కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా —మంచితనానికి సర్వోత్కృష్టమైన మాదిరి

యెహోవా —మంచితనానికి సర్వోత్కృష్టమైన మాదిరి

యెహోవా—⁠మంచితనానికి సర్వోత్కృష్టమైన మాదిరి

“యెహోవా మంచివాడు, . . . సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి!”​—⁠యిర్మీయా 33:10, 11.

1. దేవుని మంచితనాన్ని స్తుతించేందుకు మనం ఎందుకు కదిలించబడతాము?

యెహోవా దేవుడు పరిపూర్ణంగా మంచివాడు. “ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!” అని జెకర్యా ప్రవక్త ఎలుగెత్తి చెప్పాడు. (జెకర్యా 9:​17, NW) నిజమే, మన ఆనందం కోసం భూమిని సిద్ధపరచడానికి దేవుడు చేసిన ప్రతి దాంట్లో మంచితనం ప్రతిబింబిస్తుంది. (ఆదికాండము 1:​31) ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు దేవుడు అమలులో పెట్టిన సంక్లిష్టమైన సూత్రాలన్నింటిని అవగాహన చేసుకోవడం మనకు ఎన్నటికీ సాధ్యం కాదు. (ప్రసంగి 3:​11; 8:​17) మనకు తెలిసింది లేశమాత్రమే అయినా, దేవుణ్ణి స్తుతించడానికి అది మనల్ని కదిలిస్తుంది.

2. మంచితనాన్ని మీరెలా నిర్వచిస్తారు?

2 మంచితనం అంటే ఏమిటి? నైతిక శ్రేష్ఠత, లేక సౌశీల్యత. అయితే, మంచితనమంటే ఎటువంటి చెడుతనం లేకపోవడం మాత్రమే కాదు. అది ఆత్మఫలంలోని ఒక భాగం, ప్రయోజనాన్నిచ్చే ఒక లక్షణం. (గలతీయులు 5:​22, 23) మనం ఇతరుల కోసం మంచిపనులు, ప్రయోజనకరమైన కార్యాలు చేసినప్పుడు మంచితనం చూపిస్తాం. కానీ, ఈ లోక విధానంలో, కొన్ని వర్గాల్లో మంచి అని భావించినదాన్నే ఇతర వర్గాలు చెడుగా దృష్టించవచ్చు. కాబట్టి మనం శాంతి, సంతోషాలను అనుభవించాలంటే, మంచితనానికి ఒకే ప్రమాణం ఉండాలి. మరి ఆ ప్రమాణాన్ని ఎవరు న్యాయబద్ధంగా స్థాపిస్తారు?

3. మంచితనానికి ప్రమాణం గురించి ఆదికాండము 2:​16, 17 వచనాలు ఏమని సూచిస్తున్నాయి?

3 మంచితనానికి ప్రమాణాన్ని దేవుడే ఏర్పరుస్తాడు. మానవ చరిత్ర ప్రారంభంలో, ‘ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు’ అని మొదటి మానవునికి ఆజ్ఞాపించింది యెహోవాయే. (ఆదికాండము 2:​16, 17) అవును, మానవులు మంచి చెడుల పరిజ్ఞానం కోసం సృష్టికర్తవైపు చూడాల్సిన అవసరముంది.

అపాత్రమైన మంచితనపు వ్యక్తీకరణ

4. ఆదాము పాపము చేసిన తర్వాత మానవజాతి కోసం దేవుడు ఏమి చేశాడు?

4 ఆదాము పాపము చేసి, మంచితనపు ప్రమాణాలు ఏర్పరచడానికి దేవునికున్న హక్కును గుర్తించకుండా తిరస్కరించినప్పుడు, పరిపూర్ణతతో నిరంతరం సంతోషంగా జీవించే మానవాళి ఉత్తరాపేక్ష అపాయంలో పడింది. (ఆదికాండము 3:​1-6) అయితే, ఆదాము సంతానం పాప మరణాలకు వారసులుగా జన్మించకముందే, ఒక పరిపూర్ణమైన సంతానము వస్తుందని దేవుడు ప్రవచించాడు. “ఆది సర్పమైన” అపవాదియగు సాతానును సంబోధిస్తూ యెహోవా ఇలా ప్రకటించాడు: ‘నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.’ (ప్రకటన 12:⁠9; ఆదికాండము 3:​15) పాపభరితమైన మానవజాతిని విమోచించాలన్నది యెహోవా సంకల్పం. అపాత్రమైన మంచితనానికి వ్యక్తీకరణగా, తన ప్రియమైన కుమారుని విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచేవారి రక్షణ కోసం, యెహోవా నిజంగానే అలాంటి ఒక ఏర్పాటును చేశాడు.​—⁠మత్తయి 20:​28; రోమీయులు 5:8, 12.

