఆనందాన్నిచ్చే శుభ వార్తను నేడు మానవాళికి ఎవరు తెలియజేస్తున్నారు?
11 అనేకమంది యెహోవాసాక్షులు, మొదటి శతాబ్దంలోని పౌలు, బర్నబా, మరితరుల మాదిరులను అనుకరిస్తూ విదేశాల్లో జీవిస్తూ ప్రకటించడానికి వెళ్ళారు. వారి పని నిజంగానే ఎంతో ప్రయోజనకరంగా ఉంది, ఎందుకంటే వారు రాజకీయాల్లో తలదూర్చనూలేదు, మంచి వార్తను గురించి చెప్పాలన్న నియమాకం నుండి వేరే విధాలుగా తొలగిపోవనూలేదు. ‘మీరు వెళ్ళుచు ప్రకటించుడి’ అన్న యేసు ఆజ్ఞను వారు పాటించారు అంతే. అయితే యెహోవాసాక్షుల్లో అత్యధికులు విదేశాల్లో ప్రకటించడంలేదు. వారిలో చాలామంది బ్రతుకుతెరువు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొందరైతే ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు పిల్లల్ని పోషించుకుంటున్నారు. అయినప్పటికీ, సాక్షులందరూ తాము తెలుసుకున్న మంచి వార్తను ఇతరులతో పంచుకుంటారు. స్త్రీలు పురుషులు, పిన్నలు పెద్దలు అందరూ బైబిలులోని ఈ ఉద్బోధకు ఆనందంగా ప్రతిస్పందిస్తారు: “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము.” (2 తిమోతి 4:2) తొలి శతాబ్దంలోనివారివలె వీరు కూడా ‘ప్రతిదినము . . . మానక బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ’ ముందుకుసాగుతారు. (అపొస్తలుల కార్యములు 5:42) వారు మానవాళికి శుభ వార్తలన్నింటికన్నా అత్యంత ఆనందాన్నిచ్చే శుభ వార్తను తెలియజేస్తున్నారు.
సంతోషకరమైన సందేశమా లేక బలవంత మతమార్పిడా?
12. నేడు అనేకమంది ప్రకటించడాన్ని, ఒకరి మతం మార్చడాన్ని తప్పుగా ఎందుకు దృష్టిస్తారు?
12 ఈరోజుల్లో ప్రకటించడము, మతమార్పిడి చేయడము అన్న మాటలపట్ల ప్రజల మనస్సుల్లో ప్రతికూలమైన భావాలున్నాయి. ఒక వ్యక్తి తన మతం మార్చుకోవడమూ లేదా, ఇతరులు తమ విశ్వాసాలను స్వీకరించేలా చేసేందుకు వారికి ప్రకటించడమూ పాపమని కొందరు భావిస్తారు. వారలా భావించడానికి ప్రాధమికంగా వారి మనస్సుల్లో బలవంతపు మతమార్పిళ్ళు ఉండడమే కారణం.
13. మత మార్పిడి హానికరమని చూపించే కొన్ని ఉదాహరణలు ఏవి?
13 మతమార్పిళ్ళు చేయడం తప్పా? తప్పయ్యే అవకాశం ఉంది. శాస్త్రులు పరిసయ్యులు మతమార్పిళ్ళు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినా అది వారి ప్రయోజనార్థం కాదని యేసు చెప్పాడు. (మత్తయి 23:15) “బలవంతపు మతమార్పిళ్లు” నిశ్చయంగా తప్పే. ఉదాహరణకు, చరిత్రకారుడైన జోసీఫస్ చెబుతున్నదాని ప్రకారం మక్కబీయుడైన జాన్ హిర్కేనస్ ఇదూమీయులను ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత “వారు తమ పిల్లలకు సున్నతి చేయించి, యూదుల నియమాలను పాటించడానికి ఇష్టపడినంత కాలం వారిని తన దేశంలో ఉండనిచ్చాడు.” ఇదూమీయులు యూదుల పరిపాలన క్రింద జీవించాలంటే వారు యూదా మతాన్ని పాటించాల్సిందే. సా.శ. ఎనిమిదవ శతాబ్దంలో షార్లిమాన్ ఉత్తర యూరప్‌లోని క్రైస్తవులుకాని శాక్సన్‌లను జయించి, వారిని క్రూరాతి క్రూరంగా బలవంతపెట్టి మతం మార్పించాడని చరిత్రకారులు మనకు చెబుతారు. * అయితే శాక్సన్‌లే గాని ఇదూమీయులే గాని మతమార్పిళ్ళు జరిగిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నారు? ఉదాహరణకు శిశువుగా ఉన్న యేసును హత్య చేయించడానికి ప్రయత్నించిన ఇదూమీయ రాజైన హేరోదుకు, దైవ ప్రేరేపితమైన మోషే ధర్మశాస్త్రంపట్లగల భక్తి నిష్ఠలు ఎంతవరకు యథార్థం?—మత్తయి 2:1-18.
