కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ నమ్మకం నిజమైన దేవునిపైనే ఉందా?

మీ నమ్మకం నిజమైన దేవునిపైనే ఉందా?

మీ నమ్మకం నిజమైన దేవునిపైనే ఉందా?

అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ వారిచేత నియమించబడిన ఒక పరిశోధనా బృందం, ఏడు సంవత్సరాల క్రితం అంటే 1906 లో తాను చూశానని రాబర్ట్‌ ఇ. పియరీ నివేదించిన ఉత్తర ధ్రువానికి చెందిన ఒక ప్రాంతాన్ని మరింత అధ్యయనం చేయడానికి బయల్దేరింది.

ఉత్తర అమెరికాకు పూర్తిగా వాయవ్యపు దిక్కునున్న కేప్‌ కాల్గేట్‌ నుండి చూసినప్పుడు, సుదూరప్రాంతంలో ఏవో తెల్లని శిఖరాగ్రాలుగా కనిపిస్తున్నట్లు పియరీ గమనించాడు. ఆయన ఆ ప్రాంతానికి, తనకు ఆర్థిక మద్దతునిచ్చిన ఆసామి పేరు మీదుగా క్రాకర్‌ ల్యాండ్‌ అని పేరు పెట్టాడు. ఆ యాత్రికులు తమ ఎదురుగా కొండలు, లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చూసిన క్షణాన ఎంత పులకరించిపోయారో! కాని, తాము చూస్తున్నది కేవలం ఉత్తర ధ్రువానికి సంబంధించిన ఒక ఎండమావి అని వారు కొద్దిసేపట్లోనే గ్రహించారు. నిజమైన దృశ్యంగా భ్రమింపజేసిన వాతావరణ స్థితే పియరీని మోసం చేసింది, వారది గ్రహించేసరికి ఆ అవాస్తవమైనదాన్ని పరిశోధించడంలో సమయం, శక్తి, ఇతర సాధనసంపత్తులు వృథా అయ్యాయి.

నేడు అనేకమంది, తాము నిజమని నమ్ముతున్న దేవుళ్ళ కోసం తమ సమయాన్ని వెచ్చిస్తూ, భక్తి శ్రద్ధలను చూపిస్తున్నారు. యేసు అపొస్తలుల కాలంలో, హెర్మే మరియు ద్యుపతివంటి దేవుళ్ళు ఆరాధించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 14:​11, 12) నేడు షింటోలు, హిందువులు, ప్రపంచంలోని ఇతర మతాల్లోనివారు ఆరాధిస్తున్న దేవుళ్ళ సంఖ్య ఎన్నో కోట్లు దాటిపోతాయి. నిజంగానే, బైబిలు చెబుతున్నట్లు “దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.” (1 కొరింథీయులు 8:​5, 6) వాళ్ళందరూ నిజమైన దేవుళ్ళేనా?

“రక్షింపలేని” దేవుళ్ళు

ఉదాహరణకు, ఆరాధనలో ఉపయోగిస్తున్న ప్రతిమలు లేక చిహ్నాల గురించి ఆలోచించండి. విగ్రహాలను నమ్మేవారికి లేక వాటికి ప్రార్థించేవారికి, అవి ప్రతిఫలాలు ఇవ్వగల లేదా ప్రమాదాలనుండి కాపాడగల మానవాతీతమైన శక్తులున్న రక్షకుల్లాగా అనిపిస్తాయి. కానీ అవి నిజంగా రక్షించగలవా? అలాంటి వాటిగురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.” నిజమే, అవి “రక్షింపలేని” దేవుళ్ళు.​—⁠కీర్తన 135:​15-17; యెషయా 45:⁠20.

విగ్రహాలను చేసేవారు తమ హస్తకృతులకు జీవాన్ని, శక్తిని ఆపాదిస్తుండవచ్చు. విగ్రహాలను ఆరాధించేవారు వాటి మీద తమ నమ్మకాన్ని ఉంచుతారు. ‘వారు భుజముమీద [ఒక విగ్రహాన్ని] ఎక్కించుకొందురు, దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు’ అని యెషయా ప్రవక్త చెప్పాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును, ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.” (యెషయా 46:⁠7) విగ్రహాన్ని నమ్ముకునేవారి విశ్వాసం ఎంత దృఢమైనదైనా సరే, ఆ విగ్రహం నిర్జీవంగానే ఉంటుందన్నది మాత్రం వాస్తవం. అలాంటి చెక్కుడు విగ్రహాలు, పోత విగ్రహాలు ‘ప్రయోజనం’ లేని దేవుళ్ళు.​—⁠హబక్కూకు 2:⁠18.