5. మనం జన్మతః చెడు హృదయాలోచనను సంతరించుకున్నప్పటికీ, కొంతమేరకు మంచితనాన్ని ఎలా చూపించగలము?

5 ఆదాము పాపము కారణంగా, మనం జన్మతః చెడు హృదయాలోచనను సంతరించుకున్నాము. (ఆదికాండము 8:​21) కానీ సంతోషకరంగా, మనం కొంతమేరకు మంచితనం చూపించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు. అమూల్యమైన పరిశుద్ధ లేఖనాలనుండి నేర్చుకున్నవాటిని ఎల్లప్పుడూ అభ్యసించడం ద్వారా ‘రక్షణార్థమైన జ్ఞానము మనకు కలగడమే’ కాకుండా మనం, ‘ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడివుంటూ,’ ఆయన దృష్టిలో మంచి చేసేందుకు శక్తిని కూడా పొందుతాము. (2 తిమోతి 3:​14-17) అయితే, మనం లేఖనాధార బోధలనుండి ప్రయోజనం పొంది మంచితనం చూపించాలంటే, ‘నీవు [యెహోవా] మంచివాడవు, నీవు మంచివాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము’ అని పాడిన కీర్తనకర్తలాంటి దృక్కోణాన్ని కలిగివుండాలి.​—⁠కీర్తన 119:​68, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యెహోవా మంచితనం స్తుతించబడింది

6. దావీదు రాజు నిబంధన మందసమును యెరూషలేముకు తెప్పించిన తర్వాత, లేవీయులు పాడిన పాటలో ఎలాంటి పదాలు ఉన్నాయి?

6 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు, దేవుని మంచితనాన్ని గుర్తించి ఆయన నడిపింపు కోసం అన్వేషించాడు. ‘యెహోవా ఉత్తముడును [“మంచివాడు,” NW] యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును’ అని దావీదు అన్నాడు. (కీర్తన 25:⁠8) ఇశ్రాయేలీయులకు దేవుని ఆదేశాలు ఇవ్వబడ్డాయి, వాటిలో రాతిపలకలమీద వ్రాయబడిన ముఖ్యమైన పది ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ రాతిపలకలు నిబంధన మందసము అనబడే పవిత్రమైన పెట్టెలో ఉంచబడేవి. దావీదు ఆ మందసమును ఇశ్రాయేలు రాజధాని యెరూషలేముకు తెప్పించిన తర్వాత, లేవీయులు పాడిన పాటలో ‘ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు! యెహోవా ప్రేమ [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరం కొనసాగుతుంది’ అన్న చరణం కూడా ఉంది. (1 దినవృత్తాంతములు 16:​34, 37-41, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) లేవీ గాయకుల నోటినుండి అలాంటి పదాలు వినడం ఎంత ఆహ్లాదకరంగా ఉండివుంటుందో కదా!

7. మందసమును అతి పరిశుద్ధస్థలముకు తీసుకువచ్చిన తర్వాత, సొలొమోను ప్రతిష్ఠాపన ప్రార్థన ముగించినప్పుడు ఏమి జరిగింది?

