కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీకొదేము నుండి ఒక పాఠం నేర్చుకోండి

నీకొదేము నుండి ఒక పాఠం నేర్చుకోండి

నీకొదేము నుండి ఒక పాఠం నేర్చుకోండి

“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను [“హింసాకొయ్యను,” NW] ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.” (లూకా 9:​23) ఈ ఆహ్వానాన్ని వినయస్థులైన జాలరులూ, తృణీకరించబడిన ఒక సుంకరీ వెంటనే అంగీకరించారు. యేసును అనుసరించడానికి వారు సమస్తము వదిలిపెట్టారు.​—⁠మత్తయి 4:​18-22; లూకా 5:27, 28.

యేసు ఆహ్వానం నేటికీ వినిపిస్తోంది, అనేకులు ప్రతిస్పందిస్తున్నారు కూడా. కానీ, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడంలో ఆనందించే కొందరు ‘తమను తాము ఉపేక్షించుకొని, తమ హింసాకొయ్యను ఎత్తుకోవడానికి’ వెనుకంజవేస్తారు. యేసు శిష్యులుగా ఉండే బాధ్యతను, ఆధిక్యతను స్వీకరించడానికి వాళ్ళు వెనుకాడతారు.

కొందరు యేసు ఆహ్వానాన్ని అంగీకరించి, తమను తాము యెహోవా దేవునికి సమర్పించుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తారు? యూదుల్లా, క్రైస్తవుల్లా ఒక్కడే దేవుడు ఉన్నాడనే తలంపుతో పెరగనివాళ్ళు, వ్యక్తిత్వంగల సర్వశక్తిమంతుడైన సృష్టికర్త గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుండవచ్చన్నది నిజమే. అయితే, దేవుడు నిజంగా ఉన్నాడన్న నమ్మకం కుదిరాక కూడా, క్షమించండి, ఆయన అడుగుజాడలను అనుసరించలేము అని కొందరు అంటారు. తాము యెహోవాసాక్షులుగా మారితే, తమ బంధువులు స్నేహితులు ఏమనుకుంటారోనని వాళ్ళు భయపడుతుండవచ్చు. మనం జీవిస్తున్న కాలాలు ఎంత త్వరగా ముగియబోతున్నాయన్నది మరిచిపోయేవారు, డబ్బు పేరుప్రతిష్ఠల ఆర్జన వైపుకు మళ్ళుతారు. (మత్తయి 24:36-42; 1 తిమోతి 6:​9, 10) కారణమేదైనప్పటికీ, యేసు అనుచరులుగా అవ్వాలన్న తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నవారు, యేసు కాలంనాటి ధనవంతుడైన యూదా అధికారియైన నీకొదేము నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు.

ఆయన ఎదుట అద్భుతమైన అవకాశాలు

యేసు భూమిపై తన పరిచర్యను ప్రారంభించిన ఆరు నెలలకే, ‘ఆయన దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడు’ అని నీకొదేము గుర్తిస్తాడు. ఆ మధ్యే అంటే సా.శ. 30వ సంవత్సరం పస్కా పండుగ రోజున యెరూషలేములో యేసు చేసిన అద్భుతాలను బట్టి ముగ్ధుడైన నీకొదేము, తనకు యేసు మీద ఉన్న విశ్వాసాన్ని ఒప్పుకోవడానికీ, ఆ బోధకుడి నుండి మరెక్కువగా నేర్చుకోవడానికి చీకటి మాటున ఆయన దగ్గరకు వెళ్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ‘క్రొత్తగా జన్మించవలసిన’ అవసరముందన్న లోతైన సత్యాన్ని యేసు అప్పుడు ఆయనకు చెబుతాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని కూడా యేసు ఆ సందర్భంలో అంటాడు.​—⁠యోహాను 3:​1-16.

