కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి

సత్క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి

సత్క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి

నిజ క్రైస్తవులు తమ మంచి ప్రవర్తన ద్వారా, మాదిరికరమైన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ తెస్తారు. (1 పేతురు 2:​12) ఇటీవలి సంవత్సరాల్లో ఇటలీలో జరిగిన దాన్నిబట్టి అది అర్థమవుతుంది.

1997 సెప్టెంబరులో, మార్షెలోనూ, ఉంబ్రియాలోనూ పలుప్రాంతాల్లో భయంకరమైన భూకంపం వచ్చింది. దాదాపు 90,000 ఇండ్లు దెబ్బతిన్నాయి. అనేకమంది యెహోవాసాక్షులు, తమ తోటి విశ్వాసులతోపాటు ఇతరులకు వెంటనే సహాయాన్ని అందించారు. ట్రేలర్లు, స్లీపింగ్‌ బ్యాగులు, స్టౌలు, జనరేటర్లు, అవసరమైన ఇతర వస్తువులను అందించారు. ఈ సహాయ చర్యలు గుర్తించబడకుండా పోలేదు.

ఈల్‌ షెంట్రో అనే దినపత్రిక ఇలా నివేదించింది: “భూకంపానికి గురైన ప్రాంతాలకు సహాయక వస్తువులతో మొట్ట మొదట చేరుకున్నది రోసెటోలోని [టెరమో మండలంలో ఉంది] యెహోవాసాక్షులే . . . ప్రార్థన చేసుకోవడానికి తరచుగా కూడుకోవడమే కాకుండా, యెహోవాకు నమ్మకస్థులైన వీరు ఆచరణాత్మకమైన విధంగా పని చేశారు, బాధితులు ఏ మతానికి చెందినవారన్నదేమీ పట్టించుకోకుండా అందరికీ చేయూతనిచ్చారు.”

తీవ్ర విధ్వంసానికి గురైన పట్టణాల్లో ఒకటైన నోచేరా ఉంబ్రా యొక్క మేయర్‌, యెహోవాసాక్షులకు ఇలా వ్రాశాడు: “నోచేరా ప్రజలకు మీరు అందించిన సహాయానికి నేను వ్యక్తిగతంగా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుతున్నాను. ఇక్కడి పౌరులందరు కూడా ఇలాంటి భావాలనే వ్యక్తం చేస్తున్నారని నా ప్రగాఢ నమ్మకం.” అంతేగాకుండా, ఇటలీ గృహ మంత్రిత్వ శాఖ, కాంగ్రేగాట్స్యోనే క్రీస్ట్యానా డే టెస్టీమోనీ డీ ఝేయోవాకు (యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘం) “మార్షె మరియు ఉంబ్రియా ప్రాంతాల్లో ఎదురైన అత్యవసర పరిస్థితుల్లో చేసిన ప్రశస్తసేవకు, అందించిన సహాయక చర్యల్లోని కృషికి గుర్తింపు”గా, ఒక సర్టిఫికెట్‌ను, మరియు ఒక పతకమును మంజూరు చేసింది.

2000 అక్టోబరులో, ఇటలీకి ఉత్తరాన ఉన్న ప్యేమోంటే ప్రాంతం వినాశకరమైన వరదలకు గురైంది. ఈ సారి కూడా, సహాయక చర్యలందించడానికి యెహోవాసాక్షులు వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఈ సత్క్రియలు కూడా గుర్తించబడకుండా పోలేదు. ప్యేమోంటే ప్రభుత్వం, “వరదలకు గురైన ప్యేమోంటే ప్రజలకు అందించిన అమూల్యమైన స్వచ్ఛంద సేవకు” గుర్తింపుగా ఒక స్మారక చిహ్నాన్ని బహూకరించింది.

యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలా ఆదేశించాడు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:​16) యెహోవాసాక్షులు తమ పొరుగువారికి ఆధ్యాత్మికంగానూ ఇతర విధాలుగానూ సహాయపడే “సత్క్రియల” ద్వారా తమను తాము మహిమపరచుకోకుండా దేవుణ్ణి సంతోషంగా మహిమపరుస్తారు.