7 దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన యెహోవా మందిరమును ప్రతిష్ఠించేటప్పుడు కూడా అలాంటి స్తుతి పదాలకే ప్రాముఖ్యత ఇవ్వబడ్డాయి. కొత్తగా కట్టిన మందిరములోని అతి పరిశుద్ధ స్థలంలో యెహోవా నిబంధన మందసమును పెట్టిన తర్వాత ‘ప్రభువు మంచివాడు, దేవుని కరుణ [“ప్రేమపూర్వక దయ,” NW] శాశ్వతమైనది’ అని లేవీయులు స్తోత్రము చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో యెహోవా మహిమాన్వితమైన సమక్షానికి సూచనగా మందిరము అద్భుతమైన రీతిలో ఒక మేఘముతో నిండుకుపోయింది. (2 దినవృత్తాంతములు 5:​13, 14, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) సొలొమోను ప్రతిష్ఠాపన ప్రార్థన ముగించినప్పుడు, “అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను.” అది చూడగానే, ‘ఇశ్రాయేలీయులందరును సాష్టాంగ నమస్కారము చేసి​—⁠యెహోవా దయాళుడు [“మంచివాడు,” NW], ఆయన కృప [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.’ (2 దినవృత్తాంతములు 7:​1-3) 14 రోజులు పండుగ జరుపుకున్న తర్వాత, “దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును,” ఇశ్రాయేలీయులు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళారు.​—⁠2 దినవృత్తాంతములు 7:⁠10.

8, 9. (ఎ) ఇశ్రాయేలీయులు యెహోవా మంచితనాన్నిబట్టి ఆయనను స్తుతించినప్పటికీ, చివరికి వాళ్ళు ఏ మార్గంలో నడిచారు? (బి) యిర్మీయా ద్వారా యెరూషలేము గురించి ఏమని ప్రవచింపబడింది, ఆ ప్రవచనం ఎలా నెరవేరింది?

8 విషాదకరంగా, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన గీతాలకు అనుగుణంగా జీవించలేదు. కాలక్రమేణా, యూదా ప్రజలు ‘యెహోవాను పెదవులతోనే ఘనపరిచారు.’ (యెషయా 29:​13) దేవుని మంచితనపు ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి బదులుగా వాళ్ళు చెడు చేయడం ప్రారంభించారు. ఎలాంటి చెడుతనాన్ని అభ్యసించారు? వాళ్ళు విగ్రహారాధన, దుర్నీతి, పేదలపట్ల నిర్దయగా ప్రవర్తించడం వంటి వాటితోపాటు ఇతర ఘోరమైన పాపాల విషయంలో దోషులయ్యారు! తత్పర్యవసానంగా, సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడి, దానిలోని యూదా నివాసులు బబులోనుకు బందీలుగా తీసుకుపోబడ్డారు.

9 ఆ విధంగా దేవుడు తన ప్రజలకు క్రమశిక్షణనిచ్చాడు. కానీ, ‘యెహోవా మంచివాడు, ఆయన కృప [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరముండును’ అని పలికేవారి స్వరము యెరూషలేములో మళ్ళీ వినబడుతుందని యిర్మీయా ప్రవక్త ద్వారా భవిష్యత్తు గురించి ఆయన తెలియజేశాడు. (యిర్మీయా 33:​10, 11) సరిగ్గా అలాగే జరిగింది. ఆ దేశం 70 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉన్న తర్వాత, సా.శ.పూ. 537 లో యూదుల శేషము యెరూషలేముకు తిరిగి వచ్చింది. (యిర్మీయా 25:​11; దానియేలు 9:​1, 2) మోరీయా పర్వతము మీద మునుపు మందిరమున్న చోట బలిపీఠమును పునర్నిర్మించి బలులు అర్పించడం ప్రారంభించారు. వారు తిరిగి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరంలో మందిరపు పునాదులు వేయబడ్డాయి. అది ఎంత పులకరింపజేసే సమయమో కదా! ‘శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను, నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి​—⁠యెహోవా దయాళుడు, [“మంచివాడు,” NW] ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి.’​—⁠ఎజ్రా 3:​1-11.

10. ఎటువంటి గమనార్హమైన పదాలతో 118వ కీర్తన ప్రారంభమై, ముగుస్తుంది?

