కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ప్రేమించేవారిలో మీరూ ఉన్నారా?

దేవుడు ప్రేమించేవారిలో మీరూ ఉన్నారా?

దేవుడు ప్రేమించేవారిలో మీరూ ఉన్నారా?

‘నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును.’​యోహాను 14:⁠21.

1, 2. (ఎ) మానవజాతిపై తనకున్న ప్రేమను యెహోవా ఎలా చూపించాడు? (బి) సా.శ. 33, నీసాను 14 రాత్రి యేసు ఏమి ప్రారంభించాడు?

యెహోవా తన సృష్టియైన మానవులను ప్రేమిస్తాడు. నిజానికి ఆయన మానవ ప్రపంచాన్ని ‘ఎంతో ప్రేమిస్తాడు’ కాబట్టే, ‘ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు.’ (యోహాను 3:​16) క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించే సమయం దగ్గరవుతుండగా, యెహోవా “మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను” అన్న విషయాన్ని నిజ క్రైస్తవులు మునుపెన్నటి కన్నా ఎక్కువగా గుర్తుంచుకోవాలి.​—⁠1 యోహాను 4:⁠10.

2 ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విడుదలకు జ్ఞాపకార్థంగా పస్కా పండుగను ఆచరించేందుకు, సా.శ. 33, నీసాను 14 రాత్రి, యెరూషలేములోని ఒక మేడగదిలో యేసూ, 12 మంది అపొస్తలులూ సమావేశమయ్యారు. (మత్తయి 26:​17-20) ఆ యూదుల పండుగను ఆచరించడం ముగిసిన తర్వాత యేసు క్రీస్తు, ఇస్కరియోతు యూదాను పంపివేసి, ఒక స్మారక భోజనాన్ని ప్రారంభించాడు. అదే తర్వాత క్రీస్తు మరణానికి క్రైస్తవ జ్ఞాపకార్థంగా మారింది. * యేసు, పులియని రొట్టెను ఎర్రని ద్రాక్షారసమును తన భౌతిక శరీరానికి రక్తానికి చిహ్నాలుగా లేదా సూచనలుగా ఉపయోగించి, మిగిలివున్న 11 మంది శిష్యులకు ఆ భోజనంలో పాళ్ళు ఇచ్చాడు. ఆయన దానిని ఎలా ప్రారంభించాడన్న దానికి సంబంధించిన వివరాలు, ఒకే దృష్టిగల మత్తయి, మార్కు, లూకా సువార్తల ద్వారా, అలాగే అపొస్తలుడైన పౌలు ద్వారా తెలియజేయబడ్డాయి. పౌలు దానిని “ప్రభువు రాత్రి భోజనము” అని పిలిచాడు.​—⁠1 కొరింథీయులు 11:​20; మత్తయి 26:​26-28; మార్కు 14:​22-25; లూకా 22:19, 20.

3. మేడగదిలో తన శిష్యులతో యేసు గడిపిన చివరి గంటలను గురించి అపొస్తలుడైన యోహాను వ్రాసిన వృత్తాంతం ముఖ్యంగా ఏయే విధాల్లో ఇతర వృత్తాంతాలకు భిన్నంగా ఉంది?

3 రొట్టెను ద్రాక్షారసాన్ని ఒకరి తర్వాత మరొకరికి అందించుకోవడాన్ని గురించి అపొస్తలుడైన యోహాను ఏమి చెప్పకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయన దాన్ని ప్రస్తావించకపోవడానికి కారణం ఆయన తన సువార్తను వ్రాసే సమయానికల్లా (దాదాపు సా.శ. 98) ఆ పద్ధతి తొలిక్రైస్తవుల మధ్య బాగా స్థిరపడిపోవడమే కావచ్చు. (1 కొరింథీయులు 11:​23-26) అయితే, యేసు తన మరణ జ్ఞాపకార్థాన్ని స్థాపించడానికి ముందు, ఆ తర్వాత చెప్పిన విషయాలు చేసిన కార్యాలు గురించిన ప్రాముఖ్యమైన కొంత సమాచారాన్ని దైవ ప్రేరేపణతో, యోహాను మాత్రమే మనకు తెలియజేశాడు. ప్రేరణాత్మకమైన ఆ వివరాలను వ్రాయడానికి యోహాను సువార్తలో ఐదు అధ్యాయాలు పట్టాయి. దేవుడు ఎటువంటి వ్యక్తులను ప్రేమిస్తాడన్న విషయాన్ని ఈ అధ్యాయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనం యోహాను 13 నుండి 17 అధ్యాయాలను పరిశీలిద్దాం.