నీకొదేము ఎదుట ఎంత అద్భుతమైన నిరీక్షణ ఉంచబడింది! ఆయన యేసు సన్నిహిత సహవాసిగా మారి, భూమి మీద యేసు జీవితంలోని వివిధ పార్శ్వాలను ప్రత్యక్షంగా చూడగలిగేవాడు. యూదుల అధికారుల్లో ఒకరిగా, ఇశ్రాయేలులో ఒక బోధకునిగా, నీకొదేముకు దేవుని వాక్యాన్ని గురించిన మంచి పరిజ్ఞానముంది. ఆయనకు మంచి అంతర్దృష్టి కూడా ఉంది. యేసు, దేవుని చేత పంపబడిన బోధకుడని గుర్తించడంలో ఆయన అంతర్దృష్టి కనిపిస్తుంది. నీకొదేముకు ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తివుంది, అసాధారణమైన అణకువ కూడ ఉంది. ఒక మామూలు వడ్రంగి కుమారుడు దేవునిచేత పంపబడిన మనిషి అని ఒప్పుకోవడానికి యూదుల అత్యున్నత న్యాయస్థానంలోని సభ్యుడికి అంత సులభం కాదు! అలాంటి గుణాలన్నీ యేసు శిష్యుడయ్యేందుకు అత్యవసరమైన ప్రశస్తమైన గుణాలు.

నజరేయుడైన మనిషి మీద నీకొదేముకున్న ఆసక్తి తగ్గినట్లు లేదు. రెండున్నర సంవత్సరాల తర్వాత, పర్ణశాలల పండుగ సమయంలో జరిగిన మహా సభకు నీకొదేము హాజరవుతాడు. ఆ సమయంలో కూడా, ఆయన “వారిలో ఒకడు”గా ఉన్నాడు. ప్రధానయాజకులు పరిసయ్యులు యేసును నిర్బంధించమని బంట్రౌతులను పంపుతారు. ఆ బంట్రౌతులు తిరిగి వచ్చి, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని” నివేదిస్తారు. అప్పుడు పరిసయ్యులు “మీరుకూడ మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని” అంటూ వాళ్ళను కించపరచనారంభిస్తారు. నీకొదేము ఇక మాట్లాడకుండా ఉండలేకపోతాడు. “ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా” అని అడుగుతాడు. అప్పుడు ఆయన మిగతా పరిసయ్యుల విమర్శలకు గురవుతాడు. వారు “నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.”​—⁠యోహాను 7:​1, 10, 32, 45-52.

దాదాపు ఆరు నెలల తర్వాత, అంటే సా.శ. 33 పస్కా పండుగ రోజున యేసు శరీరమును హింసాకొయ్య మీది నుండి క్రిందికి దించుతున్న దృశ్యాన్ని నీకొదేము చూస్తాడు. యూదుల మహా సభలో మరో సభ్యుడైన అరిమతయియవాడైన యోసేపుతో కలిసి యేసు శరీరాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేస్తాడు. దాని కోసం నీకొదేము, “బోళముతో కలిపిన అగరు”ను తీసుకువస్తాడు. అది దాదాపు 100 రోమా పౌండ్లకు సమానమైన విలువగలది, 72 ఇంగ్లాండు పౌండ్లకు సమానమైనది. అది ఆయన చాలా ఖర్చుపెట్టాడని సూచిస్తుంది. “ఆ వంచకుడు” అని తన తోటి పరిసయ్యులు ఎవరినైతే అంటున్నారో ఆ వ్యక్తి పక్షమువాడని తాను గుర్తించబడేందుకు ఆయనకు ధైర్యం కూడా అవసరమవుతుంది. వాళ్ళిద్దరూ యేసు శరీరాన్ని సమాధి చేయడానికి త్వరగా సిద్ధం చేసి, దగ్గర్లో ఉన్న జ్ఞాపకార్థ సమాధిలో పెడతారు. ఆ సమయంలో కూడా, నీకొదేము యేసు శిష్యుడిగా గుర్తించబడలేదు!​—⁠యోహాను 19:​38-42; మత్తయి 27:​63; మార్కు 15:⁠43.