10 అనేక కీర్తనల్లో యెహోవా మంచితనం గురించి ఇలాంటి స్తుతి పదాలే కనబడతాయి. వాటిలో ఒకటి 118వ కీర్తన, దీన్ని పస్కా ఆచరణకు ముగింపుగా ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ కలిసి పాడేవి. ‘యెహోవా దయాళుడు [“మంచివాడు,” NW] ఆయన కృప [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి’ అనేవి ఆ కీర్తన ప్రారంభపు, ముగింపు పదాలు. (కీర్తన 118:​1, 29) సా.శ. 33 లో తన మరణానికి ముందుగా, యేసు తన విశ్వసనీయ అపొస్తలులతో చివరిసారిగా పాడిన స్తుతి పదాలు ఇవే కావచ్చు.​—⁠మత్తయి 26:​30.

‘దయచేసి నీ మహిమను నాకు చూపుము’

11, 12. దేవుని మహిమ యొక్క క్షణదర్శనాన్ని మోషే చూసినప్పుడు, ఎలాంటి ప్రకటనను విన్నాడు?

11 యెహోవా మంచితనానికి, ప్రేమపూర్వక దయకు మధ్య సంబంధమున్నట్లుగా, ఎజ్రా కాలానికి శతాబ్దాల క్రితమే మొదటిసారిగా చూపించబడింది. ఇశ్రాయేలీయులు అరణ్యములో బంగారు దూడను ఆరాధించిన తర్వాత, తప్పిదస్థులు చంపబడిన కొద్దికాలానికి మోషే యెహోవాను ఇలా వేడుకొన్నాడు: ‘దయచేసి నీ మహిమను నాకు చూపుము.’ మోషే తన ముఖమును చూసి బ్రతకలేడని తెలిసిన యెహోవా ఇలా అన్నాడు: “నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను.”​—⁠నిర్గమకాండము 33:​13-20.

12 ఆ మరుసటి దినం సీనాయి పర్వతముమీద యెహోవా మంచితనం మోషేకు కనబడింది. ఆ సమయంలో మోషే దేవుని మహిమ యొక్క క్షణదర్శనాన్ని చూస్తూ, ఈ ప్రకటనను విన్నాడు: ‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా [“ప్రేమపూర్వక దయ” NW] సత్యములుగల దేవుడైన యెహోవా, ఆయన వేయి వేలమందికి కృపను [“ప్రేమపూర్వక దయను” NW] చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును.’ (నిర్గమకాండము 34:​6, 7) యెహోవా మంచితనానికి ఆయన ప్రేమపూర్వక దయతోను, ఆయన వ్యక్తిత్వపు ఇతర లక్షణాలతోను సంబంధముందని ఈ మాటలు సూచిస్తున్నాయి. వీటిని పరిశీలించడం, మనం మంచితనం చూపించడానికి సహాయకరంగా ఉంటుంది. దేవుని మంచితనం యొక్క ఈ అద్భుతమైన ప్రకటనలో రెండుసార్లు ప్రస్తావించబడిన లక్షణాన్ని మొదట పరిశీలిద్దాం.

‘విస్తారమైన ప్రేమపూర్వక దయగల దేవుడు’

13. దేవుని మంచితనం గురించి చేసిన ప్రకటనలో, రెండుసార్లు పేర్కొన్న లక్షణమేది, అదెందుకు యుక్తమైనది?

13‘యెహోవా విస్తారమైన ప్రేమపూర్వక దయగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి ప్రేమపూర్వక దయను చూపును.’ “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి, “యథార్థమైన ప్రేమ” అనే అర్థం కూడా ఉంది. దేవుడు మోషేకు చేసిన ప్రకటనలో ఈ ఒక్క లక్షణమే రెండుసార్లు పేర్కొనబడింది. యెహోవా యొక్క సర్వోన్నతమైన లక్షణం ప్రేమే కాబట్టి, అదెంత యుక్తమైనదో కదా! (1 యోహాను 4:⁠8) యెహోవాను స్తుతించడంలో ప్రఖ్యాతిగాంచిన, ‘యెహోవా మంచివాడు, ఆయన కృప [“ప్రేమపూర్వక దయ,” NW] నిరంతరముండును’ అనే పదాలు ఈ లక్షణాన్ని నొక్కి చెబుతున్నాయి.

14. దేవుని మంచితనాన్ని, ఆయన ప్రేమపూర్వక దయను ప్రత్యేకంగా ఎవరు అనుభవిస్తారు?

