పెద్దలారా భారాన్ని మోసేందుకు ఇతరులకు శిక్షణనివ్వండి
పెద్దలారా భారాన్ని మోసేందుకు ఇతరులకు శిక్షణనివ్వండి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో పైవిచారణా స్థానాల్లో సేవచేయడానికి పురుషుల అవసరత ఎంతో ఉంది. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలున్నాయి.
మొదటిది, “ఎన్నికలేనివాడు బలమైన జనమగును” అని తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా నెరవేరుస్తున్నాడు. (యెషయా 60:22) ఆయన కృపాతిశయం మూలంగానే గత మూడు సంవత్సరాల్లో దాదాపు పది లక్షల మంది బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులయ్యారు. క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారు క్రైస్తవ పరిణతికి ఎదిగేలా సహాయం చేయడానికి బాధ్యతగల పురుషుల అవసరం చాలా ఉంది.—హెబ్రీయులు 6:1.
రెండవది, దశాబ్దాలపాటు పెద్దలుగా సేవచేసిన కొందరు వృద్ధాప్యం మూలంగా లేదా ఆరోగ్య కారణాల మూలంగా సంఘంలో తాము చేస్తున్న పని భారాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాల్సివస్తుంది.
మూడవది, ఆసక్తితో సేవచేస్తున్న క్రైస్తవ పెద్దలు అనేకమంది ఇప్పుడు ఆసుపత్రి అనుసంధాన కమిటీలు, రీజనల్ బిల్డింగ్ కమిటీలు, లేదా సమావేశ హాలు కమిటీల సభ్యులుగా సేవచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు సమతుల్యతను కలిగివుండడానికి తమ సంఘాల్లో కనీసం కొన్ని బాధ్యతలను వదులుకుంటున్నారు.
అధికమవుతున్న యోగ్యతగల పురుషుల అవసరాన్ని తీర్చడమెలా? అది శిక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. క్రైస్తవ పైవిచారణకర్తలు, ‘ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు’ శిక్షణనివ్వాలని బైబిలు ప్రోత్సహిస్తోంది. (2 తిమోతి 2:2) శిక్షణనివ్వడం అంటే తగినవారిగా, యోగ్యత గలవారిగా, లేదా ప్రవీణులుగా తయారు చేయడానికి బోధించడం అని అర్థం. ఇతర యోగ్యతగల పురుషులకు పెద్దలు ఎలా శిక్షణనివ్వవచ్చో ఇప్పుడు మనం పరిశీలిద్దాము.
యెహోవా మాదిరిని అనుకరించండి
యేసుక్రీస్తు తన పనిలో ‘తగినవాడిగా, యోగ్యత గలవాడిగా, లేదా ప్రవీణుడిగా’ ఉన్నాడని నిస్సంకోచంగా చెప్పగలము—అయినా అందులో ఆశ్చర్యమేముంది! ఆయనకు యెహోవా దేవుడు స్వయంగా శిక్షణనిచ్చాడు. ఆయన శిక్షణా కార్యక్రమం అంత ప్రభావవంతంగా ఉండడానికి కారణాలేమిటి? యేసు మూడింటిని పేర్కొన్నాడు, అవి యోహాను 5:20 లో నమోదయ్యాయి: [1] ‘తండ్రి, కుమారుని ప్రేమించుచు, [2] తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచు, [3] వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.’ (ఇటాలిక్కులు మావి.) ఈ కారణాల్లో ఒక్కొక్కదాన్ని మనం పరిశీలిస్తే శిక్షణ అనే అంశంపై మనకు మరింత అంతర్దృష్టి లభిస్తుంది.
మొదట, ‘తండ్రి తన కుమారుని ప్రేమించుచున్నాడని’ యేసు చెప్పినట్లు గమనించండి. సృష్ట్యారంభము నుండి యెహోవాకు ఆయన కుమారునికి మధ్య అనురాగంతో కూడిన అనుబంధం ఉంది. సామెతలు 8:30, (ఈజీ-టు-రీడ్ వర్షన్) ఆ సంబంధాన్ని ఇలా స్పష్టం చేస్తోంది: ‘నైపుణ్యంగల పనివానిలా నేను [యేసు] ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడు సంతోషంగా ఉన్నాను.’ (ఇటాలిక్కులు మావి.) యెహోవా తన విషయంలో ‘సంతోషంగా’ ఉన్నాడన్నదాని గురించి యేసు మనస్సులో ఎలాంటి సందేహమూ లేదు. తన తండ్రితో పనిచేస్తున్నప్పుడు తాను అనుభవించిన సంతోషాన్ని యేసు దాచుకోనూ లేదు. క్రైస్తవ పెద్దలకూ వారు శిక్షణనిస్తున్న వారికీ మధ్య అనురాగంతో కూడిన, మనఃపూర్వకమైన సంబంధాలు ఉండడం ఎంత బాగుంటుందో కదా!