కళాకారులను, క్రీడాకారులను, రాజకీయ వ్యవస్థలను, మతనాయకులను దైవసమానంగా ఎంచడం, భక్తి చూపించడం, ఆరాధ్య భావంతో చూడడంలాంటివి నేడు సర్వసాధారణమయ్యాయి. అంతేకాకుండా, చాలామందికి డబ్బే దైవం. ప్రతి సందర్భంలోను, ఈ విగ్రహాలు వాటిలో లేనివాటికి ప్రతీకగా చూపబడ్డాయి. వాటిని నమ్ముకునేవారు ఆశించినవేమీ అవి ఇవ్వవు, ఇవ్వలేవు. ఉదాహరణకు, అనేక సమస్యలకు డబ్బు పరిష్కారంగా అనిపించవచ్చు, కాని ధనానికి ఉండే శక్తి మోసకరమైనది. (మార్కు 4:​18, 19) ఒక పరిశోధకుడు ఇలా అడిగాడు: “అనేకమంది ప్రజలు డబ్బే ప్రతి సమస్యకు పరిష్కారమనుకొని దానిని ఎంతో ఆశతో అపేక్షిస్తారు, తీరా అది చేతికి వచ్చేసరికి, అసంతృప్తి నుండి తీవ్రంగా కృంగిపోవడం వరకు వివిధ స్థాయిల్లో దాని ప్రభావాలకు గురికావడానికి కారణమేమిటి?” అవును, ఒక వ్యక్తి సంపదల వేటలో పడినప్పుడు నిజంగా విలువైన తన ఆరోగ్యాన్ని, సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని, సన్నిహిత స్నేహాలను, లేక సృష్టికర్తతో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని త్యాగం చేయాల్సిరావచ్చు. చివరికి అతని ధనసంపదలనే దేవత కేవలం, “అసత్యమైన వ్యర్థ దేవత” అని అర్థమవుతుంది!​—⁠యోనా 2:8.

ప్రత్యుత్తరమిచ్చువారు ఎవ్వరూ లేరు’

అవాస్తవాన్ని వాస్తవమనడం మూర్ఖత్వమే. ఏలీయా ప్రవక్త కాలంలోని బయలు దేవత ఆరాధకులు ఈ విషయాన్ని ఒక చేదైన అనుభవం ద్వారా తెలుసుకున్నారు. ఆకాశము నుండి అగ్నిని తెప్పించి తమ జంతుబలిని దహింపజేసే శక్తి బయలుకు ఉందని వాళ్ళు చాలా దృఢంగా నమ్మారు. వాస్తవానికి వాళ్ళు, “ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు​—⁠బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి.” బయలుకు వినగలిగే చెవులున్నాయా, మాట్లాడగలిగే నోరుందా? ఆ వృత్తాంతం ఇలా కొనసాగింది: ‘ఒక్క మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేడు.’ నిజానికి, “లక్ష్యము చేసినవాడైనను లేకపోయెను.” (1 రాజులు 18:​26, 29) బయలు నిజమైన, సజీవమైన లేక చురుకైన దేవుడు కాదు.

నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడము, ఆయనను ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో కదా! కానీ ఆ దేవుడు ఎవరు? ఆయనను నమ్మడం వలన మనకు ప్రయోజనమేమిటి?

[3వ పేజీలోని చిత్రాలు]

పియరీ సహచరుడు ఈగీన్యా క్షితిజరేఖలో ఆ స్థలం కోసం వెతుకుతున్నాడు

రాబర్ట్‌ ఇ. పియరీ

[చిత్రసౌజన్యం]

ఈగీన్యా: The North Pole : Its Discovery in 1909 Under the Auspices of the Peary Arctic Club, 1910 పుస్తకం నుండి; రాబర్ట్‌ ఇ. పియరీ: NOAA

[4వ పేజీలోని చిత్రాలు]

ఈ లోకంలో పూజించబడే వాటి ద్వారానే చాలామంది మోసపోయారు