మంచితనాన్ని ఎల్లప్పుడూ చూపిస్తుండండి
మంచితనాన్ని ఎల్లప్పుడూ చూపిస్తుండండి
“వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.” —ఎఫెసీయులు 5:9.
1. నేడు లక్షలాదిమంది కీర్తన 31:19తో తాము ఏకీభవిస్తున్నామని ఎలా చూపిస్తున్నారు?
ఏ మానవుడైనా చేయగల సర్వశ్రేష్ఠమైన మంచి పని యెహోవాను మహిమపరచడమే. దేవుని మంచితనాన్ని బట్టి ఆయనను స్తుతించడం ద్వారా నేడు లక్షలాదిమంది ఆ మంచి పనిని చేస్తున్నారు. ‘నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు [“మంచితనము,” NW] యెంతో గొప్పది’ అని కీర్తనకర్త పాడినదాన్ని, నమ్మకమైన యెహోవాసాక్షులుగా, మనం సంపూర్ణహృదయంతో ఒప్పుకుంటాము.—కీర్తన 31:19.
2, 3. శిష్యులను చేసే పనితోపాటు మనం మంచి ప్రవర్తనను కలిగి ఉండకపోతే ఏమవుతుంది?
2 యెహోవా మంచితనాన్నిబట్టి మనం ఆయనను స్తుతించడానికి, ఆయనపట్ల మనకున్న భక్తిపూర్వక భయం పురికొలుపుతుంది. ‘యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను సన్నుతించడానికి, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును నరులకు తెలియజేయడానికి’ కూడా అది మనల్ని కదిలిస్తుంది. (కీర్తన 145:10-13) అందుకే మనం రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో ఆసక్తిగా పాల్గొంటాం. (మత్తయి 24:14; 28:19, 20) ప్రకటనా కార్యకలాపాలతోపాటు, మనం మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని మాత్రం మర్చిపోకూడదు. లేకపోతే, మనం యెహోవా పరిశుద్ధ నామానికి అపకీర్తి తెచ్చినవారమవుతాము.
3 తాము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనేకులు చెప్పుకున్నప్పటికీ, వారి ప్రవర్తన ఆయన ప్రేరేపిత వాక్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండదు. మంచి చేస్తున్నామని చెప్పుకుని, దానికి అనుగుణంగా జీవించని కొందరి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? . . . వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?”—రోమీయులు 2:21, 22, 24.
4. మన సత్ప్రవర్తన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
4 యెహోవాకు చెడ్డపేరు తీసుకురావడానికి బదులుగా మన మంచి ప్రవర్తనతో ఆయన నామమును మహిమపరచడానికి కృషి చేద్దాము. అలా చేయడం క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నవారిపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక విధంగా, మన వ్యతిరేకుల నోరు మూయడానికి అది మనకు సహాయపడుతుంది. (1 పేతురు 2:15) మరింత ప్రాముఖ్యంగా, మన సత్ప్రవర్తన ప్రజలను యెహోవా సంస్థకు దగ్గరయ్యేలా చేస్తుంది, వారు ఆయనకు మహిమను తీసుకురావడానికి, నిత్యజీవాన్ని పొందడానికి మార్గాన్ని తెరుస్తుంది.—అపొస్తలుల కార్యములు 13:48.
5. మనమిప్పుడు ఏ ప్రశ్నలను పరిశీలించాలి?
5 మనం అపరిపూర్ణులం కాబట్టి, యెహోవాకు అపకీర్తి తేకుండా, సత్యాన్వేషకులు అభ్యంతరపడకుండా ఎలా ప్రవర్తించగలం? మనం మంచితనాన్ని చూపించడంలో ఎలా సఫలులం కావచ్చు?
వెలుగు ఫలము
6. కొన్ని ‘నిష్ఫలమైన అంధకార క్రియలు’ ఏవి, క్రైస్తవుల మధ్య ఎలాంటి ఫలముండాలి?
6 సమర్పిత క్రైస్తవులుగా మనం అనుభవిస్తున్న ఆనందం, మనం “నిష్ఫలమైన అంధకార క్రియలలో” పాల్గొనకుండా సహాయపడుతుంది. ఆ క్రియల్లో అబద్ధం చెప్పడం, ఎఫెసీయులు 4:25, 28, 31; 5:3, 4, 11, 12, 18) మనం అలాంటి క్రియల్లో పాల్గొనకుండా, ‘వెలుగు సంబంధులవలె నడుచుకొందాము.’ అపొస్తలుడైన పౌలు, “వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది” అని చెబుతున్నాడు. (ఎఫెసీయులు 5:9) కాబట్టి, వెలుగులో నడవడం ద్వారా మనం ఎల్లప్పుడూ మంచితనాన్ని చూపించగలం. కానీ అది ఎటువంటి వెలుగు?