14 యెహోవా మంచితనానికి ఒక వ్యక్తీకరణ ఏమిటంటే, ఆయన ‘విస్తారమైన ప్రేమపూర్వక దయగలవాడు.’ ఇది ప్రత్యేకంగా ఆయన తన సమర్పిత, విశ్వాసులైన సేవకులపట్ల చూపించే ప్రేమపూర్వక శ్రద్ధలో వ్యక్తమవుతుంది. (1 పేతురు 5:​6, 7) ఆయనను ప్రేమించి, ఆయనను సేవించేవారిపట్ల ఆయన ‘ప్రేమపూర్వక దయను చూపును,’ అన్న దానికి యెహోవాసాక్షులు నిదర్శనంగా ఉన్నారు. (నిర్గమకాండము 20:⁠6, NW) సహజ ఇశ్రాయేలు జనాంగం, యెహోవా కుమారుణ్ణి తిరస్కరించింది కాబట్టి, యెహోవా ప్రేమపూర్వక దయను లేక యథార్థమైన ప్రేమను అనుభవించలేకపోయింది. కాని దేవుని మంచితనము, యథార్థమైన ప్రేమ అన్ని జనాంగాల్లోని విశ్వాసులైన క్రైస్తవులపట్ల నిరంతరం ఉంటాయి.​—⁠యోహాను 3:​36.

యెహోవా కనికరము, దయగలవాడు

15. (ఎ) సీనాయి పర్వతం మీద మోషే విన్న ప్రకటన, ఎలాంటి మాటలతో ప్రారంభమైంది? (బి) కనికరంలో ఏమి ఇమిడి ఉంది?

15‘యెహోవా కనికరము, దయగల దేవుడైన యెహోవా’ అనేవి సీనాయి పర్వతం మీద మోషే విన్న ప్రకటనలోని ప్రారంభ మాటలు. “కనికరము” అని అనువదించబడిన హీబ్రూ పదం ‘ఆంత్రములను’ సూచిస్తుండవచ్చు, దానికీ “గర్భకోశం” అనే పదానికీ చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. కాబట్టి, కనికరములో ఒక వ్యక్తి హృదయాంతరాల్లో జాలితోనిండిన సున్నితమైన భావాలు ఉన్నాయి. అయితే, కనికరంలో యథార్థమైన జాలి కంటే ఎక్కువే ఉంది. కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం కలిగించడానికి ఏదైనా చేసేందుకు అది పురికొల్పాలి. ఉదాహరణకు, ప్రేమపూర్వకమైన క్రైస్తవ పెద్దలు తోటి విశ్వాసులపట్ల కనికరం చూపించాల్సిన అవసరాన్ని గ్రహిస్తారు, యుక్తమైనప్పుడు ‘సంతోషముతో కరుణ చూపిస్తారు.’​—⁠రోమీయులు 12:⁠8; యాకోబు 2:​13; యూదా 22, 23.

16. యెహోవా దయగలవాడని ఎందుకు చెప్పవచ్చు?

16 దేవుని మంచితనం, ఆయన దయలో కూడా వ్యక్తమవుతుంది. దయగల ఒక వ్యక్తి, ఇతరుల భావాలను గమనార్హంగా పరిగణలోకి తీసుకుంటాడు, ప్రత్యేకంగా అల్పులపట్ల ప్రశంసార్హమైన దయను చూపిస్తాడు. తన విశ్వాసులైన సేవకులతో వ్యవహరించేటప్పుడు, దయ చూపడంలో యెహోవా అత్యంత గొప్ప మాదిరి. ఉదాహరణకు దేవుడు దయతో, వృద్ధుడైన దానియేలును దేవదూతల ద్వారా బలపరిచాడు, యేసుకు జన్మనిచ్చే ఆధిక్యత గురించి కన్య మరియకు తెలియజేశాడు. (దానియేలు 10:​19; లూకా 1:​26-38) బైబిలు ద్వారా ఆయన మనపట్ల దయను చూపించే విధానాన్నిబట్టి, యెహోవా ప్రజలుగా మనం తప్పకుండా కృతజ్ఞులమై ఉండాలి. ఆయన మంచితనం యొక్క ఈ వ్యక్తీకరణను బట్టి మనం ఆయనను స్తుతిద్దాం, ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయతో ఉండేందుకు కృషి చేద్దాం. ఆధ్యాత్మిక అర్హతలుగలవారు ఒక తోటి విశ్వాసిని సరిదిద్దేటప్పుడు, “సాత్వికమైన మనస్సుతో,” సౌమ్యతతో, దయతో సరిదిద్దుతారు.​—⁠గలతీయులు 6:⁠1.