యేసు చూపిన మాదిరికరమైన ప్రేమ నుండి నేర్చుకోండి

4. (ఎ) యేసు జ్ఞాపకార్థాన్ని స్థాపించినప్పుడు తన శిష్యులతో జరిపిన సమావేశపు ప్రముఖ అంశాన్ని యోహాను ఎలా నొక్కి చెప్పాడు? (బి) యెహోవా యేసును ప్రేమించడానికి గల ప్రముఖ కారణం ఏమిటి?

4 యేసు తన అనుచరులను విడిచి వెళ్ళకముందు వారికి ఇచ్చిన ఉపదేశం ఉన్న ఈ అధ్యాయాల్లో ప్రేమ ఒక ముఖ్యాంశంగా ఉంది. వాస్తవానికి, “ప్రేమ” అనే మాట వివిధ రూపాల్లో 31 సార్లు కనిపిస్తుంది. తన తండ్రియైన యెహోవా మీద, తన శిష్యుల మీద యేసుకు ఉన్న ప్రగాఢమైన ప్రేమ మరెక్కడికన్నా ఈ అధ్యాయాల్లోనే ఎక్కువగా స్పష్టమవుతుంది. యెహోవా మీద యేసుకున్న ప్రేమ ఆయన జీవితాన్ని గురించిన సువార్త వృత్తాంతాలన్నింటిలోను కనిపిస్తుంది. కానీ, ‘నేను తండ్రిని ప్రేమిస్తున్నాను’ అని యేసు స్పష్టంగా చెప్పాడన్న విషయాన్ని కేవలం యోహాను మాత్రమే వ్రాశాడు. (యోహాను 14:​31) యేసు, తనను యెహోవా ప్రేమిస్తున్నాడని కూడా చెప్పి, అందుకుగల కారణాన్ని వివరించాడు. “తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని; నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని ఆయన అన్నాడు. (యోహాను 15:​9, 10) అవును, తన కుమారుడు సంపూర్ణ విధేయతను చూపిస్తాడు కనుకనే యెహోవా ఆయనను ప్రేమిస్తాడు. యేసు క్రీస్తు అనుచరులందరికీ అదెంత చక్కని పాఠం!

5. తనకు తన శిష్యుల మీదున్న ప్రేమను యేసు ఎలా కనబరచాడు?

5 తన అనుచరుల మీద యేసుకున్న లోతైన ప్రేమ, అపొస్తలులతో ఆయన చివరి సమావేశాన్ని గురించిన యోహాను వృత్తాంతం ప్రారంభంలోనే నొక్కిచెప్పబడింది. “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను” అని యోహాను చెప్పాడు. (యోహాను 13:⁠1) చిరస్మరణీయమైన ఆ సాయంకాలం, ఇతరులకు ప్రేమపూర్వకంగా సేవ చేసే విషయంలో మరపురాని పాఠాన్ని ఆయన నేర్పాడు. ఆయన వారి పాదాలను కడిగాడు. వారిలో ప్రతి ఒక్కరు యేసుకు, తన సహోదరులకు అలా చేయడానికి సిద్ధమనస్సు చూపాల్సింది, కాని వారలా చేయలేదు. యేసు ఆ తక్కువ స్థాయి పని చేసి, ఆ తర్వాత, “ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అని తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 13:​14, 15) నిజ క్రైస్తవులు తమ సహోదరులకు పరిచారము చేయడానికి సిద్ధమనస్సు చూపాలి, అలా పరిచారము చేయడానికి సంతోషించాలి.​—⁠మత్తయి 20:​26, 27; యోహాను 13:⁠17.

క్రొత్త ఆజ్ఞను అనుసరించండి

6, 7. (ఎ) జ్ఞాపకార్థ స్థాపన గురించి యోహాను అందజేసిన ప్రాముఖ్యమైన వివరాలు ఏవి? (బి) యేసు తన శిష్యులకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏమిటి, దానిలో క్రొత్త విషయమేముంది?