దొంగతనం చేయడం, దూషించడం, బూతులు, పోకిరిమాటలు, సరసోక్తులు ఉచ్ఛరించడం, మద్యంతో మత్తులై ఉండడం లాంటి, దేవునికి అపకీర్తిని తెచ్చే పనులు ఉన్నాయి. (7. మనం మంచితనాన్ని ఎల్లప్పుడూ చూపించాలంటే ఏమి చేయాలి?
7 మనం అపరిపూర్ణులమైనప్పటికీ, ఆధ్యాత్మిక వెలుగులో నడవడం ద్వారా మంచితనాన్ని చూపించవచ్చు. “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 119:105) మనం “సమస్తవిధములైన మంచితనము” ద్వారా ‘వెలుగు ఫలాన్ని’ ఎల్లప్పుడూ చూపించాలనుకుంటే, దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక వెలుగును, క్రైస్తవ ప్రచురణల్లో కూలంకశముగా చర్చించబడే ఆధ్యాత్మిక వెలుగును మనం క్రమం తప్పక పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. (లూకా 12:42; రోమీయులు 15:4; హెబ్రీయులు 10:24, 25) “లోకమునకు వెలుగు,” “దేవుని మహిమ యొక్క తేజస్సు” అయిన యేసుక్రీస్తు మాదిరిపైనా, ఆయన బోధలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా మనకుంది.—యోహాను 8:12; హెబ్రీయులు 1:1-3.
ఆత్మ ఫలము
8. మంచితనాన్ని మనం ఎలా చూపించగలము?
8 మనము మంచితనం చూపించడానికి ఆధ్యాత్మిక వెలుగు సహాయపడుతుందన్నది నిర్వివాదాంశం. దాంతోపాటు, మనం దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి ద్వారా నడిపించబడతాము కాబట్టి ఈ లక్షణాన్ని వ్యక్తం చేయగలుగుతాము. మంచితనము ‘ఆత్మ ఫలము’లోని భాగము. (గలతీయులు 5:22, 23) మనం యెహోవా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడితే, దాని అద్భుతఫలమైన మంచితనం మనలో ఫలిస్తుంది.
9. లూకా 11:9-13 లో నమోదైన యేసు మాటలకు అనుగుణంగా మనమెలా ప్రవర్తించవచ్చు?
9 ఆత్మ ఫలమైన మంచితనాన్ని చూపించడం ద్వారా, యెహోవాను ప్రీతిపరచాలనే మన గాఢమైన కోరిక, యేసు చెప్పిన ఈ మాటలకు అనుగుణంగా ప్రవర్తించేలా మనల్ని కదిలించాలి: ‘అటువలె మీరును అడుగుడి [“అడుగుతుండండి,” NW], మీ కియ్యబడును; వెదకుడి [“వెదకుతుండండి,” NW], మీకు దొరకును; తట్టుడి [“తట్టుతుండండి,” NW], మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు [అపరిపూర్ణులవడం మూలంగా] చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.’ (లూకా 11:9-13) ఆత్మ ఫలమైన మంచితనాన్ని నిరంతరం చూపించేందుకు యెహోవా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తూ యేసు సలహాను పాటిద్దాం.
‘మంచి చేస్తుండండి’
10. నిర్గమకాండము 34:6, 7 లో యెహోవా మంచితనం యొక్క ఎలాంటి పార్శ్వాలు నమోదు చేయబడ్డాయి?
10 దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక వెలుగు సహాయంతోను మరియు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతోను మనం “మంచినే చేస్తూవుండ”గలము. (రోమీయులు 13:3, పవిత్ర గ్రంథం, వ్యాఖాన సహితం) బైబిలును క్రమంగా అధ్యయనం చేయడం ద్వారా, యెహోవా మంచితనాన్ని మనమెలా అనుకరించవచ్చో మరింత ఎక్కువగా తెలుసుకోగలము. దీని ముందటి ఆర్టికల్, నిర్గమకాండము 34:6, 7 లో, ‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా [“ప్రేమపూర్వక దయ,” NW] సత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయి వేలమందికి కృపను [“ప్రేమపూర్వక దయను,” NW] చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును’ అని నమోదు చేయబడ్డ, మోషేకు చేసిన ప్రకటనలోని దేవుని మంచితనపు పార్శ్వాలను పరిశీలించింది. యెహోవా మంచితనం యొక్క ఈ వ్యక్తీకరణలను దగ్గరనుండి పరిశీలించడం, ‘మంచి చేస్తుండడానికి’ మనకు సహాయకరంగా ఉంటుంది.
