కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొండ మీది పట్టణం

కొండ మీది పట్టణం

కొండ మీది పట్టణం

యేసు కొండ మీద ఇచ్చిన ప్రఖ్యాతి గాంచిన ప్రసంగంలో, “మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు” అని తన శిష్యులకు చెప్పాడు.​—⁠మత్తయి 5:​14.

యూదయ గలిలయ పట్టణాలు అనేకము లోయ ప్రాంతాల్లో కన్నా కొండలమీదే ఉండేవి. పట్టణాలను నెలకొల్పడానికి కొండశిఖరాలను ఎంపిక చేసుకోవడానికి ముఖ్యకారణం అవి సురక్షితంగా ఉండడమే. దండెత్తి వచ్చే సైనికులే కాక, ఇతర గుంపులు కూడా ఇశ్రాయేలీయుల నివాసస్థలాలపై దాడి చేసేవారు. (2 రాజులు 5:⁠2; 24:⁠2) ధైర్యవంతులైన పౌరులు లోయప్రాంతాల్లోని ఇండ్లకన్నా కొండ శిఖరం మీద దగ్గర దగ్గరగా ఉన్న ఇండ్ల సముదాయాలను సులభంగా కాపాడుకోగలిగేవారు. లోయప్రాంతాల్లోని పట్టణాల భద్రతకు ఇంకా పెద్ద ప్రహరీ గోడలు అవసరమయ్యేవి.

యూదుల ఇండ్ల గోడలకు తరచూ సున్నం కొట్టబడేది కనుక, కొండ శిఖరం మీద దగ్గర దగ్గరగా ఉండే ఇండ్ల సముదాయం, చుట్టుప్రక్కల మైళ్ళ దూరం నుండి కూడా స్పష్టంగా కనబడేది. (అపొస్తలుల కార్యములు 23:⁠3) ఇప్పటికీ మన కాలంలో కూడా కాంతులీనుతున్న మధ్యధరా పట్టణాల్లాగే, పాలస్తీనాలోని కొండ మీది పట్టణాలు కూడా ఉజ్జ్వలమైన సూర్య ప్రకాశంలో దీపస్తంభాల్లా ప్రకాశమానంగా కనిపిస్తాయి.

గలిలయ యూదయ ప్రాంతాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే ఈ దృశ్యాన్ని, నిజ క్రైస్తవుల పాత్రను తన అనుచరులకు బోధించడానికి యేసు ఉపయోగించాడు. “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని వారికి చెప్పాడు. (మత్తయి 5:​16) క్రైస్తవులు మానవుల ప్రశంసల కోసం సత్క్రియలను చేయకపోయినప్పటికీ, వాళ్ళ మంచి ప్రవర్తన గమనించబడుతుంది.​—⁠మత్తయి 6:⁠1.

అలాంటి మంచి ప్రవర్తన ముఖ్యంగా, యెహోవాసాక్షుల జిల్లా సమావేశాల సమయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. స్పెయిన్‌లోని ఒక వార్తాపత్రిక, ఇటీవల జరిగిన సమావేశాన్ని గురించి చెబుతూ, “మిగతా సముదాయాలవారిలో మతసంబంధ అంశాలపై ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతుండగా, యెహోవాసాక్షులకు మాత్రం తగ్గడం లేదు. తమ జీవితంలో బైబిలుకున్న ఆచరణాత్మక విలువను పోగొట్టుకోవడం వాళ్ళకిష్టం లేదు, అందుకే వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెడతారు” అని నివేదించింది.

వాయవ్య స్పెయిన్‌లో సాక్షులు సాధారణంగా వాడుకునే స్టేడియమ్‌కి సంరక్షుడిగా పనిచేసే థామస్‌, దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టే వ్యక్తుల మధ్య ఉండడానికి ఆనందించేవాడు. తాను యెహోవాసాక్షుల జిల్లా సమావేశ సమయంలో అక్కడ ఉండటానికి వీలుగా తన పదవీ విరమణను మరి కొన్ని వారాలకు పొడిగించుకున్నాడు. యౌవనులతో సహా, సమావేశానికి హాజరైన అనేకులు, సమావేశం అయిపోయిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చి, అనేక సంవత్సరాలుగా ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు చెప్పి, రిటైర్మెంటు జీవితం ఆనందంగా గడపమని శుభాకాంక్షలను తెలిపినప్పుడు, ఆయనకు కంట నీళ్ళు వచ్చాయి. “మీలాంటి ప్రజల గురించి తెలుసుకోగలగడం, నా జీవితంలోని అతి శ్రేష్ఠమైన అనుభవాల్లో ఒకటి” అని ఆయన అన్నాడు.

