కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశుభ్రతకు నిజమైన అర్థం ఏమిటి?

పరిశుభ్రతకు నిజమైన అర్థం ఏమిటి?

పరిశుభ్రతకు నిజమైన అర్థం ఏమిటి?

యూరప్‌లోను, అమెరికాలోను 18, 19 శతాబ్దాల్లో నెలకొనివున్న అపరిశుభ్రమైన పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉండేవి. అందుకే ఆ కాలంనాటి మిషనరీలు పరిశుభ్రత గురించి బోధించారు, వాళ్ళు బోధించిన దానినే తర్వాత “పరిశుభ్రతా సిద్ధాంతం” అన్నారు. ఈ సిద్ధాంతం మురికి పాపముకు సమానమని, పరిశుభ్రత దేవునికి సన్నిహితంగా చేస్తుందని బోధించింది. బహుశా ఈ సిద్ధాంతమే “దైవత్వం తర్వాతి స్థానం పరిశుభ్రతదే” అన్న సూక్తి ప్రఖ్యాతిగాంచేలా చేసివుంటుంది.

విలియమ్‌, కాథరీన్‌ బూత్‌ అనేవారు స్థాపించిన సాల్వేషన్‌ ఆర్మీ అనే మతగుంపు ఈ దృక్కోణాన్ని స్వీకరించింది. “సోప్‌, సూప్‌, సాల్వేషన్‌” అన్నది వారి తొలి సూక్తుల్లో ఒకటి అని హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌ ఇన్‌ ది ఇవాంజెలికల్‌ ట్రెడిషన్‌ అనే పుస్తకం చెబుతుంది. రోగాలకు, బ్యాక్టీరియాకు మధ్యవున్న ఖచ్చితమైన సంబంధాన్ని లూయీ పాశ్చర్‌, మరితరులు చూపించారు. వారు అలా చూపించినందువల్ల మంచి ప్రజారోగ్య విధానాలకు మరింత పురికొల్పూ, శాస్త్రీయ ఆధారమూ లభించాయి.

దాని ఫలితంగా, వెంటనే తీసుకోబడిన చర్యల్లో కొన్ని: కోర్టులో సాక్షి బైబిలును ముద్దుపెట్టుకోనవసరం లేదని నిర్ణయించడం; స్కూళ్ళలోను, రైల్వే స్టేషన్‌లలోను నీళ్ళు త్రాగడానికి అందరూ ఒకే కప్పు ఉపయోగించడాన్ని నిషేధించడం. చర్చి ఆరాధనల్లో అందరికీ ఒకే పానపాత్రను ఇచ్చేబదులు ఒక్కొక్కరికి ఒక్కో కప్పు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అవును ఆ తొలి మిషనరీలు, పరిశుభ్రత గురించిన ప్రజల దృక్కోణాన్ని మార్చడంలో చెప్పుకోదగినంత విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ప్రజల దృక్కోణం ఎంతగానో మారింది. ఆ మార్పుకు ఒక రచయిత “పరిశుభ్రత పట్ల ప్రణయ భావం” అని పేరు పెట్టాడు.

అయితే, “పరిశుభ్రత పట్ల ప్రణయ భావం” కేవలం పైపైన మాత్రమే ఉన్నట్లుంది. క్రొత్త పద్ధతులను ఆవిష్కరించే వాణిజ్యవేత్తలు, అనతి కాలంలోనే సాధారణ సబ్బును సౌందర్య సాధనంగా మార్చారు. కొన్ని పారిశుద్ధ్య ఉత్పన్నాలను వాడేవారికి సమాజంలో గొప్ప హోదా లభిస్తుందని, ఇతరులు చూసి అసూయపడతారని వినియోగదారులు నమ్మేలా తెలివైన వ్యాపార ప్రకటనలు చేశాయి. టీవీ ఈ తలంపును చిరకాలం ఉండేలా చేసింది. వాణిజ్య ప్రకటనల్లో లేదా ధారావాహికల్లో కనిపించే ప్రముఖులు లేదా అందమైన వ్యక్తులు ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు గానీ, వాకిలి ఊడుస్తున్నట్లుగానీ, చెత్త ఎత్తుతున్నట్లు గానీ, తమ పెంపుడు పిల్లులు లేదా కుక్కలు విసర్జించినదానిని ఎత్తుతున్నట్లు గానీ కనిపించడం చాలా అరుదు.