యేసు పేర్కొన్న రెండవ అంశం, తండ్రి ‘తాను చేయువాటి నెల్లను తనకు అగపరచుచున్నాడు.’ విశ్వం సృష్టించబడుతున్నప్పుడు యేసు యెహోవా “ప్రక్కనే” ఉన్నాడని చెప్తున్న సామెతలు 8:30ని ఆ మాటలు ధ్రువపరుస్తున్నాయి. (ఆదికాండము 1:26) పెద్దలు, పరిచర్యా సేవకులకు తమ విధులను సమర్థవంతంగా ఎలా నిర్వర్తించాలో చూపిస్తూ వారితో సన్నిహితంగా పనిచేయడం ద్వారా వారు ఆ అద్భుతమైన మాదిరిని అనుకరించగలరు. అయితే క్రొత్తగా నియమించబడిన పరిచర్యా సేవకులకు మాత్రమే పురోభివృద్ధికరమైన శిక్షణ అవసరమని కాదు. విశ్వసనీయులైన సహోదరులు కొందరు ఎన్నో సంవత్సరాలుగా పైవిచారణకర్త పదవికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ నియమించబడని వారి సంగతేమిటి? (1 తిమోతి 3:1) అలాంటి పురుషులకు పెద్దలు నిర్దిష్టమైన సలహాను ఇచ్చినట్లైతే వారు తమ ప్రయత్నాలను ఏ రంగాల్లో ఎక్కువ చేయాలో తెలుసుకుంటారు.
ఉదాహరణకు ఒక పరిచర్యా సేవకుడు నమ్మదగ్గ వాడు, సమయాన్ని పాటించేవాడు, తన విధులను మనస్సాక్షితో నిర్వర్తించేవాడు అనుకోండి. అంతేకాక ఆయన మంచి బోధకుడు కూడా అయివుండవచ్చు. అనేక విధాలుగా ఆయన సంఘంలో చక్కని పని చేస్తుండవచ్చు. అయితే, తన తోటి క్రైస్తవులతో తాను కొంచెం దురుసుగా ఉంటున్నట్లు గ్రహించకపోవచ్చు. అప్పుడు పెద్దలు “జ్ఞానముతో కూడిన సాత్వికము” ప్రదర్శించాలి. (యాకోబు 3:13) ఒక పెద్ద ఆ పరిచర్యా సేవకుడికి సమస్యను స్పష్టంగా వివరిస్తూ, నిర్దిష్టమైన ఉదాహరణలిస్తూ, మెరుగుపర్చుకోవడానికి ఆచరణాత్మకమైన సూచనలిస్తూ ఆయనతో మాట్లాడడం మంచిది కాదా? ఆ పెద్ద తన ‘సలహాను ఉప్పువేసినట్టు రుచిగలదిగా’ జాగ్రత్తగా మాట్లాడినప్పుడు ఆయన మాటలను స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (కొలొస్సయులు 4:6) నిజమే, పరిచర్యా సేవకుడు మనసు విప్పి మాట్లాడుతూ, తనకు ఇవ్వబడే సలహాను స్వీకరించినట్లైతే ఆ పెద్ద పని మరింత సులభంగా ఉంటుంది.—కీర్తన 141:5.
కొన్ని సంఘాల్లో, పరిచర్యా సేవకులకు ఆచరణాత్మకమైన, నిరంతరమైన శిక్షణను పెద్దలు అందిస్తున్నారు. ఉదాహరణకు, వారు వ్యాధిగ్రస్తులను లేదా వృద్ధులను సందర్శించేటప్పుడు యోగ్యులైన పరిచర్యా సేవకులను తమతోపాటు తీసుకెళ్తారు. ఈ విధంగా పరిచర్యా సేవకులు కాపరి పనిలో అనుభవాన్ని పొందుతారు. నిజమే, పరిచర్యా సేవకుడు కూడా తన సొంత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం చేయగలిగేది ఎంతో ఉంది.—“పరిచర్యా సేవకులు ఏమి చేయవచ్చు” అనే ఈ క్రింది బాక్సు చూడండి.