6 నీసాను 14 రాత్రి మేడగదిలో జరిగిన దాని గురించి యోహాను వ్రాసిన వృత్తాంతం మాత్రమే ఇస్కరియోతు యూదా మధ్యలో వెళ్ళిపోయాడన్న విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటోంది. (యోహాను 13:​21-30) ఆ నమ్మకద్రోహి వెళ్ళిపోయిన తర్వాతే యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను స్థాపించాడన్న విషయం, సువార్త వృత్తాంతాలన్నింటినీ పోల్చి చూస్తే తెలుస్తుంది. నమ్మకస్థులైన తన అపొస్తలులకు ఆయన వీడ్కోలు ఉపదేశాన్ని నిర్దేశాలను ఇస్తూ అన్నీ విడమర్చి చెప్పాడు. మనం జ్ఞాపకార్థానికి హాజరయ్యేందుకు సిద్ధపడుతుండగా, ఆ సందర్భంలో యేసు చెప్పిన విషయాల మీద ఎంతో ఆసక్తిని చూపాలి, ముఖ్యంగా, దేవుడు ప్రేమించేవారిలో మనం ఉండాలని నిశ్చయంగా కోరుకుంటున్నందువల్ల అలా ఆసక్తి చూపాలి.

7 తన మరణ జ్ఞాపకార్థాన్ని స్థాపించిన తర్వాత, తన శిష్యులకు యేసు ఇచ్చిన మొదటి నిర్దేశం క్రొత్తది. ఆయన వారితో, ‘మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు’ అని అన్నాడు. (యోహాను 13:​34, 35) ఈ ఆజ్ఞలో క్రొత్త విషయమేముంది? ఆ రాత్రి కొంచెం సేపయిన తర్వాత, “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని అంటూ ఆయన విషయాన్ని స్పష్టం చేశాడు. (యోహాను 15:​12, 13) “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అని మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించింది. (లేవీయకాండము 19:​18) కాని యేసు ఆజ్ఞ దానిని మించిపోయింది. క్రైస్తవులందరూ, క్రీస్తు తమను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించాలి, తమ సహోదరుల కోసం తమ సొంత ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి.

8. (ఎ) స్వయంత్యాగపూరిత ప్రేమలో ఏమి ఇమిడివుంది? (బి) నేడు యెహోవాసాక్షులు స్వయంత్యాగపూరిత ప్రేమను ఎలా కనబరుస్తారు?

8 నిజ క్రైస్తవత్వపు గుర్తింపు చిహ్నమైన క్రీస్తు ప్రేమ వంటి ప్రేమ మనకు నిజంగా ఉందా అని మనలను మనం వ్యక్తిగతంగాను, ఒక సంఘంగాను పరిశీలించుకోవడానికి జ్ఞాపకార్థ కాలం సముచితమైనది. అలాంటి స్వయంత్యాగపూరిత ప్రేమ చూపడమంటే, ఒక క్రైస్తవుడు తన సహోదరులకు నమ్మకద్రోహం చేసే బదులు తన సొంత ప్రాణాన్ని పణంగా పెట్టవలసి రావచ్చు, కొన్నిసార్లు కొందరు అలా చేయవలసి వచ్చింది కూడా. అయితే, సాధారణంగా మన సహోదరులకు ఇతరులకు సహాయం చేయడానికి సేవ చేయడానికి మన వ్యక్తిగత ఆసక్తులను త్యాగం చేసేటట్టు సిద్ధమనస్సును కలిగి ఉండాలి. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మంచి మాదిరిని ఉంచాడు. (2 కొరింథీయులు 12:​15; ఫిలిప్పీయులు 2:​17) యెహోవాసాక్షులు, తమ సహోదరులకు, పొరుగువారికి సహాయం చేస్తూ, తోటి మానవులకు బైబిలు సత్యాన్ని తెలియజేయడానికి తమను తాము వ్యయపరుచుకుంటూ చూపే స్వయంత్యాగ స్ఫూర్తికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. *​—⁠గలతీయులు 6:⁠10.

అమూల్యంగా ఎంచవలసిన సంబంధాలు

9. దేవునితోను, ఆయన కుమారునితోను మనకున్న ప్రశస్తమైన సంబంధాన్ని నిలబెట్టుకునేందుకుగాను మనమేమి చేయడానికి సంతోషిస్తాము?