బయటికి వెళ్ళి పనిచేస్తే ఖర్చులకు కావలసిన డబ్బు వస్తుంది, కానీ ఇంటి పనిని, ఇతర పరిశుభ్రతా పనులను చేస్తే డబ్బు రాదు కదా అని అనుకునేవారు కూడా ఉన్నారు. శుభ్రం చేయడం వల్ల ఆర్థిక ఫలితాలేమి దొరకనప్పుడు, వాళ్ళు ఇక పర్యావరణం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏముంది? ఈ విధంగా ఆలోచించడం వల్ల, శుభ్రత అన్నది వ్యక్తిగత పరిశుభ్రతకు మాత్రమే వర్తిస్తుందని కొందరు తలస్తున్నారు.

పరిశుభ్రత గురించిన దేవుని దృక్కోణం

పరిశుభ్రత గురించి నేర్పించాలని ఆ కాలంలో జరిగిన ప్రయత్నాలు, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడ్డాయనడంలో సందేహంలేదు. అలా మెరుగుపడటంలో ఆశ్చర్యంలేదు, ఎందుకంటే, పరిశుభ్రత అనే లక్షణం పవిత్రుడు పరిశుద్ధుడు అయిన యెహోవా దేవునికి చెందినది, ఆయన నుండే ఉద్భవించింది. మనం అన్ని విధాలుగా పవిత్రులుగాను పరిశుభ్రంగాను ఉండడం ద్వారా మనం ప్రయోజనం పొందాలని ఆయన మనకు బోధిస్తున్నాడు.​—⁠యెషయా 48:​17; 1 పేతురు 1:​14-16.

ఈ విషయంలో యెహోవా దేవుడు మాదిరికరంగా ఉన్నాడు. పారిశుద్ధ్యముతోపాటు, దేవుని ఇతర అదృశ్య లక్షణాలు ఆయన దృశ్య సృష్టిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. (రోమీయులు 1:​20) నిరంతరం నిలిచే కాలుష్యం సృష్టి మూలంగా కలగదని మనం గ్రహించగలం. భూమి, అనేక పర్యావరణ చక్రాలుగలిగి సొంతంగా శుభ్రం చేసుకునే అద్భుత సృష్టి. అది శుభ్రమైన ఆరోగ్యకరమైన జీవనం కోసం తయారు చేయబడింది. శుభ్రతా మనస్కతగల రూపకర్తే అలాంటి శుభ్రమైన సృష్టిని కలుగజేస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు, జీవితంలోని అన్ని రంగాల్లోను శుభ్రంగా ఉండాలన్న నిర్ధారణకు మనం రావచ్చు.

పరిశుభ్రంగా ఉండవలసిన నాలుగు రంగాలు

దేవుని ఆరాధకులు, శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించవలసిన నాలుగు రంగాలను బైబిలు చక్కగా తెలియజేస్తోంది. మనం వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.

ఆధ్యాత్మికత. ఇది ఒకరి నిత్యజీవ నిరీక్షణకు సంబంధించినది కాబట్టి, దీనిని శుభ్రంగా ఉండవలసిన రంగాల్లో అన్నింటి కన్నా ప్రాముఖ్యమైనదిగా ఎంచవచ్చు. అయినప్పటికీ, తరచూ ఇదే అన్నింటికన్నా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది. సరళంగా చెప్పాలంటే, ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉండడమంటే, సత్యారాధనకు, అబద్ధారాధనకు మధ్య దేవుడు ఉంచిన హద్దులను దాటకుండా ఉండడమని అర్థం. ఎందుకంటే, ఏ విధమైన అబద్ధారాధననైనా దేవుడు అశుద్ధమైనదిగా దృష్టిస్తాడు. ‘మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడి, . . . నేను మిమ్మును చేర్చుకొందును అని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 6:​16-18) ఈ విషయాన్ని శిష్యుడైన యాకోబు కూడా నిర్దిష్టంగా చెబుతూ, ‘తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా . . . ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయే’ అని అన్నాడు.​—⁠యాకోబు 1:⁠27.

అబద్ధ ఆరాధనను సత్యారాధనతో కలిపివేయడాన్ని తాను ఆమోదించడని దేవుడు స్పష్టంగా కనబరచాడు. తరచూ అబద్ధారాధనలో అపరిశుద్ధమైన అలవాట్లు, అసహ్యకరమైన విగ్రహాలు, దేవుళ్ళు ఉంటాయి. (యిర్మీయా 32:​35) కాబట్టి, నిజక్రైస్తవులు అపరిశుద్ధ ఆరాధనకు సంబంధించిన దేనిలోను పాల్గొనకుండా ఉండాలని ఉద్బోధించబడుతున్నారు.​—⁠1 కొరింథీయులు 10:​20, 21; ప్రకటన 18:⁠4.