14. క్రైస్తవమత సామ్రాజ్యపు మిషనరీలు కొందరు, ప్రజలు మతమార్పిడి చేయించుకునేలా ఎలా బలవంతపెట్టారు?
14 నేడు ప్రజలు తమ మతం మార్చుకునేలా బలవంతపెట్టబడుతున్నారా? ఒక విధంగా చెప్పాలంటే కొందరి విషయంలో అలా జరుగుతోంది. క్రైస్తవమత సామ్రాజ్యపు మిషనరీలు కొందరు, ఎవరైనా మతం మార్చుకునే అవకాశం ఉందనిపించినప్పుడు వారికి విదేశాల్లో చదువుకోవడానికి సహాయం చేశారన్న నివేదికలు ఉన్నాయి. లేక, కొందరు మిషనరీలు, ఆకలితో అలమటిస్తున్న ఒక శరణార్థికి రేషన్‌లో ఆహారాన్ని ఇవ్వడానికి ముందు బైబిలు బోధ చేస్తుండవచ్చు. ఆర్థడాక్స్ బిషప్పులు 1992 లో జరుపుకున్న ఒక సమావేశంలో జారీచేసిన ఒక ప్రకటన ప్రకారం “కొన్నిసార్లు వస్తుసంపదల ఆశ చూపించడం ద్వారా మతమార్పిడులు జరుగుతున్నాయి, కొన్నిసార్లు వివిధరకాల హింసాత్మక చర్యల ద్వారా కూడా అవి జరుగుతున్నాయి.”
15. యెహోవాసాక్షులు ఎవరినైనా మతం మార్చుకోవడానికి ఒత్తిడిగానీ, బలవంతంగానీ చేస్తారా?
15 మతం మార్చుకునేలా ప్రజలను బలవంతపెట్టడమన్నది తప్పు. యెహోవాసాక్షులు నిశ్చయంగా అలా చేయరు. * వారు తమ అభిప్రాయాలను ఎన్నడూ ఎవరిపైనా రుద్దరు. బదులుగా వారు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లా మంచి సందేశాన్ని అందరికీ చెబుతారు. ఇష్టపూర్వకంగా ముందుకువచ్చినవారిని బైబిలు అధ్యయనం ద్వారా మరింత పరిజ్ఞానాన్ని పొందమని ఆహ్వానిస్తారు. అలా ఆసక్తిని వ్యక్తం చేసినవారు ఖచ్చితమైన బైబిలు పరిజ్ఞానం ఆధారంగా దేవునిపైనా ఆయన సంకల్పాలపైనా విశ్వాసాన్ని ఉంచడం నేర్చుకుంటారు. తత్ఫలితంగా వాళ్ళు రక్షణ కోసం దేవుడైన యెహోవా నామమునుబట్టి ప్రార్థిస్తారు. (రోమీయులు 10:13, 14, 17) వినేవారు సువార్తను స్వీకరిస్తారా లేదా అన్నది వారి వ్యక్తిగత నిర్ణయమే. అందులో బలవంతం ఏమీ లేదు. ఒకవేళ బలవంతం ఉంటే ఇక మతమార్పిడి అన్నది అర్థరహితం అవుతుంది. దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఆరాధన హృదయంలోనుండి రావాలి.—ద్వితీయోపదేశకాండము 6:4, 5; 10:12.
ఆధునిక కాలాల్లో అందించే చక్కని సమాచారం
16. యెహోవాసాక్షుల ప్రకటనా పని ఈ ఆధునిక కాలాల్లో ఎలా పెరిగింది?
16 ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు మత్తయి 24:14వ వచనాన్ని మహోన్నతమైన రీతిలో నెరవేరుస్తూ రాజ్యాన్ని గురించిన మంచి వార్తను ఇతరులకు చెబుతున్నారు. వారి పనిలో ఒక ప్రధానమైన ఉపకరణం కావలికోట పత్రిక. * కావలికోట (ఆంగ్లం) పత్రిక తొలి సంచికలు 1879 లో ముద్రించబడినప్పుడు దాని పంపిణీ ఒక్క భాషలో దాదాపు 6,000 ప్రతులు. 122 సంవత్సరాలకుపైగా గడిచిన తర్వాత, అంటే 2001వ సంవత్సరంలో దాని పంపిణీ 141 భాషల్లో 2,30,42,000 కాపీలకు చేరుకుంది. యెహోవాసాక్షుల ప్రకటనా పని కూడా ఆ పెరుగుదలతో పాటే సమానంగానే ఉంది. 19వ శతాబ్దంలో ప్రకటనా పని చేస్తూ ఒక సంవత్సరంలో వెచ్చించబడిన కేవలం కొన్ని వేల గంటలను 2001వ సంవత్సరంలో వెచ్చించబడిన 116,90,82,225 గంటలతో పోల్చిచూడండి. ఆ సంవత్సరంలోనే సగటున ప్రతి నెల నిర్వహించబడిన 49,21,702 ఉచిత బైబిలు అధ్యయనాల గురించి ఆలోచించండి. ఎంత భారీ ఎత్తున పని నెరవేర్చబడింది! ఇదంతా 61,17,666 మంది క్రియాశీల రాజ్య ప్రచారకులచే చేయబడింది.