యేసు పొందిన శిక్షణ ప్రభావవంతంగా ఉండేలా చేసిన మూడవ అంశం ఏమిటంటే ఆయన భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యెహోవా శిక్షణనిచ్చాడు. తండ్రి “వీటికంటె గొప్ప కార్యములను” తనకు చూపిస్తాడని యేసు చెప్పాడు. భూమి మీద ఉన్నప్పుడు యేసు పొందిన అనుభవం, ఆయన భవిష్యత్ నియామకాలను నిర్వర్తించడానికి అవసరమయ్యే లక్షణాలను పెంపొందించుకునేందుకు సహాయపడింది. (హెబ్రీయులు 4:15; 5:8, 9) ఉదాహరణకు, యేసు త్వరలో ఎంత భారమైన నియామకాన్ని—ఇప్పుడు మరణించిన కోట్లాదిమందిని పునరుత్థానం చేసి తీర్పుతీర్చే నియామకాన్ని పొందనైయున్నాడు!—యోహాను 5:21, 22.
నేడు పరిచర్యా సేవకులకు శిక్షణనిచ్చేటప్పుడు పెద్దలు భవిష్యత్ అవసరాలు మనస్సులో పెట్టుకోవాలి. ప్రస్తుత అవసరాలను తీర్చడానికి సరిపడినంత మంది పెద్దలు, పరిచర్యా సేవకులు ఉన్నట్లుగా కనిపించినా ఒక క్రొత్త సంఘం ఏర్పడినప్పటి సంగతేమిటి, అప్పుడు కూడా ఇప్పుడు ఉన్నవారే సరిపోతారా? రెండు మూడు సంఘాలు ఏర్పడినా వాళ్ళే సరిపోతారా? గత మూడేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఆ క్రొత్త సంఘాలను చూసుకోవడానికి ఎంత ఎక్కువమంది పెద్దలు, పరిచర్యా సేవకులు అవసరమయ్యారో కదా!
పెద్దలారా, మీరు శిక్షణ ఇస్తున్న పురుషులతో అనురాగపూరితమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ యెహోవా మాదిరిని అనుకరిస్తున్నారా? వారి పనిని వారెలా నిర్వర్తించాలో మీరు చూపిస్తున్నారా? భవిష్యత్ అవసరాలను మనస్సులో ఉంచుకుంటున్నారా? యెహోవా యేసుకు ఇచ్చిన శిక్షణను అనుకరించడం ద్వారా అనేకులకు సమృద్ధియైన ఆశీర్వాదాలు లభిస్తాయి.
బాధ్యతలు అప్పగించడానికి భయపడవద్దు
అనేక బరువైన నియామకాలను ఒకే సమయంలో నిర్వహించడానికి అలవాటుపడిన సమర్థులైన పెద్దలు అధికారాన్ని ఇతరులకు అప్పగించడానికి కాస్త సంకోచిస్తుండవచ్చు. గతంలో వారలా అప్పగించినప్పుడు అసంతృప్తికరమైన ఫలితాలు లభించివుండవచ్చు. అందుకని వారు బహుశ, ‘ఏదైనా పని చక్కగా జరగాలంటే, అది నేను స్వయంగా చేసుకోవాల్సిందే’ అనే దృక్పథాన్ని అలవర్చుకోవచ్చు. కానీ ఇలాంటి దృక్పథం, తక్కువ అనుభవజ్ఞులైన పురుషులు ఎక్కువ అనుభవం ఉన్నవారి నుండి శిక్షణ పొందాలని లేఖనాల్లో వ్యక్తం చేయబడిన యెహోవా చిత్తానికి అనుగుణంగా ఉంటుందా?—2 తిమోతి 2:2.
అపొస్తలుడైన పౌలు తన ప్రయాణ సహచరుల్లో ఒకరైన యోహాను మార్కు పంఫూలియలో తన నియామకాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చాలా అసంతృప్తి చెందాడు. (అపొస్తలుల కార్యములు 15:38, 39) అయితే ఆయన ఇతరులకు శిక్షణనివ్వకుండా ఆ సంఘటన ఆయనను నిరుత్సాహపరచలేదు. ఆయన మరో యౌవన సహోదరుడైన తిమోతిని ఎంపిక చేసుకుని ఆయనకు మిషనరీ పనిలో శిక్షణనిచ్చాడు. * (అపొస్తలుల కార్యములు 16:1-3) బెరయలో ఈ మిషనరీలు ఎంతటి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారంటే పౌలు అక్కడ ఉండడమే కుదరలేదు. అందుకని అక్కడి క్రొత్త సంఘాన్ని ఆయన పరిణతిచెందిన పెద్ద వయస్కుడైన సీల చేతుల్లోను, తిమోతి చేతుల్లోను పెట్టి వెళ్ళిపోయాడు. (అపొస్తలుల కార్యములు 17:13-15) సీల నుండి తిమోతి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. అటుతర్వాత, తిమోతి మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, పౌలు థెస్సలొనీకలోని సంఘాన్ని ప్రోత్సహించడానికి ఆయనను అక్కడికి పంపించాడు.—1 థెస్సలొనీకయులు 3:1-3.