నైతికత. ఈ రంగంలో కూడా ఏది పరిశుద్ధమైనదో, ఏది అపరిశుద్ధమైనదో దేవుడు స్పష్టం చేస్తున్నాడు. “వారైతే అంధకారమైన మనస్సుగలవారై, . . . దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి” అని ఎఫెసీయులు 4:17-19 లో వర్ణించబడినట్లుగానే ప్రస్తుత లోకమంతా ఉంది. అటువంటి అనైతిక ఆలోచనాసరళి, స్పష్టంగాను, సూక్ష్మంగాను అనేక విధాలుగా బహిర్గతమవుతుంది. కాబట్టి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి.

వ్యభిచారము, సలింగ సంపర్కము, పెళ్లికాక ముందే లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, అశ్లీల చిత్రాలు సాహిత్యాలు యెహోవా దేవుని నైతిక పరిశుభ్రతా ప్రమాణాలకు వ్యతిరేకమని ఆయనను ప్రేమించేవారికి తెలుసు. అయితే, అలాంటివి ఈ లోక వినోద రంగంలోను ఫ్యాషన్‌ రంగంలోను కనిపించడం సర్వసాధారణమైపోయింది. కాబట్టి, అలాంటి పోకడల గురించి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ కూటాలకే గానివ్వండి, సామాజిక కలయికలకే కానివ్వండి, పొట్టి బట్టలు, బిగుతైన బట్టలు వేసుకోవడం అనవసరంగా మానవ శరీరంపైకి దృష్టిని మళ్ళించి, పవిత్రత కొరవడినట్లు చూపిస్తాయి. ఆ విధమైన వస్త్రధారణ లోకపు అపవిత్రమైన ఆలోచనా సరళిని క్రైస్తవ సహోదరుల మధ్యకు తీసుకురావడమే కాక, ఇతరుల్లో కూడా అపవిత్రమైన తలంపులను కలిగించగలదు. క్రైస్తవులు “పైనుండివచ్చు జ్ఞానము”ను ప్రదర్శించేందుకు తీవ్రంగా శ్రమించవలసిన అవసరమున్న ఒక రంగమిది.​—⁠యాకోబు 3:⁠17.

మనస్సు. అంతరంగము అపవిత్రమైన తలంపుల స్థావరంగా ఉండకూడదు. “నేను మీతో చెప్పునదేమనగా​—⁠ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు అన్నప్పుడు అపవిత్రమైన ఆలోచనలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. (మత్తయి 5:​28; మార్కు 7:​20-23) ఈ మాటలు, అశ్లీల ఛాయా చిత్రాలు చలనచిత్రాలు చూడడం అశ్లీల లైంగిక సంబంధాలను గురించిన వృత్తాంతాలు చదవడం అసభ్యకరమైన పాటలు వినడం వంటి వాటికి వర్తిస్తాయి. కాబట్టి అపవిత్రమైన అశుద్ధమైన మాటలకు చేతలకు దారి తీయగల అపవిత్ర తలంపులతో ఉంటూ తమను తాము అపవిత్రపరచుకోవడాన్ని నిజ క్రైస్తవులు నివారించుకోవాలి.​—⁠మత్తయి 12:​34; 15:⁠18.

భౌతికము. పవిత్రత, శారీరక పరిశుద్ధత బైబిలులో ఒకదానితోనొకటి గట్టిగా ముడిపడివున్నాయి. ఉదాహరణకు, “ప్రియులారా, . . . దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 7:⁠1) కనుక, నిజక్రైస్తవులు తమ పరిస్థితులు అనుమతించిన మేరకు, తమ శరీరాన్నీ, ఇంటినీ, పరిసరాలను శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంచుకునేందుకు గట్టిగా కృషి చేయాలి. బట్టలుతకడానికి గిన్నెలు కడగడానికి స్నానం చేయడానికి నీళ్ళు ఎక్కువగా దొరకని స్థలాల్లో సహితం, సాధ్యమైనంత మేరకు శుభ్రంగా చూడముచ్చటగా ఉండేందుకు ప్రయత్నించాలి.

శారీరక శుభ్రతలో, శరీరాన్ని మలినపరచే లేదా పాడు చేసే ఏ విధమైన పొగాకు ఉపయోగానికీ అమితంగా త్రాగడానికీ ఏ విధమైన మత్తుమందుల ఉపయోగానికీ తావులేదు. సొలొమోను వ్రాసిన పరమగీతములో వర్ణించబడిన మందకాపరి, షూలమ్మీతీ వస్త్రాల సువాసనను ఆహ్లాదంగా ఆఘ్రాణించాడు. (పరమగీతము 4:​11) మనం వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించడం ప్రేమపూర్వకమైన పని. మన చుట్టూ ఉన్నవారికి ఇబ్బందికరమైన వాసన రాకుండా ఉండాలని మనం కోరుకుంటాం. అత్తర్లు సెంట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ, క్రమంగా స్నానం చేయడానికి ఉతికిన బట్టలు వేసుకోవడానికి అవి ప్రత్యామ్నాయం కావు.