11. యెహోవా కనికరము, దయ గలవాడని తెలుసుకోవడం మనమీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
11కనికరము మరియు దయ చూపిస్తూ యెహోవాను అనుకరించాల్సిన అవసరం ఉందని ఈ దైవిక ప్రకటన మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. “కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు” అని యేసు అన్నాడు. (మత్తయి 5:7; లూకా 6:36) యెహోవా దయగలవాడు అని తెలుసుకోవడం ద్వారా, మనం ప్రకటించేవారితోపాటు ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయగా, ఆహ్లాదకరంగా ఉండడానికి కదిలించబడతాము. ఇది “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి” అని పౌలు ఇచ్చిన సలహాకు అనుగుణంగా ఉంటుంది.—కొలొస్సయులు 4:6.
12. (ఎ) దేవుడు దీర్ఘశాంతముగలవాడు కాబట్టి, మనం ఇతరులపట్ల ఎలా ప్రవర్తించాలి? (బి) యెహోవా యొక్క ప్రేమపూర్వక దయ ఏమి చేసేందుకు మనల్ని పురికొలుపుతుంది?
12 దేవుడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టి, ‘మంచి చేస్తుండాలనే’ మన కోరిక, మన తోటి విశ్వాసుల చిన్న చిన్న తప్పులను సహించి వారి మంచి లక్షణాలపై మనసు నిలపడానికి మనల్ని కదిలిస్తుంది. (మత్తయి 7:5; యాకోబు 1:19) యెహోవా యొక్క ప్రేమపూర్వక దయ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా యథార్థమైన ప్రేమను చూపించేందుకు మనల్ని పురికొల్పుతుంది. అది నిజంగా ప్రీతికరమైనది.—సామెతలు 19:22.
13. యెహోవా ‘విస్తారమైన సత్యములు’ గలవాడని చూపించడానికి మనమెలా ప్రవర్తించాలి?
13 మన పరలోకపు తండ్రి ‘విస్తారమైన సత్యములు గలవాడు’ కాబట్టి మనం, ‘సత్యం మాట్లాడటంలో దేవుని సేవకులముగా రుజువు చేసుకోవడానికి’ ప్రయత్నిస్తాము. (2 కొరింథీయులు 6:3-7, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవాకు అసహ్యములైన ఏడింటిలో “కల్లలాడు నాలుక,” మరియు “లేనివాటిని పలుకు అబద్ధసాక్షి” ఉన్నాయి. (సామెతలు 6:16-19) కాబట్టి, దేవుణ్ణి ప్రీతిపరచాలనే మన కోరిక, ‘అబద్ధమాడుట మాని పొరుగువారితో సత్యమే మాట్లాడడానికి’ మనల్ని కదిలిస్తుంది. (ఎఫెసీయులు 4:25) ఈ ప్రధానమైన మార్గం ద్వారా మంచితనాన్ని చూపించడంలో ఎన్నడూ తప్పిపోకుండా ఉందాము.
14. మనమెందుకు క్షమించేవారిగా ఉండాలి?
14 యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి, మనం క్షమించేవారిగా ఉండేందుకు కూడా దేవుడు మోషేకు చేసిన ప్రకటన మనల్ని పురికొల్పాలి. (మత్తయి 6:14, 15) అయితే, పశ్చాత్తాపం చూపని పాపులను యెహోవా తప్పకుండా శిక్షిస్తాడు. కాబట్టి మనం సంఘం యొక్క ఆధ్యాత్మిక శుద్ధతను కాపాడే విషయంలో, ఆయన మంచితనం యొక్క ప్రమాణాలను పాటించాలి.—లేవీయకాండము 5:1; 1 కొరింథీయులు 5:11, 12; 1 తిమోతి 5:22.
“జాగ్రత్తగా చూచుకొనుడి”
15, 16. ఎఫెసీయులు 5:15-19 లోనున్న పౌలు సలహా, మనం మంచితనం చూపిస్తూ కొనసాగేందుకు ఎలా సహాయపడుతుంది?