కొండమీద ఉన్న పట్టణము, పరిశీలకుల అవధానాన్ని ఆకర్షిస్తుంది, ఎందుకంటే, అది క్షితిజ సమాంతరంగా కొట్టొచ్చినట్లు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ పట్టణంలోని తెల్లని ఇండ్లన్నీ సూర్యుని ప్రకాశాన్ని ప్రతిఫలిస్తాయి. అదే విధంగా నిజక్రైస్తవులు ప్రత్యేకంగా కనబడతారు, ఎందుకంటే, వాళ్ళు నిజాయితీ, నైతికత, సానుభూతి అనే ఉన్నత ప్రమాణాలను అనుసరించడానికి శ్రమిస్తారు.

అంతేకాక, క్రైస్తవులు సత్యపు వెలుగును తమ ప్రకటనా పని ద్వారా ప్రతిఫలిస్తారు. “ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.  . . సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు” ఉన్నాము అని అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి వ్రాశాడు. (2 కొరింథీయులు 4:​1, 2) వాళ్ళు ప్రకటించిన చోటెల్లా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, యెహోవా వారి పరిచర్యను ఆశీర్వదించాడు కనుక, ఇంచుమించు సా.శ. 60వ సంవత్సరం నాటికి, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త ప్రకటించబడినదని పౌలు వ్రాయగలిగాడు.​—⁠కొలొస్సయులు 1:⁠23.

నేడు, యెహోవాసాక్షులు కూడా, యేసు ఆజ్ఞాపించినట్లు, ‘మనుష్యుల యెదుట తమ వెలుగును ప్రకాశింపనియ్యవలసిన’ బాధ్యతను గంభీరంగా తీసుకుంటారు. వారు నోటి మాట ద్వారా, ప్రచురించబడిన సమాచారం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా 235 దేశాల్లో సువార్తను వ్యాపింపజేస్తున్నారు. బైబిలు సత్యపు వెలుగు సాధ్యమైనంత మందికి చేరుకునేలా, వారు తమ బైబిలు ప్రచురణలు ఇంచుమించు 370 భాషల్లో అందుబాటులో ఉండేలా చేశారు.​—⁠మత్తయి 24:​14; ప్రకటన 14:⁠6, 7.

ప్రకటనా పని ఈ మధ్య నిషేధించబడిన దేశాల నుండీ, కొంత కాలంగా నిషేధించబడిన దేశాల నుండీ వలసవచ్చిన ప్రజల భాషలను నేర్చుకోవడమనే సవాలును అనేక ప్రాంతాల్లోని సాక్షులు చేపట్టారు. ఉదాహరణకు, ఉత్తర అమెరికాలోని అనేక పెద్ద నగరాలకు, చైనా నుండి రష్యా నుండి ప్రజలు గొప్ప సంఖ్యలో వెల్లువలా వస్తున్నారు. స్థానిక సాక్షులు, అక్కడికి క్రొత్తగా వచ్చినవారికి సువార్తను ప్రకటించేందుకు చైనీస్‌, రష్యన్‌, మరితర భాషలను నేర్చుకోవడానికి తీవ్రంగా కృషిచేశారు. పొలము “తెల్లబారి కోతకు వచ్చియున్న” ఈ కాలంలోనే మరి కొందరికి సువార్త ప్రకటించబడేందుకుగాను అనేక భాషలను త్వరగా నేర్పే క్లాసులు నిర్వహించబడుతున్నాయి.​—⁠యోహాను 4:⁠35.

“అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు” అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలు, యెహోవా దేవుని మార్గముల విషయమై బోధించబడి, ఆయన త్రోవలలో నడవడం నేర్చుకునేందుకు, “యెహోవా పర్వతమునకు” రావడానికి యెహోవాసాక్షులు తమ ప్రవర్తన ద్వారా అలాగే పరిచర్య ద్వారా వారికి సహాయపడుతున్నారు. (యెషయా 2:​2, 3) సంతోషకరమైన ఫలితమేమిటంటే, యేసు చెప్పినట్లు, వాళ్ళు ప్రజలతో కలిసి, ‘పరలోకమందున్న తమ తండ్రి’యైన యెహోవా దేవుణ్ణి ‘మహిమపరుస్తారు.’​—⁠మత్తయి 5:​16; 1 పేతురు 2:⁠12.