17. (ఎ) నేడు ఎలాంటి అబద్ధ దేవుళ్ళు ఆరాధించబడుతున్నాయి? (బి) భాష ఏదైనా, దేశమేదైనా, లేదా సమాజంలో హోదా ఏదైనా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినదేమిటి?
17 కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “జనముల దేవతలందరు వట్టి విగ్రహములే; యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.” (కీర్తన 96:5) లౌకికవాదం ప్రబలంగా ఉన్న నేటి లోకంలో జాతీయవాదము, జాతీయ చిహ్నాలు, ప్రసిద్ధ వ్యక్తులు, వస్తు సంపదలు, చివరికి సిరి సంపదలు కూడా ఆరాధనా వస్తువులుగా చేయబడ్డాయి. (మత్తయి 6:24; ఎఫెసీయులు 5:5; కొలొస్సయులు 3:5) మోహన్‌దాస్ కె. గాంధీ ఒకసారిలా అన్నాడు: “యూరప్ దేశాలు నేడు నామకార్థ క్రైస్తవత్వాన్నే ఆచరిస్తున్నాయన్నది నా దృఢమైన అభిప్రాయం. అవి నిజానికి మమ్మోనును (సిరిసంపదలను) ఆరాధిస్తున్నాయి.” నిజానికి చెప్పాలంటే శుభ వార్తను వినాల్సిన అవసరం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. భాష ఏదైనా, దేశమేదైనా, లేదా సమాజంలో హోదా ఏదైనా, ప్రతి ఒక్కరు యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కీర్తనకర్త మాటలకు ప్రతిస్పందిస్తారని మేము ఆశిస్తున్నాము: “యెహోవాకు చెల్లించుడి, మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి.” (కీర్తన 96:7, 8) ప్రజలు, యెహోవాకు తగిన విధంగానే మహిమను చెల్లించగలిగేలా ఆయన గురించి తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు వారికి సహాయం చేస్తారు. ఆ సహాయానికి ప్రతిస్పందించినవారు ఎంతగానో ప్రయోజనం పొందుతారు. అవి ఎలాంటి ప్రయోజనాలు? తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
^ పేరా 13 ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం సంస్కరణోద్యమ కాలంలో ఏదైనా జనాంగంపై బలవంతంగా మతాన్ని రుద్దడం అన్నది ఈ నినాదంలో వ్యక్తం చేయబడింది: కూయుస్ రెగ్యో, ఇల్లియుస్ ఎట్ రెలీగ్యో (దీనికి క్లుప్తంగా “దేశాన్ని ఎవరు పరిపాలిస్తారో వారే దాని మతాన్ని కూడా నిర్ణయిస్తారు” అని అర్థం.)
^ పేరా 15 2000వ సంవత్సరం నవంబరు 16న జరిగిన సంయుక్త రాష్ట్రాల అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమీషన్ సమావేశంలో పాల్గొన్న ఒక వ్యక్తి, బలవంతంగా మతమార్పిళ్ళు చేయడానికి ప్రయత్నించే వారికి యెహోవాసాక్షుల కార్యకలాపాలకు తేడా ఉందని పేర్కొన్నాడు. యెహోవాసాక్షులు ఇతరులకు ప్రకటించేటప్పుడు, అవతలి వ్యక్తి ఒక్క ముక్కలో “నాకు ఆసక్తి లేదండీ” అని చెప్పి తలుపులు వేసుకోవచ్చు అని అక్కడ వ్యాఖ్యానించబడింది.
^ పేరా 16 ఈ పత్రిక పూర్తిపేరు కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది
మీరు వివరించగలరా?
• యెహోవాసాక్షులు శుభ వార్తను ఆసక్తిగా ఎందుకు తెలియజేస్తున్నారు?
• క్రైస్తవమత సామ్రాజ్యం తన చర్చీలను స్థాపించిన ప్రాంతాల్లో కూడా యెహోవాసాక్షులు ఎందుకు ప్రకటిస్తారు?
• మతమార్పిళ్ళు చేసే అనేక మందికి యెహోవాసాక్షులు ఎలా వేరుగా ఉన్నారు?
• ఆధునిక కాలాల్లో చక్కని సమాచారాన్ని అందించే యెహోవాసాక్షుల పని ఎలా అభివృద్ధి అయ్యింది?
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
యేసు అత్యంతాసక్తిగల ప్రచారకుడు, ఆయన అదే పనిని చేయడానికి ఇతరులకు శిక్షణనిచ్చాడు
[10వ పేజీలోని చిత్రం]
మొదటిశతాబ్దపు సంఘంలో అందరూ ప్రకటనా పనిలో పాల్గొన్నారు
[11వ పేజీలోని చిత్రం]
ప్రజలు తమ మతం మార్చుకునేలా బలవంతపెట్టడం తప్పు