9 యెహోవా చేత, ఆయన కుమారుడైన క్రీస్తుయేసు చేత ప్రేమించబడడం కన్నా ప్రశస్తమైనదేదీ మనకుండదు. అయితే, ఈ ప్రేమను కలిగివుండడానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మనం తప్పనిసరిగా చేయవలసినది ఒకటుంది. “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని” ఆ చివరి రాత్రి యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 14:​21) దేవునితోను, ఆయన కుమారునితోను మనకున్న సంబంధాన్ని మనం ఎంతో అమూల్యంగా ఎంచుతాము గనుక, వారి ఆజ్ఞలకు ఆనందంగా విధేయత చూపుతాము. ఆ ఆజ్ఞల్లో, స్వయంత్యాగపూరిత ప్రేమను కనబరచాలన్న క్రొత్త ఆజ్ఞా, సువార్తను అంగీకరించేవారిని ‘శిష్యులనుగా చేయడానికి’ కృషిచేస్తూ ‘ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెను’ అని తన పునరుత్థానం తర్వాత క్రీస్తు ఇచ్చిన ఆదేశమూ ఉన్నాయి.​—⁠అపొస్తలుల కార్యములు 10:​42; మత్తయి 28:19, 20.

10. అభిషిక్తులు, “వేరే గొఱ్ఱెలు” ఏ ప్రశస్తమైన సంబంధాలను కలిగి ఉండే అవకాశముంది?

10 తర్వాత, ఆ రాత్రే, నమ్మకమైన అపొస్తలుడైన యూదా (తద్దయి) తనను అడిగిన ప్రశ్నకు జవాబుగా, యేసు, “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము” అని చెప్పాడు. (యోహాను 14:​22, 23) పరలోకంలో క్రీస్తుతో పాటు పరిపాలించేందుకు ఆహ్వానించబడిన అభిషిక్త క్రైస్తవులు భూమి మీద ఉన్నప్పుడే, యెహోవాతోను, ఆయన కుమారునితోను ప్రత్యేకమైన సన్నిహిత సంబంధాన్ని కలిగివుంటారు. (యోహాను 15:​15; 16:​27; 17:​22; హెబ్రీయులు 3:⁠1; 1 యోహాను 3:​2, 24) కానీ భూమి మీద ఎల్లకాలం జీవించే నిరీక్షణగల “వేరే గొఱ్ఱెలు” అనబడే వారి సహచరులు కూడా విధేయులుగా ఉంటే, ‘ఒకే కాపరి’ అయిన యేసుక్రీస్తుతోను, తమ దేవుడైన యెహోవాతోను ప్రశస్తమైన సంబంధాన్ని కలిగివుంటారు.​—⁠యోహాను 10:​16; కీర్తన 15:​1-5; 25:⁠14.

“మీరు లోకసంబంధులు కారు”

11. యేసు తన శిష్యులకు ఇచ్చిన ఆలోచింపజేసే హెచ్చరిక ఏమిటి?

11 తన మరణానికి ముందు నమ్మకస్థులైన శిష్యులతో జరిపిన చివరి సమావేశంలో, యేసు ఆలోచింపజేసే ఒక హెచ్చరికనిచ్చాడు. అదేంటంటే: ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడుతున్నట్లయితే, లోకం చేత ద్వేషించబడతాడు. “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.​—⁠దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీమాట కూడ గైకొందురు” అని ఆయన ఉద్ఘాటించాడు.​—⁠యోహాను 15:​18-20.

12. (ఎ) లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని యేసు తన శిష్యులను ఎందుకు హెచ్చరించాడు? (బి) జ్ఞాపకార్థం దగ్గరపడుతుండగా అందరూ దేని గురించి ఆలోచించడం ప్రయోజనకరంగా ఉంటుంది?

12 తన 11 మంది అపొస్తలులూ, వాళ్ళ తర్వాతి నిజ క్రైస్తవులందరూ కూడా లోకపు ద్వేషం మూలంగా నిరుత్సాహపడకుండా పట్టువదలకుండా ఉండేందుకే యేసు ఆ హెచ్చరికనిచ్చాడు. “మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు” అని కూడా ఆయన చెప్పాడు. (యోహాను 16:​1-3) ఇక్కడ ‘అభ్యంతరపడు’ అని అనువదించబడిన క్రియారూపక పదానికి “ఒక వ్యక్తి నమ్మకం కోల్పోయేలా, తను నమ్మి విధేయత చూపవలసిన వ్యక్తిని విడనాడేలా చేయడం, ఆ వ్యక్తి నుండి తొలగిపోయేలా చేయడం” అని అర్థమని ఒక బైబిలు నిఘంటువు వివరిస్తోంది. జ్ఞాపకార్థాన్ని ఆచరించే సమయం దగ్గర పడుతుండగా, గతకాలాల్లోని, వర్తమాన కాలాల్లోని నమ్మకస్థుల జీవిత విధానాన్ని గురించి ధ్యానించి, శ్రమల్లో ఉన్నప్పుడు స్థిరంగా నిలబడిన వారి మాదిరిని అనుకరించడం మంచిది. వ్యతిరేకత లేదా హింస మీరు యెహోవాను యేసును విడనాడేలా చేయడానికి అనుమతించకండి, వారిని నమ్మి, వారికి విధేయత చూపాలన్న దృఢనిర్ణయంతో ఉండండి.

13. యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో తన అనుచరుల కోసం ఏమి కోరాడు?

13 యెరూషలేములోని మేడగది నుండి వచ్చే ముందు యేసు తన తండ్రికి చేసిన ముగింపు ప్రార్థనలో, “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని అన్నాడు. (యోహాను 17:​14-16) యెహోవా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారు ఈ లోకంతో సంబంధం లేకుండా కొనసాగుతున్నప్పుడు ఆయన వారిని బలపరచడానికి శ్రద్ధ చూపిస్తాడన్న నిశ్చయతతో మనం ఉండవచ్చు.​—⁠యెషయా 40:​29-31.

తండ్రి ప్రేమలోను కుమారుని ప్రేమలోను నిలిచివుండండి

14, 15. (ఎ) “జాతిహీనమైన ద్రాక్షావల్లి”కి విరుద్ధమైన దేనితో యేసు తనను తాను పోల్చుకున్నాడు? (బి) “నిజమైన ద్రాక్షావల్లి” “తీగెలు” ఎవరు?

14 నీసాను 14 రాత్రి, నమ్మకస్థులైన తన శిష్యులతో సన్నిహితంగా మాట్లాడుతూ యేసు, “నిజమైన ద్రాక్షావల్లి”తో తనను తాను పోల్చుకున్నాడు. ఆయనకు భిన్నంగా విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు “జాతిహీనపు ద్రాక్షావల్లివలె” ఉంది. “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు” అని ఆయన చెప్పాడు. (యోహాను 15:⁠1) “శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; . . . నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీవెట్లు భ్రష్టసంతానమైతివి?” అని భ్రష్టసంతానముగా మారిన తన ప్రజలకు యెహోవా చెప్పిన మాటలను శతాబ్దాల పూర్వం యిర్మీయా ప్రవక్త వ్రాసిపెట్టాడు. (యిర్మీయా 2:​21) “ఇశ్రాయేలు జాతిహీనపు ద్రాక్షావల్లి. అతడు తన కోసం మాత్రమే ఫలిస్తూ ఉన్నాడు . . . వారి హృదయాలు కపటంగా మారాయి” అని ప్రవక్త హోషేయ వ్రాశాడు.​—⁠హోషేయ 10:​1, 2, NW.

15 ఇశ్రాయేలు సత్యారాధన ఫలాలను ఫలించే బదులు, భ్రష్టత్వంలో పడి, కేవలం తమ కోసమే ఫలాలను ఫలించారు. తన నమ్మకస్థులైన శిష్యులతో చివరిగా సమావేశం కావడానికి మూడు రోజుల ముందు, వేషధారులైన యూదా నాయకులతో, “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను” అని యేసు అన్నాడు. (మత్తయి 21:​43) 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులతో రూపొందిన ‘దేవుని ఇశ్రాయేలే’ ఈ క్రొత్త జనులు. వారు క్రీస్తు యేసు అనే “నిజమైన ద్రాక్షావల్లి” యొక్క ‘తీగెలుగా’ పోల్చబడ్డారు.​—⁠గలతీయులు 6:​16; యోహాను 15:⁠5; ప్రకటన 14:⁠1, 3.

16. తన 11 మంది అపొస్తలులు ఏమి చేయాలని యేసు ఉద్బోధించాడు, ఈ అంత్య దినములలో నమ్మకమైన శేషము గురించి ఏమని చెప్పవచ్చు?

16 “నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు” అని ఆ మేడగదిలో ఉన్న తన 11 మంది అపొస్తలులకు యేసు చెప్పాడు. (యోహాను 15:​2, 4) నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల శేషము తమ శిరస్సైన క్రీస్తుయేసుయందు నిలిచి ఉన్నారని యెహోవా ప్రజల ఆధునిక చరిత్ర చూపిస్తుంది. (ఎఫెసీయులు 5:​23) వారు, తమ శుద్ధీకరణకూ తమలోవున్న అవాంఛితమైనవాటిని తొలగించడానికీ అంగీకరించారు. (మలాకీ 3:​2, 3) వారు 1919 మొదలుకొని రాజ్య ఫలాలను సమృద్ధిగా ఫలించారు. మొదట ఇతర అభిషిక్త క్రైస్తవులను ఆ తర్వాత, 1935 మొదలుకొని, మునుపెన్నటికన్నా సంఖ్యలో పెరుగుతున్న వారి సహచరులైన “గొప్ప సమూహము”ను ఫలించారు.​—⁠ప్రకటన 7:⁠9; యెషయా 60:⁠4, 8-11.