దీర్ఘశాంతముగల దేవుడు

17. యెహోవా “దీర్ఘశాంతము” కలిగి ఉన్నందుకు మనమెందుకు కృతజ్ఞులమై ఉండాలి?

17‘దీర్ఘశాంతముగల దేవుడు.’ ఆ మాటలు యెహోవా మంచితనం యొక్క మరొక పార్శ్వాన్ని నొక్కి చెబుతున్నాయి. యెహోవా మన తప్పులను సహిస్తూ, మనము ప్రమాదకరమైన బలహీనతలను అధిగమించి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు ఓపికతో మనకు సమయం ఇస్తాడు. (హెబ్రీయులు 5:⁠12-6:⁠3; యాకోబు 5:​14, 15) దేవుని సహనం, ఇంకా ఆయన ఆరాధకులుగా మారనివారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. రాజ్య సువార్తకు స్పందించి పశ్చాత్తాపం చెందడానికి వాళ్ళకు ఇంకా సమయం ఉంది. (రోమీయులు 2:⁠4) యెహోవా సహనం చూపిస్తున్నప్పటికీ, సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించినప్పుడు ఆయన కోపాన్ని చూపించినట్లు, ఆయన మంచితనం కొన్నిసార్లు తన కోపాన్ని చూపించడానికి ఆయనను పురికొలుపుతుంది. సాతాను దుష్ట విధానాన్ని అంతమొందించడానికి, దేవుని కోపం ఇంకా తీవ్రమైన రీతిలో అతి త్వరలో వ్యక్తమవుతుంది.​—⁠యెహెజ్కేలు 38:​19, 21-23.

18. సత్యం విషయంలో, యెహోవాకు మానవ పరిపాలకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?

18‘యెహోవా విస్తారమైన సత్యముగల దేవుడు.’ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చడంలో తప్పిపోయే మానవ పరిపాలకులకు దేవునికి ఎంత వ్యత్యాసం! యెహోవా ఆరాధకులు ఆయన తన వాక్యంలో చెప్పిన వాటన్నింటిపైనా ఆధారపడవచ్చు. దేవుడు విస్తారమైన సత్యముగలవాడు కాబట్టి, మనం ఆయన వాగ్దానాలను ఎల్లప్పుడూ నమ్మవచ్చు. ఆధ్యాత్మిక సత్యాల కోసం మనం చేసే ప్రార్థనలకు, మన పరలోకపు తండ్రి తన మంచితనాన్నిబట్టి మనకు సత్యాలను విస్తారంగా అందిస్తూ తప్పకుండా జవాబులు ఇస్తాడు.​—⁠కీర్తన 43:⁠3; 65:⁠2.

19. పశ్చాత్తాపపడుతున్న పాపులపట్ల యెహోవా తన మంచితనాన్ని అత్యంత గమనార్హమైన రీతిలో ఎలా వ్యక్తీకరించాడు?

19‘యెహోవా అపరాధమును పాపమును క్షమించే దేవుడు.’ పశ్చాత్తాపపడుతున్న పాపులను క్షమించడానికి యెహోవా తన మంచితనాన్నిబట్టి సిద్ధంగా ఉంటాడు. మన ప్రేమపూర్వకమైన పరలోక తండ్రి, యేసు బలి ద్వారా క్షమాపణ పొందే ఏర్పాటు చేసినందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. (1 యోహాను 2:​1, 2) విమోచన క్రయధన బలియందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ, యెహోవా వాగ్దానం చేసిన నూతన లోకంలో నిరంతర జీవితపు నిరీక్షణ కలిగివుండి, ఆయనతో అత్యద్భుతమైన సంబంధాన్ని అనుభవించే అవకాశం ఉన్నందుకు మనం నిజంగా సంతోషిస్తున్నాము. యెహోవా మానవాళిపట్ల మంచితనాన్ని వ్యక్తీకరిస్తున్నందుకు, ఆయనను శ్లాఘించడానికి ఇవి నిజంగా విశిష్టమైన కారణాలు!​—⁠2 పేతురు 3:​13.