15 మన చుట్టూ దుష్టత్వం ఉన్నప్పటికీ మంచి మార్గాన్ని వెంటాడాలంటే, మనం దేవుని ఆత్మతో నింపబడి, మనమెలా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. ఎఫెసీయులు 5:15-19) అపాయకరమైన ఈ అంత్యదినాల్లో ఈ సలహా మనకు నిజంగా సమయోచితమైనది.—2 తిమోతి 3:1.
అందుకు తగినట్టే పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు ఇలా ఉద్భోదించాడు: ‘దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు ఉండుడి.’ (16 మనం ఎల్లప్పుడూ మంచితనాన్ని చూపించాలనుకుంటే, దేవుని జ్ఞానాన్ని అమలుచేసేవారిలా నడుస్తున్నామో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. (యాకోబు 3:17) గంభీరమైన పాపాలను విసర్జించాలి, పరిశుద్ధాత్మతో నింపబడినవారమై, దానితో నడిపించబడడానికి మనం దానికి లోబడి ఉండాలి. (గలతీయులు 5:19-25) క్రైస్తవ కూటాల్లో, ప్రాంతీయ, ప్రత్యేక, జిల్లా సమావేశాల్లో అందించబడే ఆధ్యాత్మిక ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా, మనం నిరంతరం మంచి చేయగలుగుతాము. మనం ఆరాధన కోసం కూటాల్లో కూడుకున్నప్పుడు, ‘ఆత్మసంబంధమైన పాటలు’ హృదయపూర్వకంగా పాడడం ద్వారా ప్రయోజనం పొందుతామని కూడా, పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు వ్రాసిన మాటలు మనకు గుర్తుచేస్తాయి. వాటిలో చాలామటుకు మంచితనం వంటి, ఆధ్యాత్మిక లక్షణాల గురించే ఉన్నాయి.
17. తీవ్రంగా అనారోగ్యులైన క్రైస్తవులు కూటాలకు క్రమంగా హాజరుకావడానికి వీలుకానప్పుడు, ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు?
17 తీవ్రమైన అనారోగ్యం కారణంగా క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకాలేని మన తోటి విశ్వాసుల విషయం ఏమిటి? వారు అన్ని సందర్భాల్లో తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో నేరుగా కలిసి యెహోవాను ఆరాధించలేకపోతున్నామని నిస్పృహకు గురికావచ్చు. కాని యెహోవా వారి పరిస్థితులను అర్థం చేసుకుంటాడని, వారికి సత్యవెలుగును అందిస్తాడని, పరిశుద్ధాత్మను ఇస్తాడని, ఎల్లప్పుడూ మంచి చేయడానికి వారికి సహాయం చేస్తాడని వారు నమ్మకంగా ఉండవచ్చు.—యెషయా 57:15.
18. మంచి మార్గంలో కొనసాగేందుకు మనకు ఏది సహాయపడుతుంది?
18 మంచితనపు మార్గంలో నిరాటంకంగా కొనసాగాలంటే, మన సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ‘సజ్జనద్వేషులకు’ దూరంగా ఉండాలి. (2 తిమోతి 3:2-5; 1 కొరింథీయులు 15:33) ఈ సలహాను పాటించడం, “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచే” విధంగా దాని నడిపింపుకు భిన్నంగా నడుచుకొనకుండా ఉండేలా మనకు సహాయపడుతుంది. (ఎఫెసీయులు 4:30) అంతేగాక, మంచిని ప్రేమించేవారిగా, యెహోవా పరిశుద్ధాత్మచే నడిపింపబడుతున్న వారిగా నిదర్శనపూర్వకంగా జీవిస్తున్నవారితో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడం మంచి చేయడానికి దోహదపడుతుంది.—ఆమోసు 5:15; రోమీయులు 8:14; గలతీయులు 5:18.
మంచితనం సత్ఫలితాలను తెస్తుంది
19-21. మంచితనం చూపించడం వల్ల కలిగే ప్రభావాలను తెలిపే అనుభవాలను చెప్పండి.