ఆయన చర్య తీసుకోకపోవడానికి కారణం

యేసును అనుసరిస్తూ ‘తన హింసాకొయ్యను ఎత్తుకో’లేనని నీకొదేము భావించడానికి కారణమేమిటో యోహాను తను వ్రాసిన వృత్తాంతంలో బయల్పరచలేదు. అయినప్పటికీ, ఆ పరిసయ్యుడు ఎందుకు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడో తెలిపే కొన్ని సూచనలు ఆయన ఇచ్చాడు.

మొదటిగా, ఆ యూదా అధికారి ‘రాత్రియందు [యేసు] యొద్దకు వచ్చాడు’ అని యోహాను సూచించాడు. (యోహాను 3:⁠2) “నీకొదేము రాత్రి వెళ్ళింది, భయం వల్ల కాదు కానీ, తనకూ యేసుకూ మధ్య సంభాషణ జరగడానికి ఆటంకం కలిగించగల జనసమూహాలను తప్పించుకునేందుకే” అని ఒక బైబిలు పండితుడు సూచిస్తున్నాడు. అయితే, యోహాను ఆయన గురించి చెబుతూ ‘మొదట రాత్రివేళ [యేసు] యొద్దకు వచ్చిన నీకొదేము’ అంటున్నాడు, అయితే అదే సందర్భంలో, అరిమతయియ యోసేపును గురించి చెబుతూ “యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు” అంటున్నాడు. (యోహాను 19:​38, 39) కాబట్టి, నీకొదేము యేసు దగ్గరికి చీకటి మాటున వచ్చినది “యూదుల భయమువలన”నే కావచ్చు. తన కాలంలోని ఇతరులు యేసుతో ఎలాంటి సంబంధాలను పెట్టుకోవడానికైనా ఎలా భయపడేవారో ఆయన కూడా అలాగే భయపడివుండవచ్చు.​—⁠యోహాను 7:⁠13.

మీ బంధువులు, స్నేహితులు, లేదా సహోద్యోగులు ఏమంటారోనన్న భయం వల్లే, యేసు శిష్యుల్లో ఒకరిగా అవ్వాలన్న నిర్ణయాన్ని మీరు వాయిదా వేస్తూ వస్తున్నారా? “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును” అని ఒక సామెత చెబుతుంది. మీరు ఆ భయాన్ని ఎలా అధిగమించగలరు? “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును” అని కూడా ఆ సామెత చెబుతుంది. (సామెతలు 29:​25) యెహోవా దేవుని మీద అలాంటి నమ్మకాన్ని పెంచుకోవాలంటే, మీరు బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. యెహోవాకు ప్రార్థించండి, ఆరాధన విషయంలో చిన్న నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ధైర్యమిమ్మని ఆయనను అడగండి. నెమ్మదిగా, మీరు దేవుని చిత్తానికి అనుసారంగా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగేంతగా మీకు యెహోవా మీద నమ్మకమూ విశ్వాసమూ పెరుగుతాయి.

అధికార వర్గంలోని ఒక సభ్యుడిగా తనకున్న స్థానమూ హోదా కూడా, తనను తాను ఉపేక్షించుకునే ప్రాముఖ్యమైన చర్యను తీసుకోకుండా నీకొదేమును అడ్డగించివుండవచ్చు. ఆ కాలంలో, సమాజమందిర సభ్యునిగా తనకున్న స్థానం మీద ఆయనకు అప్పటికీ మిక్కిలి మక్కువ ఉండివుండవచ్చు. క్రీస్తు అనుచరుడిగా అయ్యేందుకు అవసరమైన చర్య తీసుకోవడానికి మీరు వెనుకంజవేస్తున్నందుకు కారణం, సమాజంలో గౌరవపూర్వకమైన స్థానం వదులుకోవలసి వస్తుందనా, లేక ఔన్నత్యాలను చేరుకునే అవకాశాలను త్యజించాల్సి రావడమా? తన చిత్తానుసారమైన విజ్ఞాపనలను అంగీకరించి వాటిని నెరవేర్చడానికి సుముఖత చూపిస్తున్న విశ్వ సర్వోన్నతాధికారికి సేవచేయగలగడమన్న ఘనతకు ఇవేవీ సాటిరావు.​—⁠కీర్తన 10:​17; 83:​18; 145:⁠18.