20. దేవుడు చెడుతనాన్ని నిర్లక్ష్యం చేయడు అనేందుకు రుజువేమిటి?

20‘యెహోవా ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.’ వాస్తవానికి, యెహోవా మంచితనాన్నిబట్టి ఆయనను స్తుతించేందుకు ఇది మరొక కారణం. ఎందుకు? ఎందుకంటే చెడుతనాన్ని ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకపోవడమే మంచితనం యొక్క ముఖ్యమైన విలక్షణం. అంతేకాదు, “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై”నప్పుడు, “దేవుని నెరుగనివారికిని, . . . సువార్తకు లోబడని వారికిని” ప్రతిదండన చేయబడుతుంది. వారు “నిత్యనాశనమను దండన పొందుదురు.” (2 థెస్సలొనీకయులు 1:​6-9) రక్షించబడిన యెహోవా ఆరాధకులు, ‘సజ్జనద్వేషులైన’ భక్తిహీనులచేత కలతచెందకుండా జీవితాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు.​—⁠2 తిమోతి 3:​1-3.

యెహోవా మంచితనాన్ని అనుకరించండి

21. మనమెందుకు మంచితనం చూపించాలి?

21 యెహోవా మంచితనాన్నిబట్టి ఆయనను స్తుతించేందుకు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు మనకు అనేక కారణాలున్నాయన్నది నిర్వివాదాంశం. ఆయన సేవకులుగా మనం ఆ లక్షణాన్ని చూపించేందుకు మనకు సాధ్యమైనంత వరకు కృషి చేయకూడదా? తప్పకుండా చేయాలి, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను ఇలా ఉద్భోదించాడు: “ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:⁠1) మన పరలోకపు తండ్రి మంచితనాన్ని ఎల్లప్పుడూ చూపిస్తాడు, మనమూ అలాగే చూపిద్దాం.

22. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాము?

22 మనం సంపూర్ణ హృదయంతో యెహోవాకు సమర్పించుకున్నట్లయితే, నిస్సందేహంగా ఆయన మంచితనాన్ని అనుకరించాలని గాఢంగా కోరుకుంటాము. మనం పాపభరితుడైన ఆదాము సంతానం కాబట్టి, మంచి చేయడమనేది అంత సులభమేమీ కాదని మనం గ్రహిస్తాము. అయినప్పటికీ, మంచితనం చూపించడం మనకెలా సాధ్యమవుతుందో దీని తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. మంచితనానికి సర్వోత్కృష్ట మాదిరైన యెహోవాను అనుకరించగల, అనుకరించాల్సిన అనేక మార్గాలను కూడా పరిశీలిద్దాం.

మీరెలా జవాబిస్తారు?

• మంచితనం అంటే ఏమిటి?

• లేఖనాల్లోని ఏ పదబంధం దేవుని మంచితనాన్ని నొక్కి చెప్పింది?

• యెహోవా మంచితనం యొక్క కొన్ని వ్యక్తీకరణలు ఏవి?

• మంచితనం చూపించే విషయంలో మనం యెహోవాను ఎందుకు అనుకరించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాలంలోని తన ప్రజలు తాము స్తుతించినదానికి అనుగుణంగా జీవించలేదు కాబట్టి, యెహోవా వారిపై క్రమశిక్షణా చర్యను తీసుకున్నాడు

[12వ పేజీలోని చిత్రం]

విశ్వసనీయమైన శేషం యెరూషలేముకు తిరిగివచ్చింది

[13వ పేజీలోని చిత్రం]

దేవుని మంచితనం గురించిన ఒక అద్భుతమైన ప్రకటనను మోషే విన్నాడు

[15వ పేజీలోని చిత్రం]

బైబిల్లో యెహోవా మనకు విజ్ఞప్తిచేస్తున్న విధానంలో మనకు ఆయన మంచితనం కనబడుతుంది