19 ఆధ్యాత్మిక వెలుగులో నడవడం, దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడి ఉండడం, మనమెలా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవడం మనల్ని చెడుకు దూరంగా ఉంచుతూ, ‘నిరంతరం మంచి చేయడానికి’ సహాయపడడమేగాక, మంచి ఫలితాలనూ ఇస్తాయి. దక్షిణ ఆఫ్రికాలోని, జోంగెజీలె అనే ఒక యెహోవాసాక్షి ఉదాహరణను పరిశీలించండి. ఒక ఉదయం తను స్కూలుకు వెళుతున్న మార్గంలో, బ్యాంకులోని తన చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో ఎంత డబ్బుందో చూసుకున్నాడు. ఆటోమాటిక్ టెల్లర్ మిషన్ నుండి వచ్చిన స్లిప్ తన ఖాతాలో ఉన్న దానికన్నా 42,000 రాండ్లు (2,70,000 రూపాయలు) ఎక్కువ మొత్తాన్ని చూపించింది. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుని వేరే బ్యాంకులో జమచేసుకొమ్మని అక్కడున్న బ్యాంకు సెక్యూరిటీ గార్డుతోపాటు ఇతరులు ఆయనను తొందరపెట్టారు. ఆయన ఉంటున్న ఇంటివారైన క్రైస్తవ దంపతులు మాత్రం, ఆయన ఆ డబ్బులో నుండి ఒక్క పైసా కూడా తీసుకోనందుకు ప్రశంసించారు.
20 మరుసటి రోజున, జోంగెజీలె జరిగిన పొరపాటు గురించి బ్యాంకువారికి తెలియజేశాడు. ఈయన ఖాతానంబరు, ఒక ధనవంతుడైన వ్యాపారి ఖాతా నంబరు దాదాపు ఒకటేనని, పొరపాటున ఆ వ్యాపారి ఈయన ఖాతాలో డబ్బు జమచేశాడని తెలిసింది. జోంగెజీలె ఒక్క పైసా కూడా తీసుకోనందుకు నిర్విణ్ణుడైన ఆ వ్యాపారి “మీది ఏ మతం?” అని ఆయనను అడిగాడు. జోంగెజీలె తాను యెహోవాసాక్షిని అని వివరించాడు. బ్యాంకు అధికారులు ఆయనను హృదయపూర్వకంగా ప్రశంసిస్తూ ఇలా అన్నారు: “ప్రజలందరూ యెహోవాసాక్షుల్లాగ నిజాయితీపరులై ఉండాలని మేము కోరుకుంటున్నాము.” నిజమే, నిజాయితీ మరియు మంచితనంతో కూడిన క్రియలు ఇతరులు యెహోవాను మహిమపరచేలా చేస్తాయి.—హెబ్రీయులు 13:18.
21 మంచితనపు క్రియలు చక్కని ప్రభావం చూపించాలంటే, అవి విశిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు: సమోవా ద్వీపాల్లోని ఒక ద్వీపంలో పూర్తికాల పరిచర్య చేస్తున్న ఒక యువ సాక్షి, స్థానిక హాస్పిటల్‌కు వెళ్ళాల్సివచ్చింది. అక్కడ డాక్టరు పిలుపు కోసం రోగులు ఎదురు చూస్తున్నారు, ఆ సాక్షి తన ప్రక్కనున్న ఒక స్త్రీ చాలా అనారోగ్య స్థితిలో ఉన్నట్లు గమనించాడు. ఆయన తన వంతు వచ్చినప్పుడు తన స్థానంలో ఆమె డాక్టరును ముందుగా కలవడానికి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఒకసారి ఆయన ఆ స్త్రీని మార్కెట్లో కలిశాడు. ఆమె ఆయనను గుర్తించింది, తనకు హాస్పిటల్‌లో చేసిన సహాయం గుర్తొచ్చింది. “యెహోవాసాక్షులు నిజంగానే తమ పొరుగువారిని ప్రేమిస్తారని నాకిప్పుడు తెలిసింది” అని ఆమె అంది. అంతకుముందు రాజ్య సువార్తపట్ల అయిష్టత చూపిన ఆమెపై, ఆ సాక్షి చూపిన మంచితనం సత్ఫలితాలనిచ్చింది. ఆమె గృహ బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించి, దేవుని పరిజ్ఞానాన్ని పొందడం ఆరంభించింది.
22. ‘నిరంతరం మంచి చేయడానికి’ ప్రత్యేక ప్రాధాన్యత గల ఒక మార్గం ఏది?