17, 18. (ఎ) యేసు చెప్పిన ఏ మాటలు యెహోవా ప్రేమలో నిలిచివుండేందుకు అభిషిక్తులకు, వేరే గొఱ్ఱెలకు సహాయపడతాయి? (బి) జ్ఞాపకార్థానికి హాజరు కావడం మనకెలా సహాయపడుతుంది?

17 యేసు తర్వాత అన్న మాటలు అభిషిక్త క్రైస్తవులందరికీ, అలాగే వారి సహచరులకూ వర్తిస్తాయి. “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని; నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని ఆయన అన్నాడు.​—⁠యోహాను 15:​8-10.

18 దేవుని ప్రేమలో నిలిచివుండాలని మనమందరమూ కోరుకుంటాము, ఆ కోరిక, మనం ఫలభరితులమైన క్రైస్తవులుగా ఉండేందుకు మనలను కదిలిస్తుంది. “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించేందుకు మనకు లభించే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం ద్వారా మనం ఫలభరితులమైన క్రైస్తవులుగా ఉంటాము. (మత్తయి 24:​14) అలాగే, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ‘ఆత్మ ఫలాన్ని’ కనబరచడానికి శాయశక్తులా కృషి చేస్తాము. (గలతీయులు 5:​22, 23) అలా చేయాలన్న మన దృఢనిశ్చయము క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరు కావడం ద్వారా బలపడుతుంది. కారణమేమిటంటే, మనపై దేవునికీ క్రీస్తుకూ ఉన్న గొప్ప ప్రేమ మనకు అక్కడ గుర్తుచేయబడుతుంది.​—⁠2 కొరింథీయులు 5:​14, 15.

19. తర్వాతి ఆర్టికల్‌లో మనకు ఇంకా ఏ సహాయం ఇవ్వబడుతుంది?

19 జ్ఞాపకార్థాన్ని స్థాపించిన తర్వాత, తన తండ్రి, తన నమ్మకస్థులైన అనుచరుల దగ్గరికి ‘ఆదరణకర్తను, అనగా . . . పరిశుద్ధాత్మను’ పంపిస్తాడని యేసు వాగ్దానం చేశాడు. (యోహాను 14:​26) అభిషిక్తులు, వేరే గొఱ్ఱెలు యెహోవా ప్రేమలో నిలిచివుండేందుకు ఈ ఆత్మ ఎలా సహాయపడుతుందన్నది తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 2 బైబిలు ప్రకారం 2002వ సంవత్సరంలో, నీసాను 14 మార్చి 28 గురువారం సూర్యాస్తమయాన మొదలవుతుంది. ఆ సాయంకాలం, ప్రభువైన యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు సమావేశమవుతారు.

^ పేరా 8 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకం 19, 32 అధ్యాయాలు చూడండి.

పునఃసమీక్షా ప్రశ్నలు

• ప్రేమపూర్వకంగా సేవ చేసే విషయంలో యేసు తన శిష్యులకు ఏ ఆచరణాత్మక పాఠాన్ని నేర్పాడు?

• ఏ విషయంలో ఆత్మ పరీశీలన చేసుకునేందుకు జ్ఞాపకార్థ కాలం సముచితమైన సమయంగా ఉంది?

• లోక ద్వేషాన్ని గురించీ హింస గురించీ యేసు ఇచ్చిన హెచ్చరిక మూలంగా మనమెందుకు అభ్యంతరపడకూదు?

• “నిజమైన ద్రాక్షావల్లి” ఎవరు? “తీగెలు” ఎవరు, వారి నుండి ఏమి ఎదురుచూడబడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ప్రేమపూర్వకంగా సేవ చేయడంలో యేసు తన అపొస్తలులకు మరపురాని పాఠాన్ని నేర్పాడు

[16, 17వ పేజీలోని చిత్రాలు]

క్రీస్తు శిష్యులు స్వయంత్యాగపూరిత ప్రేమను కనబరచమన్న ఆయన ఆజ్ఞకు విధేయత చూపిస్తారు