పౌలు తిమోతిల మధ్యనున్న సంబంధం నిస్తేజమైనదో లేక ఉదాసీనమైనదో కాదు. వారిద్దరి మధ్య వాత్సల్యపూరితమైన అనుబంధం ఉంది. పౌలు కొరింథులోని సంఘానికి వ్రాస్తూ, అక్కడికి తను పంపించాలనుకున్న తిమోతిని ‘ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును’ అని సంబోధించాడు. ఆయనింకా ఇలా అన్నాడు: ‘[తిమోతి] క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, . . . మీకు జ్ఞాపకము చేయును.’ (ఇటాలిక్కులు మావి.) (1 కొరింథీయులు 4:17) తాను పౌలు నుండి పొందిన శిక్షణకు తిమోతి చక్కగా ప్రతిస్పందించి తన నియామకాలను నిర్వర్తించడానికి యోగ్యత గలవాడయ్యాడు. అనేకమంది యౌవన సహోదరులు సమర్థులైన పరిచర్యా సేవకులుగా, పెద్దలుగా, చివరికి ప్రయాణ పైవిచారణకర్తలుగా కూడా అయ్యారు, కారణం, పౌలు తిమోతికి శిక్షణనిచ్చినట్లే తమ పట్ల నిజమైన ఆసక్తి చూపించి, శిక్షణనిచ్చిన పెద్దల నుండి వారు ప్రయోజనం పొందడమే.
పెద్దలారా, ఇతరులకు శిక్షణనివ్వండి!
యెషయా 60:22 లోని ప్రవచనం నేడు నెరవేరుతోందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. యెహోవా ‘ఎన్నికలేనివాడిని బలమైన జనముగా’ చేస్తున్నాడు. ఆ జనాంగము ‘బలమైనదిగా’ ఉండాలంటే అది చక్కగా సంస్థీకరించబడాలి. పెద్దలారా, శిక్షణను పొందే అర్హతను సంపాదించుకున్న సమర్పిత పురుషులకు అలాంటి అదనపు శిక్షణను ఇచ్చే మార్గాల గురించి ఎందుకు ఆలోచించకూడదు? ప్రతి పరిచర్యా సేవకుడు తాను అభివృద్ధి చెందడానికి ఎలాంటి మెరుగులు దిద్దుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఉన్నాడని నిశ్చయపరచుకోండి. మరోవైపు, బాప్తిస్మం తీసుకున్న సహోదరులారా, మీ పట్ల చూపించబడుతున్న వ్యక్తిగత శ్రద్ధ నుండి పూర్తి ప్రయోజనం పొందండి. మీ సామర్థ్యాన్ని, పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని ఎక్కువచేసుకునే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోండి. అలాంటి ప్రేమపూర్వక సహాయ కార్యక్రమాన్ని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు.—యెషయా 61:5.
[అధస్సూచి]
^ పేరా 18 అటుతర్వాత, పౌలు యోహాను మార్కుతో మరొకసారి పనిచేశాడు.—కొలొస్సయులు 4:10.
[30వ పేజీలోని బాక్సు]
పరిచర్యా సేవకులు ఏమి చేయవచ్చు?
పరిచర్యా సేవకులకు పెద్దలు శిక్షణనివ్వగలిగినా వారు తమ సొంత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం చేయగలిగేది ఎంతో ఉంది.
—పరిచర్యా సేవకులు కష్టించి పనిచేసేవారై ఉండాలి, తమ నియామకాలను శ్రద్ధగా నిర్వర్తించడంలో నమ్మదగ్గవారై ఉండాలి. వారు మంచి అధ్యయన అలవాట్లను కూడా పెంపొందించుకోవాలి. చాలా మట్టుకు అభివృద్ధి అనేది అధ్యయనంపైనా, నేర్చుకుంటున్న విషయాలను అన్వయించుకోవడంపైనా ఆధారపడి ఉంటుంది.
—క్రైస్తవ కూటాల్లో పరిచర్యా సేవకుడు ప్రసంగం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు, దాన్ని ఎలా ఇవ్వాలో సూచనలిమ్మని ఒక సమర్థుడైన పెద్దను అడగడానికి సంకోచించకూడదు.
—తాను బైబిలు ప్రసంగం ఎలా ఇస్తున్నాడో గమనించమని తర్వాత మెరుగులు దిద్దుకోవడానికి సలహాలివ్వమని పరిచర్యా సేవకుడు ఒక పెద్దను అడగవచ్చు.
పరిచర్యా సేవకులు పెద్దలను సలహాలు అడగాలి, వాటిని స్వీకరించాలి, వాటిని అన్వయించుకోవాలి. ఈ విధంగా వారి అభివృద్ధి ‘అందరికి తేటగా కనబడుతుంది.’—1 తిమోతి 4:15.