22 సరిగ్గా అదేవిధంగా, మంచితనం చూపించడం యొక్క విలువను తెలిపే అనుభవాలను మీరు కూడా చెప్పవచ్చు. ‘నిరంతరం మంచి చేయడానికి’ ప్రత్యేక ప్రాధాన్యత గల ఒక మార్గం ఏమిటంటే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో క్రమంగా పాల్గొనడమే. (మత్తయి 24:14) ప్రత్యేకంగా సానుకూలంగా ప్రతిస్పందించినవారికి మంచి చేయడానికి ఇది ఒక మార్గమని గుర్తిస్తూ, అమూల్యమైన ఈ పరిచర్యలో మనం ఎల్లప్పుడూ ఆసక్తిగా పాల్గొందాం. అతి ప్రాముఖ్యంగా, మంచితనానికే మూలమైన యెహోవాను మన పరిచర్య, మన మంచి ప్రవర్తన మహిమపరుస్తుంది.—మత్తయి 19:16, 17.
నిరంతరం ‘మంచిపనులు చేయండి’
23. క్రైస్తవ పరిచర్య మంచి పని అని ఎలా చెప్పవచ్చు?
23 నిస్సందేహంగా మన పరిచర్య చాలా మంచి పని. అది మనకు, బైబిలు సందేశాన్ని విని నిత్యజీవానికి నడిపించే మార్గంలో చేరినవారికి రక్షణను తెస్తుంది. (మత్తయి 7:13, 14; 1 తిమోతి 4:16) మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మంచి చేయాలనే మన కోరిక మనమిలా ప్రశ్నించుకునేలా చేస్తుంది: ‘ఈ నిర్ణయం నేను చేస్తున్న రాజ్య ప్రకటనా పనిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నేను ఆలోచించే మార్గం నిజంగా మంచిదేనా? ఇది ఇతరులు “నిత్యసువార్త”ను అంగీకరించి, యెహోవా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునేందుకు, నేను వారికి సహాయపడేలా దోహదపడుతుందా?’ (ప్రకటన 14:6) రాజ్యాసక్తులకు తోడ్పడే నిర్ణయం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.—మత్తయి 6:33; అపొస్తలుల కార్యములు 20:35.
24, 25. సంఘంలో మంచి చేసే కొన్ని మార్గాలు ఏవి, మనం నిరంతరం మంచితనాన్ని చూపిస్తున్నప్పుడు దేని గురించి నమ్మకంగా ఉండవచ్చు?
24 మంచితనం యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలను ఎన్నడూ తక్కువగా అంచనా వేయకుండా ఉందాం. క్రైస్తవ సంఘానికి మద్దతునిస్తూ, దాని సంక్షేమం కోసం మనం చేయగలిగిందంతా చేయడం ద్వారా ఈ లక్షణాన్ని నిరంతరం చూపించవచ్చు. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవుతూ, వాటిలో పాల్గొన్నప్పుడు తప్పకుండా మంచి చేసిన వాళ్ళమవుతాం. మన సమక్షమే తోటి ఆరాధకులకు ప్రోత్సాహాన్నిస్తుంది, మంచిగా సిద్ధపడిన మన వ్యాఖ్యానాలు వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. మన వనరులను రాజ్య మందిర మద్దతు కోసం ఉపయోగించినప్పుడు, దానిపై సరైన శ్రద్ధ చూపించేందుకు సహాయం చేసినప్పుడు కూడా మనం మంచి చేసినవారమవుతాము. (2 రాజులు 22:3-7; 2 కొరింథీయులు 9:6, 7) ‘కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు [“మంచి,” NW] చేయుదము.’—గలతీయులు 6:10.
25 మంచితనం చూపించాల్సిన ప్రతి పరిస్థితిని మనం ముందుగానే ఊహించలేము. మనం క్రొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, సరైన వివేచన కోసం లేఖనాల్లో వెతుకుతూ, యెహోవా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తూ, ఆయన మంచి, పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చేయగలిగినంత చేద్దాం. (రోమీయులు 2:9, 10; 12:2) మనం నిరంతరం మంచితనాన్ని చూపిస్తున్నప్పుడు, యెహోవా మనల్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడని దృఢంగా నమ్మవచ్చు.
మీరెలా జవాబిస్తారు?
• అత్యంత శ్రేష్ఠమైన మంచి పనిని మనమెలా చేయగలం?
• మంచితనం “వెలుగు ఫలము” అని ఎందుకు పిలువబడింది?
• మంచితనం ‘ఆత్మ ఫలము’ అని ఎందుకు పిలువబడింది?
• మన మంచి ప్రవర్తన ప్రభావం ఎలాంటిది?
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని చిత్రం]
మనం మంచితనం చూపించేందుకు దేవుని వాక్యం, ఆయన పరిశుద్ధాత్మ సహాయం చేస్తాయి
[18వ పేజీలోని చిత్రం]
మంచితనం చూపించడం సత్ఫలితాలను తెస్తుంది