కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వర్గ భేదాల సమస్యలు

వర్గ భేదాల సమస్యలు

వర్గ భేదాల సమస్యలు

“సమానత్వం ఒక హక్కే కావచ్చు, కానీ భూమ్మీద ఉన్న ఏ ప్రభుత్వము దాన్ని ఎన్నటికీ వాస్తవం చేయలేదు.”

19వ శతాబ్దపు ఫ్రెంచి నవలా రచయిత ఓనోర్‌ డి బాల్జాక్‌ అలా అన్నాడు. మీరు ఆయనతో ఏకీభవిస్తారా? సహజంగానే అనేకమంది వర్గభేదాలు న్యాయవిరుద్ధమైనవని భావిస్తారు. అయినప్పటికీ, ఈ 21వ శతాబ్దంలో కూడా మానవసమాజం లెక్కలేనన్ని వర్గాలుగా చీలిపోయివుంది.

అమెరికాకు 1923 నుండి 1929 వరకు అధ్యక్షుడిగా ఉన్న కాల్విన్‌ కూలిడ్జ్‌, సమాజ వర్గభేదాల సమస్యకు సంబంధించి, “చివరికి ఉన్నత వర్గాలన్నింటిని నామరూపాల్లేకుండా నాశనం చేస్తాము” అని అన్నాడు. ఏది ఏమైనా, కూలిడ్జ్‌ ప్రభుత్వానికి దాదాపు 40 సంవత్సరాల తర్వాత, జాతి సంబంధాలను అధ్యయనం చేయడానికి నియమించబడిన కర్నర్‌ కమీషన్‌, “ఒకటి వేరుచేయబడిన నల్లజాతి, మరొకటి అసమమైన తెల్లజాతి” అని రెండు సమాజాలుగా అమెరికా విభజించబడుతుందేమోననే భయాందోళనలను వ్యక్తం చేసింది. ఆ జోస్యం ఇప్పటికే నిజమై, ఆ దేశంలో “ఆర్థికపరంగా, జాతిపరంగా అగాధం పెరిగిపోతోంది” అని కొందరు అంటున్నారు.

మానవ సమానత్వం అనే ఆలోచనను నిజం చేయడం ఎందుకంత కష్టం? అతి పెద్ద కారణం మానవ స్వభావం. అమెరికా కాంగ్రెస్‌ మాజీ సభ్యుడు విలియమ్‌ రాండొల్ఫ్‌ హార్స్‌ట్‌ ఒకసారి ఇలా అన్నాడు: “మనుష్యులందరు, ఒక్క విషయంలో మాత్రం సమానంగా సృష్టించబడ్డారు, అదేమిటంటే వారు అసమమైనవారిగా ఉండాలని కోరుకోవడమే.” ఆయన మాటలకర్థమేమిటి? 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకరచయిత్రి ఆన్రీ బెక్‌ మరింత స్పష్టంగా చెప్పినట్లనిపిస్తుంది: “సమానత్వం ఇంత జటిలమైన సమస్యగా అవడానికి కారణం ఏమిటంటే, మనం కేవలం మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారితో సమానులు కావాలంటున్నాము.” వేరే మాటల్లో చెప్పాలంటే, ప్రజలు సమాజంలో పై స్థాయిలో ఉన్నవారితో సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు; కానీ తమకంటే తక్కువ స్థాయివారు అని పరిగణిస్తున్నవారికి సమానత్వం ఇచ్చి తమ ఆధిక్యతలను, అవకాశాలను తగ్గించుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు.

గత కాలాల్లోని ప్రజలు సామాన్యులుగా, ఉన్నత వంశీయులుగా, లేక రాజ కుటుంబంలో కూడా జన్మించారు. కొన్ని ప్రాంతాల్లో నేడుకూడా అలాంటి వంశాల్లో జన్మిస్తున్నవారు ఉన్నారు. అయితే నేడు అనేక ప్రాంతాల్లో, వాళ్ళు క్రింది తరగతి వాళ్ళా, మధ్య తరగతి వాళ్ళా, లేక ఉన్నత వర్గం వాళ్ళా అనేది వాళ్ళ ఆర్థికస్థితే నిర్ణయిస్తోంది. అయినప్పటికీ, వర్గభేదాలను సూచించడానికి జాతి, విద్య, అక్షరాస్యత వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్త్రీని ఒక అధమమైన వర్గముగా దృష్టిస్తూ వేరుపరచడానికి ముఖ్య కారణం లింగభేదమే.

ఆశాఛాయలు ఏమైనా ఉన్నాయా?

కొన్ని వర్గభేదాలను కూలద్రోలడానికి మానవ హక్కుల శాసనాలు సహాయపడ్డాయి. అమెరికాలో జాతిభేదాలకు విరుద్ధంగా చట్టాలు అమలులోకి తేబడ్డాయి. దక్షిణాఫ్రికాలో జాతి వెలి విధానం నిషేధించబడింది. బానిసత్వం నేటికీ ఉన్నా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అది చట్టవిరుద్ధం చేయబడింది. కోర్టు తీర్పులు, కొన్ని ఆదిమజాతి ప్రజలకు భూమి హక్కుల గుర్తింపును బలవంతంగా కలిగించాయి. విచక్షణకు విరుద్ధమైన చట్టాలు, కొన్ని వెనుకబడిన జాతులకు ఉపశమనం కలిగించాయి.

సమాజంలో ఇక వర్గభేదాలు ఉండవని ఇవన్నీ సూచిస్తున్నాయా? అదేమీ కాదు. కొన్ని సమాజ వర్గభేదాలు ఇప్పుడు బలహీనమైనప్పటికీ, క్రొత్త వర్గాలు ప్రత్యక్షమవడం ప్రారంభించాయి. కంప్యూటర్‌ యుగంలో వర్గ పోరాటాలు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “నేడు పెట్టుబడిదారులు, కార్మికవర్గాలు అని వర్గీకరించడం ఏ మాత్రం సరైనది కాదనిపిస్తోంది, ఆ రెండు భారీ వర్గాలు ఆవేశపరులైన చిన్న గుంపులుగా విడిపోవడమే అందుకు కారణం.”

వర్గభేదాలు ప్రజలను శాశ్వతంగా విడదీస్తాయా? దీని తర్వాతి ఆర్టికల్‌, పరిస్థితి ఆశారహితం కాదని చూపిస్తుంది.