సమతుల్యమైన దృష్టిని కాపాడుకోవడం

భౌతిక పరిశుభ్రత కొందరికి అతిగా ఉంటే, కొందరికి అసలుండదు. ఒకవైపు, పరిశుభ్రతను గురించి మితిమీరిన చింత, మనకు జీవితంలో ఆనందం లేకుండా చేయగలదు. ఎంతో విలువైన సమయాన్ని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. మరొకవైపు, మురికిగా ఉన్న, అశ్రద్ధ వల్ల పాడైపోయిన ఇండ్లను మరమ్మతు చేయడానికి చాలా ఖర్చవుతుండవచ్చు. మన ఇంటిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడానికి అతి శ్రద్ధగానీ, అతి నిర్లక్ష్యం కానీ చేయకుండా సమతుల్యంగా ఆచరణాత్మకమైన పద్ధతి పాటించవచ్చు.

ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచకండి. వస్తువులు అస్తవ్యస్తంగా పడివున్న ఇండ్లను లేదా గదులను శుభ్రం చెయ్యడం కష్టం, అంతేకాక వస్తువులతో నిండివున్న చోట్ల మురికి వెంటనే కనబడకపోవచ్చు. నిరాడంబరమైన ఇళ్ళను, వస్తువులను చిందరవందరగా పడవేయని ఇళ్ళను శుభ్రంచేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. బైబిలు నిరాడంబరమైన జీవన శైలిని ఎంతగానో సిఫారసు చేస్తూ, “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని సలహా ఇస్తోంది.​—⁠1 తిమోతి 6:​7, 8.

క్రమపద్ధతిలో ఉంచండి. ఇంట్లో నివసిస్తున్న వారందరికీ ఇంటిని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉంది. మొదట, గదులు అశుభ్రంగా ఉండి నెమ్మనెమ్మదిగా ఇల్లంతా అశుభ్రంగా తయారవుతుంది. క్రమపద్ధతిలో ఉంచడమంటే ప్రతి వస్తువును దాని సరైన స్థానంలో ఉంచడమని అర్థం. ఉదాహరణకు, మురికి బట్టలను పడకగదిలో నేల మీద వదిలేయకూడదు. అంతకన్నా ముఖ్యంగా గుర్తించాల్సిన విషయమేమిటంటే, ఆట బొమ్మలు లేదా పనిముట్లు అక్కడిక్కడ పడివుంటే ప్రమాదం సంభవించే సాధ్యత ఉంది. క్రమంలేని అలవాట్లే ఇంట్లో జరిగే అనేక ప్రమాదాలకు కారణం.

పరిశుభ్రతా, క్రైస్తవ జీవన విధానమూ విడదీయరానివన్నది స్పష్టం. ప్రవక్తయైన యెషయా, దైవిక జీవన విధానాన్ని ‘పరిశుద్ధ మార్గము’ అని అన్నాడు. “అపవిత్రుడు ఆ మార్గములో వెళ్ళడు” అని కూడా ఆయన అన్నాడు, కాబట్టి ఇది నిజంగా ఆలోచించవలసిన విషయమే. (యెషయా 35:​8, NW) అవును, ఇప్పుడు మనం పరిశుభ్రతకు సంబంధించిన మంచి అలవాట్లను పెంపొందించుకుంటే, త్వరలో పరిశుభ్రమైన పరదైసు భూమిని స్థాపిస్తానని దేవుడు చేసిన వాగ్దానం మీద మనకున్న విశ్వాసానికి అది బలమైన రుజువును ఇవ్వగలదు. పరదైసు పునఃస్థాపించబడినప్పుడు ఈ సుందరమైన గ్రహము మీది సమస్త ప్రాంతాల్లోని సమస్త జనులూ యెహోవా దేవుని పరిపూర్ణమైన పరిశుభ్రతా ప్రమాణాలను పూర్తిగా పాటించడం ద్వారా ఆయనను మహిమపరుస్తారు.​—⁠ప్రకటన 7:⁠9.

[6వ పేజీలోని చిత్రం]

ఇంటిని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉంది

[7వ పేజీలోని చిత్రం]

భూమి, స్వయంగా శుభ్రం చేసుకునే అద్భుత సృష్టి