నీకొదేము అలా వాయిదా వేస్తూ రావడానికి మరో కారణం తన సిరిసంపదల గురించిన చింతే కావచ్చు. ఒక పరిసయ్యుడుగా, ఆయన “ధనాపేక్షగల” ఇతర పరిసయ్యుల చేత ప్రభావితుడై ఉండవచ్చు. (లూకా 16:​14) ఎంతో ఖరీదైన బోళముతో కలిపిన అగరును ఆయన తీసుకురాగలిగాడన్న వాస్తవం ఆయన చాలా ధనవంతుడని రుజువు చేస్తుంది. కొందరు క్రైస్తవ బాధ్యతలను తీసుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉండడానికి కారణం, వారు తమకున్న ఆస్తులను గురించి ఎక్కువగా చింతిస్తుండడమే. అయినప్పటికీ యేసు, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. . . . ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని తన అనుచరులకు ఉద్బోధించాడు.​—⁠మత్తయి 6:​25-33.

ఆయన చాలా నష్టపోయాడు

యోహాను సువార్తలో మాత్రమే చెప్పబడుతున్న నీకొదేమును గురించిన వృత్తాంతం, ఆయన తర్వాత యేసు అనుచరుడయ్యాడా లేదా అన్నది చెప్పకపోవడం జిజ్ఞాసను కలిగిస్తుంది. నీకొదేము యేసు పక్షాన నిలబడి, బాప్తిస్మం పొంది, ఆ తర్వాత యూదుల వేధింపుకు గురై తన స్థానం నుండి తొలగించబడి, చివరికి యెరూషలేము నుండి బహిష్కరించబడ్డాడు అన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఏదేమైనప్పటికీ, ఒకటి మాత్రం నిశ్చయం: యేసు భూమి మీద ఉన్నప్పుడు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తుండడం వల్ల ఆయన చాలా నష్టపోయాడు.

నీకొదేము యేసు ప్రభువును మొదటిసారి కలిసినప్పటి నుండే ఆయనను అనుసరించడం మొదలుపెట్టి ఉంటే, ఆయన యేసు సన్నిహిత శిష్యుడవ్వగలిగేవాడు. తనకున్న పరిజ్ఞానము, అంతర్దృష్టి, అణకువ, ఆధ్యాత్మిక అవసరాలను గురించిన ఎరుకను బట్టి నీకొదేము విశిష్టమైన శిష్యుడు కాగలిగేవాడు. అవును, గొప్ప బోధకుడైన యేసు చేసిన ఆశ్చర్యకరమైన బోధలను ఆయన వినగలిగేవాడు, ఆయన చెప్పిన ఉపమానాలనుండి ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకోగలిగేవాడు, యేసు చేసిన ఆశ్చర్యకరమైన అద్భుతాలను చూడగలిగేవాడు, యేసు తన అపొస్తలులను వదిలి వెళ్ళే ముందు వారికిచ్చిన ఉద్బోధ నుండి బలాన్ని పొందగలిగేవాడు. కాని, ఆయన వాటినన్నింటిని కోల్పోయాడు.

నీకొదేము ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల, చాలా నష్టపోయాడు. ఆయన నష్టపోయిన దానిలో, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” అని ఎంతో ప్రేమగా యేసు ఇచ్చిన ఆహ్వానం కూడా ఉంది. (మత్తయి 11:​28-30) స్వయంగా యేసు ద్వారా సేదదీర్చుకునే అవకాశాన్ని నీకొదేము కోల్పోయాడు.

మీ విషయమిటి?

యేసుక్రీస్తు పరలోకంలో 1914 మొదలుకొని, దేవుని పరలోక రాజ్యపు రాజుగా ఉన్నాడు. తను రాజుగా ఉన్న కాలంలో జరిగే ఇతర సంఘటనలను సూచిస్తూ, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని ప్రవచించాడు. (మత్తయి 24:​14) అంతము రాక ముందే, ఆ ప్రపంచవ్యాప్త ప్రకటనా పని తప్పకుండా సంపూర్ణముగా జరుగుతుంది. అపరిపూర్ణ మానవులకు కూడా ఆ పనిలో భాగమివ్వడానికి యేసుక్రీస్తు ఎంతో ఆనందిస్తున్నాడు. మీరు కూడా ఈ పనిలో పాల్గొనవచ్చు.

యేసు, దేవుని దగ్గరి నుండి వచ్చాడని నీకొదేము గుర్తించాడు. (యోహాను 3:⁠2) బైబిలు అధ్యయనం ద్వారా, మీరు కూడా అలాంటి నిర్ధారణకే వచ్చివుంటారు. బైబిలు ప్రమాణాలకు పొందికగా ఉండేందుకు మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకొనివుండవచ్చు. మీరు మరింత బైబిలు పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు యెహోవాసాక్షుల కూటాలకు కూడా హాజరవుతుండవచ్చు. మీరు చేస్తున్న ప్రయత్నాలకు మిమ్మల్ని నిజంగా ప్రశంసించాలి. అయితే యేసు, దేవునిచేత పంపబడినవాడని గుర్తించానని ఒప్పుకోవడమే కాక అంతకన్నా ఎక్కువే నీకొదేము చేయవలసిన అవసరం ఉండింది. ఆయన ‘తనను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన హింసాకొయ్యను ఎత్తికొని [యేసు]ను వెంబడించవలసిన’ అవసరం ఉండింది.​—⁠లూకా 9:⁠23.

అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను హృదయంలోకి తీసుకోండి. “కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.​—⁠అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” అని ఆయన వ్రాశాడు.​—⁠2 కొరింథీయులు 6:1, 2.

మీరు చర్య తీసుకునేలా మిమ్మల్ని కదిలించేంతటి విశ్వాసాన్ని పెంపొందించుకోవలసిన సమయం ఇదే. దాని కోసం, మీరు బైబిలులో అధ్యయనం చేస్తున్న విషయాలను ధ్యానించండి. యెహోవాకు ప్రార్థించండి, అలాంటి విశ్వాసాన్ని కనబరచడానికి సహాయం చేయమని ఆయనను వేడుకోండి. ఆయన సహాయ హస్తాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటుండగా, ఆయన గురించి మీకున్న మెప్పుదల, ఆయన మీద మీకున్న ప్రేమ ‘మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, ప్రతిదినము మీ హింసాకొయ్యను ఎత్తికొని [యేసు]ను వెంబడించాలని’ కోరుకునేలా మిమ్మల్ని కదిలిస్తాయి. మరి మీరు ఇప్పుడు చర్య తీసుకుంటారా?

[9వ పేజీలోని చిత్రం]

నీకొదేము యేసును మొదట ధైర్యంగా సమర్థించాడు

[9వ పేజీలోని చిత్రం]

వ్యతిరేకత ఉన్నప్పటికీ, నీకొదేము యేసు శరీరాన్ని సమాధికి సిద్ధం చేయడానికి సహాయం చేశాడు

[10వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగత అధ్యయనమూ, ప్రార్థనా మీరు చర్య తీసుకొనేలా మిమ్మల్ని బలపరచగలవు

[10వ పేజీలోని చిత్రం]

యేసు క్రీస్తు నాయకత్వం క్రింద పని చేసే ఆధిక్యతను మీరు స్వీకరిస్తారా?